Friday, March 30, 2012

కహానీ - స్క్రిప్టు యండమూరి (టూకీగా) రాస్తే?***********************************************************
గమనిక: ఈ పోస్టు ముఖ్య ఉద్దేశ్యం వీరేంద్రనాథ్ కు పేరడీ. ఇది కహానీ సినిమా రివ్యూ కాదు.
***********************************************************

ప్రోలోగ్


"మిసెస్ విద్యా బాగ్చీ?" - సన్నగా, స్ఫుటంగా వినిపించింది పక్కనున్న చీకటి సందునుండి.

విద్యాబాగ్చీ అనబడే ఇరవై ఎనిమిదేళ్ళ అమ్మాయి పక్కకు తిరిగి చూసింది.

"మీ ఆయన అర్ణబ్ బాగ్చీ మీకు కావాలా?" పక్కన చీకటి సందునుండి వెలుగులోకి వస్తూ అన్నాడతను. సన్నగా, బలంగా ఉన్నాడతను. ఫుల్ స్లీవ్ షర్టు, కాస్తంత పైకి మడిచి ఉంది. జీన్సు పేంటు.కాస్తంత గడ్డం. అది కాదు ఆమె చూస్తున్నది. అతని కళ్ళు. వేటాడే చిరుతపులి కళ్ళలా ఉన్నాయవి.

"ఎవరు నువ్వు?"

సముద్రపు గాలి చల్లగా వీస్తోంది. దూరంగా దుర్గా దేవి నిమజ్జనం తాలూకు సందోహం వినబడుతోంది.

"తెలుసుకుని ఏం చేస్తారు?" - చిరుతపులి లానే సన్నగా నవ్వేడతను.

మి-ల-న్ దా-మ్జీ - విద్యాబాగ్చీ గొంతు నుంచీ సన్నగా కీచుగా వచ్చింది. ఆమె భయం ఆవేశాన్ని కప్పిపుచ్చలేకపోయింది. "తేగలవా? నా భర్తను తెచ్చివ్వగలవా?" హిస్టీరిక్ గా ముందుకు రాబోయింది.

అప్పుడు కొట్టేడతను. సరీగ్గా ఆమె ఊపిరితిత్తులు అంతమయి కడుపు మొదలయే చోట పిడికిలి బిగించి కంటికి కనిపించనంత వేగంతో. ఆ దెబ్బకు ఆ అమ్మాయి మూడడుగులు వెనక్కి వెళ్ళి కూర్చుండి పోయింది. బాధతో అంగలార్చుకుపోతున్నందున ఆమె ముఖంలో భావాలు కనిపించడం లేదు.

అతడు తాపీగా లేచాడు. నింపాదిగా జేబు నుండి పిస్టల్ తీసి గుళ్ళు లోడ్ చేశాడు. లేడి ఎక్కడికీ తప్పించుకుపోలేదని తెలిసిన తర్వాత పులి ఎలా తనని సమీపిస్తుందో అలా నెమ్మదిగా ఆమెను సమీపించేడు. ఆమె నుదుటికి పిస్టల్ సరీగ్గా పది అంగుళాల దూరంలో గురిపెట్టేడు.

అయిపోయింది. అన్నేళ్ళుగా తను పడిన తపన మొత్తం మరో క్షణంలో ముగిసిపోబోతూంది.  ఆమె తలపైకెత్తింది. తన ముఖం భావగర్భితంగా ఉంది. చావును ఆహ్వానిస్తున్నట్టుగా కళ్ళు మూసుకుంది. దూరంగా "దుర్గా మా కీ జై" అని భక్తుల నినాదాలు వినిపిస్తున్నాయి.

...
...

దుర్గాదేవి నిమజ్జనం లాగానే ప్రతీ కథా ఎక్కడో ఒక చోట అంతమవుతుంది.

***********************************************************

ప్రోలోగ్ కి ప్రోలోగ్


మే 25,2008.

కలకత్తా మెట్రో రైలు యథావిధిగా ప్రయాణికులని మోసుకుంటూ హడావిడిగా వెళుతూంది. క్రిక్కిరిసిన కంపార్టు మెంటు అది. స్త్రీలే ఎక్కువశాతం. రైలు వెళ్ళే ఆ రూట్లో కూలినాలి చేసుకునే స్త్రీలే ఎక్కువగా కాబట్టి అందులో ఆశ్చర్యమేం లేదు.

ఒకావిడ తనబిడ్డను సముదాయించలేక అవస్థపడుతూంది. "అలా ఏడిపించకపోతే పాలు  తాపించరాదా?" మందలిస్తున్నట్టుగా అంది పక్కనున్న ముసలావిడ. బిడ్డనెత్తుకున్నావిడ పక్కకు తిరిగి ఏదో చెప్పింది. రైలు శబ్దంలో ఆమె మాటలు ఎవరికీ వినబడలేదు. కాసేపటి తర్వాత ఆమె తన బిడ్డతో దిగిపోతుండగా, వెనుకనున్న ముసలావిడ పిలిచింది. "ఏవమ్మో నీ సంచీ" - సంచీలో పాలసీసా, అందులో పాలు. ఆ యువతి హడావుడిగా దిగిపోయింది. రైలు బయలు దేరుతుండగా ముసలావిడ పాలపీక తెరిచింది.

అదే ఆమె చేసిన తప్పు.

ఏం జరిగిందో తెలీదు. కొన్ని క్షణాల తర్వాత ఆ కంపార్టుమెంటులో అందరూ నిర్జీవంగా పడి ఉన్నారు. ఇదంతా తెలియని రైలు పట్టాలమీద ప్రయాణిస్తూ ఉంది.

రైలునుండీ ఆమె దిగుతున్నప్పుడు ఆమె పక్కన ఒకతను దిగేడు.

అతని కళ్ళు - అచ్చంగా చిరుతపులి కళ్ళల్లా ఉన్నాయి.

***********************************************************

ఆరంభం


ప్రతీ కథా ఎక్కడో ఒకచోట మొదలవాలి. కాల్పనిక కథను నిజమైన కేరక్టర్ తో మొదలు పెట్టడం మంచిది. ఈ కథకు సంబంధించి ఆ కేరక్టర్ పేరు సాత్యకి.

సాత్యకి - చిన్నవయసులోనే డిపార్టుమెంటులోకి అడుగుపెట్టాడు కాబట్టి అధికార దర్పం కానీ, హోదా కానీ అలవడలేదు. చురుకైన కళ్ళు, ఎప్పుడు చిరునవ్వుతూ ఉండే సన్నని పెదాలు, వాటిని కప్పి వేస్తూ సన్నగా, వత్తుగా అందమైన మీసాలు.

అతడు భాషాపరశేషభోగి కాడు కానీ మకరాంకశశాంకమనోజ్ఞమూర్తి. ఇక మిగిలిన విశేషణాలు కథకు సంబంధించి అనవసరం. వరూధినికి మీసాల పట్టింపు లేకపోతే ప్రవరుడికి బదులు ఇతడికే ప్రాంచద్భూషణబాహుమూల రుచి చూపించి ఉండేది. వసుచరిత్రకారుడు ఈతణ్ణి చూసి ఉంటే అనవసరంగా ముక్కు గురించి అంత అందమైన పద్యం అనవసరంగా ఎందుకు వ్రాశానా అనుకుని ఉండేవాడు.

ప్రస్తుతం పోలీసు సాత్యకి ఆ కంప్యూటర్ తో కుస్తీ పడుతున్నాడు. కాళీఘాట్ పోలీస్ స్టేషన్ దేశంలోని అన్ని పోలీసు స్టేషన్ల లానే అస్తవ్యస్తంగా ఉంది.

"ఎక్స్ క్యూజ్ మీ"

యస్ మేడం - ఎనిమిది నెల గర్భవతి పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టడం ఎన్నడూ చూడని ఎస్సై కాస్త కంగారుగా ఆమెను కూర్చోమన్నట్టు సైగ చేస్తూ అన్నాడు.

"మీరు?"

"నా పేరు విద్యా బాగ్చీ. నేను లండన్ నుండి వస్తున్నాను. మా ఆయన అర్ణబ్ బాగ్చీ రెండేళ్ళుగా కనిపించడం లేదు."

లండన్ - అనగానే ఎస్సై ముఖంలో తెచ్చిపెట్టుకున్న వినమ్రత కనిపించింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలినా వాళ్ళ దేశంపట్లా, వాళ్ళ నగరం పట్లా వినమ్రతను ఇంకా తీసికెళ్ళినట్టు లేదు.

"చాయ్ తాగుతారా?"

"వద్దు" - మొహమాటంతో అందావిడ.

ఇప్పుడు చెప్పండి - "మీ పేరు", "మీ ఆయన పేరు", "ఆయన వివరాలు" - ఎస్సై తనే స్వయంగా రాసుకోసాగాడు. పక్కనున్న సాత్యకి కంప్యూటర్లో చూపిస్తున్న సిస్టమ్ ఎర్రర్ ను - ఓస్ ఇదెంత అన్నట్టు చూస్తున్నాడు.  తాము ఒక భయంకరమైన వలయంలో ఇరుక్కుపోతామని ఆ క్షణాన వాళ్ళిద్దరికీ తెలియదు.

వివరాలు ముగించి లేచింది విద్య. పక్కనున్న సిస్టమ్ ను చూసి, "నేను సహాయం చేయనా" అని అడిగింది. చొరవగా వెళ్ళి ఒక్క క్షణంలో సరిచేసింది. "చిన్న మెమరీ ప్రాబ్లెం అంతే" - అని సాత్యకిని చూసి నవ్వింది.

ఆమె బయటకు రాగానే ఎస్సై ఆమెను జీపులో దింపిరమ్మని సాత్యకికి చెప్పాడు.

కథ మొదలయింది.

***********************************************************

"పెళ్ళయి కొంతకాలం కాపురం చేసి పెళ్ళానికి కడుపు రాగానే ఎలా వదిలించుకున్నాడో చూశావా? నేను ముప్ఫై యేళ్ళ నుండి ప్రయత్నిస్తూన్నాను. కుదరడమే లేదు" - పక్కనున్న పోలీసతనితో చెబుతున్నాడు ఎస్సై. ఉద్యోగం తాలూకు ఫ్రస్ట్రేషన్ ను సంసారంపై చూపించే సగటు సుబ్బారావు మనస్తత్వానికి ప్రతీక ఆ ఎస్సై. ప్రస్తుతం విద్యాబాగ్చీ అనబడే ఆ లండన్ అమ్మాయిని వదిలించుకుందామన్నా వదిలించుకోలేకపోవడం వల్ల వచ్చిన చికాకును తన తోటి పోలీసుతో పంచుకుంటునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఆ పోలీసులు చేయలేని పని విద్యాబాగ్చీ తనంతట తను చేసుకు పోతూంది. అప్పటికే ఆమె తన భర్త బస చేసిన హోటల్లో రూము తీసుకుంది. అతను పని చేసిన అసైన్ మెంట్ కు సంబంధించిన సంస్థ కార్యాలయానికి వెళ్ళి ఆ కంపెనీ తాలూకు మానవవనరుల అధికారిణి తో మాట్లాడి వచ్చింది. తన భర్త ఆనవాళ్ళు దొరకలేదు కానీ అతణ్ణి పోలిన మిలన్ దామ్జీ అనే ఒకతను అదే సంస్థలో పని చేస్తున్నట్టు, అతని ఆనవాళ్ళు పాత ఆఫీసు ఫైళ్ళల్లో దొరకవచ్చన్న సమాచారం సేకరించింది.


విద్యాబాగ్చీ చేస్తున్న ఈ ప్రయత్నంలో ఆమెకు సహాయపడుతున్నది సాత్యకి.

***********************************************************
ఒక సాధారణ ఎల్ ఐసీ ఏజెంటు అతను. వలయాలు గా ఉన్న కళ్ళజోడు, కాస్తంత పొట్ట, మెడపై సంచీ, ఒక చిన్న సెల్ ఫోను, ముడతలు పడ్డ ముఖం, బీదనవ్వు అతని ఆభరణాలు. రోజూ లాగే అతని ఆఫీసరు తిడుతున్నాడు. ఆఫీసరు తిట్లను తప్పించుకుందుకు ఫోనులో మాట్లాడుతున్నట్టు ఎవరితోనో ఫోనులో మాట్లాడుతున్నాడు అతను. మరి కాసేపటికి తన స్కూటర్ లో క్లయింటు దగ్గరికి బయలుదేరేడు.

లిఫ్టు లో ఒక నడివయసు స్త్రీ పైకెళుతూంది. ఆమెయే ఈతని క్లయింటు. లిఫ్టు ఆగగానే తలుపులు తెరుచుకున్నాయి. ఏం జరుగుతూంది తెలిసేలోపల ఆమె నుదుటిన కాల్చేడు. మరో బుల్లెట్టు ఛాతీలోకి దూసుకు వెళ్ళింది. తాపీగా బయటకు వచ్చేసేడు.

ఒక క్లయింటు పని అయిపోయింది. మరో ఇద్దరు అంతే. ఆ ఇద్దరు - ఒక డాక్టరు, మరో అమ్మాయి. ఆ అమ్మాయి ఫోటో సెల్ ఫోను లో అమాయకంగా నవ్వుతూంది. ఆ అమ్మాయి పేరు వి-ద్యా-బా-గ్చీ.

జాగ్రత్తగా గమనిస్తే అతని బీదనవ్వు వెనుక నిర్లిప్తతతో కూడిన క్రూరత్వం కనబడుతూంది.

***********************************************************

సీబీఐ ఆఫీసు, న్యూఢిల్లీ.

సీనియర్ ఆఫీసర్ ఖాన్ చూడ్డానికి సాధారణంగా ఉంటాడు. అతనికి ఎథిక్స్ తెలియవని, మాట్లాడ్డం రాదని, ఈ ఉద్యోగానికి అతను పనికి రాడని ఆఫీసు వర్గాల్లో కొందరు చెప్పుకుంటూ ఉంటారు. చాలా కొద్ది మందికి మాత్రమే అతడి గురించి తెలుసు.

ఖాన్ సిగరెట్టు వెలిగించాడు. అలానే మీటింగు జరుగుతున్న డైరెక్టర్ గదిలోకి సూటిగా వెళ్ళేడు. మిలన్ దామ్జీ కోసం లండన్ నుంచి వచ్చిన ఒకావిడ వెతుకుతూందన్న వార్త చెప్పదం కోసం. సీబీఐ డైరెక్టర్ ముఖంలో తొట్రుపాటు స్పష్టంగా కనిపించింది. ఆ తొట్రుపాటుకు కారణం ఆ వార్తో, లేక ఖానో సరిగ్గా తెలీదు. ఆ తర్వాత రోజు సరీగ్గా పొద్దున పది గంటలకు ఖాన్ కాళీఘాట్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు.

***********************************************************

"నాకు ఈ పోలీస్ స్టేషన్ మరో రెండు నిముషాల్లో ఖాళీగా కావాలి"

ఆ కంఠంలో కనిపిస్తున్న అధికారానికి ఎస్సై బిత్తరపోయేడు. ఈ మధ్య పోలీసు స్టేషన్ లో ఇటువంటి వాళ్ళ తాకిడి ఎక్కువవుతూంది. "ఎవడుబే నువ్వు?" - తెచ్చిపెట్టుకున్న పోలీసు దర్పంతో అడగబోయేడు.

"అబే, ఖాన్" - ఒక బూతు మాటకు తన హోదాను జోడించి చెప్పేడు ఖాన్. మరో రెండు నిముషాల తర్వాత పోలీస్ స్టేషన్ ఖాళీ అయింది.

అక్కడికి అదే సమయంలో విద్యాబాగ్చీ వచ్చింది. ఆమెకు ఖాన్ ఎదురయ్యేడు. సిగరెట్టు పొగ ఆమెపై వదులుతూ కటువుగా చెప్పేడు. "మిలన్ దామ్జీ లేడు. సెమెక్ ఆఫీసులో రెండు వేల మంది ఉద్యోగులున్నారు. వాళ్ళల్లో మిలన్ దామ్జీ అనేవాడు లేడు. మీరు మీ అన్వేషణ మానేసి లండన్ కు తిరిగి వెళ్ళడం మంచిది"

సరీగ్గా ఇక్కడే ఖాన్ ఆ అమ్మాయిని తక్కువగా అంచనా వేసేడు.

***********************************************************

విద్యాబాగ్చీ సాత్యకి సాయంతో పాత ఆఫీసులో చొరబడి మిలన్ వివరాలు సేకరించింది. దాని సాయంతో అతని అడ్రసు, అతని బ్లడ్ గ్రూపు తదితర వివరాలు అనేకం సేకరించింది. ఈ తీగ సాయంతో సెమెక్ సంస్థలో కుట్రకు మూలకారణమైన వ్యక్తిని కూడా పసిగట్టగలిగింది. ఇటుపక్క సాత్యకి పోలీసు ఇన్ఫార్మర్ సాయంతో మరిన్ని వివరాలు సేకరించేడు.


మధ్యలో ఆమెపై మూడు హత్యాప్రయత్నాలు జరిగేయి. మొదటిది కేవలం భయపెట్టటానికయితే మిగిలిన రెండూ నిజమైనవి. ఆ రెండు హత్యాప్రయత్నాల్లో ఆ హత్యకు ప్రయత్నించిన వాళ్ళే చనిపోయేరు. అందులో రెండవవాడు కేసుకు కీలకమైన రుజువు.

***********************************************************

తన ముఖ్యమైన రుజువు హతుడయ్యాడని విని సీబీఐ ఆఫీసర్ ఖాన్ కట్రాట అయ్యేడు. కోలగా, క్రూరంగా ఉన్న అతని ముఖంపై కుడివైపు దవడకండరం బిగుసుకుని ఉంది.

చివరిగా మిగిలింది మరొక్కరు అంతే. అతను ఈ కేసుకు మూల సూత్రధారి. అతణ్ణెలా కనుక్కోవాలి. ఖాన్ కు దిగిరాక తప్పలేదు. తన జీవితంలో మొట్టమొదటి సారి విద్యా బాగ్చీ ని అర్థించేడు.

ఖాన్ అంచనా తప్పు కాలేదు. కేసు కొలిక్కి వచ్చేసింది. అయితే చివర్న క్రిమినల్ ను పట్టుకో బోయే ముందు ఒక చిన్న రివెంజ్ తీసుకోదల్చుకున్నాడు. ఆ రివెంజ్ తాలూకు విలువ విద్యా బాగ్చీ ప్రాణం. అందుకు ఏమీ చేయనవసరం లేదు. ఆమెను తన మానాన తనను వదిలేస్తే చాలు. సాత్యకిని మాత్రం దూరంగా పెట్టాలి.

***********************************************************
సాత్యకి -

ఒక వ్యక్తిలో తనకు నచ్చిన గుణం కనబడితే అది ఆరాధనకు దారి తీస్తుంది. సాత్యకికి ఆమె పట్ల ఉన్నది తనకు ఉన్న ఫీలింగు ప్రేమ కాదని తెలుసు. అయితే ఆ ఇది ఏదో అర్థం కావడం లేదని కూడా తెలుసు. కొన్ని కొన్ని ఫీలింగ్స్ కి లాజిక్ అవసరం లేదు. అతని భావం విద్యకు కూడా తెలుసు. అయితే ఈ కథ ముగింపు గురించి విద్యాబాగ్చీ కి తెలిసినంత స్ఫుటంగా సాత్యకికి తెలియదు. సాత్యకికి విద్య పట్ల స్నేహభావమే మిగిలింది. అతడు ప్రవరుడిలానే స్వచ్ఛంగా మిగిలేడు. ఆమె ప్రాణాలను కాపాడగలిగేడు. అలా ఆమెకు సహాయపడిన తృప్తి అతని మీసాల వెనుక చిరునవ్వులో గర్వంగా ఒదిగింది.


అతడి వైపు నుంచీ చెప్పడానికి ఇక ఏమీ లేదు.

***********************************************************
ఎపిలాగ్

"ఎవరు నువ్వు?"

సముద్రపు గాలి చల్లగా వీస్తోంది. దూరంగా దుర్గా దేవి నిమజ్జనం తాలూకు సందోహం వినబడుతోంది.

"తెలుసుకుని ఏం చేస్తారు?"

"తేగలవా? నా భర్తను తెచ్చివ్వగలవా?"

అప్పుడు కొట్టేడతను. సరీగ్గా ఆమె ఊపిరితిత్తులు అంతమయి కడుపు మొదలయే చోట పిడికిలి బిగించి కంటికి కనిపించనంత వేగంతో.

అతడు తాపీగా లేచాడు. నింపాదిగా జేబు నుండి పిస్టల్ తీసి గుళ్ళు లోడ్ చేశాడు. లేడి ఎక్కడికీ తప్పించుకుపోలేదని తెలిసిన తర్వాత పులి ఎలా తనని సమీపిస్తుందో అలా నెమ్మదిగా ఆమెను సమీపించేడు. ఆమె నుదుటికి పిస్టల్ సరీగ్గా పది అంగుళాల దూరంలో గురిపెట్టేడు.

అయిపోయింది. అన్నేళ్ళుగా తను పడిన తపన మొత్తం మరో క్షణంలో ముగిసిపోబోతూంది.  అతని వేళ్ళు తుపాకీ ట్రిగ్గర్ దగ్గరగా వచ్చేయి.

సరీగ్గా అప్పుడు అతను ఊహించని సంఘటన ఎదురయ్యింది. అతడెంతగా విస్మయానికి గురయ్యాడంటే  దాదాపు పాతికక్షణాలు అతడికి ఏమీ అర్థం కాలేదు. ఆ సమయం చాలు....
...
...
దుర్గాదేవి నిమజ్జనం దుష్టసంహారానికి, కాల్పనిక కథకు, దాని ముగింపుకూ, ఆ కథవెనుక స్ఫూర్తికీ  కూడా చిహ్నమే.

***********************************************************

43 comments:

 1. బాబోయ్ ఏంటిదీ? యండమూరి అనే రచయిత ఎందుకు మాకు ఇంక! అదరహా! బెదరహా! కుదరహ!

  Just one word - Awesome!

  ReplyDelete
 2. అచ్చంగా యండమూరి నవల చదువుతున్నట్టే అనిపించింది :) పనిలో పనిగా సినిమా కథ కూడా చెప్పేసారుగా :))

  ReplyDelete
 3. అమేజింగ్... మాటల్లేవంతే :))

  ReplyDelete
 4. awesome.. యండమూరిని మరిపించారు. ముఖ్యంగా.. ప్రోలోగ్ కి ప్రోలోగ్ :)

  ReplyDelete
 5. చాలా బాగా రాశారు. రెండు సార్లన్నా ఎవరికో ఒకరికీ 'దవడ కండరం కూడా బిగుసుకోపోయీ' వుంటే ఇంకా బావుండేది

  ReplyDelete
 6. Awesome రవి గారు :)))

  ReplyDelete
 7. రవీ అదరగొట్టేశారు. !! గుండెనిండా దమ్ము పీల్చి ఒక్క క్షణమాగి రింగులు రింగులుగా పొగవదుల్తున్న సాటిస్ఫాక్షనూ, ఫీలింగూ కలిగించారు...(ఫీలవ్వడానికి దమ్ముకొట్టే అలవాటు గానీ, సినిమా చూడాల్సిన అవసరం కానీ ఉండక్కర్లేదని మీరూ ఒప్పుకుంటారనే భావిస్తున్నా). పట్టు, బిగువూ వగైరా వగైరా బాగా మెయింటెన్ చేశారు.

  (ఇందుకోసం కదా తొడగొట్టి సమరాంగణం లోకి మిమ్మల్ని పునరాహ్వానించింది.. ఇది స్వంత డబ్బా...)

  ఏదేమైనా ధన్యవాదాలు.. :-)

  ReplyDelete
 8. గురువు గారూ..,
  అక్కడక్కడా పెద్ద అక్షరాలు, బొద్దు అక్షరాలు పెట్టటం మర్చిపోయారు :)
  యండమూరి సంగతి, సినిమా సంగతి ఎమో కానీ.. నిలబెట్టి ఉన్నపళంగా టపా చదివించారు.

  ReplyDelete
 9. ఇరగదీశారండీ... ;)
  గతం లో రాసిన మధుబాబు పోస్ట్ గుర్తొచ్చింది నాకు.

  దవడకండరం బిగుసుకుందీ..>> ;) హిఇహిహి..

  మళ్ళీ బ్లాగాడించడం మొదలైందన్నమాట..

  ReplyDelete
 10. చంపేశారండీ బాబూ..!!

  అధిరిపోయింది.. :-)

  ReplyDelete
 11. అద్దరగొట్టేహారంతే జై వీరేంద్రాయనమహ

  ReplyDelete
 12. >>అతడు భాషాపరశేషభోగి కాడు కానీ మకరాంకశశాంకమనోజ్ఞమూర్తి. ఇక మిగిలిన విశేషణాలు కథకు సంబంధించి అనవసరం. వరూధినికి మీసాల పట్టింపు లేకపోతే ప్రవరుడికి బదులు ఇతడికే ప్రాంచద్భూషణబాహుమూల రుచి చూపించి ఉండేది. వసుచరిత్రకారుడు ఈతణ్ణి చూసి ఉంటే అనవసరంగా ముక్కు గురించి అంత అందమైన పద్యం అనవసరంగా ఎందుకు వ్రాశానా అనుకుని ఉండేవాడు

  ఈ లైన్లు చదవగానే పెదాలపై అప్రయత్నంగా చిరునవ్వు కదలాడింది.చాలా బాగా వ్రాశారు

  ReplyDelete
 13. ఒక రెండు పేఏఏఏ...ద్...ద్ద ఈలలు...!
  వీరేంద్రనాథ్ సంగతి నాకు పెద్దగా తెలీదు కాని నేనీ సినిమాని నవలగా రాస్తే, సాత్యకి చెపుతున్నట్టు రాస్తాను. :)

  ReplyDelete
 14. వీరేంద్రనాథ్ రచనలేమీ చదవకపోడం మూలాన్న ఆయన రచనాశైలి నాకు తెలీదు. కాబట్టి మీ పేరడీ నాకు 'ఒరిజినల్' లానే ఉంది.

  ఏంటీ, కహానీ కథ మొత్తం చెప్పేశారు, ఒక్క ట్విస్టు తప్పవిడిచి?? చదివినవాళ్ళొక్కక్కళ్ళదగ్గరా టిక్కెట్లో మూడొంతులు వసూల్ చెయ్యండి.

  ReplyDelete
 15. hii.. Nice Post Great job.

  Thanks for sharing.

  Best Regarding.

  More Entertainment

  ReplyDelete
 16. మిస్టర్ "రవీం"ద్రనాథ్.. ఎపిలోగ్‌కి ఎపిలోగ్ చెప్పకుండా వదిలేశారే... సినిమా చూడని నాలాంటి వారికి బాగుండేదిగా...!

  ReplyDelete
 17. భలే రాశారు. దవడ కండరం బిగుసుకోవడం అన్న యండమూరి ట్రేడ్‌మార్క్ బాగా పట్టారు.

  ReplyDelete
 18. బాగుంది. బాగా వ్రాశారు.
  "......చీకటి సందునుండి వెలుగులోకి వస్తూ అన్నాడతను. ............
  ......... అది కాదు ఆమె చూస్తున్నది. ..........
  ఈ రెండూ చదవగానేనే అర్ధమయిపోయింది. వీరేంద్రనాథ్ గారి శైలి బ్రహ్మాండంగా పట్టేశారని.

  ReplyDelete
 19. <>
  ఇది మాత్రం పొలికేక. భలే పట్టుకున్నారు యండమూరి శైలిని.

  ReplyDelete
 20. < సరీగ్గా ఇక్కడే ఖాన్ ఆ అమ్మాయిని తక్కువగా అంచనా వేసేడు >
  ఇది మాత్రం పొలికేక. భలే పట్టుకున్నారు యండమూరి శైలిని.

  ReplyDelete
 21. మీరు చెప్తే తప్ప ఇది పేరడీ అని ఎవ్వరూ పసిగట్టలేరు. యండమూరే స్వయంగా రాసినట్టుంది. యండమూరిని కాచి వడపోసి "తాపీగా" జీర్ణం చేసేసుకున్నారు. మాటల్లేవింక.

  ReplyDelete
 22. చాలా పాప్యులర్ రచయిత ఐనా, వీరేంద్రనాథ్ రచనలు చదివిన వాణ్ణి కాను కనుక మీ పేరడీ ఎలాగుందో చెప్పలేను.కహానీ సినిమా చూసేను. చాలా అద్భుతమైన సినిమా.అలాంటి సినిమా ఈ మధ్య నేను చూడలేదు.ఈ సినిమాను మీరు పరిచయం చేసిన తీరు చాలా చాలా బాగుంది.

  ReplyDelete
 23. wow.. wow..
  "అదే ఆమె చేసిన తప్పు", "అది కాదు ఆమె చూస్తున్నది", "దవడ కండరాలు బిగుసుకున్నాయి", "అవన్నీ ఈ కథకి అనవసరం", "ఫలానా జరగబోతోందని వాళ్ళకి తెలియదు"
  perfect..

  ReplyDelete
 24. Very good! I really enjoyed reading the narrating style.

  ReplyDelete
 25. ఎన్నిసార్లు చదివినా తనివి తీరట్లేదు. అద్భుతః

  ReplyDelete
 26. " బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలినా వాళ్ళ దేశంపట్లా, వాళ్ళ నగరం పట్లా వినమ్రతను ఇంకా తీసికెళ్ళినట్టు లేదు."
  నాకు బాగా నచ్చినదీ వాక్యం.
  చాలా బాగుంది.

  ReplyDelete
 27. super yaaa .. adhirindhi .. opigaaa .. neat gaa powerful .. kastha vetakarangaaa .. nice

  ReplyDelete
 28. really ynadamoori gare raasaremo anukunnanu

  ReplyDelete
 29. brilliant.
  హైదరాబాదులో బ్రహ్మాండమైన సభచేసి మీకు అపరవీరేంద్రనాథ్ అనే బిరుదు వీరేంద్రనాథ్ గారితోనే ఇప్పిస్తాం!

  ReplyDelete
 30. యండమూరి శైలి స్ఫూర్తి-సర్వ హక్కులు యండమూరి వే. ,

  వారి ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే పేరడీలు అనుమతింపబడవు.


  ఈ విషయంపై సర్వహక్కులు యండమూరి వే !

  (ఈ పై వాక్యాలు వేటికి పేరడీయో తెలుపుడూ!)


  ReplyDelete
 31. రవి గారూ,

  మీరు నిజంగానే ఈ ప్యారడీలో కాకలు దీరి పోయారు. Hats off!

  -మురళి

  ReplyDelete
 32. మురళి గారు, ఏమై పోయారు? నాకు ఇంగ్లీషు అంతగా రాదు. స్పీడుగా చదవలేను. అందుకనే మీ ఆంగ్ల బ్లాగు ఫాలో కాలేకుండా ఉన్నాను.

  ReplyDelete
 33. కహానీ స్క్రిప్టు నిజంగానే యండమూరి రాశాడు అనామికగా. బహుశా శేఖర్ కమ్ముల కూడా మీ వ్యాసం చదివి వుంటాడు.

  ReplyDelete
 34. Chaala Baaga rasarandi.. E Tapa Choosi Yandamuri gaaru Chaala Mechukunnaru mimmalni.. Sorry meetho cheppakunda Yandamuri sir ki E Tapa share Chesa.. :)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.