Saturday, June 14, 2008

కాళిదాసు - వ్యక్తిత్వం, సమాజ పరిశీలన, కొన్ని భిన్నాభిప్రాయాలు

రచన -

కావ్యం, ప్రబంధం, పురాణం, నవల, కథ, ఆఖరుకు బ్లాగు, ఏదైనా కానివ్వండి, తను ఉంటున్న సమాజాన్ని ప్రత్యక్షం గానో, పరోక్షం గానో ప్రతిబింబించడం సహజం. ఇది అన్ని కళలకూ వర్తిస్తుంది. అది సాహితీ చరిత లో గొప్పగా వెలుగొందినదే అవచ్చు, అద్భుతమైన వర్ణనలు ఉండవచ్చు, ఆ వర్ణనల వెనుకైనా సమాజం లోని భిన్న కోణాలు ఆవిష్కృతమవడం కద్దు. ఒకవేళ రచయిత ఉన్న (కాలంలో) సమాజం లో అసమానతలు ఉన్నట్లయితే, ఆ అసమానతలు కూడా రచనలో కనుపించ వచ్చు. (ఉదా :- ఓ కావ్యంలో వేశ్యను అద్భుతంగా వర్ణించారనుకోండి., ఆ వర్ణనలోని అద్భుతంతో బాటు, ఆ సమాజం లో అసమానత-వేశ్యా వృత్తి అన్నది మరుగవదు).

అలాగే ప్రతి కళాకారుడు, లేదా రచయితా వర్గ సమాజంలో, ఏదో ఓ వర్గానికే ప్రాతినిధ్యం వహిస్తాడు. ఏవో కొన్ని రచనలు / కళాకృతులు (ఆబ్జెక్టివ్ ఆర్ట్ - ఉపనిషత్తులూ/ జీసస్ సెర్మన్ ఆన్ ద మవుంట్/ ధమ్మపదం వగైరా) వీటికి మినహాయింపు కావచ్చు. రచైత/కళాకారుడు ఏ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు అన్న విషయంలోనే ఆ రచయిత ఔన్నత్యం తెలుస్తుంది.

********************************************************
కాళిదాసు -


సంస్కృత సాహిత్యం (ఆ మాట కొస్తే సాహిత్యం తో) తో కనీస పరిచయం ఉన్న వారికైనా తెలిసిన పెద్ద పేరు.

పురా కవీనాం గణన ప్రసంగే కనిష్టికాధిస్టిత కాళిదాసః
అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్థవతీ బభూవ !

పూర్వకవులను లెక్కెడుతూ చివరి వేలు (అనామిక) ని మడిచామనుకోండి. ఆ తరువాత అంతటి కవి ఇంకొకరు లేకపోవడంతో అనామిక అన్నపేరు చిటికిన వ్రేలుకు సార్థకంగా ఒప్పింది అని భావం.

ఇంకా కవికులగురువు, ఉపమా కాళిదాసు, దీపశిఖా కాళిదాసు వంటి విశేషణాలు ఎన్నో కాళిదాసు సొంతం.
ఈయనను తన భార్య, అస్తి కశ్చిద్వాగ్విషయః ? (ఏమైనా చెప్పదగిన సమాచారం ఉన్నదా?) అని అడిగిందట. దానికి సమాధానంగా అస్తి అనే పదం తో మొదలుకుని "అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా .. " అన్న పద్యంతో కుమార సంభవాన్ని, కశ్చిత్ అన్న పదంతో మొదలుకుని " కశ్చిత్ కాంతా విరహ గురుణా " అన్న పద్యంతో మేఘ సందేశాన్ని, వాక్ అన్న పదంతో " వాగర్థావివ సంపృక్తౌ ..." అన్న పద్యంతో రఘు వంశాన్ని వెలయించాడని లోకోక్తి.


ఈయన ప్రభావం తన తదనంతర కవుల మీద అపారం అన్నది అతిశయోక్తి కాబోదు.

*******************************************************

రచన ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి ?
1. మానసిక వికాసం
2. అప్పటి సమాజ పరిశీలన
ఓ అద్భుతమైన కావ్యాన్ని (మేఘ సందేశం అనుకోండి ఉదాహరణకు) చదివి రసాస్వాదన చేయవచ్చు. ఇది మానసిక వికాసం. ఐతే ఏ రచననైనా సామాజిక పరిశీలనకు ఎన్నుకుంటే దాన్ని సాధ్యమైనంత వరకు నిస్పాక్షిక దృష్టితో చూడాలి. అందులో భాగంగా కొన్ని కఠినమైన సత్యాలను ఒప్పుకోవలసి వస్తే ఒప్పుకోవాలి. తప్పదు. అలానే తార్కిక దృష్టి తో ఓ విషయం పరిశీలించేప్పుడు రాగ రంజితమైన దృక్పథం కూడదు. ఓ కవి భగవంతుని అనుగ్రహ పాత్రుడు, కాబట్టి తనను విమర్శించడం తప్పు అన్న భావన తార్కిక దృష్టి లో సమాజ పరిశీలకులకు ఉండదు.


ఈ రకమైన పరిశీలన మహా పండిత రాహుల్ సాంకృత్యాయన్ గారు మన భారతదేశపు కవుల మీదే కాక భారత దేశ సమాజం మీద చేశారు. రాహుల్ సాంకృత్యాయన్ పండితుడు, సుప్రసిద్ధ పాళీ భాషా శాస్త్రవేత్త, త్రిపీఠకాచార్య అన్న బిరుదుతో గౌరవింపబడినవాడు, లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్య భాషా బోధకుడు, స్వాతంత్రం కోసం 10 యేళ్ళు జైళ్ళలో మగ్గిన మానవతా మూర్తి. ఈయన రాసిన చారిత్రక పుస్తకాలు భారత సారస్వతాన్ని పరిపుష్టం చేసాయి. అందులో కొన్ని " వోల్గా నుండి గంగా వరకు ", "సిం హ సేనాపతి ", "ఋగ్వేద ఆర్యులు " మొదలైనవి.
రాహుల్ సాంకృత్యాయన్ గారు కాళిదాసు మీద కొన్ని దృక్కోణాల ద్వారా పరిశీలించారు. అవి.
1. రాజాశ్రయం.కాళిదాసు చంద్రగుప్త విక్రమాదిత్యుని (భోజ రాజు) సమకాలికుడు, ఆ రాజాశ్రితుడు అన్నది జగద్విదితం. 2. విలువలు, సామాజిక స్పృహ

3. తదనంతర కవులపైన (తప్పుడు ?) ఒరవడి
4. ఇతరములు కొన్ని.

ఇవి చర్చించే ముందు కాళిదాసు కాలం, అప్పటి సమాజ పరిశీలన తప్పక చేయాలి.

********************************************************
గౌతమ బుద్ధుడు


క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం (ఇంచుమించుగా) భారతావని ఓ రకంగా సాంస్కృతిక, సామాజిక పునరుజ్జీవనం. అప్పటికే భరతావని లో వేళ్ళూనుకున్న అతి హేయమైన అస్పృశ్యత, యగ్న యాగాది కర్మ కాండలు, మూఢత్వం వంటి వాటి మీద ఓ సామాజిక విప్లవం.

( బ్రాహ్మణో అస్య ముఖమాసీత్, బహూరాజన్య
కృతఃఊరూ తదస్యయద్ వైశ్యః, పద్భ్యా శూద్రో అజాయతః - ఋగ్వేదం 10-90-12)

(ఆతని ముఖము నుండీ బ్రాహ్మణుడు, భుజముల నుండీ క్షత్రియుడూ, తొడల నుండీ వైశ్యుడు, కాళ్ళ నుండీ శూద్రుడు జన్మించారు.)

హిందూ వాఙ్మయంలో అప్పటికే ఉపనిషత్తులు ఉన్నప్పటికీ (బుద్ధ బోధ ఉపనిషత్తుల సారమే అని ఒక వాదన) అవి జన సామాన్యానికి అందుబాటులో లేని సంస్కృత భాష కు మాత్రమే పరిమితం.

బుద్ధుడి సంఘంలో వర్ణ వివక్షతకు చోటు లేదు. సంఘం లో అందరు వ్యక్తులు సమానమే. అలాగే సంఘంలో ఆస్తులు అన్ని ఉమ్మడి ఆస్తులు మాత్రమే. వినయ ధర్మాల అనుసారం ప్రతి వ్యక్తి, తన భిక్షా పాత్ర, కర్ర, పై వస్త్రం లాంటి 7 వస్తువులకు మాత్రమే సొంతదారు.అంటే సంఘం కేవలం సన్యాసుల మఠమా? కాదు. సంఘంలో గృహస్తులూ సభ్యులే. అప్పటి రాజ్యాలు కూడా గణతంత్ర రాజ్యాలే. ఈ గణతంత్ర రాజ్యాలకు రాజు ఉండడు. అధికారులు కేవలం వృత్తి నిర్వాహకులు మాత్రమే. అలాగే అవసరం వస్తే, రాజ్యం లో ప్రతి వ్యక్తీ కత్తి చేతబట్టి పోరాడుతాడు. అది ఓ రకంగా జగతి లోనే మొదటి వర్గ రహిత సమాజం.అలాగే గ్రీకు (యవన), భారతీయ సంస్కృతుల మేళవింపు, పరస్పర ఆదాన ప్రదానాలు అప్పటి కాలం నాటివే. గ్రీకులు ఎంతో మంది బుద్ధ దార్శనికత కు అనుకూలురై, భారతీయ జీవన స్రవంతిలో కలిసి మమేకయ్యారు.

(నాటిక అన్న ప్రక్రియ గ్రీకు దేశం నుండీ వచ్చిందట. అలాగే పైథాగరస్ తత్వ చింతన మీద భారతీయ చింతన ప్రభావం ఉన్నది అని కొందరి ఊహ)

కేవలం యవన దేశ సంస్కృతి ప్రభావమే కాక తక్షశిల, నలందా విశ్వ విద్యాలయాల ప్రాదుర్భవం వల్ల ఎన్నో దేశాల సాంస్కృతిక, వైఙ్ఞానిక చింతనలతో భారతీయ చింతన పరిపుష్టం అయింది.

ఈ గణతంత్ర రాజ్యాలు ఏమయ్యాయి?సమాజంలో తిరిగి అస్పృశ్యతా రక్కసి ఎలా వేళ్ళూనుకుంది?భారతీయ సంస్కృతి లో మమేకమైన గ్రీకులు తిరిగి అప్రాచ్యులు గా ఎలా అయారు?

వీటన్నిటికీ సమాధానం గుప్త వంశ ప్రాదుర్భావం అని రాహుల్ సాంకృత్యాయన్ గారు సాధికారికంగా విశ్లేషించారు.

***********************************************
రాజాశ్రయం -----


కాళిదాసు చంద్రగుప్త విక్రమాదిత్య రాజాశ్రితుడని లోకవిదితం. అప్పటికి ఇతర కవులు లేరా? వారందరూ రాజాశ్రితులేనా? ఈ రాజాశ్రయం అన్నది కేవలం భుక్తి కోసమా? ఇంకేదైనా స్వప్రయోజనం ఉన్నదా? స్వ ప్రయోజనం ఉన్నప్పటికీ, రాజును దైవాంశ సంభూతుడిగా చిత్రీకరించవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఈ పరిణామంలో ఆ కవి పాటించిన విలువలు ఏమిటి? ఈ ప్రశ్నలను సాంకృత్యాయన్ గారు అప్పటి చారిత్రక యవనిక పై చర్చిస్తారు.

ఇక కాళిదాసు రాజాశ్రయం కేవలం భుక్తి కోసమా? అప్పటి ఎన్నో చాటువుల ద్వారా, కొందరు చారిత్రకుల సిద్ధాంతాల ద్వారా గుప్తుల కాలం స్వర్ణ యుగం. ఆ స్వర్ణయుగం లో కాళిదాసు కేవలం భుక్తి కోసం రాజుని ఆశ్రయించడంలో ఔచిత్యం కనబడుతుందా?

సాంకృత్యాయన్ గారు చెప్పిన ఇంకొక విషయం కుమార సంభవం అన్న కావ్యం, కుమార గుప్తుని కీర్తించడానికి అన్నది. ఇందులో విడ్డూరం ఏమీ లేదంటారాయన. అలాగే ఊర్వశీ పురూరవం అనవలసిన నాటకం విక్రమోర్వశీయం ఎందుకయింది? అని ఓ ప్రశ్న.

మన పోతన ' బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ ' అని ఎందుకు ప్రశ్నించలేదు అన్న ప్రశ్న కూడా ఇక్కడ అనుచితం అనుకుంటాను.

ఈ రకంగా కాళిదాసు తన తదనంతర కవుల మీద కూడా ఓ రకమైన తప్పుడు ఒరవడి ప్రవేశపెట్టాడంటారు. కాళిదాసుని అనుకరిస్తున్నం అన్న భ్రమలో తర్వాతి కవులు (ఉదాహరణకు బాణ భట్టు హర్షుని ఆశ్రయించినట్టు) తమను తాము వంచన చేసుకోవచ్చని కూడా సాంకృత్యాయన్ గారు ఓ పాత్రతో చెప్పిస్తారు.

విలువలు----

కాళిదాసు పూర్వకవి అశ్వఘోషుడు. ఈయన బుద్ధ చరిత, సౌందర నందం, సారిపుత్ర ప్రకరణం (మొట్ట మొదటి సంస్కృత నాటకం) వంటి కావ్య నాటకాలను రచించాడు. ఈయన తన రచనల్లో అక్కడక్కడా ప్రాకృతం వాడాడు (ట). ఈయన రచనలు కొన్ని వేయేళ్ళ పూర్వమే అరబ్బీ లో అనువదితమయ్యయిట (ఆచార్య తిరుమల రామచంద్ర - ప్రాకృత వాఞ్ఙయంలో రామకథ).

రాహుల్ సాంకృత్యాయన్ గారు "వోల్గా నుండీ గంగా వరకు " అన్న పుస్తకంలో ఈ అశ్వఘోషుని ఓ మహనీయునిగా చిత్రీకరించారు. అలాగే ఆ పుస్తకంలో కాళిదాసుతోనే " అశ్వఘోషుడు కేవలం పండితుడే కాక మహా మానవతా వాది " అని చెప్పిస్తారు. మరి ఆ అశ్వఘోషుడు కాళిదాసుకు ఆదర్శం ఎందుకు కాకూడదు? అలాగే కాళిదాసు సమకాలికుడు 'దిఙ్నాగాచార్యుడు '.కాళిదాసు మేఘసందేశం-14 లో ఈ దిఙ్నాగుని ప్రస్తావన వస్తుంది.

ఈ దిఙ్నాగుడు (ఈయన ఇంకొక పేరు భదంత ధీరనాగుడు) ప్రమాణ సముచ్చయం, ప్రమాణ సముచ్చయ పరీక్ష, హేతుచక్ర డమరుకం, న్యాయావయవం వంటి తర్క శాస్త గ్రంథాలు, కుందమాల అనే ఓ అపూర్వమైన నాటకాన్ని రచించాడు. కుందమాలను సుగృహీత మానవల్లి రామకృష్ణ కవి తెలుగులో అనువదించారు. ఈ దిఙ్నాగుడు ఆంధ్రుడు అని తిరుమల రామచంద్ర గారు వివరిస్తున్నారు. దిఙ్నాగుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో తర్క శాస్త్రం బోధించే వాడట.

ఈ దిఙ్నాగుని గురువు భదంత వసుబంధువు. ఆయన ఓ గొప్ప కవి.

ఈ కాళిదాసు సమకాలికుల, పూర్వకవులతో పోల్చి చూస్తే, కాళిదాసు రచనల వెనుక ఉద్దేశ్యం కొంచెంగా (పూర్తిగా కాకపోయినా) అవగతమవుతుంది.

కాళిదాసు హిందువు.వర్ణాశ్రమ ధర్మానుయాయి.బ్రాహ్మణ, క్షత్రియ పక్షపాతి.

ఇంకొక్క విషయం సాంకృత్యాయన్ గారు అనేక పర్యాయాలు చర్చిస్తారు. అది గోసంరక్షణ. వేద కాలం లో, మహా భారత కాలాల్లో బ్రాహ్మణులు గోభక్షణ చేసే వారుట.అప్పటి సమాజం లో అది విపరీతమైన విషయం కాదు. అలా గోవులను బ్రాహ్మణుల కోసం వధించిన రక్తంతో చర్మణ్వతి అన్న నది ఏర్పడ్డది (మేఘసందేశం -49, మహా భారతం వనపర్వం, శాంతి పర్వాలలో రంతిదేవుని ప్రస్తావనలు). ఐతే కాళిదాసు కాలంలో ఈ గోపూజ, గో సమ్రక్షణ ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకున్నాయి? బౌద్ధాన్ని ప్రశ్నించి, సమాజంలో తిరిగి వర్ణాశ్రమ ధర్మాలను నెలకొల్పడానికి, బ్రాహ్మణుల ప్రాముఖ్యత పెంపుదలకే అని సాంకృత్యాయన్ గారు విశ్వసిస్తారు. తద్వారా కాళిదాసు విలువలను ప్రశ్నిస్తారు.

ఒక్క విషయం. ఈ విషయాలన్నిటినీ ఆధారం ఇంతకు ముందు చెప్పినట్టు చారిత్రక, సమాజ పరిశీలన మాత్రమే. కాళిదాసు కవితలో మాధుర్యాన్ని ప్రశ్నించే సాహసం, ప్రఙ్ఞ నిస్సందేహంగా ఎవరికీ లేదు. అలానే ప్రతీ వ్యక్తికీ (రాహుల్ సాంకృత్యాయన్ పండితుడికీనూ) కొన్ని విశ్వాసాలు, నమ్మకాలు సహజం. ఈయన కు కొన్ని విశ్వాసాలు బుద్ధ బోధ, బుద్ధుడి ప్రతీత్య సముత్పాదం, ఆర్య అష్టాంగిక మార్గం పట్ల విశ్వాసం మెండు అని మనకు తెలుస్తుంది. ఇలాంటి విశ్వాసాల పరదాల నుండీ ఒక్కొక సారి మనం చేసే విశ్లేషణలు కూడా ఒక్కోసారి వ్యక్తిగతంగా కనిపించవచ్చు.

ఐతే అన్నిటికీ మూలం సత్య సందర్శనేచ్చ మాత్రమే.

*****************************************************

మిత్రుడు నాగమురళి కోసం ఈ బ్లాగు రాయడానికి ఈ క్రింది పుస్తకాలు తిరగేయడం జరిగింది.
రంగనాయకమ్మ - రామాయణ విషవృక్షం (3 భాగాలు)

కాళిదాసు - మేఘ సందేశం, కుమార సంభవం (మొదటి సర్గ)
రాహుల్ సాంకృత్యాయన్ - ఋగ్వేద ఆర్యులు, సిమ్హ సేనాపతి, వోల్గా నుండీ గంగా వరకు
తిరుమల రామచంద్ర - మన లిపి పుట్టు పూర్వోత్తరాలు, ప్రాకృత వాఙ్ఞయంలో రామకథ,
విశ్వదర్శనం - నండూరి రామ మోహన రావు

ఈ టపా ద్వారా ఎవరి విశ్వాసాలను ప్రశ్నించే సాహసం నాకు లేదు. ఎవరైనా నొప్పిస్తే, క్షమాపణలు.

16 comments:

 1. చాలా విశాలమైన విషయాల్ని ఒక్క టపాలో కుదించటం వల్ల కొంత అర్థం చేసుకోవడానికి కష్టపడాల్సి వచ్చినా, చాలా మంచి ప్రయత్నం. తెలియని చాలా విషయాల్ని సులభంగా వివరించారు.
  www.parnashaala.blogspot.com

  ReplyDelete
 2. wow!
  మళ్ళీ తీరిగ్గా వచ్చి చదువుతా. ఎందుకైనా ముందు పనికొస్తుందని ఈ మాట మీ చెవిన వేసి పోదామని .. బాబ్బాబు .. ఇలాంటి వ్యాసాలేవైనా రాయదల్చుకుంటే ముందస్తుగా నాకొక్ఖ వేగు పంపండి!

  ReplyDelete
 3. రవి గారూ, నా అభ్యర్థనని మన్నించి సవివరమైన వ్యాసం రాసినందుకు చాలా చాలా సంతోషించాను. కృతజ్ఞతలు. మీరు ముందే ఈ వ్యాసంలోని విషయాల గురించి కొన్ని `హింట్లు’ ఇచ్చి ఉండడం మూలాన నాకు వ్యాసం చదవడానికి ముందే కొంత అవగాహన ఏర్పడింది. రాహుల్ సాంకృత్యాయన్ రచనలు నేను ఏమీ చదవలేదు. అయినప్పటికీ పెద్దలతో చర్చించడం వల్లా, కొన్ని వ్యాసాలు చదవడం వల్లా ఇటువంటి భావాలతో నాకు పరిచయం ఉంది. మీరు రాసిన వ్యాసంలోని కొన్ని విషయాల గురించి నా భావనలు తెలియజేస్తాను.

  1. `ప్రతి కళాకారుడు, లేదా రచయితా వర్గ సమాజంలో, ఏదో ఓ వర్గానికే ప్రాతినిధ్యం వహిస్తాడు. రచైత/కళాకారుడు ఏ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు అన్న విషయంలోనే ఆ రచయిత ఔన్నత్యం తెలుస్తుంది.’ - ఈ మాట అంగీకరించడం నాకు చాలా కష్టం. భిన్న ధృవాలకు చెందిన శిఖరసమానులైన వ్యక్తుల రచనలు నేను కొన్ని చదివాను. వాళ్ళ భిన్న దృక్పథాల రచనలు నేను సమానంగా ఆస్వాదించాను. ఒక్కొక్క రచయితను ఒక వర్గంలో చేర్చి, దాన్ని బట్టి మాత్రమే ఆ రచయిత యొక్క ఔన్నత్యాన్ని నిర్ణయించడం విశాల దృక్పథం ఉన్నవాళ్ళు చెయ్యలేరు అని నా అభిప్రాయం.

  2. మేఘదూతంలో దిఙ్నాగానాం అన్న ప్రయోగం దిగ్గజాలు (ఈ భూమిని ఎనిమిది దిక్కులలోనూ మోస్తూ ఉన్న ఏనుగులు) అన్న ఉద్దేశ్యంలో ఉపయోగించబడింది. శబ్దసామ్యాన్నిబట్టో, గూఢార్థాలు వెతికో దిఙ్నాగుడి ప్రసక్తి పండితులు తీసుకువచ్చి ఉండవచ్చు. సంస్కృత కావ్యాల వ్యాఖ్యానాల్లో ఇటువంటి గూఢార్థాల వివరాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి.

  3. కాళిదాసు చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలోని వాడని సందేహాతీతంగా ఋజువు చేయబడిందని నేను అనుకోవడంలేదు. కాళిదాసు గురించిన చారిత్రికాంశాలు ప్రతిపాదనలు మాత్రమే. `ప్రతిష్ఠాన పుర ప్రభువుకు జయమగుగాక’ అని కాళిదాసు తన `మాళవికాగ్నిమిత్రం’లో అన్నాడనీ ఆయన ప్రతిష్ఠాన పురాన్ని (పైఠాన్) రాజధానిగా చేసుకుని పరిపాలించిన శాతవాహన రాజు ఆస్థానంలోని వాడనీ మరొకాయన అభిప్రాయం.

  4. కుమార సంభవంలో కుమార గుప్తుడి కథ రాయబడిందనీ, రఘువంశంలో చంద్రగుప్త విక్రమాదిత్యుడి కథ (లేదా అతడి దండయాత్రల వివరాలు) రాయబడిందనీ చదివి నేను నవ్వుకుంటూ ఉంటాను. ఇటువంటి విషయాలు ఖచ్చితంగా నిరూపించబడినవి కావు. కేవలం ప్రతిపాదనలూ, ఊహాగానాలూ.

  5. వేదకాలంలో గోమాంస భక్షణ జరిగేదని కొన్ని ఆధారాలు చూపిస్తూ ఉంటారు. భవభూతి రాసిన ఉత్తరరామ చరిత్రం నేను చదివేను. నాకు చాలా ఇష్టం కూడా. అందులో వాల్మీకి ఆశ్రమానికి జనకుడూ పరివారమూ వస్తే, వాళ్ళ భోజనం కోసం ఆశ్రమంలోని గోవు `మడమడాయితం’ అని ఒక నాటకం లోని ఒక పాత్ర అంటుంది. నాకు అప్పట్లో చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం అది.

  6. ఇంక మీవ్యాసంలోని సారాంశం (నాకు బోధ పడినంతవరకు ) - బుద్ధుడి బోధనల ఫలితంగా వర్ణ, వర్గ విచక్షణలేని సమ సమాజం ఒకటి భారత దేశంలో ఏర్పడింది. గుప్తరాజుల కాలంలో మళ్ళా వైదిక ధర్మం ప్రబలి వర్ణాశ్రమ ధర్మాలూ, బ్రాహ్మణ క్షత్రియాధిపత్యమూ మళ్ళా ఏర్పడ్డాయి. కాళిదాసు ‘రాజాశ్రయం’ పొంది, తన రచనల ద్వారా అవే విలువల్ని గ్లోరిఫై చేశాడు. అతడు `కవికుల గురువు’గా, దైవానుగ్రహం పొందిన `లెజండ్’గా మారి తన తరువాతి కవులందరూ అదే బాట పట్టడానికి కారకుడయ్యాడు.

  ముందే చెప్పినట్టు నాకు ఈ భావన కొత్త ఏమీ కాదు. ఎంతటి మేధావులైనా సరే `ఉటోపియా’ అన్న భావనలో చిక్కుకోనివాళ్ళు, దాని వ్యామోహంలో పడి కొట్టుకుపోనివాళ్ళు మనకి చాలా చాలా అరుదుగా కనిపిస్తారు. ఒక్కొక్క మహానుభావుడిది ఒక్కొక్క ఉటోపియా.

  ఏవిధంగా బౌద్ధ `ఉటోపియా’ని గుప్తులు ధ్వంసం చేసి `కౄర, దుష్ట’ వైదిక, వర్ణ వ్యవస్థనీ, అస్పృశ్యతనీ పునరిద్ధరించారనీ, ఆ విలువల్ని కాళిదాసు గ్లోరిఫై చేశాడనీ కొందరు మేధావులు బాధపడతారో, అదే విధంగా వైదిక ధర్మాన్ని ప్రేమించేవారు ’అవైదిక, మ్లేచ్ఛ, అప్రాచ్య’ సంస్కృతుల్నీ, మతాల్నీ గుప్తులు రూపుమాపి, ‘సనాతన’ ధర్మాన్ని పునరుద్ధరించారని భావించి, అటువంటి వైదిక ‘ఉటోపియా’ని కాళిదాసు రచనల్లో చూసుకుని, పరవశించి, కాళిదాసు ఋషితుల్యుడని కీర్తిస్తూ ఉంటారు. ఈ రెండు ధోరణులూ నాకు పరిచయమే.

  మతాలూ, సిద్ధాంతాలూ, ఈ ఉటోపియాల కళ్ళజోళ్ళ మీద నాకు కొంతమటుకు భ్రమలు నశించాయి, చాలా కాలం క్రితమే. అందుకే మొహమాటం లేకుండా ఎటువంటి సిద్ధాంతాన్నైనా, దృక్పథాన్నైనా, ఏ కళ్ళజోడులోంచి రాసినదైనా చేతనైనంత మేరకు ఆస్వాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటా. కాళిదాసు రచనల్ని ఎంతగా ఆస్వాదించానో, అంతగానూ అశ్వఘోషుడి రచనలు గానీ మరేవైనాగానీ ఆస్వాదించగలను అని నాకో నమ్మకం. అంతమాత్రాన ఒక దృక్పథం గొప్పది అని గానీ, మరొకటి తప్పు అనిగానీ నేను నిర్ణయించుకోలేను. అన్ని దృక్పథాల్లోనూ తప్పొప్పులు ఉంటాయనీ, ఉటోపియా అన్నది (అది వైదికమైనా, బౌద్ధమైనా, కమ్యూనిజమైనా, మరే మతమైనా సరే) అసాధ్యమైన భావన అనీ నా నమ్మకం.

  ReplyDelete
 4. మురళి గారు,

  నాకూ చాలా సంతోషంగా ఉంది. ఇక మీరు చెప్పిన వివరాలు చూద్దాం.

  1. ఇది చాలా పెద్ద చర్చ. పైగా సున్నితమైనది. దాదాపు ఈ పాయింట్ మీదే రంగనాయకమ్మ గారు రామాయణ విష వృక్షం 3 భాగాలు రాసారు. ఎంతో చర్చ, ఎన్నెన్నో విమర్శలు., ఈ చర్చ ఇప్పుడు వద్దు.

  2. అవును. ఆ పద్యం లో దిగ్గజాల గురించి వర్ణన అని ఒక వర్గం, లేదూ, నిచుల కవిని, దిఙ్నాగుణ్ణీ ప్రస్తావించాడు అని ఇంకొక వర్గం అభిప్రాయపడుతున్నారు. ఐతే దిఙ్నాగుడు, నిచుల కవీ కాళిదాసు సమకాలికులు అవడం వలన, ఇద్దరి భావాలు విరుద్దమైనవి అవడం వలన, దిఙ్నాగుడి తరపు నుండీ పరిశోధించి పరిశోధకులు ఈ విషయం తేల్చాలి.

  4. కాళిదాసు కాలం గురించి ఎన్నో ప్రతిపాదనలు ఉన్నాయి. ఐతే 'రాజాశ్రితుడు ' అన్నది దాదాపు చారిత్రకులందరు ఒప్పుకుంటున్న నిజం.

  5. 'మడమడాఇతం ' అంటే ఏమిటి?

  6. 'యుటోపియా ' ఈ పదం బుద్ధుడికి వర్తించదు అని నా అభిప్రాయం. బుద్ధుడి ప్రబోధం వ్యక్తి ఔన్నత్యం కోసమే. (అప్ప దీపో భవ). ఐతే బుద్ధుడు వేరు, బుద్ధిజం వేరు. మీరు 2 ధోరణులు చెప్పారు. 'యుటోపియా ' ను ప్రతిపాదనే తప్పు (మీరన్నట్టు). అందుకే ఈ 'ఇజా ' లకు సంబంధం లేని రచనలు (ఉదా : జిడ్డు కృష్ణమూర్తి) చదవడం నా వరకు నాకు ఇష్టం.

  ఐతే ఒక్క విషయం. మీరు సమాజ పరిశీలనా పరంగా ఏదో ఒక్క యుటోపియా ను సమర్థించవలసి వస్తే ? ఏ యుటోపియా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడింది అని ఆలోచించాల్సి వస్తే? ఎందుకంటే అశ్పృస్యతా, వర్ణవివక్షతా ఎంతటి హేయమైనవి, జుగుప్సాకరమైనవి అన్నవి మనకందరకూ తెలుసు. అలా వర్ణ వివక్షత గు గురయిన వ్యక్తి దృక్కోణం నుండీ ఈ చర్చ జరగాల్సి వస్తే ?

  నిజానికి ఈ వ్యాసం ఎంతో చిన్నది, ఎన్నో విషయాలు చెప్పలేక పోవడం జరిగింది. ఐతే దీని ఉద్దేశ్యం సత్య సందర్శనేచ్చ మాత్రమే. కాళిదాసు మహనీయుడైనా అశ్వఘోషుడు మహనీయుడైనా మనం కాంక్షించేది వ్యక్తి, సమాజ శ్రేయస్సు మాత్రమే.

  ReplyDelete
 5. నాగ మురళి గారిటొ చర్చ జరిపే ఉబలాటంలో మీకు సమాధానం ఇవ్వటం మరిచాను.

  @ మహేష్ కుమార్ గారు: నెనర్లు. :-)

  @కొత్తపాళీ గారు : తప్పకుండానండీ. :-) ...ఐతే ఇక మీదట ఇలాంటి వ్యాసాలు నేను రాయకపోవచ్చు. ఈ వ్యాసం కూడా కేవలం నాగమురళి గారి కోసం రాసినది. నా వంటికి అంతగా ఇవి పడవు అని నా ఉద్దేశ్యం :-).

  ReplyDelete
 6. ప్రతీ వ్యక్తికీ భావవ్యక్తీకరణాస్వాతంత్ర్యముంటుంది. ఆ వ్యక్తీకరణ మా విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉంది అని వ్యక్తిపై విరుచుకుపడడం కొంచెం అతివాదమే. ఇటువంటి వ్యాసం వ్రాసి, ప్రతీమనిషికీ విమర్శకులుంటారు, కాళిదాసూ మనిషే, కాళిదాసుని విమర్శించేవారూ ఉంటారు అని గుర్తు చేసారు.

  ReplyDelete
 7. రాఘవ గారు, ఇందులో అతివాదం ఏమీ లేదండీ. కాళిదాస కవి భావ వ్యక్తీకరణ ని ప్రశ్నించడం లేదు. కాళిదాసు ఓ సాధారణ కవి లేదా సాధారణమైన వ్యక్తి అన్నప్పుడు ఈ చర్చ రాదు. కాళిదాసు పుంభావ సరస్వతి, సాక్షాత్తు భగవత్ స్వరూపుడు, కవితా కన్యక విలాసము, సొబగు కాళిదాసు... ఇలాంటి మాటలు అస్వాభావికంగా ఉన్నవా అన్న ఓ చర్చ మాత్రమే ఇది.

  ReplyDelete
 8. రవి గారూ, మీరు చెప్పిన విషయాల గురించి నా భావాలు -

  మీరు చెప్పినవాటిలో 1, 2 గురించి చెప్పడానికేమీ లేదు. 4 నాకు సమంజసంగానే తోస్తోంది.

  5. మడమడాయితం అంటే చంపబడింది అని. (కసకసా అంటామే, అలాంటి శబ్దవిన్యాసం అనుకుంటాను.)

  6. యుటోపియా బుద్ధుడికి వర్తించదు అని నేను ఒప్పుకుంటాను. సత్య దర్శనం చేసిన మహానుభావులు యుటోపియాలకోసం కలలు కనేవాళ్ళు కాదు. మీరన్నట్టు బుద్ధుడు వేరు, బుద్ధిజం వేరు. నేనూ `ఇజా'లకి వ్యతిరేకిని.

  నేనెటువంటి యుటోపియాని సమర్ధిస్తాను అన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేను. ఒక మనిషి మరొక మనిషిపట్ల అపచారం చెయ్యడం అన్నది ఏ కాలంలోనైనా ఏ సమాజంలోనైనా తప్పే. అయితే కాలంతో పాటు మారే విలువల్నిబట్టి ఈ అపచారాల తీవ్రతలూ, తప్పొప్పులూ కొంచం మారుతూ ఉంటాయి. అయితే దోషరహితమైన సమాజం అసాధ్యం కాబట్టి యుటోపియా అన్న భావనే అసాధ్యమని భావిస్తాను.

  వైదిక యుటోపియాలో వర్ణాలు ఉంటాయిగానీ, వర్ణ వివక్ష ఉండదు. (ఒకప్పుడు కులాలు ఉండేవిగానీ, కుల వివక్ష ఉండేది కాదు అని కొందరు భావిస్తారు). ఆ యుటోపియాలో వర్ణాలు కేవలం శ్రమ విభజన కోసం, వ్యక్తి స్వభావాన్ని అనుసరించి చేయబడి ఉంటాయి. తమ స్వభావాన్ని బట్టి తమ వర్ణాన్ని మార్చుకునే, ఎన్నుకునే స్వేచ్ఛ వ్యక్తులకి ఉంటుంది. (ఇవి నేను కొత్తగా కనిపెట్టిన విషయాలు కావు. వైదిక యుటోపియా కోసం కలలు కనేవాళ్ళ రచనలు మీరు చదవవచ్చు.)

  అస్పృశ్యులు అని చెప్పబడుతున్నవాళ్ళు ఆనాటి వైదిక సమాజంలోని భాగస్తులు కారు అని అనుకుంటాను. ఒకటి రెండు సంవత్సరాల క్రితం పారిస్ లో పెద్ద యెత్తున గొడవలు జరిగాయి. వర్ణ వివక్షకి గురి అవుతున్న నల్ల జాతివాళ్ళు, ముస్లిములు చేసిన తిరుగుబాటు అది. అతి సంపన్నమైన పారిస్ నగరంలోని ఘెట్టోలకి పరిమితమై, నిరుద్యోగం, ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వర్గమది.

  వైదిక ‘యుటోపియా’లో అసలు అస్పృశ్యులే ఉండకపోవచ్చు - అది కేవలం భావన కాబట్టి. అయితే ఆ యుటోపియాకి కాస్తైనా చేరువగా వచ్చిన భారత దేశపు స్వర్ణ యుగంలో అస్పృశ్యుల స్థితి ఈనాటి అభివృద్ధి చెందిన దేశాల్లోని పేదవాళ్ళ కన్నా హీనంగా ఉంటుందని నేను అనుకోవడం లేదు. అయినప్పటికీ ఒక యుటోపియాలాంటి భావనగా ‘వైదిక మతం’ అస్పృశ్యులు ఉండి తీరాలనీ, వాళ్ళని అస్పృశ్యులుగా చూడాలనీ ఏమీ చెప్పదు. ఏ సమాజానికైనా ఆ సమాజం ‘వెలుపల’ ఉండే వాళ్ళు ఉండనే ఉంటారు. వాళ్ళని చిన్న చూపు చూడడం అన్నది కూడా ఉండనే ఉంటుంది. ఆనాటి బుద్దిస్టు సమాజం కానీ, ఈనాటి అభివృద్ధి చెందిన దేశాలు గానీ దీనికి మినహాయింపు అని నేను అనుకోవడం లేదు.

  లండన్ లో నాకొక స్నేహితురాలు ఉంది. ఆవిడ స్నేహితురాలు మరొకావిడ ఒక టిబెటన్ బుద్ధిస్టు ఆశ్రమంలొ చాలా ఉన్నత స్థాయికి చెందిన గురువు. ఆ పీఠాధిపతి తరవాత అంత సీనియర్ ఆవిడే. పీఠాధిపతి ముసలివాడయ్యాడు. అయినప్పటికీ ఆయన తరవాత పీఠాధిపత్యం ఆవిడకి దక్కదు. ఎందుకంటే ఆవిడ స్త్రీ కాబట్టి. అవిడకన్నా జూనియర్ అయిన పురుషుడే పీఠాధిపతి అవుతాడు.

  కాబట్టి యుటోపియాల భ్రమలూ, వ్యక్తిగత ద్వేషభావనలూ తొలగించి చూస్తే మంచి చెడ్డలు అన్ని చోట్లా కనిపిస్తాయి. అస్పృశ్యతా, వర్ణ వివక్షా చూసిన వాళ్ళకి వైదిక సమాజం మీద ద్వేషం ఉండడం సహజమే. అయినప్పటికీ అది కనీసం ‘యుటోపియా’గా కూడా పనికి రాని భావన అంటే మాత్రం నేను ఒప్పుకోలేను.

  ReplyDelete
 9. "వైదిక యుటోపియాలో వర్ణాలు ఉంటాయిగానీ, వర్ణ వివక్ష ఉండదు. (ఒకప్పుడు కులాలు ఉండేవిగానీ, కుల వివక్ష ఉండేది కాదు అని కొందరు భావిస్తారు). ఆ యుటోపియాలో వర్ణాలు కేవలం శ్రమ విభజన కోసం, వ్యక్తి స్వభావాన్ని అనుసరించి చేయబడి ఉంటాయి. తమ స్వభావాన్ని బట్టి తమ వర్ణాన్ని మార్చుకునే, ఎన్నుకునే స్వేచ్ఛ వ్యక్తులకి ఉంటుంది. (ఇవి నేను కొత్తగా కనిపెట్టిన విషయాలు కావు. వైదిక యుటోపియా కోసం కలలు కనేవాళ్ళ రచనలు మీరు చదవవచ్చు.)"

  బహుశా మీరు భగవద్గీత లో "చాతుర్వర్ణం మయా సృష్టం, గుణ కర్మ విభాగశః " అన్న శ్లొకాన్ని ఉదహరిచారేమో అని నా భావన. ఐతే వర్ణ వివక్షత ఉన్నది, (టపాలో నేను ఉదహరించిన శ్లోకం ) అని రాహుల్జీ వాదన. ఆయన ఋగ్వేదం మీద ఓ పుస్తకం రాసారు. అందులో ఈ విషయాలు కూలంకషంగా చర్చించారు.

  ఇకపోతే మంచి చెడ్డలు అన్నవి మీరన్నట్టు ప్రతి సమాజంలోనూ ఉంటాయి అని ఒప్పుకొంటున్నాను. బుద్ధిస్టులు వైదిక మతాన్ని, వీళ్ళు వాళ్ళనూ పరస్పరం ఆడిపోసుకోవడం కూడా మామూలే.

  ఐతే, ఈ వర్ణవివక్షత అన్నది భారతావనికి ఓ భయంకరమైన జాడ్యం (కొంచెం 'అతి ' అని అనిపించినా) అని నేను నమ్ముతున్నాను. భారతావని 200 సంవత్సరాలు విదేశీ దాస్యంలో మగ్గడం సామాన్యమైన విషయం కాదు. అంటే దాస్యత్వం అన్నది భారత ప్రజల నరనరాన జీర్ణించుకుని ఉండాలి. దీనికి మూలం ఈ అస్పృశ్యతా, వర్ణ వివక్షతా అన్నది ఒప్పుకుని తీరాలి.

  మీ వాదన "భారత దేశపు స్వర్ణ యుగంలో అస్పృశ్యుల స్థితి ఈనాటి అభివృద్ధి చెందిన దేశాల్లోని పేదవాళ్ళ కన్నా హీనంగా ఉంటుందని నేను అనుకోవడం లేదు". ఇదీ నిజమే కావచ్చు (నాకు ప్రపంచ వ్యవహారాలు పెద్దగా తెలీవు).

  "కనీసం ‘యుటోపియా’గా కూడా పనికి రాని భావన అంటే మాత్రం నేను ఒప్పుకోలేను."

  ఇది మీ అభిప్రాయం. ఎవరి అభిప్రాయాలు వారివి. (వివేకానందుడిదీ ఇదే అభిప్రాయం... ఎక్కడో చదివాను). ఇది అప్పటికి (ఆ కాలానికి) సరిపడి ఉండవచ్చు కాక.అంటే ఎవలూషన్ , నాగరికత తప్పటడుగులు నేర్చుకునే రోజుల్లో. ఐతే బుద్ధుని తదనంతరం భారతావనిలో జరిగినసాంస్కృతిక పునరుజ్జీవనం (లలిత కళలు, సమాజంలో అసమానతా నిర్మూలన, విశ్వవిద్యాలయాలు, ఇతర దేశాల చింతనతో భారతీయ చింతన పరిపుష్టం కావడం) దృష్ట్యా చూస్తే, నా వరకు నాకు ఈ చాతుర్వర్ణాలతో కూడిన సమాజం ప్రిమిటివ్ అని అనిపిస్తుంది.

  ReplyDelete
 10. రవి గారూ, వర్ణ వివక్ష ఉండడం వేరు, ఒక యుటోపియాని ఊహించేటప్పుడు ఆ యుటోపియాలో భాగంగా వర్ణ వివక్షని ప్రతిపాదించడం వేరు. అసలు వైదిక మత ప్రతిపాదనలోనే వర్ణ వివక్ష ఉన్నదని భావించడం పొరపాటు. ‘సర్వే జనా: సుఖినో భవన్తు’ అనే వైదిక మతం కూడా ఘోషిస్తుంది.

  కుల వివక్ష భారతావనిని పట్టి పీడిస్తున్న భయంకరమైన జాడ్యమని నేను ఒప్పుకుంటాను. ‘దాస్యత్వం అన్నది భారత ప్రజల నరనరానా జీర్ణించుకుని ఉండాలి. దీనికి మూలం అస్పృశ్యతా, వర్ణ వివక్షా అని ఒప్పుకుని తీరాలి.’ - ఈ అభిప్రాయలతో నేను పూర్తిగా ఏకీభవించలేను. భారత జాతి దాస్యత్వానికి కేవలం వర్ణ వివక్ష ఒక్కటే కారణమని నేను భావించలేను. మన భారతదేశం ఒకటే కాదు, ఈ ప్రపంచంలో అనేక దేశాలూ, జాతులూ దురాక్రమణకి గురై, దాస్యంలో మగ్గినవే. బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాధిపత్యాన్ని ఎలా సాధించారో సవివరంగా వర్ణించిన పుస్తకం ఒకదాన్ని (The Empire - Niall Ferguson) ఈ మధ్య చదివేను. చరిత్రలో దేనినీ ఒకే కారణం చేత జరిగిందని నిర్ధారించలేము. అంత బ్లాక్ అండ్ వైట్ గా ఏదీ ఉండదు.

  చాతుర్వర్ణాలతో కూడిన సమాజం ప్రిమిటివ్ అన్న మీ అభిప్రాయాల్ని నేను గౌరవిస్తాను. అయితే బౌద్ధ సమాజం చాతుర్వర్ణ సమాజం కన్నా చాలా ఉన్నతమైనదిగా వర్ణించబడిన రచనలు నేను చదవలేదు. చదివితేగానీ, కూలంకషంగా సమాచారం సేకరిస్తేగానీ నిశ్చితాభిప్రాయానికి రాలేను. అయినప్పటికీ వైదిక యుటోపియా కళ్ళద్దాల్లోంచి చూస్తే మాత్రం ఆ యుటోపియా ప్రిమిటివ్ గానూ, కౄరమైనది గానూ కనిపిస్తుంది అని నేను అనుకోను. అదీ మహోజ్జ్వలంగానే కనిపిస్తుంది, ఆ కళ్ళజోడులోంచి. అయితే ముందే చెప్పినట్టు ఎటువంటి కళ్ళజోడులోనూ చిక్కుకోకూడదనే చాదస్తం ఉన్నవాణ్ణి కాబట్టి ఇక్కడితో చర్చ ముగించేస్తున్నా.

  మీరు నా మాట మన్నించి ఇంత విలువైన వ్యాసం రాసినందుకూ, ఓపికగా నాతో చర్చించినందుకూ మరీ మరీ ధన్యవాదాలు. మీ వ్రతభంగం చేయించి ఇంకా ఇలాంటి వ్యాసాలు రాయించాలని కోరిక. ప్రయత్నిస్తాను. మీరూ రాయనని మంకుపట్టు పట్టరనే ఆశిస్తాను.

  ReplyDelete
 11. భారత జాతి దాస్యత్వానికి కేవలం వర్ణ వివక్ష ఒక్కటే కారణమని నేను భావించలేను. మన భారతదేశం ఒకటే కాదు, ఈ ప్రపంచంలో అనేక దేశాలూ, జాతులూ దురాక్రమణకి గురై, దాస్యంలో మగ్గినవే....

  నాకు తెలిసిన వరకు 200 యేళ్ళు దాస్యత్వంలో మగ్గిన దేశం, అదీ ఒకప్పుడు ప్రపంచ దేశాలలో అత్యున్నత స్థాయి లో సర్వతోముఖాభివృద్ధి (సామాజిక పరంగా నాగరికత పరంగా, సంపత్తు పరంగా)సాధించిన దేశం ప్రపంచ దేశాలలో ఏదీ లేదు. దీనికి ఓ బలమైన కారణం అంటూ ఉండాలి అని నా భావన. ఆ కారణం ఏదైనా కావచ్చు.

  సర్వే జనా: సుఖినో భవన్తు’ అనే వైదిక మతం...

  ఇక్కడ ఓ విషయం. నా చర్చ కేవలం వేదాలు, వేద కాలానికి సంబంధించినది. ఉపనిషత్తులు (ఈశ కేన కఠ ముండ మాండూక్య తిత్తిరిః) వేరు. అవి అమూల్యమైనవి. ' సర్వే జనాస్సుఖినో భవంతు ' ...ఇది ఉపనిషత్ వాక్యమని నా భావన (నాకూ సరిగ్గా తెలియదు)..

  ఈ బ్లాగ్లోకంలో అడుగు పెట్టటానికి కారణం మంచి మిత్రులు దొరకవచ్చు అని. (కొంచెం కీర్తి కాంక్ష కూడా ఉండవచ్చు :-)అది నెరవేరినందుకు చాలా ఆనందిస్తున్నాను.ఈ వ్యాసం 3 సార్లు రాసి (రకరకాలుగా) మళ్ళీ సరిదిద్దడం జరిగింది. నా ప్రయత్నాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 12. రవి గారూ, ఇంకా వివరంగా చర్చ కొనసాగించడానికి నాకున్న విషయ పరిజ్ఞానం చాలదు. అయినా నా అభిప్రాయాలు మరి కొన్ని.

  భారత దేశం దాస్యత్వంలో మగ్గినది కేవలం రెండు వందల యేళ్ళు మాత్రమే కాదు. అంతకు ముందు అనేకవందల యేళ్ళుగా దేశంలోని అనేక ప్రాంతాలు ‘పరాయి’ పాలకుల చేతిలోనే ఉన్నాయి అని మరువకూడదు. అందుచేత మొత్తం వెయ్యి సంవత్సరాల దాస్యం అనుకోవాలేమో. అయితే నాకు ఈ విషయం మీద కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఎంత ‘పరాయి’వాళ్ళు పరిపాలించినా తనదైన సొంత అస్తిత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ కొంతమటుకు భారత జాతి నిలబెట్టుకుంటూనే వచ్చింది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. చరిత్రలో దురాక్రమణకు గురైన నాగరికతలు కాలగర్భంలో కలిసిపోవడమో, పరాయి నాగరికతల్లో కలిసిపోయి తమ అస్తిత్వాన్ని కోల్పోవడమో జరిగింది గానీ, ఆ నాగరికతలతో సహజీవనం చేస్తూ తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం జరిగినట్టు కనిపించదు. (ఇస్లాంకు పూర్వం పర్షియా, ఒకనాటి గ్రీకు నాగరికతల గురించి కొంచం ఆలోచిస్తే నాకు కలిగే భావాలు ఇవి. ఎక్కువ వివరాలు నాకు తెలియవు అనుకోండి.)

  ఇక మీరు చెప్పిన మరొక మాట - సర్వతోముఖాభివృద్ధి సాధించిన ఒక సమాజం, పతనమై దాస్యంలోకి దిగజారిపోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి. అవును, నేనూ దీని గురించి చాలా ఆలోచించాను. నా బుద్ధికి తోచినంతవరకు దీనికి కారణం ఒకటే - మార్పును, కొత్తగాలిని ఆహ్వానించలేకపోవడం. ఉష్ట్రపక్షులు ఇసుకలో తల పెట్టుకున్నట్టు సమాజం గతానికి చెందిన భావనల్లోనూ, పడికట్టుల్లోనూ చిక్కుకుని స్టాగ్నేట్ అయిపోవడం. అటువంటి ధోరణుల్లో భాగమే వేల సంవత్సరాల క్రితంనాటి మత భావనలనీ, అస్పృశ్యతా మొదలైన దురాచారాల్నీ మన సమాజం వదిలించుకోలేకపోవడం (ఇప్పటికీ). అయితే సమాజం పతనానికి దాన్ని ‘కారణం’గా కాక వ్యాధి లక్షణంగానే నేను భావిస్తాను. వ్యాధికి కారణం కొత్తగాలి పడకపోవడం.

  కానీ మరొక్క మాటని కూడా మనం ఒప్పుకుని తీరాలి. హైందవ సమాజంలో సంస్కరణలూ, మతభావనల గురించిన చర్చలూ, మార్పును ఆహ్వానించడమూ ఎప్పుడూ జరుగుతూ ఉన్నవే. ఆ విషయంలో ప్రపంచంలో మిగతా మతాలతో పోలిస్తే మనకి ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ. అయినప్పటికీ ఆధునిక ధోరణుల్ని అందిపుచ్చుకోవడంలో ఆలస్యం జరిగిందనీ, అదే దాస్యానికి కారణమనీ నేను అనుకుంటూ ఉంటాను. అయినా మన ఫ్లెక్సిబిలిటీని, భిన్న సంస్కృతులతోనూ, మతాలతోనూ సహజీవనం చేస్తూ కూడా మన అస్తిత్వాన్ని నిలుపుకోగల సామర్థ్యాన్నీ పరికిస్తే మాత్రం నాకు మనసు పులకిస్తుంది.

  వేద కాలంనాటి నాగరికత కన్నా, బౌద్ధ కాలం నాటి నాగరికత ‘ఆధునికమైనది’, సదుపాయమైనది, నాగరికమైనది అంటే ఒకరకంగా ఒప్పుకోడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అదే విధంగా ఈనాటి నాగరికత బౌద్ధకాలం నాటి నాగరికత కన్నా ఉన్నతమైనది అని కూడా నేను భావిస్తాను. కాదు, కాలంతో పాటూ నాగరికత గొప్పది అయిపోదు, అన్ని కాలాల్లోకీ గొప్పది అయిన నాగరికత ఫలానా సమయంలో ఏర్పడింది, దాన్ని మించిన నాగరికత రాబోదు అంటే మాత్రం నేను ఒప్పుకోలేను. అసలు కొత్త నాగరికతలు పాత నాగరికతల కన్నా నిజంగా గొప్పవేనా, అంటే మళ్ళా చర్చ వేరే దారిలోకి పోతుంది. ప్రస్తుతానికి అటు వెళ్ళవద్దు.

  నాగరికతల దృష్టికోణంలో కాకుండా మతాల దృష్టికోణంలో నుంచి చూసినా, బౌద్ధం వైదిక మతం తరవాత పుట్టింది కాబట్టి దానికి అప్పటి వైదిక మతంలో విస్తృతంగా ఉన్న లోపాల్ని సవరించుకోగలిగే అవకాశం ఉంది. అలాగే బౌద్ధం తరవాత వైదిక మతం (లేదా హైందవం) అనేకసార్లు పునరుజ్జీవితం చేయబడింది. ఖచ్చితంగా అది బౌద్ధంలోని ఉత్తమాంశాల్ని స్వీకరించి తనవిగా చేసుకుంది. చాలామంది చేసే పని ఏమిటంటే, ‘పాత’ వైదిక మతంతో ‘కొత్త’ బౌద్ధాన్ని పోల్చి, బౌద్ధం గొప్పది అని నిర్ధారించడం. తరవాత ఆధునిక హిందూ మతమూ, పాత వైదిక మతమూ ఒకటే అన్నట్టుగా మాట్లాడి, ఆధునిక హిందూ మతం కన్నా ‘పాత’ బౌద్ధం గొప్పది అనడం. నిజమేమిటంటే, ఆధునిక హిందూ మతం అనేకసార్లు సంస్కరించబడింది కాబట్టి అది బౌద్ధంలోని ఉత్తమాంశాల్నీ, అనేక ఇతర మతాల సారాన్నీ తనలో ఇముడ్చుకుని ఎప్పటికప్పుడు చైతన్యవంతమౌతూ వస్తోంది. ఉపనిషత్తుల్నీ, పురాణాల్నీ, అద్వైతాన్నీ, రమణ మహర్షినీ, రామకృష్ణ పరమహంసనీ ఆధునిక హిందూమతం నుంచి వేరు చేసి చూడరాదు.

  ఇంతకీ కాళిదాసు విషయానికి వస్తే, రాహుల్ సాంకృత్యాయన్ గారి ఉద్దేశ్యం - కాళిదాసుని పోషించిన రాజులు తిరోగమన వాదులనీ, అంతకు ముందు బౌద్ధ ‘విప్లవం’ ఫలితంగా వచ్చిన నాగరిక ఫలాల్ని చెడగొట్టుకుని సమాజం వెనక్కి వెళ్ళిపోవడానికి కారకులయ్యారనీ, కాళిదాసు రచనలు అటువంటి తిరోగమనానికి తోడ్పడ్డాయనీ భావిస్తున్నట్టు తోస్తూంది. ఎందుకో నాకిటువంటి భావనమీద చాలా ‘అనుమానం’ కలుగుతోంది. గుప్తుల కాలం స్వర్ణయుగమని మనకి తెలుసు. ఆ స్వర్ణయుగ కర్తలు తిరోగమనవాదులు అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆనాటి కాలం కల్పించిన అవకాశాల్ని అంది పుచ్చుకోకుండా వాళ్ళు ఒక సంపన్న సమాజాన్ని ఎలా నిర్మించగలరు? నేనూ దీన్ని భవిష్యత్తులో అనేక కోణాల్లో పరిశీలించి చూస్తాను. దీని గురించి తెలిసిన పెద్దలెవరైనా కూడా ఈ చర్చలో పాలు పంచుకుంటే బాగుంటుంది.

  ReplyDelete
 13. మీ చర్చ చదివాను. ఈ చర్చ లోనో, లేదా ఇలాంటి టపా ఇంకెవరైన సహృదయులో ఇంకొక విభిన్నకోణాన్ని ఆవిష్కరిస్తేనో చాలా బావుంటుంది.

  "గుప్తుల కాలం స్వర్ణయుగమని మనకి తెలుసు. ఆ స్వర్ణయుగ కర్తలు తిరోగమనవాదులు అంటే నమ్మబుద్ధి కావడం లేదు."

  రాహుల్ సాంకృత్యాయన్ గారిని బౌద్ధ పక్షపాతి అనుకోవడం సరికాదని నా అభిప్రాయం. ఆయన ఓ అద్భుత చారిత్రక పరిశీలకుడు కూడాను. గుప్త కాలానికి కాస్త ముందు మగధ సేనాపతి ఇటుకలపై పాళీ భాషలో వ్రాసిన ఓ గ్రంథాన్ని ఆయన త్రవ్వకాలలో వెలికి తీసి, పరిష్కరించారు. ఈ ఇటుకలు పాట్నా మ్యూజియం లో భద్రపరచ బడ్డాయి. (అంటే ఇదే ఆయన నిబద్ధత కు నిదర్శనం అని కాదు...జస్ట్ మీకొక ఇంఫర్మేషన్ లా చెబుతున్నాను)

  గుప్తుల కాలం స్వర్ణ యుగం అన్న విషయాన్ని ఆయన ఎంచేతనో ఒప్పుకోరు. ఆయన ఉద్దేశ్యం ప్రకారం అప్పటి కాలంలో రాజధానులు (రాజులకు సంబంధించిన విషయాలు) తప్ప మిగిలిన జనపదాలన్ని దారిద్ర్యం లో మగ్గాయి. ఆయన ఇలా ఎందుకు అంటున్నారు అన్న దానికి పూర్తి సమాధానం నాకు తెలియదు .

  ఏవో బలమైన కారణాల వలనే ఆయన ఆ అభిప్రాయానికి వచ్చినట్టు కనబడుతుంది. (లేదా బ్రాహ్మణ్యం మీద ద్వేషంతో ఈ అభిప్రాయానికి వచ్చుండాలి. కానీ దీని మీద నాకు అనుమానం గా ఉంది).

  ReplyDelete
 14. ఈ టపా దీని వ్యాఖ్యలు కొద్దిగా పై నుంచి వెళ్ళాయి :)

  అయినా ఈ విషయాలు తెలిపినందుకు ఆనందం. ఈ వీకెండు కూర్చుని తీరిగ్గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తా.

  మీలో చాలా టాలెంటుందండి బాబు. చాలా పుస్తకాలే చదివినట్టున్నారు.

  ReplyDelete
 15. ప్రవీణ్, టాలెంటూ లేదూ, బొచ్చూ లేదు. కొంచెం పుస్తకాల పిచ్చి ఉంది మొదట్నుంచీ. నాగమురళి ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ పాండిత్యం (?) అంతా బయటకు తీయాల్సి వచ్చింది.;-) నాకు వీటికంటే, ఆఫీసులో వ్యవహారాలు, సినిమా సంగతులు లాంటివే బాగా ఇష్టం. అదే నా రేంజి కూడా...

  ReplyDelete
 16. వ్యాసంలో లోతైన విషయాల మీద అందరూ ఆల్రెడీ బోలెడన్ని వ్యాఖ్యలు వ్రాశారు. నాది చిన్న సవరణ మాత్రమే. అనామిక అన్న పేరు చిటికెన వేలుకు కాదు, ఉంగరం వేలుకు సార్థకంగా ఒప్పింది. ఎలా అంటే, పూర్వ కవులను లెక్కపెడుతూ, "కాళిదాసు" అని ఒక వేలు మడిచారు (చిటికెన వేలు వైపు నుంచి లెక్క మొదలెట్టి). కాళిదాసు పేరు చెప్పాక అంతటి కవి రెండవ వాళ్ళెవరూ దొరకలేదుట చిటికెన వేలు పక్కనున్న వేలు మడవడానికి. అందుకని అది "అనామిక" గా మిగిలిపోయింది. చిటికెన వేలుని కనిష్ఠిక అనే అంటారు. ఉంగరం వేలు పేరు అనామిక.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.