Friday, August 15, 2008

దేశభక్తి అంటే?

కాలేజీ రోజుల్లో ఆగస్టు 15 ను తల్చుకోగానే, ఓ మోస్తరుగా బాడీ లో మూవ్మెంట్స్ వచ్చేవి. అంటే, రక్తం ఉప్పొంగటం, రోమాలు నిక్క బొడుచుకోవటం, కళ్ళు అరమోడ్పులవటం, అర్జెంట్ గా పాకిస్తాన్ వాళ్ళను చంపేయాలంత ఆవేశం కలగటం వగైరా...అలానే క్రికెట్ మాచులు చూసినప్పుడూనూ (ఇప్పటికీ అనుకోండి) మన దేశమే గెలిచి తీరాలనే ఓ దురాశ కలుగుతుంది. నిజానికి అదో ఆట మాత్రమే, అన్న నిజం మనకూ తెలుసు. అయితే మనం అందులో లీనమైనప్పుడు అవన్నీ కనిపించవు.

దేశభక్తి అంటే యేమిటి? ఈ ప్రశ్న మామూలుగా అయితే ఎవరికీ రాకూడదు. అయితే, దేశభక్తి కి మనం అనుకునే దానికైనా భిన్నమైన అభిప్రాయాలు ఎక్కడైనా చదివినప్పుడు, లేదా విన్నప్పుడు ఓ సారి పునరాలోచించుకోవలసి వస్తుంది.

అలాంటి ఆలోచన నాకు జిడ్డు కృష్ణ మూర్తి, ఓషో, (కొద్దిగా రవీంద్ర నాథ్ ఠాగూర్) వీళ్ళ ప్రవచనాలు/ప్రసంగాలు చదివినప్పుడు, విన్నప్పుడు కలిగింది. జిడ్డు కృష్ణమూర్తి గారి కొన్ని ప్రముఖ వ్యాఖ్యలు

" Nationalism is a glorified form of tribalism "

" The flag, is nothing but a piece of loin cloth, which represents a symbol, which is of the mind. Does the love belongs to mind? "

సిద్ధాంతాల గురించి ఆయన చెప్పదల్చుకున్నది (నాకు అర్థమయినంత వరకూ) ఎటువంటి సిద్ధాంతం (idealism) అయినా సరే, మౌలికంగా, మానవుని, యే రకమైన సమస్యనూ దూరం చేయలేదు.

అలానే ఓషో అంటాడు, "దేశాలు, రాష్ట్రాలు వంటి విభజనలు మనుషుల్లో అసమానతలను పెంచడానికి తప్ప, మనిషి దుఃఖాన్ని నిరోధించటానికి యే మాత్రం ఉపయోగపడదు."

చంద్ర మండలం పై అమెరికా మొదటి సారి అడుగు పెట్టి, తమ దేశపు జెండాను ఎగురవేయటం మీద ఆయన విసురు, "ఆ జెండాపై రెట్ట వేయటానికి ఓ పక్షి కూడా లభ్యం కాని ప్రదేశం చంద్ర మండలం. అక్కడ జెండా ఎగురవెయ్యటం ఎంత మూర్ఖత్వం?"

దేశ భక్తి అంటే, ఇతర దేశాలను విమర్శిచటమా, లేదూ జపాన్, కొరియా లాంటి దేశాలను అనుకరించటమా (దీనికి స్పూర్తి పొందటం అని అందంగా కవర్ చేస్కోవచ్చుననుకోండి) ?

ఈ ఇద్దరి రచనలు బాగా చదివిన తర్వాత, నాకు ఎప్పుడూ ఉదయించే ప్రశ్న, అది ఎలాంటిదైనా అవనివ్వండి (దేశ భక్తి లాంటి ఉన్నతమైన సిద్ధాంతం ముదలుకుని, నాజీఇజం లాంటి చెత్త సిద్ధాంతం వరకు) సిద్ధాంతం గొప్పదా? మనిషి గొప్ప వాడా? సాటి మనిషిపై (ఆ మాటకొస్తే, సాటి జీవం పై, ఆఖరుకు చెట్లు పుట్టలపై) ఉన్న ప్రేమ (ఫీలింగ్) గొప్పదా?

మనిషి ప్రస్థానం ఎటువైపు సాగుతోంది??

8 comments:

 1. దేశభక్తి గురించి ఇలాంటి మాటలే ఈ రోజు నేనూ విన్నాను. కొత్తపాళీగారి బ్లాగులో ఇప్పుడే ఈ మాట చెప్పి వస్తున్నాను - "ఇందాకా ఒకాయన (భారతీయుడే) అంటున్నాడు - దేశభక్తి అనే వ్యవహారం బల ప్రదర్శనకు, మనుషుల్లో వేర్పాటు వాదానికీ దారితీస్తుంది, మానవత్వమే అసలైన భక్తి అని. నిజమేనేమో అనిపించింది."

  ReplyDelete
 2. దేశభక్తి అన్నది తీవ్రవాదానికి మొదటిమెట్టు అన్నట్టుగా తయారయ్యింది మన పరిస్థితి. కొంత ద్వేషం ఉంటేగానీ ఆపాటి అభిమానాన్ని చూపించలేము మనం. తింటే సుగర్ వస్తుంది కాబట్టి అసలు తిననే వద్దు. నిజమేనంటారా! ప్రపంచంలో ఉండే ఆరువందలకోట్లమందినీ ఒకేలా మానవత్వంతో చూడచ్చు - మంచిదే కానీ - ఆ ఆరువందలకోట్లమందికీ ఎంత గౌరవం ఇచ్చామో మన తల్లికి అంతే గౌరవం ఇవ్వడం మన తల్లిని అవమానించడం కాదూ..

  ReplyDelete
 3. దేశభక్తి గురించిన మీ ప్రశ్నలు సబబుగానే ఉన్నాయి. కానీ మీరు పేర్కొన్న తత్వవేత్తల అభిప్రాయాలతో నేను అంగీకరించను. తత్వవేత్తలంటే నాకు గౌరవమే అయినా, వాళ్ళలో ప్రథాన లోపం పాక్షిక దృష్టి అని నా అభిప్రాయం. అది, ఆ తత్వవేత్తలు చెప్పిన విషయాలు సర్వత్రా వర్తిస్తాయనుకొనే వాళ్ళ లోపం కూడా అయ్యుండవచ్చు.
  మనిషి ఒక విచిత్రమైన జంతువు. ఇతర జంతువుల మాదిరీ తనకి కూడా సహజమైన స్వార్థం ఉంది. అయితే అది వ్యక్తికి పరిమితమై పోకుండా విస్తృతిని పొందింది. ఇదే కుటుంబం, సమాజం, దేశం ఇలాటివి ఏర్పడ్డానికి కారణమయ్యింది. నిజానికి ఈ గుంపులుకట్టే స్వభావం జంతువుల్లో కూడా కనిపిస్తుంది కాని అది శిఖరాగ్రానికి చేరింది మనిషిలో. మనిషి తన బాగు చూసుకుంటూనే, తన కుటుంబంలోనివాళ్ళ బాగుకోసం కష్టించగలడు. రాష్ట్రమంటే తనకున్న అభిమానం దేశమ్మీది అభిమానానికి అడ్డురాదు. దేశమ్మీది అభిమానం మానవజాతిపై అభిమానానికి అడ్డురానక్కరలేదు. మానవత్వం చాలా మహోన్నతమైనదే, కానీ మిగతావాటిలానే అదీ ఒక సిద్ధాంతం. ఆచరణలో మరింత కష్టసాధ్యం కూడాను. ప్రపంచంలోని మనుషులందరినీ ప్రేమించడం, గౌరవించడం ఒక్కసారిగా సాధ్యపడుతుందా? ముందు తనని, తన కుటుంబసభ్యులనీ, తన అనుకొనే ఇతరులనీ ప్రేమించగలిస్తే, అప్పుడు మొత్తం మానవాళి గురించి ఆలోచించవచ్చు.
  అంతేకాకుండా, మనిషిని సంఘంగా కలిపి ఉంచడానికి ఎదో ఒక శక్తి అవసరం. అలాటి శక్తులలో సంస్కృతి ఒకటి, దానిలో భాగమే దేశభక్తి. అమెరికావంటి దేశాల్లో వ్యక్తివాదం ప్రముఖంగా కనిపిస్తుందని అనుకుంటాం. కానీ వాళ్ళని కూడా వాళ్ళ జాతీయవాదమే కలిపి ఉంచుతోంది. జపాను వంటి దేశాలు అతి త్వరగా అంత ఆర్ధిక ప్రగతిని సాధించడంలో వాళ్ళకున్న సంస్కృతీతత్పరత పాత్ర తక్కువేం కాదు. కాబట్టి మనిషి పురోగమనానికి తమ దేశమ్మీదకాని, సంస్కృతి మీద కానీ నిర్హేతుకమైన ఒక అభిమానం అత్యవసరం.
  ఎప్పుడైనా స్పర్థ సరైన మార్గంలో వెళ్ళినంతవరకూ ఆరోగ్యకరమైనదే. అయితే నేను బాగుండాలంటే అవతలవాడు నాశనమవ్వాలి అనే భావన మాత్రం వినాశ హేతువవుతుంది. అది మౌలికంగా మనిషిలోని జంతు ప్రవృత్తి విజృంభించడంవల్ల జరిగేదని నేననుకుంటాను. దానికి మతమో, దేశమో, భాషో మరొకటో ఆలంబన కావచ్చు, అది కేవలం ఆలంబనే కాని మూల హేతువు కాదు.

  ReplyDelete
 4. @రానారె, @కృష్ణ మోహన్, @కామేశ్వర్రావు గారు : ఒక్కో సారి మనం కొన్ని విషయాలను ’ఫీల్ ’ అవుతాము. అలాంటి ఫీలింగ్స్ ని rationalize చేయడం కుదరదు. నా ఈ భావన అలాంటిదే. ఇందులో తప్పొప్పులు/మౌలిక నిజాలు అన్నవి కొంచెం అసంబద్దం అని నా భావన. అలాగని ప్రతీ వ్యక్తి, రాత్రికి రాత్రి బుద్ధుడు గా మారడం అన్నదీ సాధ్యం కాని పని. (ఇవి నా భావనలు కాబట్టి, పాకిస్తాన్ తో క్రికెట్ పందెం జరిగేప్పుడు, నేను "వసుధైక కుటుంబకం" అన్న భావనతో ఆ పందెం చూడాలి అంటే, నా బలహీనతలు అందుకు ఒప్పుకోవు! :-))

  కృష్ణ మోహన్ గారు స్వదేశాన్ని తల్లి తో పోల్చారు. ఇంకాస్త పెద్ద పరిధిలో, మన నేల (ధరణి), అది ఏ దేశ భూభాగానికి సంబంధించినదైనా కానివ్వండి, the earth basically అన్నది మన తల్లి. కాదంటారా?

  (నువ్వు పాకిస్తాన్ నేల ను కూడా తల్లిలా భావిస్తావా? అని నన్ను ప్రశ్నిస్తే, సమాధానం, అవును అని మనసు, కాదు బుద్ధి చెబుతాయి.)


  @కామేశ్వర్రావు గారు : చాలా చక్కగా చెప్పారు. మీ స్పందన చూసి చాలా ఆనందించాను. మౌలికంగా, తత్వవేత్త, దార్శనికుడు, వీరి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఓ బుద్ధుడు, ఓ జీసస్ వీళ్ళంతా దార్శనికులు. కారల్ మార్క్స్, నీత్సే వీళ్ళది తత్వం. మీరన్న ఆలంబన, మూల హేతువు మధ్య గీత సున్నితమైనదని అనుకుంటున్నాను. (ఆ సున్నితమైన అంశానికి మరో రూపే దర్శనం, తత్వం అని నా ఊహ)ఈ విషయాలపై వివరంగా ఓ టపా రాయాలని శ్రీకారం చుట్టి, ఆ టపా కు రావలసిన కంటెంట్ బ్రహ్మ పదార్థం లా నాకే అర్థం కాకుండా వెళుతోంది.

  ఏమైనా, మంచి చర్చ లేవనెత్తారు. నెనర్లు.

  ReplyDelete
 5. by asking those questions in your concluding paragraph, you are indeed creating a new 'siddhantham' ;)

  JK said that, those who understand his philosophy will NOT follow/accept him. On that count, you & bhairavabhatla appear to be true JK's disciples.

  --Cine Valley

  ReplyDelete
 6. సారే జహాసె అచ్చా - హిందుస్తా హమారా

  హం బుల్ బులే హై ఇస్‌కీ యే గుల్ సితా హమారా,హమారా.

  పర్ బత్ వో సబ్‌సే ఊంచా హంసాయ ఆస్‌మాకా వోసంతరీ హమారా - వో పాస్ వా హమారా,హమారా.

  గోదీమె ఖేల్ తీ హై ఇస్‌కీ హజారో నదియా గుల్షన్ హై జిన్ కీ దమ్ సే రష్‌కే జనా హమారా, హమారా.

  ఆయె అబ్ రౌద్ గంగా ఓ దిన్ హె యాద్ తుజ్ కో ఉతారా తేరె కినారే జబ్ కారవా హమారా మజ్ హబ్ నహీ సిఖాతా ఆపస్‌మే బైర్ రఖనా హింధీ హై హం(3) వతన్ హై హిందూ సితా హమారా,హమారా.

  యూనాన్ ఓ మిస్ర్ ఓ రోమా సబ్ మిత్ గయే జహా సే అబ్ తక్ మగర్ హై బాకీ నామ్ ఓ నిషాన్ హమారా

  కుచ్ బాత్ హై కె హస్తి మిఠాతీ నహీ హమారా సదియో రహా హై దుష్మన్ దౌర్ ఏ జమాన్ హమారా

  ఇక్బాల్ కో ఐ మెహ్రామ్ అప్నా నహీ జహా మే మాలూమ్ క్యా కిసీ కో దర్ద్ ఏ నిహా హమారా

  సారే జహాసె అచ్చా...

  * అర్ధం:

  Better than the entire world, is our Hindustan; we are its nightingales of mirth, and it is our garden abode

  Though in foreign lands we may reside, with our homeland our hearts abide, Regard us also to be there, where exist our hearts

  That mountain most high, neighbor to the skies; it is our sentinel; it is our protector

  In the lap of whose, play thousands of rivers; gardens they sustain; the envy-of-the-heavens of ours

  O waters of the Ganga mighty, do you recall the day when on your banks, did land the caravan of ours

  Religion does not teach us to harbour grudges between us Indians we all are; India, our motherland

  While Greece, Egypt , Rome have all been wiped out till now yet remains, this civilization of ours {it has stood the test of time}

  Something there is that keeps us,our entity from being eroded For ages has been our enemy, the way of the world

  Iqbal! Is there no soul that could understand the pain in thy heart?
  "విశాల విశ్వంలో నా భారత దేశం ఉన్నతం" అంటూ ఈపాట తెలుగులో ఆకాశవాణిలో ప్రసారమయిందట.ఎవరన్నా ఆపాట తెలుపగలరు.

  ReplyDelete
 7. గల్ఫ్ దేశాల్లో భారతీయుల అగచాట్లు,ఆస్ట్రేలియాలో భారతీయులకు అవమానం,అమెరికా గురుద్వారాలో కాల్పులు లాంటి బాధాకరమైన వార్తల నేపధ్యంలో ఒకసారి ఆలోచిద్దాం;
  “కొంతమంది ఎక్కువ జీతం వస్తుందని విదేశాలకు వెళుతున్నారు.అక్కడ నెలకు ఐదు వేల డాలర్లు సంపాదించవచ్చు.ఇండియన్ కరెన్సీ తో పోల్చుకుంటే అది ఎన్నో లక్షలౌతుంది .కానీ అక్కడ ఆ దేశానికి ఎంత ఆదాయమో ఇక్కడ ఈ దేశానికి అంత నష్టం.అక్కడ అయిదు వేల డాలర్లు సంపాదించే బదులు ఇక్కడ ఐదు నూర్లు సంపాదించినా చాలు మనకు.ఈ సత్యాన్ని గుర్తుంచుకొనలేక అనేకమంది అనేక రకములైన ఆశలు పెంచుకొని విదేశాలకు పోతున్నారు.కానీ ఎబ్రాడ్ లో ఏముంది?బ్రాడ్ నెస్ (విశాల భావం) మీలోనే ఉంది.దానిని వదిలి పెట్టి మీరు అబ్రాడ్ పోవటం చాలా పొరపాటు.మీరు విదేశాలకు పోనక్కరలేదు.ఇక్కడే ఉండి మీ తల్లి దండ్రులను సేవించండి. భారతీయ సంస్కృతిని మీ బిడ్డలకు నేర్పండి “అని సత్య సాయి చెప్పాడు.15.1.2008.(సనాతన సారధి మార్చి 2008)

  ఇప్పుడు 32 లక్షల మంది భారతీయులు అమెరికాలో ఊడిగం చేస్తున్నారు.మిగతా దేశాల్లో ఇంకెంతమంది ఉన్నారో! అవకాశం వస్తే విదేశాలకు ఉరకాలని లక్షల మంది కాచుకొని ఉన్నారు.వీళ్ళంతా మన దేశంలోనే ఉండి మన ప్రజలకే సేవ చేసే పరిస్థితి మన ప్రభుత్వం,మన పారిశ్రామిక వేత్తలూ కల్పిస్తే విదేశాల తలదన్నేలా మన దేశం అభివృద్ధి చెందదా?మన మాతృభాషలు ఇలా మరణ శయ్యమీదకు చేరుతాయా? అన్ని భాషలూ ఇంగ్లీషు దెబ్బకు చచ్చి పోతున్నాయి. భారతీయ సోదరులారా, ఎన్నో శతాబ్ధాల పాటు నిర్మించుకున్న మన సాహిత్యం ,దేశీయ జన విజ్నానం మట్టిపాలు కానీయవద్దు.మీ దేశ భక్తి ,భాషాభిమాన కబుర్లు ఆపి ఈ ఒక్క సాయి సలహా పాటించండి చాలు. పదేళ్ళలో మళ్ళీ మన భాషలు ప్రాణం పోసుకొని తిరిగి జనశక్తితో తప్పక లేస్తాయి. మన భాషలు బ్రతకాలంటే ఇలా చెయ్యక తప్పదు.
  ‘మాతృభాషను మాతృభూమినీ దేశ పౌరుల్నీ ప్రేమించటమే నిజమైన దేశభక్తి ‘ విదేశాలలో మన దేశ ఘన కీర్తులు చాటుతున్న భారతీయ వీరులారా లేవండి.పల్లవి మార్చండి.మాతృదేశమే మాకు అమర దైవతము అనండి.భారతీయత లేని బ్రతుకును ఆశించకండి.భరత గడ్డమీదకు తరలి రండి.మనదేశ ప్రజలకే సేవ చెయ్యండి.

  ReplyDelete
 8. కాస్త ఈ “అమెరికా ద్వేషాన్ని” పక్కనపెట్టి ఆలోచించండి రహంతుల్లా గారు. ముందు ఇండియాలో ఉండి అమెరికాకు ఊడిగం చేస్తున్న కోటిమందికి పైగా ఊడిగస్తులతో ‘దేశసేవ” చేయించండి. అది సరిపోకపోతే అమెరికానుండి పిలిపించవచ్చు.

  http://100telugublogs.blogspot.com

  .

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.