Wednesday, July 1, 2009

చారు చాఱు !!

చారు చారు సమాయుక్తం
హింగు జీర సమన్వితం
లవణ హీనం న శోభన్తే
పాలాశ కుసుమం యథా ||

ఈ శ్లోకం కథ ఇక్కడికెళితే తెలుస్తుంది.

ఈ "చారు" సంస్కృత శబ్దం. సంస్కృతంలో "చారు" అంటే "మంచి, అందమైన, చక్కటి" అని అర్థాలు. ప్రియే చారు శీలే, ముంచ మయి మానమనిదానం - ఇది గీతగోవిందంలో ఓ శ్లోకం. ఇంకొకాయన "యావచ్చారు చచారు చారు చమరం చామీకరం చామరం" అని (పైన చారు కథ చెప్పినాయన గారి పంఖా) చారుతో చెడుగుడు ఆడుకున్నాడు. "చారు శీల" అంటే మంచి శీలవతి అని.

("చారు" కు ఇంకో అర్థం గూఢచర్యం?)

ఇంకాస్త ముందుకెళ్ళి "చాఱు" లో కాలెడదాం. ఈ చెప్పిన "చాఱు" మనది. అంటే దక్షిణ భారతీయులది. ఇదండీ మనకు కావలసిన ఘుమఘుమలాడే చోష్య విశేషం. (భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, చర్వ్యాలని తిండి పదార్థాలు. మింగడానికిన్ని పేర్లు. ఇవి నాలుగా, అయిదా అన్నది ఇంకో పెద్ద చర్చ!) ఇది ఇందాకటి "చారు" కాదు. అంటే మన "చాఱు" సంస్కృతభవం కాదు. "బండి ఱ" మనది కదా! ఇలా చారులో కరివేపాకు ఏరడాలు అవసరమా?
అంటే దానికొక పెద్ద కథ ఉంది. ఒకప్పుడు దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు, శ్రీరామ వీరబ్రహ్మ కవి గారు, "ఆ ఏదో ఒక చారు లెద్దూ" అనుకోకుండా, ఇందులో ఉన్నది శకట రేఫాంతమా? సాధు రేఫాంతమా? అని తీవ్రంగా వివదించుకున్నారట. ఇది ఏ భారతి సంచికలోనో ఉండే ఉంటుంది.

మళ్ళీ మొదటి శ్లోకానికి వద్దాం.

"చక్కగా కూర్చబడి, ఇంగువ, జీలకర్రలతో తాలింపు పెట్టి ఘుమఘుమలాడించినప్పటికి, ఉప్పు లేక పోతే వ్యర్థం, మోదుగ పువ్వు (పూజకు పనికి రానట్టు) లాగా" అని ఆ శ్లోకం తాలూకు తాత్పర్యం.

"చారు చారు సమాయుక్తం" - ఇందులో "చారు చారు" అన్నది చక్కదనాన్ని విస్పష్టం చేయడానికే తప్ప, రెండవ చారు కు మొదటి చారు విశేషణం కాదు.
జాగ్రత్తగా గమనిస్తే, ఆ చెప్పినాయన "ఫలానా" దీనికి ఇంగువ, జీలకర్ర జోడిస్తే అని చెప్పలేదు. లేదంటే, ఆయన తెలుగాయన కాబట్టి, "చారు చాఱు" లో రెండవ చారును "చాఱు" గా భావించమని అన్యాపదేశంగా ఆ చారు మతికి ఉప్పందించి ఉండాలి! ఏదేమయితేనేం, "చారు చమత్కారం"!


***********************************************************

చాఱు అంటే మా అమ్మ గుర్తుకొస్తుంది. వంట విషయాలలో, మా అమ్మ పక్కా ప్రొఫెషనలు. మా నాన్న గారు హోటలు నడిపేవారు, నా చిన్నప్పుడు. మా ఇంట్లో కట్టెల పొయ్యి. మా అమ్మ కేమో చిన్నప్పుడే పువ్వు పూచి, ఓ కన్ను కనిపించదు. ఆ పొయ్యిలో పచ్చి కట్టెలు మండక, చిలిమితో ఊదుతూ, పొగను భరిస్తూ, అలా అలవోకగా కాస్త దూరం నుండీ ఉప్పు విదిల్చేది. సరిగ్గా ఒక్క పలుకు కూడా తేడా రాకుండా ఉప్పు పడేది. అలానే ఇంగువ, జిలకర కలిసిన పోపు కూడాను. చివర్న కరివేపాకు ఇంట్లో పెరిగిన చెట్టునుండీ కోసుకొచ్చినది.

ఇప్పుడు మా ఇంట్లో కరివేపాకు చెట్లు ఉన్నయ్ కానీ చాఱు పెట్టటానికి మా అమ్మ లేదు. మా ఆవిడ కూడా చాఱులో ఎక్స్ పర్టే. అయితే చాఱు విషయంలో అమ్మకు పెద్దపీట.

ఇక్కడ బెంగళూరులో మల్లేశ్వరంలో కృష్ణాభవన్ అని ఒక భోజన శాల ఉండేది. అక్కడ చాఱు ఘుమఘుమలాడిపోయేది. ఎం టీ ఆర్ (మావళ్ళి టిఫిన్ రూమ్) వారి సాఱు కూడా తక్కువతినలేదు. కన్నడిగులకు "సాఱు" లో "సిహి" (తీపి) జోడించటం అలవాటు. బెల్లం తగుపాళ్ళలో జోడిస్తే నిజానికి "సాఱు" ఘాటు పెరుగుతుందట. కొరియా (ఆన్ సైటు) లో ఉన్నప్పుడు నా రూమ్మేటు విట్ఠల్ అనే అబ్బాయి దీన్ని (నా మీద) ప్రయోగాత్మకంగా నిరూపించాడు.


***********************************************************

"చాఱు" ఎక్కడిది? ఎప్పటిది? అని డా. తిరుమల రామచంద్ర గారు "నుడి - నానుడి" అన్న పుస్తకం లో వివరిస్తారు. భారతంలో, భీముడు బకాసుర వధ కు ముందు తిన్న "పలుతెఱంగుల పిండివంటలు బప్పు కూడును నేతి కుండలు గుడంబు దధి ప్రపూర్ణ ఘటంబుల" లో "చాఱు" లేదు(ట). :-(

పాల్కురికి సోమనాథుడి బసవ పురాణం లో బసవన్న అల్లమ ప్రభువుకు పెటిన విందులోనూ, అలాగే పార్వతి ప్రమథులకు తెట్టిన విందులోనూ చాఱు లేదట. అలాగే లక్కావజ్ఝల మెస్ లోనూ చాఱు లేదు. అన్ని చోట్ల చారుడిలా దాక్కున్న చాఱు చివఱికి ... సారీ .... చివఱకు హరవిలాసంలో విలాసంగా బయటపడిందిలా. (శ్రీనాథుని కాలానికి) "చాఱులు పిండి వంటలును శర్కరయున్ దధియున్ యథేచ్చగన్"

ఈ "చాఱు" కన్నడంలో "సాఱు" గా ఎప్పటినుంచో ఉందట. శబ్దమణిదర్పణ కారుడు సాఱు = రసార్ద్రే అని గ్రహించాడు(ట). ఈ "చాఱు" సంస్కృత "సారు" కు తద్భవం అనే వాదన, దీనిని పూర్వపక్షం చేస్తూ "చాఱు", "సాఱు" అన్న దక్షిణాత్య భాషా శబ్ద ప్రయోగాల గురించి చెబుతారు రామచంద్ర గారు. కన్నడంలో సాఱు, స్రవించు, ప్రవహించు, జరుగు, చారు అన్న అర్థాలతో ఉందట. అలాగే తమిళ మలయాళాల్లో చాఱు కు అర్థం పిండబడినది అని అట. పనంజాఱే (తమిళం) = తీపికల్లు.

తమిళంలో "రసం" అని వ్యవహారం. అక్కడ చాఱు లుప్తమవటానికి కారణం చెబుతూ, చాఱు = తీపికల్లు అనే అర్థం ఉన్నది కాబట్టి, భోజనంలో వాడే చాఱు, రసం అయిందంటారు.

అన్నట్టు ఈ "చాఱు" దంత్యమా, తాలవ్యమా అని మరొక చర్చ ఉన్నదట. మనకెందుకండి శుభ్రంగా నోటిది అనుకునేసి, జుర్రేసుకుంటే పోలా?

తెలుగు వాడి పప్పు, తమిళుడి సాంబారు, కన్నడిగుడి సాఱు ఏదయితేనేం, ఎవరిదయితేనేం - కాదేదీ మింగడానికనర్హం.

31 comments:

 1. చారు గురించి బాగా చెప్పారు.మా ఇంట్లో అందరం చారు ప్రియులమే.అన్నలు ఆ రెండవ లిను మా మామ్మగారు ఇంకొలా చెప్పేవారు "ఇంగువ మిరియం సమన్వితం"అని .మరి ఏది కరక్టో..

  ReplyDelete
 2. రవి గారూ! ‘చారు విజ్ఞాన సర్వస్వం’ అనిపించేలా రాశారు. అభినందనలు.

  క్షేమేంద్రుడు సంస్కృతంలో రాసిన ‘చారు చర్య’ తప్ప... చారుకీ, ‘చాఱు’కీ సంబంధించిన అన్నిటినీ స్పృశించినట్టున్నారు. బకాసుర వధ కు ముందు భీముడు
  తిన్న పదార్థాల్లో చాఱు లేకపోవటం లోటుగానే ఉంది మరి!

  ReplyDelete
 3. చాలా బాగా రాశారండీ. చారులో మేము కూడా కొద్దిగా బెల్లం వేస్తాం. బ్రహ్మాండమైన రుచి వస్తుంది. (ఇవి వంటల్లో రహస్యాలు - secret ingredients. పెళ్ళి కాక ముందు నేనూ చారు బాగానే పెట్టేవాణ్ణి.)

  మొత్తానికి మీ పుణ్యమా అని చారు విశేషాలు చాలానే బయటపడుతున్నాయి. తులసీదళాలతో కాపించిన చారుని శ్రీరామచంద్రులవారు తాగిన వైనం కూడా ఎవరైనా రాసేస్తే బాగుంటుంది (శ్రీరఘురామ, చారు తులసీదళ దామ...)!!

  ReplyDelete
 4. అప్పట్లో రామ్ అనబడే నా ఒకానొక రూమ్మేటుడు పెట్టే ఘుమఘుమలాడే 'టమాటా' చాఱు గుర్తొచ్చి నోరూరింది మీ చాఱు పురాణం చదువుతుంటే. రెండు టమాటాలు, రెండు గలాసులు నీళ్లు, పిసరంత ఉప్పు ఉంటే చాలు, నిమిషాల్లో 'రామ రసం' పెట్టేసేవాడు.

  ReplyDelete
 5. చారు కింత "చారు చరిత్ర " ఉందా? నిజంగానే చారు విజ్ఞాన సర్వస్వస్వమే ఇది! ఈ పేజీ దాచుకోవాలనిపించేంతగా రిఫరెన్స్ కి ఉపయోగపడేలా ఉంది.
  నాగమురళి గారూ, చారులో కొంచెం బెల్లం వెయ్యడం మా ఇంట్లో కూడా ఉంది.(అమ్మ దగ్గర).ఇప్పుడు మా ఇంట్లో అయితే చారు అరుదే, ఎందుకంటే చారు ను చూస్తే జ్వరం వస్తుంది నాకు బ్రెడ్డు ని చూస్తే వచ్చినట్లుగా! మీరడిగిన రులసీ దళాల చారు వైనం గణపతి చెప్పాడుగా!

  ReplyDelete
 6. మంచి విషయాలు తెలియ పరి'చారు', హాస్యం పలికిం'చారు'.. వ్యవహారికంలో చెప్పాలంటే చిం'చారు'.

  ఇది చదివితే మరో చారు చమత్కారం గుర్తొచ్చింది - మొక్కపాటిగారి గణపతి "శ్రీ రఘురామ చారు తులసీదళ ధామ.." అన్న పద్యానికి చెప్పిన వివరణ..!!

  ReplyDelete
 7. అయితే చారులందు చాఱు రుచి వేరన్నమాట :)
  నాకు చాఱు అంటే చాలా ఇష్టం.. మా బామ్మ చాలా బాగా చేస్తారు..

  ReplyDelete
 8. meeru paper publish cheseyavachhu anta research chesinatlunnaru......chaaru gurinchi............naaku kooda chaaru ante chaala chaala ishtam

  ReplyDelete
 9. చంపే’చారు’సారూ,
  ఇదంతా మా ఆవిడ చదివితే ఇంకేమన్నా ఉందా అని?
  మా ఆవిడ అసలు పేరు చారుమతి లేండి,తర్వాత ఏదో లెక్కలప్రకారం పేరుమారింది.
  మీరెన్ని చెప్పినా ఈ తినేతాగే చారుకు నాకూ చాలా దూరమండి.చారంటే మా యింట్లో నా చిన్నప్పుడు జ్వరమొచ్చితగ్గినప్పుడో సారి,లేదా కూరఅరటికాయ వేపుడప్పుడే అదే ఇంకా కొనసాగిస్తున్నానని తెలియజేసుకుంటున్నా..

  ReplyDelete
 10. చారు గురుంచి చాలా బాగా రాసారు. ఈ చారు లాగానే "ఉండ చారు" అని కొంచం బెల్లం, చింతపండు అలానే ఉండలానే వేయాలి కొంచం అల్లం దంచి జీలకర్ర, మిరపకాయి, కరివేపాకుతో తాలింపు పెట్టాలి. రుచి గా ఉంటుంది.

  ReplyDelete
 11. ఈ చారు విషయంలో శ్రీనాదుడి అనుభవం చూడండి..

  తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు జారు
  చెవులలొ బొగవెళ్ళి చిమ్మిరేగ
  బలు తెరంగుల తోడ బచ్చళ్ళు చవి గొన్న
  బ్రహ్మ రంధ్రము దాక బారు నావ
  యవిసాకు వేచిన నార్నెల్లు పసి లేదు
  పరిమళ మెంచిన బండ్లు సొగచు
  వేపాకు నెండించి వేసిన పొళ్ళను
  గంచాన గాంచిన గ్రక్కువచ్చు
  నఱవ వారింటి విందెల్ల నాగడంబు
  చెప్పవత్తురు తమ తీరు సిగ్గు లేక
  చూడవలసిన ద్రావిళ్ళ కీడు మేళ్ళు...

  అసలే భోజన ప్రియుడైన శ్రీనాధుడు అలవాటు లేని తమిళుల భోజనముతో ఎలాటి అవస్థలు పడ్డాడో కదా. ఆంధ్రుల భోజనములో పప్పు ప్రధానము. తమిళులకు చారు ముఖ్యం. అలవాటు లేని చారు అదీగాక మిరియపు చారు మొదటనే వడ్డించేసరికి కవి సార్వభౌముడికి చిర్రెత్తింది.

  ReplyDelete
 12. Ravi,
  Really can't forget rasam of pedamma, Never had such a nice rasam in my life; My dad was big fan of molagu kootan and Chinta Chiguru pappu of pedamma.
  Nice article, all I can do is just taste the rasam from the memory lane.

  ReplyDelete
 13. "మోదుగ పువ్వు (పూజకు పనికి రానట్టు) లాగా"
  మొగలిని గురించి తెలుదుగాని, ఈవిషము తెలియదు. కారణము చెప్పగలరా?

  ReplyDelete
 14. స్వరూప్ గారు, మోదుగ ఆకులు విస్తరాకులకు వాడతారు. పూలు రంగులు తయారీలోవాడతారు, కాని శివరాత్రినాడు మాత్రం ఈ మోదుగ పూలు శివపూజలో ఉపయోగిస్తారు..

  ReplyDelete
 15. జ్యోతి గారూ,
  పూజలలో మొగలిపూవులు (కేతకి, గొజ్జంగి ? అని కూడ అంటారు) వాడకూడదని ఏవో కథలు ఉన్నాయి. ఎప్పుడో శివుడికి కోపము వచ్చిందట. అలాగే ఏమైనా మోదుగను గురించి కూడ ఉన్నయ్యేమోనని అనుమానము వచ్చింది.
  నాకు ఈ సంగతులు సరిగ్గా తెలియవు, ఈమధ్య రాళ్ళపల్లి అనంతక్రిష్ణ శర్మ గారి 'రాయలనాటి రసికత చదివాను. అందులో గొజ్జంగి అంటే అర్థమును గురించి కొన్ని సందేహాలు చెప్పారు, గూగులమ్మలో చూస్తే మొగలి సంగతి తెలిసింది.

  ReplyDelete
 16. స్వరూప్ గారు,

  దీనికో కధ ఉంది. బ్రహ్మ, విష్ణువులకు శివుడు పెట్టిన పరిక్షలో మొగలిపువ్వు బ్రహ్మ తరఫున మొగలిపువ్వు అబద్ధపు సాక్ష్యం చెప్పిందని పూజకు పనికిరాకుండా, అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు గుడి,విగ్రహారాధన లేకుండా శాపం ఇచ్చారంటారు.. అందుకేనేమో మొగలిపువ్వును పూజలో ఉపయోగించరు.

  ReplyDelete
 17. బుద్ధి జ్ఞాన సమాయుక్తం
  పద్య శ్లోక సమన్వితం|
  చతుర హీనం నశోభన్తే
  పాలాశ కుసుమం యథా||

  అన్నాడొక మహాకవి. కవి ఎవరో, చారులు మీరిట్టే పసిగట్టగలరు. :-)

  టపాలోనూ వ్యాఖ్యల్లోనూ చాలా విషయాలతోపాటు చమత్కారాలూ వున్నాయి. వ్రాస్తూనే వుండండి, నిరంతర సమా'చార'స్రవంతి.

  ReplyDelete
 18. @తృష్ణ గారు : రెండూ తప్పే (చందస్సు పరంగా). రెండూ ఒప్పే, వారసత్వ పరంగా. :-)

  @వేణు : చారు చర్య అనేది 80 లలో బాలమిత్రలో ఒక్కో శ్లోకం, ఒక్కో సంచికలో వచ్చేది. చారు చర్య క్షేమేంద్రుడనే ఆయన వ్రాశాడని నాకు తెలియదు.అందుకనే ప్రస్తావించలేదు.

  @నాగమురళి గారు: అవును ఆ గణపతి గురించి ఎవరైనా చెబితే బావుంటుంది.

  @అబ్రకదబ్ర : టమోటో చారు గుర్తు చేసి తల చెడగొట్టేశారు. దీనికి మీమీద ...

  @సుజాత గారు : నుడి - నానుడి లో ఇలాంటివి మరెన్నో ఉన్నాయండీ. ఈ మధ్య మళ్ళీ ముద్రించినట్లున్నారు. వీలయితే తప్పక చదవండి.

  @సత్యప్రసాద్ గారు : మొక్కపాటి గారి "చారు" గురించి ఎవరైనా చెబుతారేమో అని చూస్తున్నాను.

  @మేధ : చారు "రుచి" (కాంతి) కూడా బావుంటుంది.

  @వినయ్ గారు : ధన్యవాదాలు.

  @రాజేంద్ర కుమార్ గారు : మనలో మనకి ఓ సీక్రెట్టు. నాకూ చాఱు అంతగా నచ్చదు. నేను పెరుగు జాతి పురుషుణ్ణి.

  @సునిత గారు : ఈ సారి మీరు చెప్పిన చారు చేసి, మా ఆవిడకు తినిపిస్తాను.

  @జ్యోతి గారు, శ్రీనాథుని చాటువు బాగ గుర్తు చేశారు. మోదుగ, మొగలి కబుర్లు బావున్నాయ్.

  @రానారె గారు : మూడవ పాదంలో చందో భంగం.:-) అక్కడ మురళి గారికి ఇదే చెప్పాను. ఆయన, పర్లేదు లైట్ దీస్కో అన్నారు.

  ఒక్కో నెల ఒక్కొక్కటి, ధారగా "సమాచారం" స్రవింపజేద్దామంటారా?

  ReplyDelete
 19. ఇంకేం! ఐతే నేనూ అదే అంటాను. ఫర్లేదు లైట్ తీస్కోమని. :-)

  'నెలకొక సమాచార గుళిక' ఆరోగ్యకరమైన పని.

  ReplyDelete
 20. రవిగారు,

  చారు ముచ్చట్ల ఘుమఘుమలు బావున్నాయి!
  మేం కూడా చారులో చిటికెడు బెల్లం వేసుకుంటాం. చింతపండుకి చిటికెడు బెల్లం ఎప్పుడూ జోడీ అని మా ఆవిడ చెప్పిన శాస్త్రం. మేం "పప్పుచార"ని కూడా చేసుకుంటాం.
  శ్లోకంలో లవణాన్ని తెలుగులో అనేస్తే వ్యాకరణం మాటెలా ఉన్నా ఛందస్సు సరిపోతుంది :-)
  అలానే రానారే శ్లోకంలో "చారు హీనం న శోభంతే" అనేసుకోవచ్చు :-)

  ఈ శ్లోకం నాగమురళిగారి బ్లాగులో చదివినప్పణ్ణుంచీ ఆలోచిస్తున్నా యీ "సమాయుక్తం సమన్వితం" ఎక్కడో చదివానే అని. ఇప్పుడు రెండు గుర్తుకొచ్చాయి. ఒకటి పూర్తిగాను, మరోటి చూచాయగాను.

  1. దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్వేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే
  2. మరొకటి చాటువే. తెనాలిరామకృష్ణునిదిగా చెప్తారు. ఒకసారి ఒక ఉద్దండపండితుడు రాయల ఆస్థానానికి వచ్చి అక్కడ పండితులకి విద్వత్ పరీక్షకి సవాలు విసురుతాడు. అతడేమో చాలా రాజ్యాల్లో గెలిచివచ్చిన ఘనుడు. ఏంచెయ్యాలి అని ఆలోచించి, అతనికి ఆతిధ్యం ఇచ్చి మర్నాడు సభ జరుపుతానని రాయలవరు చెప్తారు. ఈలోగా దిగ్గజాలతో విషయం చర్చిస్తాడు. మన రామకృష్ణుడు అతని సంగతి నేను చూసుకుంటానంటాడు. మర్నాడు ఆ పండితుడు ఏటిగట్టున స్నానం చెయ్యడానికి వెళ్ళినప్పుడు, అటుపక్కనే ఒకడు బట్టలు ఉతుకుతూ ఉంటాడు. అంతలో ఆ చాకలి భార్య వచ్చి ఆ రోజు ఏం కూర చెయ్యమంటావని అడుగుతుంది. దానికతడు ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకం గుర్తులేదు :-( అందులో ఇలాగే మొదటి పాదం చివర సమాయుక్తం అని వస్తుంది. రెండో పాదం: గోపత్నీ సమన్వితం
  ఈ శ్లోకం ఆ పండితుడికి అర్థం కాదు. ఏవిటని అడిగితే ఆ చాకలి వివరిస్తాడు. ఇక్కడ "గోపత్ని" అంటే "ఆవు+ఆలు" = ఆవాలు. ఇలాగే మొదటిపాదంలోనూ బచ్చలికూర అనే అర్థం వస్తుంది. మొత్తానికి బచ్చలికూర ఆవాలుతో పోపుపెట్టి చెయ్యమని. అమ్మబాబోయ్! ఈ రాజ్యంలో చాకలివాళ్ళకే ఇంత పాండిత్యం ఉంటే సభలో పండితులు మరెంత పండితులో అని అతడు అక్కణ్ణుంచి చల్లగా జారుకుంటాడు. ఇంతకీ అతని చేత ఆ శ్లోకం చదివించింది రామకృష్ణుడు. శ్లోకం గుర్తుకొస్తే చెప్తాను.
  మొత్తానికి యీ "సమాయుక్తం సమన్వితం" template చాలా ప్రసిద్ధి పొందినట్టుంది!

  ReplyDelete
 21. కామేశ్వర రావు గారూ,
  శ్లోకం మర్చిపోయి అన్యాయం చేశారండీ ! గోపత్ని= ఆవాలు --సూపర్బ్

  రవి గారూ,మీరు చాలా చోట్ల తిరుమల రామచంద్ర గారి -నుడి-నానుడి గురించి ప్రస్తావించడం గమనించాను.తప్పక చదువుతాను.

  అన్నట్లు కర్నాటకలో మంగుళూరు వైపు భోజనం పూర్తయ్యాక 'సారు ' ను గ్లాసులోనో, కప్పులోనో పోసి సూపు లాగా సర్వ్ చేసే సంప్రదాయం ఉంది.అది digestive అట.
  మొత్తానికి చారు చక్కగా కుదిరింది! అదిరింది ఇక్కడ!

  ReplyDelete
 22. చారుతమంగా ఉంది మీ టపా! కర్ణాటక చారుకు పుట్టిల్లయితే కావొచ్చుకానీ, ఇప్పుడు చారు అంతగా గుబాళించడం లేదిక్కడ. ఆకుకూరలతో చేసిన సాంబారులాంటి దానిని కూడా ఇక్కడ 'సొప్పు సార'ని అంటారు. మన చారులాంటి దానిని ప్రత్యేకంగా 'తిళిసారు' అంటారు.

  శ్రీనాధునికి నచ్చకపోతే పోయిందిగానీ, దొడ్డ మిరియపు చారు 'Mullaghatawny Soup' పేర ఏ ఐదు నక్షత్రాల హోటల్లో చూసినా ప్రత్యక్షం నేడు.

  ReplyDelete
 23. చారు చారు, .. ఐ మీన్, బాగు బాగు :)
  సంస్కృత సాహిత్యన్నించి చారు దత్తుణ్ణీ, తెలుగు సాహిత్యన్నించి చారు తులసీ దళ ధాముణ్ణీ మరిచారు.
  మామూలు తమిళులకి రసం అయిన చారు, వైష్ణవులకి సార అముదు అయ్యి వ్యావహారికంలో సాత్తముదు అయి కూర్చుంది. ఇదిలా ఉండగా, రసములందు మైసూరు రసము వేరు అనే పలుకుబడి కూడ వినే ఉంటారు. ఈ చారు భారతం ఘుమఘుమలాడుతూ నోరూరించుచున్నది.

  ReplyDelete
 24. చంద్రమోహన్ గారు,

  చారు గుబాళింపులు బయట కనబడకపోవచ్చునండి, కానీ సంప్రదాయ కన్నడిగుల ఇళ్ళల్లో (మధ్వులు) చాలా బాగా పెడతారు. అలాంటి భోజనం కొల్లూరు లోనో, ఉడుపిలోనో, లేదా శృంగేరి లోనో ఒక సారి చవి చూశాను నేను.

  అవును మీరు చెప్పిన మిరియపు చారు నేనూ రెండు, మూడు ఐదు చుక్కల పూటకూళ్ళ ఇళ్ళల్లో చూశాను.

  కొ.పా గారు,

  ఇంకా క్షేమేంద్రుడు (చారు చర్య), "ఆ పైన రొయ్యప్పట్టు చారున్నది" అన్న సావిత్రి పాట, చాలా మిస్సయ్యాయి.

  ReplyDelete
 25. కొత్తపాళీ గారు,
  అయ్యంగార్ల మాటలో "సాత్తమదు", "రసమదు" వేరు వేరు.
  "అమళ్దు" (అమృతం) తో సమానమని, అన్నాన్ని "సాత్త్ అమళ్దు", రసాన్ని "రస అమళ్దు", కూరని "కరి అమళ్దు" అనాలిట. అది కాస్తా వాడుకలో "సాత్తమదు", "రసమదు", "కరియమదు" అయినవి!
  ఇందులో వుండే "ళ" శబ్దం గురించి మీకు తెలిసే వుండాలి.
  ("కళిద" లో వున్నట్టు :))
  నా రెండు నయా పైసల భాష్యం :)
  శారద

  ReplyDelete
 26. శారద గారు,

  ("కళిద" లో వున్నట్టు :))

  మీరు చెప్పిన ఉదాహరణతో ఠక్కున అర్థమయ్యింది. :-)

  ReplyDelete
 27. "కళిద" లో వున్నట్టు ?

  అర్థం కాలేదు ! కొంచెం వివరిస్తారా ? ( అది కన్నడం అయితే, నాకు కన్నడం రాదు )

  కొత్తపాళీ గారు అన్నట్టు, మీ పోస్ట్ చారు చారు ! ఇప్పుడు అర్జెంటుగా చారు అన్నం తినాలనిపిస్తోంది ! ఎలాగబ్బా ?

  ReplyDelete
 28. అనానిమస్ గారు: "కళుద" (తమిళం) అంటే, గాడిద అని. అయితే మాటర్ అది కాదు. అందులో "ళ" ను "ష"- "ళ" మధ్యలో పలకాలి. "తాలవ్యం" గా పలకాలి.

  ReplyDelete
 29. నాకైతే చారు కంటే పప్పుచారు బాగుంటుంది.

  తమిళుల రసం కూడా మన చారు కంటే రుచిగా ఉంటుంది.

  బెంగుళూరులో సాంబారు నాకస్సలు నచ్చదు. తీపిగా చేస్తారు.

  ReplyDelete
 30. @శారద .. నిజమా? అయుండచ్చు. తమిళ వైష్ణవుల్తో బుజాలు రుద్దుకుని చాలా ఏళ్ళైంది. అందుకని కళిద లు మరుపుకొచ్చి ఉండొచ్చు :)

  ReplyDelete
 31. రవి - మీ ఈ పోష్టు నేనెలా మిస్సయ్యానబ్బా! బాగుంది బాగుంది ....సారు సాలా బాగుండాది

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.