Wednesday, September 19, 2007

శునక సం హిత (కొత్త నిబంధన గ్రంథము - బెంగళూరు)

Statutory warning :


కుక్కలంటే భయపడే వారు, ఇష్టపడే వారు ఈ టపా చదవకండి.


అదో కాళ రాత్రి. రాత్రి 12:30 గంటలు. దూరంగా కుక్కల వూళ వినిపిస్తుంది. మా ఇంటికి రోడ్డు నుండి దాదాపు 1/2 కిలో మీటర్ వుంటుంది. రోడ్డు బాగ ఇరుకవడంతో, అక్కడకు కార్లు, వగైరా వచ్చే అవకాశం లేదు. నేను రోడ్డు దగ్గర దిగి నడుచుకుని వస్తున్నాను. ఒక 20 అడుగులు వేయగానే వెన్ను నుండి చిన్నగా చలి మొదలయ్యింది. దాదాపుగా ఒక డజను శునక రాజములు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాయి. అందులో ఒక కుక్క మేలుకుని వుంది.అడుగు ముందుకేసాను.


చిన్న శబ్దం, గ్ ర్ర్, అని, అలానే కొన్ని అడుగులు ముందుకెళ్ళాను. ఈ సారి బుస్స్ అనే శబ్దం. ఝల్లు మంది గుండె. ఇంకొన్ని అడుగులు ముందుకేసాను. లక్కీ గా ఆ రోజు నేను ఏ రకమయిన యూనిఫారం వేసుకోలేదు. (ఈ సారి బాగ గమనించండి. శునకాలు ఎక్కువగా యూనిఫారం వేసుకున్న వాళ్ళను అంతగా ఇష్టపడవు. ఉదాహరణకు పోలీసులు, పోస్ట్ మాన్, బుడబుక్కల వాళ్ళు వగైరా..). పాపం పోనీలే అని దయ తల్చినట్టున్నాయి, వదిలేసాయి.


ఆ రాత్రి ఓ పీడ కల. కలలో పేపర్ హెడ్ లైన్స్ ఇలా కనబడ్డాయి.

" కుక్కల వేటుకు ఠపా కట్టిన టెకీ!"

" సీమ సిం హం పై గ్రామ సిం హాల దాడి"

" బెంగళూరు శునక పర్వం లో మరో నెత్తుటి పేజీ"


ఎలానో ఆ రాత్రి గట్టెక్కింది.


నేనెలానో తప్పించుకున్నాను, కానీ మరుసటి రోజు ఆఫీసు కు వెళ్ళిన తర్వాత తెలిసింది, మా కొలీగు వాళ్ళ వీధి కుక్కల కరాళ నృత్యానికి బలి అయి, హాస్పిటల్ పాలయ్యాడు అని.


ఈ శునక పర్వం బెంగళూరు లో ఇప్పటికే ఎన్నో అధ్యాయాలు దాటింది.


అయితే పెరుగుతున్న శునక జాతి వలన కొన్ని లాభాలు వున్నాయి. అవి


1. కుక్కలను చంపకుండా వాక్సినేషన్ వేయించి వదలాలి కాబట్టి, ఆ వాక్సిన్ తాలూకు కంపనీ లకు మంచి లాభాలు.


2. బెంగళూరు నిశాచరులు ఇల్లు దగ్గర వున్నా కాబ్/టాక్సి లోనే వెళుతున్నారు. ఎందుకంటే 2 వీలర్ లేదా కాలి నడకన వెళితే అంతే గతి.సదరు టాక్సి కంపనీ వాళ్ళకు యమ గిరాకీ.


3. 2 వీలర్, లేదా కాలి నడక గాళ్ళకు దొంగల భయం వుండచ్చు. టాక్సి అయితే ఆ భయం వుండదు. మహా అయితే టాక్సి డ్రైవర్ ద్వారా మాన భంగమో లేదా ప్రాణ హానో జరగచ్చు అంతే.

నగర పాలికా కార్యాలయం వారు ఇంతకు ముందు ఎవేవో ప్రయత్నాలు చేసి, ఈ సమస్యను ఆఖరు కు గాలికి వదిలేసారు.


ఇప్పుడు కరవమంటే శునక బాధితులకు కోపం, విడవమంటే బ్లూ క్రాస్ వారికి కోపం అన్నట్టు తయారయింది, విషయం. మొన్నామధ్య M.G రోడ్డు లో ఓ బోర్డు చూసాను.ఆ బోర్డు లో ఇలా రాసుంది. "పౌరులకు హెచ్చరిక. మీ పిల్లలను వీధి శునకములతో ఆడుకొనుటకు అనుమతించ వలదుడీ".


ఈ దారుణ శునక సమస్య ను యెదురుకోవడానికి నా వరకు నేను నా శునక సం హిత నుండి కొన్ని బిట్స్ ను ఈ బ్లాగు ద్వారా సూచిస్తున్నాను.

1. ఎల్లప్పుడూ మీ దగ్గర ఒక పొడుగైన కర్ర వుంచుకోండి. వీలయితే కర్ర సాము కూడా నేర్చుకోండి.
2. రాత్రి కాగానే మొత్తం శరీరం అంతా కవర్ అయేలా కవచం ధరించండి.
3. ఎమర్జన్సీ ఇంజక్షన్ లు దగ్గర వుంచుకోండి.
4. పరిగెత్తడం ప్రాక్టీసు చేయండి. మీ టార్గెట్ కుక్క కంటే వేగాన్ని అందుకోవడం.

5. మీ వీధి కుక్కలకు బిస్కట్లు వగైరా ఇచ్చి దగ్గర అవండి.

6. ఆదిమ జాతి మానవుల లాగా విషం పూసిన బాణాలు వగైరా వుపయోగించండి.
...
ఇంక 2, 3 యేండ్ల తర్వాత ఈ కింది పరిణామాలు సంభవించినా ఆశ్చర్యం లేదు. అవేమంటే

చిన్న పిల్లలకు పోలియో మందు లాగా నిశాచరులకు అంటి రేబీస్ ఇంజక్షన్లు వేయించడం.
మన రాజకీయ నాయకులు తమ వాగ్దానాలలో, మేము గెలిస్తే, ప్రతి ఒక్కరికీ కవచాలు, లేదా ప్రతి ఇంటికీ కుక్కల ఇంజక్షన్లు ఫ్రీ., లేదా మీ వీధి కుక్కలను మచ్చిక చేసుకోడానికి, ఇంటికి, ఒక రోజుకు ఒకటి చొప్పున ఒక కుక్క బిస్ఖత్ పాకెట్ ఫ్రీ.

ఏతా వాతా, శునక జాతి పెరుగుదల వల్ల ఇంత మందికి ఇన్ని లాభాలు వున్న కారణంగా, ఈ సమస్య ను నా దృష్టి లో పరిష్కరిచక పోవడమే వుత్తమం. మీరేమంటారు?

3 comments:

  1. బెంగళూరు శునకాలకు నేనూ బాధితుడినే మాస్టారూ... ఈ బాధ తట్టుకోలేకే కాబ్ ని మా ఇంటిదాకా తీసుకెళ్ళేవాడిని. డ్రైవర్ రోజూ, తిట్టేవాడు(పాపం వెన్నక్కి వెళ్దామంటే వన్-వే, ముందుకి వెళ్దామంటే ఇంకో 2కిమీ దూరం పెరుగుతుంది). కానీ కుక్కలచేత కరిపించుకోవడంకంటే ఇతనిచేత తిట్టించుకోవడమే నయం అని ఫిక్సయ్యాను.

    ReplyDelete
  2. హ హ... భలే...బ్లా"డాగించా"రు.. మీకింకో రకం శునకం గురించి చెప్పాలి... మా వీధిలో.. ఒక కుక్క..బాగా "మందు" కొట్టడం నేర్చుకుందండి...దీనిని మేము.. దేవదాసు శునకమని పిలిస్తాం... రోజుకో మందు బాటిల్ దగ్గరుంచుకుంటే దీనిబారినుంచి తప్పించుకోవచ్చన్నమాట...

    ReplyDelete
  3. హహ .. తాగితే మొరగలేను, తాగనివ్వరు. మొరిగితే తాగలేను. మొరగనివ్వరు...టైప్ అన్నమాట. ఇది ఇంకో మంచి ఐడియా. శునకాలకు మందు అలవాటు చేయించడం.

    ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.