Saturday, April 23, 2011

సాయిబాబా - అంతశ్శోధన


"అంతమంది జనాలు సాయిబాబాను నమ్ముతున్నారు గదా, నువ్వెందుకు నమ్మవు?" కాలేజీ చదువుతున్నప్పుడు మాయమ్మ అడిగింది ఒకరోజు.

అప్పట్లో ఒకానొక ఫంక్షన్ లో (సత్యసాయి నిగమాగమం ప్రారంభోత్సవం అనుకుంటా) సాయిబాబా రాజేష్ పైలట్ అనే కేంద్రమంత్రికి కొన్ని వేలమంది చూస్తుండగా గాలిలో నుండి ఒక చిన్న నగ సృష్టించి బహుమతిగా ఇచ్చారు, ఆ దృశ్యం వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత వీడియో రికార్డులను స్లో మోషన్ లో చూస్తుండగా ఒక విషయం బయటపడింది. సాయిబాబా పక్కన ఒకతను ఒక పళ్ళెం పట్టుకుని నిలబడి ఉంటే, ఆ పళ్ళెం క్రిందుగా చేతులు పోనిచ్చి సాయిబాబా ఆ నగను తీసినట్టు ఆ దృశ్యం చెబుతూంది. ఆ టేపును అప్పటి దూరదర్శన్ డైరెక్టర్ అప్పారావు గారు కాల్చేశారట. ఇదంతా పత్రికల కథనం కాబట్టి నిజానిజాలు నాకు తెలియవు. అయితే సాయిబాబా పళ్ళెం కింద చేయి పెట్టటం నగ తీయడం ఈ వరుస ఫోటోలు ఒకానొక దినపత్రికలో వచ్చాయి. వాటిని మా కాలేజీ నోటీసు బోర్డులో పెట్టారు. అదీ కథ.

ఆ రోజు వరకూ నా గోల నాది, కానీ సాయిబాబాను నమ్మకపోవడం ఆ సంఘటన నుంచి నాలో మొదలైంది. దానికి తోడు ఆయన కుండలోంచి విభూతిని పది పదిహేను నిముషాల వరకూ తీస్తూనే ఉండడం, నోట్లో శివలింగం తీయడం ఇవన్నీ ఒక డాక్యుమెంటరీ సినిమాలో చూసి కాస్త విరక్తి కలిగింది. ఈ పైత్యానికి తోడు నాకో స్నేహితుడు ఉండేవాడు. వాడు పరమభక్తుడు. "దీపం విలువ దీపం క్రింద చీకట్లో కూర్చున్న వాళ్ళకు తెలీదురా. కాస్త దూరం నుంచి చూసేవాళ్ళకు మాత్రమే కనబడుతుంది" అనే వాడు. వాడి మూర్ఖభక్తి చూసి నవ్వు వచ్చేది. ఆలోచనాశక్తిలేకపోవడం వల్ల ఎప్పుడైనా కోపమూ వచ్చేది.

సాయిబాబా మీద ఈ తిరుగుబాటు భావజాలం అంతర్మథనంగా మారింది మా మేనమామ వల్ల.

కీర్తిశేషులు శంకరసుబ్రహ్మణ్యం మా మామయ్య. ఆయన కాలం చేసి నేటికి పదేళ్ళవుతూంది. ఆయన బహుభాషావేత్త. సంస్కృతంలో మంజరీశతకం అన్న శతకకావ్యమూ, వేమన పద్యాలకు హిందీ అనువాదం, ఠాగూర్ పద్యాలకు తెనుగు సేత, మేఘదూతం లా నిస్తంతీ దూతం (ఆయన టెలికాం లో ఆఫీసర్ గా పనిచేసి పదవీవిరమణ చేశారు) ఇలాంటి రచనలతో సాహిత్యపరిశ్రమ, శారదాసేవ చేసిన వారు. నిత్యవిద్యార్థి. ఆయన ఛాందసులు కారు, ఆధునికులనే చెప్పాలి. ఆంగ్లం మీద, ఆంగ్లవిద్య మీద మోజు, ఆంగ్లం చదివితే జీవితంలో పైకి రావడం సులభమనే భావనా ఆయనకు ఉండేవి. ఆయన టెలికాం ఉద్యోగం నుండి రిటైర్ అవడానికి ముందు కొన్ని చిక్కుల్లో పడ్డారు. తన ఆఫీసులో సహోద్యోగి ఒకతను ఒక చెక్కును ఫోర్జరీయో ఏదో చేసి, డబ్బు కాజేసి, ఆ నేరం ఈయన మీదే మోపారు. ఆ కేసు పెట్టినది దళితుడు అవడంతో ఈయనకు చిక్కులు మరింత ఎక్కువయ్యాయ్. దాదాపు నలభై అయిదేళ్ళ సర్వీసులో నిజాయితీగా కష్టపడినందుకు ఈ ఫలితం దక్కిందని ఆయన మానసిక వేదన అనుభవించారు. ఆ సమయంలో సత్యసాయిబాబాను నమ్మారు. వేడుకున్నారు. ఎలాగైతేనేం కొన్ని యేళ్ళకు ఆయనకు న్యాయం దొరికింది. కోర్టు ఆయనను నిర్దోషిగా నిర్ణయించి తీర్పునిచ్చింది. సాయిమీద కృతజ్ఞతతో ఆయన ఇల్లు కట్టుకుని "సాయిసదనమ్" అని పేరు పెట్టుకున్నారు.

మా అమ్మకూ, మా పిన్నమ్మలిద్దరికీ మేనమామ మాట వేదవాక్కు కాబట్టి వాళ్ళూ ఆయనను నమ్మడం మొదలుపెట్టారు.మా ఇళ్ళ పూజాగృహాలలో సాయిబాబా పటం ఉండేది. అయితే అవజ్ఞతతో, తెలివిమాలినతనంతో అప్పట్లో మా అమ్మతో నేను కాస్త దురుసుగా మాట్లాడేవాణ్ణి, సాయిబాబా కుండలో విభూతి తీస్తే మీరెలా నమ్ముతారని మా అమ్మను ఆక్షేపించిన జ్ఞాపకం. టపా మొదట్లో మా అమ్మ కోపంగా అడిగిన ప్రశ్న ఆ సందర్భం లోనిదే.

బతికి ఉన్న రోజుల్లో మా మేనమామయ్యతో నాకు మాటలు, కొంతవరకూ చర్చలు ఉండేవి కానీ, విపరీతమైన చనువు లేదు,ఆయనతో మాట్లాడే స్థాయి కూడా లేదు. అంచేత సాయిబాబా విషయంలో నేను ఆయనతో చర్చించలేదు కానీ, ఒక సందర్భంలో నాకు తెలిసిందేమంటే, ఆయన సాయిబాబాను చూడనే లేదని, కేవలం ఆశ్రయించారని. తన లీలల గురించి కూడా తనకు తెలిసి ఉండదని నా అనుకోలు. సాయిబాబాను ఆయన కడకు దర్శించారో లేదో తెలియదు.

ఆయన ద్వారా నేను నేర్చుకున్నది సాయిబాబాను నమ్మినా, నమ్మకపోయినా నమ్మేవాళ్ళను గేలి చేయరాదన్న సంస్కారం. ఆ సంస్కారం కాస్త మిగలబట్టి మా ఇంటికి ఒకసారి నాన్న తరపున బంధువులు వస్తే, వారివెంట పుట్టపర్తి వెళ్ళి వచ్చాను. మా బంధువు పొద్దున ఐదున్నరకు వెళ్ళి మూడవ వరుసలో కూర్చున్నారు. సత్యసాయిబాబా చేతి నుండీ విభూతి రాలడం ఆయన స్వయంగా చూశానన్నారు. చాలా ఆశ్చర్యపడిపోయారు.

అయినా ఎందుచేతో అప్పుడప్పుడూ పురుగులా ఒక ప్రశ్న తొలుస్తూనే ఉంటుంది. ద్వేషం వల్ల కాదు, ఏదో తెలియని బాధ, ఆవేశం వల్ల.  ఒక వ్యక్తి రోలెక్స్/టైమెక్స్/సిటిజెన్ గడియారం గాల్లో ఎలా సృష్టిస్తారు? ఒక గడియారం కావాలంటే క్వార్ట్జ్ క్రిస్టలు, దాని వెనుకనున్న సైన్సు సూత్రాలు, నిపుణులు అనేకుల పరిశ్రమ లేకుండా ఎలా సాధ్యం? గాల్లో బూడిద పుట్టిందంటే ఏదోలే సంభావ్యత ఉందనుకుందాం, గడియారం ఎలా "పుడుతుంది"? అసలు చేతిలో పట్టేంత వస్తువెందుకు పుట్టాలి? యే రిఫ్రిజిరేటర్ నో పుట్టించవచ్చు గదా? (నేను ఎర్ర వాణ్ణి, మతద్వేషినీ కానని మనవి. నా వాదన ఎర్రవారికి మద్దతు కాదు. పైవాదన సాయిబాబా భక్తులకు ధిక్కరింపూ కాదు. నేను నమ్మవలసి వస్తే నాకు కలిగే ప్రశ్నలు మాత్రమే)

పై ప్రశ్నలు ఎవరినైనా అడిగితే వాళ్ళు నన్నెలా ఆక్షేపిస్తారో అనుకుంటే ఈ క్రింది ప్రశ్న తట్టింది.

"నువ్వెందుకు ఐదేళ్ళ పిల్లవాడు (కృష్ణుడు) ఒక కొండను చిటికెన వ్రేలుతో ఎత్తాడంటే నమ్ముతున్నావు? పూజిస్తున్నావు?రాముడు ఒక బండకు తన కాలు సోకించగానే ఒకమ్మాయి పుట్టిందంటే నీవెలా నమ్ముతున్నావు?(ఇలాంటివి అనేకం ఉన్నయ్)

కాస్త తల చెడగొట్టుకుంటే రెండు సమాధానాలు కని(విని)పించాయి.

౧) పై రెండు కావ్యసాహిత్య విషయాలు కాబట్టి. సాహిత్యంలో ఒక పురుషోత్తముణ్ణి, శ్రేష్టుణ్ణి చేయడానికి చిలవలు పలవలుగా కల్పించడం ఉన్నదే. (రాజమౌళి సినిమాల్లో హీరోలు చేసే విన్యాసాలలాగా). అవన్నీ లేకపోతే కావ్యమూ లేదు, కావ్యోద్భవరసనిష్పందమూ లేదు. కావ్యం అంటే కేవలం న్యూస్ పేపర్ లో చదివే న్యూస్ లాంటిది కాదు, పొద్దస్తమానం తిని తొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా లేదు. అంచేతే కావ్యమూ, రసమూ, కల్పనలూ వగైరా వగైరా..

౨) ఎవరైనా ఒక మహానుభావుడు, మహోన్నతుడు, పురుషోత్తముడు, సద్గురువు పుట్టి గతించిన తర్వాత ఆతని చుట్టూ మార్మికత, ఆచారాలు, వ్యవస్థా కమ్ముకోవడం లోకవ్యవహారం. బుద్ధుడు దేవుడే లేడన్నాడు. (లేదా దేవుణ్ణి బయట కాక అంతశ్శోధనలోనే వెతుక్కోమన్నాడు). ఆయన తర్వాత అనుచరులు ఆయనను దేవుణ్ణి చేసిపెట్టారు. ఆయన పేరు మీద అభూతకల్పనలు, అతీంద్రియ శక్తులు కల్పించారు. షిర్డీ సాయిబాబా విషయంలో అదే జరిగింది. ఇంకా ఎంతోమంది విషయంలో కూడానూ. బహుశా మరో రెండు తరాల తర్వాత ఏమో, జిడ్డు కృష్ణమూర్తి కూడా దేవుడు కావచ్చు!

జిడ్డు కృష్ణమూర్తి 1929 లో తను అధిపతిగా ఉన్న ఆర్డర్ ఆఫ్ స్టార్ సంస్థను రద్దు చేసి అప్పట్లో 3000 కోట్ల డాలర్ల సొమ్మును సంస్థ సభ్యులు ఎవరికి వారికి పంచి ఇచ్చేశాడని వార్త.

బహుశా మరో వంద, నూటయేభై సంవత్సరాల తర్వాత -

కృష్ణమూర్తి అప్పుడు కళ్ళు తెరిచాడు. అంతే! ఆయన ముందున్న డబ్బంతా మాయమయింది. అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపడ్డారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఆశ్చర్యం!!! వాళ్ళ ఇళ్ళ అల్మైరాలలో, ఇనుపపెట్టెలలో సరిగ్గా వాళ్ళు ఆర్డర్ ఆఫ్ స్టార్ కు ఇచ్చిన విరాళం లెక్క ప్రకారం అంతే లెక్క అలాగే ఉంది. పూజాగదిలో కృష్ణమూర్తి విగ్రహం లోంచి దేదీప్యమానమైన కాంతి ప్రసరిస్తోంది......

అలాంటిది కల్పన ఒకటి మొదలయితే ఆశ్చర్యమేమీ లేదు.

**************************************************************************************************

సాయిబాబా (మత) ద్వేషులది మరో తీరు. ఏదో, ఎవరినో ఉద్దరిస్తున్నట్టు, ప్రపంచానికంతా జ్ఞానజ్యోతులు వెదజల్లుతున్నట్టు ఉంటాయి వీళ్ళవాదనలు. జీవితంలో భరించలేని కష్టాలొస్తే, మళ్ళీ వీళ్ళది అదే త్రోవనే. ఏదో ఒక నమ్మకమో, విశ్వాసమో ఆసరా కావలసిందే. వ్యవస్థీకృతమైన నమ్మకం చెడ్డదని కొందరి చిలకపలుకు. వ్యవస్థీకృతమైన నమ్మకం ఆత్మశోధనకు అడ్డంకి కావచ్చునేమో, కానీ వ్యవస్థీకృతమైన అపనమ్మకం పరమ దారుణమైనది. మనుషులను పశువులుగా మార్చేదీనూ. Truth is not opposite of false, but absence of false అనేది వివేకవంతమైన మాట. అది స్వయంగా ఎవరికి వారు తెలుసుకోవలసిందే. నమ్మకం కనీసం సాంత్వననిస్తుంది. అపనమ్మకం వల్ల ఒరిగే ప్రయోజనమేదీ లేదు. వీళ్ళు చెప్పే అంత సైన్సూ ఈ రోజు ఒరగబెడుతున్నదేమీ లేదు. నూటికి ముప్ఫై మంది ఆకలితో ఛస్తుంటే సైన్సు బాంబులకోసం తన్నుకుంటూంది. అందుకు శాస్త్రీయవాదులు సమాధానం చెప్పరు. వాళ్ళమాట వింటే ప్రపంచం మారిపోతుందన్న అల్పభ్రమలో ఉంటారు.

**************************************************************************************************

అయితే సాయిబాబా గురించి ఆలోచనలు వచ్చినప్పుడు దొర్లే కొన్ని ప్రశ్నలు మట్టుకు వేధిస్తూనే ఉంటాయి. Faith begins when logic ends. అని సూత్రం. Is that faith which comes is really a faith? or a subset of FEAR/DESIRE? గౌతమ బుద్ధుని నుంచి జిడ్డు కృష్ణమూర్తి వరకూ శంకను నిరంతర అన్వేషణాపరత్వాన్ని వీడకూడదని బోధిస్తారు. Doubt has a cleansing effect అంటారు కృష్ణమూర్తి. శంక అంటేనే తర్కం పరిధిలోకి వచ్చేది. తర్కాన్ని ఎంతవరకు నమ్మాలి? ఎప్పుడు తర్కం వద్దనుకోవాలి? ఎవరి దగ్గర తర్కాన్ని త్యజించి విశ్వాసం చూపడం మొదలుపెట్టాలి? తర్కం కూడా బుద్ధి పరిధి లోనిదే కదా? దాన్ని తోసిరాజనడం ఆత్మవంచన కాదా?

Logic ను పక్కకు నెట్టేసి ఒక Entity ని నమ్ముతాము అనుకుంటే నా నమ్మకం (FAITH) వెనుక ఉన్నది ఏమిటి? కోరికా? భయమా? లేక ఆత్మార్పణమా? (Total surrender)

భయమూ, కోరికా లేనప్పుడు మనలను (ఆత్మను లేదా మనసును) ఒకరికి అర్పించుకోవడం ఎందుకు? ఆ అవసరమేమిటి?

Master is born when pupil is ready
When the rain comes
grass grows by itself.

అనేది ఒక జెన్ హైకూ. గురువు కన్నా శిష్యుడే గొప్ప, అంతశ్శోధనయే గురువు అని ఈ సాంప్రదాయం. అంతిమంగా ఏదైతే తెలుసుకోవలసి ఉందో, ఏది తెలిస్తే దుఃఖమూ, అసూయ, అజ్ఞానము, అవివేకమూ మొదలైనవన్నీ నశిస్తాయో దానికి formula ఏ గురువు దగ్గర, ఏ బాబా దగ్గర, ఏ ప్రస్థానం వద్ద, ఏ పుస్తకంలో, ఎవరి బోధలో, ఎవరి శిష్యరికంలో,ఏ మఠంలో, ఎక్కడ దొరుకుతుంది?

Sunday, April 10, 2011

కర్రదెబ్బలూ - మొట్టికాయలూ

గు శబ్దః అంధకారః రు శబ్దస్తు తన్నిరోధకః
అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే ||

గురు అంటే అంధకారాన్ని వదిలించి కాంతిపథాన్ని దర్శింపజేసేవాడురా. ఎవడ్ని బడితే వాణ్ణి గురు అనకూడదురా రేయ్. శాస్త్రి సారు చెప్పారు.

గురు అని సినిమా ఉంది సార్, అది చూడచ్చా? వెనకబెంచీ వాడొకడు ధర్మసంకటం వెలిబుచ్చాడు. అయ్యవారికి కోపమూ, నవ్వూ వచ్చినై. నవ్వు దాచుకుని, కోపం చూపిస్తూ వాడి చెవులు పట్టుకుని వీపు వంచారు. జేబు నుంచీ నేత ముళ్ళకంప ఆకు కాస్త కిందపడింది. లేత ముళ్ళకంపాకు జేబులో కూరుకుంటే ఆ రోజు దెబ్బలు తగలవని పిల్లకాయలకు ఒక నమ్మకం.

ఇదేందిరా? అయ్యవారు పక్కన పిల్లవాణ్ణి అడిగారు.

"సార్. అది జేబులో పెట్టుకుంటే తన్నులు పడవంట సార్." - చెప్పాడా అబ్బాయి.

బెల్లు కొట్టారింతలో.

అయ్యవారు కిందపడిన ఆ ఆకులు తీసి ఆ పిల్లవాని జేబులో కూరి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.

"అమ్మయ్య. దెబ్బలు తప్పినయ్ గురూ.." వాడు పక్కనున్న పిల్లవానితో అన్నాడు.

**************************************************************************

మరో అయ్యవారు వచ్చారు. ఈ అయ్యవారికి కోపమొస్తే రూళ్ళకర్ర తెప్పిస్తారు. దేవుడికన్నా పూజారి వరం అవసరమని ఆ రూళ్ళకర్ర తెచ్చే ప్యూపిల్ లీడరుకు తెగ డిమాండు. ఒక్కోసారి అయ్యవారి హిట్ లిస్టులో అస్మదీయులు ఎక్కువగా ఉంటే, సారు ఆజ్ఞ అయిన తర్వాత రూములో రూళ్ళకర్ర దాచిపెట్టి వచ్చి, అయ్యవారికి "కర్ర దొరకలేదు సార్" అని చెబుతుంటాడు.

ఆ రోజు పూజారి పాత్రధారి దగ్గరకు గోపాల్ వచ్చాడు.

"ఒరే, నేను హోమ్ వర్కు చేయలేదు, ఈ రోజు సారుతో తన్నులు తినకుండ నువ్వే ఏదో చెయ్య"మన్నాడు. వీడు "నాకేమిస్తావ"ని అడిగినాడు.

పూజారికి రెండు కమ్మరకట్టలు, ఒక జీడి మామిడి కాయకు ఇచ్చేలా బేరం కుదిరింది.

అయ్యవారు రానే వచ్చారు. రూళ్ళకర్రకు పురమాయించారు. కాసేపటికి - "రూళ్ళకర్ర కనిపిస్తా లేదు సార్" అన్న సమాధానం వచ్చింది. సరిగ్గా అక్కడ, ఆ రోజు కథం అడ్డం తిరిగింది.

అయ్యవారి కోసం ఎవరో అతిథి వస్తే తన రూముకు తీసుకు వెళ్ళారు. అక్కడ అతిథి అల్మైరా పక్కన కుర్చీలో కూర్చుని ఉంటే అల్మైరా పైనుండీ రూళ్ళకర్ర దొర్లుకుంటూ వచ్చి తన తలమీద పడింది. అతిథిని పంపేసి రెట్టించిన కోపంతో క్లాసుకు ఒచ్చినారు. ప్యూపిల్ లీడరు రూళ్ళ కర్రను అల్మైరా పైన దాచి ఉంచినాడని అర్థమయిపోయిందాయనకు. అయితే అతని సంగతి పక్కనబెట్టి వస్తూనే హోమ్ వర్కు గురించి ఆరా తీశారు.

గోపాల్ కు ఇక అర్థమైపోయింది. అయితే వాడు పంచతంత్రంలో ప్రాప్తకాలజ్ఞుడిలాంటి వాడు. అయ్యవారు రూళ్ళకర్రతో కొట్టడం మొదలెట్టగానే ఫిట్స్ వచ్చినవాడిలా పడిపోయి తల అటూ ఇటూ కదల్చడం మొదలుపెట్టినాడు. అయ్యవారి కోపం బెరుకుగా మారింది. ఏదో కీచైను చేతిలో పెట్టి, నీళ్ళు చల్లి ఇట్లా ఏదేదో చేసినాడు. ఆ గొడవలో అసలు దొంగను మర్చిపోయినాడు.

ప్యూపిల్ లీడరే కమ్మరకట్టలు, మామిడికాయలూ, రసగుల్లాలు ఇచ్చుకోవలసి వచ్చింది చివరికి.

మా గోపాల్ గురించి రెండు మాటలు. చిన్నప్పుడు నువ్వేమౌతావురా అంటే అందరూ నేను డాక్టరు, ఇంజినీరు, టీచరూ - ఇట్ల చెబితే వాడు మాత్రం రాజకీయనాయకుడైతానని అన్నాడు. ఇప్పుడు ఏదో పల్లెలో సర్పంచ్ అయినట్లున్నాడు.

**************************************************************************

మరో పీరియడు వచ్చింది. ఈ అయ్యవారు క్లాసులో సైలెన్స్ ను ఇష్టపడతారు. అలా క్లాసంతా సైలెంటుగా ఉంటే ఆయన పుస్తకం మధ్యలో చందమామ పెట్టుకుని హాయిగా చదువుకుంటుంటారు. అనువాదం క్లాసు కాబట్టి చెప్పేదేమీ లేదు. తరతరాల సంపదగా వస్తున్న నోట్సు రాసుకోవడమే.

సైలెన్సు పాటించడం కోసం ఈయన భేదోపాయం అనుసరిస్తారు. ఎవడైనా మాట్లాడితే పక్కన వాడు మొట్టికాయ వేయమని చెప్పారు.

కాసేపు బానే ఉంది. ఆ తర్వాత ఒకడికి మొట్టికాయ పడింది. "ఎందుకు కొట్టావు?" అని అడిగాడు వాడు. తక్షణం రెండు మొట్టికాయలు - ఇవతల వాడు, అవతలి వాడు వేశారు. (మాట్లాడాడు కాబట్టి). వీడు వస్తున్న కోపం దిగమింగి మొదటి మొట్టికాయకు ప్రతీకారం తీర్చుకుందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రత్యర్థి పడనీయడం లేదు. అయ్యవారు ధ్యానముద్ర నుండి లేవగానే మొదటి బెంచి లో సీను కనబడింది. వాడెవడో (ఇందాకటి ప్రత్యర్థి) ఊరికే కూర్చుంటే వీడు వాణ్ణి తన్నడానికి వెళుతున్నాడు! "రేయ్ వీడికి ఒకటెయ్యండ్రా". ఈ సారి ఒరిజినల్ సఫరర్ కు ఇటువైపు, అటువైపు మాత్రమే కాకుండా వెనుకనుండి రెండూ వెరసి నాలుగు మొట్టికాయలు పడ్డాయి.

**************************************************************************

(ఈ మధ్య మా ఊళ్ళో స్కూలు మిత్రులం కలిసినప్పుడు గుర్తుకు వచ్చిన జ్ఞాపకాలు కొన్ని)

Monday, April 4, 2011

"మూల" బడిన నక్షత్రం

చిన్నప్పుడు ఆరవ తరగతిలో అనుకుంటాను. తెలుగులో చంద్రహాసుడి పాఠం వస్తుంది. కథ లీలగా మాత్రమే గుర్తుంది. చంద్రహాసుడనే అతడు మూలానక్షత్రంలో పుట్టాడు. అతడు ఒకరోజు ఒకానొక ఉద్యానవనంలో తెలివితప్పి పడిపోయి ఉన్నాడు. అతడి జేబులో ఒక ఉత్తరం ఉంది. అందులో "ఇతడహితుడు. విషమునిమ్ము" అని రాసుంటే, రాకుమారి విషయ చూసి, కాటుకతో, "ఇతడు హితుడు. విషయ నిమ్ము" అని మారుస్తుంది. దాంతో కథ సుఖాంతం.

ఆ కథ గుర్తుండడానికి ముఖ్యమైన కారణమేమంటే, నాదీ మూలా నక్షత్రం కనుక. నాకు జ్యోతిష్యం మీద ఆసక్తి, అనాసక్తి రెండూ లేవు కానీ నాకు తెలిసిన కొంతమంది చెప్పేదేమంటే - ఈ మూలా నక్షత్రం ఒక వేస్టు చిల్లర నక్షత్రమట. ఇందులో పుట్టినవాళ్ళను చేసుకుంటే అత్తగారు గానీ, మామగారు కానీ ఫట్ అంటారు అని. ఇవి ఎంతవరకూ నిజాలో నాకు తెలియదు. దానికి ఎక్సెప్షన్స్ ఏవేం ఉన్నాయో అంతకన్నా నాకు తెలీదు.

అయితే ప్రతి ఉగాదికీ పంచాంగశ్రవణం వినేప్పుడు ఠంచనుగా అయ్యవార్లు చెప్పేది మాత్రం గుర్తుంది. ఈ యేడాది ధనూ రాశి వారికి బావోలేదు. చిన్నప్పుడు మా అమ్మ రెండు మూడు ఉగాదులు వరుసగా ధనూరాశి వారికి బావోలేదని చెప్పి ఆ తర్వాత ఉగాదికి మళ్ళీ ధనూరాశికి అష్టమ శని అనేసరికి కోపం వచ్చి నేనడిగా. "అమ్మా, శని ధనూరాశికి పట్టిందా? ధనూరాశే శనికి పట్టిందా?". మా అమ్మ కాసేపు అలా దిక్కులు చూసి, సరే కనుక్కుని చెబుతానంది. తరువాత రెండు రోజులకు అమ్మ నా దగ్గరకు వచ్చి అంది. "ఒరే, ఆణ్మూలం అరసియల్ (తమిళం) అంటార్రా, అంటే మూలానక్షత్రంలో పుట్టిన మగపిల్లవాడికి ఎదురే లేదుపో!" మళ్ళీ అడిగా. ఆణ్మూలం సంగతి సరే, పెణ్మూలం బావోదా? ఈ సారి అమ్మ నవ్వేసింది. నేననుకున్నాను. పెణ్మూలం ఎందుకు బావుండదూ? ఖచ్చితంగా బావుంటుంది, బావుండాలి, బావుంది కూడానూ. కంటెదురుగా మూలా నక్షత్రంలో పుట్టిన పెణ్ణు కనిపిస్తూంది. (మా అమ్మ నక్షత్రం ఏంటో కనుక్కున్నారా? లేకపోతే వెవ్వెవ్వె)

ఈ ఆణ్మూలం సెంటిమెంటు మరోసారి నా లైఫులో ఎంట్రీ ఇచ్చింది. నా మీద మా నాన్న కుట్రపన్ని నాకు పెళ్ళి సంబంధాలు వెతుకుతుంటే ఎవరో నా నక్షత్రం సంగతి విని హెవీ కట్నం ఆఫర్ చేశారట. అయితే మా నాన్న కట్నం మాటవింటే నేనెక్కడ కసురుకుంటానో అని ఆ ప్రసక్తి నా వద్ద తీసుకురాలేదు. ఈ మధ్య ఎందుకో నాదగ్గర మానాన్న ఆమాట అంటే నేను అన్నాను. అవును మూలానక్షత్రం వాళ్ళు రాజులా ఉంటారుకానీ బానిసలా అమ్ముడు పోరుగా..

ఈ మధ్య పెళ్ళైన తర్వాత మూడేళ్ళుగా పంచాంగశ్రవణంలో ఒక చిత్రం గమనిస్తున్నాను. నాకు ఆదాయం 14, వ్యయం 2 అని ఉంటే మా ఆవిడ నక్షత్రంలో ఆదాయం 2, వ్యయం 14 ఇలా ఉంటూ వస్తూంది. అంటే నేను సంపాదించడం, ఆమె ఖర్చు పెట్టడం ఇలా అన్నమాట. (సాధారణంగా భార్యాభర్తలు అందరికీ ఇదే ఈక్వేషన్ వర్తిస్తుందని నాకు చూచాయగా తెలుసు). హళ్ళికి హళ్ళి, సున్నకు సున్న. ఈ సీక్వెన్సు జీవితాంతం కంటిన్యూ అవుతూంటుంది. అవడమే మేలు. అలా కాక, భార్యాభర్తలిద్దరూ ఒకే నక్షత్రంలో పుట్టినవాళ్ళై, ఆదాయవ్యయాల లెక్క ఒకటే అయితే అప్పుడు ఆ ఇంట్లో రిక్టర్ స్కేలు ఒకటి సంస్థాపించి పెట్టుకోవాలి. తప్పదు.

మొన్నామధ్య మా ఆవిడకు జ్ఞానం ఎక్కువై, మీది మూలానక్షత్రమటగా అంది అనుమానంగా చూస్తా. అవునన్నా. అదేమంత నక్షత్రం కాదటగా అంటే నేనన్నా, మీ ఇంటిదేవుడు ఆంజనేయస్వామి కూడా మూలానే తెలుసా. ఆవీడ సన్నగా ఏదో అంది. నాకు ఆమె ఏమందో వినబడలేదు. (తూచ్)

ఈ రోజు యుగాది కాబట్టి ఏదో రాయాలనే సెంటిమెంటుతో రాశా. మూలా నక్షత్రం గురించిన పచ్చి నిజాలేమైనా ఉంటే అవి ఈ టపా వ్యాఖ్యలలో అనుమతించనని సవినయంగా మనవి చేస్తున్నాను. ఆపైన మీ ఇష్టం.

అందరికీ ఖర నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు.

Friday, April 1, 2011

మేడ

మా ఇంట్లో అన్నిటికన్నా నాకు ఇష్టమైన గది - నా బెడ్రూము, డ్రాయింగు రూము..ఉహూ..ఏదీ కాదు. నాకిష్టమైన చోటు - మా ఇంటి మేడ. అదొక ప్రత్యేకప్రపంచం.

చాలాకాలం క్రితం ఎన్. ఆర్. నంది సీరియల్ ఆంధ్రభూమి వారపత్రికలో వచ్చేది. పేరేంటో మరిచాను. ఆ సీరియల్ లో ఒకమ్మాయికి కొన్ని అతీత శక్తులు ఉంటాయి. ఆమె స్నేహితురాలొకనాడు ఆమె ఇంటికొస్తుంది. ఇద్దరు కలిసి డాబా మీదికి వెళతారు. పైనుండి వీధిలో జరిగే పోట్లాటను గమనిస్తుంటారు. అప్పుడా అమ్మాయి అంటుంది - మనం పైనుండి చూస్తే క్రింద జరుగుతున్నది కనిపిస్తుంది. అలాగే అంతః చక్షువులను ధ్యానం ద్వారా సాధారణ స్థాయినుండి పైనికి తీసుకెళితే మనకు సాధారణ ప్రపంచం విషయాలు తేలిగ్గా తెలుస్తాయి అంటూంది. ఆ సీరియల్ లో ఆ అమ్మాయికి మేడనే ప్రపంచం.

అతీత శక్తులు ఏంటో కానీ, మేడ పైనుండి కనిపించే ప్రపంచం అద్భుతమైనది. అందునా సాయంకాలం పూట..

లంకంత ఇంట్లో మనుష్యుల మధ్య ఇమడలేక బయట వచ్చి కూర్చున్న ముసలమ్మ,
అమ్మ కొంగుపట్టుకుని సోన్ పాపిడి బండి వైపు లాగుతున్న పిల్లవాడు,
బడిపిల్లలను దించడానికొస్తున్న స్కూలు బస్సు,
ధీమాగా రోడ్డుపైన కదిలిపోతున్న ఆవు
రాత్రి నడుం వాల్చడానికో గూడు కోసం ఎగిరిపోతున్న కొంగ,
దూరంగా మరో డాబా పైన కేకలు పెడుతూ బంతాట ఆడుకుంటున్న పాప, అతని చిట్టి తమ్ముడూ,
ఆఫీసునుండి ఇంటికి వచ్చి తిరిగి ఏదో పనిమీద బండిమీద కిరాణాకొట్టు భారంగా వెళుతున్న నిరంతరశ్రమజీవీ,
ప్రపంచాన్నంతటినీ నిర్వికారంగా చూస్తూ అవనితల్లిని సెలవడుగుతున్న రవి...

ద్వైతం లేకపోతే అద్వైతం లేదు. ప్రపంచమూ-ప్రజలూ, బాధా-సంతోషమూ, చిర్నవ్వూ-కన్నీటిచుక్కా, మంచీ-చెడూ ఇవన్నీ లేక దైవత్వం, దేవుడూ ఉండడు. ఠాగూర్ ఒకానొక కవితలో ఒక చిన్నకథ చెబుతాడు. అర్ధరాత్రి సన్న్యసించడానికి ఉద్యుక్తుడవుతాడు. అతడికి ఎవరో తనచెవిలో "వద్ద"ని గుసగుసలాడుతారు. "ఎవరూ" అంటాడతను. నిద్రలో పాపాయి వాళ్ళమ్మను మరింత హత్తుకుంది. నన్ను వదిలి నా భృత్యుణ్ణి వెతకడానికి వెళుతున్న ఈ పిచ్చివాడెవడవని భగవంతుడు నవ్వుకుంటాడు.

Being in the world, but not of it
O yogi, get salvation at market place!

ఎక్కడో చదివిన కవిత..

ధ్యానమూ, ఏకాగ్రతా వేర్వేరంటాడు కృష్ణమూర్తి. ఏకాగ్రత అంటే - ఒక వస్తువుపైన దృష్టిని కేంద్రీకరించడం. ఆ ప్రయత్నంలో అందుకు అడ్డువచ్చే ఆలోచనలను నియంత్రించడం తప్పనిసరి. ఆ నియంత్రించేది కూడా బుద్ధే కాబట్టి ఏకాగ్రత ఓ ద్వైధీభావం. మెదడులో నిరంతరంగా జరిగే సమరం అది. ధ్యానం అంటే చుట్టూ జరుగుతున్న ప్రపంచాన్ని నిర్వికారంగా ’చూడడం’. ఈ చూడడం కాంక్షారహితమై, గతం, ఆగతం వర్తమానంలో కరిగిపోతే అదే ప్రేమ, అదే దైవం, అదే నిర్వాణమంటాడాయన.

ఈ రోజు మేడపైన - ప్రపంచాన్నీ, సూర్యుణ్ణీ, ఆ తర్వాత ఉదయించిన చంద్రుణ్ణి చూస్తూంటే ఏకాంతానికి అర్థం లీలగా స్ఫురించింది. ఏకాంతం - అంటే ఒంటరితనం కాదు. తనకు తాను తోడుండడం. అది అనుభవైకవైద్యం.