Thursday, May 27, 2010

ఒక పద్యము, కొన్ని పైత్యాలూ

మొదట వేటూరికి నివాళి.

’ఆరేసుకోబోయి పారేసుకున్నాను
యని చిలిపి తలపుల నల రేపు!
’తాంబూలమరుణమందారమనెడుతేనె
లొలికెడి మాటల కలిత బాపు!
’అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి
పదమల్లు కైతల పయిడి కాపు!
’గాలినై పోతాను గగనాని కి’దెయని
మలయానిలమయి మయిని మరపు!

పాటలకు పెనిమిటి తేటతేనెకు పాటి
మధురభావపు పదబంధములకు
వేరెవరట సాటి? వేటూరి సుందర
రామ మూర్తి - సుమ మరంద పేటి.

ఇక పైత్యాలు.

రంజుగ సాగెడి ప్రాజెక్ట్.
స్ట్రింజెన్టు క్లయింటు గాడు చెప్పెనిలా! ’వెం
టం జేయి డెలివరి.’ అకట!
కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్

మొన్నను విన్మొబయిలనిరి
నిన్నను కొత్తగ దిగినది నేర్వుడిదె లిమో!
మిన్నగ ఆండ్రాయిడట
ఎన్నగ నేడొచ్చె. రేపు ఇంకే దొచ్చో?

మోడగు మా టీమునకు
మాడరనుగ బ్యూటిజేరె. పండగ ఇకపై
మా డామేజరుకు సి! పూ
బోడికి బోడికిని పొత్తు పొసగెన్వసుధన్

త్రోవలెరుంగకం జవిరి తూరిచి గూర్చిన క్లైంటు స్పెక్సులుం
జేవలుఁ జచ్చిపోయిన డిజేనును అండగ జేసుకొన్న నా
జావలు గారుకోడుయది సాఫ్ట్ వెరు నెల్లెడలందు బొక్కలున్.
బావుర నేడ్చె కష్టమరు ఫైనలు వర్షను జూచి బాధతో!

సృజనతొ వర్కు సేయుడి అసాధ్యము సాధ్యము జేయగానిలన్
అజులయి మీరు నూతన సహాయ మెథడ్సులజైలు లాదిగా
ప్రజలకు తృప్తి గూర్చగ నపారముగన్ యని జేత్రు బోధనల్.
వజనము లేని మాటలివి.వంచన జేయుచునెన్నడున్మహా
భజనలు సేయు వారలకె పై పదవుల్.ఇది నిక్కమెల్లెడల్.

స్పర్ధకు వోయి స్వస్థితిని సైతము జూడకసైనుమెంటునున్
మూర్ధమునందు యెత్తికొనె మూర్ఖశిఖామణి బాసురుండటన్
వర్ధిల జేతుమంచు నట వచ్చిరి యిద్దరు టెక్నికల్ ఫెలోస్.
అర్ధనిశీధమందు అలయంధుడు గాంచెను సూర్యచంద్రులన్

నాతుల గుంపు జేరెనట దారిన, వీధి కొళాయి చెంతకున్
చేతులఁ దిప్పుచున్నొకరు, జిహ్వల వాటము జూపి కొందరున్,
చేతుల బిందెలం గొనుచు చేటగు మాటల పోరు హెచ్చగన్
బూతుకు బూతు బూతునకు బూతుకు బూతుకు బూతు బూతుకున్

తాష్ట్రులు వచ్చిచేరిరిట నాటికి చేటుగ ఉగ్రవాదులై
రాష్ట్రము దోచుచుం జనుల రక్తము పీల్పగ మావొయిష్టులై
త్వష్ట్రము జూపి యా దుడుకు దైత్యుల పాలిటి కాలరూపుడై
రాష్ట్రమునేలగా నొక విరాధుడు రావలె రక్తపాయియై

(గత కొన్ని రోజులుగా ఆరోగ్యం కూసింత చెడగొట్టుకుని, పొద్దుపోక వెలగబెట్టిన పైత్యాలు. వూకదంపుడు గారి ఓ పాతటపా నుంచి కొన్ని సమస్యలు , మరో అవధానం పుస్తకంలో ఇంకొన్ని సమస్యలు ఏరాను. తప్పులుంటే కొంచెం పెద్దమనసు చేసుకుని సూచించి క్షమించండి ప్లీజ్!)

Monday, May 24, 2010

మిరపకాయ పేరడీ

ఎద్దాని సంబంధ మెలమి గల్గిన మాత్ర
కూరలెల్లను మంచి గుణము గనునో
కొత్తిమీరను నూరుకొని తిన్న నెయ్యది
కంచెడన్నము తినగలుగ జేయు
ఎద్దాని శిశుజాల మెఱుగక చేబట్టి
కనులు నల్పిగ మంట గలుగ జేయు
ఎద్ది తా క్రమముగ నెదిగి పంపిన మీద
జోటి కెమ్మోవితో సాటి యగునో

నూరి దేనిని పుల్లనై మీరు మెంతి
పెరుగులో గూర్ప స్వర్గము నెరుగజేయు
నరులకెల్లను నా పచ్చి మిరపకాయ
మహితభక్తిని నేను నమస్కరింతు!

తిరుపతి వేంకటకవులు పచ్చిమిరపపై చెప్పిన పద్యమట ఇది. ఈ పద్యం చదవగానే మరో భారతపద్యం స్ఫురించింది. ఇక్కడ వ్యాఖ్యానం చదివి, ఇక్కడ ఆ పద్యం విని రండి. ఈ పద్యం ఆ పద్యానికి పేరడీయా అన్న అనుమానమొచ్చింది. ఓ సారి పాడి చూసుకున్నాను. ఎత్తుగీతి కొంచెం అలానే ఉంది, అయితే తేటగీతి మాత్రం కుదరలేదు.

పై పద్యం నా గొంతులో.

Get this widget | Track details | eSnips Social DNA(గత పది రోజులుగా నా ఆరోగ్యం బావోలేదు. అందుకనే గొంతు సరిగ్గాలేదు. దయచేసి భరించగలరు.)

తీరం లేని సముద్రప్రయాణం


గు - అనే అక్షరం అంధకారాన్ని,
రు - తన్నిరోధకత్వాన్ని వెరసి గురు అన్న శబ్దం అంధకార నిరోధకత్వాన్ని సూచిస్తుందట. భారతదేశ చారిత్రక యవనిక పైన అనేక మంది గురువులు మనకు కనిపిస్తారు. వీరు మానవాళికి వారి ప్రబోధాల ద్వారా, జ్ఞానం పంచటం ద్వారా దిశానిర్దేశం, మార్గనిర్దేశకత్వం చేశారు.

నూటికో కోటికో గురువులు కాని గురువులు పుడుతుంటారు. వీరు గురువులని ఒప్పుకోరు.

నువ్వో చీకటిగదిలో కూర్చున్నావు. గది తలుపు ఫలానా దిశలో ఉందని ఒకరు నీకు చెబుతారు. అంతే. ఆతడి పని ముగిసింది. ఇకపై కూర్చున్నచోటునుండీ లేవవలసినది నీవు. నడవవలసినది నీవు. నడవటంలో ఒడిదుడుకులను అనుభవించేది నీవు. ద్వారాన్ని చేరేది, బయటకు అడుగుపెట్టేది అన్నీ నీవే. ఇదెలా అంటే - ఊరిబయట కూడలి వద్ద ఒకడు "సానెన్" ఊరికి దారెటు అనడిగాడు. ఇంకొకడు, "ఇదిగో ఇలా" అని చెప్పాడు. ఆ మాత్రం దానికి, మొదటివ్యక్తి, "ఆహా, నువ్వు నా గురువువి. నీకిదే పూలమాల" అంటూ అనడం హాస్యాస్పదం. గురువు అన్న పదానికి సంప్రదాయ నిర్వచనం చెప్పుకోవడం చిన్నపిల్లల వ్యవహారం.

అంటూ తేల్చేస్తారు.

ఒకానొక జెన్ సూత్రం ప్రకారం గురువంటే, "హృదయానికి దర్పణం". రకమైన గురువు దిశానిర్దేశాలవీ చేయడు. నిన్ను నీకు ఉన్నదున్నట్లుగా పరిచయం చేస్తాడు. జిడ్డు కృష్ణమూర్తి కూడా కోవకు చెందిన గురువు కాని గురువు. జిడ్డు కృష్ణమూర్తి పుస్తకం చదవడమంటే, మనలను మనం చదవటం. లేదా, మన హృదయాన్ని అద్దంలో చూసుకోవడం. అంతే.

అయితే అది అత్యంత ప్రమాదకరం. నిజమైన గురువు కొత్తగా ఏదీ నేర్పడు. పైగా నేర్చుకున్న విషయాన్ని ప్రశ్నిస్తాడు. (Unlearning) జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలను ఆస్తికుడు చదివితే నాస్తికత్వం, నాస్తికుడు చదివితే హేతువాదం, హేతువాది చదివితే, హేతువాదానికి మెట్టుపైనున్న సుప్రాలాజిక్, సంప్రదాయవాది చదివితే ఆధునికత, ఆధునికుడు చదివితే ఆధునికత లోని లోటుపాట్లూ..ఇలా వేటికవి భిన్నధృవాలుగా కనిపిస్తాయి. ద్వైధీభావాలు చదివే వారివే తప్ప కృష్ణమూర్తివి కాదు. కృష్ణమూర్తి వాదీ కాడు. విభజనకూ అందడు.

ధ్యానం అంటే - ఒకానొక ఏకాంతప్రదేశంలో అన్ని మానసిక వ్యాపారాలను బహిష్కరించి, ఏకాగ్రంగా ఒక విషయంపై దృష్టినిలుపటం కాదు. మనిషి మెదడులో నిరంతరాయంగా జరుగుతున్న ఆలోచనావ్యాపారాలను, నిరుద్దేశ్యపూర్వకంగా, (passive observation) ఎఱుకతో గమనించటం మాత్రమే అని కృష్ణమూర్తి చెబుతారు. ధ్యానం ఎప్పుడైనా, ఎక్కడైనా, చివరికి రోడ్డు మీదైనా జరుగవచ్చు. ప్రపంచంలో ప్రతివ్యక్తి, ఇతరుల సహాయం లేకుండా, తనకు తానుగా మాత్రమే నేర్వదగిన, నేర్చుకోవలసిన ఏకైక విద్య ధ్యానం మాత్రమేనని అంటారు కృష్ణాజీ.

కృష్ణమూర్తి పుస్తకాలను అత్యంత ఆసక్తితో కొన్నిసార్లు చదువుతున్నప్పుడు ధ్యానం అనుభవానికి రావడం నాకు స్వయంగా తటస్థించింది. అదొక సౌందర్య స్థితి. నీనుంచీ నీవు దూరంగా జరిగి, నిన్ను నువ్వే గమనించడం. ఇటువంటి ధ్యానపూర్వక అనుభవాలు మనందరికీ కలుగుతుంటాయి. భగవంతుని ధ్యానించేప్పుడు, ఏకాంతంలో ప్రభాత కుసుమాన్ని చూసినప్పుడో, అనిర్వచనీయమైన సూర్యాస్తమయాన్ని గమనించినప్పుడో, క్షణం కోల్పోయి, మారుగా చెప్పలేని సౌందర్యానుభూతిని సొంతం చేసుకుంటాం మనం.

సత్యం అన్నది రకమైన పదజాలానికి లొంగనిది. దానిభాష మౌనం. దాని అస్తిత్వం శూన్యం. నిర్వాణం పొందిన వ్యక్తి మానసిక వ్యాపారెలెలా ఉంటాయి? వ్యక్తి చూడగలిగే సత్యం ఏమిటి? విషయాలను జ్ఞానీ ఇదివరకు చెప్పలేదు. ఒకవేళ చెప్పినా అది సాధారణ ప్రజలస్థాయికి అందనిది. అలాంటి ప్రయత్నం కృష్ణమూర్తి చేశారు. (ఎంతో సంకోచంతోనే). Krishnamurti's Notebook అన్న పుస్తకం అద్భుతం. అయితే ఇది "చదివే" పుస్తకం కాదు. అలా చదివితే బోరుకొట్టటం సహజం. ఇదొక ధ్యానం. పుస్తకం చదవటం ద్వారా ఎవరైనా ఏదైనా ఆశించే ప్రయత్నం చేస్తే, వారు పుస్తకాన్ని చదవకపోవటమే మంచిది.

పుస్తకం అలా ఉంచితే, సాధారణంగా, జీవితంలో ఎదురయ్యే సంఘటనలూ, కృష్ణమూర్తి ఎందరినో కలుసుకుని జరిపిన చర్చలు, ధనం, సౌందర్యం, జీవితం, పిల్లలు, సంసారం, మతం, ఇలా అనేక విషయాలపై వ్రాసిన పుస్తకాలు "Commentaries on Living". పేరిట మూడుభాగాలుగా వచ్చాయి. అనిర్వచనీయమైన సౌందర్యం తొణికిసలాడుతుంది రచనల్లో.

కృష్ణమూర్తి పుస్తకాలు చదవటమంటే, తీరంలేని సముద్రంలో ప్రయాణానికి ఒడిగట్టటమే. ఇందులో ప్రయాణం మాత్రమే ఉంటుంది. గమ్యం ఉండదు. ప్రయాణంలో జరిగే రసస్వాదన గమ్యాన్ని మరిపింపజేస్తుంది. ఇది నిజం.

వైశాఖమాసంలో ఎందరో కళాకారులు, మహా తాత్వికులు జన్మించారు.

కృష్ణమూర్తి తాత్వికుడు.
కృష్ణమూర్తి కళాకారుడు.
కృష్ణమూర్తి కళాకారుడైన తాత్వికుడు. ఊహూ...

కృష్ణమూర్తి ఎవరూ కాదు. కృష్ణమూర్తి కృష్ణమూర్తే.

(మే పదవతేదీ కృష్ణమూర్తి జయంతి. ఈ వ్యాసం వ్రాయటం ఇన్ని రోజులకు కుదిరింది.)