Saturday, August 23, 2008

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాభినందనలు!

అంగుళ్యా కః కవాటం ప్రహరతి?కుటిలే!మాధవః,కిం వసంతః?

నో చక్రీ!కిం కులాలః?నహి,ధరణీధరః కిం ద్విజిహ్వః ఫణీంద్రః?

నాహం ఘోరాహిమర్దీ, కిమసి ఖగపతిః?నో హరిః,కిం కపీంద్రః?

ఇత్యేవం గోపకన్యా ప్రతివచనజితః పాతు నశ్చక్రపాణిః


సత్య : "వేలితో తలుపు తట్టేది ఎవరు?"

కృష్ణ : "కొంటెపిల్లా, మాధవుణ్ణి"

సత్య : " వసంతుడా ?" (మాధవుడంటే, వసంతుడనే అర్థం కూడా ఉన్నది.)

కృష్ణ : "కాదు చక్రిని" (చక్రం ధరించే వాణ్ణి).

సత్య : "కుమ్మరివా ?"(చక్రి అంటే కుమ్మరి అనే అర్థం కూడా ఉన్నది.)

కృష్ణ : "కాదు ధరణీ ధరుణ్ణి." (భూమిని ఉద్ధరించిన విష్ణువును.)

సత్య : "రెండు నాలుకలు కల నాగరాజువా?" (ధరణీ ధరుడు ఆదిశెషుడు కూడా.)

కృష్ణ : "ఘోరమైన పాముని మర్దించిన వాణ్ణి." (ఈ పాము కాళీయుడు.)

సత్య : "గరుత్మంతుడివా?"

కృష్ణ : "కాదు.హరిని."

సత్య :"కోతివా?" (హరి అంటే కోతి అనే అర్థం కూడా ఉన్నది.)


ఇలా సత్యభామ చేత మాటలలో ఓడిఓయిన కృష్ణుడు మిమ్మల్ని రక్షించు గాక.


ఈ అందమైన శ్లోకం చందమామ (జులై 1974) అమరవాణి లో వచ్చింది. శ్రీ కృష్ణ కర్ణామృతం అనే కావ్యం లోనిది (అట). ఆ కావ్యం తాలూకు రచయిత, ఈ కావ్యం పూర్తి వివరాలు తెలియవు!

(శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా బ్లాగ్మిత్రులకు అభినందనలు)

10 comments:

 1. :-) భలే గా ఉంది!! నాకు తెలియని బోలెడు విషయాలు మీ బ్లాగు వల్ల తెలుస్తున్నాయి. మరిన్ని పరిచయం చేయగలరని ఆశిస్తున్నాను!

  "శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాభినందనలు!" (copy, paste - can't help ;-))

  ReplyDelete
 2. రవి-గారు,

  మీకు శ్రీకృష్ణకర్ణామృతం గురించి తెలియదనడం కాస్త ఆశ్చర్యం కలిగించింది.

  మీకు చింతామణి కథ తెలుసు కదా :-)! ఆ బిల్వమంగళుడే (/లీలాశుకుడే) ఈ కర్ణామృతం రాసాడని లోకప్రతీతి. మన తెలుగువాడే, కృష్ణా తీరం వాడని ఒక వాదన. కేరళీయులు, బెంగాలీలు, ఇంకా మరి కొందరూ మా వాడే అంటారనుకోండి :-).

  ఈ సంస్కృత రచనకు తెలుగీకరణొకటుంది. వెలగపూడి వెంగనామాత్యునిది ...

  ఈ పుస్తకంలో నాకు చాలా ఆసక్తుంది. చాలా సార్లు నెట్‌లో రాయడం జరిగింది. మీ బ్లాగు చూసి గూగుల్‌లో త్వరగా వెతికితే ఈ క్రింది 3 పోస్టులు కనపడ్డాయి. ఇంకా చాలా రాసిన జ్ఞాపకం.

  http://www.bhaavana.net/telusa/jan-apr98/0290.html
  http://groups.yahoo.com/group/racchabanda/message/6142
  http://groups.yahoo.com/group/racchabanda/message/8899

  -- శ్రీనివాస్

  ReplyDelete
 3. చాలా అందమైన పద్యం! పరిచయం చేసినందుకు నెనర్లు.
  @ శ్రీనివాస్ గారు
  శ్రీకృష్ణ కర్ణామృతం గురించి నాకూ తెలియదు. మీ పుణ్యమాని తెలుసుకొన్నాను.నెనర్లు.

  ReplyDelete
 4. :-) భలే గా ఉంది!! పరచూరి గారి లింకులు చాలా బావున్నాఅయి

  ReplyDelete
 5. @పూర్ణిమ గారు : నా ప్రతీ టపాకు ప్రోత్సహిస్తున్నందుకు కృతఙ్ఞుణ్ణి.ప్రయత్నం చేస్తాను :-)..

  @శ్రీనివాస్ గారు : మీ పోస్ట్ లు బావున్నాయి. ఎప్పుడో స్కూల్లో చదివుకున్న సంస్కృతం. ఇప్పుడు బ్లాగ్లోకం కారణంగా తిరిగి ఆసక్తి పెరుగుతోంది. లీలా శుకుడి గురించి మీరు చెప్పిన తర్వాత లీల గా ఙ్ఞాపకం వచ్చింది :-). ఆ బిల్వ మంగళుడి గురించి, చిన్నప్పుడు బాలమిత్రలో "గురువాయురప్ప వైభవం" అనే సీరియల్ లో చదివిన ఙ్ఞాపకం.

  ఒక్క సందేహం. "విప్ర నారాయణుడు " ఈయనేనా?

  @చంద్ర మోహన్, @అశ్విన్ : నెనర్లు. ఆశ్విన్, కొన్నాళ్ళు మాయమైనట్టున్నారు?

  ReplyDelete
 6. బాగుంది పద్యం. కృష్ణాష్టమి సందర్భంగా మీ బ్లాగులో మంచి పరిచయం.

  ReplyDelete
 7. రవి గారు,
  > ఒక్క సందేహం. "విప్ర నారాయణుడు" ఈయనేనా?

  నాకు తెలిసి కాదు. ఏదయినా పోలికంటూ వుంటే రెండు కథల్లోను నాయకుడు "వేశ్యాలోలుడు" కావడం. విప్రనారాయణుడి కథ పూర్తిగా (తమిళ)శ్రీవైష్ణవ సాంప్రదాయం లోనుండి పుట్టినది.

  -- శ్రీనివాస్

  ReplyDelete
 8. advertising lengthy taping lebanon medi holley critically restraint gloriette trainz kentucky
  lolikneri havaqatsu

  ReplyDelete
 9. గురువాయూరప్ప కథలోని మహాత్ముడి పేరు "నారాయణ భట్టద్రి". ఈయన "నారాయణీయం" అన్న పేరుతో భాగవతం దశమస్కంధాన్ని తీసుకుని, కేవలం శ్రీ కృష్ణలీలలు వ్రాసి ఉన్నారు. శ్రీకృష్ణ కర్ణామృతానికి నారాయణీయానికీ అదీ ముఖ్యమైన పోలిక - రెండూ శ్రీకృష్ణుడి గాథలు.

  శ్రీనివాస్ గారు చెప్పినట్లు బిళ్వమంగళుడే లీలాశుకుని పేరుతో సన్యాసాశ్రమం స్వీకరించి శ్రీకృష్ణ కర్ణామృతాన్ని రచించారు. వీరు మళయాళ దేశస్థులు అని ప్రతీతి.

  విప్రనారాయణులు శ్రీరంగం వాసులు. పన్నిద్దరు ఆళ్వారుల్లో "తొండరడిప్పొడి ఆళ్వార్" (భక్తాంఘ్రి రేణు) పేరుతో మనకు పరిచయం. నాలాయిర దివ్య ప్రబంధంలో వీరివి రెండే ప్రబంధాలు - "తిరుప్పళియెళుచ్చి", "తిరుమాలై" రంగనాథుడిని తప్ప మరెవరి గురించీ (రామ, కృష్ణ అవతారాలు, వేంకటేశ్వర స్వామి, కంచి వరదరాజులు మొదలైన అర్చామూర్తుల తో సహా) పాడని పతివ్రత ఆళ్వార్ ఈయన.

  మీకు సంస్కృతాభిమానం మెండు కాబట్టి శ్రీకృష్ణ కర్ణామృతం చదివి తీరాలి. ఎంతో సొగసైన వర్ణనలున్నాయి. ఉదాహరణకి, కృష్ణుడి వేణురవానికి చేతనాలు అచేతనాలు, అచేతనాలు చేతనాలు అవుతున్నాయిట. గోపికలు స్థాణువులౌతూంటే, రాళ్ళు కరుగుతున్నాయి, మోళ్ళు చిగురిస్తున్నాయి. బృందావనంలో గోపకుల ఇళ్ళల్లో పొయ్యిలో కాలుతున్న చెక్కపేళ్ళు కూడా రెండోవైపు నుంచి చిగురులు తొడిగేస్తున్నాయిట వేణునాదంలోని అమృతత్వానికి. మరైతే, కృష్ణుడు వాయిస్తున్న మురళి సంగతి? అదికూడా ఎండిన వెదురే కదా, అదీ చివురిస్తోందా? అని ఒక ప్రశ్న. దానికి ఆయనే సమాధానం చెప్తాడు - "మురళి సంగతి వేరే. అది శ్రీకృష్ణుడి అధరస్పర్శ పొందింది... దానికి ఇంక పునర్జన్మ ఎక్కడిది?" అంటూ.

  ReplyDelete
 10. మంచి శ్లోకం గుర్తు చేశారు. దీనికి తెలుగు సేత కూడా ఏదో ఉన్నట్టు గుర్తు. (ఆలస్య స్పందనకు క్షమాపణలు.. కృష్ణుడికీ రాముడికీ అభేదం కదా:))

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.