Showing posts with label వింత. Show all posts
Showing posts with label వింత. Show all posts

Saturday, October 6, 2012

ఒక జీవి మినీ ఆత్మకథ!

ముగ్గుబట్టలా తెల్లగా పండిన జుట్టు, నల్లటి కళ్ళు. చక్కని ఛాయ గల శరీరం. తన పేరు సుధాకరరావు.

సుధాకరరావు లో ఎన్నో కళలు! తన పేరుకు తగ్గట్టు!

పొద్దున లేవగానే వ్యాహ్యాళికెళ్ళాలి. అయితే తను ఒంటరిగా వెళ్ళలేడు. తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా తీసికెళ్ళాలి. ఇంట్లోవాళ్ళు తీసికెళుతుంటారు. తనకొక హోదా, స్టేటస్ ఉన్నది. తనను తీసికెళ్ళే వాళ్ళు ఆ స్టేటస్ ను కాపాడతారు, కాపాడాలి కూడా. ఒక్కొక్క సారి తనకు సాధారణ జీవుల పట్ల ఆత్రుతను, అభిమానాన్ని చూపించాలని ఉంటుంది. "నేను సైతం భువనఘోషకు వెఱ్ఱిగొంతుకు విచ్చి మోసాను" - అన్న శ్రీశ్రీ లెవెల్లో జాతి భేదాలని రూపుమాపడానికి కనీసం గొంతెత్తి అరవాలని, తన శృంఖలాలను తెంచుకోవాలని ఉంటుంది.

అయితే ప్రోటోకాల్ ఒప్పుకోదు. ఆ విషయంలో తను అస్వతంత్రుడు.

తన తిండి కూడా ప్రత్యేకం. ఆ విషయంలో కూడా తన వాళ్ళు ఎంతో శ్రద్ధ వహిస్తారు. తిండి ఒకటే కాదు, సాధారణంగా కూడా అందరూ కూడా తనంటే ఇష్టం చూపిస్తారు. అయితే ఒక్క విషయం మాత్రం తనను బాధిస్తుంది. తన తోటి వాళ్ళ లాగా స్వేచ్ఛగా తిరగాలని, పరుగెత్తాలని ఉంటుంది. ఒక్కో సారయితే గట్టిగా అరవాలనీ కూడా అనిపిస్తుంది. అయితే తను శృంఖలాబద్ధుడు. తనకు హోదా, స్టేటస్, సౌకర్యాలు, ఇలా సర్వమూ అమరాలంటే ఇది తప్పదు. స్వేచ్ఛ కావాలంటే మిగిలినవన్నీ దొరకవు. ముఖ్యంగా freedom of speech. ఎక్కడో ఒక చోట రాజీపడాలి. ఇది ఒక రాజీ లేని existential dilemma. అంతే!

స్వేచ్ఛ దొరకలేదు కదా అని ఆ కసిని మనసులో నింపుకుని తనవాళ్ళపై కక్ష గట్టే విశ్వాసఘాతకుడు కాదు తను. ప్రాణం పోయినా సరే తన వాళ్ళను రక్షించడానికి నడుం కట్టుకునే ఉంటాడు. రాత్రి పూట తనకు నిద్రపట్టదు. ఎంత చిన్న అలికిడి అయినా ఛప్పున మెలకువ కలుగడం తనకు దేవుడిచ్చిన వరం లాంటి శాపం, శాపం లాంటి వరం కూడా.

తనలో ఇలాంటి కళ ఉందని తెలిసిన తర్వాత ఆ వీధిలోకి దొంగలు అడుగుపెట్టకపోవడంలో ఆశ్చర్యమేముంది?

ఒకమారు తను తన వాళ్ళతో వ్యాహ్యాళి కెళుతుంటే తనలాంటి శృంఖలాబద్ధమైన మరొక ప్రాణి ఎదురొచ్చింది. ఆ ప్రాణికి హాయ్ చెబుదామని పరిచయం పెంచుకుందామని మనసు పీకింది. తనవాళ్ళు ఆ రోజు యే కళనున్నారో యేమో, తనను కాస్త చూసీ చూడనట్లుగా వదిలారు. సహజీవిని పలుకరించి తన గురించి వివరాలు తెలుసుకుని జీవితంలో సేద తీరిన
ఆ క్షణాలు మరపురానివి. అయితే తనకు ప్రోటోకాల్ సడలించడానికి ’అసలు’ కారణం వేరే ఉందని తెలిసింది. హు! అందరూ ఇంతే!

ఓ మారు తనకు జబ్బు చేసింది. ఎంత హడావిడి పడ్డారో అందరూ? డాక్టర్ దగ్గరకు తీసికెళ్ళారు. అక్కడ డాక్టర్ చేతిలో సూదిని చూడగానే కళ్ళు బైర్లు కమ్మాయి. ఎన్నడూ బర్రున చీది కూడా ఎరుగని జీవితం కదా! అయితే డాక్టర్ తాలూకు బలప్రయోగం నిర్దాక్షిణ్యంగా జరిగింది. అందరూ ఓదార్చారు.

మరో రోజు ఎవరో కొత్తవాళ్ళు ఇంటికొచ్చారు. కాసేపటికి అందరూ నన్ను మందలించడమే. ఇంతకూ అక్కడ జరిగినదేమిటి? ఆ వచ్చిన కొత్త వ్యక్తులు నమ్మకస్తుల్లా లేరు. స్వీయ చాదస్తం ఎలాగైనా ఉండనీ కాక, అలాటి వాళ్ళ గురించి తన వాళ్ళకు చెప్పడం మర్యాద కాదా? అలా చేయడం తప్పా? చెబితే వినరు, సరే వాళ్ళబాధలేవో వాళ్లే పడనీ. అయితే ఇదే
అలవాటు కొంపముంచిందొక రోజు.

(దుర్)అలవాటు ప్రకారం ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని నఖశిఖపర్యంతం చూసి, అతనిపై అనుమానాన్ని వ్యక్తం చేయగానే - నన్ను ప్రాణంగా చూసుకున్న వాళ్ళు కర్ర ఝళిపించారు. ఇది శరీరంపై కాదు, మనసుపై కొట్టిన దెబ్బ.

కానీ!

ప్రతి కుక్కకు ఒకరోజు వస్తుంది. తనకు కూడా. తనూ కుక్కే!
ఈ మజ్జన ఊరకుక్కలకు జూలీ,టామీ, స్నూపీ లాంటి ఇంగిలీసు పేర్లు, ఇంట్లో కుక్కలకు తెలుగు పేర్లు డిసైడు చేస్తన్నారు. అటువంటి వాళ్ళు దొరకటం అదృష్టం. వాళ్ళపై విశ్వాసం నిరంతరంగా ఉంటుంది. అయితే తన బ్రతుకు మాత్రం కుక్క బ్రతుకే. ఇదే existential dilemma అంటే!

(చాలారోజుల తర్వాత రామనాథరెడ్డి గారి బ్లాగు చదివి, అక్కడ నా వ్యాఖ్య చూసి ఈ సొల్లు రాశాను)

Wednesday, June 9, 2010

కిత్తెమొ కిత్తెమొ ఒనాజి కెవొ

మొన్నామధ్య బీహారీ బాసురుడు కంపెనీకెవడో హెడ్డాపీసు నుండి వస్తే, వాడితో నానాబాధలు పడి "యే క్యా హరాకిరీ హై" అంటూ వాపోయాడు. హరాకిరీ - ఆ మాట వినగానే ఒకప్పుడు నేను వెలగబెట్టిన జపనీసు గుర్తొచ్చింది.

"హరాకిరీ" అనేది జపనీసు మాట. హరా అంటే బొడ్డు (navel), ఇంకో అర్థం పువ్వు. కిరిమాసు అంటే కత్తిరించటం, కోయటం లేదా పొడవటం. జపనీసు క్రియాపదాలన్నీ విడిగా అయితే మాసుగా ’మాసు’తో ముగుస్తాయి. మనకు ’ట’ తో ముగుస్తాయిగా అలాగన్నమాట. (ఉదా: లేయుట, మింగుట, పరుండుట ) జపనీసులో అయితే, ’ఇకిమాసు, కిమాసు, హజిమెమాసు ఇలా. నామవాచకంతో కలిసినప్పుడు మాసు లుప్తమవుతుంది.

ఈ హరాకిరీ అన్నమాట ఎలా వచ్చిందంటే సమురాయ్ ల గురించి తెలియాలి. సమురాయిలు జపాను యోధులని మనకు తెలుసు. ఈ రాలుగాయిలు యుద్ధంలో ఓడిపోతే, ఏదో ఓడాంలే అని ఊరుకోక, ఫీలయిపోయి, తమ షోగన్నులతో (షోగన్ను అంటే షో గన్ను కాదు, పొడుగాటి కత్తి. సుజుకి షోగన్ అనేదదే) తమే పొడుచుకు ఛస్తారు. అదియొక చమత్కారము! బతికుంటే బలుసాకు తినచ్చులే అనుకోక ఇలా ఛావడమేమిటో మరి. వెధవ ఫిలాసఫీలు, వెధవ పీడ!

పై విషయం మనం ’లాస్ట్ సమురాయ్’ సినిమాలో చూస్తాం(శాం). ఆ చచ్చే ప్రాసెస్ పేరు ఈ హరాకిరీ. ఈ పదం ఇంత దూరం వచ్చి, మన దేశంలో ఎలా తిష్టవేసుక్కూచుందో తెలిసి ఛావట్లేదు. ఇలాంటిదే మరొక మాట, కిరికిరి. దీనర్థమేంటో, దీని వెనక యే కథుందో ఏమో నాకు తెలీదు.

వాళ్ళమాట మనకు వచ్చి చేరినట్టు, మన మాటొకటి అక్కడ చేరుకుంది. అది ’సేవ’. అవును సేవ అనేపదం, జపాను భాష (నిహోంగొ) లో అదే అర్థంలో ఉన్నది. ఇప్పుడు ఆ పదాన్ని వాక్యంలో ప్రయోగించి మీ సహనాన్ని కొద్దిగా పరీక్షిస్తాను, ఏమనుకోకండి.

"ఇరోఇరోయిన ఓ-సేవాని నరిమాషిత. అరిగతో గొజైమాసు" (రకరకాల సేవలను పొందాను.కృతజ్ఞతలు).

మీరు కాస్త పట్టిచూస్తే ఇరోఇరోయి=రకరకాల ఒకేరకంగా ఉన్నాయని గ్రహిస్తారు. చెప్పొచ్చేదేమంటే, వాళ్ళభాష structure తెలుగుకు కాస్త దగ్గర.

లాస్ట్ సమురాయ్ సినిమా గురించి కాస్త మాట్లాడుకుందాం. అందులో టామ్ క్రూయిసు గాడు యుద్ధంలో గాయపడి జపానోళ్ళ ఇంట్లో వచ్చి పడతాడు, తంతే బూరెలగంపలో పడ్డట్టు. వాడికి తను పూర్వాశ్రమంలో రెడ్ ఇండియన్ పిల్లవాణ్ణొకణ్ణి చంపినట్టు గుర్తొస్తూ ఉంటుంది. ఆ చచ్చిన పిల్లాడి పేరు సాకే. టామ్ క్రూయిస్ సాకే, సాకే అని పలవరిస్తుంటాడు. సాకే అంటే జపనీసులో వరితో చేసిన సారాయం. వీడి కలవరింతను అక్కడవాళ్ళు అలా ఇంటర్ ప్రెట్ చేసుకుని వాడికి సారా తెచ్చి పోస్తుంటారు.

ఆ సాకేను కొరియాలో సోజు గా పిలుస్తారు. నేను దాన్ని ఓ గుటక వేశాను. బాగా వేడిచేసిన ఓ చిన్న నిప్పుగోళాన్ని మింగినట్టు అనిపించింది. కంపు వాసన దాని అడిషనల్ క్వాలిటీ.

ఆ సాకే తయారు చేసే వారు పురాతన జపానులో ఓ పల్లె వద్ద నివసించేవారు. ఆ పల్లె ఇప్పుడో పెద్ద పట్టణం. దానిపేరు ఒసాకా. ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒకాయన, 1947 లో ఓ సంస్థ నెలకొల్పాడు. అదే ఇప్పటి సోనీ.

జపాను వారి పేర్లన్నీ ప్రకృతికి సంబంధించినవై ఉంటాయి. నాకో పెన్ గర్ల్ ఫ్రెండు ఉండేది. ఆ అమ్మాయి పేరు చిహారు అని ఏదో వస్తుంది. దానర్థం - వేయి వసంతాలు అనట. ఆమే చెప్పింది.

ఇంతకూ టైటిలు సంగతేమంటారా? అదేమంటే - జపాను వారి ఓ క్యాండీ ఉంది. చాక్పీసులా ఉంటుంది. దాన్ని ఏ భాగంలో అడ్డుగా కోసినా, కనబడే గుండ్రటి తలంలో, మనిషి ముఖం ఉంటుంది. కిత్తెమొ కిత్తెమొ ఒనాజి కెవొ అంటే, ఎక్కడ కోసినా, ఒకే ముఖం అని. (కెవొ - ముఖం, కిత్తెమొ - కోసినా). ఈ మధ్య ఓ జపానెళ్ళిన ఫ్రెండొకడు ఆ క్యాండీ తెచ్చాడు. అది చూడగానే దానికి సంబంధించిన కథ, ఏదో చదివినట్టు లీలగా అనిపించింది. ఇదుగో ఇప్పుడు గుర్తొచ్చిందది.

ఇప్పుడో మణిప్రవాళ కందం. (బొత్తిగా సంకరం అంటే బావుండదు, అందుకని ఆ పేరు)

లత్తుక జపాను భాషను
’కిత్తెమొ కిత్తెమొ ఒనాజి కెవొ’ అని అంటే
కత్తెర వేసిన చోటుల
తిత్తెరి! కనబడిన ముఖమె తిరిగి కనపడే.

లత్తుక జపాను ఎందుకంటే ఎర్రని సూర్యుడి చిహ్నం కాబట్టి.

అన్నట్టు జపనీసులో అమ్మానాన్నలను ’చిచి’, ’హహ’ అంటారు. తల్లిగారు, తండ్రిగార్లను ’ఒకాసాన్’, ’ఒతోసాన్’ అంటారు.

జపాను వార్తలు ఇప్పటికి సమాప్తం. ఇంకొన్ని మళ్ళీ ఎప్పుడైనా.
ఒ యాసుమి నాసాయ్. (ఇదేదో నాశనమైపో అన్న తిట్టు కాదండి. ప్యూర్ ట్రాన్సిలేషన్- సుఖ నిద్రాప్రాప్తిరస్తు)
సయోనర.

Tuesday, February 9, 2010

మా ఊరి మాటలు

"మీనుంచీ మీ సీమోళ్ళ భాష వినబడుతుందేమోనని ఆశపడ్డా, డిసప్పాయింట్ చేశార"ని ఈ మధ్య ఒక యువ బ్లాగ్మిత్రుడన్నాడు. అంత రాక్సాలిడ్ మాట వింటే బాధ కలగాలి, కానీ కొంచెం ఆనందమేసింది. నా ఆనందానికొక చిన్న కనురెప్పపాటువెనుక (ఫ్లాష్ బ్యాక్) ఉంది.

నేను మా ఊరు విడిచి బయటపడకుండా, అక్కడే కూపస్థమండూకంలా, డిగ్రీ వెలగబెడుతున్న రోజుల్లోనే కొంత మంది ఇతర జిల్లా బాహ్యస్థ మండూకాలు సహాధ్యాయులుగా దొరికారు. వాళ్ళలో ఒకడు శ్రీకాకుళం వాడు, కొంతమంది నెల్లూరు వాళ్ళు, ఇశాపట్నమోళ్ళు, కరీంనగర్ వాళ్ళు ఇలా రకరకాలు. తెలుగులో అన్ని రకాలుంటాయని, ఒక్కో తెలుగు ఒక్కో రకంలా ఉండుద్దనీ, అప్పుడే ఎరికయ్యింది. ఆ తర్వాత వూర్ల మీద పడి తిరుగుతున్న రోజుల్లో ఎక్కువగా విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళూ రూమ్మేట్లు గావడంతో నా భాష మారిపోయింది. అదీ జరిగిన సంగతి.

ఫ్లాష్ ఫ్రంటుకొస్తే - మా సీమ భాష అట్లా మర్చిపోయినా, అప్పుడప్పుడూ అలా గుర్తొస్తా ఉంటుంది, రానారె మాటలు విన్నప్పుడూ, నామిని కతలు చదూతున్నప్పుడు వగైరా వగైరా. కానీ ఎక్కడో చిన్న అనుమానం. మా తెలుగు మంచి ప్రామాణికమైన తెలుగేనా అని. ఇది నా కాంప్లెక్సే గానీ, వ్యర్థమైన డౌటు రాజం అని చాలా సార్లు నాకునేను సర్దిచెప్పుకున్నా, అప్పుడప్పుడూ అది తొలుస్తా ఉంటుంది నాకు.

అలానే తెలంగాణా మాండలికంలో వాడబడే "ఉన్నిండ్రు", "ఉంటుండ్రు" వంటి పదాలు అప్పటమైన తెలుగు పదాలని తిరుమల రామచంద్రగారు చెబుతారొకచోట. ఆయన చెప్పిన మరో ప్రయోగం "సేపు". మామూలుగా సేపు అన్న పదం విశేషణాలతో కలిసి "కొంచెం సేపు", "చాలా సేపు" అని వాడబడుతుంది. కానీ కర్ణాటక సరిహద్దు సీమ ప్రాంతాల్లో "సేపెంతయ్యింది" అన్న వాడుక ఉంది.

సరే, కథ కొస్తే, ఈ మధ్య సీమ మాండలికంలో పదాలు ఓ రెండు ప్రబంధాల్లో కనబడ్డాయి. వాటి కథకమామీషు ఇది.

౧. కూపెట్టుట - చాలా ఏళ్ళక్రిందట, మా పక్కింట్లో దంపతులు బాడుగకు దిగారు. వారిది మా జిల్లానే అయినా, దూరప్రాంతం కర్ణాటక సరిహద్దు (మడకశిర) నుంచీ వచ్చారట. వాళ్ళ అమ్మాయి తమ్ముణ్ణిలా పిల్చింది, "రేయ్, అమ్మ కూపెడతా ఉంది. గొజ్జు చేసిందంట, రాల్లంట". అప్పుడు అక్కడ నేనూ, నాతో బాటూ మా అన్నయ్యా, ఇంకొంతమందికీ నవ్వొచ్చింది. కూపెట్టటమేంటి? అని. ఆ అమ్మాయి, ఆ అబ్బాయి సిగ్గుపడ్డారు మా నవ్వులు చూసి. (గొజ్జు అంటే - పులిహోర గొజ్జు)


అదుగో ఆ కూత ఇన్నాళ్ళకు మళ్ళీ ఇక్కడ.

ఏ పట్టున విసువక ర
క్షా పరుడవు గమ్ము ప్రజల చక్కి, విపన్నుల్
గూపెట్టిన విని తీర్పుము,
కాపురుషుల మీదనిడకు కార్యభరంబుల్

ప్రజల మీద విసుక్కోకు, ఆపన్నులు మొరపెట్టుకుంటే, శ్రద్ధగా ఆలకించు, చెడ్డవాళ్ళ మీద కార్యభారాలు వేయకు అని రాజనీతి సూత్రాలు చెబుతాడు ఒకాయన. ఆ పద్యం మా సీమకు పేరెట్టిన సీమ రాయడి కావ్యంలోనిది. కూపెట్టటమంటే పిలువడమూ, మొరపెట్టుకోవటమూనట.

౨. ఉడ్డ

మెత్తగ నూఱిన చుట్టుం
గత్తిన్ మధుకైటభోరు కంఠము లలనా
డొత్తిన హత్తిన చేదుం
దిత్తుల క్రియ దొడల నుడ్డ తిత్తులు వ్రేలన్.

ముందుగా ఒక ససందర్భ ప్రేలాపన. నామిని మిట్టూరోడి కతల్లో "అలిమేలు మంగమ్మకొక దండం" అన్న కతొకటుంది. ఆ కతలో ఓ వాక్యమిది.

"మడికాడికి ఆవును తోలకబోతా ఉండిన కర్రెక్కా, బోరింగు కాడ బోకులు తోముకుంటుండిన కడుపక్కా, మొగుడికి చద్ది పోస్తాపోస్తా ఉండిన నీలావొతీ అందురూ, చేపలగంప చుట్టూతా వుడ్డజేరిపొయినారు."

ఉడ్డజేరడం అంటే, గుంపు జేరటం అనే అర్థంలో మా ఊళ్ళోనూ నేను చిన్నప్పుడు విన్నాను., ఆ మాట వాడి ఉంటాను కూడాన అయితే ఈ మాట ఎక్కడా కనపడలేదు ఇన్నాళ్ళూ. మళ్ళీ ఆ పైన పద్యం లో "ఉడ్డ" ప్రస్తావన కనబడగానే కొంచెం ఛాతీ సైజు పెరిగింది నాకు.

ఆ పద్యం వివరణ ఇది.

ఆ పద్యం తాలూకు హీరో స్పష్టంగానే తెలుస్తూంది, పాండురంగడని. ఆ అయ్య ఆవులు కాస్తూ, కాస్తూ మధ్యలో సమయం దొరికినప్పుడు మిగిలిన గోపాలకులతో కలిసి గోళీలాడతాడట. అందుకోసం ఆయనకు నాలుగు గోళీకాయ (గచ్చకాయ) సంచులు మొలకు చుట్టుకుంటాడుట. వాటి వర్ణన ఆ పద్యం.

మెత్తగ నూరిన - బాగా పదునెట్టిన
చుట్టుం గత్తిన్ - చక్రం తోటి
మధుకైటభోరు కంఠములలనాడొత్తిన - మధుకైటభుల కంఠాలను తరిగిన (ఒత్తిన అంటే శబ్దం రాకుండా తరిగెయ్యటమట)
చేదుం దిత్తుల - చేదటానికి (గాలి తోడుకోవటానికి) పనికొచ్చే తిత్తులు అంటే ఊపిరితిత్తులట. మధుకైటభులు ఇద్దరివీ చెరో రెండ్రెండు, వెరసి నాలుగు సంచులు.
హత్తిన - లభించిన
క్రియన్ - యట్లుగా
తొడలన్ - తొడలకటూ ఇటూ
ఉడ్డ తిత్తులు వ్రేలన్ - నాలుగు సంచులు వ్రేలాడుతున్నవి.

ఇక్కడ బేతవోలు రామబ్రహ్మం గారి వివరణ -

"ఉడ్డ" అనేది నాలుగు అనే అర్థంలో ఆచ్ఛికపదం. ఉడ్డాముగ్గురు అనేది రాయలసీమ వాడుక. ఏడుగురు అని.

ఉడ్డ అంటే నలుగురు అని విశేషమైన అర్థం తీసుకున్నాడు కవి. అయితే సామాన్యంగా వాడుకమాటల్లో గుంపు అని అర్థమనుకుంటాను.

ఈ పద్యమూ ప్రబంధ కవివరులదే. మొదటి పద్యకర్త పేరులో ఉన్న కృష్ణయ్యే ఈ కవి పేరులోనూ ఉన్నాడు!

(నెనర్లు - పద్యకవితా పరిచయం - బేతవోలు రామబ్రహ్మం గారు - అజోవిభో కందాళం వారి ప్రచురణ)

Tuesday, January 5, 2010

పిపీలికం

వంటింట్లో నిలువున్న నిన్నటి చపాతీలు తిందామని చూద్దును కదా, అందులో ఎర్రచీమలు.

చీమ! జాగ్రత్తగా గమనిస్తే ఎంత చక్కటి ఆకారం! రెండు అండాకారాలు - ఒకటి ఎర్రనిదీ, మరొకటి నల్లనిదీనూ. వాటిని దారంలా కలుపుతూ సన్నటి నడుము. అటూ ఇటూ హడావుడిగా పరుగెడుతూ ఉన్నాయి. ఇటు వైపు వెళ్ళే చీమకు అట్నుంచి వచ్చే చీమ అడ్డుపడితే, ఓ లిప్తపాటు తలను తాకించి, ఏదో సందేశాన్నందిస్తూంది. కొన్ని చీమలు కలిసికట్టుగా చేరి, ఓ పెద్ద ముక్కను లాగుతున్నాయి. ఆ చీమలబారు ఎక్కడి నుంచీ మొదలవుతుందో చూద్దామని పరికిస్తూ వెళితే, గోడవారగా పక్కగదిలోకి, అలా గది చివర్న ఓ చిన్న పుట్టలోనికి దారి తీసింది. అందులో సగం బారును లెక్కపెడితే, ఉజ్జాయింపుగా 450 చీమలున్నాయి. ఇటు వెళుతున్నవి, తిరిగి వస్తున్నవీ కలిపి. అంటే, దాదాపు వేయి చీమలు ఆహార సేకరణ అనే ఆ మహా యజ్ఞంలో పాలుపంచుకుంటున్నాయి!

భగవంతుని సృష్టిలో అన్నీ అద్భుతాలే. ఉహూ.. ఆ వాక్యం బావోలేదు. సృష్టిలోని అణువణువులోనూ భగవంతుడు తానై రూపాంతరం చెందాడేమో. ఠాగూర్ అనుకుంటాను గుర్తు లేదు. చూడగలిగితే భిన్నత్వం అణువణువులోనూ ఉందంటాడు. ఓ చెట్టులో ఏ రెండు ఆకులను ఆకులను చూచినా, ఆ ఆకులపైని మెఱుపులోనో, ఆ ఆకుల తాలూకు ఈనెలలోనో, ఆ ఆకు ఆకారంలోనో ఏదోక భిన్నత్వం కనిపిస్తుంది(ట). ఓ చెట్టులోని ఆకుకు, మరో ఆకుకూ మధ్య కూడా వ్యత్యాసం స్పష్టంగా చూడవచ్చట, కనులు తెరిచి పరికిస్తే.

ఓ చెట్టులోని ఆకులను అలా చూస్తూనే లెక్కెట్టటం అనే విద్య ఒకటుండేదట, పూర్వకాలంలో. నలదమయంతుల కథలోని నలమహారాజుకు ఈ విద్య తెలుసట. ఈ విద్య పేరు అశ్వ హృదయం అనో, అశ్వహృదయంలో ఈ గణనం కూడా ఓ అంగమనో చిన్నప్పుడెప్పుడో మాష్టారు చెప్పిన గుర్తు. (ఈ నా జ్ఞాపకం పొరబాటు కూడా అయి ఉండవచ్చు. అయితే ఈ రకమైన విద్య మాత్రం ఏదో ఉన్నట్టు చెప్పారన్నది బాగా గుర్తుంది).

చీమల గురించి ఏదో ఆలోచనలో పడి ఎక్కడికో వెళ్ళాను. కనిపిస్తున్న ఇన్ని చీమలలో కూడా ఒకచీమకూ, మరో చీమకూ మధ్య వ్యత్యాసం ఉందా? అదెలా తెలుసుకోవచ్చో? అయినా ఏ ఎమ్బీయేలూ, మేనేజిమెంటులు చదవకుండానే వీటికి, ఇలా తమ ఆహారాన్ని వర్షాకాలం కోసం దాచుకోవాలని ఎలా తెలిసిందో? ఒక మి.మీ. లో అర్ధ భాగం కూడా లేని వాటి తలలలో, ఈ ఆలోచన ఎలా వచ్చిందో? లేకపోతే, మెదడుతో సంబంధం లేని మరో అద్భుత యంత్రాంగం ఏదో ఈ జీవప్రపంచంలో ఉండి ఉండాలి. నేర్చుకోవాలన్న తపన అవసరమే కానీ, మనకు నేర్పడానికి భగవంతుడు అణిమాది రూపాల నుంచి, బ్రహ్మాండమంతటా తానే అయిన మహిమాత్మక రూపం వరకూ ఎదుట కనిపిస్తూ ఆశ్చర్యానందాద్భుతాలకూ ఎప్పుడూ గురి చేస్తూనే ఉంటాడు. మహిమాన్వితమైన ఆ తేజో రూపం గురించి ఏం మాట్లాడగలుగుతాం? కైమోడ్చి శిరసు వంచటం తప్ప?

నల్ల చీమలను (నల్ల గండు చీమలు కాదు. చిన్నవి) ఎట్టి పరిస్థితిలోనూ చంపరాదని మా అమ్మ చిన్నప్పుడు మాకు విధించిన ఆంక్ష! అవి వినాయకుడి చీమలట. వాటికి చక్కెర కూడా పెట్టేది మా అమ్మ.

సత్యజిత్ రే రాసిన ఓ కథ ఉంది. శాశ్మల్ అనే ఓ ఆసామీ, తన సెలవు రోజును గడపడం కోసం, ఒక్కడే కలకత్తాకు దూరంగా అడవిలో ఓ రిసార్టుకెళతాడు. అక్కడ అడవికి మధ్య, చౌకీదారును పంపేసి, గదిలో నిద్రకుపక్రమిస్తాడు. అప్పుడు ఆ రాత్రి - తను చిన్నప్పట్నించీ చంపిన ప్రాణులన్నీ ఒక్కొక్కటిగా ఆ గదిలో కనబడ్డం ఆరంభిస్తాయి. వాటిలో ఓ చీమలబారు కూడా. అతను తన స్కూలు రోజుల్లో ఓ పైకి వెళుతున్న చీమలబారును, కాగితానికి చివర నిప్పంటించి, ఆ నిప్పుతో ఆ చీమల దండుకు మంటెడతాడు. ఆ చీమల బారు, తన కారు కింద పడ్డ కుక్క, తమ బంధువులింట ఎవరికీ హాని తలపెట్టకుండా, దైవంలా అందరూ పూజించబడుతూ, తనచేత కర్రతో కొట్టి చంపబడ్డ పాము, ఓ పక్షి, పిల్లి....ఇలా... ఆ కథ చివరికేమవుతుందో మాత్రం ఇప్పటికి సస్పెన్స్!

అంతరిక్షమూ, పాలపుంతలూ, గ్రహాలు, నక్షత్రాలు ఆదిగా గల ఈ బ్రహ్మాండంలో మనిషి అస్తిత్వం కూడా పిపీలిక పరిమాణమే కాదూ!

చీమలదండు గురించి ఆలోచిస్తూ, వాటికి పెట్టిన ప్రసాదం వదిలేసి, ఏదో అలా మింగి, కొత్త సంవత్సరం ఏ టపా రాద్దామా అని ఈ టపా రాస్తున్నాను. ఆ చపాతీల పాత్రకు కాస్త దూరంగా సాయంత్రం వెలిగించిన సంధ్యాదీపం ఇంకా వెలుగుతూంది దివ్యంగా.

(జిడ్డు కృష్ణమూర్తి గారు తన బాల్యంలో చీమలను దీక్షగా గమనించేవారట. చీమలపై ఆయన వ్రాసిన ఓ పేరా స్ఫూర్తిగా)

Saturday, December 19, 2009

అవతారం - ఓ సామాన్యుడి గోల

నిన్న నవతరంగం లో రామ్ గోపాల్ వర్మ బ్లాగులో అవతార్ సినిమా గురించి అతని ప్రశంస చదివి అతని మీద నమ్మకంతో, అవతార్ సినిమాకు టికెట్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడే ఓ మల్టీప్లెక్స్ లో ఈ 3D సినిమా చూసొస్తున్నాను.

రాము వ్యాఖ్య ప్రకారం ఈ సినిమా ఓ అనుభవం. అక్షరాలా. సందేహం లేదు. అయితే, అనుభవం వేరు, అనుభూతి వేరు. అనుభవానికి ఆలంబన ఇంద్రియాలు, వాటి తాలూకు ప్రకంపనలు, ఇంకాస్త ముందుకు వెళితే, ఇంద్రియాల ద్వారా చోదితమైన బుద్ధి అయితే అనుభూతికి ఆలంబన మనస్సు. అవతార్ సినిమా స్టార్ వార్స్ సినిమా గుర్తు తెప్పిస్తే, నాకు మాత్రం స్పీల్ బెర్గ్ E.T. సినిమా గుర్తొచ్చింది. అందులో ఉన్నది, ఈ సినిమాలో లేనిది కాస్త స్పష్టంగానే కనిపించింది.

ఇది కేవలం నా సోది కాబట్టి, నా ఆలోచనల్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. చాలా రోజుల క్రితం, ఓ శుక్రవారం రాత్రి, "అన్బే శివం" అన్న కమల్ హాసన్ సినిమా చూశాను. ఆ సినిమాలో - ఓ బస్సు ఆక్సిడెంట్ కు గురవుతుంది. దానికి కారణం ఓ కుక్క. ఈ సంగతి తెలిసీ, కమల్ ఆ కుక్కను చేరదీస్తాడు. ఆ సినిమా ఆలోచనలతో రాత్రి చాలాసేపు నిద్రపట్టలేదు. రాత్రి కిటికీ బయట కుక్క ఏడుస్తోంది. రోడ్డుపై ఎవరో దాన్ని కసరడమూ వినబడింది. ఆ తర్వాత మాగన్నుగా నిద్రపట్టింది. (ఆ సినిమాకు చలించిన నా బుద్ధి నిజంగా ఎదురుగా కుక్క ఏడుస్తుంటే పట్టించుకోలేదెందుకో) ఇంతకూ నేను చెప్పదల్చుకున్నదేమంటే, - మనసుకు, బుద్ధికి దగ్గరగా కనిపించే, వినిపించే సంఘటనలకు ప్రతిస్పందించటం మానవ సహజం. మొన్న వరదతాలూకు ప్రభావం టీవీల్లో చూసి, ప్రజలు స్పందించారు. అదే సమయంలో ఏ ఇరాన్ లోనో, మరెక్కడో ఏ దుర్ఘటనలోనో అంతకంటే ఎక్కువ ప్రజలు చచ్చినా, మనం పట్టించుకోము. ఉద్వేగం బుద్ధిని తాకితే అది "అద్భుతం". ఉద్వేగం మనసును తాకితే అది "కరుణ". రెండూ రసానుభూతులే అయినా "ఏకో రసః కరుణ ఏవ" . మనిషి ఆలోచనలను సత్యం వైపుగా మరల్చడానికి "కరుణ" రసమే ఆలంబన అవుతుంది, కానీ అద్భుతం కాదు.

అవతార్ సినిమాలో ఆటవికుల (?) బాధ చూసినప్పుడూ అందులో "అద్భుతం" కనబడిందే తప్ప, వారి "ఆక్రోశం" నా మనసుకు తాకలేదు. (ఇది నా గోల. అందరికీ ఇలానే అనిపిస్తుందో మరి నాకు తెలీదు). ఆ ఆటవికుల ఆహార్యం విచిత్రంగా అనిపించింది కానీ ఆహ్లాదంగా కనిపించలేదు. ఇక నేపథ్య సంగీతం పేలవంగా ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదన్నట్టుగా ఉంది.మరో లోకానికి మనల్ని "ఈడ్చుకెళ్ళినట్టు" ఉన్నది తప్ప, "తీసుకు వెళ్ళినట్టు" ఈ సినిమా నాకు అనిపించట్లేదు.

Imagination will be a creation, if it touches one's heart, and is identifiable by the heart. Otherwise, it remains as a technical grandeur. (ఇది నా కోటింగే, ఎవరిదీ కాదు)

అవతార్ సినిమా ఓ Technical masterpiece అనిపించింది తప్ప, ఓ కళాఖండం అని నాకు అనిపించట్లేదు.

ఇందాక అన్నట్టు, నాకు E.T. సినిమా గుర్తొచ్చింది. అందులో ఉపగ్రహపు బాలుడి వేలు కొసను, భూలోకపు బాలుడు తాకుతాడు. ఈ సినిమా ప్రోమోస్ లో కూడా ఇది కనిపిస్తుంది. ఈ సినిమాలో ఈ దృశ్యం అనుభవైకవైద్యం. అదే సినిమా 3D లో తీసి ఉంటే, ఓ ఒక్క దృశ్యం కోసం సినిమా చాలాసార్లు చూసి ఉండవచ్చు. అవతార్ సినిమాలో కనిపించే (నాగమల్లి) పూలు, జలపాతాలు, యుద్ధ విమానాలు, మరో లోకానికి తీసుకు వెళతాయి తప్ప దర్శకుడు అంతర్లీనంగా చెప్పదల్చుకున్న సందేశానికి ప్రోద్బలం చేసేలా మాత్రం లేవు.

"ఇంతకంటే, ఓ మామూలు థియేటర్ లో ఓ తెలుగు మాస్ సినిమా చూసి ఉంటే మేలు".ఈ సినిమా చూసి, బయటకు వచ్చిన తర్వాత నాకు, నిజాయితీగా నాకు కలిగిన ఫీలింగ్.

1200 కోట్ల సినిమా, రాము మెచ్చిన సినిమా ఇట్లాంటి పనికిరాని మాటలు నా వంటికి పడవని మరో మారు అర్థమయింది. గొప్ప సినిమా అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియట్లేదు.

(అవతార్ సినిమా చివర్లో, ఓ 20 నిమిషాలకు ముందు లేచొచ్చాను నేను. ఆ 20 నిముషాల్లో, నా ఆలోచనల్ని తిప్పేసే సంఘటనలు సినిమాలో జరిగి ఉంటాయని నేను భావించట్లేదు)

Friday, August 21, 2009

నూరు టపాల సింగారం

ఎట్టకేలకు....నేనూ హండ్రెడ్ షాట్ వాలా సరం పేల్చాను.

రెండేళ్ళు కావస్తూంది, బ్లాగ్లోకంలో అడుగుపెట్టి. నేను బ్లాగు మొదలెట్టిన విధంబెట్టిదనిన .......... మామూలే. ఆదివారం ఈనాడు అనుబంధం చదివి. చదవగానే బాడీ లో మూవ్ మెంట్స్ వచ్చాయి. ఆవేశం తన్నుకొచ్చింది, అదీ కాక ఆ వ్యాసంలో డాక్టర్ ఇస్మాయిల్ గారని మా సీమ డాక్టర్ బ్లాగు గురించి రాశారు! తట్టుకోలేక జూనియర్ ఎన్ టీ ఆర్ "ఆది" సినిమాలో లాగా, "ఎన్నాళ్ళిలాగ", "ఎన్నాళ్ళిలాగ" అని మనసు ఆక్రోశించింది. జనాలు నా రాతలు మిస్ అవుతున్నారు కదా అన్న భావన కుదిపేసింది. (అక్కడికి నా సోది వినడానికిక్కడ అందరూ కాసుక్కూర్చున్నట్టు) ఏదో చేసెయ్యాలి అని ఊగిపోయాను. ఆఫీసుకెళ్ళి చూస్తే అక్కడ బ్లాగర్.కాం వంటి తుచ్చమైన వాటికి పర్మిషన్ లేదు!

ఆ తర్వాత 2007 ఆగస్ట్ లో ఆన్ సైట్ తగిలింది. వాడుకోడానికి లాప్ టాప్ ఇచ్చారు ఆఫీసుగాళ్ళు. రూమ్ లో ఇంటర్నెట్ ధారలై ప్రవహిస్తూంది. అంత ఇంటర్నెట్ తేరగా దొరికే సరికి ఓ రెండు రోజులు అందరు మగాళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ తేరగా దొరికితే ఏం చేస్తారో ఆ పనులు చేసి, విసుగెత్తి, బ్లాగుల గురించి చూశాను. త్రివిక్రం గారి బ్లాగు మొట్టమొదట తగిలింది. ఆ తర్వాత రాధిక గారి స్నేహమా బ్లాగు. అంతకు ముందు ఇస్మాయిల్ గారి గురించి విన్నారుగా. ఇదిగోండి, ఈ ముగ్గురే నేను బ్లాగడానికి మూలకారణమైన త్రిమూర్తులు. రానారె, ప్రవీణు, కొ.పా గారు, తదితరులు మొదట్లో రాసిన సోదంతా చదివి ప్రోత్సహించారు. మేధ (నాలో నేను) కూడా ఇంచుమించు అదే టైం లోనే బ్లాగులు మొదలెట్టారనుకుంటా. కాబట్టి ఆమె ఏమి రాస్తున్నారో చూసేవాణ్ణి రెగ్యులర్ గా.

సరే బ్లాగుకు ఏం పేరు పెడదామా అని "నీహారిక" అని డిసైడ్ చేసి, ప్రయత్నిస్తే, ఆ పేరుతో ఎవరో బ్లాగేస్తున్నారు. ఆ తర్వాత "హరివిల్లు", "ఉత్పలమాల" ఇలా ప్రయత్నించి, అవేవి కుదరక, చివరికి మాస్ టైటిల్ ప్రయత్నిస్తే, గూగులమ్మ ఓకే అంది. అదీ టైటిలు కథ.


రాద్దామనుకున్నది పేరడీలు. సినిమా రివ్యూలు. (నాకు కూసింత అనుభవం ఉండేది వాటిలో. మా మిత్రుల వెబ్ సైట్లు బలయ్యాయి నా రాతలకు) ఇప్పుడు రాసేవి చూస్తే, మళయాళం క్లాసిక్ సినిమా కథలా నా రాతలు నాకే అర్థమయి చావడం లేదు.

చాలా రోజులు ఆఫీసులో ఆఫీసుటైం లో బ్లాగిన తర్వాత (ప్రాక్సీ కనుక్కుని, దాని ద్వారా లాగిన్ అయి), మొన్నామధ్య మార్గదర్శిలో చేరకుండానే ఓ లాప్ టాప్ కొనుక్కున్నాను. అదీ నా సెల్ఫ్ డబ్బా.

వెనక్కి తిరిగి చూసుకుంటే -


ఈ రెండేళ్ళలో, కొన్ని నవ్వులు, కొన్ని చమక్కులు, ఇంకొన్ని చురుక్కులు, కొంచెం అమాయకత్వం, కొంచెం ఆస్తికత, కొంచెం తిరగబడ్డ ఆస్తికత్వం, అస్తవ్యస్తమైన ఆలోచనలు, కుదురుగా ఉండలేని తలబిరుసుతనం,
జ్ఞాపకాల అల్మారాలో వెలికితీతలు, హృదయమనే భూగర్భంలో నుంచి తవ్వుకున్న అనుభూతుల జలాలు,

"పుస్తకం" లో వెలగబెట్టిన కబుర్లూ..

అబ్బో.... నా రేంజుకంటే చాలా ఎక్కువే వెలగబెట్టాను!!

నిజానికి నా రాతల్లో చాలా తప్పులు నాకే కనిపిస్తాయి. అవి అలా ఉంటేనే బావుంటుందని నా అవుడియా.


నన్ను అనవసరంగా రాతగాణ్ణి చేసి, నా సోది ఓపికగా విన్న వారికి, వింటున్న వారికి, ప్రోత్సహించిన, ప్రోత్సహిస్తున్న వారికి ధన్యవాదాలు (బిల్ కుల్ ముఫ్త్). వీవెన్ గారికి కృతజ్ఞతలు. ఈ రెండేళ్ళలో రెండు సార్లు మాత్రం, ఎందుకొచ్చిన సోది, మానేద్దామనుకున్నాను. తిరిగే కాళ్ళు, తిట్టే నోరు ఊరుకోవు అని సింద్ బాద్ చెప్పినట్టు,మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతున్నాను. బ్లాగులు అన్నవి తెలియక ముందు, రాయలసీమ వాణ్ణి అని చెప్పుకోవాలంటే - ఓ గోళీలాట ఆటగాడు, క్యారమ్స్, బిలియర్డ్స్ ఆటగాళ్ళ ముందు నిలబడితే ఎలా ఉంటుందో అలా ఫీల్ అయే వాణ్ణి. ఇప్పుడు షర్ట్ కున్న ఓ బటన్ విప్పేసి చెప్పుకుంటున్నాను, నేనో సీమ బ్లాగరిని (రచయితను కాకపోయినా) అని.

అన్నట్టు నా సోది రాతల వల్ల కొందరు సహృదయులను కలిసే అవకాశం దొరికింది. ఇది నా అదృష్టం. ఇంకా బ్లాగర్లు సాధ్యమైనంత మందిని కలవాలని ఉంది. చూడాలి.


(టపాలో వాడుకున్న ఫోటోలకు మోడల్ - సంహిత అనే దుండగురాలు

వయసు - సరిగ్గా యేడాది.

చేసే పనులు - బొమ్మల తలలు, కాళ్ళు విరగ్గొట్టటం,
ఈనాడు పేపర్ రాగానే చింపెయ్యటం,
కొత్త గౌను మీద నీళ్ళు పోసుకోవటం,
మట్టి, చెప్పులు, పరక, ఇలాంటి వాటితో ఆడుకోవడం,
లాప్ టాప్ మీదెక్కి చిచ్చిపోయటం,
నాన్న సులోచనాలను (కళ్ళజోడు) లాగి విసిరెయ్యటం వగైరా..)

Tuesday, December 30, 2008

నా మొబైల్ కి తెలుగొచ్చేసింది

కొన్ని నెలల క్రితం, ఓపెరా విహరిణి తెలుగు లో రిలీజ్ అయినప్పుడు, వీవెన్ గారు ఓ టపా ద్వారా ఆ విషయం చెప్పారు. అప్పుడు ఓ అనుమానం వచ్చింది. మొబైల్ లో మన తెలుగు బ్లాగులు చూసుకోవచ్చా? అని. ఎందుకంటే, నాకు ఇంటి దగ్గర pc, లాప్టాప్ లేవు. పైగా వీలు చిక్కినప్పుడల్లా వారాంతాలు మా వూరికి ప్రయాణం పెట్టుకుంటూ ఉండడం వల్ల, ప్రయాణంలో బ్లాగులు చదువుకోడానికి అనువుగా మొబైల్ (ఓపెరా మినీ విహరిణి) లో చూసుకోవడం కద్దు. అయితే,నా మొబైల్ ఫోన్ (సోనీ ఎరిక్సన్ w 350-I) లో తెలుగు సదుపాయం లేదు. (అయితే యూనీ కోడు బెంగాలీ ఫాంట్, అరబిక్ వగైరా ఉన్నాయ్) అందుకే తెలుగు బ్లాగులు తెరిచినప్పుడల్లా, డబ్బాలు డబ్బాలు కనిపించేవి. ఫోన్ లో నేటివ్ ఫాంట్ లేకపోతే తెలుగు చదవడం కుదరదని ఓపెరా వారి ఉవాచ. వీవెన్ గారు ఆ విషయం ధ్రువీకరించారు.

ఈ రోజు ఉదయం ఓ అద్భుతం జరిగింది. మొబైల్ ఫోన్ లో ఎందుకో జీమెయిల్ చూసుకుంటుంటే, కొన్ని తెలుగు అక్షరాలు కనిపించాయ్. సరే అని, నా బ్లాగుకు వెళితే, చక్కగా తెలుగు అక్షరాలు కనిపిస్తున్నాయి. అలానే కూడలి, లేఖిని వగైరా...

నేను నా మొబైల్ సాఫ్ట్ వేరు ను అప్డేట్ చేయలేదు. ఓపెరా కొత్త వర్షను దింపుకోలేదు. నా ఫోన్ లో ఇప్పటికీ తెలుగు ఫాంట్ లేదు. అయితే ఇది ఎలా సాధ్యమయిందో తెలియట్లేదు. ఈ మధ్య మా వూళ్ళో ఓ internet cafe లో కెళ్ళి, పాత చిరంజీవి పాటలు, కొన్ని గేములు ఎక్కించుకు రావడం తప్ప మరే పాపమూ ఎరుగను. ఏదైనా వైరస్సు తగులుకుందో ఏమో మరి. ఒక వేళ అలాంటిదేమైనా ఉంటే, ఆ వైరస్సు మాతకు నమోవాకాలు! :-)

మొత్తానికి ఇది చాలా పెద్ద వింతే నాకు!

మొబైల్ లో నా బ్లాగు :-