Thursday, July 3, 2008

సోడా గోళీ

మిట్ట మజ్జాన్నం. ఎండ సంపుతా ఉండె. ఇల్లొదిలి తార్రోడ్డు మీదకొస్తే, కాళ్ళు అంటకబోతాన్నాయ్. ఒంటిపూట బడి మొదలై ఒక ఐదార్రోజులయ్యుంటదేమో. సుంకేశనం మాను కింద ఆయాలికే గేర్లో పిలకాయలు జేరుకున్నారు, బద్దే గుండ్లాడే దాని కోసరం. మొన్న దాంక చిల్లాకట్టె సీజను. ఎండాకాలం మొదలైతానే గోళీ గుండ్ల సీజనొచ్చె.

బడి ఒదిలి ఇంటికొస్సానే మనసంతా గోళీలాట మీదున్నాది. నాయన పన్లోండొచ్చి అలిసిపాయి పడుకున్నాడు. నులక మంచం పైన అమ్మ కునుకు దీస్తా ఉండె. అవ్వ ఆతలికే అన్నం దిని వక్కలు గొట్టుకుంటాన్నాది.

"కాళ్ళు కడక్క రాపో, అన్నం దినేకి" అనె మాయవ్వ.

అన్నం పెట్టుకుంటానే, మజ్జిగేసేసుకున్న్యా. నంజుకునేకి రోంత చింతొక్కు యేసుకుని అన్నం గానిస్తి. రోన్ని గోళీలు నిక్కరు జేబులో పెట్టుకుని సుంకేసనం చెట్టు కాడికి ఉరికెత్తితి.

యెనకాల అవ్వ అరుస్తా ఉండె, " యేందిరా ఈ తినడం, అంతా ఆత్రమే ఈ నా బట్టకు" అనుకుంటా.

-------------

ఆతలికే ఆడ, సాకలోళ్ళ సుబ్బయ్య, టైలరు ఓబిలేసు, గొల్లోళ్ళ శివ బొద్దీ తోగి పదీ ఇరవయ్యి ఆట ఆడతాన్న్యారు. చెట్టు కింద ఒగ మూల గొల్లోళ్ళ కర్రావు సగం కండ్లు మూస్కుని ఎందో సప్పరిస్సా ఉన్న్యాది. రోంత అవపక్క అది యేశిన ప్యాడ.

మామూలుగా, ఎప్పుడూ, నాకూ గొల్లోళ్ళ శివకే పడేది.ఓబిలేశూ, సుబ్బయ్య అంతంత మాత్రం ఆడేవోల్లు. అయినా వాళ్ళకి ఒగో సారి అదురుష్టం పడుతా ఉంటాది. ఈ రోజు ఆ అదురుష్టం తోటే వాళ్ళిద్దరూ మొదటే నెగ్గేసిరి. గొల్లోళ్ళ శివ కీ నాకి పడింది, కడాకు.

శివ కాడ ఒక సోడా గోళీ ఉన్నాది. నల్లగా నిగనిగలాడతా. అది చూసినప్పుడల్లా నాకు బాధ.ఆ గోళీ ని ఒడ్డమన్నా చాలా తూర్లు. ఒక వేళ వాడు ఆ గోళీ గనక ఒడ్డితే, యేమైనా చేసి, గెల్చుకుంటా దాన్ని. నాకాడ గినా అట్లా గోళీ ఉన్నిందా, ' నా సామి రంగా' ఒగ ఆట ఆడించే వోణ్ణి. అది లేకపాయేసరికి ఇంకో ఎర్ర గోళీ తోటి ఆడతా ఉన్నా. చిటికినేలు, ఉంగరమేలు మజ్జెలో ఓ తెల్ల గుండు పెట్టుకుని, మధ్య వేలు వెనక్కి మడిచి జోరు కొద్దీ ఇడస్తా ఉన్నా, ఆడి గుండుకేసి. ఆడు అంతే, నా గుండు ని కొట్టాల అని. నేను శక్తి కొద్దీ యెనక్కి లాగి వాని సోడా గుండుకేసి వదిల్తి.

'తగిలె '. అబ్బ నేను గెలిస్తిలే అనుకునేంతలోపల నా ఎర్ర గుండు జారతా పోయి బొద్దీలో పడె. తగిలిన తర్వాత బొద్దీ లో పడితే, 'చిట్ పట్ ', అంటే అవతలోడు గెలిచినట్ల.

అప్పుడు నా కసంతా వాని సోడా గుండు మీద పాయె. అది నున్నగున్నందుకే నా గోళీ జారుకుంటా పోయి బొద్దీలో పడింది. నా కాడ అట్లా గోళీ, కనీసం జింజరు గోళీ ఉన్నిన్నా, పరిస్తితి ఇట్లా ఉంటా ఉన్నిండ్లే. యెట్లోగట్ల ఒక సోడా గోళీ సంపాదించల్ల. ఆ రోజు నా దగ్గిర గుండ్లన్నీ ఓడిపోతి.

--------------

అనుకున్నా గానీ సోడా గోళీ యాడ నుండీ సంపాయించేది? అదేమన్న మామూలు గోళీనా అంగిట్లో కొనుక్కునేకి?

రోజూ రాత్రి మా ఇంటికాడికి రాముడన్న సోడా బండీ వస్సాది. చెక్క బండీ లోపల సోడాలన్నీ వర్స్గాగ బేర్సింటాయి. మధ్యలో గెడ్డి.పైన తడి గోనె పట్ట. బండి కిందట ఒగ చిన్న బకెటు. సోడా ఇచ్చే ముందర కడిగే దానికి. సోడా సీసాలోపల మెరుస్తా సోడా గుండు. ఆ సోడా సీసా మూతి కాడ ఒక రబ్బరు రింగు మూతికి బిగుతుగా అతుక్కుని. ఆ రింగు ఎట్లోగట్ల తీసెస్సే సోడా బయటకి లాగొచ్చు అని అనిపిస్తాంటాది.ఒక సారిట్లే రాముడన్న దగ్గర సోడా దీస్కుని, సోడా సీసా మూతి దగ్గిర యేలు బెట్టి తడముతా ఉంటే, రాముడన్నకి యెందో అనుమానం వచ్చె. సోడా అయిపోతానే గుంజుకుని, గుర్రుగ జూస్తా, ’ఫో ’ మని కసురుకునె. సోడా గోళీ బయటకు పోతే ’శనంట ’ వాళ్ళకి. యాపారం నష్టమైతాదంట.

ఇంగ రాముడి కాడ గాకుండ యాడ దొరుకుతాది మరి? రాముడేమో గుర్రుగ జూస్సాండె. సరే యేమైతే అదైతాది ఈ రోజు మాయమ్మనడుగుదామని తీర్మానం జేసిన. ఆ రోజు రాత్రి మాయమ్మ పనైపాయి తీరుబడిగా కూర్చుని మాయవ్వతో ముచ్చట్లాడతాన్నాది. అప్పుడు అమ్మ దగ్గరకి పోయినా. గుండెలు పీచు పీచు మంటన్నాయి. ఎట్లోగట్ల దైర్నం జేసి మెల్లగడిగితి, ’అమ్మా, నాకు ఒక సోడా గోలీ కావల్ల ’ అని. యా కళనున్న్యాదో ఎమో, తిట్టగోకుండా అనె ’ సర్లేరా కొనక్కొచ్చుకో!’.

కొనక్కొచ్చుకునేకయితే కొనక్కొచ్చుకోనా ఏంది?

’లేదే, సోడా బండీ రాముడన్న కాడ నువ్వే ఇప్పీయాల ’ అన్నా.

’వాళ్ళెక్కదిస్సార్రా, సరే రేపు ఇప్పిస్సాలే’ అనె మాయమ్మ.

మరసట్రోజు నుండీ నాకు నిద్దర్లేదనుకో.

మాయమ్మేమో రాముడన్న దగ్గిర అడిగె, మరసట్రోజు, ’రాముడు, నీకాడ ఒగ సోడా గోలీ ఉంటే తీస్కరారాదా? ప్రాణం తీస్తా ఉండాడు, మా వాడు. రూపాయిస్తాలే’

’సర్లేమ్మయ్యా’ రేపు తీస్కొస్సాలే అనె రాముడు.

ఇంత సులబంగయిపోతది పని అనుకోలే నేను. ఐతే మన జనమకి యా పనయినా అంత తొందరగ అయితాదా?

నా ఖర్మ కి ఆ తర్వాత వారమ్ రోజులు రామన్న మా ఈది మొగమ్ జూళ్ళే. వారమ్ తర్వాత మళ్ళీ వచ్చె.
మాయమ్మ ’ ఏం రాముడూ, యాడ బోయినావ్? ’ అని పలకరించె.


’లేదమ్మయ్యా, జొరమొచ్చిన్నాది.’ అందుకే రాల్యా. అనె.

మజ్జెలో నా సోడా గోళీ కథ యాడో కొట్టకపాయె. మళ్ళీ మాయమ్మకి జెప్పి, మాయమ్మ రామునికి జెప్పి, కడాకేమయితేనేమిడిది, గోలీ పట్టుకొచ్చిచ్చె. ఒగ్గోలీ కాదు, ఒక సోడా గోలీ, రెండు జింజరు గుండ్లు.

---------------

మజ్జన్నం బడి అయిపాయి, పరీక్షలొచ్చె.పరీక్షలన్నీ అయిపానిచ్చి, తర్వాత రోజు మజ్జాన్నం గోళీలాడేదానికి పొవాలనుకున్నా. నా గుండ్లన్నీ, మాయమ్మ బీరువా పైన ఒక ’పాండ్స్’ డబ్బీలోకేసి పెట్టిన్న్యాది. మా నాయన రూములో నిద్ర పోతన్నాడు. నేను భోంచేసి, బీరువా ఎక్కనీకి స్టూలేస్కుని, గోళీ డబ్బా అందుకునే దానికోసమ్ రోంతట్ల లాగితి.

అంతే.

అది కింద పడి మొత్తం గోళీలు పొర్లుతా ఉండె. మా నాయన కు మెలకువొచ్చి, భలే కోపమొచ్చె. ’ నువ్వు, నీ బొద్దే గుండ్లు. యేరే పనీ పాటా లేదు నీకి’ అని పాండ్స్ దబ్బీ మొత్తం గుంజుకునె.

’ సెలవులే గద నాయనా’, అంటి గొంతు పూడకపోతా ఉంటే.

’ఐతే, పనికిమాలినోల్లతో గల్సి గోళీలాడే పనేనా, ఉండు, నీ గోళీలన్నీ దిబ్బలేకి గొడతానుండు’ అని కోపంగ అరస్తా యెల్లి, జానకమ్మోళ్ళ, నీళ్ళు లేని బాయి లో పారేసె.

నేను గెల్చుకున్న గోళీలన్నీ పాయె. అయినా బాధలేదు నాకి. సోడా గుండ్లు మళ్ళీ యాడనుండీ సమ్పాయిన్చేది?

ఆ తర్వాత అప్పుడప్పుడూ, జానకమ్మోల్ల బావిలో చూస్సా వచ్చిన, ఆ గోళీ యాడైనా కానొస్సాదేమో, మల్లీ ఎవరైనా బావిలో దిగి యేరుకొనిచ్చి తెచ్చిస్సారేమో అని.

ఈ రోజు దాంక అది జరగలే.

---------------

(రానారె స్పూర్తిగా, కృతఙ్ఞతలతో ! నా చిన్నప్పటి ఓ సంఘటన కి కథనం)

15 comments:

 1. అయ్యో.. గోళీలు పోయాయా?? :-( నాకు తెలుసు అలా దాచుకున్న వస్తువు పోతే ఉండే బాధ!!

  మీ ప్రయత్నం బాగుంది.. ఒక ప్రాంతపు యాసలో ప్రయత్నం అభినందనీయం!! కానీ ఎందుకో.. యాసలో "ప్రయాస" ఎక్కువగా కనిపించింది. :-( (నాకు ఏ యాస మీద పట్టులేదులేండి.. అందుకేనేమో). మున్ముందు ఇంకా బాగా రాస్తారని మనసారా కోరుకుంటూ..

  Purnima

  ReplyDelete
 2. నీతి. ఎండ వేళ గోళీ లాడవలెనన్నచో పెద్దలకు మెలకువ రాకుండా జాగ్రత్త పడుము! :-)

  చాలా బావుందండీ.

  ReplyDelete
 3. వాళ్ల మీద ఆధారపడ్డాం కదా అని అట్లా ప్రవర్తిస్తారు పెద్దలొకోసారి. పొరపాటున నిద్ర లేపినందుకే గోలీలన్నీ బావిలో పడేస్తారా! అప్పుడే మనకొక ఉద్యోగముంటే అంత ధైర్యం చెయ్యగలరా అని!! :)

  ReplyDelete
 4. రవి,
  మీ గోళీ కధ చదివితే శ్రీరమణ రాసిన 'సోడాల నాయుడు ' కథ గుర్తొచ్చిందండీ! గోళీలతో పిల్లలకుండే అనుబంధమే వేరు కదా! వీలైతే ఆ కథ తప్పక చదవండి. 'మిథునం ' కథా సంపుటిలో ఉంది ఆ కథ. ఒక్కోసారి మనకొచ్చే ఆలోచనలు గొప్ప గొప్ప రచయితల కొచ్చే ఆలోచనలకేం తీసిపోవనిపిస్తుంది.

  ReplyDelete
 5. @సుజాత గారూ, పట్టేసారూ? :-) ఆ కథనూ, స్పూర్తిలో తెలుపుదామనుకున్నాను. ఐతే, ఇది నా జీవితంలో నిజంగానే జరిగింది చిన్నప్పుడు :-). అందుకని సర్లే, కానిద్దూ అని ఒదిలేసాను. సోడాల నాయుడు కథలో ముగింపు అద్భుతం. ( నా కథలో ముగింపు తేడా గమనించండి)

  "నా బాల్యాన్ని నాకు తిరిగి రాసిచ్చిన సిద్ధుడికి నేను ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను? " ఈ వాక్యం మర్చిపోలేము. అందులో ఇంకోకథ 'తేనెలో చీమ ', ఈ శతాబ్దపు ఉత్తమ కథల్లో ఒకటి.

  @పూర్ణిమ గారు : యాస మీద ధ్యాసతో ప్రయాస గా మారింది :-). ఎంతైనా రామనాథుడే రాయాలి ఇలాంటివి. ఇది తనను అనుకరించడానికి ఓ ప్రయత్నం.

  @కొత్తపాళీ : నీతి గ్రహించాను, కానీ ఇప్పుడు గోళీలాడే చాన్సు లేదు. ఒలింపిక్స్ లో గోళీలాట ఉండుంటే ఇరగదీసుండే వాణ్ణి. :-)

  @రానారె : ఉద్యోగం ఉండుంటే సొడా గోళీ ల మేళ కూడా పెట్టుండే వాణ్ణి :-)

  ReplyDelete
 6. బలుంది మీ బ్లాగాటలో బద్దీలాట. బలిగుడు ఎప్పుడాడిస్తారు? :)

  >>సుంకేశనం మాను

  దిరిసెన చెట్టును మేం బిరసనపు చెట్టంటాం. అట్లా మీరు సుంకేసుల మానును సుంకేశనం అంటారా?

  >>మొన్న దాంక చిల్లాకట్టె సీజను

  అది జిల్ల-కట్టె కదా?

  ReplyDelete
 7. @త్రివిక్రం : సుంకేసుల మాను వ్యవహారం లో సుంకేసనం అయ్యింది. ఇది తప్పేమో తెలీదు. కానీ మా వూళ్ళో వ్యవహారం లో ఉంది.

  జిల్ల-కట్టె కూడా అంతే. చిల్ల అని వ్యవహారం..

  మంచి లంకె ఇచ్చారు. ఇన్ని రోజులు ఇలాంటి లంకె కోసం వెతుకుతా ఉన్నాను.

  ReplyDelete
 8. చాలా బాగా రాశారండీ కథ. నాకైతే మీ నాన్న గారి మీద కోపమొచ్చేసింది, గోళీలు బావిలో పడేశారని. కాసేపు దాచేసి ఏ సాయంత్రమో మళ్ళా ఇచ్చేయొచ్చు కదా..
  చాలా బాగా, హత్తుకునేలా ఉంది కథ.

  ReplyDelete
 9. @ నాగమురళి గారూ: మీ సూచన (దాచుకుని తర్వాత ఇవ్వడం), నేను పాటిస్తాను. నేనూ తండ్రి కాబోతున్నా లెండి. అన్నట్లు, మీరు శ్రీ రమణ మీద ఓ టపా రాసినట్టు గుర్తు. సోడాలనాయుడు కథ చదవకపోతే తప్పక చదవండి.

  ReplyDelete
 10. వావ్, శుభాకాంక్షలు.

  ReplyDelete
 11. అద్భుతంగా రాసారు రవి...
  గోళీలాట ఎంత బాగుంటుందో పెద్ద వాళ్ళకి తెలిస్తే కదా!

  ReplyDelete
 12. Ravi
  I could visualize ur parents in this writing.Really sooper even though I struggled a bit to understand that slang,

  ReplyDelete
 13. వావ్!

  చాలా బాగుంది. యాస బాగానే పండింది.

  ఆటల మీద పిల్లల కుండే మమకారం, అదే సమయంలో పెద్దల ఆరాటం బాగా చూపించారు.

  తండ్రవుతున్నందుకు శుభాకాంక్షలు.

  --ప్రసాద్
  http://blog.charasala.com

  ReplyDelete
 14. మీ ఫా0ట్ సైజ్ పె0చరా ప్లీజ్...నా నాలుగు కళ్ళకి కూడా చాలా ఇబ్బ0దిగా వు0ది. అస్సలు చదవలేకపోతున్నాను.

  ReplyDelete
 15. ఒక్కసారి ఒంటిపూట బడిని, జేబులో గోళీలని గలగలలాడించావు. చాలా బాగుంది.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.