Wednesday, March 21, 2012

ఒక శాసనం - వెనుక కథ

బహువృత్తాన్తాని రాజకులాని నామ - ప్రతిమా నాటకంలో భాసమహాకవి సీతమ్మ నోట చెప్పించిన మాట. రాజవంశాలలో జరిగే చిత్రాలు పలువిధాలు అన్న మాట ఆయన ఏ ముహూర్తంలో వ్రాసినాడో ఏమో ఇది భారతదేశ రాజవంశాలవిషయంలో అక్షరసత్యమయింది. ఆ ’చిత్రాలు’ తదనంతర కాలంలో శిథిలదేవాలయాలకూ, విరిగిపోయిన శిలలకూ, వైభవం కోలుపోయిన సంస్కృతీ నిలయాలకూ కారణమై, గతించిన చరిత్రకు మూగ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఎట్టి కఱకు రాతి గుండెవానినయినా కరిగించి, విలపింపజేయగలిగిన కరుణాతరంగితమలయవీచికలు ఇవి. అలాంటి ఒకానొక కథను గుర్తు చేసే శిలాఫలకం, గతించిన దాని వైభవం, దానిని చెక్కించిన ఒకానొక పసి బాలుని దయనీయమైన కథనమే ఈ వ్యాసం.

(ఈ వ్యాసం ఉద్దేశ్యం చరిత్ర కాదు, చరిత్ర మీద, మన సంస్కృతి మీద సానుభూతి కలిగించడం. ఈ వ్యాసాన్ని ఏ విధమైన ప్రమాణంగా స్వీకరించవద్దని మనవి)

***********************************************************


(శాసనపాఠం - తప్పులుండవచ్చు. సరిదిద్దితే సంతోషం)
శుభమస్తు స్వస్తి శ్రీ జయాభ్యుద
య శాలివాహన శకవర్షంగ
ళు ౧౪౭౮ శయన సంవత్సరద
ఆషాఢ శు ౧౨ (మం)పుణ్యకాలదెయ శ్రీ
మద్రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ
వీరప్రతాపశ్రీ సదాసివరాయ మహ
రాయరూ ప్రౌఢిరాజ్యం గెవుతిరలు విరూ
పణనాయకరు శంఖదూర మల్లికా
ర్జున దేవర సమ్మాన సిలాశాసనద
క్రమవంతెందరె ప్రాకుదినగళలూ పారు
పత్యగారరూ మాన్యగ్రాసక్కొంబ గర్భ
రహౌసతం మ తందె రంతుప్రే నాయకరిగె
పుణ్యవాగి బెశోయంకుధారె
రద్దు కోట ధర్మశాసన యీ ధర్మ.

***********************************************************

భౌగోళికంగా రాయలసీమలో నేటి అనంతపురం జిల్లాకు ఒక వైచిత్రి ఉంది. అనంతపురం జిల్లాలోనికి కర్ణాటక తాలూకు ఒక పాయ చొచ్చుకుని వచ్చి ఉంటుంది. ఇటుప్రక్క, అటుప్రక్కనా తెలుగు, మధ్యలో కన్నడ. నేటి ఈ పరిణామం గత వందల యేళ్ళుగా కొనసాగుతున్న సాంస్కృతీ మైత్రికి చిహ్నం. రెండు భాషలు, రెండు సంస్కృతులు వందల యేళ్ళుగా కలిసి మమేకమై జీవిస్తున్న అపురూపమైన చోటు ఇది. లిపి కూడా తెలుగు కన్నడాలకు దాదాపు ఒక్కటిగానే ఉంది.

ఈ కర్ణాటక పాయకు ఇటువైపున కల్యాణదుర్గం, కంబదూరు, అటువైపు హేమావతి, అమరాపురం, మధ్యలో కన్నడనాడు ముఖ్యపట్టణం పావగడ. ఈ పేర్కొన్న పట్టణాలన్నీ గతించిన వైభవానికి చిహ్నాలే. అన్ని ప్రాంతాల్లోనూ విజయనగర సామ్రాజ్యపు ఆనవాళ్ళు కొద్దో, గొప్పో కనిపించడం కద్దు.

పైన పేర్కొన్న ఆ శాసనం కంబదూరు లోని శంఖదూరమల్లేశ్వరస్వామి దేవాలయం తాలూకుది. ఆ శాసనం తాలూకు భాష కన్నడ. శాసనంపైన శివలింగం చెక్కారు. కృష్ణరాయలు వైష్ణవుడు. ఈ శివలింగచిహ్నం ఆర్వీటి రామరాజు ప్రాభవానికి చిహ్నం కావచ్చును. ప్రతి వాక్యానికి ముందూ ’౦’ చెక్కారు. అందులో ప్రముఖంగా కనిపిస్తున్న పేరు - శ్రీ వీరప్రతాపసదాశివమహరాయలు. ఇంకా విరూపణ్ణ, పారుపత్తెదారుడు అన్న పదాలు కూడా ఉన్నై. ఆ శాసనంలో చెక్కిన సంవత్సరం - శాలివాహన శకం 1478 అంటే క్రీ.శ: 1556. ఆ యేడు ఆషాఢమాసంలో - శ్రీ మల్లేశునికి విరూపణ ద్వారా చెందవలసిన మాన్యాలను నిలుపుదల చేయిస్తున్నట్టు శ్రీ సదాశివరాయలి పారుపత్తెదారుడు వేయించిన శాసనం. పారుపత్తెదారుడు అంటే గ్రామాధికారి. బహుశా విరూపణ అనే అతను ఈ ప్రాంతానికి పారుపత్తెం వహిస్తూ ఉండేవాడు కావచ్చును. (ఈ అర్థాలు నాకు తోచినవి మాత్రమే)

మనకు తీగ దొరికింది: 1558 - అంటే తుళువ (సంపెట) శ్రీకృష్ణదేవరాయలవారు గతించిన తర్వాతి కాలం. ఆయన మరణించినది 1530 వ వత్సరంలో. అప్పటికి శ్రీవారి పుత్రసంతానం కూడా గతించింది. ఆ కుట్రకు తిమ్మరుసయ్య కారణమని ఆయన్ను పెనుగొండ జైల్లో పెట్టటమూ జరిగిపోయింది. ఆ దయనీయమైన పరిస్థితిలో ఆంధ్రవిద్యాభోజుడు, కవివరహృత్కమలబాలమిత్రుడు, ఆంధ్రాభారతీలాలసమానసాబ్జుడు, హిందూరాజ్యరమారమణుడు, మూరురాయరగండడు శ్రీ కృష్ణసార్వభౌముడు తన భౌతికకాయాన్ని విడచి యశఃకాయుడైనాడు.

సీ ||
కవిబుధనికరంబు కల్పతరూయని
వాక్రుచ్చి వాక్రుచ్చి వగచుచుండ
రాణులార్తధ్వనిఁ బ్రాణేశ్వరాయని
యుర్విపైఁబడి మూర్ఛనొందుచుండ
హా తండ్రి మమునిట్టులనదలఁ జేసితే
యని ప్రజాతతులంగలార్చుచుండ
వైరిరాజులుఁగూడ వీరాగ్రణీయని
విలపించి యశ్రులు విడచుచుండ
గీ||
గాఢమైనట్టి శోకాంధకారమందు
లోకమంతయు మునుఁగ నాలోకబాంధ
వుండు, శ్రీకృష్ణసార్వభౌముండు సుప్ర
శస్తవిక్రమసంపన్నుఁ డస్తమించె 

- (శ్రీకృష్ణదేవరాయచరిత్ర)

కృష్ణరాయల వారి తదనంతరం ఆయన సవతి తల్లి కుమారుడు (నరసరాజుకు కోబాంబిక వల్ల కలిగిన పుత్త్రుడు) అచ్యుతరాయలు - శాలివాహన శకం ౧౪౫౨ (క్రీ.శ 1530) విరోధినామ సంవత్సర కార్తీకబహుళపంచమి నాడు రాజ్యం తీసుకొన్నాడు. ఈయన రాజ్యం దక్షిణాన తిరునల్వేలి వరకు వ్యాపించినదని కంచిలో ఒక శిలాశాసనం ఉంది. అచ్యుతరాయలు ఎటువంటివాడయినా కానీ, తన దండాధిపతి, స్వయానా అచ్యుతరాయలికి బావమఱిది అయిన సలకము తిమ్మయ మాత్రం వెనకటి తిమ్మరుసయ్య లాగే కడుసమర్థుడు. ఈ తిమ్మయ్య తమ రాజ్యంలో తిరుగుబాటు ప్రకటించిన కేరళరాజును పాండ్యరాజును అణచివేసినాడు. అట్లాగే కృష్ణరాయలు ఇక లేడన్న ఔద్ధత్యంతో దాడి జరిపిన బిజాపురసులతానును పారద్రోలినాడు.

ఇలా సలకము తిమ్మయ అచ్యుతరాయని కంటికి రెప్పలా కాపాడుతూ రాజ్యాన్ని చూసుకుని వహిస్తున్నాడు. అయితే ఎంత సమర్థుడైనా తిమ్మయ కేవలం దండనాథుడు మాత్రమే. అచ్యుతరాయలు భోగలాలసుడు. సలకము తిమ్మయ చేత దెబ్బతిన్న రాజులందరినీ ఒకచోట చేర్చి కృష్ణరాయల అల్లుడు ఆరవీటి రామరాజు మెలమెల్లగా సామ్రాజ్యం మీద తిరుగుబాటు సలుపజొచ్చినాడు. అచ్యుతరాయలు ఆతని బాధ తప్పించుకోవడానికి ఇటుపక్క, యోగ్యులైన సామంతులనేకమంది నచ్చచెబుతున్నా  వినక విజాపుర సులతాను ఇబ్రహీం ఆదిల్షాతో చెలిమి చేయడమే కాక, అతనికి ఇరువది లక్షల వరహాల కప్పం చెల్లించుకున్నాడు. ఇదే అంతటి మహారాజ్యపతనానికి తొలి మెట్టుగా పరిణమించింది. మితిమించిన భోగలాలసతో అచ్యుతరాయలు అనతి కాలంలోనే కాలం చేసినాడు.

అచ్యుతరాయల తర్వాత -

సలకము తిమ్మయ తన మేనల్లుడు వేంకట దేవరాయని సింహాసనంపై కూర్చుండబెట్టి, రాజ్యవ్యవహారాలు తనే స్వయంగా చూడసాగినాడు. విధి వైపరీత్యం - వేంకటదేవరాయడు సింహాసనం ఎక్కిన కొంతకాలానికి మరణించినాడు.

"క్షితి ప్రతిష్టాపిత కీర్తిదేహే ప్రాప్తే పదం వైష్ణవమచ్యుతేంద్రే
అధ్యాస్య భద్రాసనమస్య సూనుర్వీరో బభౌ వేంకటదేవరాయః
ప్రశాస్య రాజ్యం ప్రసవాస్త్రరూపే విద్వన్నధౌ వేంకటరాయభూపే
అభాగదేయదచిరాత్ ప్రజానాం అఖండలావాసమదాధిరూఢే"

(ఎపిగ్రాఫికా ఇండికా)

సలకము తిమ్మయ్యే దేవరాయని చంపించాడని కొంతమంది చరిత్రకారులన్నారు. అయితే చరిత్రను మానవీయదృక్పథంతో, నిజాయితీతో, ప్రాంతీయనేపథ్యంతో పరిశీలించలేని అసమర్థ పాశ్చాత్య చరిత్రకారుల నిరాధారపు రాతలవి. ఆ తర్వాత తిమ్మయే రాజ్యానికి వచ్చినాడు. ఈ లోపల ఆరవీటి రామరాజు రాజ్యంలో ఒక్కొక్కరినీ తనవైపుకు తిప్పుకుని తిరుగుబాటు ప్రకటించినాడు. సలకము తిమ్మయ చేసేది లేక ఆదిల్షా సహాయం అర్థించినాడు. ఆదిల్షా విజయనగరానికి వచ్చి, కొన్ని రోజులు అతిథిలా ఉండి, కొంత కప్పం స్వీకరించి మరలినాడు. ఆదిల్షా మరలిన వెంటనే రామరాజు తిరిగి దండెత్తినాడు.

విధిలేని పరిస్థితులలో పరమరాజభక్తుడు, దేశప్రేమికుడు సలకము తిమ్మయ ఆత్మహత్య చేసికొన్నాడు. ఆత్మహత్య చేసుకొన్నది కూడా చేవలేక కాదు - బ్రతికి ఉంటే ఆర్వీటిరామరాజు తనచేత ఇంకే అఘాయిత్యాలు చేయిస్తాడోనన్న బాధతో మాత్రమే.

ఆర్వీటి రామారాజునే అళియరామరాజంటారు. అళియ శబ్దానికి కన్నడ భాషలో అల్లుడని అర్థం.

ఆర్వీటి రామరాజు రాజ్యం కోసం ఎన్ని కుటిలప్రయత్నాలు చేసినా శౌర్యంలోనూ, రాజసంలోనూ తగ్గనివాడు. చంద్రవంశ సుక్షత్రియుడు. ఈతడు తను నేరుగా సింహాసనంపై కూర్చొనకుండా వేంకటదేవరాయని సవతి తమ్ముని - సదాసివరాయని సింహాసనాలంకృతుణ్ణి చేసినాడు. ఆ యేడు క్రీ.శ 1543. ఈ సదాశివరాయలు పాపం చిన్నవాడు. అభం శుభం ఎఱుగని పసివాడు. రాజ్యం పేరుకు ఈతనిది కానీ అధికారం అంతా రామరాజుది.

ఆ పటుకీర్తి రామవసు | ధాధిపచంద్రుఁడు కృష్ణరాయ ధా
త్రీపతిసార్వభౌమ దుహి | తృప్రియుఁడై వితతప్రతాప సం
తాపిత ప్రియుఁడై, యల స | దాశివరాయ నిరంతరాయ వి
ద్యాపుర రాజ్యలక్ష్మికి ని | దానము తానయి మించెనెంతయున్


(రామాభ్యుదయము)

సదాశివరాయలు యేడాదికొక్కమారు మాత్రమే ప్రజలకు కనబడే వాడుట. మిగిలిన సమయమంతా నిర్బంధమే. తర్వాత్తర్వాత అదీ నల్లపూసయింది. కొంతకాలానికి ఆ సదాశివరాయలు ఉన్నాడో లేడొ ప్రజలకు తెలియకుండా పోయింది. రామరాజే మొదటినుండి ఆతని పేరు వాడుకుని తద్వారా కృష్ణరాయల వారి విశ్వాసపాత్రులయిన దండనాథులను తనవైపుకు తిప్పుకొన్నాడని, రాజ్యం చేతికి రాగానే సదాశివరాయలిని నిర్బంధించి చంపించాడని హెరాసు అనే ఆయన ఆర్వీటి చరిత్రలో వ్రాశాడు.

రామరాజు అంతటి దుర్మార్గుడు కాదని, రాజ్యసంరక్షణ భారం సమర్థంగా నిర్వహించాలన్న తలంపుతో తనే ఎక్కువగా కలుగజేసుకొన్నాడని ఇంకో కథనం. ఏదేమైనా సదాశివరాయలు అతి దురదృష్టవంతుడు నిర్భాగ్యుడు. తదనంతరం ఆర్వీటి రామరాజు కడు సమర్థంగా కొంతకాలం రాజ్యం చేసినప్పటికీ, గొల్కొండ నవాబు మల్కిభరామునితో అనవసరంగా మైత్రి చేసి చివరికి దుర్మార్గంతా తురుష్కరాజులంతా దండెత్తితే ’రాక్షసతంగడి’ అనే భయంకరమైన పోరు సలిపి వీరస్వర్గం పొందినాడు.

ఒకమహాసమ్రాజ్యం తదనంతరం ఆరునెలలు తురుష్కుల ధాటికి చిన్నాభిన్నమైంది. ఒకప్పటి విజయనగరప్రభువుల రాజధాని విద్యానగరం (హంపి కమలాపురం, ఆనేగొంది పరివర్తిత ప్రాంతం) నేటి లండను నగరమంత వైశాల్యం కలిగి ఉండినదట. ఏడు ప్రాకారాలు. తుంగభద్రమ్మ చల్లని చూపులతో, అంగళ్ళరతనాలతో అలరారి దిక్కూ మొక్కూ లేక నాశనమయింది.

ఈ సామ్రాజ్యపు విషాదాన్తానికి కారణం -
మొత్తం దక్షిణదేశాన్ని చిటికినవేలుపై ఆడించిన తిమ్మరుసయ్య,
పసివాడు సదాశివరాయలు,
రాజభక్తి పరుడైన సలకము తిమ్మయ
వీళ్ళ శాపఫలితమేనేమో!

పై ముగ్గురిలో సదాశివరాయలి తాలూకు శాసనం ఈ మల్లేశ్వరస్వామి దేవళపు శాసనం. ఆతడు నాడు అనుభవించిన దుస్థితికి ప్రతిరూపంగానే దిక్కూ మొక్కూ లేకుండా ఉంది. అపురూపమైన శిల్పాలు ఉన్నై ఈ గుడిలో. గుడికి కాస్త దూరంగా పొలాల మధ్య ఒక నాలుక్కాళ్ళ మంటపం, చిన్న దేవళం శిథిలావస్థలో ఉంది. గుళ్ళో విగ్రహాలు ఇప్పటికే కొన్ని మాయమయినాయి. ఇదొక్కటే కాక, మరి కొన్ని ప్రాచీన శాసనాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. వాటిపై ఎవరో బట్టలారవేసుకునే దౌర్భాగ్యస్థితి నేడు ఉన్నది.

(గమనిక: ఈ రచనలోని చారిత్రకాంశాలలో సాధికారతను దయచేసి ఆశించవద్దు. ఇవి రచయితకు తెలిసినంతమేరలోని నిజాలు మాత్రమే.)

13 comments:

 1. ఇది చాలా సార్లు అనుకున్న మాటే, ఇప్పుడు బయటకు చెప్పెస్తున్నా - మరో తిరుమల రామచంద్ర మనకు దొరికేసినట్టే!....బంధించి పారేసే వచనానికి, ఆపకుండా చదివించే తత్వానికి....

  ReplyDelete
 2. శ్రీవంశీ గారి వాఖ్య సరీఅయినదె. ఒక చిన్న శాసనం కాని మాకు చాల విలువయిన సమాచారం కనులముందల.నేను సకలం తిమ్మయ్యగారి గురించి మొదటసారిగా తెలుసుకొన్నా.

  ReplyDelete
 3. శాసనాన్ని అలా చూసి ఇలా వచ్చేయకుండా బాగా పరిశీలించి,పరిశోధించి మంచి విలువైన సమాచారాన్ని అందించారు.

  ReplyDelete
 4. అదరహో, చాలా మంది కడగంటి చూపులకు కూడా నోచుకోని ఒక శాసనాన్ని ఫోటో తియ్యడమే కాక, దాని చరిత్రను విపులంగా వర్ణిస్తూ చెప్పారు.మీకు కృతజ్ఞతలు.

  ReplyDelete
 5. టైం మిషనులో కుర్చోబెట్టి ఐదు శతాబ్దాల వెనక్కు తీసుకెళ్లారు. ఈ వేసవిలో మీతో పాటు ఇలాంటి ప్రదేశాలు చూస్తానేమోనని ఓ ఆశ!

  ReplyDelete
 6. బాగా రాసారు. మాలిక్ ఇబ్రహీమ్ని మల్కిభ రాముడనడం అవసరమా...!

  ReplyDelete
 7. @వంశీ, రమేష్ బాబు గారు: పొఱబాటున కూడా అలా అనకండి. ఆయనకు అవమానం. :)
  @విజయమోహన్ గారు, శ్రీకాంత్ గారు, drpen: చాలా రోజుల ముందు చూసినదేనండి. విజయనగర సామ్రాజ్యం మీద ఒకట్రెండు అపురూపమైన పుస్తకాలు దొరికాయి. ఈ సమాచారం వాటిలో సేకరించి రాశాను.
  @ఫణి గారు: :)అవసరం లేదండి. మల్కిభరాముడనే ఆయనకు ఈ బేక్ గ్రవుండ్ ఉందని సూచిద్దామని.

  ReplyDelete
 8. నాకు శాసనాలు ఎప్పటికైనా చదివి అర్థం చేసుకోవాలని కోరిక! ఎన్నిసార్లు ప్రయత్నించినా తీరలేదు! ఇలా మీలా చక్కగా విడమరచి, పరిశీలించి, విశ్లేషించి చెప్తే ఎంత బాగుందో! ఎన్నో విషయాలు తెలిసాయి! ధన్యవాదములు!

  ReplyDelete
 9. కట్టిపడేశారు రవీ... వంశీగారు నా మనసులోని మాటనే వ్య్క్తీకరించారు... చాలా మంచి విషయం తెలుసుకున్నాము

  ReplyDelete
 10. చాలా బాగుంది।
  రెండు విషయాలు। మఱీ ఇలా అల్పనీలంలో తెల్లని బట్ట మీద వ్రాస్తే చదువుకునేవారు ఏమైపోవాలి। లిపిని నలుపులోనికి మార్చగలరు।

  ఇంకో విషయం। మఱీ గతంపై అంత మోజు తగదు। భారతం నేటికీ భారతమే। మహాకాళి అమ్మవారికి ఎవరూ ఎదురు నిలువలేరు। కాలాన్ని ఒక కేళిగా చూస్తే నొచ్చుకోవలసింది వుండదు । ఏది ఎంతటి సామ్రాజ్యమైనా ఒక నాటికి పడక తప్పదు।

  అన్నట్టు మాగంటి వారు చెప్పినట్టు మంచి పూర్తి నిడివి సాహిత్యం త్వరలోనే తయారుచేయగలరని ఆశిస్తున్నాను। నా దృష్ట్యా మఱీ ఈ కలంలో మనబోటివారికి తిరుమల రామచంద్రుల వంటి అనుభవాలు , అటు యోగులతోనూ ఇటు సేనలతోనూ తగలడం దాదాపు అసంభవమ్। కానీ ఎవరు చెప్పగలరు రేపటి తరాలకు మనకు రోజువారీనే వారికి పెదవింతవ్వచ్చుఁ।

  రాకేశ్వర

  ReplyDelete
 11. ఇది చదవగానే కొడాలి సుబ్బారావుగారి యీ పద్యం గుర్తుకువచ్చింది!

  శిలలు ద్రవించి యేడ్చినవి, జీర్ణములైనవి తుంగభద్రలో
  పలి గుడిగోపురంబులు, సభాస్థలులైనవి కొండముచ్చు గుం
  పులకు, చరిత్రలో మునిగిపోయినదాంధ్ర వసుంధరాధిపో
  జ్జ్వల విజయప్రతాపరభసం బొక స్వప్నకథా విశేషమై


  అవును, ఎంతటి సామ్రాజ్యమైనా ఒక నాటికి పడక తప్పదు. ఇది గతం గురించిన మోజు కాదేమో. అసలంటూ మనకి తెలియకుండాపోయిన గతం గురించి ఆవేదన, కాలస్పృహలోంచి వచ్చిన ఒక నిర్వేదమూ అనుకుంటా.

  ReplyDelete
 12. చాలా బాగుంది. మంచి శైలిలో చాలా విశేషాలు చెప్పారు.

  ReplyDelete
 13. @రసజ్ఞ, @సనత్ శ్రీపతి, @నాగమురళి: ధన్యవాదగళు.
  @కామేశ్వరరావు గారు: బాగా చెప్పారు. నాటి నిర్వేదం నేటికీ అలానే ఉంది. సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఈ ప్రాంతం అనేకవిధాలుగా వెనుకబడ్డానికి నాటి పునాదులు కారణం. అంచేతనే కవుల దగ్గర మొదలుకుని, బ్లాగులవరకూ ఇలాంటి రాతలు.
  @రాకేశ్వరరావు: పూర్తి నిడివి చేయవచ్చునండి. యే మల్లంపల్లి వారిలాగో కష్టపడాలి. మనకలాంటి దృశ్యం లేదు.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.