Saturday, April 24, 2010

పద్యాలతో నా కసరత్తు!

పొద్దు వారి ఉగాది కవిసమ్మేళనానికి రమ్మని కొత్తపాళీ గారి పిలుపు రూపంలో పొరబాటున నాకో వేగొచ్చింది. నాకు ఏదీ రాకపోయినా (అది నేను చెబుతున్నా), ప్రజలు కొన్ని ఊహల్లో జీవిస్తున్నారని నాకు అ(క)నిపిస్తూనే ఉంటుంది. సరే, భరించే వాళ్ళున్నారు కదాని కొన్ని పూరణలు ప్రయత్నించేను. దాదాపు అన్నీ తప్పులతడకలే. వాటినన్నిటినీ పుల్లెల శ్యాం గారు ఓపికగా సరిదిద్దారు. అలానే కొత్తపాళీ గారు, ఆయన , బిగుసుకు పోవద్దని కొత్త ధైర్యాన్నిచ్చారు. వీరందరి ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో నేను ప్రయత్నించిన పద్యాలు ఇక్కడ. (ఇవి పొద్దులో ప్రచురింపబడలేదు).

నపుంసకమితి ఙ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మన:
తత్తు తత్రైవ రమతే హతా: పాణినా వయం ||

ఆ పద్య తాత్పర్యం : సంస్కృతంలో ’మనస్’ శబ్దం నపుంసకలింగం. నపుంసకం కదా అని మనస్సును ప్రియురాల వద్దకు పంపితే అది అక్కడే చిక్కుకుని ఆనందిస్తోంది. పాణినీ, నీ(వ్యాకరణం)చేత హతులయ్యామే!

అనువాదం:
షండమది ఉలుకదటంచు సంతసమున
పంపితి మనమును పొలతి పంచకునది
ఇంపుగ యచటే చిక్కి రమింపు రీతి
హన్త! పాణిని నన్ను నిహతుని జేసె!

("హన్త" వెనుక చిన్న కథ. హన్త (హర్షే2నుకమ్పాయాం వాక్యారంభ విషాదయోః) అని అమరం. సంతోషానికి, దయకు, దుఃఖానికి ఈ పదప్రయోగం చేస్తారట. వాక్యారంభంలో చేయాలిట. ఈ పూరణ వేగులో చూసినప్పుడు రాఘవ గారు కాస్త నవ్వుకున్నట్టు గుర్తు)

పొద్దున లెగచిన మొదలు యెద్దుల వలె
పని సలుపుచు వేళకు ఇంత తిని యెరుగని
శుష్క నగరపు జీవులు సుంత పంచ
దారను విడనాడ సుఖము తథ్యమగును

ధీటగు హీరో ’చిరు’కున్
నోటిచ్చు బాబుకునసలు నోనో అంటూ
ధాటిగ హస్తము కేలన
ఓటది నా ఇష్టమనుచు ఓటరు పలికెన్

భాసురమౌ రుక్మిణి భా
మా, సురపతికిం, గుమరుడు మదనుండు సునా
యాసముగ యుద్ధమున బా
ణాసురుఁ గేళీ విధమున నాశము జేసెన్!

ఐసు (eyes) వైడు జేసి ఐప్యాడుఁ గొనిదెచ్చి
ముదము మీర దాని ముందు జేరి
సరస సల్లపనము నెరపంగ, హతవిధీ!
పేరు గొప్ప కాని ఊరు దిబ్బ.

వసతిగ పెళ్ళిఁ చేసుకుని వాసిగ శోభనరాత్రి వేళలో
కుసుమములెల్ల జిత్తమున కోరికలై మురిపాలు గ్రోలగా
కిసలయ సౌకుమార్యమున క్రీగనులన్ నళినాక్షి చూడగా
ముసలము బుట్టదే మదిని? పూశరుఁ బాణము వాడియే సుమీ!

విధేయుడు,
రవి.

Saturday, April 17, 2010

మా మంచి మాస్టారు

కృష్ణారావు మాస్టారికి ఆగ్రహమొచ్చినా, అనుగ్రహమొచ్చినా అలవి గాదు. ఆయన మాకు ఏడవ తరగతిలో ఇంగ్లీషు టీచరు. మాధ్వుడు, కన్నడ యాస. మాటల్లో కస్తూరి కన్నడ సౌరభాలు గుప్పుమనేవి. తెలుగు సామెతలూ అలవోకగా జాలువారేవి. ఘంటకొట్టినట్టు పాఠం చెప్పేవారు. ఒజిమాండియస్ పాఠం, I lay in sorrow, deep distressed..అని ఆయన కంఠం ఇన్నేళ్ళ తర్వాత కూడా నా గుండెల్లో మారుమ్రోగుతోంది.

మొదటి పీరియడే ఆయనది. ఠీవిగా మడతనలగని షర్టు, నేరో ప్యాంటులోకి టక్ చేసి, కళ్ళజోడు సవరించుకుంటూ ఆయన దూరంనుంచీ వస్తూంటే, తరగతి మొత్తం కిమ్మనకుండా ఎదురుచూసేది. ఏ చిన్న తప్పూ సహించేవాడు కాదాయన. వెరీ డిసిప్లిన్డ్. తెలుగులో చెప్పాలంటే, పాషాణపాకప్రభువు.

ఆరోజు - ఇంగ్లీషు నోట్సు ఎవరెవరు రాస్తున్నారో చూస్తున్నారు మాస్టారు. ఒక్కొక్కరినీ చూపించమంటున్నారు. ఎవరైనా అంతా రాసి, కాస్త మిగులబెడితే వారిని క్షమించేస్తున్నారు, మళ్ళీ రాసి తీసుకుని వచ్చి సబ్మిట్ చేయమంటున్నారు.

నా వంతు వచ్చింది. లేచి నిలబడి, "లాస్టు పాఠం మిగిలుంది సా. అదొకట్రాసేసి, రేఫు చూయిస్తా" నన్నాను. సరే అనబోతు కాసేపు పరీక్షగా నా ముఖం చూశారు. నాలో దొంగ ఆయనకు దొరికిపోయాడు. నోట్సు ఒక్కసారి తీసుకురమ్మన్నారు. తీసుకువెళ్ళాను, ఇక తప్పదన్నట్టు.

మొదటి పాఠం కొక్కిరి గీతలతో బానే ఉంది. రెండవ పాఠమూ పర్లేదు. మూడవ పాఠం సగమే ఉంది. ఆ తర్వాత మొత్తం శూన్యం. అత్త అన్నందుక్కాదు, ఆడబిడ్డ నవ్వినందుక్కోపం వచ్చిందన్నట్టు, నోట్సు రాయనందుక్కాదు, అబద్దం చెప్పినందుకాయన హర్టయ్యారు.

"తెలుగు పాఠమైతే అంత అందంగా రాస్తావోయ్? ఇంగ్లీషయితే అంత తీటా? ఒక్కసారి జవిరితే ఇంగ్లీషు మొత్తం వచ్చేస్తుంది". అన్నారు. అన్నంతపనీ చేశారు. (నా తెలుగు దస్తూరీ అప్పట్లో గుండ్రంగా బావుండేది. బోర్డు మీద తరగతి, తేదీ, పాఠం మొదలైనవి ఏవైనా రాయాలంటే నాతో వ్రాయించే వారు అందరయ్యవార్లూ). ఆయన చేతికి పని కల్పించారు. నా చెంపకు ఆయన చేయి పరమైంది. కంటికి నీరు ఆదేశంగా వచ్చింది.

అదుగో. అప్పుడు నాలో అగ్గిరాజుకుంది. తరగతిలో అందరిపైకీ ఇంగ్లీషు దస్తూరీ అందంగా ఉన్న ఒకబ్బాయితో నోట్సు అడిగేను. వాడివ్వనంటే, వాడికి జీళ్ళూ, కమ్మరకట్టలూ లంచంగా పెట్టి ఇప్పించుకున్నాను. అతడి దస్తూరీని అనుకరిస్తూ పాఠం మొదలెట్టాను. మొత్తం పది పాఠాలు పూర్తయ్యేసరికి వాడి దస్తూరీ, నా దస్తూరీ, ఒకేలా ఉంది. నా దస్తూరే ఓ పిసరు మెఱుగేమో. మూడ్రోజుల తర్వాత అయ్యవారికి నోట్సు చూపెట్టాను. ఆయన నా నోట్సు చూశారు. ఆ ఇంకో అబ్బాయి దస్తూరీ ఆయనకెఱుకే. మొత్తం చూసి సంతకం చేశారు. ఆయన పెదవి చివర ఓ చిన్న చిఱునవ్వు నేను గమనించకపోలేదు.

అక్కడితో నా పంతం ఆగలేదు. ఈ సారి మాస్టారు గొంతును, ఆయన యాసను అనుకరించడం మొదలెట్టాను. తోటి పిల్లలదగ్గర ఆయనను అనుకరిస్తూ, (గేలి చేస్తూ) కసి తీర్చుకునే వాణ్ణి. ఇది అలా పాకి, స్కూల్లో అందరికీ తెలిసిపోయింది. కృష్ణారావు మాస్టారికీ తెలిసొచ్చింది.

బడివదిలిన తర్వాత నేను ఒకచోట ట్యూషనుకు వెళ్ళేవాణ్ణి. ఆయనా మా మాస్టారే, కన్నడిగుడే. ఆయనా కృష్ణారావు మాస్టారు, మిత్రులు, బంధువులు కూడానూ. ఓ రోజు సాయంత్రం కృష్ణారావు మాస్టారు అక్కడ ట్యూషన్ లో ప్రత్యక్షమయ్యారు. ట్యూషన్ గది కాక, లోపలి గదికి నన్ను పిలిచారు. అక్కడ ఇద్దరు మాస్టార్లు, గురుపత్నులు, మరో అయ్యవారు ఉన్నారు. నన్ను కూర్చోమని, నాకు కొన్ని వేరుశనగ విత్తనాలు, ఉప్మా పెట్టారు. భయంకరమైన మొహమాటంతో రగిలిపోతున్నాను నేను. ఉన్నట్టుండి బాంబు పేల్చారు మాస్టారు.

"వీడు స్కూల్లో, నన్ను చాలా బాగా ఇమిటేట్ చేస్తాడు. ఇదో ఇప్పుడు చెయ్యరా. ఊ.." అన్నారు. నా పరిస్థితి వర్ణనాతీతం. మరికొన్ని శనగ విత్తనాలు తీసుకొచ్చి పెట్టారు గురుపత్ని.

ఇక తప్పదని, మొదలెట్టాను. మొదలెట్టాక అలా లీనమయి, ఆయన గొంతూ, హావభావాలు, ఆయన వాడే తెలుగు, కన్నడ పదాలు అన్నీ కలగలిపి చెప్పేశాను. ఓ పది నిముషాల తర్వాత ఆగింది నా ప్రవాహం. ఫెళ్ళున నవ్వు, అక్కడ మా అయ్యవార్లే కాక, వారి ఇంట్లో వాళ్ళూ, గుమ్మం పక్కన ఆసక్తిగా చూస్తున్న ఒకరిద్దరు ట్యూషన్ పిల్లవాళ్ళూ, అందరి ముఖాల్లో నవ్వు. మాస్టారు చివర్లో నాకో జామెట్రీ బాక్సనుకుంటాను, బహుమతి ఇచ్చినట్టు గుర్తు.

ఆ తర్వాత నేను మాస్టారు గారిని అనుకరించినా అందులో ఆయనను గేలి చేసే ఉద్దేశ్యం ఉండేది కాదని నాకే స్పష్టంగా తెలిసేది. ఆయన చేతిలో తన్నులు కూడా నేను తిన్నట్టు గుర్తులేదు.

**********

చాలా యేళ్ళ (20 యేళ్ళపైమాటే) తర్వాత ఓ రోజు. మా అమ్మగారి ఆబ్ధికం రోజు శ్రాద్ధకర్మలు జరుపడం కోసం, నేనూ, అన్నయ్యా మా ఊళ్ళో వ్యాసరాయరి మఠానికి వెళ్ళాము. మాతో కర్మ చేయించడానికి అయ్యవారు రాకముందే, మేము స్నానం చేసి ఎదురుచూస్తున్నాము. పురోహితులు సైకిల్లో వచ్చి, ఓ చిన్న సంచీతో దిగారు. లోతుకు పోయిన బుగ్గలూ, దళసరి కళ్ళజోడు, చిక్కి, వంగిపోయిన శరీరం. పంచెకట్టూ, పైనొక తువాలు. భుజం నుంచీ వ్రేలాడుతున్న ఉపవీతం. ఇంకెవరూ, కృష్ణారావు మాస్టారే. ఆయనా మా అన్నదమ్ములను గుర్తుపట్టారు. అప్యాయత వెనుక సంకోచం, అత్మీయత వెనుక కించిత్తడబాటూ. శ్రద్ధగా తంతు జరిపించేరు.

మాస్టారు స్కూలునుంచీ రిటయిరయ్యారు.ఇద్దరు అమ్మాయిలకు వివాహాలు చేశారు. ఆ తర్వాత జీవికకు పౌరోహిత్యం చేసేవారనుకుంటాను.

**********

మాస్టారి జవురు ఈ రోజు పొద్దునే చేమకూరి వెంకటకవి, "విజయవిలాసం" చదువుతుంటే గుర్తొచ్చింది. ఆ వెంటనే ఆయన జ్ఞాపకాలూ పరుగులెత్తాయి. జవరడమంటే, ఈడ్చి, చెంపకు ఒక్కటిచ్చుకోవడం. అమ్మణ్ణి పెదవి అందం, చివురుటాకును ఈడ్చితంతోందట.

నువ్వుఁ బువ్వు నవ్వు జవ్వని నాసిక
చివురు సవురు జవురు నువిద మోవి
మబ్బు నుబ్బు గెబ్బు బిబ్బోకవతి వేణి
మెఱపు నొఱపు బఱపుఁ దెఱవ మేను.