Sunday, November 22, 2009

ఊరికి పోదాం ...

రోజూ చూస్తున్న పూలు, చెట్లూ, మనుషులూ ఒక్కోసారి కొత్తగా కొంగ్రొత్తగా కనబడితే ఆ అనుభూతి ఎలాంటిది? నా వరకూ ఆ అనుభూతి, ఊరికి వెళ్ళేప్పుడు, ఊరిలో మన వారిని కలుసుకోబోతున్నాం అన్న ఆనందం లాంటిది. జీవితం వారాంతపు సంకెళ్ళలో కట్టివేయబడిన ఓ సగటు నిర్భాగ్యోద్యోగిని నేను. అదుగో ఆ వారాంతం ఒకింత ముందుగా ఒచ్చింది మొన్న శుక్రవారం. ఊరికే రాలేదండోయ్. ఓ అర్ధ రోజు సెలవును మింగేస్తూ వచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం బయలుదేరాను మా ఊరికి.

అనుభూతిపరంగా రైలు ప్రయాణంలో ఉన్నంత సుఖం బస్సు ప్రయాణంలో ఉండదు. రైలు తలుపు దగ్గర నుంచుని, ఆ గాలిలో చెట్లు పరుగెత్తుకుని వెనక్కెళ్ళి పోతుంటే, ఓ మేఘం చాలా దూరం వరకూ వచ్చి, దూరమైన స్నేహితుడిలా వీడుకోలు పలుకుతూ వెళ్ళిపోతుంటే అబ్బ! ఎంత హాయిగా ఉంటుంది! ఆ పక్కన జామకాయలమ్మి, స్టేషన్ లో దొరికే తినుబండారాలు, అవి తింటూ కూర్చుంటే, రైలు బయలుదేరిపోతుందనే ఆదుర్దా, మన కూపేలో అందమైన అమ్మాయి ఎక్కినప్పుడు "ఆహా!" అన్న ఓ చిన్ని ఆనందం, అంతలోనే ఆ అమ్మాయి పుస్తకంలో కూరుకుపోతే ఆవిరయిపోయిన ఆ అనుభూతి, చిన్నపిల్లాడు వాళ్ళమ్మను అడిగే "ఇంటెలిజెంట్ ప్రశ్నలూ" ..రైలు ప్రయాణం ఓ అందమైన లఘు కావ్యం, ఒక్క "లేటు" అన్న ముద్రారాక్షసం తక్క.

అయితే, బస్సు ప్రయాణం కూడా ఇందుకు తీసిపోదు ఒక్కోసారి. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడూ, వర్షం వెలిసినప్పుడూ, ఆ తర్వాత వచ్చే ఇంద్రధనుస్సు "హాయ్" మన్నప్పుడూ!

మొదటికొస్తాను. బస్సు నేషనల్ హైవే 7 మీదుగా వెళుతూంది. బెంగళూరు దాటింది. వర్షం పడసాగింది. మెత్తగా జారిపోతున్న బస్సు! సుతిమెత్తగా కిటికీ పక్కనుంచీ కొడుతున్న వాన చినుకులు! (ఏదో యద్దనపూడి నవలలో అనుకుంటా, ఆరంభం అట్టాగే ఉంటది). ఇంతలో .... ఏజోల్డు నోస్టాల్జియా! తగుదునమ్మా అని ఒచ్చేసింది. అదేనండి, శనగపిండి ప్రొడక్షన్స్ వారి పకోడీలు! వర్షం పడుతూంటే పకోడీలు తినని వాడు పశువై పుట్టున్! ఇది గిరీశం లాంటోడికి కూడా ట్రివియల్ మాటరు. అందుకే ఎక్కడా చెప్పలే! సరే బస్సు హైవే నుండి పక్కకు మట్టి రోడ్డులోకి, అప్పుడే కొత్తగా నడకలు నేర్చుకున్నట్టు ఊగుతూ కొంతదూరం నడిచి, ఓ హోటలు అలియాస్ ఢాబా దగ్గరాగింది. ఆ హోటలు వాడికున్నంత సామాజిక స్పృహ తెలుగు బ్లాగర్లలో కూడా లేదు. వేడి వేడి పకోడీలు, చపాతీలూ, దోసెలూ, చిక్కటి కాఫీ, నీళ్ళటి అల్లం టీ, ఇవీ అక్కడ మెనూ కార్డు లో ఐటమ్సు. మెను కార్డు బూర్జువా వ్యవస్థ కు ప్రతిరూపమనేమో అక్కడ పెట్టలేదు. దానికి ముందు వర్షను వాయిస్ మెనూ కార్డే అక్కడ నడుస్తూంది. ఆ వర్షంలో పకోడీ తింటూ, మధ్య మధ్యలో నీళ్ళటి అల్లం టీ తాగుతున్నప్పుడు - ఆహా! కరడుగట్టిన నాస్తికులకు, గతి తార్కిక భౌతిక వాదులకు కూడా కాసేపు దేముడు కనబడతాడు. అది ఆ హోటలు వాడి శాపం లాంటి వరం. అదంతే!

తిరిగి బస్సు రోడ్డునపడింది. (క్షమించాలి. మామూలుగానే అన్నా, విమర్శనాత్మకంగా కాదు!) ఈ సారి వర్షం వెలసింది. అయితే ఈ సారి రివ్వున, చల్లటి గాలి కొట్టసాగింది. ప్రేమలో పడ్డవాళ్ళకు ఆకాశం మామూలుగాకన్నా, ఎక్కువగా నీలంగా కనిపిస్తుందట. సైన్సు కేవలం వర్ణాంధత్వం (కలరు బ్లయిండ్ నెస్సు) గురించే చెబుతుంది కానీ, ఈ కలరు ఎన్రిచ్ మెంటు గురించి మాట్లాడదు. నాకు అట్లాగే కనిపించింది బయట. ఎందుకో మరి. (మనలో మాట. నేను ప్రేమలో చాలా సార్లు పడ్డాను కానీ, పడి దెబ్బలు తగిలించుకోలే. కనీసం మోకాళ్ళు దోక్కుపోలే.నాది విశ్వజనీనమైన ప్రేమో, విశ్వస్త ప్రేమో నాకే తెలీదు). హైవే బ్లూస్ ను మీరూ చూస్తారా?
మీకో గుండెలు పిండేసే నిజం చెప్పనా? ఆ ఫోటోలు రాయలసీమ, అందునా కరువుకు ఇంటిపేరయిన మా అనంతపురం జిల్లా తాలూకువి. అసలు కెనడాలు, న్యూజీలాండులకెందుకెళ్తారో ఈ సినిమా వాళ్ళు. కాస్త కళ్ళు తెరిస్తే ఇక్కడే ఇలాంటివి కనిపిస్తాయి.


ఏం చెబుతున్నా. సీనికి బ్యూటీ గురించి కదా! ఆ బ్యూటీతో పాటుగా నేను చేస్తున్నపని ఇంకొకటున్నది.

మొన్న పుస్తక ప్రదర్శనలో కొన్న ఓ కావ్యం (తెలుగు వ్యాఖ్యానసహితం) చదువుతున్నాను. అందులో వర్షం వర్ణన మొదలయింది. (ఆ పుస్తకం గురించి పెద్దలెవరైనా చెబుతారేమో అని ఎదురుచూస్తున్నా. ఎవరో లేకపోతే నేనే ఓ రోజు పెద్దరికం తీసుకోవాలి)

వర్షంలో మైమరిచిన కొంగలు చిందులేస్తూ, ప్రావృట్, ప్రావృట్ అని అరుస్తున్నాయిట. అదీ వర్ణన. బయట ఆ వర్ణనకు తగినట్టుగా కొంగలు కనబడ్డాయ్. (ఫోటోలో బంధించలేకపోయాను)

కాసేపటికి మేఘాలలా దూరంగా ఒళ్ళు విరుచుకుంటున్నట్టు కనబడ్డాయ్. గరుత్మంతుడు విష్ణువును మోసి, మోసి, అలసి, నిలబడి రెక్కలు బారజాపి, .. అలా ఒళ్ళు విరుచుకుంటున్నట్టు, ఓ బ్రహ్మాండమైన మేఘం గరుడపక్షి రూపంలో ఇలా....

మరి కాస్సేపటికి ఓ వరాహ రూపంలో భూమి పైకి యుద్దానికి వస్తున్నట్టుగా ఓ మేఘం. ఆ వరాహం ధనుస్సును కూడా ధరించింది. అది - ఇంద్రధనుస్సు. (ఫోటో మీద క్లిక్కి, తదేక దీక్షతో చూస్తే, రైన్ బో ముక్క కనిపిస్తుంది) ఈ ఫోటోలో ఆంగిల్ లేదు! రెసొల్యూషన్ లేదు!పొజిషనూ లేదు!(ఈ టీలో రంగులేదు! రుచి లేదు!చిక్కదనం లేదు! ఆ టోన్ లో అనుకోండి). అనుకోవడం వరకే ఛాయిస్.మరి కాసేపటికి సింహం (సింహం దవడకండరం కాస్త బిగుసుకుంది. ఏమనుకోకండి!)
నలుపు, ఆకుపచ్చ, నీలాలతో ప్రకృతి త్రివర్ణ పతాకలా ఉంది.అదీనండీ..అలా చూసుకుంటూ, మల్లీశ్వరిలో "పరుగులు తీయాలి" పాట వినుకుంటూ ఊరికి చేరుకున్నానండి.ఊరు చేరగానే సాయంత్రమయింది. మా ఊరు యథావిధిగా వర్షాలు అవీ లేకుండా క్షామంగా ప్రశాంతంగా ఉంది. మా పాపాయి ఇంటి ముందు ఇసుకలో ఆడుతూ స్వాగతం పలికింది.
రెండు రోజుల జీవితం తర్వాత మళ్ళీ బతకడానికి నగరానికొచ్చేశాను యథావిధిగా.

30 comments:

 1. ప్రస్తుతం సమయం రాత్రి పదకొండున్నర. ఇప్పటికీ టపాని మూడోసారి చదివాను! నేను పొందిన అనుభూతిని వ్యక్తం చెయ్యడానికి నా దగ్గర మాటల్లేవు. మీరు వ్రాసిన ప్రతి మాటకీ "అద్భుతం" అన్న మాటని నేనీ వ్యాఖ్యలో తిరిగి వ్రాస్తే బహుశా కొంతవరకూ వ్యక్తమవుతుందేమో. కానీ మరి ఆ ఛాయాచిత్రాల సంగతో! దాని వెనకనున్న మీ మనోనేత్రం మాటో!

  ReplyDelete
 2. చాలా అందంగా వ్రాసారు. చిత్రాలు కూడా బాగున్నాయి.

  పాప భేషో! చిన్ని కృష్ణుడి పోలికలు కనబడుతున్నాయి. :-)

  ReplyDelete
 3. రవి గారు, అద్భుతం అన్న ఒక్క మాట సరిపోదండీ.. చాలా బాగా రాశారు. మీ ఫోటోలు కూడా చాలా చాలా చాలా బాగున్నాయ్. పాప ఫోటో హైలేట్ :-)

  ReplyDelete
 4. దటీజ్ చో చ్వీట్.
  మబ్బులు మావూళ్ళోనే మనసును దోచేలా ఉంటాయనుకున్నా, మీ వూళ్ళోనూ భలే అద్భుతంగా ఉన్నాయే!

  ReplyDelete
 5. ప్రయాణాలు అందరూ చేస్తుంటారు.ప్రయాణంలోని పదనిసల్ని ఇంతందంగా హాయిగా నయనానందకరంగా అందించడం అందరికీ రాదు భలేగా వ్రాసావు రవీ!మేఘాలలోగరుత్మంతున్ని,వరాహ,నరసింహావతారాలను దర్శించుకోవడమేగాక మాకూ దర్శనం చేయించడం చాలా బాగుంది.ఆలూరు కోన గుండుపై కాస్త మొలకలొచ్చినట్లున్నాయి.చెవిపోగులతో,మెడలో తాయెత్తుతో పాపాయి భలే!

  ReplyDelete
 6. " మా ఊరు యథావిధిగా వర్షాలు అవీ లేకుండా క్షామంగా ప్రశాంతంగా ఉంది. "
  క్షామంగా వుంది.----మనస్సుని పిండేస్తున్న మాట .
  కాదు కాదు
  త్వరలోనే మీ ఊరు వర్షాలతోను పాడిపంటలతోనూ క్షేమంగా మారాలని నా తపన , ఆశాను .

  ReplyDelete
 7. రవి గారు చాలా బాగా రాశారు

  ReplyDelete
 8. బాగా రాశారండీ, రవి గారూ!

  మీ వాక్యాలు మీ ఊరి ప్రయాణం మల్లే హాయిగా తోచాయి. > ఆ హోటలు వాడికున్నంత సామాజిక స్పృహ తెలుగు బ్లాగర్లలో కూడా లేదు. :)

  మబ్బుల చిత్రాలను భలే బంధించారండీ. చివరికి ఇంద్రధనుస్సు తునకను కూడా వదల్లేదు మీరు!
  ఇసుకలో ఆడుకుంటూ మీ పాపాయి పలికిన స్వాగతం అద్భుతమైన ముగింపు!

  ReplyDelete
 9. రవి గారూ చాలా చాలా బాగా రాసారు. మాకు కూడా ఆ అనుభూతి కలిగించారు.
  ఫొటోస్ గురించే కాదు, కలిగిన అనుభూతి గురుంచి చెప్పటానికి కూడా నా దగ్గర మాటలు లేవు.

  ReplyDelete
 10. బావుందండి మాతో మొత్తానికి బస్సు ప్రయాణం చేయించారు.. నాకు కూడా చాలా ఇష్టం బస్ ప్రయాణమ్ అంటే ఏమి పుస్తకం అండి ఇంతకు మీరు చదువుతున్నది? పాప బలే ముద్దు గా వుంది చాచిన చెయ్యి అందుకుని ఎత్తుకుని ముద్దెట్టుకుని ఇసుక దులిపేద్దాం అనిపించింది, ఆకోర్స్ మీరు చేసే వుంటారు లే..

  ReplyDelete
 11. నేనూరెళ్ళే ప్రతీ సారీ కొండలూ గుట్టలూ.. వాటి మీద ఉండే రాళ్ళూ రప్పలూ, మేఘాలూ వాటితో ఏర్పాటయ్యే ఆకృతులూ చూస్తూ కాలక్షెపం చెసేస్తూంటా. మీ వర్ణన 'చూసినా తర్వాత నా గత ప్రయాణాలు అనుభూతులు గుర్తొచ్చాయి. చాల బాగున్నది మీ 'నేత్రం'. మీ ఆమ్మాయి భేషుగ్గా ఉంది...

  ReplyDelete
 12. >>మధ్య మధ్యలో నీళ్ళటి అల్లం టీ తాగుతున్నప్పుడు - ఆహా! కరడుగట్టిన నాస్తికులకు, గతి తార్కిక భౌతిక వాదులకు కూడా కాసేపు దేముడు కనబడతాడు.

  భలే చెప్పారు.

  ఒక్కసారి వెనక్కి వెళ్ళి మీతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న అనుభవం కలిగింది.

  ReplyDelete
 13. మబ్బులు..మబ్బులు.. అద్భుతం.

  ReplyDelete
 14. ఫొటోలు బాగున్నాయి.
  కబుర్లు ఇంకా బాగున్నాయి..

  ReplyDelete
 15. @కామేష్: అనుభూతులు, వాటి సాంద్రత క్షణికమే. ఎప్పుడైతే అనుభూతి, మెదడు పొరల్లో వెళ్ళిపోతుందో, అప్పుడు దాని సాంద్రత తగ్గిపోతుంది...

  సరే తత్వం సంగతి మళ్ళీ చూద్దాం లెండి, :-), ధన్యవాదాలు.

  @ప్రవీణ్: మొబయిల్ కెమెరా,అందునా బస్సు మూవింగు లో ఉన్నప్పుడు తీసినవి. బయట దృశ్యాలలా ఉన్నాయి. సీమా మజాకా?

  @వేణు: ఫోటోల కర్టెసీ, ఆయా దృశ్యాలకు!

  @కొత్తపాళీ గారు: మేఘాల దృశ్యాలను ఆనందించే సొసయిటీ ఒకటుంది. ఇక్కడ చూడండి. కొన్నేళ్ళ క్రితం నేనూ అందులో సభ్యుణ్ణి.

  @విజయమోహన్ గారు: గుండమ్మకు కాస్త మొలకలొచ్చాయి.అయితే బౌద్ధ బిక్షువులకు లాగా ఒకటే చోట ఎక్కువగా వస్తూ ఉంది!

  @నరసింహ మూర్తి గారు: అనంతపురం ఎప్పుడూ అంతేనండి. దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయే రెండవ జిల్లా ఇది. ఏమైనా చేయాలి. కనీసం రైతులకైనా. లేకపోతే, ఈ జిల్లా బతుకదు.

  @శ్రావ్య, ఫణి, తమిళన్, సనత్ శ్రీపతి, రవిచంద్ర, సునీత, bonagiri గార్లు: నెనర్లు.

  @వేణు గారు: ఇంకా చాలా దృశ్యాలు బంధించలేకపోయాను. కొంగలన్నీ ఓ చెట్టుపై కూర్చుని ఉన్న దృశ్యం అందులో ఒకటి.

  @భావన గారు: అమ్మో, దాన్ని ఆటలో అదీ ఇసుక నుండీ డిస్టర్బ్ చేయడమే? ఇల్లు పీకి పందిరేస్తుంది! మనమూ కాసేపు ఆడి, మరో విషయానికి దారి మళ్ళించడమే చేయగలిగిన పని.

  ReplyDelete
 16. ఇక్కడ మా పిల్లలకి అలా ఇసుకలోనూ, మట్టిలోనూ ఇంటిముందే అంత ఈజీగా ఆడుకునే ఛాన్స్ లేదండీ. ఆ అదృష్టం కోసం ఏ పార్కుకో వెళ్ళాలి.

  ReplyDelete
 17. మేఘానందస్వాముల మఠానికి దారి చూపినందుకు నెనర్లు.
  మా వూరి మబ్బుల అందచందాలు ఇక్కడ తిలకించగలరు.

  ReplyDelete
 18. beautiful.

  mI interpretation chaalaa baagundi.

  ReplyDelete
 19. @కొత్తపాళీ గారు: ఓ పెద్ద "వావ్" అందుకోండి.

  @బాబా గారు: "ఆ కొండలు, పిల్లల కేరింతల్లా ఉన్నాయి" అన్న రవీంద్రుడి అనువాదం గుర్తొచ్చింది, మీరూ గుర్తొచ్చారు. అయితే అవేవీ రాయలేదు.

  @శరత్: నగరాల పరిస్థితి అంతేనండి. కానీ మట్టిలో పిల్లలను ఆడించడం తప్పనిసరి అని నా అభిప్రాయం.

  ReplyDelete
 20. ఇంత తీరిగ్గా అందమైన ఫోటోలు తీశారూ అంటే మీరు వెళ్ళింది బస్సులోనా, కారులోనా అనిపిస్తోంది. చాలా బాగా రాశారండి.

  ReplyDelete
 21. నిజమే ఈ మబ్బులు తమతో పాటు మననూ లాక్కెళతాయి కదా. చేతిలో కెమెరా ఉంటే ఈ మబ్బులు ఆహ్లాదంగా ఉన్నా, గర్జిస్తూ ఉన్నా బందించక మానతరమా.. నేను అలాగే చేసి ఛైత్రరధంలో దాచుకున్నాను.

  ReplyDelete
 22. రవి గారు,బావున్నాయండీ ప్రయాణంలో పదనిసలు !
  ఫోటోలు కూడా చాలా బాగున్నాయ్

  ReplyDelete
 23. ravi garu blagadinchav ppa...

  ReplyDelete
 24. Ravi garu, nenu bangalore lo chennai lo pani chesthunnappudu prathi vaaram intikellevadini(anantapur). Intiki velthunna ani entha anandanga undedo bus prayanam chesthunnaaa ani antha kante anandanga undedi. aa gnapakalanu malli kalla mundu sajeevanga niliparu...koti dandalu

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.