Friday, October 31, 2008

భాషా సేవకుడు, ఆయన రచనల పరిచయం

తిరుమల రామచంద్ర గారి గురించి, ఆయన రచన (ఆత్మకథ) "హంపీ నుంచీ హరప్పా దాకా" గురించి దాదాపు తెలుగు సాహితీ అభిమానులందరికీ పరిచయమే. ఆయన రాసిన మరి కొన్ని పుస్తకాల మీద ఓ చిన్ని పరిచయం.

౧. సాహితీ సుగతుని స్వగతం : రామచంద్ర గారు, చాలా చిన్న వయసులోనే భారతి పత్రిక కు వ్యాసాలు రాసే వారట. అప్పట్లో భారతి పత్రికలో వ్యాసం పడ్డం అంటే, అదో గొప్ప గౌరవమట. ఆ వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. ఇందులో కొన్ని అద్భుతమైన వ్యాసాలు.

ఆంధ్రచ్చందో విశేషములు : "ఎసగు , ఒసగు" అన్న పదాల చర్చకు సంబంధించి శ్రీ వజ్ఘల చిన సీతారామశాస్త్రి గారి వాదనను ఆక్షేపిస్తూ వ్రాసినది. ఈ వ్యాసం చదివిన పండితుడొకాయన ప్రభాకర శాస్త్రి గారి వద్ద ప్రస్తావిస్తూ, భారతి లో ఎవరో గొప్ప వ్యాసం రాసేరని అన్నాట్ట. శాస్త్రి గారు పక్కనున్న రామచంద్ర గారిని చూపించేరట. ఆ పండితుడు విస్తుపోయి, "ఎవరో శాలువా పండితుడనుకున్నాను. ఈ కుర్ర వాడా?" అని మెచ్చుకున్నారుట. ఈ ప్రస్తావన "హంపీ నుండీ..." లో ఉన్నది.

నువ్వులు కొట్టిన ఇడి నూటిడి : నన్నెచోడుడి కుమారసంభవం పరిష్కరిస్తూ, వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఓ చోట, "నూటిడి" అన్న భక్ష్య విశేషాన్ని, "నూబిడి (నువ్వు + పిడి -> పిడికిలి మేర నువ్వులు)" గా పేర్కొంటే, రామచంద్ర గారు, "నూటిడి" పదాన్ని అన్నమయ్య కీర్తనలోనూ, శ్రీనాథుని హరవిలాసం లోనూ వాడినట్టు ఋజువు చేశారు. ఇదో అత్యద్భుతమైన వ్యాసం.

బుద్ధుడికి ముందే ఉన్న ధూమపానం : ధూమపానం పైని వివరణ. ఇంకా ఇందులో ఆఫ్రికా కాల్పనిక సాహిత్యం, అనువాద సమస్యలు వంటి అద్భుతమైన వ్యాసాలున్నాయి. సాహితీ ప్రేమికులు మరువకూడని అద్భుతమైన పుస్తకం ఇది. విశాలాంధ్ర ప్రచురణ. ఇప్పుడు దొరకం లేదు!

౨.మనలిపి - పుట్టుపూర్వోత్తరాలు : లిపి పైన తెలుగులో కానీ, మరే భాషలో కానీ ఇంత సాధికారికమైన, సమగ్రమైన గ్రంథం వెలువడలేదు అంటే అతిశయోక్తి కాదు. రామచంద్ర గారు ప్రాకృతం పరిష్కరింపబడి, సంస్కృతం గా మారిందని, సంస్కృత, ప్రాకృతాల మధ్య జన్య జనక సంబంధం లేదని ఎన్నో ఋజువులు (ఆచార్య హేమచంద్రుడు, గాథా సప్తశతి వగైరా) చూపించారు. ఈ రచనలో పాళీ నుండీ సాగిన లిపి ప్రస్థానం ప్రస్తుత తెలుగు లిపి పరిణామం వరకు ఎంతో అద్భుతంగా వివరించబడింది. లిపి గురించి తెలుసుకోవాలన్న వారు ఈ గ్రంథం చదవకపోతే, వారి ఆసక్తి, అనురక్తి, అసమగ్రం అని చెప్పడానికి సందేహించనక్కరలేదు. ఇంకో గొప్ప విషయం. ఈ రచన వ్యవహార భాషలో సాగటం. ఇలాంటి గ్రంథం వ్యవహార భాషలో అదీ అప్పటి కాలంలో రాయడం ఓ నేర్పు.ఇదీ విశాలాంధ్ర ప్రచురణే.

౩. మనవి మాటలు : ఇదో చక్కని వ్యాస సంకలనం. ఇందులో కేరళ వారి "ఓణం" గురించీ, మాఘుని జ్యోటిశ్శాస్త్ర పాండిత్యం మీద, వినాయక చవితి మీద చక్కటి వ్యాసాలు.

౪. అహం భో అభివాదయే : రామచంద్ర గారు ఆంధ్ర ప్రభ లో పని చేస్తున్నప్పుడు, ఎందరో ప్రముఖులను ముఖాముఖి జరిపారు, మరెందరి మీదో అద్భుతమైన వ్యాసాలు రాసారు. అప్పటి ప్రముఖుల మీద రాసిన వ్యాస సంకలనం ఇది. విశ్వకవి రవీంద్రుడు, ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి, దాలిపర్తి పిచ్చిహరి, విస్సా అప్పారావు గారు, చిలుకూరి నారయణ రావు గారు..ఇలా ఎందరో గొప్ప వ్యక్తుల గురించి ఈ పుస్తకం మనకు పరిచయం చేస్తుంది.

౫. ప్రాకృత వాఙ్ఞ్మయంలో రామకథ : పైన ఇందాక చెప్పినట్టుగా, ప్రాకృతం అన్నది జనపదాల్లో వాడుకలో ఉన్న భాష కాగా, సంస్కృతం సంస్కరింపబడి, సమాజంలో ఉన్నత వర్గాల ఆదరణకు నోచుకున్న భాష. పల్లె సీమల్లో ఉన్న జీవన రామణీయత, వారి గాథలు మొట్టమొదట సంకలనం చేసిన సహృదయుడు హాలుడు. ఆ గాథలు గాథాసప్తశతి గా పొందుపరుచబడ్డాయి. ఈ పుస్తకంలో కొన్నివ్యాసాలు : వజ్జాలగ్గంలో తెలుగు పదాలు, ప్రాకృత ప్రకృతి (ఇది చాలా అద్భుతమైన వ్యాసం), వివిధ ప్రాకృత కవులు, బౌద్ధ రచనలు మొదలైనవి. ఇది ఓ అందమైన పుస్తకం.

౬. నుడి-నానుడి : మహీధర నళినీ మోహన్ గారి ఓ చిట్టి రచన, పిడుగుదేవర కథ. ఇందులో పిడుగు గురించి చాలా విషయాలు చెప్పారాయన. అందులో ఓ చోట తెలుగు పదాలు ఎలా మొదలయ్యాయి అని ఆసక్తి ఉన్న వారికి నుడి - నానుడి పుస్తకం సూచించారు. ఇదో శీర్షిక, ఆంధ్రజ్యోతి వారపత్రికలో. ఈ పాకెట్ సైజు పుస్తకం లో అనేక తెలుగు పదాలకు మూలాలు వెతికారాయన. ఇది కేవలం వ్యాసం రాస్తున్నట్టుగా, మధ్యమధ్యలో పిట్టకథలు చెబుతూ, కావ్యాల్లో ఉదాహరణలు పేర్కొంటూ, అందంగా సాగుతుంది. తెలుగు భాషా ప్రియులకు ఇదో ఆవకాయ. ఇందులో పేర్కొన్న కొన్ని పదాలు :గోంగూర, మిరపకాయ,నాచకమ్మ, చారు, సేపు వగైరా వగైరా...

౭. లలిత విస్తరం : ఇది బుద్ధ మహానుభావుని జీవితం. బౌద్ధపురాణం. దీన్ని, ఈయన, బులుసు వెంకటరమణయ్య గారు తెనిగించారు. ఈ పుస్తకం నేను చదవలేదు. ఈ మధ్య ఆనంద బుద్ధ విహార ట్ర్సస్ట్, సికందరాబాద్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించినట్టు చూసానెక్కడో.

౮. ఇంకా తెలుగు పత్రిక సాహిత్య సేవ, మరపురాని మనీషులు ఇలాంటి ప్రచురణలు ఈ మధ్య విశాలాంధ్ర వారు మళ్ళీ పునర్ముద్రించలేదు.

***********************************

Tuesday, October 28, 2008

మలయాళంకారం

"మీ ఇండియన్స్ ఇంగ్లీషు ఇంత చక్కగా మాట్లాడతారు కదా, కానీ ఇక్కడ యూనివర్సిటీ లో ఇంగ్లీష్ చెప్పే టీచర్లు ఓ రకమైన యాసతో మాట్లాడతారు. ఎందుకలాగ?" అడిగాడు క్లయింట్ దేవో భవ గాడు, నిరుడు యెమెన్ కి వెళ్ళినప్పుడు.

"అంటే?" అడిగాను అర్థం కాక.

"అంటే, "కాలేజ్" ను "గోళేజ్" అని, అరబ్ ను "యెర్ఱబ్" ఇలా ఖూనీ చేస్తుంటారు దారుణంగా" చెప్పాడు వాడు. వాడి కళ్ళల్లో అరుణిమ.

అర్థమయి నవ్వేశాను. (నవ్వక పోతే, అ కోపం మా మీద చూపించి మమ్మల్ని పీక్కు తింటాడు)

మలయాళంకారం గురించి ఇప్పటికే నెటిజనులకు తెలిసి ఉంటుంది. ఎన్ని మెయిల్స్ వచ్చినా తిరిగి మలయాళీల మీద వచ్చిన జోక్ కొత్తగానే అనిపిస్తుంది.

ఇంతకీ "మలయాళీ" కరెక్టా? "మళయాళీ" కరెక్టా?

***************************

కాలేజ్ అయిపోయిన తర్వాత మా వాడికొకడికి బిర్లా పోలీ ఫాబ్రిక్స్ అన్న కంపనీ లో ఉద్యోగం వచ్చింది. ఆ కంపనీ ఉత్పత్తి గంధకిక ఆంలము (సల్ఫ్యూరిక్ ఏసిడ్). సల్ఫ్యూరిక్ ఏసిడ్ ఉత్పత్తి లో ఓ (అనుబంధ ఉత్పత్తి) బై ప్రాడక్ట్ జనిస్తుంది. దాని పేరు ఓలియం (H2S2O7).

మావాడు డ్యూటీ ఇంజినీరు(ట). తన షిఫ్ట్ లో ఎంత ఉత్పత్తి సాధించేడు, తదితర వివరాలు పద్దు రాసి వెళ్ళాలి షిఫ్ట్ ముగిసి వెళ్ళేప్పుడు.

వాడి బాసురుడు తనిఖీకి వచ్చేట్ట.

"ఒళియూం" ఎంత? అడిగేడట.

ఓహో, "ఓలియం" గురించేమో అని మా వాడు ః౨౨ఓ౭ గురించి చెప్పేడుట.

బాసురుడు ఆగ్రహంతో, "అసలు నీవు ఇంజినీరింగ్ చదివావా? నీకు చెప్పేది అర్థం అవుతుందా ... " ఇలా మొదలెట్టేట్ట.
ఆఖరుకు తేలిందేమంటే, "ఓలియం" (H2S2O7) కు "వాల్యూం" (ఘనపరిమాణం) కు ఆ కేరళ బాసు ఒకే రకంగా సౌండిస్తాడు!


************************

ఇంకో సారి కేరళ కు మా ఇంట్లో వాళ్ళందరం పిక్నిక్ కి వెళ్ళాం. అక్కడ ఓ హోటల్ లో పొద్దునే, కాఫీ టీ లు వదిలేసి ఓ పెద్ద గ్లాసులో తెల్లటి ద్రవ పదార్థం తాగుతున్నారు జనాలు.

వెయిటర్ ను పిలిచి, సైగలతో అడిగేం, యేమిటదని.

వెయిటర్ నిండుగా ఊపిరి పీల్చాడు, సముద్రం లంఘించబోయేముందు ఆంజనేయుడు బిగపట్టినట్టుగా.

"హో-ర్ళి-క్స్" అన్నాడు, వూపిరి వదిలేస్తూ.

మా కజిన్ ఆ దెబ్బకు తుఫానులో చిక్కిన ఎండుటాకులా అల్లాడాడు.

******************************

మా ఇంట్లో మా మేనత్త కేరళ లోని కేలికట్ లో ఉంటుండటంతోనూ, మేము అప్పుడప్పుడు అక్కడికి వెళుతుండటంతోనూ, వాళ్ళ వాళ్ళు మలయాళం లో సంభాషిస్తుండంతోనూ, ఎంగళుక్కు మలయాళం స్వల్పమాయి అరయుం. (మాకు మలయాళం తెలుసు).

కేలికట్ అన్న వూరిని వాళ్ళు పిలిచేది కో-ఝి-కోడ్ అని. ఇక్కడ "ఝి" అన్నది కేవలం తమిళ్, మలయాళం లో ఉన్న ఓ అక్షరం. ఆ అక్షరమే అపభ్రంశం చెంది, ఱ గా మారిందని ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం లో తేల్చారు.

అన్నట్టు ఇంకో విషయం ఏమిటంటే, ఆ భాషలో "సంభాషించడం" అనడానికి ఏమంటారో తెలుసా? "సంసారిక్క్యాం" .

కేరళ భాషలో 64 శాతం సంస్కృత పదాలున్నాయట. ఇది మా మామయ్య చెప్పేడో సారి. ఆయన సంస్కృత, తెలుగు, హిందీ, భాషా పండితుడు. ఆయనకు మలయాళం కూడా తెలుసు. నాకు మాత్రం తెలుగే సంస్కృతానికి దగ్గర అని ఓ అనుమానం. "సంస్కృతం తెలుగు వాడి అబ్బ గంటు" అని ఓ తెలుగు కవి చెప్పినట్టు కూడా గుర్తు.

*************************

మలయాళం అర్థం చేసుకోడానికి, పనికొచ్చే మలయాళంకారం లో రూల్స్ కొన్ని ఇక్కడ పెడుతున్నాను.

1. ఎక్కడ "ల" ఉన్నా, దాన్ని "ళ" గా పలకండి. (కాలేజ్ - గోళేజ్, వగైరా...)
2. "ర" అన్న అక్షరాన్ని అప్పుడప్పుడు "ఱ" తో ఖూనీ చేస్తుండండి. (జేసుదాసు, అదేదో మోహన్ బాబు సినిమాలో "నగుమోము" త్యాగరాజ కృతి పాడేప్పుడు, "నగరాజ" అనే పదాన్ని ఎలా పలుకుతాడో గమనించండీసారి)
3. అక్కడయితే పదం మధ్యలో "ఒ" వస్తే, దాన్ని సాగబీకి, "ఓ" అని పలకండి.
4. వీలున్నప్పుడు, "క చ ట త ప" లను "గ జ డ ద బ" లు గా మార్చండి.
5. మీకు తమిళం తెలుసా, అలాగయితే, బాగా జలుబు తెచ్చుకుని, తమిళ్ మాట్లాడండి. ఓ 40 శాతం మలయాళం వచ్చేసినట్టే.
6. లేదూ, ముక్కు మూసుకుని తమిళం మాట్లాడండి.
7. "అ" ను "ఎ" గా పలకండి. ఏదీ "రెవి" అనండి చూద్దాం ఓసారి. (నా పేరండీ బాబు)
8. ఎంద - ఏమి, ఎత్తరె - ఎంత, యార్- ఎవరు ...ఈ బేసిక్స్ ను విచ్చలవిడిగా ఉపయోగించుకోండి. అవతల వాడు చెప్పినది అర్థం అయినా కాకపోయినా "ఓ!" అంటుండండి.
9. వత్తు పలికేప్పుడు, వత్తు తర్వాత అక్షరం సాగబీకండి. (ఉదా : మెసేజింగ్ అనడానికి, మా ఆఫీసులో ఓ కైరళి "మస్సాజింగ్" అంటుంది. ఆ అమ్మాయి అందం చూసి ఏమనలేక వొదిలేసాను)
10. వంటలో కొబ్బరి నూనెను అధికంగా ఉపయోగించండి. నాలుక జారి, మలయాళం పలుకుతుంది.

*****************************

పైవేవీ వర్క్ అవుట్ అవకపోతే, "వేండామొరు జీవిదం " అని ఓ నమస్కారం చెప్పండి.

Friday, October 24, 2008

ప్రాక్సీ తో నా ప్రయోగాలు!

భగవంతునికీ భక్తునికీ అనుసంధానించడానికి అంబికా దర్బారు బత్తి లా, ఆఫీసులో మీకూ (మీ విహరిణికీ) బ్లాక్ చేయబడ్డ సైట్లనూ చూడ్డానికి నేను ప్రయత్నించిన విధానాలు కొన్ని ఇక్కడ. మీరు నాలాంటి బాధితులే అయితే, ఈ ప్రయత్నాలు ఉపయోగపడతాయేమో ప్రయత్నించండి.

డిస్క్లైమర్ : ఇవి నేను ఎప్పుడో యూత్ లో ప్రయత్నించిన అస్త్రాలు. ఇప్పుడు పని చేయకపోతే నన్ను బూతులు తిట్టుకోవద్దు.

ముందుగా నల్లమోతు శ్రీధర్ గారి ఈ టపా చూడండి.

నా ప్రయత్నాలు.

1. మీ కంపనీ ప్రాక్సీ సర్వరు యూనిక్స్ (లైనక్స్) సర్వరా? అందులో మీకు అకవుంట్ ఉందా? అలా అయితే ఇది ప్రయత్నించండి. ముందుగా winaxe అనే ఈ ఉపకరణాన్ని దింపుకోండి. ఇదో x-సర్వర్. అంటే, మీ సర్వరు లో ఉన్న x windows ను మీ windows లో తెచ్చుకోడానికి ఉపయోగపడే మంచి ఉపకరణం. అంటే, మీరు కేవలం telnet ద్వారా మీ సర్వర్ కు లాగిన్ అయి, నల్లగా ఓ తారు డబ్బాను తెరుచుకుని, అందులో మీరు చేయవలసిన యూనిక్స్ పనులు చేసుకోకుండా, మీ windows PC లోనే, ఓ లైనక్స్ ఎక్స్ విండోస్ ను రన్ చేయాలనుకోండి. ఈ ఉపకరణం ఉపయోగపడుతుంది.

ఉపయోగించే విధానం : దింపుకుని, సంస్థాపించుకున్న ఆ ఉపకరణాన్ని, రన్ చేయండి. ఇప్పుడు మీ లైనక్స్ సర్వర్ లో టెల్ నెట్ ద్వారా ప్రవేశించి, షెల్ ప్రామ్ట్ దగ్గర ఇలా టైపించండి.

$export display=xx.xx.xx.xx:0 (xx.xx.xx.xx ఉన్నచోట మీ pc ఐ పీ అడ్రసు).
$netscape (లేదా విహరిణి నామం) లేదూ $gnome-session అని టైపిస్తే, మొత్తం అక్కడి డస్క్ట్ టాప్ మీ pc లో లభ్యం.

ఇప్పుడు మీ pc లో మీ లైనక్స్ సర్వర్ కు సంబంధించిన విహరిణి తయారు! మామూలుగా సర్వరులో సైట్లు బ్లాక్ చేసి ఉండరు కాబట్టి, అక్కడ మీరు చూడాలనుకున్న(బ్లాక్ అయిన) సైట్లు చూసుకోవచ్చు.

2. మల్టీ ప్రాక్సీ : కొన్ని పెద్ద పెద్ద కంపనీల్లో ఒక్క సర్వరు కాక, లోడ్ బాలన్స్ అవడానికని ఒకటి కంటే ఎక్కువ సర్వర్లను వాడటం కద్దు. మీ కంపనీ లోనూ అలాంటి పరిస్థితి ఉన్నట్లయితే, మల్టీ ప్రాక్సీ అన్న ఉపకరణాన్ని గూగిలించి పట్టండి. ఇలాంటివి చాలా ఉన్నాయ్. (మల్టీ ప్రాక్సీ అనబడే పేరు తోనే ఓ ఉపకరణం ఉన్నది.అయితే, నేను దాన్ని వాడి ఎన్నో ఏళ్ళు గడిచాయ్.ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటో తెలీదు.) ఆ ఉపకరణం దింపుకుని సంస్థాపించండి. అది, డొబర్ మాన్ కుక్కలాగా మీ కంపనీ సర్వర్ లన్నిటినీ వాసన పసికట్టి ఓ లిస్ట్ తయారు చేస్తుంది. ఆ తర్వాత మీరు చూడాలనుకున్న సైట్ మీ కంపనీలో ఏ ప్రాక్సీ లో తెరుచుకునే వీలుందో, దాన్ని వెతికి, తద్వారా మీ ఆర్తి ని తీరుస్తుంది. ఇంకో సౌలభ్యం ఏమిటంటే, ఇందులో మీ pc ఐ పీ అడ్రసు ను మాస్క్ చేసుకోవచ్చు. అంటే, మీరు మీ pc కి మీ బాసు పేరో, మీకు నచ్చనోడి పేరో ఈ ఉపకరణం ద్వారా తగిలించి, వాడు బ్రవుస్ చేస్తున్నట్టూ, మీరు చాలా sincere గా పని చేసుకుంటున్నట్టు డ్రామాలాడవచ్చు. మంచి ఉపకరణం. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయ్ దీనిలో.

3. ఇంకో చిన్న అవుడియా. మీకు కొన్ని పాక్సీ లు తెలుసు http://www.vtunnel.com/, http://www.kproxy.com/ వంటివి.

అయితే ఇవి మీ ఆఫీసులో తెరుచుకోవు! ఇప్పుడో పని చేయండి. ఆ ప్రాక్సీ ల ఐ పీ అడ్రస్ (పింగ్ చేసి) కనుక్కోండి. డాస్ డబ్బా ఒకటి తెరిచి, అందులో ping http://www.kproxy.com/ అని టైప్ చేస్తే తెలిసిపోతుంది.ఇప్పుడు విహరిణి నావిగేషన్ బార్ లో ఈ ఐ పీ అడ్రస్ టైపు చేయండి. ఇది చాలా వరకు పని చేస్తుంది.

4. ఇది చాలా మందికి తెలిసిందే...చాట్ చేసుకోడానికి మీకు అవకాశం లేకపోతే, మీబో ను ఉపయోగించండి. ఇలాంటిదే మరోటి ఉండాలి, సబీర్ భాటియా ది. పేరు మరిచాను.

***************************

ఇవి కాక ఇంకా ఏమన్నా పద్ధతులు తెలుస్తే, దయచేసి నాకు తెలపండి. :-)

Thursday, October 23, 2008

మా ఇంటి మోనాలిసా

మోనాలిసా బొమ్మ చూసే వాళ్ళకు ఆమె (చిత్రం) లో ఒక్కోసారి ఒక్కో భావం ద్యోతకమవుతుందట. ఇంకో విషయం- ఆ చిత్రం గది లో యే మూల నిలబడి చూసినా చూసే వాళ్ళకు తమను చూస్తున్నట్టు ఉంటుందట.


మా 2 నెలల చంటిది (గుండు) కూడా మోనాలిసా కు ధీటుగా ఫోజు ఇచ్చింది. మా మోనాలిసా (చెబుతున్న ఊసులు) ఇక్కడ...

Wednesday, October 22, 2008

మిత్ర ఖేదం

సూర్యుడికి మేఘంలాగా, అగ్నికి నీరులాగా, పువ్వుకు తుమ్మెదలాగా,గౌతం పాలిటి దినకర్ లాగా మనకు మన జీవితాల్లో కొంతమంది స్నేహితులు తగులుతూనే ఉంటారు. అప్పుడప్పుడూ మనమూ వాళ్ళ పాలిట దినకర్ గా మారుతుంటాము.

గుండ్రాలు....గుండ్రాలు...గుండ్రాలు...

ఇంజినీరింగుకు ముందు, ఎమ్ సెట్ రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న రోజులు. ఫలితాలు రానే వచ్చాయ్. నాకూ, నా పాలిట దినకర్ అయిన అనంత్ కూ, మరో ఇద్దరు మిత్రులకూ రాంకు వచ్చింది! సృష్టిలో అప్పుడప్పుడూ అద్భుతాలు జరుగుతాయ్ అన్నది అర్థం అయింది. (ఎమ్సెట్ రాని మిత్రుల లిస్టు పెద్దది కాబట్టి ఇక్కడ చెప్పడం కుదరదు)ఎమ్సెట్ కొట్టామన్న ఆనందాన్ని మా నలుగురు, ఎమ్సెట్ తమను కొట్టిందన్న ఆక్రోశాన్ని మిగిలిన మిత్రులు సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాం. అందులో భాగంగా జీవితంలో మొట్ట మొదటి సారి ఓ "మంచి" మళయాళ చిత్ర రాజాన్ని చూడాలని నా మిత్ర బృందం నిర్ణయించింది. ఆ చిత్రం పేరు "అడవిలో అందగత్తెలు".

అందరూ మా ఇంటికి వచ్చేరు. మాది చాలా ఆర్తోడాక్స్ ఫ్యామిలీ!

"ఇలాంటి సినిమాలు చూస్తే చెడిపోతాం. అంత కక్కుర్తి తో ఈ సినిమా చూడ్డం నాకు ఇష్టం లేదు. నేను రాను"
ఉద్రేకంగా చెప్పాన్నేను.


ఓ ముప్పావు గంట తర్వాత సినిమా హాలు దగ్గరున్నాము.

అది మా వూళ్ళోని ఓ poorman's multiplex. అందులో 3 సినిమా హాళ్ళు. అందులో ఒక సినిమా హాల్లో శరత్ బాబు ప్రధాన పాత్రధారుడిగా "అయ్యప్ప స్వామి లీలలు" సినిమా ఆడుతోంది. ఆ పక్క సినిమా హాల్లో మేము వెళ్ళదలుచుకున్న సినిమా. రెండు సినిమా ల టికెట్ కవుంటర్లు, థియేటర్ తలుపుకి చెరో వైపున ఉన్నాయ్. అయ్యప్ప సినిమా కు విపరీతమయిన రద్దీ. టికెట్లు ఇవ్వడం ఇంకా ఆరంభించలేదు.

సరే అని బఠాణీలు, శనక్కాయలు షాపింగ్ చేయడానికని హాలు బయటికెళ్ళాం మేము. అక్కడ కాస్త నింపాదిగా కూర్చుని ఉన్నాం. ఇంతలో టికెట్ కవుంటరు ముందు లైటు వెలిగింది.

అంతే!

అయ్యప్ప స్వామి లీలలు సినిమా కోసం కాచుకున్న జనాభా అంతా మూకుమ్మడిగా రెండవ సినిమా హాలు టికెట్ కవుంటర్ వైపు పరిగెత్తుకు రాసాగారు. మేము త్వరగా స్పందించి, కవుంటర్ వైపు పరిగెట్టాము. ఎలాగోలా మా బృందం అందరం క్యూలో నిలబడి టికెట్లు తీసుకున్నాం. మా మిత్ర బృందంలో అనంత్ (దినకర్) మాత్రం లేడు!

బాక్ గ్రవుండ్ లో జరిగిందిదీ! మేము శనక్కాయలు తింటుండగా, మా వాడు అయ్యప్ప స్వామి సినిమా క్యూలో వాళ్ళ అక్కయ్య ఫ్రెండ్ నిలబడి ఉండటం చూసాడు. మాతో "ఇప్పుడే వస్తా" అని చెప్పి పక్కకెళ్ళాడు. నేనూ నా మిత్ర బృందంతో కలిసి పరుగులు తీస్తున్నప్పుడు వాడి అక్కయ్య ఫ్రెండ్ నన్ను చూసింది! (ఆమె ఇల్లు మా వాడి ఇంటి పక్కనే. నేను వాడి ఇంటికి అప్పుడప్పుడూ వెళుతుంటా కాబట్టి, నన్ను ఆమె గుర్తు పట్టింది). వాడు మాత్రం ఆమె కనుమరుగయే వరకు ఎదురు చూసి, తర్వాత మా దగ్గరకు వచ్చాడు.

సినిమా అంతా భయంకరమైన సస్పెన్స్త్ తో , ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలమధ్య, అడవిలో ఉత్కంఠ భరితంగా గడిచింది.ఆ సినిమా కు సెన్సార్ సర్టిఫికట్ ఇచ్చిన వాడికి ఇంగ్లీష్ అక్షరాలు సరిగా రానట్లుంది. "U" అని రాయాల్సిన చోట "A" అని రాసాడు.

మరుసటి రోజు వాడి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అక్క నా వైపు కొంచెం నిరసనగా, అనుమానంగా చూసింది. ఆ పయోముఖ సారా కుంభం గాడు అప్పటికే తప్పును నా మీదకు మళ్ళించి ఉన్నాడు. నాకు కొంచెంగా అర్థమయింది విషయం. ఎందుకంటే, మొట్ట మొదటి సారి జీవితం లో (so called) తప్పు చేసేం. ఎవరు అనుమానించినా అందుకేనేమో అని మనసులో ఓ అభద్రతా భావం.

ఆవిడ అడగనే అడిగింది నన్ను,వాణ్ణి కలిపి, "ఏరా, ఇంజినీరింగు సీటు వస్తూనే కొమ్ములొచ్చాయా? వెధవ పనులు, మీరూను" అంటూ. (నిజానికి వాళ్ళింట్లో అందరికీ, నామీద మంచి నమ్మకం, రవి మంచి బాలుడు అని.)

వాడు చెప్పక ముందే నేను చెప్పేను, "లేదక్కా, అయ్యప్ప సినిమాకని వెళ్ళాము. అక్కడ క్యూలో అందరు ఇంకో సినిమా వైపు పరిగెత్తుతుంటే, మేము పరుగెత్తి టికెట్లు కొన్నాం అంతే, హాలు లోపల చూస్తే, ఈ దరిద్రం సినిమా ఉండె. మాకసలు తెలీనే తెలీదు."

ఆమె నా మాట నమ్మినట్టే కనబడింది. (నా లాంటి అమాయకుడు అలాంటి తప్పులు చేయడని ఆమె గట్టి నమ్మకం కాబట్టి.)అంతా అయ్యప్ప లీల!!!

*********************************

వాణ్ణి దెబ్బ కొట్టే అవకాశం మరో సంవత్సరం తర్వాత నాకు వచ్చింది. ఇంజినీరింగు మొదటి యేడు అచ్చు "హాపీ డేస్" సినిమాలోలా గడిపేం. ఆ యేడు గడవగానే, నాకు రొస్టు సివిల్ ఇంజినీరింగు నుండీ తొట్టి మెకానికల్ కు, వాడికి రొస్టు సివిల్ నుండీ తోలు కెమికల్ కు ప్రమోషన్లు లభించాయ్. రెండవ ఏడు మా ఇద్దరికీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్ కామను. మా ఇద్దరికీ నచ్చని ఒకే ఒక సబ్జెక్ట్ అది.

ఆఖరు ఇంటర్నల్ పరీక్షలు వచ్చాయ్. మామూలుగానే పరీక్షలను ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. సరిగ్గా ఆ సమయంలో, నాకు (అవుట్ అయిన) ప్రశ్నాపత్రం ఓ మిత్రుడి ద్వారా దొరికింది. అప్పుడు...నాకో అద్భుతమైన అవుడియా వచ్చింది. ఎలాగు ప్రశ్నాపత్రం అందరికీ దొరుకుతుంది. అంతలోనే మా వాణ్ణి ఓ చిన్న ఆటాడించాలి! వెంటనే ఆ ప్రశ్నా పత్రానికి ఇంకో ఇంకో 5,6 ప్రశ్నలు (కొన్నిటికి తప్పుడు సమాధానాలు) కలిపి, తన వద్దకు వెళ్ళాను.

"రేయ్, రేపు జరుగబోయే పరీక్ష ప్రశ్నాపత్రం ఇది. ఏం చేస్తావో తెలీదు. మనం సాధ్యమైనంత త్వరగా అన్నిటికీ ఆన్సర్లు పట్టాలి. రాత్రిలోగా ప్రిపేర్ అవాలి" చెప్పాను.

ఆ రోజు రాత్రికి వాడో పేపర్ తీసుకొచ్చాడు. (బాక్ గ్రవుండ్ లో...వాడూ నన్ను దెబ్బ కొట్టాలని, కొన్ని తప్పుడు సమాధానాలు రాసుకుని తీసుకొచ్చేడు) సరే ఎలాగో మొత్తం ప్రిపేర్ అయాం. తర్వాతి పరీక్షలో ఇద్దరం ఫెయిలు!ఆ ర్వాత ఫైనల్ పరీక్షలోనూ విజయ వంతంగా ఫెయిలయాం ఇద్దరూనూ.

ఇక్కడో విషయం. అప్పట్లో మా యూనివర్సిటీ JNTU లో కొన్ని (3,4) సబ్జెక్ట్లు వదులుకున్నా డిగ్రీ రావడానికి ఢోకా ఉండదు. క్రెడిట్ సిస్టం అంటారు దాన్ని. అందువల్ల మాకు ఇబ్బంది లేదు.

అయితే ఇంటి దగ్గర ఊరుకోరు కదా. మా నాన్నకేమో వాడి మీద, వాడి నాన్న కేమో నా మీద నమ్మకం. ఇద్దరం ఫెయిలయ్యాం అన్న విషయం ఎలాగో ఇంట తెలిసింది. మేమిద్దరం మాట్లాడుకుని ఓ ప్లాను వేసుకున్నాం. వాళ్ళ నాన్నను నేను, మా నాన్న ను వాడు కన్విన్స్ చేసేట్టుగా.

అందులో భాగంగా ,అంకుల్ నా దగ్గరకు రాగానే నేను చెప్పాను. "అంకుల్, మా యూనివర్సిటీ పద్దతి చాలా ఆధునికంగా ఉంటుంది. విద్యార్థికి తనకు నచ్చిన సబ్జెక్ట్ మీద ఆసక్తి కలిగించడం వాళ్ళ ప్రధాన ఉద్దేశ్యం. అందుకనే ఒకట్రెండు పరీక్షలలో ఫెయిలయినా పట్టించుకోదు. నిజానికి ఫెయిలవాలి కూడా. అలా కాకపోతే, వాళ్ళు మా మీద చర్య కూడా తీసుకుంటారు."

"ఇదేం యూనివర్సిటీ రా, పరీక్షల్లో ఫెయిలవమని చెబుతుంది. ఎక్కడా విన్లే" అన్నాడాయన.

"అదే అంకుల్, మా యూనివర్సిటీ గొప్పతనం. అందుకే ఇందులో సీటు రావడం చాలా కష్టం" చెప్పాను నేను.

మా నాన్న వాడి దగ్గరకెళ్ళాడు అనుకున్నట్టుగానే. వాడు అదో గొప్ప విషయంలా మా నాన్నకు సర్ది చెప్పేడు.

శుభం.

ఆ తర్వాత ఎప్పుడైనా వాడు నా మీద, నేను వాడి మీదా కత్తులు నూరాలని ప్రయత్నించినా ఇద్దరికీ చెడుపు చేస్తుండటంతో, అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు తనెక్కడో, ఏ దేశానికి పారిపొయాడో తెలీదు!

********************


Friday, October 17, 2008

తెలుగులో "ఇవ" అర్థములు!

ఓ అందమైన సీస పద్యం చదవడం తటస్థించింది నిన్న.

మామూలుగా కనిపిస్తూనే ఎన్నో విషయాలు తెలిపిందా పద్యం, దానిలో ఉటంకించిన వివరాలూను. ఇంకెందుకు ఆలస్యం., చిత్తగించండి.

సింధు బల్లహు రీతి, శ్రీపతి పండితు
మరియాద, ధూపద మాచిదేవు
నట్లు,మహాకాళుననువున, నల్ల క
ల్కద బ్రహ్మ ఠేవ, గక్కయ విధమున,
శూలద బ్రహ్మయ్య చొప్పున, బిబ్బ బా
చన లీల, వీర నాచాంకు పోల్కి,
కదిరె రెమ్మయగారి కైవడి, దెలుగేశు
మసణయ్య చందాన,మాదిరాజు

కరణి, మోళిగ మారయ్య గతి, దెలుంగు
జొమ్మనార్యుని వడువున, సురియ చౌడు
పగిది, బసవేశ్వరుని మాడ్కి భక్తి యుక్తి
శంభు బూజించి బ్రదుకు రాజన్య చంద్ర!


పై పద్యంలో 16 మంది ప్రముఖ శివ భక్తులు. వారందరి లాగ, రాజా, నీవూ శంభుని పూజించి తరించు అని భావం.

ఆ 16 మంది కథా కమామీషు ఇలా...

1. సింధు బల్లహుడు : ఇతణ్ణే బల్లాణ రాజు, బల్లవ రాయడు అంటారుట.శివుడు జంగముడై, ఈయన వద్దకు వచ్చి, ఓ వేశ్యను యాచించాడుట. ఈయన భార్యను అతని వద్దకు పంపాడుట. శివుడు ఆమెను సమీపించగానే శిశువు గామారాడుట.
2. శ్రీపతి పండితుడు : ఇంద్రకీలాద్రి శాసనంలో ఈయన ప్రస్తావన ఉందిట. ఈయన తన ఉత్తరీయంలో నిప్పులు మూటగట్టేడుట. ఆంధ్ర దేశంలో శైవం వ్యాప్తి చేసిన ముగ్గురిలో ఒకడు. (ఈన పేరు వినగానే మనకు బాగా పరిచయం ఉన్న ఒకాయన పేరు గుర్తుకు వచ్చి వుండాలి. శివునికి తేనె తో ఎన్నో యేళ్ళు అభిషేకం చేస్తే, తీయని స్వరం వస్తుందిట. శ్రీపతి పండితారాధ్యుల బాలు కూడా అదే పని చేసి ఉంటాడు ముందు జన్మల్లో)
3. ధూపద మాచిదేవుడు : ధూపం ఇచ్చేవాడు ధూపదుడు. బసవేశ్వరుని సమకాలికుడు.
4. మహాకాళయ్య : శివుడికి తల అర్పించి తిరిగి తలను పొందిన భక్తుడు.
5. కల్కద బ్రహ్మయ్య : మరో బసవేశ్వరుని సమకాలికుడైన భక్తుడు.
6. ఇంద్రజాలం చేసే కక్కయ్య
7. శూలద బ్రహ్మయ్య : శూలమును ధరించిన ఓ భక్తుడు
8. బిబ్బ బాచన : శివ భక్తుల ఇళ్ళలో బిచ్చమెత్తి, అన్నార్తులకు ప్రసాదించే వాడట ఈ శివ భక్తుడు. అప్పటి బ్రాహ్మణులు ఆయన బండిని నిరోధించాలని విఫలమయ్యేరుట.
9. వీర నాచయ : వీర నాచాంకుడనే మరో భక్తుడు
10. కదిరె రెమ్మయ : కోమాలో వెళ్ళిన ఓ వ్యక్తికి వైద్యం చేసి బతికించినట్లు చెప్పుకునే ఓ పల్లీయుడైన శివ భక్తుడు.
11.తెలుగేశు మసణయ్య: మసణము (శ్మశానము)లో నివశించిన ఓ భక్తుడు
12. మాదిరాజు : మరో భక్తుడు
13 మోళిగ మారయ్య : కట్టెలమ్ముకునే ఓ నిరుపేద భక్తుడు. ఈయనకు శివుడు సువఋనాలను ప్రసాదిస్తే, వాటిని పంచి తిరిగి నిరుపేదగా మిగిలి పొయేడుట.
14. తెలుగు జొమ్మయ్య :వేటగాడైన ఓ శివ భక్తుడు (తిన్నడంటే ఈయన కాదు)
15. సురియ చౌడయ్య :మరో ప్రసిద్ధ శివభక్తుడు.
16. బసవేశ్వరుడు : నంది అవతారుడని చెప్పుకునే, వీర శైవానికి ఆద్యుడైన మహా భక్తుడు. లింగాయతులనబడే వారు, ఈయనను పూజిస్తారు. పాల్కురికి సోమనాథుడి బసవేశ్వర చరిత్ర ఓ గొప్ప గ్రంథం.


బాగానే ఉంది, ఇంతకూ సంగతేంటి అంటారా?

తెలుగు లో "వలె" అనే అర్థం వచ్చే పదాలు మొత్తం 30 ఉన్నయి(ట).అవి- రీతి, మరియాద, అట్లు, అనువున, ఠేవ, విధమున, చొప్పున, లీల, పోల్కి (పోలె), కైవడి, చందాన, కరణి, గతి, వడువున, పగిది, మాడ్కి, లాగు, భాతి, భంగి, గరిమ, రేఖ, భావము, సోయగము, చెలువు, గారవము, వెరవు, సరణి, రమణ, క్రియ, తెఱగు

అందులో ఏకంగా 16 పదాలను ఇందులో ప్రయోగించడం ఓ యెత్తయితే, పేర్లను సీసంలో చక్కగా ఇముడ్చి చేసిన చమత్కారం ఇంకొకటి. (పేర్లను పద్యంలో ఇముడ్చటం కష్టం అని విన్నాను, అయితే నాకు ఉపజాతి పద్యాల గురించి అంతగా తెలియదు. పొద్దు లో రాఘవ గారి వ్యాసాలు ఇంకా పూర్తిగా చదవలేదు.)

ఇంతకూ ఈ పద్యం రాసినాయన ఎవరు అంటారా?

ఊహించండి.

2 క్లూలు.
1. ఈ పద్యం ఓ గ్రంథంలోనిది. ఆ గ్రంథం పేరు ఓ అచ్చుతో మొదలవుతుంది.
2. ఈయన ఓ ప్రబంధ కర్త (పంచ ప్రబంధాల్లో ఓ ప్రబంధం ఈయన కృతి)

(అందంగా కందాలు చెబుతున్న మన బ్లాగు సోదరులకు ఈఇవార్థములు ఉపయోగపడుందేమో అని ఓ ఆశ., అలాగే ఓ అనుమానం. "మాదిరిగా" అని మనం వ్యవహార భాషలో వాడతాం. ఆ పదం ఈ లిస్టులో లేదెందుకో?ఎవరికైనా తెలుస్తే చెప్పగలరు.)

**************

Sunday, October 12, 2008

కాళిదాసు శబ్దాలంకార చమత్కృతి!

ఉపమా కాళిదాసు, ఉత్ప్రేఖ్య కాళిదాసుల గురించి ఇదివరకు (కొన్ని నెలల క్రితం) రెండు మూడు టపాలు వచ్చాయి. ఇప్పుడు కాళిదాసు శబ్దాలంకార చమత్కృతి చూద్దాం.

యావత్తోయధరా ధరాధర ధరా ధారాధర శ్రీధరా
యావచ్చారు చచారు చారు చమరం చామీకరం చామరమ్
యావద్రావణ రామ రామ రమణం రామాయణం శ్రూయతే
తావత్తే భువి భోగ భోగ భువనం భోగాయ భూయాద్విభో

ఈ పద్యం లోని శబ్ద చమత్కారం ఎంత అందంగా ఉందో గమనించండి. ఇలా ఒకే రకంగా ధ్వనించే శబ్దాల ను ఆవృత్తిలో ప్రయోగించడమే యమకాలంకారం లేదా వృత్త్యనుప్రాస అంటారు(ట).

ఈ పద్యానికి అర్థం ఇది.(తప్పులుంటే నిర్మొహమాటంగా సరిదిద్దగలరు)

విభో : ఓ రాజా,తోయధరాః : మేఘాలు,ధరా : భూమి,ధరాధరః : పర్వతాలు,ధారాధరః : భూమిని మోస్తున్న ,శ్రీధరా: ఆది శేషుడు,యావత్ : ఎంతవరకు ఉంటాయో,చారు : అందమైన,చచారు : సంచరించడం అనే స్వభావం ఉన్న,చమరం : చామరీ మృగాలు,చామీకరం చ: సువర్ణ గిరి (మేరు పర్వతము),అమరం : జీవించి, యావత్ : ఎంతవరకు ఉంటాయో,రావణ రామ రామ రమణం : రావణుడు, రాముడు (వంటి పాత్రలతో) వీనులకింపైన,రామాయణం శ్రూయతే : రామాయణం వినబడుతుందో,తావత్ : అంతవరకు,భోగ భోగ భువనం : సకల భొగాలకు నిలయమైన,భువి : పృథ్వి,తే భోగాయ : నీ భోగాల కోసంభూయాత్ : ఉండు గాక!

పై శ్లోకం కాళిదాసు చెప్పిన చాటువు (ట).

ఈ అలంకారం హిందూ స్తోత్రాల్లో కూడా చాలా చోట్ల కనబడుతుంది. నాకు చప్పున స్ఫురించిన ఓ (శివతాండవ) స్తోత్రం లోని శ్లోకం ఇది.

జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసత్
ద్వినిర్గమ క్రమ స్ఫురత్కరాళ ఫాల హవ్యవాట్
ధిమిద్ధిమిద్ధిమి ధ్వనన్ మృదంగ తుంగ మంగళ
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శ్శివః

పై స్తోత్రం లో ఇంకో విశేషం (నాకు కనిపించినది) ఏమంటే, సంస్కృతంలో ధాతువు (క్రియా వాచకం) తో ఆరంభించడం గొప్ప వ్యాకరణ పాండిత్యానికి ఋజువు(ట). పై పద్యం "జయతు" తో ఆరంభించడం లో అది కనిపిస్తుంది.

- ఈ టపా రాసేప్పుడు దీనితో పాటుగా ఇంకో టపా రాద్దామని బయలు దేరి, తొందరలో ఈ శబ్దాలంకారాన్ని రూపకం (యమకం అని ఉండాలి) అని చెప్పడం జరిగింది. ఇది చాలా అల్పమైన తప్పిదం. తర్వాత చాలా సిగ్గేసింది. సవరించిన కొత్తపాళీ, చంద్రమోహన్ గార్లకు కృతఙ్ఞతలు.

Saturday, October 11, 2008

ఓ సిగరెట్టు కథ

వచ్చే జన్మలో నేను మనిషిగా పుట్టకపోవచ్చునేమో కానీ, దున్నపోతుగా మాత్రం పుట్టను. ఎందుకంటే, నేనూ సిగరెట్టు తాగాను! గిరీశం శాపనార్థం నాకు తగలదు!

ఖగపతి అమృతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగచెట్టై జన్మించెను
పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్

సరే, నా మొదటి సిగరెట్టు కాలేజీ చదువు ముగించి, పూనా లో ఉద్యోగం చూస్తున్న రోజుల్లో మొదలయింది. అప్పట్లో పూనా లో "అల్కా" అని ఓ సినిమా థియేటరు. సెలవు రోజుల్లో అక్కడ చెప్పనవసరమే లేదు. రంగు రంగుల సీతాకోక చిలుకల మయం. అయితే అపశృతి ఏమంటే, అమ్మాయిలందరు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తోనూ, వాళ్ళ కాలేజీ మేట్స్ తోనూ సినిమాలకు రావడం. నాలాంటి జిడ్డు ముఖాలను అస్సలు పట్టించుకోకపోవటం.

ఎలా...? వాళ్ళ దృష్టిలో పట్టం ఎలా?

ఆ దురాశే నా మొదటి సిగరెట్టు కు హేతువయింది. నేనూ నా మిత్ర బృందం ఓ మూల నిలబడి స్టవిలుగా ఒకే సిగరెట్టు పంచుకుని తాగేము. అమ్మాయిలు రాలే కానీ దగ్గొచ్చింది. ఆ తర్వాత నోరంతా చేదు వాసన..అప్పుడప్పుడూ మా ఆశ చావక మా మిత్ర బృందం సభ్యులు, అలా ఒకే సిగరెట్ పంచుకుని మా వంతు ప్రయత్నాలు చేశాము. అయితే,ఒకే సిగరెట్ అలా పంచుకుని తాగడం వల్ల డబ్బు ఆదా చేయగలిగామని కాస్త ఆత్మ తృప్తి మాత్రం మిగిలింది.మా లో బడ్జెట్ ప్రేమ వ్యవహారాలు మాత్రం ఫలించలేదు.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. నా వ్యర్థ ప్రయత్నాలను చూసి, ఎగతాళి చేయడం, నలుగురు చూసి నవ్వుకోవడం వంటివి అక్కడి అమ్మాయిలు చేసినట్టు కనబడలేదు. ఆ తర్వాత ఎంతో కాలానికి, నాకు ఆఫీసులో ఇద్దరు ముంబయి అమ్మాయిలు పరిచయమయ్యారు. ఆ అమ్మాయిలు నా టీమ్ లో పనిచేయడానికి ముంబయి IIT నుండీ వచ్చిన వాళ్ళు. (అన్నట్టు నేనో భయంకరమైన మొహమాటం గాణ్ణి లెండి) వాళ్ళతో కాస్త పరిచయం అయిన తర్వాత అర్థమయింది, వాళ్ళ కు అబ్బాయిలు చేసే కోతి చేస్టల గురించి చాలా వీజీగా తెలిసిపోతుంది అని. (అప్పటికి నేనింకా "యూత్" గానే ఉన్నాను). వాళ్ళకో సారి నేను చేసిన వ్యర్థ ప్రయత్నాల గురించి చెప్పేను. పడీ పడీ నవ్వారు. ఆ అమ్మాయిల్లో ఓ అమ్మాయి నన్ను చాలా లైక్ చేసేది(ట). ఇప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ భర్తలతో, పిల్లలతో కాపురాలు చేసుకుంటున్నారు. నాకు మంచి ఫ్రెండ్స్ ఇప్పటికీ....ఓర్కుట్లో!

సరే..

సిగరెట్టు వెనుక నా ఉద్దేశ్యం సిగరెట్టు కాదు కనుక, నాకు అది అలవాటవలేదు. పూనాలోనే కొన్ని రోజులలా గడిచిన తర్వాత, ఉద్యోగం మారాను. ఆ కొత్త ఉద్యోగం లో, ఆఫీసులో ఓ అందమైన మరాఠీ రెసెప్షనిస్టు. తొలి చూపులోనే ప్రేమ మొదలయింది. ఏవేవో ఊహలు, ఎక్కడికో వెళ్ళిపొయే వాణ్ణి. ఆ ఊహల్లో ఓ ఊహ, ఎప్పుడో ఓ సిగరెట్టు తాగినా అది తనకు ద్రోహమే కదా అనేది ఒకటి. ఆ విధంగా సిగరెట్టు ఆలోచనలే దూరమయాయ్. కొసమెరుపు ఏమంటే, ఆ అమ్మాయి స్టయిల్ గా సిగరెట్ తాగే అప్పటి నా కొలీగ్ ని ఒకణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంది!

అప్పుడలా వదిలేసిన సిగరెట్టు పొగ, మళ్ళీ 8 ఏళ్ళ తర్వాత రాజుకుంది. ఈ సారీ అమ్మాయే, అందులోనూ పూనా అమ్మాయే కారణం. ఇక్కడ సాఫ్ట్ వేర్ సంస్థలో నేను పని చేసిన మొదటి ప్రాజెక్ట్ విజయ వంతంగా నాశనం అవడంతో, నన్ను వేరే టీమ్ లోకి మార్చారు. ఆ టీములో చేరిన తర్వాత మొదటి మీటింగు. నా ఎదురుగా ఓ అమ్మాయి వచ్చి కూర్చుంది. నా జీవితంలో ఓ క్షణం నాకు కాకుండా పోయింది. అంత అందమైన కళ్ళు నేనంతవరకు హీరోవిను భానుప్రియ లో మాత్రమే చూసాను.ఆ అమ్మాయి నా పక్క సీట్ అవడంతో మాటలు కలిపేను. ఆ అమ్మాయి తెలివయిందేమో, మొదటి రోజే చెప్పేసింది, తనకు పెళ్ళయినట్టుగా. సిగరెట్ మళ్ళీ రాజుకుందిక్కడ!

అదో పెద్ద బాధాకరమైన విషయం గా మారలేదు.

అయితే ఎప్పుడైనా (ఏ రెండు మూడు నెలలకో ఓ సారి) అలా ఓ సిగరెట్ తాగాలనిపిస్తే, తాగడంలో ఇబ్బంది లేదు. ఎలాగూ అది నాకు అలవాటు కాదు కాబట్టి.

ఓ ఏడాది క్రితం మాత్రం, సిగరెట్ నాకో చిన్న అనుభూతిని మిగిల్చింది. ఉద్యోగ రీత్యా, ఇండోనెషియా వెళ్ళాను ఆన్సైట్ కి. అక్కడ మా (కంపనీ) డ్రయివర్ మాకు బాగా నచ్చేడు. తన పేరు "ఉన్ తుంగ్". అంటే, వాళ్ళ భాషలో "అదృష్టం". అతను చాలా పేద వాడు. భారతీయులంటే చాలా అభిమానం తనకు. తను స్వయంగా షారుఖ్ ఖాన్ కి పంఖా. షారుఖ్ ఖాన్ సినిమాలు అక్కడ వాళ్ళ భాషలో అనువదించినవి సినిమా హాళ్ళలో విడువకుండా చూస్తాడట తను. అక్కడ కంపనీ రూల్స్ ప్రకారం మాకు ఆఫీసు టైములో తప్ప మిగతా సమయాల్లో కారు వాడుకునే అవకాశం లేదు. అయితే, ఈ డ్రయివర్ మాత్రం మా కోసం, అప్పుడైనా వచ్చి సహాయం చేసే వాడు. మేమూ తనకు సహాయం చేసే వాళ్ళం. అక్కడ నుండీ తిరిగి వస్తూ, తనకు ఓ బహుమతిగా ఓ మొబయిల్ ఫోన్ ఇచ్చేము. తనూ మాకు ఏదైనా ఇవ్వాలనుకున్నాడు. అయితే పేదవాడు , పైగా చదువుకోని వాడు కదా..చివరకు అక్కడ వాళ్ళ దేశం లో తయారయే "బుదం గరం" అనే ఓ సిగరెట్ పాక్ ఇచ్చేడు మాకందరికీ. ఆ సిగరెట్ లో ఉన్న ప్రత్యేకత , కాస్త చక్కెర లా తియ్యగా ఉన్న టేస్ట్.

ఆ చక్కెర తీపి, సిగరెట్ దా, ఆ పేదవాడి మనసులో మాపట్ల ఉన్న అభిమానానిదా? ఆ చిన్ని అనుభూతి మరువలేనిది.

Friday, October 3, 2008

ఒక(ప్పటి) ఊపున్న పాట !!

ఈ మధ్య ఆఫీసులో పనెక్కువై, యాహూ పాత మెయిలు చూస్తుంటే, నా మొట్టమొదటి ప్రచురణ కనబడింది. అది చూస్తూనే గుండేలో మరీ కోటి కాకపోయినా, ఓ వెయ్యి వీణలు మోగాయ్. ఇక భరించలేక ఇక్కడ పెడుతున్నాను. అదో పేరడీ పాట.

మృదులాంత్రం (జావా) ఊపులో ఉన్నప్పుడు ౨౦౦౦ లో, మృదులాంత్రం లో అడుగుపెట్టిన, అడుగుపెట్టదలుచుకున్న, ఔత్సాహికులు, పాడుకోదగిన ఊపున్న పాట అది.

అనగనగా ఓ యూఎస్ వుంది
యూఎస్ లోనే ఐటి వుంది
ఐటి వెనకే డాలర్ వుంది
డాలర్ జనులను కదిలించింది
కదిలే జనతా పరుగెత్తింది
పరుగే ప్రైవేట్ కోర్సయ్యింది
ప్రైవేట్ కోర్సే చెసిన జనులా
హెచ్1 వేట మొదలయ్యింది

బాడీషాపర్ నువ్వే కావాలి
నా బాడీషాపర్ నవ్వే కావాలి.
డాలర్ల పంటే పండాలి
యూఎస్ డాలర్ల మోతే మోగాలి.

సాఫ్ట్వేర్ కొమ్మలలోనా ఒ జావా, ఖవ్వాలి పాడి కచ్చ్చేరిచేసే వెళల్లో,
సర్వర్ గుమ్మంలోనా సరదాగా ఒక సర్వ్లెట్ రాసి,హోస్టింగు చేసే వేళల్లో,
కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా, కవ్వింతగా

ఆఆ ఆ ఆఅ ఆఆ ఆఆఅ....ఆఆఆఆఆ ఆ

నీ చెలిమే చిటికేసి, నను పిలిచే నీకేసి
నువు ప్రాసెస్ చేసే ,హెచ్1 కోసం నేనొచ్చేసా, పరుగులుతీసి !! (బాడీషాపర్ నువ్వే..)

సిలికాన్ వేలీ చుట్టు , తిరగాలి అనుకుంటూ వూహవూరేగే వెన్నెల దారుల్లో,
నేనున్నా రమ్మంటూ, ఒ ఎంప్లాయర్, గాలాన్నే వేసే వేళల్లో,

నూరేళ్ళకీ సరిపోయె డాలర్స్నీ పండించగా,
ఆ తలపులు చిగురించి , మనసులు కదిలించీ

మరింత మంది సాఫ్ట్వేర్ జనులను యూఎస్ వైపుకు లాగేవేళ,
బాడీషాపర్ నువ్వే కావాలినా బాడీషాపర్ నవ్వే కావాలి...


అనగనగా...

********************************

అప్పుట్లో నేనూ యూఎస్ కోసమ్ ఎగబడ్డాను. అయితే, నా పేపర్స్ రాగానే, అక్కడ యూఎస్ లో భవానాలు కూలాయి.
సరే, కేవలం పేపర్స్ వస్తేనే ఇంత జరిగితే, అక్కడికి వెళితే ఏం జరుగుతుందో అని, లోకకల్యాణార్థం విరమించుకున్నా.

*******************************

ఆ పై పేరడీ అప్పట్లో indiainfo.com అన్న తెలుగు వెబ్ సైట్ లో ప్రచురించబడింది.

Hello Mr.Ravi,We are delighted by your parody song of Nuvve Kavali. And, as you suggested,we put it on the net.http://telugu.indiainfo.com/cinema/slideshow/index.html. Read this andenjoy. Keep sending funny things.All the best,Regards,Yours sincerely,JalapathyTeam memberhttp://telugu.indiainfo.com

(ఇది నా 50 వ టపా. రాయడమే గొప్ప అనుకునే నాకు ఇంత ప్రోత్సాహించీ, ఇన్ని టపాలు రాయించిన బ్లాగ్మిత్రులకు వేల వేల కృతఙ్ఞతలు).