Friday, September 14, 2012

వీణ వేణువైన మధురిమ!


ఆయన పాటలో ఆయన వేషం లానే పటాటోపాలు ఉండవు. పెద్ద పెద్ద సమాసాలు, బిగువైన పదబంధాలు, ఊపిరి తిప్పుకోలేని అద్భుతాలు లేవు. అలా రాయలేక కాదు. అవసరం లేక అలా రాయడాయన. చిన్న చిన్న తెనుగు పదాలతో మనసులను మైమరపించగలిగిన కలం ఆయనది. ఆయన పెన్నులో ఇంకు వాడతారో లేక తేనె వాడతారో తెలీదు కానీ రాసిన పాటలో మాత్రం మాధుర్యం కారిపోతూ ఉంటుంది.

ఒకపక్క బాలు, జానకి, మరోపక్క తెరపై నటించడానికి ముచ్చటైన జంట రంగనాథ్, ప్రభ. ఇంకేముంది? బాలు కు తోడు జానకి గారు, నటించడానికి చక్కనైన జంట ఉంది కాబట్టి "పూలు గుసగుసలాడేనని" పాటలోలాగా, గాయకుడు, నటుడు కలిసి రచయిత ను, సంగీత దర్శకుడిని తుక్కు రేగ్గొట్టాలి. కానీ అలా జరగలేదు. బాలు గొంతులో మాధుర్యం, జానకి గొంతులో నయగారాలు ఆ అపురూపమైన సాహిత్యానికి పక్క వాయిద్యాలుగా చేరిపోయాయి. మనోహరమైన సంగీతానికి పల్లకీలు మోసినాయి. వేటూరి, రాజన్ నాగేంద్ర గారలు చిరస్మరణీయులు అయ్యారు. వేటూరి గారి కలం వేణువు, రాజన్ నాగేంద్ర గారల సంగీతం వేణునాదమూ అయినాయి.

*************************************************************************

ఈ పాట ఇంటింటి రామాయణం సినిమా లోనిది. అనగనగా ఒక డాక్టరు. ప్రవృత్తి రీత్యా కవి. చిన్న చిన్న కవితలల్లుతుంటాడు. గొప్పింటి బిడ్డ. ఆయనకు నచ్చిన అమ్మాయితో వివాహమైంది. మనసైన వాడు. అమ్మాయి అణకువ, అందమూ కలబోసిన చక్కని చుక్క. వారి దాంపత్యం, ప్రేమ పాటగా జాలువారింది.

ప్రేమ పాట కాబట్టి ప్రేమ, మనసు, అనురాగం, దాంపత్యం, హృదయం, మమత, ప్రాణం ఇలాంటి శబ్దాల్లో ఒక్కటైనా వినబడాలి మరి.

చిత్రం! అవేవీ ఈ పాటలో లేవు. మరో చిత్రం - ఆ సినిమాలో నాయకుని ప్రవృత్తి కవిత. ఆ ’కవిత’ ను ఒదల్లేదాయన. అక్కడా చాలా అర్థం ఇరికించాడు. వేటూరి కలం ఎలా మెలికలు తిరిగిందో చూడండి.

పల్లవి:

వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో...


అబ్బాయి మనసు వేణువు, అమ్మాయి మనసు వీణ. మనసు కు బదులుగా అనురాగాన్ని కానీ, ఆరాధనను కానీ దేన్నైనా ప్రతిక్షేపించుకోవచ్చు. ఎంత క్లాసుగా ఊహించవచ్చో, అంత మాస్ గా కూడా ఊహించుకోవచ్చు. అది వేటూరి స్పెషాలిటీ!

వేటూరి కలం చిలికించిన ’ప్రాస’ లీలను ఇక్కడ చదువుకోండి. ఈ పాట గురించి వివరించి స్వారస్యం చెడగొట్టటం వద్దు.

’కదిలే అందం కవిత....అది కౌగిలి కొస్తే యువత’ - అబ్బాయీ నీవు రాసే కవితలు కాదు, నీ ఎదుట కదిలే అందాన్ని చూడలేదా? ఆ అందాన్ని కౌగిట్లో చేరిస్తేనే నీ యౌవ్వనానికి సార్థకం....కాదంటావా?....

పాఠకవర్యా! ఎన్ని అర్థాలు ఊహించుకుంటారో ఊహించుకోండి. ఇది మీకు విందుభోజనం....ఇదే వేటూరి ఆహ్వానం.


సరే. పాట చదువుకున్నారు కదా. ఇప్పుడు సంగీతానికి వద్దాం. ఇప్పుడు పాటను పల్లవి ఆరంభం ముందు వరకూ వినండి. పాట ఆరంభంలో వీణ! ఆ వీణ అలా మెలమెల్లగా వచ్చి మురళీనాదంతో లీనమవడం - అంటే వీణ వేణువైన సరిగమ, తీగె రాగమైన మధురిమ ను గమనించారా?  ట్యూను తో సంగీతదర్శకుడు భావాన్ని చెబితే, ఆ భావాన్ని మనసుతో పట్టుకుని అందుకు అనుగుణంగా పాట వ్రాయడం వేటూరికి చెల్లింది.
సరిగ్గా అర్థం కాకపోతే మరోసారి పాటను చూస్తూ వినండి.


మొదటి చరణం జానకితో మొదలెడితే, రెండవ చరణం బాలు తో మొదలు. రెండు చరణాల మధ్యలో హమ్మింగ్. వేటూరి కలం ప్రాస! ఆహా! ఎంత అందమైన symmetry?

ఈ పాటలో జానకి "తహ తహ" లాడాల అన్నప్పుడు పరవశమూ, బాలూ "అహాహా లలలా" అని రాగం తీసినప్పుడు ఉన్న అలవోక, అద్భుతంగా ఉన్నా, "పూల గుసగుస లోలా" డామినేట్ చేయలేదు. వాళ్ళ పప్పులు వేటూరి ముందు ఉడకలేదు. అలాగే - ’కదిలే అందం కవిత’ అన్నప్పుడు నాయిక అందంగా సిగ్గు పడటం, ’చెలి ఊగాల ఉయ్యాల లీవేళలో’ - అన్నప్పుడు నాయిక, నాయకుల మధ్య అందమైన బిట్ వంటివి - సంగీత మాధుర్యాన్ని పెంచాయే గానీ సంగీతాన్ని మర్చిపోయే విధంగా కళ్ళకు పని చెప్పలేకపోయాయి. 


రాజన్ నాగేంద్ర గారల దమ్ము అది! ఇంకా రాజన్ నాగేంద్ర ల గురించి తెలియాలంటే ఈ పాట మాతృక , కన్నడ సినిమా పాటను చూడండి. కన్నడ పాట విరహ గీతం. తెనుగు పాట ఆహ్వాన గీతం. రెంటికీ దాదాపుగా ఒకే ట్యూను? ఎలా సాధ్యం? అది రాజన్ నాగేంద్ర గారి ఇంద్రజాలం. ఈయన పాటల్లో నాకు తెలిసి వినలేనివంటూ ఒక్కటీ లేవు. అంత మధురమైన సంగీతం ఆయనది.ఈ పాట సాహిత్యానికి, సంగీతానికి సంబంధించి నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇంటింటి రామాయణం సినిమాకు ’హొంబిసిలు’ అనే నవల ఆధారితమైన కన్నడ సినిమా మూలం.

10 comments:

 1. అద్భుతంగా రాసారండీ,దీన్ని మన వేటూరి సైట్ లో ఉంచుతాను కొన్ని రోజుల తర్వాత మీరు అనుమతిస్తే

  ReplyDelete
 2. దీనిమీద కృష్ణన్న పాటే అదరహ...ఏనాటికైనా...జై సూపర్ స్టార్...జై జై సూపర్ స్టార్..నావరకూ....ఆయన స్టెప్పేస్తే వేటూరి సాహిత్యమెంత - బలాదూర్..... :)

  BTW - రాజన్ - నాగేంద్ర అన్నదమ్ములు...

  ReplyDelete
 3. ఈ పాటలో హీరోయిన్ ప్రభ, కవిత కాదు.

  ReplyDelete
 4. పప్పు సార్: తప్పకుండానండి.
  మాగంటి వంశీ: నూటయాభై శాతం ఏకీభవిస్తున్నాను. వేటూరి లాగ పాట రాయచ్చేమో కానీ కిట్టన్న లా ఆట అసాధ్యం. :)
  మహెక్: సవరణకు నెనర్లు. తీరుబాటుగా సవరిస్తా.

  ReplyDelete
 5. నాకు చాలా ఇష్టమైన పాట. ఇంటింటి రామాయణం అనే పేరు విని హీరో చంద్రమోహనేమో అనుకున్నాను. అయితే రంగనాథ్ అన్నమాట.వీడియో కోసం చాలా వెతికాను.ఈ మధ్యే అప్‌లోడ్ చేసినట్లున్నారు.పాటతో పాటూ వీడియో లింక్ జతచేసినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 6. Super song... super lyrics...Super post ravi gaaru ;)

  ReplyDelete
 7. తెలుగులో రాజన్ నాగేంద్ర గారు చేసిన పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఇంటింటి రామాయణం, నోము (ఎన్నెన్నో జన్మల బంధం..పాట) ఇంకా కొన్ని జంధ్యాల సినిమాలకి చేసారు. మన చక్రవర్తి గారు కూడా వీరి వద్ద కొన్ని రోజులు శిష్యరికం చేసారని ఎక్కడో చదివాను.నాకు ఇష్టమయిన పాటల్లో ఇది ఒకటి.

  ReplyDelete
 8. నిజాన్ని ఎదురుకోలేక మనిషి అల్లుకున్న అనేక అబద్ధాలకలలో ఇవన్నీ భాగం। దీని మీదనెప్పుడైన ఒక టపా వేస్తాను। ప్రస్తుతం అంత తీఱిక లేదు।

  ReplyDelete
 9. వినాయక చవితి శుభాకాంక్షలు!

  ReplyDelete
 10. You have got me back to that golden era My friend...I am a staunch admirer of Rajan-Nagendra..Every song of theirs is tingled with some sweetness..especially the bells are their stamp...what to say about Veturi....there is none to compare....!

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.