Sunday, August 24, 2008

దోసె పురాణం!


పని రోజుల్లోని ఓ రోజు సాయంత్రం. మామూలుగానే రోజంతా మొద్దు యంత్రం ముందు కూర్చుని, సాయంత్రం ఇంటికి వచ్చి, కాస్త స్నానం అదీ చేసి,ఈనాడు పక్కనేస్కుని, వెధవ డబ్బా ముందు రిలాక్స్ అవుతున్నాను. టీవీ లో మామూలుగానే ఒకదాన్ని మించి ఒకటి చెత్త కార్యక్రమాలు, పనికి రాని ధారా.. వాహికలూనూ.ఇక లాభం లేదని ఆపద్ధర్మ చానెల్స్ కుప్ప (ఎన్ జీ సీ, డిస్కవరీ వగైరా) లోకి అడుగు పెట్టాను. యాత్ర మరియూ జీవితం చానెల్ తగిలింది.


సల్మాన్ రష్డీ వాళ్ళ (మాజీ?) ఆవిడ (పద్మా లక్ష్మి) దక్షిణ భారత వంటకాల గురించి, ఒక్కో ఊరు తిరుగుతూ ఏదో చెబుతోంది. యాత్ర లో భాగంగా బెంగళూరు కి వచ్చింది. ఎంటీఆరు వారి హోటల్లో దోసెల గురించి, చట్నీ నంజుకుని తింటూ మరీ చెప్పసాగింది.


ఆ తర్వాత ఈనాడు కర్ణాటక పేపర్ చూడసాగాను. అందులోనూ ఓ చోట విద్యార్థి భవన్ దోసెల గురించి రాసేరు!


నా టిఫిన్ భారతంలో ఆది టిఫిన్ ఇడ్లీ, ద్వితీయం దోసె, మూడవది పూరీ. అందులో దోసె ద్వితీయమైనా అద్వితీయమే. ఇటు నెల్లూరు పద్మావతీ విలాస్, చెన్నై శరవణా భవన్ మొదలుకుని, మన రాజధాని లో మినర్వా, కామత్,బెంగళూరు, కోయంబత్తూరు అన్నపూర్ణ విలాస్ నేతి దోసెల వరకు, ఉత్తరాన పూనా, ముంబై ల వరకూ, నా దోసెల జైత్రయాత్ర సాగింది.చివరకు బెంగళూరుకు వచ్చి ఆగింది.


బెంగళూరు ను భారత దేశ, దోసెల రాజధానిగా ప్రకటించవచ్చు. యష్వంతపూర్ గాయత్రి భవన్, మల్లేశ్వరం జనతా భవన్, జయా నగర్ గణెష్ దర్శిని, శివాజీ నగర్ శిల్పా, బసవన గుడి విద్యార్థీ భవన్, ఎంటీ ఆర్, మెజిస్టిక్ ప్రియదర్శిని ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నని ? బెంగళూరు వచ్చిన కొత్తల్లో ప్రతీ శని వారం సాయంత్రం జయా నగర్ దోసెల క్యాంపు, రాత్రి కో తెలుగు సినిమా , ఆదివారం ఉదయాన్నే విద్యార్థీ భవన్ ఠంచను గా ఉండేది. అవీ హోటెల్ దోసెలే. ఇంటి దగ్గర అమ్మ వేసే దోసెలు మాత్రం నాట్ ఆక్సెప్టబిల్! ఇప్పుడు మా ఆవిడ కూడా అప్పుడప్పుడూ దెప్పుతుంటుంది, "సొంత ఇంటి పుల్ల దోసెల కంటే పొరుగింటి మసాల దోసెలంటేనే" నాకు ప్రాణమని.


ఈ "దోసె" అనే పేరు వెనుక పాపులర్ కథ, దాదాపు అందరికీ తెలిసినదే. తమిళాళ్ళు దోసెలూ పోస్తుంటే, ఉత్తర భారతీయులెవరో, రెండు సార్లు "స్స్" అంది కాబట్టి "దోసె" అన్నారు అని.


దోసె - దో బార్ "స్స్" శబ్దం చేయునది.


తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక బహువ్రీహి సమాసం అది!


ఎందుకంటే, దోసె తమిళ్ వాళ్ళదీనడం నాకు సుతరాము నచ్చలేదు. (నాకు తమిళ దురభిమానం మెండు. సిగ్గు లేకుండా చెబుతున్నాను.) ఇది విన్నప్పుడల్లా అదో బాధ.


ఆ రోజు పద్మా లక్ష్మి (ఆవిడా అరవామెనే అనుకోండి) కూడా అదే చెప్పేసరికి కోపం వచ్చింది.


ఈ మధ్య తెనాలి రామకృష్ణ కవి మీద ఒకాయన రాసిన రీసెర్చి పుస్తకం చదువుతుంటే, అందులో ఓ పద్యం కనబడింది. ఆ పద్యం రాయలవారి అష్ట దిగ్గజాల్లో ఒకాయన అయ్యలరాజు రామభద్రుడు రాసిన "రామాభ్యుదయం" అనే కావ్యం లోనిదట.


ఇడిరమ్మౌనికుపాయనమ్ములు మనోభీష్టంబుగా బూరియల్

వడలుం జక్కెర కర్జకాయలును లడ్వాలుక్కెరల్ పూర్ణపుం

గుడుముల్ గారెలు బెల్లమండెగలు నౌగుల్ కమ్మచాపట్లు నూ

టిడులున్ దోసెలు నప్పముల్ సుకియలున్ హేరాళమై కన్పడన్.

అర్థాత్ : బూరెలు, వడలు, చక్కెర కజ్జికాయలు, లడ్డూలు, ఉక్కెరలు (చక్కెర చేర్చి పొరటిన పిండి), పూర్ణపు కుడుములు, గారెలు, గోధుమ పూరీలు, ఓఉగులు, కమ్మని చాపట్లు, నువ్వులతో చేసిన ఇడులు, దోసెలు, అప్పములు,సుకియలు ...వగైరాలు విస్తరి నిండుగా కంపించేట్లు ఆ మునికి వడ్డించారు(ట).


అంటే దోసె 15 వ శతాబ్దం కణ్టే ముందుదే అన్న మాట! కొసరుగా అదే పద్యంలో బెల్ల మండెగలు అని కూడా కవి పేర్కొన్నడు! బెల్ల మండెగలంటే పూరీలట! (ఆ పుస్తకం లోనే చెప్పారది)


తెలుగు ఉచ్చ స్థితిలో ఉన్న విజయ నగర సామ్రాజ్యం కాలంలో దోసె, తమిళ నాడు నుండీ వచ్చి స్థిరపడి ఉంటుందా? నమ్మను గాక నమ్మను. దోసె ఆంధ్ర వాళ్ళ అబ్బ సొమ్మే! నేను విన్నంతే!


నాకున్న ఇంకో ఆశ, ఇడ్లీ గురించి తెలుసుకోవాలి. అది యే మాస్టారు గారో, సంస్కృత పండితులయిన బ్లాగర్లో దాన్ని గురించి చెబితే, ఇడ్లీ తిన్నంతగా సంతోషిస్తా.

23 comments:

 1. హిహి.. మీరు విననంటే విననన్నాక "నాకెందుకో దోసె అరవ వాళ్ళ నుండే దిగుమతి అయ్యిందనిపిస్తుందండీ" అని చెప్పి మాత్రం ఏం లాభం? పద్యం మాత్రం సూపర్! అర్ధరాత్రి భలేంటి పద్యం రుచి చూపించారు.

  మీ దోశె పురాణం చదివి, ఎవరైనా మరిన్ని పద్యాలు చెప్తారేమో, వేచి చూడాల్సిందే!

  ReplyDelete
 2. మీరేమనుకున్నా దోసె మనది కాదు. ఇడ్లీ ఇండోనేషియా (ప్రాస కోసం వాడటంలేదు సుమా!) నుండి వచ్చిందని నేనంటే మీకది ఘోరమయిన విషయం కావచ్చు :-).

  ఇంకాస్త సాగదీస్తే మన మన జీవితంలో భాగమైపోయిన మిరపకాయలు (నేనసలే గుంటూరు జిల్లా వాణ్ణి!), వంకాయలు, దుంపలు, టొమాటోలు, అన్నీ దిగుమతి సరుకే. ప్చ్!

  ఆ తెనాలి రామకృష్ణునిపైన "రీసెర్చ్" పుస్తకం పక్కన పెట్టేసి మరో మంచి పుస్తకమేదన్నా పట్టుకోండి :-).

  -- శ్రీనివాస్

  ReplyDelete
 3. దోసెల్ని తెలుగులో "అట్టు" అంటారని విన్నాను. ముఖ్యంగా మినపట్టు,పెసరట్టు,గుడ్డట్టు లాంటి పదాలు కోస్తాలో విన్నతరువాత, అదే దోసెలకి సరైన తెలుగు పదం అనిపించక మానదు.

  ఈ విధంగా చూస్తే "దోసె" అన్నపదం ఖచ్చితంగా తమిళమే అయ్యుండాలి. దీని వుత్పత్యర్థం (etymology) ఏమిటో ఎవరైనా తమిళ మిత్రుడిని అడిగి తెలుసుకోవాలి.

  ReplyDelete
 4. దోసె - దో బార్ "స్స్" శబ్దం చేయునది.


  తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక బహువ్రీహి సమాసం అది!

  భలే నవ్వొచ్చింది. పొద్దున్నే శబ్దం కాన్ సెప్టు అదిరింది.

  ReplyDelete
 5. నెల్లూరు లోని (మాది నెల్లూరు లెండి) పద్మావతిలో దోశెలే కాదు పరోటాలు కూడా సూపర్. ఇక్కడ (హైదరాబాదు) మినర్వా లోని steam దోశ కూడా సూపరు. ఇక నెల్లూరు లో మాత్రమే దొరికే కారం దోశ (మిత్రులు క్షమించాలి నేనెక్కడా ఈ కారం దోశని చూడలేదు ఒక్క నెల్లూరు లో తప్ప, ఒక వేళ ఇంకెవరు తిని ఉన్నా కూడా, అది అక్కడి నుంచి దిగుమతై ఉంటుంది) తప్పని సరిగా రుచి చూడాలి, హైదరాబాదు లో బిర్యాని ఎంత ఫేమస్సో నెల్లూరు లో కారందోశ అంత ఫేమస్సు.

  ReplyDelete
 6. అరవ్వాళ్ళు దోసె, వడ రెండువేలయేళ్ళ కిందటి నుంచే తింటున్నారట. ఇడ్లీ మాత్రం మధ్యకాలంలో బయటి (దేశం) నుంచి వచ్చిందని ఎక్కడో చదివాను.

  మహేష్ గారూ,

  మీ లాజిక్ నాకు అర్థం కాలేదు. కోస్తాలో వాడేవే అచ్చ తెలుగు పదాలు అంటున్నారా? ఆ లాజిక్ ప్రకారం అట్టు తెలుగు పదమైతే దోసె తమిళ పదమని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు?

  ReplyDelete
 7. @ Sugatri

  Kosta telugu meeda bayati bashala prabhavam takkuva/assalu ledu. Telagana meeda urdu, Rayalaseema meeda Kannada/tamil, alage uttarandhra jillala meeda oriya prabhavam untundi.

  maa oollo dosa ni attu ane antaaru :)

  ReplyDelete
 8. దోశల గురించి తెలియదు కానీ, ఇడ్లీ మాత్రం మన భారతం వంట అయితే కాదుట... ఏదో వేరే దేశం నుండి ఇక్కడ అడుగుపెట్టిందనీ, అది కూడా మొదట చెన్నపట్నంలోనే అని చదివినట్లు గుర్తు!

  ReplyDelete
 9. రవి,,

  దోసె తమిళులది అంటే అంత గుర్రుగా ఉన్నప్పుడు ,హాయిగా అట్టు అనుకో. పోయేదేముంది.
  దో - హిందిలో రెండు
  సే - ఇంగ్లీషులో tell

  ఇలా అర్ధాలు వెతుక్కునే కన్నా.ఎక్కడ దోసెలు రుచిగా ఉంటాయో కనుక్కో. వెళ్ళి తిను. కాని ఇంట్లో చెప్పకు.
  చప్ప అట్లు( ఉప్పులేని దోసెలు) తప్పవు మరి..

  ReplyDelete
 10. As I already mentioned, iDli is undoubtedly an "import" and probably "originated" in Indonesia, if not precisely in that country, then somewhere in south-east Asia. Mind you, there have been extensive trade links between today's Tamilnadu and south-east Asia going back to the early centuries of common era.

  If one is interested in this subject don't miss late Dr. Achaya's works; esp. "Indian Food: A Historical Companion". If you don't know who he was, here is Dr. Subramanian's glowing tribute @

  http://www.hinduonnet.com/seta/2002/09/26/stories/2002092600010200.htm

  Regards,
  Sreenivas

  ReplyDelete
 11. @సుగాత్రి: ఇక్కడ కోస్తానా,రాయలసీమా,తెంలంగాణాలో వాడుతారా అనికాదు.వండేవిధానం వగైరావగైరాలనుచూస్తే పెసరట్టు,మినపట్టు,గుడ్డట్టు అనేవి దోసెకి byproducts లాంటివి.అందుకే దోసెకి తెలుగుపదం "అట్టు" అయివుంటుందని గెస్ కొట్టా...

  హా..ఇప్పుడే గుర్తొచ్చింది. S.V కృష్ణారెడ్డి తీసిన ‘కోదండరాముడు’(జె.డి.చక్రవర్తి,రంభ,లయ)చిత్రంలో ఒకసారి అన్నపూర్ణమ్మ (జె.డి.చక్రవర్తి అమ్మ పాత్ర) దోసెలు పోస్తుంటే, "నాకొక అట్టువెయ్యండి" అంటుంది లయ. ఈ మాటవిని అన్నపూర్ణమ్మ తెగ ముచ్చటపడి,"ఈ అరవోళ్ళ పదం దోసెలూ..దోసెలూ అని వినివినీ విసిగెత్తిపోయిందమ్మా,నువ్వు అట్టు అంటుంటే ఎంత బాగుందో" అంటుంది. వీలైతే ఆ సినిమా చూసి నిర్ణయించొచ్చు. కృష్ణారెడ్డి తెలుగుతనం మీద నాకైతే ఆమాత్రం నమ్మకముంది.

  ReplyDelete
 12. ఆవును, రోజుకొక్కసారయినా దోశ తినకపోతే నాకు నిద్రపట్టదు.మళ్లీ మీ ఈ దోశ పురాణం చదివిన తర్వాత అర్జెంట్ గా మళ్లీ దోశ తినాలనిపిస్తోంది, వస్తా మరి.

  ReplyDelete
 13. "అరవ్వాడి దోశై
  మీద తోచింది రాసెయ్"
  అన్న శ్రీశ్రీ ని ఆదర్శంగా తీసుకున్నట్లున్నారు. మీరెంత కాదనుకున్నా దోసె, ఇడ్లీలు మావే (అంటే అరవ్వాళ్ళవే). ఇడ్లీలు మాత్రం రాజేంద్ర చోళుని కాలంలో బాలి ద్వీపంనుండో, జావానుండో దిగుమతి అయిందని కొందరి వాదన (అందరూ ఒప్పుకొన్నది కాదు). అయితే ఆ పదాలకు తమిళంలో వ్యుత్పత్తి కనిపించదు.

  ReplyDelete
 14. చట్నీస్ లో "గుంటూరు ఇడ్లీ" తిన్నారా ఎవరైనా? నేతిలో ముంచి కారప్పొడి అద్ది వడ్డిస్తారు. అవి లాగించాక 'ఇడ్లీలంటే మా గుంటూరువే, సాంబారులో 'పిసికి ' ముద్దలు చేసి తినే అరవ్వాళ్ళవి కావు అని గర్విస్తూ ఉండగా శరాఘాతంలా శ్రీనివాస్ గారి వ్యాఖ్య 'అసలు ఇడ్లీ మన దేశపు వంటే కాద ' ని. దేవుడా!

  ReplyDelete
 15. ఎవరిదయితే నాకేంటి సుబ్బరంగా పెట్టండీ. అన్నీ తింటాను నేను :-)

  ReplyDelete
 16. 'ఆశ దోశ అప్పడం వడ '.... అను వెక్కిరింపు ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టెను ? :D

  ReplyDelete
 17. హ హ హ .. భలే టాపిక్కు పట్టారు.
  ఇడ్లీ దోసా నావి, పూరీ కూరా నావి,
  సాంబారు నాది, పెసరట్టు నాది
  అన్నీ కలిసిన బ్రేకు ఫాస్టు మనదే మనదే మనదే రా!
  తెలుగు జాతి మనది పాట ష్టైల్లో :)

  ReplyDelete
 18. నిజమే మా వైపు[రాజమండ్రి దగ్గర]అట్లు అనే అంటాము.
  పై కామెంట్ల లో ఎవరో అన్నారు క్రిష్ణారెడ్డి అట్టు అన్నాడని.ఆయన కూడా మావైపు వాడే అని విన్నాను.అమ్మ చిన్నప్పుడు చాలా సార్లు చెప్పేవారు తమిళ్ వాళ్ళు వీటినే దోశెలంటారని.కానీ చూస్తూవుంటే మన తెలుగువాళ్ళు చాలామందికే అట్టు అన్న పదం తెలియదని అర్ధం అవుతుంది.

  ReplyDelete
 19. @శ్రీనివాస్ గారు : గత సంవత్సరం నేనూ జావా ద్వీపం (ఇండోనేషియా) వెళ్ళాను. అక్కడ మన రామాయణం లో సుమిత్రా దేవి, సీతా దేవీ, వాళ్ళ తాలూకే అని చెప్పబడే కథలు విన్నాను. సుమిత్రో, సీతో, మన దేశం వస్తూ వస్తూ, పార్సిలు పట్టుకొచ్చిందేమో ఇడ్లీని :-). మిరప కాయలు, వంకాయలు వీటి గురించి నుడి నానుడి లో తిరుమల రాచంద్ర గారు చెప్పారు, మనవి కాదని స్పష్టంగా :-).

  @ప్రతాప్ : కారం దోసె 2 రకాలు. మొదటిది పొడి దోసె అని, తమిళ నడు లో దొరుకుతుంది. రెండోది, వెల్లుల్లి కారం పూత తో చేసింది. హైదరాబాద్, కృష్ణ నగర్ దగ్గర సాయి దర్శన్ (సాయి తో మొదలవుతుంది, దర్శనో ఇంకోటో తెలీదు.) లో దొరుకుతుంది.

  @సుగాత్రి గారు : నాకు అదే డవుట్.

  @జ్యోతి : జ్యోతకా, కాకతాళీయంగానే పచ్చి నిజం రాసారు. ఇప్పుడే, ఇంట్లో జ్యోతి (మా ఆవిడ పేరు కూడా జ్యోతే)కి తెలీకుండా దోసె లాగించి వస్తున్నా. :-)

  @మహేశ్ : అట్టు అంటే, దోసె అని అంతగా నాకు తెలీదు. 'మన ' ది సీమ కదా, ఇక్కడ ఆ పదం వాడుకలో అంతగా లేదు. కృష్ణా రెడ్డి తెలుగు దనం మీద నాకు కొంచెం (కొంచెమే లెండి) డవుట్. తన సినిమాలు/ సినిమాల్లో సన్నివేశాలు, కొన్ని మళయాళ ఆర్ట్ సినిమాల్లో చూసాను. :-). ఎవరికీ తెలీకుండా కాపీ కొట్టాడు ఆయన.

  @సుజాత : నేను మీ గుంటూర్ ఇడ్లీలు (నేయి + కారప్పొడి) ఇక్కడ బెంగళూరు లో మత్తికెరె అనే చోట తిన్నాను. భలే గుర్తు చేసారు.

  @పూర్ణిమ, @అశ్విన్, @ఫల్లింగ్ అంగెల్,@ మేధ,@కల,@చంద్ర మోహన్,@ప్రవీణ్, @సుజాత, @కొత్తపాళీ, @రాధిక : భలే ఉన్నాయండీ ముచ్చట్లు. ఉప్మా, దోసె, చాక్లెట్ అయిపొయాయి. ఇడ్లీ గురించి ఎవరన్నా బ్లాగండీ, ప్లీస్..ఇప్పుడే గుర్తొచ్చింది, ఐస్ క్రీం గురించి కూడా 15 వ శతాబ్దం లో పద్యం ఉండాలి. వెతికి చూస్తా...(పరుచూరి శ్రీనివాస్ గారు, రీసెర్చి పుస్తకం నన్ను వదట్లేదండీ, నేను దాన్ని వదిలేద్దామన్నా...:-))

  ReplyDelete
 20. ekada puttind emo gaani, konchem jaagartha ga gamanisthe; telugu, kannada & tamil dosala madhya subtle differences kanipisthayi.

  Kannada dosa is a little fluffy with Saggu Biyyam (Kannada: Sabbakki) added to it. While our side dosa (pullattu) gets its fluffuness from curd/buttermilk

  Btw, Vidyarthi Bhavan's dosa gets its taste from Desi Ghee that they use.

  If you are in blr, try walking around Sajjan Rao circle. There are some food stalls which serve variety dosas. Raagi dosa is my favorite.

  @Sujatha: While chutney's is a little hyped. Try Saravanabhavan's mini idli - with lots of ghee & sambar! yummy!!

  --Cine Valley

  ReplyDelete
 21. బెంగళూరును దోసెల రాజధానిగా ప్రకటించడంమీద నాకు తీవ్రమైన అభ్యంతరాలున్నాయి మేష్టారు, దోసె పుట్టింది ఉడిపిలో అయితే అయ్యుండొచ్చుగానీ, కన్నడంవాళ్ళకి దోసెలెయ్యడం అస్సలురాదు. మన ఆంధ్రా దోసెల రుచిముందు ఇవి బలదూర్, అఫ్కోర్స్ తమిళ దోసెలు బెస్టనుకోండి. ఏది ఏమైన మీరు బెంగళూరు దోసెలను పొగిడి నా మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు, దీనికి నిరసనగా మీరు బెంగళూరు వచ్చినప్పుడు మీఇక్కడి ఉల్లిదోసె తినిపిస్తాను.

  ReplyDelete
 22. bangalore ulli dosa ante, mana side Uthappam annamata!

  ReplyDelete
 23. మీరు చెప్పినవి ఏవీ నిజం కావు... అసలు గుర్గావ్ లో దోసె ముందు ఇవి అన్నీ దిగదుడుపే.. (ఈ మాట నిజం అనుకుంటే... నాలాగే మీరు కూడా idlebrain.com సైటు లాంటి వాడి రేటింగు చూసి "తొక్క బంగారులోకం" చూసినట్టే). నేను ఇక్కడ దోసె తిన్నతరువాత దోసె అనే పదం(వంటకం)ఉన్న విషయమే మర్చిపోయాను.

  మొత్తానికి "దోస పురాణం" బాగుంది. తిట్టుకుంటూ ఐనా సరే మా ఆఫీసు క్యాంటిను వాడి దగ్గర దోసే తినాల్సిందే.

  సీనుగాడు ఉరఫ్ శ్రీనివాస్

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.