Thursday, July 16, 2009

జలోపాఖ్యానం

"మీ ఆంధ్ర మీల్స్ తెగ స్పైసీనోయ్. అయినా సరే చాలా అద్భుతంగా ఉంది" అన్నాడా బాబు మోషాయ్ కన్నీళ్ళతో. అతనివి దుఃఖాశ్రువులు కావు. ఆనంద భాష్పాలూ కావు. మజ్జిగ మిరపకాయ ముక్క కాస్త కొరికి, ఆ ఘాటు నషాలాకెక్కడంతో, కంట్లో, ముక్కులో నీళ్ళు కారాయ్ తనకు. నాగార్జున హోటల్లో మధ్యాహ్నం లంచడానికి వెళ్ళేం మేము. బాబు మోషాయ్, బీహారీ, కన్నడ కస్తూరి, ఇలా మినీ ఇండియా లాగ ఉందక్కడ.

"సార్, సాయంత్రమయే సరికి కడుపు మంట స్టార్ట్ అవుతుంది చూడండి. దీనికి అలవాటు పడితే ఎప్పుడో ఒకప్పుడు అల్సర్ రావడం ఖాయం" వంతపాడాడు కన్నడ కస్తూరి.

నేనన్నాను. "అవును, ఈ అన్నం ఇక్కడ తిని అరిగించుకోవటం కాస్త కష్టమే" అని.

"అంటే?" క్వశ్చన్ మార్క్ ఫేసు పెట్టాడు కాట్రవెల్లి కండో (మలయాళీ).

"ఏముందీ, ఇదే భోజనం ఆంధ్రాలో అంతమంది తింటున్నారు, అక్కడ అల్సరూ, హలసూరు ఏదీ లేదు. మా వూళ్ళో ఇంతకంటే స్పైసీగా భోంచేస్తాం. మాకు కడుపులో ఏ మంటా కలగదు" చెప్పాను.

"ఎందుకంటావ్?" బీహారీ డవుటేడు.

"మా వూరి నీళ్ళు అలాంటివి." చెప్పేను నేను. నా మాటకు బాబూ మోషాయ్ ఏకీభవించలేదు. నీళ్ళు ఎక్కడికెళినా ఒకేలా ఉంటాయ్. అసలు నీళ్ళకు టేస్టేంటి? వితండవాదం సాగించేడు. బాబూ మోషాయ్ నా బాసురుడు కావడంతో నేను మాట్లాడలేదు.

అవును. మా వూళ్ళో నీళ్ళకు ఆ గుణముంది అని నా నమ్మకం. కాలేజీ రోజుల్లో దాదాపు ప్రతిరోజు సాయంత్రం నారాయణ బొరుగులో, ఉగ్గాని, మిరపకాయ బజ్జీలో, కట్లెట్ పానీపూరీయో మాకు కడుపున పడాల్సిందే. ఆ నారాయణ బొరుగులు తినేప్పుడు కళ్ళల్లో నీళ్ళలా కారిపోయేవి, అయినా సరే అలాగే లాగించేవాళ్ళం.

ఓ సారి నేను, నా ఫ్రెండ్ ఓ పందెం వేసుకున్నాం తను పాతిక మిరపకాయ బజ్జీలు తింటానని, దానికి ప్రతిగా నేను పాతిక రూపాయల బొరుగులు తినగల్ననీనూ. అన్నంతపనీ చేశాం. గెలుపు ఎవరిది అని తేలలేదు. అయితే మా వాడు మరుసటి రోజు హాస్పిటల్లో సెలైన్ బాటిళ్ళ వాతన బడ్డాడు. నేను తప్పించుకున్నా. కారణం బాగా నీళ్ళు తాగడమే. అవును మా వూరి నీళ్ళల్లో అలా కారాన్ని హరాయించే శక్తి ఉంది. అలానే మా వూరి నీళ్ళ రుచి కూడా. (అందరూ వాళ్ళ వూరి నీళ్ళ గురించి అలానే అనుకోవచ్చు). నా చిన్నప్పుడు మా నాన్న మా సొంత ఇంట్లో బావి తవ్వించారు. 200 అడుగులకు పైగా. నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఆ నీళ్ళు కొబ్బరి పాలలా ఎంత తియ్యగా ఉండేవో. పొద్దులో అరిపిరాల సత్య గారి మంచినీళ్ళ బావి కథ చదివినప్పుడు అదే గుర్తొచ్చింది నాకు.

అయితే మా మేనమామ ఒప్పుకోడు. "గంగా స్నాన, తుంగా పాన". మా ఊరి నీళ్ళే మంచివి అనే వారాయన. ఆయన బళ్ళారి లో నివాసముండేవారు.

నీళ్ళ విషయంలో బెంగళూరు వాళ్ళది తెగ బడాయి. మేము కావేరీ నీరు తాగుతాం. కావేరి వాటర్లో ఫాస్పరస్ కంటెంట్ ఉందట. అది బుద్ధిని తెగ షార్ప్ చేస్తుందట, అని వీళ్ళ మాటలు. అక్కడికి బుద్ధి పెన్సిలయినట్లు, కావేరీ నీళ్ళు బ్లేడులా దాన్ని చెక్కుతున్నట్లు.


నీళ్ళకో గుణం. ఏం తిన్నా హరాయిస్తాయా నీళ్ళు. అలాగే ఎంత తాగినా ఏవీ తాగినట్టుండదు, ఎందుకో ఏమో?

పారే నదిలో మధ్యలో వెళ్ళి ఆ నీళ్ళు తాగటం ఓ గొప్ప సంతోషాన్నిస్తుంది నాకు. బాసర వద్ద గోదావరి నది మధ్యకు తెప్పలో వెళ్ళి నది మధ్యలో తెప్పనాపించి, నీళ్ళు ముంచుకు స్నానం చేసి, ఆ నీళ్ళు తాగడం నాకున్న గొప్ప జ్ఞాపకాల్లో ఒకటి. తెప్ప అంటే హరిగోలు కాదు. థర్మోకోల్ షీట్లను తాళ్ళతో కట్టి చేసిన ఓ నలుచదరపు పడవ. అలానే శృంగేరి దగ్గర తుంగా నది నీళ్ళు కూడా. ఇంకా గొప్ప జ్ఞాపకం నైలు నది మధ్యలో పడవలో వెళ్ళి నీళ్ళు ముంచుకు తాగటం.

ఇంతకూ నేనిలా మంచినీళ్ళ మీద పడ్డానికి కారణం, గత ఐదేళ్ళుగా ఈ దరిద్రపు ఊళ్ళో మినరల్ వాటర్ కొనుక్కుని తాగి బతుకీడ్చాల్సిన ఖర్మ పట్టటం. మన చదువులు, మన బతుకులన్నీ "ఉద్యోగం" చుట్టూ తిరుగుతూ తగలడ్డాయ్. ఇంతమందికి ఉద్యోగాలు రావాలంటే పనికొచ్చేవి, పనికి రానివీ రకరకాల వస్తువుల ఉత్పత్తి జరగాలి. పనికి రాని వస్తువులు మార్కెటింగ్ ప్రతిభ కారణంగా, పనికొచ్చే వస్తువులుగా తయారు చేయాలి. అదుగో అందుకనేనేమో చివరకు నీళ్ళను కూడా కొనుక్కుని తాగే దిశకు చేరుకున్నాం. ఎవణ్ణి తిట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఈ నీళ్ళల్లోనూ కాంపిటీషను. టాటా వాడి నీళ్ళు లీటరు పాతిక రూపాయలు. ఇంకొకడెవడో క్యువా అట. బాటిలు నలభై రూపాయలు పెట్టి అమ్ముతున్నాడు.

అలానే మన తిండి పదార్థాలు, పాలు పెరుగు వీటి రుచి కూడా నీటి మీదనే ఆధారపడి ఉంటుందని నాకొహ నమ్మకం. నైలు నది వద్ద ఒక ఆన్ సైటుకెళ్ళినప్పుడు నెల్లాళ్ళు దాదాపు నేనే వండాను, మా కొలీగుల కోసం. అయితే అదే వంట ఇక్కడ బెంగళూరులో చాలా సార్లు ప్రయత్నిస్తున్నా, కుదిరి చావడం లేదు. నైలు నీళ్ళలోనే మర్మం ఉంది.

ఇంతకూ, మనకు ఎప్పుడు వానలు కురిసి నీటి కరువు తీరుతుందో ఏమిటో?

ఇప్పుడు కొంచెం జ్ఞానదాయకమైన విషయాలు చెప్పుకుందాం

నీరు అన్నది సంస్కృత "నీయతే ఇతి" అన్న ధాతువు నుండి వచ్చిన "నీర" శబ్దానికి తద్భవం కాదని నుడి నానుడి రామచంద్ర గారు. నిగనిగలాడేది కాబట్టి నిగళ్ష్, నిగర్, నీరు, నివురు అయిందట. అలాగే వెణ్ణ, పెన్నా వీటి నుంచి వెల్ల, వెల్లువ, మలయాళలో వెళ్ళం (వెళ్ళం అంటే నీరు ఆ భాషలో), వానావానా వల్లప్ప లోని వల్లప్ప ఇవన్నీ వచ్చాయట. ఇలాంటివి మరెన్నో. కాబట్టి మనపదాలన్నీ సంస్కృతానికి కాపీ అని బాధపడాల్సిన అవసరం లేదు.

Wednesday, July 8, 2009

పోలిక

నా క్రితం టపాలో కామేశ్వర్రావు గారు కామెంటుతూ, సమాయుక్తం, సమన్వితం అన్న పదాలు చూడగానే చప్పున ఓ విషయం, చూచాయగా ఓ విషయం గుర్తొచ్చాయన్నారు. ఇలా ఓ విషయం చూసినప్పుడు మరో విషయం స్ఫురించటం మామూలుగా అప్పుడప్పుడు జరిగేదే అయినా, ఒకే కాలానికి, ప్రాంతానికి చెందని ఏ రెండు రచనలలోనో, రచనా ప్రక్రియల్లోనో ఇలా పోలికలు కనబడితే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కో సారి ఈ పోలిక అనుసరణ, ప్రేరణ లేదా ప్రభావం కావచ్చు.

కామేశ్వర్రావు గారు వివరించిన "ఎవ్వాని వాకిట . . ." చదివిన తర్వాత, అలాంటిదే ముక్కు తిమ్మనాచార్యుని పారిజాతాపహరణం చూసినప్పుడు, అందులో అవతారికలో ఈ (12 వ)పద్యం కనిపించింది. ఇలాంటివి ఎన్నెన్నో సారస్వతంలో ఉండవచ్చు.

అయితే - ఒకే వర్ణన ఇద్దరు కవులు చేస్తే ఎలా ఉంటుంది?

రఘువంశం 6 వ సర్గ లో ఒక చిన్న వర్ణన

ఇందీవరశ్యామతనుర్నృపోసౌ
త్వం రోచనాగౌరశరీరయష్టిః
అన్యోన్యశోభాపరివృద్ధయే వాం
యోగ స్తటిత్తోయదయో రివాస్తు

ఈ నృపుడు నీలోత్పలము వలె భాసించే శ్యామతనూ విలాసుడు. నీవు గోరోచనమువలె పచ్చనైన దండసదృశదేహవిలసితవు. మెఱపుకు, మేఘమునకు వలె, మీరిరువురకు యోగము పరస్పర కాంతి ప్రవృద్ధమానమగును.

స్వయంవరంలో పాండురాజును చూపెడుతూ, దౌవారికి సునంద రాకుమారి ఇందుమతికి చెప్పే మాట ఇది. అయితే సూర్యుని కోసం ఎదురు చూసే తామర మొగ్గకు చంద్రుడి కాంతి పట్టనట్టు ఈ రాజు ఇందుమతికి నచ్చలేదట. (సూర్యుడు అంటే సూర్యవంశపు రాజయిన అజుడు అని అన్వయించుకోవాలి)

పై శ్లోకంలో తటిత్తోయదయోరివ - (తోయం దదాతి ఇది తోయదః - తోయములను ఇచ్చునది తోయదము) - మెఱపునకు, మేఘమునకు వలె.

ఈ ఆఖరు వాక్యం చదవగానే -

మెఱయు శ్రీ వెంకటేశు మేన సింగారము గాను
తఱచయిన సొమ్ములు ధరియించఁగా
మెఱుఁగుబోణీ అలమేలు మంగయుఁ దాను
మెఱుపు మేఘము గూడి మెరసినట్లుండె

ఒకపరికొకపరి ఒయ్యారమై
మొకమునఁ గళలెల్ల మొలచినట్లుండె

చప్పున గుర్తుకు వచ్చింది. అయితే ఈ సారి పద్మావతి, శ్రీనివాసుడు నాయికా నాయికలు. నాయకుడు నీలతనుడు. పైగా మంచి సొమ్ములు వేరే వేసికొన్నవాడు. నాయిక పద్మావతి కుంకుమ వర్ణిని. ఇద్దరి యోగము ఇందాక చెప్పిన తటిత్తోయదయోరివ అంటే - మెఱుపు మేఘము గూడి మెరసినట్లుండె.

ఈ కీర్తన విన్నప్పుడో, చిన్నగా పాడుకునేప్పుడో, మేఘాల మధ్య తటిల్లత లాంటి మెఱుపు, ఆ వెంటనే ఆ తటిల్లత ను నాయిక (అమ్మవారి)గా పోల్చిన పోలిక, ఆ తర్వాత నల్లటి మేఘం లాంటి నాయకుడు అసంకల్పితంగానే గుర్తుకు రావడం జరిగిపోతోంది.

సంస్కృత వర్ణన లో క్లుప్తత, కేవలమొక సాదృశ రూపము కనిపిస్తే తెలుగు వర్ణనలో ఓ లయ, దాని ఉధృతి, మనసులో చెప్పలేని ఓ తాదాత్మ్య భావన కలుగుతోంది. (బహుశా నాకే అలా అనిపిస్తుందో ఏమో?)

ఇందులో భక్తి, భగవంతుడిపై నమ్మకం, అపనమ్మకం ఇవేవి లేవు. ఇవన్నీ రసాస్వాదనకు అడ్డు రావు, రావలసిన అవసరం లేదు. అనుభూతులకు తర్కం సమాధానం చెప్పలేదు.

అన్నట్టు ఇది రాస్తున్నప్పుడు, పక్కన కిటికీ నుండీ బయట చీకట్లో ఉండుండీ మెఱుపులు కనిపిస్తున్నాయి.

Sunday, July 5, 2009

గుసగుస - రుసరుస

ఉదయం 8:30 కావస్తోంది.

"హా...(ఆవులింత) ఈనాడు వచ్చిందా?"

"ఇదిగోండి. ఇప్పటికి తెల్లారిందీ. ఇప్పటికైనా నిద్ర లేచేదుందా? లేదా?"

"పేపర్ చదివీ (పన్లో పనిగా టీవీ చూసి)"

"తిప్పసంద్ర కెళ్ళి కూరగాయలు తీసుకు రావాలి. ఇంట్లో కూరగాయల్లేవు"

"బయట బండ్లో వస్తాయి. లేదంటే సొప్పు (కన్నడంలో ఆక్కూర) గాడొస్తాడు. వాడితో తీసుకో"

"ఏమంత బద్ధకం? ఈ రోజయినా కాస్త మంచి తిండి తిందామని లేదా?"

"సర్లే"

బయటకొచ్చాను. పక్కింటి ముందు మల్లె పూల చెట్టు. దానికి పూచిన మల్లెపూలు నవ్వుతున్నాయ్.

ఆదివారం అనుబంధం లో బాలు కూడా. బాలుడి పుట్టినరోజా? ఏమో?

"ఉప్మా రవ్వ కొంచెమే ఉంది. టిఫిన్ తీసుకు రావాల్సిందే. తప్పదు." ప్రాంప్ట్ గా అనౌన్స్ చేసింది మా ఆవిడ.

అబ్బా..తప్పదా? లేదంటే ఉప్మా చేసేస్తుందని, వీధిలోకి దౌడు తీసాను. టిఫిన్ తిని ఆత్మారాముడు శాంతించాక లాప్ టాప్ తీశాను. నాకిష్టమైన బాలు పాట కనిపించింది. ఇక ఆగలేక ఆ పాట మోగించాను.బాలు గారి "పూలు గుస గుస లాడేనని" నాకు చాలా ఇష్టమైన పాట. ఆ పాట కోసం చెవి కోసుకుంటాను నేను.

పాట బాక్ గ్రవుండ్ లో నడుస్తుంటే, తెలుగుపద్యం లో కొ.పా. గారి వ్యాఖ్య కనిపించింది. ఇదేదో బావుందే. నేను పాట పాడతాను. ఆలస్యమెందుకు, ఇదీ నా పాట. (మొదటి చరణం)


poolu.wma

"అస్తమాను ఆ లాప్ టాప్ తప్ప సంసారం అదీ కాబట్టదా?" బాక్ గ్రవుండ్ లో సణుగుడు, ఫోర్ గ్రవుండ్ లో మా ఆవిడ.

ఆవిడ అలా పక్కకెళ్ళిన తర్వాత శ్రోతలు కోరని నా పాట కంటిన్యూ చేశాను. రెండవ చరణం.

poolu1.wma

"ఇంకా బట్టలుతకాలి. సరే స్నానం చేసొస్తాను" వెళ్ళిందామె.

ఆవిడ బయటకొచ్చే లోపు ఆవిడ మీద ఈ (పేరడీ) పాట కట్టేశాను.
aalu.wma

ఉంటానండి. ఆవిడ పాట ఛ, ఛ..., స్నానం ముగించి వచ్చేస్త్తోంది.

ఇవన్నీ ఒకే షాట్ లో ఓకే చేసిన పాటలు. బాలు పుట్టిన రోజుకు చాక్లెట్ గా పనికి రాకపోతే, జాక్సను నివాళి కోసమైనా సరే వాడుకోవచ్చు.

Wednesday, July 1, 2009

చారు చాఱు !!

చారు చారు సమాయుక్తం
హింగు జీర సమన్వితం
లవణ హీనం న శోభన్తే
పాలాశ కుసుమం యథా ||

ఈ శ్లోకం కథ ఇక్కడికెళితే తెలుస్తుంది.

ఈ "చారు" సంస్కృత శబ్దం. సంస్కృతంలో "చారు" అంటే "మంచి, అందమైన, చక్కటి" అని అర్థాలు. ప్రియే చారు శీలే, ముంచ మయి మానమనిదానం - ఇది గీతగోవిందంలో ఓ శ్లోకం. ఇంకొకాయన "యావచ్చారు చచారు చారు చమరం చామీకరం చామరం" అని (పైన చారు కథ చెప్పినాయన గారి పంఖా) చారుతో చెడుగుడు ఆడుకున్నాడు. "చారు శీల" అంటే మంచి శీలవతి అని.

("చారు" కు ఇంకో అర్థం గూఢచర్యం?)

ఇంకాస్త ముందుకెళ్ళి "చాఱు" లో కాలెడదాం. ఈ చెప్పిన "చాఱు" మనది. అంటే దక్షిణ భారతీయులది. ఇదండీ మనకు కావలసిన ఘుమఘుమలాడే చోష్య విశేషం. (భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, చర్వ్యాలని తిండి పదార్థాలు. మింగడానికిన్ని పేర్లు. ఇవి నాలుగా, అయిదా అన్నది ఇంకో పెద్ద చర్చ!) ఇది ఇందాకటి "చారు" కాదు. అంటే మన "చాఱు" సంస్కృతభవం కాదు. "బండి ఱ" మనది కదా! ఇలా చారులో కరివేపాకు ఏరడాలు అవసరమా?
అంటే దానికొక పెద్ద కథ ఉంది. ఒకప్పుడు దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు, శ్రీరామ వీరబ్రహ్మ కవి గారు, "ఆ ఏదో ఒక చారు లెద్దూ" అనుకోకుండా, ఇందులో ఉన్నది శకట రేఫాంతమా? సాధు రేఫాంతమా? అని తీవ్రంగా వివదించుకున్నారట. ఇది ఏ భారతి సంచికలోనో ఉండే ఉంటుంది.

మళ్ళీ మొదటి శ్లోకానికి వద్దాం.

"చక్కగా కూర్చబడి, ఇంగువ, జీలకర్రలతో తాలింపు పెట్టి ఘుమఘుమలాడించినప్పటికి, ఉప్పు లేక పోతే వ్యర్థం, మోదుగ పువ్వు (పూజకు పనికి రానట్టు) లాగా" అని ఆ శ్లోకం తాలూకు తాత్పర్యం.

"చారు చారు సమాయుక్తం" - ఇందులో "చారు చారు" అన్నది చక్కదనాన్ని విస్పష్టం చేయడానికే తప్ప, రెండవ చారు కు మొదటి చారు విశేషణం కాదు.
జాగ్రత్తగా గమనిస్తే, ఆ చెప్పినాయన "ఫలానా" దీనికి ఇంగువ, జీలకర్ర జోడిస్తే అని చెప్పలేదు. లేదంటే, ఆయన తెలుగాయన కాబట్టి, "చారు చాఱు" లో రెండవ చారును "చాఱు" గా భావించమని అన్యాపదేశంగా ఆ చారు మతికి ఉప్పందించి ఉండాలి! ఏదేమయితేనేం, "చారు చమత్కారం"!


***********************************************************

చాఱు అంటే మా అమ్మ గుర్తుకొస్తుంది. వంట విషయాలలో, మా అమ్మ పక్కా ప్రొఫెషనలు. మా నాన్న గారు హోటలు నడిపేవారు, నా చిన్నప్పుడు. మా ఇంట్లో కట్టెల పొయ్యి. మా అమ్మ కేమో చిన్నప్పుడే పువ్వు పూచి, ఓ కన్ను కనిపించదు. ఆ పొయ్యిలో పచ్చి కట్టెలు మండక, చిలిమితో ఊదుతూ, పొగను భరిస్తూ, అలా అలవోకగా కాస్త దూరం నుండీ ఉప్పు విదిల్చేది. సరిగ్గా ఒక్క పలుకు కూడా తేడా రాకుండా ఉప్పు పడేది. అలానే ఇంగువ, జిలకర కలిసిన పోపు కూడాను. చివర్న కరివేపాకు ఇంట్లో పెరిగిన చెట్టునుండీ కోసుకొచ్చినది.

ఇప్పుడు మా ఇంట్లో కరివేపాకు చెట్లు ఉన్నయ్ కానీ చాఱు పెట్టటానికి మా అమ్మ లేదు. మా ఆవిడ కూడా చాఱులో ఎక్స్ పర్టే. అయితే చాఱు విషయంలో అమ్మకు పెద్దపీట.

ఇక్కడ బెంగళూరులో మల్లేశ్వరంలో కృష్ణాభవన్ అని ఒక భోజన శాల ఉండేది. అక్కడ చాఱు ఘుమఘుమలాడిపోయేది. ఎం టీ ఆర్ (మావళ్ళి టిఫిన్ రూమ్) వారి సాఱు కూడా తక్కువతినలేదు. కన్నడిగులకు "సాఱు" లో "సిహి" (తీపి) జోడించటం అలవాటు. బెల్లం తగుపాళ్ళలో జోడిస్తే నిజానికి "సాఱు" ఘాటు పెరుగుతుందట. కొరియా (ఆన్ సైటు) లో ఉన్నప్పుడు నా రూమ్మేటు విట్ఠల్ అనే అబ్బాయి దీన్ని (నా మీద) ప్రయోగాత్మకంగా నిరూపించాడు.


***********************************************************

"చాఱు" ఎక్కడిది? ఎప్పటిది? అని డా. తిరుమల రామచంద్ర గారు "నుడి - నానుడి" అన్న పుస్తకం లో వివరిస్తారు. భారతంలో, భీముడు బకాసుర వధ కు ముందు తిన్న "పలుతెఱంగుల పిండివంటలు బప్పు కూడును నేతి కుండలు గుడంబు దధి ప్రపూర్ణ ఘటంబుల" లో "చాఱు" లేదు(ట). :-(

పాల్కురికి సోమనాథుడి బసవ పురాణం లో బసవన్న అల్లమ ప్రభువుకు పెటిన విందులోనూ, అలాగే పార్వతి ప్రమథులకు తెట్టిన విందులోనూ చాఱు లేదట. అలాగే లక్కావజ్ఝల మెస్ లోనూ చాఱు లేదు. అన్ని చోట్ల చారుడిలా దాక్కున్న చాఱు చివఱికి ... సారీ .... చివఱకు హరవిలాసంలో విలాసంగా బయటపడిందిలా. (శ్రీనాథుని కాలానికి) "చాఱులు పిండి వంటలును శర్కరయున్ దధియున్ యథేచ్చగన్"

ఈ "చాఱు" కన్నడంలో "సాఱు" గా ఎప్పటినుంచో ఉందట. శబ్దమణిదర్పణ కారుడు సాఱు = రసార్ద్రే అని గ్రహించాడు(ట). ఈ "చాఱు" సంస్కృత "సారు" కు తద్భవం అనే వాదన, దీనిని పూర్వపక్షం చేస్తూ "చాఱు", "సాఱు" అన్న దక్షిణాత్య భాషా శబ్ద ప్రయోగాల గురించి చెబుతారు రామచంద్ర గారు. కన్నడంలో సాఱు, స్రవించు, ప్రవహించు, జరుగు, చారు అన్న అర్థాలతో ఉందట. అలాగే తమిళ మలయాళాల్లో చాఱు కు అర్థం పిండబడినది అని అట. పనంజాఱే (తమిళం) = తీపికల్లు.

తమిళంలో "రసం" అని వ్యవహారం. అక్కడ చాఱు లుప్తమవటానికి కారణం చెబుతూ, చాఱు = తీపికల్లు అనే అర్థం ఉన్నది కాబట్టి, భోజనంలో వాడే చాఱు, రసం అయిందంటారు.

అన్నట్టు ఈ "చాఱు" దంత్యమా, తాలవ్యమా అని మరొక చర్చ ఉన్నదట. మనకెందుకండి శుభ్రంగా నోటిది అనుకునేసి, జుర్రేసుకుంటే పోలా?

తెలుగు వాడి పప్పు, తమిళుడి సాంబారు, కన్నడిగుడి సాఱు ఏదయితేనేం, ఎవరిదయితేనేం - కాదేదీ మింగడానికనర్హం.