Friday, June 13, 2008

అనగనగా ఓ తెలుగక్షరం 'అ ' !

అక్షరాణాం అకారోస్మి
ద్వంద్వస్సామాసికస్య చ

అంటాడు గీతాకారుడు విభూతి యోగంలో. 'అ ' అక్షరానికున్న ప్రాముఖ్యం అది. మన తెలుగు అక్షరాలలో అందమైనది ఏది అని ప్రశ్నించుకుంటే, నా వరకు నాకు దొరికిన సమాధానం 'అ '.
'శ్రీ ' ఇంకా బావుంటుందనుకోండి (జంధ్యాల చంటబ్బాయి ఓ పాట చరణంలో 'శ్రీ ' లో అమ్మాయి రూపాన్ని ఊహిస్తాడు గీతకర్త), ఐతే 'శ్రీ ' సం యుక్తాక్షరం. అచ్చు, హల్లు ల్లో ఇది రాదు.
నా చిన్నప్పుడు మా తాతయ్య అన్నాడో సారి, "మీ చదువులేం చదువుల్రా.." 'అ ' తో ప్రారంభిస్తారు. అప్పుతో చదువు. మేము ఓనామాలు దిద్దుకున్న తర్వాతే ఐదు బర్లు".

ఓనమాలు అంటే ఇప్పటి పిల్లలకు తెలీదేమో మరి, మనలో చాలా మందికి తెలిసిందే "ఓం నమశ్శివాయ, సిద్ధం నమః " అని.
ఇక ఐదు బర్లు అంటే..

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
ఖ గ ఘ ఙ చ చ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ
త థ ద ధ న ప ఫ బ భ మ
య ర ల వ ష స హ
క్ష ఱ ఇతి

ఈ అక్షరాలను చూచి పరవశించే, మన పూర్వ కవులు "ఆణి ముత్యముల సోయగము మించిన వ్రాలు", "లలిత ముక్తాఫలాకార విలసనమున" అని వర్ణించారేమో!

వాటిలో కొన్ని అక్షరాలు ఇప్పుడు రిటైర్ అయిపొయాయి (ఌ, ౡ) అనుకోండి.

ఆ ఐదు బర్లు ఇసుకలో దిద్దుకునే వాళ్ళట. (బరి - కన్నడంలో రాత, వ్రాయి. ఈ బరి - బడి గా రూపాంతరం చెందిందట)

ఇప్పట్లో కాన్వెంట్ రైంస్ లా నేను చదువుకున్నప్పుడు పెద్దబాలశిక్ష లో ఓ తెలుగు రైం ఉండేది.

"ఒంకర టింకర 'ఓ '
దాని తమ్ముడు 'సో '
రెండు గుడ్ల 'మి '
నాలుగు కాళ్ళ 'బే '"

'అ ' అక్షరానికి అలాంటి అవలక్షణాలేం లేవు. ఇది అప్పటమైన తెలుగు అందం. అచ్చు, తిరుపతి లడ్డులా గుండ్రంగా...ఆ లడ్డులో వట్టి ద్రాక్ష ముక్కలా ఎడమ వైపు పైమూల ఓ చిన్న వృత్తం...లడ్డులో గోడంబి ముక్కలా ఓ అడ్డుగీత....

ఈ 'అ ' అక్షరం (ఆ మాటకొస్తే మన తెలుగు లిపి) ఎలా ఉండేది అని పుస్తకాల షాపులో గాలిస్తే ఓ ఆణిముత్యం కనబడింది (వివరాలు చివర్లో). అలానే వికి పీడిస్తే ఈ వివరాలు దొరుకుతాయి.

మన తెలుగు లిపి ది అచ్చంగా 2000 యేళ్ళకు పైబడిన చరిత్ర!

మన దేశానికి సంబంధించిన అతి ప్రాచీన లిపి పాళీ లో 'అ ' ఇలా ఉండేదట. అంతకు ముందు మన దేశంలో చిత్ర లిపి (చిత్రాల ద్వారా రాసుకునే అక్షరాలు - చైనా అక్షరాల లాగా) ఉండేదట. హరప్ప, మొహంజొదడో (సింధు నాగరికత) త్రవ్వకాల్లో ఓ లిపి బయటపడినా, ఆ లిపి ని ఇంతవరకు ఎవరు గుర్తించలేదు!చూడండి. ఇప్పటి మన 'అ ' కు అప్పటికీ పొంతనే కనబడదు. అప్పటి ఆ పాళీ 'అ ' ఇప్పటి మన అందమైన 'అ ' వరకూ సాగిన ప్రస్థానం ఈ
లంకె లో చూడండి. ఆ లంకెలో మధ్య పల్లవుల కాలంలో తెలుగు కాస్త వ్యత్యాసంగా ఉండడం గమనించ వచ్చు. (పల్లవులు తమిళులు కాబట్టి, ఆ అక్షరాలు ఇప్పటి తమిళ అక్షరాలకు మాతృక కావచ్చునేమో)

మన తెలుగు 'అ ' ప్రస్థానాన్ని చూసి, దేవనాగరి లిపి 'अ ' ను కూడా కాస్త ఊహించవచ్చు.

మన భారతీయ లిపికి ఇంకో ప్రాముఖ్యం ఉంది. అదేమిటంటే, అక్షరాలనే కాకుండా, ఒక్కో అక్షరం పుట్టుక స్థానం కూడా కనుగొన్నారు మన వాళ్ళు. వీటిని కంఠ్యములు(గొంతు), తాలవ్యములు(దవడ),మూర్ధన్యములు(అంగిలి),దంత్యములు(పళ్ళు),ఓష్ట్యములు(పెదవులు) అని విభజించారు.ఈ మౌలికమైన విభజన కాక ఇంకొన్ని అక్షరాలను కంఠౌష్ట్యములు, దంత్యౌష్ట్యములు, లాంటి విభాగాల లోనూ చేర్చారు.

గొంతు ద్వారా పలకబడే అక్షరాలు 'అ ', 'క ' , 'హ ' మొదలైనవి. పెదవుల ద్వారా ఐతే 'ప ', 'మ ' మొదలైనవి. పుట్టిన బిడ్డ మొట్టమొదట నేర్చుకునే పదం 'అమ్మ ' అన్నది గొంతు, పెదవి ద్వారా పలకబడే సులువయిన శబ్దాలు ’అ ’ , ’మ ’ కావడమే అని మా తాత చెప్పేవాడు. (మిగిలిన భాగాలు, అంగిలి, దంతాలు మొదలైనవి ఇంకా వచ్చి ఉండవు కాబట్టి.)

అలానే 'అ ', 'హ ' ఇవి పలికేప్పుడు గాలి బయటకు వెళుతుంది. కరుణశ్రీ గారు స్వారోచిష మను సంభవం లో ఓ పద్యానికి (ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో....)భాష్యం చెబుతూ,వరూధిని తనను కౌగిలించుకున్నప్పుడు, ప్రవరుడు ఆమె భుజాలను పట్టి తోసి వేస్తూ, 'హా! శ్రీ హరీ ' అంటాడు కదా ’హా! శ్రీ హరీ ’ అనే అని ఎందుకనాలి? అని చక్కగా విశదీకరించారు.

'హా! శ్రీ హరీ ' అన్నప్పుడు గాలి బయటకు వెళుతుందట. అంటే ప్రవరుడు తన ముఖం పక్కకు తిప్పుకోవడంలోనే కాకుండా, తన వాచికంలోనూ అయిష్టత ను చూపించ దలిచాడట (ఈ 'హా! శ్రీ హరీ ' అని అనడం ద్వారా)

ముగించే ముందు మన తెలుగు వాడి గుత్త సొమ్ము తలకట్టు గురించి ఓ పద్యం గుర్తు చేసుకుంటాను.

కన్నులు దీర్ఘముల్ నగుమొగంబవురా తలకట్టు తమ్మిపూ
పున్నమ చందమామలకు బొక్కిలి చక్కదనంబు చెప్పగా
నున్నదె!మేలు బంతులు పయోధరముల్ మరి కౌను సున్నయౌ
నెన్నిక కెక్కు వ్రాతఫలమివ్వర వర్ణినికిన్నింజంబుగన్.

(ఉపకరించిన పుస్తకం, ఆచార్య తిరుమల రామచంద్ర - మన లిపి పుట్టు పూర్వోత్తరాలు, విశాలాంధ్ర ప్రచురణ)

15 comments:

 1. Hi....
  Mee blog chalabagundandi.Meeku Telusa
  www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
  ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
  www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

  ReplyDelete
 2. చాలా అద్భుతంగా రాసారు,అందుకోండి అభినందనలు

  ReplyDelete
 3. blaagaadinchaaru kadaandi. chaala upayuktam gaa undi mee tapaa!

  ReplyDelete
 4. మీరు చెప్పిన ఐదుబర్లలో తవర్గము లేదు, చూడండి.

  ReplyDelete
 5. అద్భుతమయిన టపా ఇది. మీరు రాసిన వాటిలో బెస్టు. భేష్...

  అన్నట్టు రాఘవ గారన్నట్టే "త,థ,ద,ధ,న" లు ఎందుకు మిస్సయ్యాయో ?

  ReplyDelete
 6. @రాజేంద్ర కుమార్ గారు, @పూర్ణిమ గారు: నెనర్లు.

  @రాఘవ గారు, @ప్రవీణ్ : తప్పు సవరించాను. HTML తో పోరాటంలో 'త ' వర్గం మిస్ అయ్యింది :-). ఇంకో విషయం. ఈ ఐదు బర్లు త్రికోణాకారంలో రావాలి. HTML లో ఎలా మార్చడమో తెలీక వదిలేసాను.
  నెనర్లు.

  ReplyDelete
 7. చాలా మంచి సమాచారం.నా అభిమాన బ్లాగులలో మీది కూడా చేరిపోయింది.అభినందనలు!!!

  ReplyDelete
 8. hi RAVI garu.nice,nice,nice post.
  chala baundi.meenakshi

  ReplyDelete
 9. చాలా బాగుంది మీ అనగనగా ఓ తెలుగక్షరం అ .అక్షర మాలలో ఫ అక్షరం కూడా తప్పి పోయినట్టుంది.మీరుదాహరించిన పద్యం పింగళి సూరన గారి కళాపూర్ణోదయం లోని దనుకుంటా.నాకు బాగా ఇష్టమయిన పద్యాలలో ఒకటి.ఈ పద్యం ఉదాహరించినందుకు మరీ మరీ ధన్యవాదములు.

  ReplyDelete
 10. చాలా బాగుంది, చిన్నప్పుడు చదువుకున్న తెలుగు గుర్తుకొస్తున్నది.

  ReplyDelete
 11. చాలా బాగుందండీ, మంచి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 12. కొన్ని చిత్రమైన విశేషాలు తెలిశాయి. బాగుంది. తెలుగు వర్ణ నిర్మాణంపై పొద్దులో వచ్చిన వ్యాసాలు మీరు చూశారా?
  http://poddu.net/?p=179
  http://poddu.net/?p=190

  ReplyDelete
 13. ఈ టపా చదివి, గుర్తించి, ప్రోత్సహించిన బ్లాగు మిత్రులందరికీ ధన్యవాదాలు.

  @రానారె : అద్భుతమైన సమాచారం. పొద్దులో ఈ టపాలు నిదానంగా చదవాలి. ఇంతకు ముందివి చూడలేదు. చూసి ఉంటే ఇంకా బాగా పరిశీలన చేసి రాసి ఉండే వాణ్ణి.

  ReplyDelete
 14. చాలా బాగుందండీ...

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.