Thursday, September 6, 2007

నమ్మ (శక్యం కాని) బెంగళూరు!


బెంగళూరు గురించి బయట జనాలు యేదేదో వూహించేసుకుంటారు సిలికాన్ వ్యాలీ (తొక్కలో వ్యాలీ) అని, చల్లటి ప్రదేశం అనీ, శాంతి కాముకులైన (శాంతి అంటే అమ్మాయి పేరు కాదు) జనాలు గట్రా అని. అయితే ఇక్కడ మరో ప్రపంచం (సినిమా కాదు) మిమ్మల్ను పలకరిస్తుంది. మా (మూగ) బాధలు మీతో చెప్పుకుని కొంచెం సాంత్వన పొందడం కోసం ఇది వ్రాస్తున్నాను.వుపోద్ఘాతంమొన్నామధ్య ఫలాన టీవీ చానెల్లో ఒకతను చీమల్ని నోట్లో కుక్కుకుంటున్నాడు. ఇంకోసారి ఒకాయన తేనెటీగల మధ్య తల దూర్చి పండుగ చేసుకుంటున్నాడు. ఇంకో టీవీ చానెల్లోనేమో ఒక ముస్టి వెధవ మొసళ్ళతో కబడ్డీ ఆడుకుంటున్నాడు. ఈ క్యాటగిరీ జనాలందరికీ సవాల్. (అయితే తోటరాముడు గారికి మినహాయింపు. ఆయన దూల (దుష్ట) దర్శన్ లొ (అ)శాంతి స్వరూప్ ఇంటర్ వ్యూ చూసారు.అలాగే దూల (దుష్ట) దర్శన్ ప్రేక్షకులకు అందరికీ మినహాయింపు.) యెవరైనా సరే మా బెంగళూరు కు వచ్చి విజయవంతంగా ఆటో లో ఒక చోటి నుండి ఇంకో చోటికి (మీటరు మీద, భద్రంగా మరియు మోసపోకుండా), ప్రయాణం చేసి చూపించండి. మీ తఢాఖా ఒప్పుకుంటాం.


***********************************************************************************


ఆటో, రింగ్ రోడ్ బర్తిరా (వస్తారా)?
70/- ఆగత్తె (అవుతుంది).

యాకేరీ, మీటర్ ఆదరే 35/- అల్వా ఆగువదు (ఎందుకండీ, మీటర్ అయితె 35/- కదా అయేది).

అల్లి రౌండ్ ఒడీబేకు, మీటర్ బరల్లా (అక్కడ చుట్టు తిరిగి వెళ్ళలి, మీటర్ కు రాను).

చెసేది లేక ముందుకు వెళ్ళాను. ఆటో వాడు మిగతా ఆటో వాళ్ళతో చెరి, నా మీద జోకులెస్తూ నవ్వుకుంటున్నాడు. గుడ్ల నీరు కుక్కుకుంటూ అక్కడే నిలబడ్డాను. ఇంకో ఆటో అరగంట తర్వాత వచ్చింది. వాడితొ మళ్ళీ..


(పై సంభాషణ మళ్ళీ చదువుకోవలసింది గా ప్రార్థన).


కానీ నా పరిస్థితి చూసి అతనికి జాలి కలిగింది.


సరే సార్, మీటర్ మీద 20/- ఎక్స్ట్రా కొడ్తిరా (ఇస్తారా)?అడిగాడు.

కంటి నిండా నీళ్ళతో కళ్ళు మసకబారుతుండగా సరే అన్నాను. ఎందుకంటే, ఇక వేరే ఆటొ దొరికే చాన్సు లేదు మరి.
వెళుతుండగా ఆటో అతను అడ్డు వచ్చిన 2 వీలర్, 4 వీలర్ జనాలను ఘాటయిన (కన్నడ కస్తూరి) పదజాలం లో దీవించ సాగాడు. కర్ణాటక ప్రభుత్వం, మిగతా రాస్ట్రాల నుండి వచ్చి నమ్మ (నిమ్మ) బెంగళూరులో బతుకుతున్న జనాలు కూడా ఆ దీవెనలకు నోచుకున్నారు.

ఆఫీసు దగ్గర దిగి ఆటో వాదికి 60/- చేతికిచ్చి, భయం భయం గా నిలబడ్డాను, 5 రూపాయలు (చిల్లర) కనికరించి ఇస్తే తీసుకుందామని. ఒక 2 రూపాయలు చెతిలో పెట్టాడు, ఎంతో దయ చూపిస్తూ.

ఆఫీసు లో పని చేయడానికి వుపక్రమించగానే (అంటే.. ఆఫీసు కు వచ్చి, కాఫీ, ఇ మైల్స్, గుంపు గా చేరి మానేజర్ ను తిట్టుకోవడం, పని ఎలా ప్రారంభించాలి అనేదాని మీద మీటింగ్, టీం మేట్ లను డాక్యుమెంట్ పంపమని అడగటం ఇవన్నిటి తర్వాత) ఎందుకో ఆటో వాడు, వాడి దీవెనలు గుర్తొచ్చాయి. ఇంకో సారి కాఫీ తాగితే తప్ప లాభం లేదనుకుని, క్యాంటీన్ కు వెళ్ళాను.
ఇలా బిజీ , బిజీ గా రోజు గడిచిపోయింది.
సాయంత్రం ఆఫీసు నుండి బయటకు వచ్చి గుండెలు పీచు పీచు మంటుండగా ఆటో స్టాండు దగ్గర నిలబడ్డాను. మొదటి ఆటో వాడిని అడిగాను, ఫలానా చోటికి వస్తారా? అని. సరే ఎక్కండి అన్నాడు. నమ్మలేకపోయాను. ఈ మధ్య దేవుడు, పునర్జన్మలు వీటి మీద నమ్మకం బలపడుతున్నట్టు అనుమానంగా వుంది నాకు.సరే, 'ఫలానా' చోట దిగి ఆటో మీటర్ చూసాను. 70/- చూపించింది. పొద్దున ఇదే చోట నుండి ఎక్స్త్రా ఇస్తే కూడా ఇంతవలేదు కదా, పైగా వెళ్ళే దారి రోజు చూసేదే. మోసం చేసి, సందు గొందు ల్లొ తిప్పడం అనే సీన్ లేదు. మరి ?? ఈ భేతాళ ప్రశ్నకు సమధానం ఆలోచిస్తేనే తల వేయి వ్రక్కలు అయేటట్లుంది. జేబు తడుముకుని చూసి కర్రెక్ట్ గా 70/- ఎంచి విజయ గర్వం తో ఆటో వాడికి ఇచ్చాను. 100 ఇస్తాడేమో ఒక 5 రుపాయలయినా నొక్కుదామని చూసిన ఆటో వాలా నిరాశ గా 70/- జేబు లొ పెట్టుకున్నాడు. అతను నా నవ్వు చూసి దండకం ఆరంభించక ముందే, అక్కడ నుండి బయట పడ్డాను.
ఇలాంటి దురదౄష్ట కరమయిన సంఘటనల మధ్య వీక్ ఎండ్ వచ్చింది. సరే అని సాయంకాలం నేను నా రూం మేటు బయటకు అడుగు పెట్టాము. అలా బలాదూరు గా తిరిగి, మ్యూసిక్ వరల్డ్, ప్లానెట్ ఎం లలో సరికొత్త సినిమా పాటలు ట్రయల్స్ లో విని (క్యాసెట్లు, సీ డీ లు 'కొనడం' మా ఇంటా వంటా లేదు)ఒక మంచి భోజనం చేసి (మంచి భోజనం అనగా, రుచి దరిద్రముగా వున్ననూ, సున్నము/సోడా కలపని అన్నము తో కూడిన భోజనము - గ్రహించగలరు) ఆటో కొసం నిలబడ్డాము. బస్సు లో ప్రయాణం చేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే, అంతకంటే, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తేవడం, లేదా (అ)శాంతి స్వారూప్ కవితలు వినడం ఈజీ. ఇక ప్రహసనం మొదలయింది. కనీసం మీటరు మీద ఒకటిన్నర ఇస్తానన్నా ఎవడూ రాడు. టైము 9:30 మాత్రమె. ఇలా 10:15 వరకూ ఒక 20 మంది ఆటో వాళ్ళను బతిమాలిన తర్వాత ఇక లాభం లేదు, ఇక్కద ఈ రోజు కు లాడ్జి తీసుకుని, రేపు పొద్దున బస్సు లో ఇంటికి వెళదాం లే అని డిసైడు అవుతున్నాము. ఆశ చావని మా రూం మేటు ఆటొ కోసం ప్రయత్నించాడు. సక్సెస్స్ ..
ఐన్ స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కనుక్కున్నప్పుడు కూడా ఇంత ఆనందం పొంది వుండడు. (మనల్ను మనం వున్నతమయిన వ్యక్తులతో పోల్చుకోవాలి అని మా కంపనీ హెచ్ ఆర్ వారు సెలవిచ్చారు, యేదో తొక్కలో ట్రైనింగ్ లో, గుర్తు లేదు, అందుకే ఆయనతో పోలిక)

ఇలా రోజులు గడుస్తుండగా, ఓ రోజు మా వాడు యేదో సందర్భం లో, ఆది లొ జూనియర్ ఎంటీఆర్ లా ఆవేశపడ్డాడు. "ఎన్నాళ్ళిలాగ .. ఎన్నాళ్ళిలాగ .." అంటూ. తీవ్రంగా ఆలోచించిన తర్వాత (రామయ్య ఇంటి కప్పుల కొసం ఆలోచిoచినంత కాకపోయినా, ఇంచు మించు గా) ఇక ఆ రోజే అనుకున్నా, ఎలాగయినా సరే, కారు కొనాలని. అది ఎంత దారుణమయిన నిర్ణయమో అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ విషయాలు ఇంకో సారి యెప్పుడైనా ..
(ఈ బెంగళూరు పురాణం మళ్ళీ కంటిన్యూ చేసే వరకూ సశేషం) ..

5 comments:

 1. అందుకే కదా రన్నింగ్ ఆటోలలో ఎక్కాలనేది.

  ReplyDelete
 2. ఎవరన్నా ఒక కొత్త మోటార్ సైకిల్ కనిపెడితే బాగుండును.అది ఎలా వుండాలంటే సైకిల్ లా తొక్కుకునేలా,తేలికగా,ఎక్కువ దూరాలు వెళ్ళేప్పుడు మోటార్ సైకిల్ లా వాడుకునేలా,తక్కువ పెట్రోలు ఖర్చుపెట్టేదిగా వుండాలి.ఇన్ని తిప్పలు పడలేక నాకు తెలిసి ఏ బెంగులూరు వాడో?,హైదరాబాదు వాడో తప్పక కనిపెట్టేస్తాడు.ఏమో మీరే కనిపెట్టేయొచ్చు.
  కష్టాలను కామెడీగా రాయడం చాలా గొప్ప.ఒకరి కష్టాన్ని చూసి నేను నవ్వుకోను అని చెప్పుకునేదానిని.కానీ బ్లాగ్లోకం లో అడుగుపెట్టాకా ఆ మాట చెప్పలేకపోతున్నాను.

  ReplyDelete
 3. బాగా రాసారు రవి గారూ..!! నాకు కూడా బెంగుళూరులో నలుగు సంవత్సరాలు (1998-2002) నివసించిన అనుభవం ఉంది. ఆటో వాళ్ళ దోపిడీకి నేనూ గురయ్యాను. ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదన్న మాట..!! కానీ బైకు మీద నేను తిరిగి ఎంజాయ్ చేసిన రోజులు మాత్రం మరచిపోలేను. మీ కారు బాధల గురించి కూడా రాయండి. పార్కింగ్ బాధల గురించే రాస్తారనుకొంటా..:-)

  ReplyDelete
 4. అవునండీ... బెంగళూరూ ఆటోవాళ్ళు దారుణం మరీ... యశ్వంతపూర్ స్టేషన్ నుంచి ఈఈశ్చ్ కి ఓ 15 నిముషాలు. దానికే 60 రూపాయలు అడిగారు. అక్కడే పక్కనే ఇస్చ్కొన్ ఉంటే అక్కడి నుండి ఇకడికి అరవై మళ్ళీ... ఇవ్వలేదు అనుకోండి అది వేరే విషయం. ఇవన్నీ ఒక ఎత్తు. మీటరేస్తే నలభై యాభై అయ్యే దూరానికి నా ఫ్రెండు ని 300 ఇవ్వమని అడిగాడట ఒక ఆటో వాడు!!!! అయినా, ఆ ఊళ్ళో బస్సు కండక్టర్లు మంచి వారు. కాబట్టి నేను నా stay లో బస్సుల్ని నమ్ముకున్నా.

  ReplyDelete
 5. నేను రోజూ అఫీస్ కి రావాలి అంటే ఆటో తప్పని సరి.. ఎందుకంటే మా టెక్ పార్క్ కి వచ్చే బస్సులు మా రూట్ లో లేవు.. సరే ఏమి చేస్తాం అని రోజూ ఆటోలో నే వస్తున్నాను..

  అసలు ఈ ఆటో సమస్యతోనే, నేను బ్లాగడం మొదలుపెట్టాను..

  ఈ సమస్యలన్నీ చూసి, మీకు కార్ కొనాలనిపించింది.. అదే నాకైతే ఆటో కొనుక్కోవడం బెటరేమో అనిపిస్తోంది..!

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.