Friday, December 31, 2010

కఠినోపనిషత్ (పెళ్ళై రెండేళ్ళు దాటిన మగవారికి మాత్రమే)

The best way to remember your wife's birthday is - not to remember it.

***************************************************************************************************************
ప్రతి యేడాదీ new year ఆరంభంలో నేను చేసే పని ఒకటుంది. అది - మొబైల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసి పడేయటం. అవును. నాకు ఆ అర్ధరాత్రి ఫోనులంటే కిట్టవు.
గత మూడు యేళ్ళుగా ఈ new year కు తోడుగా మరో తల్నెప్పి తోడయింది నాకు. మా ఆవిడ పుట్టినరోజు డిసెంబరు ముప్పై. ఆమె నాకు సెట్ చేసిన kpi (key process indicator) ప్రకారం ఆ రోజు ముందురోజు అర్ధరాత్రి దయ్యంలా మేలుకుని, నిద్రలేకుండా కళ్ళు వాయగొట్టుకుని ఆమెకు శుభాకాంక్షలు చెప్పాలి. నాకు ఆమె బర్త్ డే, భర్త డే ఏం ఖర్మ, నా బర్త్ డే కూడా గుర్తుండి ఛావదు. ఇక ఆ అర్ధరాత్రి స్కీములు ఎట్లా అమలు జరిపేది? కానీ చిచ్చీ, ఈ ఆడాళ్ళున్నారే .. (అదేదో సినిమాలో ఉదయకిరణ్ లా చదువుకోవచ్చు) వాళ్ళకు ఇట్లాంటి డ్రామాలు తప్ప ప్రాక్టికల్ గా ఆలోచించటం రానే రాదు.

భర్తారావులూ, మనలోమాట. ఒకవేళ బర్త్ డే, ఇంకో డే గుర్తున్నా కూడా గుర్తుండనట్టు మిన్నకుండడం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే, పోన్లే పాపం అని Many happy returns of the day అని చెప్పామనుకోండి. అంతటితో తెమలదు. నిజానికి అప్పుడే ప్రమాదం మొదలవుతుంది. ఏదో మాటవరసకు returns అంటే, నిజంగానే returns అడుగుతారు వాళ్ళు. అది మరీ ప్రమాదం. వెనకటికో సారి మా ఆవిడ గిఫ్టు అడిగింది కదా అని ఏదో వాచీ, మరేదో గిఫ్టు ఆర్టికల్లూ కొనుక్కుని వెళితే మా ఆవిడ మెచ్చుకోడానికి బదులు తిట్టిపోసింది. పెళ్ళానికి గిఫ్టు ఆర్టికల్స్ ఇవ్వకూడదట. నగలు, నట్రా ఇలాంటివి ఇవ్వాలంట. (నట్రా = లేటెస్టు మొబైలూ, స్విస్ వాచూ, ఐపాడు, ఐపోడు, నా శ్రాద్ధం వగైరా వగైరా) అదీ మామూలుగా కాదంట, ఆర్చీస్ వాడి దగ్గర ఓ పెద్ద కార్డు ఒకటి కొనుక్కుని దానితో బాటు ఇవ్వాలంట. ఆ ఆర్చీస్ కార్డు లో రాసేదంతా పరమ సొల్లు. ఆ సోదంతా ఆమె చదివి ఆనందామృత తరంగాలలో ఓలలాడాలట. అవసరమా ఇదంతా?

నాకు ఫీలింగ్సే లేవని, ప్రేమంటే ఏంటో తెలీదని మా ఆవిడకో గోప్ప నమ్మకం. నా పొఱబాటు కూడా ఉంది లెండి. పెళ్ళైన కొత్తల్లో ఇంప్రెస్ చేయడానికి - "ప్రేమలో ఏమియునూ లేదు, ప్రేమయన్న భావన తప్ప" అని కృష్ణ శాస్త్రి మాట, "Love is not a sensation" అన్న కృష్ణమూర్తి మాట, "నీవు ప్రేమించట్లేదు, ప్రేమ అనే భావనను ప్రేమిస్తున్నావు" అన్న యండమూరి కోటు ఇలా తన్మయత్వంతో చెప్పుకుంటూ పోయేసరికి, ఆమెలో రియాక్షన్స్ వచ్చి, నా మీద నెగటివ్ ఫీలింగ్స్ స్థిరపడిపోయినయ్.నేనో ఇంటలెక్చువల్ అన్న బిరుదు రావడానికి బదులు, మెటీరియలిష్ట్ అన్న ముద్ర శాశ్వతంగా నామీద మోపబడింది.

అలాగే ఫీలింగ్స్ అంటే సినిమాల్లో లాగ ఉండాలా అని నా ఫిర్యాదు. ఓ రోజు ప్రాక్టికల్ గా ఆమెకు సినిమాల్లో ప్రేమలు ఎలా ఉంటాయోనని కొన్ని ఉదాహరణలతో వివరించా. నేను చూపిన సినిమాలు, ఉటంకించిన దృశ్యాలు ఇవి.

రైల్వే స్టేషన్ ప్రేమ - చూడాలని ఉంది
అక్వేరియం ప్రేమ - అక్వేరియంలో అటూ ఇటూ మొఖాలు పెట్టుకుని మహేష్ బాబు, ఆర్తి అగర్వాలూ ప్రేమించేస్కుంటారు.
పసిప్రాయం ప్రేమ - మరీ చిన్నవయసులోనే హీరోవిన్ను ప్రేమించెయ్డం
చిచుబుడ్డి ప్రేమ - తొలిప్రేమ
వగైరా...అలా అక్వేరియంలో మొహం చూసుకుని ప్రేమెట్ల వస్తుందని ఓ మాటు నేనడిగితే - మా శ్రీమతికి ఎంచేతనో నచ్చలేదు.

మొగోళ్ళకు (ముఖ్యంగా భర్తలకు) ఫీలింగ్స్ ఉండవని చాలామంది భార్యామణుల ప్రగాఢ నమ్మకం అనుకుంటా.నాకైతే జెంట్స్ కే ఫీలింగ్స్ ఉంటాయని నా ఫ్రెండ్ ఒకతను నిరూపించాడు. ఆ కథాక్రమంబెట్టిదనిన..

చాలా యేళ్ళ క్రితం బాచిలర్ గా ఉన్న రోజుల్లో నా ఫ్రెండుకు తన పెళ్ళైన కొత్తలో నేనో గిఫ్టు పంపా. ఓ గ్రీటింగు కార్డు - ఆ కార్డు అట్టమీద - "నిన్ను చూస్తే నా హృదయం లోపలున్న వస్తువులా ఉప్పొంగుతుంది. నీకు లోపలున్న పరికరం లా బోళా మనిషివి.నీకు కాస్ట్లీ గిఫ్టు ఇవ్వలేను, ఏదో నా తృప్తి కోసం ఈ చిన్న ముక్క. దయచేసి misuse చేయద్దు..." ఇలా ఏవేవో రాసి లోపలో ఊపరబుడ్డ (బెలూను) పెట్టి పంపా. అతనా గిఫ్టు ఇంకా దాచుకున్నాడు(ష). నా పెళ్ళికి వచ్చినప్పుడు చెప్పాడు.

సరే ఇందాక భర్తలకు తగలడే ప్రమాదం గురించి మాట్లాడుకున్నాం కదా. దానికి నేను పాటించిన ఉపాయాలు కొన్ని ఫ్రీగా చెబుతాను. విచ్చలవిడిగా వాడుకోండి.

౧. రాత్రి పూట విషెస్ చెప్పలేదు. మర్సటి రోజు పొద్దున చెప్పవచ్చు. నాకు నా ఫ్రెండు, ఇంకా ముఖ్యమైనోళ్ళు రాత్రే చెప్పేసినారు అంటే - మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో మొదలై సూర్యోదయంతో ముగిస్తే సమయం వరకు దినం. అని లెక్చరివ్వండి. వీలుంటే ఓ సంస్కృత శ్లోకం ఉటంకించండి. ఏదైనా పర్లేదు. (మీ శ్రీమతికి సంస్కృతం రాకున్నంత వరకూ పర్లేదు)

౨. ఆ రోజు ఆఫీసుకెళ్ళేప్పుడు మీరు మొబైల్ ఫోను మర్చిపోతారు, పోవాలి.

౩. సాయంత్రం (లేటుగా) వచ్చేప్పుడు ఓ స్వీటు డబ్బా తీసుకురండి. ఇంటికి వస్తూనే నగర ట్రాఫిక్ మీద విరుచుకు పడండి. అలానే తొందరగా మూసేసిన అంగడి వాళ్ళపైనా, ఆఫీసులో బాసురుని మీదా వగైరా కూడా.అంత కష్టంలోనూ మీరు స్వీటు డబ్బా తెచ్చిన వైనం వివరించండి.

౪. ఆ రోజు ఆఫీసులో మీ కొలీగుకు పెళ్ళవబోతోందని, అదీ ఇదీ చెబుతూ, అతని కట్నం సంగతి అలవోకగా, అందులో భాగంగా చెప్పేయండి. ఆ కట్నం తాలూకు ఫిగరు మీరు తీసుకున్న ఫిగరు (ఒకవేళ తీసుకుని ఉంటే) కంటే ఎక్కువ ఉండాలన్నది వేరే చెప్పనక్కర లేదనుకుంటాను.

౫. పెరిగిపోతున్న బాంకు ఋణాల గురించి కూడా ఓ మాట అనుకోవచ్చు.

౬. ఎందుకో మీకు భార్య పుట్టిన రోజు ఆమె చేతి వంట తినాలనిపిస్తుంది. భార్య వంట ఆ రోజు బావుంటుంది కూడా. అమ్మంత కాకపోయినా దాదాపుగా అంత. ఇది ఒకే బాణానికి రెండు పిట్టలు కాన్సెప్టు ఇలా జరగకపోతే బయట హోటలు కెళదాం అన్న ప్రపోజలు ఒకటొస్తుంది. దానితోబాటు హిడెన్ అజెండా కింద భోజనం తర్వాత షాపింగు అన్నది వస్తుంది. ఇవి రెంటిని తప్పించుకోడానికి ఇందాక మీకు కలిగిన ఫీలింగు పనిచేస్తుంది.

౭. మీ ఆఫీసులో ఇదివరకెప్పుడో ఇచ్చిన చిన్న గిఫ్టేదైనా ఉంటే సరిగ్గా ఈ రోజు ఇంటికి తీసుకు రండి. ఈ మధ్య చాలా సంస్థలలో ఉద్యోగులను ఆకట్టుకోడానికి చిన్నచిన్న గిఫ్టులు ఇస్తున్నారు. ఇవన్నీ సుల్తాన్ బజార్ సరుకులు లేదా చైనా దరిద్రం. వాటిపైన అందమైన రాపరో, కంపనీ ముద్రో ఉంటది అంతే.(మా ఆఫీసులో మంచినీళ్ళకప్పు, ఓ హెడ్ శెట్టూ, కాలిక్యులేటరూ, టీ షర్టూ ఇలాంటి ముష్టి ఇస్తున్నారు). లేడీస్ సైకాలజీ ప్రకారం కంపనీ వాడిచ్చే సుల్తాన్ బజార్ సరుకులంటే వాళ్ళకు చాలా ప్రేమ. ఇదివరకు తరాల్లో పాత చీరలేసి స్టీల్ సామాన్లు కొనుక్కునే స్కీము, షాపుల్లో పదిసోపులు కొంటే ఒకసోపు స్కీము ఇవన్నీ అట్లాంటివే కదా.

ఇలా ఎన్నో స్కీములు ఉపయోగించి మీకు వచ్చిన ప్రమాదాలనుండి బయటపడండి. ప్రస్తుతానికి సెలవ్. అర్ధరాత్రి నన్ను నిద్దర లేపకుండా ఉండేందుకు ఇప్పుడే మీకందరికి చెప్పేస్తాండ. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Thursday, December 23, 2010

చక్కిలాలు, జంతికలోయ్..
ధనుర్మాసం చలి దంచేస్తోంది. ఈ చలిలో కరకరలాడుతూ చక్కిలాలు తింటూ, టీవీయో, నెట్టో, పుస్తకమో పట్టుకుంటే ఎంత బావుంటుంది? వర్షంలో పకోడీలూ, ఎండకు చల్లటి మజ్జిగా, చలికి కరకరలాడే చక్కిలాలూ ఊహించని జీవితం జీవితమేనా?

నా ఊహ మటుకు ఈ రోజు నిజమయినది. పెళ్ళిళ్ళ సీజను కాబట్టి ఈ మధ్య నాకు ఓ పెళ్ళి తాలూకు కైమురుకులు/చక్కిలాలు దొరికాయ్. ఆ చక్కిలాలు లాగిస్తూంటే, ఇదుగో ఈ టపా తట్టింది. క్రితం ఏడాది ధనుర్మాసం ఇలానే పులిహోర మీద నోరు, చేయి చేసుకున్నాను, కాబట్టి ఇప్పుడు చక్కిలాల మీదపడ్డానికి అభ్యంతరం లేదనిపించి రాస్తున్నాను.

చక్కిలాలు - వీటిని కొన్నిచోట్ల మురుకులు అంటారు. జంతికలు అని కొందరంటారేమో కానీ నాకు తెలిసి జంతికలు అంటే గుండ్రంగా ఉండక, చుట్లు చుట్లుగా ఉన్నవి. చక్కిలాలు, జంతికలు, మురుకులు, పాలకాయలు, నిప్పట్లు, చేగోడీలు ఏవైతేనేం? అన్నీ ఒకే కుటుంబానికి చెందినవి. "యుష్మాకం సహకుటుంబానాం భక్షణ సమయే సముచిత స్థాన ప్రాప్తిరస్తు!"

ఇవి తిండిలో అజాతశత్రువులు. ఇవి నచ్చని వాడెవడూ ఉండడు. అయినా - అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా - అందరూ గారెలూ, బూరెలూ, బొబ్బట్లూ తలుచుకుంటారు కానీ వీటిని తలుచుకునే నాథుడు లేడు. చివరికి ’వివాహభోజనంబు..’ లో కూడా పింగళి వారు "ఔరౌర గారెలల్ల, ఒహ్హోరె బూరెలిల్ల..ఇవెల్ల నాకె చెల్ల" అంటూ చక్కిలం ఫ్యామిలీలో పెద్ద అయిన గారెలని తలుచుకున్నాడు కానీ చక్కిలాలకు సముచిత స్థానం ఇవ్వలేదు. చివరికి మన దేవాలయాల్లో కూడా చక్కిలానికి వివక్షత. ఏ దేవుడూ చక్కిలాన్ని ప్రసాదంగా తీసుకోడు (నాకు తెలిసినంత వరకు). పెళ్ళిళ్ళప్పుడు మాత్రం తగుదునమ్మా అని పెద్దపెద్ద గుండ్రాలుగా తీర్చిదిద్ది, పెళ్ళి తంతులో కూర్చోబెడతారు. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.

నా చిన్నతనంలో సెలవులకు మా పిన్ని ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్కడ మాకు చక్కిలాలు భలే దొరికేవి. వాళ్ళింట్లో ఓ పెద్ద డబ్బా, అందులో నిత్యాగ్నిహోత్రంలా నిరతమూ లభ్యమయే చిరుతిండి. ఆ పెద్ద బాక్సు సగానికి వచ్చినప్పుడల్లా తిరిగి నిండుతుండేది, అక్షయ తూణీరంలా, అక్షయఖండనఖాద్యపేటిక అని చెప్పుకోవచ్చు. అవి తింటూ టీవీ చూసుకుంటూ అలా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ సెలవులను అలవోకగా గడిపేసే వాళ్ళం.

మా ఊళ్ళో శ్రీకంఠం అని ఓ సినిమా థియేటర్ ఉంది. అక్కడ వచ్చే సినిమాలేమో గానీ అక్కడ ఇంటర్వెల్ లో దొరికే చక్కిలాలు మాత్రం నా చిన్నతనంలో ఫేమసు. నాకు చక్కిలాల పిచ్చి కాస్త ఎక్కువే అప్పట్లో. ఎనిమిదవ తరగతిలోననుకుంటాను ఓ మారు చిరంజీవి సినిమాకు టికెట్లు దొరక్క నిరాశతో ఇంటికి తిరిగి రాబుద్ధి పుట్టక ఏ సినిమా ఐతే ఏముందని ఈ సినిమా థియేటర్కు వెళ్ళాము నేనూ నా ఫ్రెండూనూ. సినిమా పోస్టర్ చూడలేదు. ఏదో డబ్బింగ్ సినిమా. సినిమా చూశాము, ఇంటర్వెల్ లో చక్కిలాలు, కలర్ సోడా కూడా లాగించాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అడిగారు ఏరా సినిమా బావుందా ఎలా ఉంది. జరిగింది చెప్పాను నేను. చిన్న సైజు బడితె పూజ చేశారు. నేనేం పాపమూ ఎరుగకపోయినా బడితె పూజ! ఎందుకంటే - ఆ సినిమా మలయాళ చిత్రరాజమట. నాకూ నా స్నేహితునికి బూతు అ(క)నిపించలేదు, సకుటుంబ సమేతంగా చూడవచ్చు ఆ సినిమాని. ఎవడో డాక్టరు వచ్చిన వాళ్ళకు ఏదో చెబుతుంటాడు. అదీ ఆ సినిమా కథ. అలా చక్కిలాల కోసం చెయ్యని పాపానికి దెబ్బలు తిన్నాం.

ఇదివరకెప్పుడో నా బ్లాగులో ఇడ్లీల గురించి ఓ మాటనుకున్నప్పుడు ఇడ్లీలు ఇండోనేషియా నుండి వచ్చాయని మనసు విరిచేశారు పరుచూరి శ్రీనివాస్ గారు. చక్కిలం మటుకూ భారతదేశ వంటకమని నా వాదన. సంస్కృతంలో చక్కిలాలను "శష్కులీ" అంటారు. (శష్కులీ ప్రకృతి - చక్కిలి వికృతి కాబోలు). ఈ శష్కులీ గురించి ఓ శ్లోకం ఈ రోజే నా కళ్ళబడింది.

నృపమాన సమిష్టమానసస్సనిమిజ్జత్కుతు కామృతోర్మిషు |
అవలంబిత కర్ణశష్కులీ కలశీకం రచయన్నవోచత ||

ఇష్టమానసః = ప్రియమైన మానస సరస్సుగల
సః = ఆ రాజహంస
కుతుకామృతోర్మిషు = సంతోషామృత లహరులలో
నిమజ్జత్ = మునిగిన
నృపమానసం = నలుని చిత్తమును
అవలంబిత కర్ణశష్కులీ = పట్టుకొనబడిన చక్కిలము వంటి చెవులనెడి
కలశీకం = కలశములు కలదిగా
రచయన్ = చేయుచూ
అవోచత = పలికెను

కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నా అర్థం ఇదీ.
మానస సరోవరం లో తిరిగే రాజహంస సంతోషాంతరంగ లహరులలో ఓలలాడే నలుని చక్కిలాలవంటిచెవులను కలశములచే నిలబెట్టి (సావధానచిత్తునిగా చేసి) చెప్పసాగింది.

చక్కిలాలవంటి చెవులను కలశాలుగా చేయడం - ఈ మాటకు అర్థం ఇంచుమించుగా ఇది. నదిలో మునిగేవాడికి ఖాళీ బిందె దొరికితే దాని సహాయంతో (మునక్కుందా పైకి పట్టుకుని) ఎలా వస్తాడో అలా సంతోష తరంగాల్లో మునిగిన నలునికి చెవులనే కలశాలు దొరికాయిట. ఆ చెవులు చక్కిలాల్లా ఉన్నాయిష!

కర్ణశష్కులీ - ఉపమాలంకారము.

పై శ్లోకం నైషధీయచరితంలో రెండవ ఆశ్వాసంలోనిది. రచయిత శ్రీహర్షుడు. ఈయన పదవ శతాబ్దపు ఆసుపాసుల్లోనివాడనుకుంటాను కాబట్టి మనం చక్కిలం భారతీయమైనదని ఒప్పేసుకుకోవచ్చు అనుకుంటాను. చక్కిలాల రుచిచూసేనేమో ఆయన "ఖండనఖండఖాద్యం" అన్న ఓ తర్కగ్రంథం వ్రాశాడు. ఆ మాటకర్థం - ఖండనం అనబడే చిరుతిండి. ఇది అద్వైత వాదం సమర్థించే ప్రౌఢగ్రంథం.

తెలుగులో జంతికల గురించి వేమన ఓ పద్యం చెప్పాడు.

తమకుఁ గలుగుపెక్కుతప్పు లటుండఁగా
నొరుల నేరమెంచు టొప్పు గాదు
చక్కిలంబు విడిచి జంతిక లేరుటా?
విశ్వదాభిరామ వినుర వేమ.