Saturday, March 17, 2012

విహారి - ఓ మినీ లోకల్ ట్రావెలాగుడు (ఫుటోలతో)

క్రితం వారం మా ఆవిడ పనిచేసే పల్లె (నీళ్ళు లేని)తిమ్మాపురంలో ఉండినాను. ఊరికే ఉండేదెందుకని ఉబుసుపోకుండా చుట్టు పక్కన ఒక మూడు పల్లెలు తిరిగొచ్చినాను. జీవితానికి మరొక రెండు అందమైన రోజులు జతపడినాయి. నా డైరీలో ఆ రోజునాటి పేజీలు..

నీళ్ళు లేని తిమ్మాపురం ఎందుకంటే - ఎక్కడో నీళ్ళుండే తిమ్మాపురం ఇంకోటుందంట. ఆ ఊరికి ఈ ఊరికి తేడా కనుక్కునేకి జనాలు ఇట్లా పెట్టుకున్నారు.

౧. రాధాస్వామి ఆశ్రమం - గుద్దెళ్ళ

అనంతపురంలో కల్యాణదుర్గం నుండి కర్ణాటక లో పావగడకు వెళ్ళేదారి బాగుంటుంది. ఆ దార్లో దాసంపల్లి తర్వాత ములకనూరు అనే పల్లెటూరు వస్తుంది. ఈ ఊరి శివార్లలో ఒక కొండ ఉంది. ఆ కొండ పేరు - నెమళ్ళకొండ. అవును. ఆ కొండపైన సాయంత్రం పూట నెమళ్లను చూడవచ్చు మనం. ఒక్కొక్కసారి నెమళ్ళు కనిపించవు కానీ, చాలా దగ్గర నుండి మనకు నెమళ్ళ క్రేంకారవాలు వినిపిస్తాయి. ఆ ఊరిముచ్చట్లు మరెప్పుడైనా., ప్రస్తుతమనుసరామః...

ములకనూరు నుండి కాస్త ముందుకు వచ్చి కుడివైపు మట్టిదోవ పడితే రెండు కిలోమీటర్ల దూరంలో రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడ ఇరవై ముప్ఫై ఎకరాల స్థలంలో ఆశ్రమం, తోట, ఆశ్రమం వారి నిర్వహణలో ఓల్డ్ ఏజ్ హోము ఉన్నాయి. అక్కడ వారందరు వారి అన్నం వాళ్ళే పండించుకోవాలి. అది నియమం. తోటలో సపోటా, మామిడి, జామ, అరటి, కూరగాయలు, తమలపాకులు, వక్క, ఆముదం విరగ కాసి ఉన్నాయి. దాపుల్నే చేనూ ఉందట. వేరుశనగ నూర్పిళ్ళు జరుగుతున్నాయి. బెంగుళూరు మామిడి కాయలు నవనవలాడిపోతున్నాయి. ఇవి కాస్త తీపిగా ఉండి ఊరగాయకు పనికి రావు కానీ,ముక్కలు కోసుకుని కారప్పొడి, తాలింపు వేసి పెట్టుకుని పెరుగన్నంలో నంజుకుంటే స్వర్గం కనిపిస్తుంది.


ఆశ్రమానికి వచ్చిన అతిథులకు కులజాతిమతభేదం చూపకుండా ఆశ్రమవాసులు స్వాగతించి భోజనం పెడతారు. ఒకరోజు ఉండదలుచుకుంటే ఆవాసం కల్పిస్తారు. ఆశ్రమానికి దాపున ఒక కొండ వుంది. రాత్రిపూట అక్కడనుండి ఎలుగుబంట్లు దుంపలకోసం వస్తాయి. అందుకని ఆశ్రమంలో జాతికుక్కలను సాకుతున్నారు.

ఆ ఊరికి నేను, మా ఆవిడా, తన తోడి టీచరమ్మలు, అయ్యలు కొంతమంది ఆటోలో వెళ్ళాము. వెళుతూ ఉంటే దార్లో ఒక అద్భుతం జరిగింది. కొండమలుపు దగ్గర దాదాపు పది పదిహేను జింకల గుంపు. అప్పుడు సాయంత్రం ఐదున్నర.

జింకలు మట్టి రంగుకు, సూర్యుని రంగుకు మధ్య రంగులో మెరిసిపోతున్నాయి. ఆటో శబ్దం వినగానే జింకలు గెంతుతూ పరుగు పెట్టినై.  కాళిదాసు శ్లోకం గుర్తొచ్చింది.

గ్రీవాభంగాభిరామం ముహురనుపతతి స్యన్దనే దత్తదృష్టిః
పశ్చార్ధేన ప్రవిష్టః శరపతనభియా భూయసా పూర్వకాయమ్ |
దర్భైరర్ధావలీఢైః శ్రమవివృతముఖభ్రంశిభిః కీర్ణవర్త్మా
పశ్యోదగ్రప్లుతత్వాద్వియతి బహుతరం స్తోకముర్వ్యాం ప్రయాతి ||

సూతా అదుగో చూడు! మెడను కాస్త వంచి క్రీగంట మన రథం మీద దృష్టిపెట్టి తిరిగి చూస్తూ, బాణం పడుతుందేమోనని ముడుచుకుంటూ, శ్రమవల్ల వచ్చిన ఆయాసంతో నోరు తెరిచి, గడ్డిపోచలు జారవిడుస్తూ, భూమిపైన కంటే, గాల్లోనే ఎక్కువభాగం ఉండేట్లుగా వేగంగా పరిగెత్తుతూంది.

(గ్రీవమంటే మెడ. గ్రీవాభంగమంటే మెడను తిప్పడం, గ్రీవాభంగ అభిరామం అంటే అందంగా మెడను తిప్పడం. స్యన్దనమంటే రథం)

కళ్ళకు కట్టినట్టుంది కదూ ఈ వర్ణన. ఈ సంస్కృతపద్యం అద్భుతరసానికి ఉదాహరణగా అలంకారికులు పేర్కొంటారు.
(జింక చచ్చేట్టు ప్రాణభయంతో పరిగెత్తుతూ ఉంటే ఇందులో రసం, చారు కాచుకోవడమేం ఔచిత్యమని నాకొక అనుమానం ఉంది. మళ్ళెప్పుడైనా తీరిగ్గా ఆలోచించాలి.)

సరే మళ్ళీ బాటకు. జింకలు కెమెరా కన్నుకు దొరికినట్టు లేవు, ఒక్కటి దక్క.

తోటలో సపోటాలు, జామ కాయలు విరగకాసి ఉన్నాయి. మా ఆవిడ, తన సహచరులు ఆ తోటలో తమ షాపింగు చేసి రెండు సంచులు నింపుకున్నారు. ఆ రోజు గడిచింది.

౨. రాళ్ళపల్లి

మరుసటి రోజు పొద్దున - బండి తీసుకుని బయలుదేరాన్నేను సంహితతో కలిసి. తిమ్మాపురం నుండి కంబదూరుకు వెళ్ళేదారిలో ఒక కూడలి వస్తుంది. అక్కడి నుండి పక్కకు తిరిగితే - బొమ్మలో ఎఱుపు రంగు లైనుకు క్రిందుగా రోడ్డు కనిపిస్తూంది కదా ఆ దారిలో ఏడెనిమిది కిలోమీటర్లు వెళితే మేలుకుంట, రాళ్ళపల్లి గ్రామాలు వస్తాయి.


ఆ కొండ పైన ఒక చిన్న నీటి కొలను, దానిపక్కన ఒక చిన్న గుహ, అందులో ఎవరు ఎప్పుడు పెట్టారో తెలీని రాముల విగ్రహమూనూ. అక్కడికెళ్ళాలంటే కాస్త శ్రమపడి కొండ ఎక్కి దిగాలి. ఇది నిర్మానుష్యమైన ప్రదేశం. ఈ కొండపైన నీటికొలను, గుహలో రాముడి గురించి స్థానికులలో కూడా చాలా తక్కువమందికే తెలుసు. (ఈ ట్రెక్కింగు బ్లూస్ ఇప్పటివి కావు, పాత అనుభవాలు)


సరే మన దారికొచ్చాం.రాళ్ళపల్లి ఊరి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక నిద్రాణమైన పల్లెటూరు. ఆ పల్లెలో ఏదో ఆంజనేయస్వామి దేవళం ఉందని విన్నా కానీ, అదీ అగుపడలేదు. వెళ్ళేదారి మాత్రం చాలా అందమైనది. అరటి తోటలు, దూరంగా కనిపించే పల్లె, మేలుకుంటలో చెఱువు...

రాళ్ళపల్లి - నిజానికి ఈ పేరు చెబితే ఇప్పటికే ఒక మహానుభావుని పేరు గుర్తు రావాలి. గుర్తు రాకపోతే మాత్రం అది తెలుగువాడి దౌర్భాగ్యం.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ - ఈయన 1893 నందన నామ సంవత్సరంలో రాళ్ళపల్లిలో పుట్టారు. (ఆయన తొమ్మిదవ యేట మైసూరుకు వెళ్ళి, ఆపై అక్కడే స్థిరపడ్డారు.) ఈయన గురించి చెప్పడం కొండను గాజుముక్కలో చూపడమే.
- రేడియోకి ఆకాశవాణి పేరు పెట్టినదీయనే.
- తొమ్మిది యేళ్ళ వయసులో అమ్మ, అయ్య చెప్పించిన చదువుతో తెలుగులో మీరా అనే ఖండకావ్యం వ్రాసిన ప్రతిభాశాలి. ఆ వయసులోనే సంస్కృత శ్లోకాలు చెప్పగలిగే వారట ఆయన. ఏక సంథాగ్రాహి, బహుభాషాకోవిదుడు కూడాను.
- మనం నేడు వింటున్న అన్నమయ్య పాటల్లో వందలాది పాటలకు స్వరాలు కూర్చిన సంగీతనిధి. (ఇప్పుడిటు కలగంటి, తందనానా ఆది, అదివో అల్లదివో..ఇట్లాంటి పాటలకు ఈయనే స్వరకర్త)
- అత్యుత్తమశ్రేణి విమర్శకుడు. ఈయన విమర్శ ఎంత నిశితమంటే, ఆయన తెనిగించిన రఘువంశకావ్యాన్ని (పదిహేడు సర్గలు), ఆయనే విమర్శించుకుని చించి వేశారు.
- వందలాది పీఠికలు వ్రాశారు. జాయపసేనాని వ్రాసిన నృత్తరత్నావళి సంస్కృత కావ్య అనువాదకర్త.
- అనేక గ్రంథాల పరిష్కర్త.

రాళ్ళపల్లి కాస్త నిరాశ కలిగించింది. అంతటి మహానుభావుడు పుట్టిన ఊరన్నట్టు లేకపోగా, ఆయనకు ప్రేరణ కలిగించినదేదైనా కనిపిస్తుందనుకుంటే అదీ లేదు.

తిరిగి వచ్చేప్పుడు, సంహిత,నేను సంహిత వాళ్ళమ్మకు చెప్పకుండా కొన్ని పనులు చేశాం. చింతచెట్ల చేతికి కొమ్మలు అందేట్లుగా కనిపిస్తే వాటిని పట్టి ఊపుకుని కాయలు రాల్చుకుని తిని, పక్కన పొలం గట్లలో పైపులో నీళ్ళు కడుపునిండా తాగేసొచ్చాం.

5 comments:

 1. మీ 'గ్రీవాభంగాభిరామం " అద్భుతం !


  అద్భుతమైన వర్ణన. ఇక జింకల గురించి రాసేరు. మన రాజకీయ నాయకులు ఏమైనా ఈ వ్యాసం చదవబోయేరు ! ఈ గ్రీవాభంగాభిరామం గుటకాయ స్వాహా అయిపోను.

  Not Amen!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 2. జిలేబి గారు, నెనర్లు. రాజకీయనాయకుల కన్ను ఆ పక్కన ఉన్న కొండ మీద పడిందని భోగట్టా. జరిగేది జరుగుతుంది.

  ReplyDelete
 3. చాలా రమ్యంగా ఉన్నాయి మీ అనుభవాలు, వర్ణన... కరీమ్నగర్, వరంగల్ మధ్యన మన "పాములపర్తి" పెద్దాయన స్వస్థలం దగ్గర కూడా ఒక ములకనూరు ఉంది అక్కడ కూడా ప్రకృతి రమణియత ఇంత అందంగానూ ఉంటుంది... దాన్ని జ్ఞప్తికి దెచ్చారు. నెనర్లు

  సనత్

  ReplyDelete
 4. Beautiful post.

  ReplyDelete
 5. రవి గారు మీది అనంతపురం జిల్లానా! మాది కూడా అనంతపురమే! ప్రస్తుతం హైదరాబాదులో వుంటున్నాను. ఈ సారి అనంతపురం వచ్చినప్పుడు వీలైతే కలుద్దాం!

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.