Sunday, June 29, 2008

మా సీమలో ఓ రోజు (గత నెల)

మా ఆవిడ వాళ్ళ వూరు కర్నూలు జిల్లా లో హంప అనే ఓ పల్లెటూరు. ఇది అనంతపురం జిల్లా గుంతకల్లు అనే పట్టణానికి దగ్గర.ఇక్కడకు దగ్గర్లోనే కసాపురం అనే ప్రముఖ ఆంజనేయ దేవస్థానం ఉంది. సరే అంత విశేషమేమిటి? అంటారా? పెద్దగా విశేషాలేం లేవనుకోండి. కొన్ని ముచ్చట్లు.

మనకు విజయ నగర సామ్రాజ్య ముఖ్య పట్టణం, సాహితీ సమరాంగణ చక్రవర్తి, కృష్ణ రాయల గారి రాజధాని హంపి తెలుసు. ఈహంపి విరూపాక్ష స్వామి మొదట హంప లో వెలిసాడట. ఈ హంప నుండీ రాయల వారు విరూపాక్ష స్వామి ని హంప కు తరలించాడని ఓ కథనం. దానికి సాక్ష్యంగా హంప లో విరూపాక్ష స్వామి శిథిల దేవాలయం ఇప్పటికీ ఉంది. హంప నుండి విరూపాక్షుడు వెళ్ళడం వల్లే విరూపాక్షుడు కొలువున్న పట్టణం హంపి అయింది అని ఐతిహ్యం.

మా ఆవిడ తాలూకు వారు ఈ గ్రామానికి శ్రోత్రియందార్లు. వాళ్ళ ఇంటి పేరు అవధానం వారు. వీళ్ళకు ఈ గ్రామం సమీపాన 200 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి ఉండేదట. మాగాణి పండించటానికి 2 చెరువులు కూడాను. గ్రామ కక్షల వల్లో, అధికారుల అలసత్వం వల్లో, మరే కారణాల వల్లో అవన్నీ ఉడిగిపోయి, ఇప్పుడు కేవలం 20 ఎకరాలు, ఎండిన చెఱువులు మిగిలాయి. ఈ గ్రామానికి ఉన్న ఇంకొక ప్రాముఖ్యత వజ్రాలు. (ఎంతైనా ఒకప్పటి రతనాల సీమ కదా) గ్రామంలోని పాడుబడ్డ శిథిలాల మధ్య, పంటపొలాల్లోనూ, కొందరు గ్రామస్తులకు వజ్రాలు దొరికాయి (ట) . ఇప్పటికీ అలాంటి వజ్రాల కోసం అన్వేషించే వారు ఉన్నారు.

ఆ వజ్రాల సంగతి ఏమో తెలియదు కానీ, నాకు మాత్రం ఓ నిధి దొరికిందీ వూళ్ళో. అవి పాత చందమామలు. మా ఆవిడ తాలూకు మామగారొకాయన ధన్యజీవి. ఎన్నో చందమామలు, కాశీమజిలీ కథలు మొదలుకుని, యద్దనపూడి సులోచనారాణి నవలల వరకు అనేకం సేకరించేడీయన. (సహస్ర చంద్ర దర్శనం తర్వాత ఈ మధ్యే ఆయన కాలం చేసారు )1955 మొదలుకుని 60, 70 వ దశకంలోని అనేకమైన చందమామలు, కొన్ని బొమ్మరిల్లు, బాలమిత్రలూ, ఇంకా కొన్ని పాకెట్ సైజులో ఉన్న చిట్టి చిట్టి జానపద నవలలూ ఓ పెద్ద అట్టపెట్టెలో పెట్టి తీసుకు వచ్చేము.

(ఈ మధ్య కొత్త పాళీ గారు ఏదో బ్లాగులో కామెంటు రాస్తూ, పాత బొమ్మరిల్లులోని చమత్కార శ్లోకం కథ, ఆడ కవిత్వం, మగ కవిత్వం గురించి భోజరాజు,కాళి దాసు చెప్పుకున్న ముచ్చట్ల గురించిన కథను ఉదహరించేరు.. ఆ బొమ్మరిల్లు కూడా మొన్నే చదివి సంతోషించాను. అలాగే అప్పటి బొమ్మరిల్లు పుస్తకాలలో చమత్కార శ్లోక కథ తో పాటూ, తెనాలి రామకృష్ణుని కథ, ఖరభ శరభుల కథ, ఇంకా కథా సరిత్సాగరం, ప్రముఖ రచయిత మల్లాది గారి చిన్న చిన్న కథలూ (ఓ పేజి కథలు) కనిపిస్తాయి.)

ఇంకా అక్కడ నులక మంచం పై నిద్ర, వాళ్ళ పాత ఇల్లు, పొగచూరు, కట్టెలపొయ్యి, వర్షం వస్తే మిద్దె పైకెక్కి మూయాల్సి వచ్చే గవాక్షాలు...ఓహ్! వాళ్ళ కాడెద్దు కి పృష్టానికి కాస్త ఎడంగా స్వస్తిక్ గుర్తు ముద్రించారు. అచ్చోసిన ఆంబోతు అంటే అదేనేమో? (నాకు పల్లె జీవితం గురించి పెద్దగా తెలియదు).

ప్రతీ సంవత్సరం ఆనవాయితీ గా హనుమజ్జయంతి జరుపడం ఓ ఆచారం వారికి. ఈ సంవత్సరం హనుమజ్జయంతి తాలూకు కొన్ని స్మృతులు (ఇవిగో).ఎన్ని రక్తపు మడుగులకు సాక్షీభూతమయిందో, మాఇంటి ఈపాతకాలం నాటి కత్తి (కరవాలం)...


తిరిగి వస్తున్న దారిలో అనంతపురం ఇస్కాన్ దేవస్థానం సందర్శించినప్పుడి ఫోటోలు కొన్ని...
13 comments:

 1. బాగుందండీ మీ టపా. నాకూ అన్ని చందమామలు కావలి.. ఎలా? ఎలా? ఎలా కుదురుతుంది?

  కొత్తపాళీ గారు ఆ వ్యాఖ్య రాసింది నా సాహిత్యానికే!! :-( వారు చెప్పినప్పటి నుండి ఆ కథ చదవాలని ఉంది.. కానీ ఎలా వెతికి పట్టుకోవాలో తెలియడం లేదు.

  అన్నట్టు.. మీ బ్లాగు టెంప్లేట్ మార్చేరే!! తెలుగక్షరం చదివేటప్పటికి వేరేది ఉండేది. నా బ్లాగు టెంప్లేట్ కూడా ఇదే!!

  purnima.

  ReplyDelete
 2. ఎన్ని రక్తపు మడుగులకు సాక్షీభూతమయిందో, మాఇంటి ఈపాతకాలం నాటి కత్తి (కరవాలం)...

  కత్తి గురింఛి ఖంగారు పడకండి రవిగారు,ఆరోజుల్లో ఒక లాంచనంగా,ఒక తప్పనిసరి వస్తువులాగా కత్తులు,బల్లాలు,బాకులుండేవి.అవి ఉన్నవారందరూ రక్తాలు పారించారని భావించనక్కరలేదు.ఇవ్వాళ ఎన్ని ఇళ్ళల్లో పుస్తకాలుండటం లేదు??చదివుతున్న వారేరి మరి??

  ReplyDelete
 3. రాజెంద్ర గారి కామెంటు అదుర్స్.
  సాహితీ యానం

  ReplyDelete
 4. నిజమైన నిధే దొరికింది.

  purnima గారు:

  ఆ మధ్యెవరో చందమామలు ఆన్లైనులో చదవడానికి లంకె పంపించారుగా..
  అందులో మొదటి నుంచి ఇప్పటీ వరకూ చందమామలు అన్నీ ఉన్నాయి. మీరు అక్కడ చదవవచ్చు.
  నాకు దొరికితే పంపుతా.

  ReplyDelete
 5. @పూర్ణిమ గారూ, @ప్రవీణ్ గారూ : చందమామలు 1948ఆగస్టు సంచిక (మొదటి చందమామ) నుండీ 1959 వరకూ చందమామ వారు పీడీ ఎఫ్ రూపంలో పెట్టారు. (www.chandamama.org) ఇందులో కొన్ని చందమామలు (1955 వి)మిస్ అయాయి. వాటిలో కొన్ని నాకు దొరికాయి :-). ఇవన్నీ నేనెప్పుడో దింపుకున్నాను. నాగమురళి గారు కూడా ఓ లంకె ఇచ్చారు కొన్ని దాదాపు ఓ నెలక్రితం. ఐతే పాతచందమామల సువాసన ఆఘ్రాణిస్తూ, దాచిపెట్టుకుని చదవడంలో అదో సుఖం. :-)

  @పూర్ణిమ గారూ, చూద్దాం, వీలున్నప్పుడు ఆ బొమ్మరిల్లు కథను స్కాన్ తీయించి పెడతాను.టెంప్లేట్ మారలేదండీ, కాస్త కలర్సూ, అవీ ఇవీ మార్చి ఉంటానేమో..అంత ఓపిక నాకు లేదు.
  :-)

  @రాజేంద్ర కుమార్ గారూ : బొల్లోజు బాబా గారు చెప్పినట్టు మీ కామెంట్ సూపర్. :-) ఐతే వాళ్ళ ఇంటిలో ఏదో రాయలసీమ ఫాక్షన్ గోల నిజంగనే ఉంది. వాళ్ళ ఇంటి పెద్ద కూడా ఆ కక్షలకే బలయ్యాడు (హత్య చేయబడ్డాడట. అదో పెద్ద కథ. పూర్తి డీటయిల్స్ తెలియవు నాకు :-))(ఈ కత్తి అందులో పాల్గొన్నదీ ల్నిదీ తెలియదు).

  @బాబా గారూ : నెనర్లు.

  ReplyDelete
 6. A .. M .. A .. Z .. I .. N .. G

  You have no idea how much I envy you right his second!!! :-)

  అనేక పార్శ్వాల్లో ఈ హిస్టారికల్ టపా సూపర్ గా ఉంది.
  ఆ పావలా ముప్పావలా బొమ్మరిల్లు బుజ్జాయి పాకెట్ నవల్లు .. ఓహ్ తల్చుకుంటేనే వొళ్ళు పులకరిస్తోంది.

  కక్ష్య కాదు, కక్ష. కక్ష్య = orbit.
  గడియారం రామకృఇష్ణ శాస్త్రిగారు తమ ఆత్మ కథలో బ్రాహ్మలు కూడా "పార్టీ" (ఫాక్ష్నిస్టు యుద్ధాలకి స్థానిక పేరు) పాల్గోవడం, దానికోసమే యుద్ధం చెయగల పహిల్వానులని మెయింటేన్ చెయ్యడం గురించి రాశారు. ఆ ప్రాంతంలో ఏ పాడుబడిన ఇల్లున్నా నిధి నిక్షేపాలకోసం వెదకడం పిచ్చ గురించి తిరుమల రామచంర తమ ఆత్మకథలో రాశారు.

  చాలా బావుంది ఈ టపా. ఫొటోలు కూడా.

  ReplyDelete
 7. రవి గారు టపా బావుంది... చందమామ లింక్ కూడా ఇచ్చినందుకు నెనర్లు..
  ఆన్లైన్ లో చదవినా ఏదో చదివామని తప్ప నిజంగా చదివిన ఫీల్ ఐతే రాదు నాకు.. పుస్తకాల నుండి వచ్చే ఆ సువాసనలు నాకూ ఇష్టమే!

  ReplyDelete
 8. ఈ ఊరేదో మా ఊరిలా ఉందే!! మాదీ శోత్రీయ గ్రామమే! కాకపోతే వారసత్వంలో కత్తులు మాకు రాలేదు..మా దాయాదులకు వెళ్ళాయి

  ReplyDelete
 9. రవి గారు,
  చదువుతుంటేనే నోరూరి పోతోంది. ఆ బుల్లి పాకెట్ నవలల కోసం ఏమైనా చేస్తాను ! మీ చుట్టాలు భలే మంచి వాళ్ళండీ! అలాంటి పుస్తకాలిచ్చే చుట్టాలుంటే బాగుంటుంది. అయినా ఇంత మంచి నిధి దొరికాక వజ్రాలూ అవీ ఎవరిక్కావాలండీ?

  ReplyDelete
 10. > బ్రాహ్మలు కూడా "పార్టీ" (ఫాక్ష్నిస్టు యుద్ధాలకి
  > స్థానిక పేరు) పాల్గోవడం, దానికోసమే యుద్ధం...

  కొత్తపాళీ: పై విషయంపై చూ: ఆముక్తమాల్యద,
  "రాజనీతి" భాగం :-). అలాగే అక్కన్న, మాదన్నల చరిత్ర.ప్రస్తుత కాలంలో కాస్త sensitive topic కాబట్టి లోతుగా ప్రస్తావించలేను!

  ఆయుధాలకు చరిత్రలు, వంశాలు (lineages) వుంటాయి. ముఖ్యంగా దక్షిణభారతంలో ఈ సంప్రదాయం యెక్కువ.

  -- శ్రీనివాస్

  ReplyDelete
 11. చాలా బాగున్నాయి విశేషాలన్నీ. ఫొటోలు కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడైనా ఈ ఊళ్ళన్నీ చూడాలని ఉంది. చూడాలి, ఎప్పుటికి కుదురుతుందో.

  మీకు వెతక్కుండానే నిధి దొరికింది. ఆయనలాగే మీరు కూడా భద్రంగా దాచి ముందు తరాలకి అందించండి. :-) :-)

  ReplyDelete
 12. @కొత్తపాళీ గారు :ఆ బుజ్జాయి, బాలభారతి, బొమ్మరిల్లు పాకెట్ నవల్ల కోసం నేనూ, మా అన్న చచ్చేట్టు కొట్టుకునే వాళ్ళం. :-), భలే సరదాగా ఉంటాయవి.

  ముద్రారాక్షసుడికి పరివర్తన కలిగించాను. (కక్ష్య)

  గడియారం వారి ఆత్మ కథ చదవాలి. మీరో సారి మంచి పుస్తకాలు ఓ సారి పరిచయం చేస్తే బావుంటుంది.

  @శ్రీనివాస్ పరుచూరి గారు: మంచి టపా రాయరాదా మీరే ఈ విషయాలపైన?

  @రవి వైజాపత్య గారు : మా మిత్రులు కొంతమంది ఇలానే అన్నారు. పల్లెల్లో కథలు ఇలానే ఉంటాయేమో మరి?

  @ మేధ గారు, @సుజాత గారు, @ నాగమురళి గారు : నెనర్లు.

  ReplyDelete
 13. బావుంది రవి గారు, మొత్తానికి భలే నిధి సంపాదించారు...

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.