Friday, August 29, 2008

అష్ట విధ బ్లాగికలు!

మన ప్రాచీన కావ్యములలోనూ, శాస్త్రీయ నృత్య రీతుల యందునూ నాయికలను అష్ట విధములుగా విభజించిన సంగతి రసఙ్ఞులయిన బ్లాగరులకు విదితమే.

1. ప్రోషిత భర్తృక 2. స్వాధీన పతిక 3. వాసవ సజ్జిక 4. ఖండిత 5. కలహాంతరిత 6. విరహోత్కంఠిత 7. విప్ర లబ్ధ 8. అభిసారిక

ఆ విధములుగా వారిని ఎన్ననగును.

****************************

మన బ్లాగ్లోకమున మహిళా మణుల ప్రాభవము ఎన్నదగినది అనిన, అయ్యది ఏ మాత్రమూ అత్యుక్తి కానేరదు. బ్లాగ్లోకమున నాయికలను ఈ విధములుగా వర్గీకరింపవచ్చును.

1. పోషిత బ్లాగిక 2. స్వాధీన 'గడి 'క 3. మూసవ సజ్జిక 4. కామెంటిత 5. గణకాంతరిత 6. తెవికోత్కంఠిత 7.నెనరు లబ్ధ 8. అభి 'చాటి ' క

ఆయా నాయికల వివరణములు ఈ క్రిందనొసంగ బడినవి.

1. పోషిత బ్లాగిక : బ్లాగ్లోకమున కొత్తగా బ్లాగులు వ్రాయగోరు వారిని ఈ నాయిక ప్రోత్సహించును. కొత్త బ్లాగరులకు అమూల్యమయిన సలహాలనందించుట, తెలుగు (యూనీ కోడు) నందు వ్రాయుటకు వలసిన వివిధ సాంకేతిక సహాయ సౌలభ్యములను సూచించుట ఈ నాయిక సంచారీ భావములు.

2. స్వాధీన 'గడి ' క : తన ఆసక్తిని అత్యుత్తమమైన టపాలను వెలువరించుటయే కాక, పొద్దు అను జాలపత్రిక యందు వచ్చు 'గడి ' ని కూర్చుట ఈ నాయిక ప్రముఖ వ్యాసంగము. గడి ని పూరించుటయే కాక, భావ సారూప్యము కలిగిన గడి ఔత్సాహికులకు తగిన సూచనలు, సలహాలనందించుట మున్నగునవి ఈ నాయిక విజయ వంతముగా నిర్వహించును.

3. మూసవ సజ్జిక : కేవలము టపాలను వ్రాయుటయందే ఆసక్తిని నిలుపుకొనక, కాలముతో వచ్చు మార్పులకు అనుగుణముగా, బ్లాగును వివిధ రకములయిన మూస లనుపయోగించి, దృశ్య రంజితముగా ఈ నాయిక తీర్చిదిద్దును. అంతర్జాలమున, బ్లాగులకు సంబంధించి జరిగెడి , అభివృద్ధిని ఈ నాయిక అత్యంత జాగరూకత తో పరిశీలించును.

4. కామెంటిత : ఈ నాయిక టపాలు వ్రాయుటయందే మాత్రమూ ఆసక్తి కనబర్చక, తోటి బ్లాగరులు వ్రాసిన వ్రాతలను చదివి, వారి టపాలపై, కామెంటును.

5. గణకాంతరిత : తను నిర్వహించు బ్లాగుయందు, సందర్శకుల సంఖ్యని లెక్కించుటకై, గణక యంత్రములను నిక్షిప్తము గావించి, బ్లాగుకు గల ప్రాచుర్యమును తులనాత్మకముగా పరిశీలించును. బ్లాగరులు వ్రాయు వివిధ రచనా వ్యాసంగములకు వచ్చు, వ్యాఖ్యలను గణించి, బ్లాగరు యొక్క రచనా పటిమను అంచనా వేయుట ఈ నాయిక అదనపు లక్షణము.

6. తెవికోత్కంఠిత : తెలుగు వికీపీడియా అనబడు తెలుగు విఙ్ఞాన భాండాగారమునకు తన వంతు సహాయ సహకారములనందించుట ఈ నాయిక లక్షణము. తెవికీ లో తన వూరి వివరములు జోడించుట, వివిధ వ్యాసములను ఆంధ్రీకరించుట, ఇతరులు వ్రాసిన వ్యాసములను సరిదిద్దుట ఈ నాయిక సంచారీ గుణములు.

7. నెనరు లబ్ధ : బ్లాగ్లోకమున వివిధ రకములయిన నూత్న కార్యక్రములను చేబట్టి, బ్లాగరుల చేత నెనరులు గడించుట ఈ నాయిక లక్షణము.

8. అభి 'చాటి ' క : కూడలి యందు బ్లాగరులకి ఒసంగబడిన ఉపకరణము, కూడలి చాట్ ను ఉపయోగించుకుని, రక రకములయిన చర్చా కార్యక్రములకు బ్లాగరులను ఆహ్వానించుటయందు ఈ నాయిక ఆసక్తి కనబర్చును. వారాంతమున తీరిక లేకుండుట సంచారీ గుణము.

***********************

పై విభజన, మరియూ ఆయా లక్షణములు, బ్లాగ్లోకమునకు సంబంధించి, కేవలము మహిళా బ్లాగరులకే గాక, పురుష బ్లాగరులకూ వర్తింపజేయవచ్చును.

ఈ టపా వెనుక, హాస్య స్ఫోరకత మినహా, ఒకరిని అవహేళన చేయుట, నొప్పించవలెనను ప్రయత్నము ఏ మాత్రమూ లేవని బ్లాగ్లోకము గమనించ వలె యని నా ప్రార్థన.

***********************

(70 వ దశకం చివర్లో వార పత్రికలు, మాస పత్రికలను చదివే మహిళా పాఠకులపై శ్రీ రమణ ఓ పేరడీ రాసారు. ఆయన విభజనలు ఇలా ఉన్నాయి.

1. పోషిత పత్రిక 2. స్వాధీన పఠిత 3. పుస్తక సజ్జిక 4. రీడిత 5. నవలాంతరిత 6. కథనోత్కంఠిత 7. చిత్ర లబ్ధ 8. అభిమానిక

ఈ టపాకు శ్రీ రమణ గారి పేరడీ స్ఫూర్తి, ఆధారం)

*************************

Sunday, August 24, 2008

దోసె పురాణం!


పని రోజుల్లోని ఓ రోజు సాయంత్రం. మామూలుగానే రోజంతా మొద్దు యంత్రం ముందు కూర్చుని, సాయంత్రం ఇంటికి వచ్చి, కాస్త స్నానం అదీ చేసి,ఈనాడు పక్కనేస్కుని, వెధవ డబ్బా ముందు రిలాక్స్ అవుతున్నాను. టీవీ లో మామూలుగానే ఒకదాన్ని మించి ఒకటి చెత్త కార్యక్రమాలు, పనికి రాని ధారా.. వాహికలూనూ.ఇక లాభం లేదని ఆపద్ధర్మ చానెల్స్ కుప్ప (ఎన్ జీ సీ, డిస్కవరీ వగైరా) లోకి అడుగు పెట్టాను. యాత్ర మరియూ జీవితం చానెల్ తగిలింది.


సల్మాన్ రష్డీ వాళ్ళ (మాజీ?) ఆవిడ (పద్మా లక్ష్మి) దక్షిణ భారత వంటకాల గురించి, ఒక్కో ఊరు తిరుగుతూ ఏదో చెబుతోంది. యాత్ర లో భాగంగా బెంగళూరు కి వచ్చింది. ఎంటీఆరు వారి హోటల్లో దోసెల గురించి, చట్నీ నంజుకుని తింటూ మరీ చెప్పసాగింది.


ఆ తర్వాత ఈనాడు కర్ణాటక పేపర్ చూడసాగాను. అందులోనూ ఓ చోట విద్యార్థి భవన్ దోసెల గురించి రాసేరు!


నా టిఫిన్ భారతంలో ఆది టిఫిన్ ఇడ్లీ, ద్వితీయం దోసె, మూడవది పూరీ. అందులో దోసె ద్వితీయమైనా అద్వితీయమే. ఇటు నెల్లూరు పద్మావతీ విలాస్, చెన్నై శరవణా భవన్ మొదలుకుని, మన రాజధాని లో మినర్వా, కామత్,బెంగళూరు, కోయంబత్తూరు అన్నపూర్ణ విలాస్ నేతి దోసెల వరకు, ఉత్తరాన పూనా, ముంబై ల వరకూ, నా దోసెల జైత్రయాత్ర సాగింది.చివరకు బెంగళూరుకు వచ్చి ఆగింది.


బెంగళూరు ను భారత దేశ, దోసెల రాజధానిగా ప్రకటించవచ్చు. యష్వంతపూర్ గాయత్రి భవన్, మల్లేశ్వరం జనతా భవన్, జయా నగర్ గణెష్ దర్శిని, శివాజీ నగర్ శిల్పా, బసవన గుడి విద్యార్థీ భవన్, ఎంటీ ఆర్, మెజిస్టిక్ ప్రియదర్శిని ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నని ? బెంగళూరు వచ్చిన కొత్తల్లో ప్రతీ శని వారం సాయంత్రం జయా నగర్ దోసెల క్యాంపు, రాత్రి కో తెలుగు సినిమా , ఆదివారం ఉదయాన్నే విద్యార్థీ భవన్ ఠంచను గా ఉండేది. అవీ హోటెల్ దోసెలే. ఇంటి దగ్గర అమ్మ వేసే దోసెలు మాత్రం నాట్ ఆక్సెప్టబిల్! ఇప్పుడు మా ఆవిడ కూడా అప్పుడప్పుడూ దెప్పుతుంటుంది, "సొంత ఇంటి పుల్ల దోసెల కంటే పొరుగింటి మసాల దోసెలంటేనే" నాకు ప్రాణమని.


ఈ "దోసె" అనే పేరు వెనుక పాపులర్ కథ, దాదాపు అందరికీ తెలిసినదే. తమిళాళ్ళు దోసెలూ పోస్తుంటే, ఉత్తర భారతీయులెవరో, రెండు సార్లు "స్స్" అంది కాబట్టి "దోసె" అన్నారు అని.


దోసె - దో బార్ "స్స్" శబ్దం చేయునది.


తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక బహువ్రీహి సమాసం అది!


ఎందుకంటే, దోసె తమిళ్ వాళ్ళదీనడం నాకు సుతరాము నచ్చలేదు. (నాకు తమిళ దురభిమానం మెండు. సిగ్గు లేకుండా చెబుతున్నాను.) ఇది విన్నప్పుడల్లా అదో బాధ.


ఆ రోజు పద్మా లక్ష్మి (ఆవిడా అరవామెనే అనుకోండి) కూడా అదే చెప్పేసరికి కోపం వచ్చింది.


ఈ మధ్య తెనాలి రామకృష్ణ కవి మీద ఒకాయన రాసిన రీసెర్చి పుస్తకం చదువుతుంటే, అందులో ఓ పద్యం కనబడింది. ఆ పద్యం రాయలవారి అష్ట దిగ్గజాల్లో ఒకాయన అయ్యలరాజు రామభద్రుడు రాసిన "రామాభ్యుదయం" అనే కావ్యం లోనిదట.


ఇడిరమ్మౌనికుపాయనమ్ములు మనోభీష్టంబుగా బూరియల్

వడలుం జక్కెర కర్జకాయలును లడ్వాలుక్కెరల్ పూర్ణపుం

గుడుముల్ గారెలు బెల్లమండెగలు నౌగుల్ కమ్మచాపట్లు నూ

టిడులున్ దోసెలు నప్పముల్ సుకియలున్ హేరాళమై కన్పడన్.

అర్థాత్ : బూరెలు, వడలు, చక్కెర కజ్జికాయలు, లడ్డూలు, ఉక్కెరలు (చక్కెర చేర్చి పొరటిన పిండి), పూర్ణపు కుడుములు, గారెలు, గోధుమ పూరీలు, ఓఉగులు, కమ్మని చాపట్లు, నువ్వులతో చేసిన ఇడులు, దోసెలు, అప్పములు,సుకియలు ...వగైరాలు విస్తరి నిండుగా కంపించేట్లు ఆ మునికి వడ్డించారు(ట).


అంటే దోసె 15 వ శతాబ్దం కణ్టే ముందుదే అన్న మాట! కొసరుగా అదే పద్యంలో బెల్ల మండెగలు అని కూడా కవి పేర్కొన్నడు! బెల్ల మండెగలంటే పూరీలట! (ఆ పుస్తకం లోనే చెప్పారది)


తెలుగు ఉచ్చ స్థితిలో ఉన్న విజయ నగర సామ్రాజ్యం కాలంలో దోసె, తమిళ నాడు నుండీ వచ్చి స్థిరపడి ఉంటుందా? నమ్మను గాక నమ్మను. దోసె ఆంధ్ర వాళ్ళ అబ్బ సొమ్మే! నేను విన్నంతే!


నాకున్న ఇంకో ఆశ, ఇడ్లీ గురించి తెలుసుకోవాలి. అది యే మాస్టారు గారో, సంస్కృత పండితులయిన బ్లాగర్లో దాన్ని గురించి చెబితే, ఇడ్లీ తిన్నంతగా సంతోషిస్తా.

Saturday, August 23, 2008

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాభినందనలు!

అంగుళ్యా కః కవాటం ప్రహరతి?కుటిలే!మాధవః,కిం వసంతః?

నో చక్రీ!కిం కులాలః?నహి,ధరణీధరః కిం ద్విజిహ్వః ఫణీంద్రః?

నాహం ఘోరాహిమర్దీ, కిమసి ఖగపతిః?నో హరిః,కిం కపీంద్రః?

ఇత్యేవం గోపకన్యా ప్రతివచనజితః పాతు నశ్చక్రపాణిః


సత్య : "వేలితో తలుపు తట్టేది ఎవరు?"

కృష్ణ : "కొంటెపిల్లా, మాధవుణ్ణి"

సత్య : " వసంతుడా ?" (మాధవుడంటే, వసంతుడనే అర్థం కూడా ఉన్నది.)

కృష్ణ : "కాదు చక్రిని" (చక్రం ధరించే వాణ్ణి).

సత్య : "కుమ్మరివా ?"(చక్రి అంటే కుమ్మరి అనే అర్థం కూడా ఉన్నది.)

కృష్ణ : "కాదు ధరణీ ధరుణ్ణి." (భూమిని ఉద్ధరించిన విష్ణువును.)

సత్య : "రెండు నాలుకలు కల నాగరాజువా?" (ధరణీ ధరుడు ఆదిశెషుడు కూడా.)

కృష్ణ : "ఘోరమైన పాముని మర్దించిన వాణ్ణి." (ఈ పాము కాళీయుడు.)

సత్య : "గరుత్మంతుడివా?"

కృష్ణ : "కాదు.హరిని."

సత్య :"కోతివా?" (హరి అంటే కోతి అనే అర్థం కూడా ఉన్నది.)


ఇలా సత్యభామ చేత మాటలలో ఓడిఓయిన కృష్ణుడు మిమ్మల్ని రక్షించు గాక.


ఈ అందమైన శ్లోకం చందమామ (జులై 1974) అమరవాణి లో వచ్చింది. శ్రీ కృష్ణ కర్ణామృతం అనే కావ్యం లోనిది (అట). ఆ కావ్యం తాలూకు రచయిత, ఈ కావ్యం పూర్తి వివరాలు తెలియవు!

(శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా బ్లాగ్మిత్రులకు అభినందనలు)

Tuesday, August 19, 2008

బంగారు పథ(త)కం!

అది ఒకప్పటి గాంధార దేశంగా పిలవబడ్డ ప్రస్తుత ఘనీభవిస్తాన్. అక్కడ ఓ భూగృహంలో అత్యవసరంగా ఓ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఆ సమావేశానికి నాసామి బిన్ డాలిన్, పీకిస్తాన్ దేశ అధ్యక్షుడు లాపర్వా సమురాఫ్, వారితో ’భావ సారూప్యం’ గల ఇంకొంత మంది దేశాధిపతులు, ప్రపంచ శాంతిని కాంక్షించే ప్రఖ్యాత శాంతి కాముక సంస్థ ISI, ముష్కరీ తోలుబా, బుల్ బుల్ జాముద్దీన్ వంటి శాంతి కాముక (చిల్లర) సంస్థల ప్రతినిధులూ పోగయారు.ఆ సమావేశపు అజెండా, ప్రస్తుత "నీచా" దేశంలో నడుస్తున్న ప్రపంచ క్రీడల్లో ఈ శాంతి కాముక దేశాల వారికి ఒక్క పతకం కూడా దక్కకపోవడం, ప్రపంచ క్రీడలు మొదలుపెట్టినప్పటి నుండీ ఇప్పటి వరకూ, ఎన్ని పతకాలు వచ్చాయో అన్ని పతకాలు ఓ అగ్ర రాజ్యపు (అందునా ఓ టెర్రరిస్ట్ అగ్ర రాజ్యానికి చెందిన) క్రీడాకారుడు పల్ప్ కి ఒకే రోజు దక్కడం, ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవడం వంటి విషయాల గురించి చర్చించడం.సమావేశానికి అధ్యక్షుడు, నాసామి డాలిన్ లేచి నిలబడ్డాడు. ఆ నాసామి డాలిన్ చచ్చిపోయాడని ప్రపంచం అంతా అనుకుంటున్నది. అయితే ఈ సమావేశానికి వచ్చినాయన నిజంగా అతడేనా, లేదూ, వాడి డూపు గాడా అని ఎవ్వరికీ తెలియదు.సభ్యులందరూ లేచి ఆ..శాంత మూర్తికి అభివాదం చేశారు.(ఆ సభ్యుల్లో బుల్ బుల్ సంస్థకి చెందిన ఓ కుర్ర సభ్యుడికి అది మొదటి ఆన్సయిటు అవడంతో, శాంత మూర్తి కి అభివాదం చేయడం మరిచాడు.వెంటనే ఆ సభ్యుడిని లాక్కెళ్ళి శిక్షగా చేతి వేళ్ళు నరికేశారు నాసామి అనుచరులు.)నాసామి ఆరంభ ప్రసంగం చేస్తూ, ఇలా అన్నాడు."ఇవాళ ప్రపంచం అంతా మనం చేస్తున్న పవిత్ర యుద్ధపు పరిణామాలు చూస్తున్నది. గత కొన్ని సంవత్సరాలుగా మనం ఎంతో అభివృద్ధి సాధించాం. ఎన్నో రకాల బాంబులు సమకూర్చుకున్నాం.ప్రపంచపు అన్నికోణాల్లోనూ మన శాంతి దూతలు బాంబులతో తమ పవిత్ర యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాగే మనం మరిన్ని పథకాల ద్వారా మొత్తం ప్రపంచాన్నంతా మన హస్తగతం చేసుకోవాలి.ఇక పోతే, ఇవాళ మన తోటి దేశాలు "నీచా" దేశంలో ప్రపంచ క్రీడలు జరుపుకుంటూ, మన సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారు. అలాగే మనం ఇంత శాంతి కాముకులం అనే కనీస ఙ్ఞానం లేకుండా, పతకాల్లో మనకు ఏ మాత్రం కన్సెషను ఇవ్వట్లేదు. ఆఖరుకు మన పొరుగున ఉన్న జంబూ ద్వీపానికి కూడా ఓ బంగారు పతకం కట్టబెట్టేరు, అదీ మనకు బాగా పరిచయమున్న క్రీడ లో.ఈ పరిస్థితి ని ఎదుర్కోవడం పై మీ సలహాలు కావాలి. అదీ ఈ సమావేశపు ఉద్దేశ్యం" అంటూ ముగించేడు."నాసామి కీ జై, నాసామికీ జై" అంటూ జయ జయ ధ్వానాలు మిన్ను ముట్టేయ్. (ఇందాక అభివాదం చెయ్యని సభ్యునికి ఏ గతి పట్టించారో చూసారు కాబట్టి, సభ్యులందరూ పాల్గొన్నారీ సారి, భయంతో వణుకుతూ!)ఆ తర్వాత ప్రపంచ క్రీడల్లో సంస్కృతి కాపాడ్డానికి తీసుకోవాలి, కొత్త రకం పోటీలు ఏవి ప్రతిపాదించాలి (శాంతి కాముక దేశాల వాళ్ళు పతకాలు గెల్చి సావడం కోసం) వంటి వాటిపై చర్చ జరిగింది.

" క్రీడలు జరుగుతున్న కాకి గూడు స్టేడియం పై విమానం తోలి దాన్ని పేలుద్దామా?" ముష్కరీ తోలుబా సంస్థకు చెందిన కుర్ర వాడొకడు చిలిపిగా ప్రశ్నించాడు.సభ్యులందరూ మెచ్చుకోలుగా అతని వంక చూసేరు.లాపర్వా సమాధానం చెప్పేడు. " నీచా దేశం మనకు కావలసిన దేశం. వాళ్ళకు ఓ ప్రాంతాన్ని ఎలా కబళించాలి అనే దానిపైన మంచి అనుభవం ఉంది. అది మనకు ఉపయోగపడచ్చు. కాబట్టి, వాళ్ళ దేశపు కాకి గూడు స్టేడియం ను ధ్వంసం చేయడం మంచిది కాదు".తోలుబా కుర్రవాడు నిరాశగా నిట్టూర్చేడు.నీకు అంతగా పేల్చాలని ఉంటే ఈ సారి జంబూ ద్వీపం లో ఓ నగరంలో పెట్టబోయే వరుస బాంబుల ల ప్రాజెక్ట్ కు లీడర్ గా చేద్దువు గానీలే, అంటూ తోలుబా సంస్థ అధిపతి అనునయిస్తూ సర్దిచెప్పేడు. (క్రితం సారి మిసి సంస్థకి ఆ ప్రాజెక్ట్ ఇచ్చేరు. అయితే ఈ సారి మాత్రం తమే ప్రాజెక్ట్ చేసుకోవాలని వాళ్ళ ప్లాను)ఇలాంటి అర్థవంతమైన చర్చలతో ఆ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి MOM (Minutes of Meeting) తయారు చేశారు. ఆ తర్వాత action items అవీ తీర్మానించి, దీనిపై తర్వాతి రోజు ఓ లిస్టు తయారు చేసారు.ఆ రోజు రాత్రి సభ్యులకు విందు, నాసామి నడుపుతున్న ఆల్-ఖైమా సంస్థ కు చెందిన కొన్ని మర్డర్ ऽ రేప్ వీడియోల ప్రదర్శనా, లైవ్ మర్డర్ షో వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయ్.తర్వాతి రోజు జయ జయ ధ్వానాల మధ్య క్రీడలకు సంబంధించి ఈ క్రింది తీర్మానాలు సభ్యులందరితో ఆమోదించబడ్డాయ్. (ఆమోదించని సభ్యులకు ఏం జరుగుతుందో వేరే చెప్పాలా?)1. టెన్నిస్, పోల్ వాల్ట్, ఈత, పరుగు, జిమ్నాస్టిక్స్ లాంటి పందేలు జరుగుతున్నప్పుడు, పోటీదార్లు అసభ్యమైన బట్టలు వేసుకుంటున్నారు. ఇకపై అందరూ విధిగా శరీరంలో ఏ భాగమూ కనబడని నలుపు దుస్తులు ధరించాలి.2. ఈటె విసరడం, ఇనప గుండు విసరడం, షూటింగు లాంటి క్రీడలు జరిగేప్పుడు శాంటి కాముక దేశాల ఆటగాళ్ళ (మానసిక ఉద్దీపన) కోసం ఆ ఈటె/గుండు/గోలీ పడే చోట సరిగ్గా, టెర్రరిస్ట్ దేశాల ప్రజలను నిలబెట్టాలి.3. కొత్త కొత్త క్రీడలు (బాంబులు విసరడం, విమానం తో భవనాలను మోదడం వగైరా) ప్రవేశపెట్టాలి.4. కేవలం శారీరకమైన క్రీడలే కాక మానసిక వికాసానికి తోడ్పడే క్రీడలకూ (విమానాలను హైజాక్ చేయడం, ఎవరికీ తెలియని చోట బాంబులను నిక్షిపం చేయడం) సముచిత స్థానం ఇవ్వాలి.5. మొత్తం పతకాల్లో కనీసం 50 శాతం రిజర్వేషన్లు శాంతికాముక దేశాలకు ప్రకటించాలి.6. టెర్రరిస్ట్ దేశాలకు కేవలం వెండి,కాంస్య పతకాల్లో మాత్రమే స్థానం కల్పించాలి.ఈ ముషాయిరా తీర్మానాలను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించేరు. ఇకపై వీటిని అమలు జరిపాల్సిన బాధ్యత ప్రతీ పవిత్ర యుద్ధపు సైనికునిపైనా ఉన్నదని నాసామి నొక్కి వక్కాణించాడు. (దేన్ని నొక్కి అని అడగద్దు.)ఆ మరుసటి రోజు సభ్యులందరూ సెలవు తీసుకుని, గాంధార దేశం నుండీ వాళ్ళ వాళ్ళ స్థానాలకు తిరిగి వెళ్ళి పొయేరు.మరో పవిత్ర యుద్ధం మొదలయింది!

Friday, August 15, 2008

దేశభక్తి అంటే?

కాలేజీ రోజుల్లో ఆగస్టు 15 ను తల్చుకోగానే, ఓ మోస్తరుగా బాడీ లో మూవ్మెంట్స్ వచ్చేవి. అంటే, రక్తం ఉప్పొంగటం, రోమాలు నిక్క బొడుచుకోవటం, కళ్ళు అరమోడ్పులవటం, అర్జెంట్ గా పాకిస్తాన్ వాళ్ళను చంపేయాలంత ఆవేశం కలగటం వగైరా...అలానే క్రికెట్ మాచులు చూసినప్పుడూనూ (ఇప్పటికీ అనుకోండి) మన దేశమే గెలిచి తీరాలనే ఓ దురాశ కలుగుతుంది. నిజానికి అదో ఆట మాత్రమే, అన్న నిజం మనకూ తెలుసు. అయితే మనం అందులో లీనమైనప్పుడు అవన్నీ కనిపించవు.

దేశభక్తి అంటే యేమిటి? ఈ ప్రశ్న మామూలుగా అయితే ఎవరికీ రాకూడదు. అయితే, దేశభక్తి కి మనం అనుకునే దానికైనా భిన్నమైన అభిప్రాయాలు ఎక్కడైనా చదివినప్పుడు, లేదా విన్నప్పుడు ఓ సారి పునరాలోచించుకోవలసి వస్తుంది.

అలాంటి ఆలోచన నాకు జిడ్డు కృష్ణ మూర్తి, ఓషో, (కొద్దిగా రవీంద్ర నాథ్ ఠాగూర్) వీళ్ళ ప్రవచనాలు/ప్రసంగాలు చదివినప్పుడు, విన్నప్పుడు కలిగింది. జిడ్డు కృష్ణమూర్తి గారి కొన్ని ప్రముఖ వ్యాఖ్యలు

" Nationalism is a glorified form of tribalism "

" The flag, is nothing but a piece of loin cloth, which represents a symbol, which is of the mind. Does the love belongs to mind? "

సిద్ధాంతాల గురించి ఆయన చెప్పదల్చుకున్నది (నాకు అర్థమయినంత వరకూ) ఎటువంటి సిద్ధాంతం (idealism) అయినా సరే, మౌలికంగా, మానవుని, యే రకమైన సమస్యనూ దూరం చేయలేదు.

అలానే ఓషో అంటాడు, "దేశాలు, రాష్ట్రాలు వంటి విభజనలు మనుషుల్లో అసమానతలను పెంచడానికి తప్ప, మనిషి దుఃఖాన్ని నిరోధించటానికి యే మాత్రం ఉపయోగపడదు."

చంద్ర మండలం పై అమెరికా మొదటి సారి అడుగు పెట్టి, తమ దేశపు జెండాను ఎగురవేయటం మీద ఆయన విసురు, "ఆ జెండాపై రెట్ట వేయటానికి ఓ పక్షి కూడా లభ్యం కాని ప్రదేశం చంద్ర మండలం. అక్కడ జెండా ఎగురవెయ్యటం ఎంత మూర్ఖత్వం?"

దేశ భక్తి అంటే, ఇతర దేశాలను విమర్శిచటమా, లేదూ జపాన్, కొరియా లాంటి దేశాలను అనుకరించటమా (దీనికి స్పూర్తి పొందటం అని అందంగా కవర్ చేస్కోవచ్చుననుకోండి) ?

ఈ ఇద్దరి రచనలు బాగా చదివిన తర్వాత, నాకు ఎప్పుడూ ఉదయించే ప్రశ్న, అది ఎలాంటిదైనా అవనివ్వండి (దేశ భక్తి లాంటి ఉన్నతమైన సిద్ధాంతం ముదలుకుని, నాజీఇజం లాంటి చెత్త సిద్ధాంతం వరకు) సిద్ధాంతం గొప్పదా? మనిషి గొప్ప వాడా? సాటి మనిషిపై (ఆ మాటకొస్తే, సాటి జీవం పై, ఆఖరుకు చెట్లు పుట్టలపై) ఉన్న ప్రేమ (ఫీలింగ్) గొప్పదా?

మనిషి ప్రస్థానం ఎటువైపు సాగుతోంది??

Thursday, August 14, 2008

కమ్మదనం, తెలుగుదనాల బాల్యం!

"మావయ్యా, ఎత్తుకో మావయ్యా!"
"ఎందుకురా? పెద్దోడయినావు కదరా, నడవాల మరి."
"కాళ్ళు కాలుతున్నాయి మామయ్యా!"

బయట పిండారబోసినట్టు వెన్నెల. నింగిని మిడిసిపడుతున్న రాతిరి రేడు. భోజనాలకు ముందు, నన్నెత్తుకుని కాస్సేపలా తిప్పడానికి వచ్చాడు(ట) మా మామయ్య. అప్పుడు నా వయస్సు ఓ నాలుగేళ్ళు ఉంటుందేమో?

"చందమామ మనతో పాటే వస్తున్నాడు. ఎందుకు?"
"చందమామకు నువ్వంటే ఇష్టం రా అందుకు."

ఇంకా ఏ జవాబు లేని ప్రశ్నలు అడి(గుంటానో)గానో ఏమో, మా మామయ్య దుకాణం దగ్గర చాక్లెట్టు కొనడానికి ఆగాడు(ట).

"ఏం కావాలిరా?"
"నాకు చాక్లెటొద్దు.ఆ కనబడే పచ్చ రంగు ఇల్లు కావాలి."
మా మామయ్య నవ్వుకుని," పెద్దయ్యాక కొందాం లేరా" అన్నాడు(ట).
"ఇప్పుడే కావల్ల"
"****" మామయ్యకు చుక్కలు కనిపించుంటాయ్.

ఇవి మా మామయ్య ఙ్ఞాపకాలు. ఎప్పుడు మా ఇంట పండుగో, పబ్బమో జరిగి, నలుగురూ చేరిన వేళ, ఆయన మాతో తన ఙ్ఞాపకాలను పంచుకుని మురిసి పోవడం పరిపాటి. నాకు ఆ చందమామ, ఆకుపచ్చ ఇంటి సంగతి మాత్రం లీలగా ఙ్ఞాపకం.

*****************

ఆ ఆకుపచ్చ ఇంటాయన బసయ్య మా వూళ్ళో గొప్ప షాహుకారు.ఓ చిన్న హోటల్ నడుపుకుంటున్నమా నాన్నను "స్వామీ" అంటూ, ఎంతో ఆప్యాయంగా పలుకరించే వాడు. ఆయన కొడుకు కొన్నేళ్ళ క్రితం హైదరాబాదులో బిర్లా గుడి దగ్గర కనిపించేడు.చాలా సంతోషపడిపొయేడు.

******************

నాకు చిన్నప్పుడు పెరుగు, ఆవకాయ అంటే ప్రాణం. అదీ మా ఇంట్లో ఓ ప్రత్యేకమైన తట్ట (పళ్ళెం) ఉండేదిట, మధ్యలో ఓ ప్రత్యేకమైన డిజయిను తో. అందులోనే తినాలి. ఇక మా ఇంట బంధువుల పిల్లలు (మా ఇద్దరు పిన్నమ్మలు, మామయ్యల కొడుకులు, కూతుళ్ళు)వస్తే మాత్రం, పండగే (ఇప్పటికీ). చింత చివురు పప్పుతో మా అమ్మ అందరికీ ముద్దలు కలిపి పెట్టేది.

మా ఇంట్లో ఓ తెల్ల ఏనుగు చెక్కబొమ్మ ఉండేది, నాకు ఊహ తెలిసినప్పటి నుండి. ఆ బొమ్మ, మా నాన్నకు తన బాల్యంలో ఎవరో కొనిపెట్టేరుట. ఆ బొమ్మకు చక్రాలు పెట్టుకొందుకు రెండు కన్నాలు, కాళ్ల కింద. నేను 4 వ తరగతి చదువుతున్నప్పుడనుకుంటా, ఆ బొమ్మను మరింత అందంగా మార్చాలని, ఎర్ర రంగు బాల్ పాయింట్ పెన్ను నుంచీ ఇంకు వూదేసుకు తీసి ఆ ఏనుగు కళ్ళకు, నీలి రంగు (బాల్ పాయింట్ ఇంకు) దాని తోకకు పూసేను. ఆ మరకలతోటి చాలాకాలం ఉన్నదది.ఈ మధ్యనో ఇల్లు మారేటప్పుడు పోయింది.

తెలుపు రంగు మీద ఇష్టం ఇప్పటికీ అంతర్గతంగా ఉందేమో మరి, ఇడ్డెన్లన్నా,పూత రేకులన్నా, కోవా బిళ్ళలన్నా,గడ్ద పెరుగన్నా ఇప్పటికీ ప్రాణం (కక్కుర్తి, సరిగ్గా చెప్పాలంటే).

********************

బడిలో వేశారుట నన్ను, పారిపోకుండా పట్టుకోడానికి ఓ ఇద్దరు ధృఢ కాయుల సహాయంతో. అదీ సంస్కృతం బడిలో. పెద్ద గంట కొట్టాక ఇంటికి రా. ఒకటి, రెండు, ఇలా చిన్న గంటలు వినబడితే రాగాకు అని చెప్పి పంపేరు(ట). ఓ రెండు గంటల తర్వాత ఇంట్లో ప్రత్యక్షం అయిన నన్ను అడిగారుట, "ఏరా, ఇంత తొందరగా వచ్చావు?" అని. "ఆ దరిద్రుడు, ఎంతకీ పెద్దగంట కొట్టటం లేదమ్మా, ఏం చేయను?" ఇదీ సమాధానం.

********************

మాది కరువు ప్రాంతం కదా, వర్షాలు తక్కువ. నాకేమో చిన్నప్పుడు, నీళ్ళంటే తెగ ఇష్టం. ఓ సారి, సాయంత్రం, కొళాయిలో నీళ్ళు వచ్చేప్పుడు (స్కూలు వదిలే టైము), వెళ్ళి, ఆ కొళాయి కింద కూర్చున్నానుట.అలా ఓ గంట సేపు నానిన తర్వాత ఎవరో ఇంటికి వచ్చి చెప్పేరు, చేసిన ఘన కార్యం గురించి. 5 వ తరగతిలో ఇంకో ఘన కార్యం. మా వూరి కెనాల్ (తుంగ భద్ర డాము నుండీ, మా వూరికి కాలువ నీళ్ళు వస్తాయి)లో ఈత నేర్చుకుందుకు ఇంట్లో చెప్పకుండా వెళ్ళి, నేనూ, నా మిత్రుడూ, చివరకు దొరికి పోయి తన్నులు తిన్నాము.

********************

తెలుగు అంటే, నాకు చందమామ గుర్తొస్తుంది.మొదటి సారి, 1978 లో అనుకుంటా. "భల్లూక మాంత్రికుడు" అనే ఓ సీరియల్ వచ్చేది. ఓ చందమామ పుస్తకం లో సీరియల్ మధ్యలో భాగం (అర్థం కాకపోయినా) చదివి , చివర్లో "ఇంకా ఉంది" అన్నది చూసి, ఆ "ఇంకా" ఎక్కడ ఉంది అని, అందరినీ అడిగినది ఇప్పటికీ గుర్తు. కొన్నేళ్ళ తర్వాత మా ఇంట "బాల జ్యోతి", "ఆంధ్ర జ్యోతి" పత్రికలు తెప్పించేది అమ్మ. ఆంధ్ర జ్యోతి లో "మధూలిక", "చంటబ్బాయ్", "అభిలాష" సీరియల్స్ వచ్చేవి. బొమ్మలు చూడ్డం వరకే నా పని. మొట్టమొదటి సారి చదివిన సీరియల్, "రెండు రెళ్ళు ఆరు", మల్లాది సీరియల్. వారం వారం కాచుకుని చదవడం - ఓహ్!

*********************

మా సీమలో గోంగూర, తేగలు, జున్ను, కాజాలు, పూత రేకులు...ఇలా తెలుగు తనానికి ఆనవాళ్ళుగా చెప్పుకునే అనేకం చిన్నప్పుడు నేను ఎరుగను. మా ఇంట కూడా వాటికి అంత ప్రాచుర్యం లేదు. నాకు ఇష్టమైన తిండి, ’ఉగ్గాని ’. ఇది సర్కారు, తెలంగాణా వాళ్ళకు తెలియదనుకుంటాను. రాయల సీమలోనూ, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే దీని పేరు తెలుసనుకుంటా.

ఉగ్గాని అంటే, బొరుగులు (మరమరాలు) నీటిలో నానబెట్టి, తర్వాతి రోజు మసాలా,ఉల్లిపాయలతో, కలపి తిరుగుమోత బెట్టటం. దీనికి వ్యంజనం గా మిరప కాయ బజ్జీలు. దీని రుచి....ఎంత చెప్పినా తక్కువే.

*********************

6 వ తరగతిలో మా కొత్త తెలుగు టీచరు పాఠం చెబుతున్నారు. కాకతీయుల ఆస్థాన కవి విద్యానాథుడి గురించిన పాఠం అది. చెబుతూ ఆగి, మన తరగతిలోనూ విద్యానాథుడు ఒకడున్నాడని విన్నాను ఎవరతను అని అడిగేరు. (నా పేరు, విద్యానాథ రవి). నేను లేచి నిలబడ్డాను. ఓ పద్యం చెప్పమందావిడ. చెప్పేను. మెచ్చుకుంది. అప్పటి నుండీ, 10 వ తరగతి వరకూ, ఆవిడే మా టీచరు,అప్రతిహతంగా తెలుగులో నాకే మొదటి మార్కులు. 10 వ తరగతిలో 89 మార్కులు, తెలుగులో. అప్పట్లో అది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. అయితే, మా తెలుగు టీచరు మాత్రం కాస్త బాధపడ్డది. ఆ మార్కులు తక్కువని. (నా మీద అంత నమ్మకం ఆవిడకు).

ఆ తర్వాత నా పేరు నోరు తిరగని వ్యక్తులకు చిత్ర హింసలకు గురవడంతో, కుదించాల్సొచ్చింది.

*********************

ఇప్పుడు బాలజ్యొతీ లేదు,
మా అమ్మ గారు స్వర్గస్తులయేరు,
బాల్యం ముగిసింది,
మా వూరి చెరువు ఎండిపోయింది,
ఆవకాయ తో కూడిన పెరుగన్నం ఖరీదు దాదాపు 25 రుపాయలు నగరంలో,
తెలుగుదనపు ఙ్ఞాపకాలు మాత్రం మిగిలేయ్.

" कालॊह्ययं निरवधि॒ः विपुलाच पृथ्वी ! "

Tuesday, August 12, 2008

కథ పరయుంబోల్....

....అంటే "కథ చెప్పినట్లుగా" అని మళయాలంలో అర్థం. దీన్నే తెలుగులో "కథానాయకుడు", అరవంలో "కుచేలన్" గా రూపొందించారు. మొన్న వారాంతం ఈ సినిమాకు వెళ్ళడానికి ముందు నాకెక్కడో ఓ సందేహం. మళయాలంలో "కళాత్మక" సినిమాలెక్కువ. ఒక్కోసారి ఈ కళాత్మకత ముదిరి అర్థం పర్థం లేని ఆర్ట్ సినిమాలుగా రూపొందడం కూడా జరిగింది. (మమ్ముట్టి కి నేషనల్ అవార్డ్ సంపాదించి పెట్టిన ఓ సినిమా చాలా కాలం క్రితం చూసాను. అది ఆ కోవ లోదే!). "కథ పరయుంబోల్" మాతృకలో, అవార్డ్ సినిమాలకు ఆయువుపట్టు-మమ్ముట్టి హీరో.

అందుకే కొంచెం సందేహించేను, "కొండ నాలుక్కి మందేస్తే, ఉన్న నాలుక ఊడిందన్న" అన్నసామెత చెప్పినట్టుగా ఆ కళా ఖండాన్ని తెలుగులో తీసి "సామెత పరయుంబోల్" గా మారుస్తారేమో అని.అయితే అదేం జరగలేదు.

కళాత్మక చాయలున్న మంచి సినిమా ఇది.

కథ : ఓ భర్త, ఓ భార్య, పిల్లలు, భర్తారావుకో సూపర్ స్టార్ బాల్యస్నేహితుడు. ఇదీ కథ. (నిజ్జం.. కథ ఇంతే!)

కథనం : బాలకృష్ణ, శ్రీదేవిలది అన్యోన్య దాంపత్యం. (శ్రీదేవి బోనీకపూర్కి ఎప్పుడు విడాకులిచ్చింది? బాలకృష్ణకు సడన్ గా ఏమ్ పోయేకాలం వచ్చింది? లాంటి ఇంటెలిజెంట్ ప్రశ్నలు వేయకండి. అవి సినిమాలో జగపతిబాబు, మీనాలపేర్లు). బాలకృష్ణ కు భయంకరమైన సినిమా కష్టాలు. అతడో క్షురకుడు. తన షాపులో చెక్క కుర్చీ రిపేరు కు కూడా తన వద్ద డబ్బులు ఉండవు.ఇక పిల్లల ఫీజులేం కడతాడు? ఆ వూళ్ళోకి సూపర్ స్టార్ అశోక్ కుమార్ సినిమా షూటింగ్ కోసం వస్తాడు. సదరు సూపర్ స్టార్ మన బాలుకు బాల్యమిత్రుడు(ట). ఇక ఊళ్ళో వాళ్ళంతా బాలు వెంటపడతారు, తమకు సూపర్ స్టార్ తో పరిచయం కలిగించమని.బాలుకు ఇది ఇష్టం లేకపోయినా, తన సినిమా కష్టాలు గట్టెక్కాలంటే, వేరే మార్గం కనబడదు. సూపర్ స్టార్ ను కలుసుకోవాలని విఫల ప్రయత్నాలు చేస్తుంటాడు.చివరకు బాలు అశోక్ కుమార్ ను కలిశాడా? తన సినిమా కష్టాలు గట్టెక్కాయా?

ఈ సినిమాకు ఆయువుపట్టు, చివరి 20 నిముషాలు. స్నేహ బాంధవ్యాన్ని హృద్యంగా, ఉద్వేగంగా (కొండొకచో మనసులను, నిమ్మకాయ ముక్క పిండినట్టుగా) చిత్రీకరించాడు దర్శకుడు.

పాత్రలు, పాత్రధారులు : సూపర్ స్టార్ గా రజని నటన తనే ఆ పాత్ర చేయగలడు అనేటట్టుగా ఉంది. జగపతి, నటనలో ’గజ’పతి అనిపించుకున్నాడు. తనికెళ్ళ భరణి, ధర్మవరపు, సునీల్ వగైరా ఓకే.నయన తార, నయన మనోహరంగా ఉంది. మీనా అంతకన్నా బావుంది.

ఇక ఆపై చెప్పుకోదగ్గవి, ఫోటొగ్రఫీ, తోట తరణి కళా దర్శకత్వం. మాటలు ఓకే.

లోపాలు : నేటివిటీ లోపించిందీ చిత్రంలో.బార్బర్ షాపు అంటే,ఓ బంకు, అందులో సినిమా వాల్ పోస్టర్లూ, ’బెంచ్’ పైన ఉన్న వాళ్ళ కోసం సితార, జ్యోతి చిత్ర లాంటి పత్రికలూ, కబుర్లు చెబుతూ, అనాయాసంగా క్షవరం చేస్తూ,your freindly neighborhood లాంటి క్షురకుడూ...ఇవేవి లేవు. జగపతి బాబు షాపు యే మాత్రం బావోలేదు. అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గుంపు కాస్త మళయాళ వాసన కొట్టింది. కామెడీ తేలిపోయింది. ప్రభు, మమతా మోహన్ దాస్ ...వీళ్ళ పాత్రలు శుద్ధ వేష్ట్.

మొత్తానికి, పాట, ఫైటూ, పాట, ఫైటూ ఈ సీక్వెన్స్ తో వచ్చే చెత్త కంటే, ఈ చిత్రం కాస్త నయమే. ఒక్క సారి చూడవచ్చు.Friday, August 8, 2008

ఉద్యోగ భారతం - ముగింపు

(గత టపా తరువాయి)

కష్టాలకున్న ఐకమత్యం, సుఖాలకు లేదు.వస్తే, కష్టాలు అన్నీ ఒక్కసారే వచ్చి పడతాయి అని ఎక్కడో చదివాను. అది స్వయంగా నాకూ జీవితంలో అనుభవమైంది.

ఇంటి పరిస్థితుల దృష్ట్యా, అనివార్య కారణాల వలన పూనాలో సాగుతున్న ఉద్యోగం విరమించుకుని, తిరిగి రావాల్సి వచ్చింది నాకు. సరే, ఇక్కడ మా వూళ్ళోకి తిరిగి రాగానె తెలిసిన సమాచారం,మా లెగ్గు మిత్రులు నలుగుర్లో ఒకడు, అదేదో Mainframes course, 45 రోజుల్లో పూర్తి చేసి, ఓ సంస్థలో చేరి, ఓ నెల తిరక్కుండానే తన ఉక్కు పాదాన్ని అమెరికా పై మోపాడు!

నాకు అలాంటి ఆశలు లేవు, అయితే, మా వూరికి దగ్గర ఉన్నబెంగళూరు నగరంలో ఓ ఉద్యోగం చూసుకోవాలి అని.మా నాన్న ఆనందానికి పగ్గాలు లేవు.ఆయనకు బంధుప్రీతి జాస్తి. తన బంధువులు నాకు ఉద్యోగం చూసి పెడతారని వెర్రి ఆశ ఆయనకు. నాకు అస్సలు ఇష్టం లేదు ఇలాంటివి. అయితే, వేరే మార్గమే లేదు! మా వాళ్ళు కేవలం మాట్లాడ్డానికే తప్ప, సహాయం మాట వచ్చేసరికి, చేయి చూపుతారని నాకు తొందరలోనే తెలిసింది. పైగా, నేను నగర వాతావరణానికి చెందిన వాణ్ణి కాకపోవడంతో ఓ రకమైన చులకన భావం! సహాయం మాట అటుంచి, అడుగడుగునా ఆటంకాలు.

అది ఒకందుకు మంచిదే అయింది.

విధిలేని పరిస్థితుల్లో, ఓ ప్రముఖ mainframes సంస్థలో చేరేను. అక్కడ కోబాల్ నేర్పిస్తున్నారు. ఆ కోబాల్ లో ఒక్క ముక్క అర్థమయి చావలేదు నాకు! మిగిలిన జనాభా అంతా కుమ్మేస్తున్నారు. సరే, నా పాత టెక్నిక్ ప్రయోగించాను. ఓ మేధావి పాస్వర్డ్ సంగ్రహించి, అతని ప్రోజెక్ట్ ఒకటి కాపీ చేసుకున్నాను. ఆ ప్రోజెక్ట్ ను రకరకాల మార్పులు చేసి, పరిశీలించేసరికి అర్థమైంది కాస్త.

ఇంతలో, ఆ సంస్థ ఉద్యోగం గ్యారంటీ అని నమ్మజూపి, ఉద్యోగాలు లేవు అని చెప్పేసరికి, అక్కడ జనాభా తిరుగుబాటు లేవదీశారు. ఆ సంస్థ వారు, తీసుకున్న సొమ్ములో కొంత సొమ్ము తిరిగి ఇచ్చేసి, మాలో ఓ రెండు నెల్ల పాటు ట్రయినింగు కొనసాగించండి అని అని చెప్పారు. నేనూ, ఇంకో నలుగురు మాత్రం అలా కంటిన్యూ అయాము. ఆ రెండు నెల్ల తర్వాత నాకు ఓ చోట జీతం లేని పని దొరికింది.

ఆ జీతం లేని సంస్థలో పని చేస్తున్న వాళ్ళం మేము. అయితే, ఆ సంస్థ పేరు తమ రెస్యూమె లలో పెట్టుకుని, చివరకు ఆ సంస్థ పేరునే చెడగొట్టారిక్కడ.

అప్పట్లో ఈ సాఫ్ట్వేర్ సంస్థలలో, హెచ్ ఆర్ వారి ఆధిపత్యం కాస్త హెచ్చుగా ఉండేది. వాళ్ళకు టెక్నికల్ విషయాలు తెలియకపోయినా, తెలిసినట్టు ఫోజు కొట్టే వారు.

ఓ కంపనీలో, నేనూ, నా మిత్రుడు (అతను MTech) వెళ్ళాము.అక్కడ హెచ్ ఆర్ వారు నా మిత్రుని మొదట ముఖాముఖి జరిపారు. తరువాతి వంతు నాది. నేను ఆ ఇంటర్వ్యూ చాలా బాగ చేసాను. బయటకు వచ్చి ఇద్దరం సమాధానాలు సరిచూసుకున్నాము. నా మిత్రుడు సరిగ్గా చేయలేదు, నావి దాదాపు అన్నీ కరెక్ట్ అని తేలింది. అయితే, ఆ కంపనీ హెచ్ ఆర్ వారు, మొదట తనను ముఖాముఖీ జరిపారు కదా, ఆయన MTech కాబట్టి, తన సమాధానాలన్నీ కరెక్ట్ అని డిసైడు అయిపోయి, నన్ను రిజెక్ట్ చేసారు.ఈ సంగతి, అదే కంపనీలో పని చేస్తున్న వ్యక్తుల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది.అయితే, నా మిత్రుని కూడా, తర్వాతి రవుండ్ లో బయటకు పంపేశారు.

ఇలాంటి అనేక "Get back to you" ( మృదులాంత్రపు ఉద్యోగ ముఖాముఖీలో, అభ్యర్థి ఎంపిక కాకపోతే, ’ఎన్నిక కాబడలేదు’ అని చక్కగా చెప్పరు. We'll get back to you" అని చా....లా పాలిష్డ్ గా చెప్పడం ఆనవాయితీ) ల తర్వాత, ఓ రోజు.

తాతబ్బాయ్ మృదులాంత్రపు బాధితుడే. నాతో బాటు కాంప్లెక్స్ (హాస్టల్) లో ఉండేవాడు. తనూ, నేను కలిసి ఓ ముఖాముఖి కి వెళ్ళాం. అక్కడ ఓ రాత పరీక్ష. అందులో నేను తనకు సహాయం చేశాను. ముఖాముఖిలో మాత్రం తను సెలెక్ట్ అయాడు.

ఆ తరువాత రోజు, తనో ముఖాముఖికి వెళ్ళాడు. వెళ్ళి, అక్కడి విశేషాలన్నీ నాకు పూస గుచ్చినట్టు చెప్పేడు.తర్వాత ఆ ముఖాముఖి కి నేను వెళ్ళి, సెలెక్ట్ అయేను.

జీవితం గాడిలో పడింది.

ఆ గాడిలో పడ్డ జీవితం, ఓ మూడు కంపనీల మార్పు తర్వాత కూడా, ఇప్పటికీ, గానుగెద్దు జీవితం లా సాగుతూనే ఉంది!

(సమాప్తం)