Sunday, August 7, 2011

మిళింద పన్హ


ఆర్యగౌతముడు గతించి భిక్కుసంఘానికి మహాకాశ్యపుడు మార్గదర్శకుడుగా ఉంటున్నకాలమది.
గంగానదీతీరంలో ఒక ఆవాసంలో భిక్కుసంఘం ఒకటి ఉంది. ఒకనాటి ఉదయం ఆ భిక్కుసంఘంలో శీలసంపన్నులయిన భిక్షులు బుద్ధానుస్సతి (బుద్ధుని దైవికగుణాలకు సంబంధించిన ధ్యానపద్ధతి) చేస్తూ అంకణాన్ని (ముంగిలి) ఊడ్చి, చెత్తాచెదారం ప్రోగు చేస్తున్నారు. ఆ పనిలో భాగంగా ఒక భిక్షువు శ్రమణేరునితో (కొత్తగా భిక్కుసంఘంలో చేరినవాడు) చెత్త కుప్పను ఊడవమని చెప్పాడు. ధ్యానమజ్ఞుడైన ఆ పిల్లవాడు ఆ పని చేయలేదు. మరోసారి చెప్పాడు భిక్షువు. అప్పటికి ఆ అబ్బాయి వినకపోతే చీపురుకొయ్యతో ఒకదెబ్బ వేశాడు. ఆ దెబ్బకా అబ్బాయి ఏడుస్తూ, భయంతో ఆ కుప్పను ఊడుస్తూ, మనసులో సంకల్పించుకున్నాడు. "ఈ కుప్పను ఊడ్చే ఫలం నాకు దక్కితే ఆ ఫలంతో, నిర్వాణపర్యంతం మహా తేజోవంతునిగా, మహా శక్తునిగా అవుతాను".
తర్వాత ఆ పిల్లవాడు గంగానది ఒడ్డుకు స్నానానికి వెళ్ళాడు. గంగానది అలల ప్రవాహాన్ని చూస్తూ, తన మనసులో ద్వితీయప్రణిధి (ఆకాంక్ష)ను అనుకున్నాడు. "నిర్వాణపర్యంతం నేను గంగానదిలా వేగవంతమైన మనస్సు కలిగినవాడినవుతాను". శ్రమణేరున్ని భిక్షువు ఆ సంఘటన ఆదిగా గమనిస్తూనే ఉన్నాడు. అతనితోబాటూ గంగాస్నానానికి భిక్కువు కూడా వచ్చియున్నాడు. ఆతడూ మనసులో సంకల్పం చెప్పుకున్నాడు. "తర్వాతి జన్మలలోనూ నేను గంగానది ప్రవాహంలా ఉద్ధృతమైన బుద్ధిని ఉపయోగిస్తూ ఈ అబ్బాయి ప్రశ్నలకు జవాబు చెప్పగలిగిన వాడనవుతాను".

ఐదువందల యేళ్ళతర్వాత -

ఇందాకటి శ్రమణేరుడు, మిళిందుడు అన్న పేరుతో జంబూద్వీపంలోని సాగలనగరానికి రాజయినాడు. (అశోకుని తర్వాత జంబూద్వీపానికి గ్రీకులదండయాత్ర మరోమారు మొదలయ్యింది. గ్రీకు సేనాని ఒకడు భారతదేశ వాయవ్య భాగాన్ని (నేటి ఆఫ్ఘనిస్తాన్) ఆక్రమించాడు. ఆతడి కొడుకుగా రాజయినవాడు మినాందర్. అతడే మిళిందుడు)

మిళిందుడు అనేక శాస్త్రాలు చదివాడు. మహా మేధోవంతుడైనాడు. అయితే వితండవాది. అజేయుడు. ఎందర్నో తన వాదనలో ఓడించాడు. వాదప్రియుడు. అతని వాదానికి జంబూద్వీపంలో ఎవరూ సమాధానాలు చెప్పలేకపోయారు. "ఈ జంబూద్వీపం ఒక తుచ్ఛ ద్వీపం. ఇంతపెద్ద ద్వీపంలో ఒక్కరూ నాతో మాట్లాడగలిగే వాళ్ళు లేరు". అని ఆక్షేపించాడు. ఈతని ఆక్షేపణ అశ్వగుప్తుడనే భిక్షువు విన్నాడు. మిళిందునితో తలపడే శక్తి అతనికీ లేదు. తగిన వ్యక్తి కోసం, తగిన కాలం కోసం చూస్తూ అలాంటి వ్యక్తిని వెతకమని తన శిష్యుడు రోహణునికి చెప్పాడు.

అక్కడికి చాలా కోసుల దూరంలో - ఆంధ్రదేశంలో సోణుత్తరుడనే అతనికి నాగసేనుడనే పుత్రుడు జన్మించినాడు. ఆ పిల్లవాడు పుట్టగానే అనేక శుభాలు జరిగాయి.

రోహణుడు అర్హతుని కోసం వెతుకుతూ ఆంధ్రదేశం వచ్చాడు. సోణుత్తరుని ఇంట జన్మించిన మహాసేనుడనే బుద్ధకాయాన్ని గుర్తించాడు. ఆ తర్వాత సోణుత్తరుని ఇంటికి భిక్షకోసం రాసాగినాడు. సోణుత్తరుని ఇల్లాలు ఛీత్కరించి పంపేది. నిర్వికారంగా వెళ్ళేవాడు రోహణుడు. రోజూ అదేగతి. ఇలా ఏడు సంవత్సరాలు గడిచింది. నాగసేనుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు.

రోహణుడికి సోణుత్తరుని ఇల్లాలు ఒకనాడు, ఏ కళనుందో ఏమో, తిట్టిపోయకుండా "అధిగచ్చథ భన్తే" (ముందు ఇంటికి వెళ్ళండి) అని ఆదరంగా పలికింది. రోహణుడు వెళుతూంటే సోణుత్తరుడు అగుపడి, "మా ఇంట మీకు భిక్ష దొరికిందా" అని అడిగాడు. "అవున"న్నాడు రోహణుడు. ఇంటికి వచ్చిన సోణుత్తరుడు, భార్యను ప్రశ్నిస్తే, ఆమె భిక్ష ఏమీ ఇవ్వలేదని చెప్పింది. మరుసటి రోజు సోణుత్తరుడు రోహణుడిని కడిగిపారేద్దామని నిశ్చయించుకుని ఇంటిముందు కూర్చున్నాడు. రోహణుడు రాగానే అతణ్ణి నిందించాడు. "నీవొక మృషావాదివి. నిన్న మా ఇంట భిక్ష దొరికిందని అబద్ధం చెప్పావు" అన్నాడు. " అయ్యా! ఎన్నడూ ఆదరించని ఇల్లాలు మార్దవంగా ఒక మాట చెప్పింది. ఆ వచనలాభమే నా భిక్ష" అన్నాడు రోహణుడు. సోణుత్తరుడు చింతించాడు. ఒక్క వచనలాభమే ఇంత సంతోషాన్నిస్తే, భిక్ష ఇస్తే ఇంకెంత సంతోషిస్తాడో"నని రోహణుడికి భిక్ష ఇచ్చాడు. ఆ తర్వాత రోజునుండి ప్రతి రోజూ భిక్ష ఏర్పాటు చేశాడు.

నాగసేనుడు ఎనిమిది యేళ్ళ వయసులో గురువు వద్ద శాస్త్రాలన్నీ నేర్చేశాడు. అతనికి శాస్త్రాల మీద ఎందుచేతనో విరక్తి కలిగింది. మరణ సమయంలో ఈ శాస్త్రాలన్ని ఎందుకు పనికి వస్తాయోనని సందేహం కలిగేది.

ఒక రోజు నాగసేనుడు, తన ఇంట్లో భిక్ష స్వీకరిస్తున్న రోహణున్ని, "భన్తే! మీరు ఎందుకు ఇలా ఉన్నారు? ఎందుకు మీ దుస్తులు మాకంటే వేరుగా ఉన్నాయి? ఎందుకు మీరు భిక్ష తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు?లోకరీతికి భిన్నంగా ముండనం ఎందుకు చేసికొన్నారు?" అని అడిగాడు.

రోహణుడు జవాబు చెబుతూ, "బాలకా! నేను ప్రవ్రజితుడను, పాపరూపములైన మలములను వదిలించుకొనేదానికి ఇల్లూవాకిలీ వదిలివేశాను. అలంకార, మండన, తైలమర్దన, ధోవన (shampoo),మాల, గంధ, వాసన,హరీతక, ఆమలక, రంగ(dye), బంధన,కోచ్ఛ(దువ్వెన), కప్పక, విజటన, ఊకా, కేశరక్షణ అనే పదహారు చింతనలనుండి తప్పించుకుందుకు కేశశ్మశ్రువులను తీసివేసుకున్నాను. కామమోహితం కారాదని ఈ బట్టలు వేసుకున్నాను" అన్నాడు. 

"
మీకు లోకంలో ఉత్తమమైన విద్య ఏదో తెలుసా?" అడిగేడు నాగసేనుడు.

"
తెలుసు. ఆ విద్య తెలియాలంటే నువ్వు ప్రవ్రజ్యం తీసుకోవాల"న్నాడు రోహణుడు.

నాగసేనుడు తల్లిదండ్రుల అనుమతితో ప్రవ్రజ్యం తీసుకుని రోహణుడితో కూడా సాగిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి నాగసేనుడు అర్హతుడయ్యాడు. క్రమంగా అతనికి శిష్యులు ఏర్పడ్డారు. ప్రవచనాలు చేస్తూ సాగలనగరానికి వచ్చాడు. నాగసేనుని శిష్యులలో ఆయుపాలుడనే ఒకతణ్ణి మిళిందుడు వాదనతో ఓడించాడు. ఆ శిష్యుడు నాగసేనునికి జరిగింది చెప్పడంతో, నాగసేనునికి మిళిందుని కలిసే అవకాశం వస్తుంది. ఒక శుభముహూర్తాన, భిక్షుల సంఘం చుట్టూ ఉండగా. రాజాస్థానంలో మిళిందుడు నాగసేనునితో వాదం పండితవాదం ప్రారంభించాడు.

వాదం పండితవాదం, రాజవాదం అని రెండురకాలు. మొదటివాదంలో సమాధానం కోసం తాపత్రయం మాత్రమే ఉంటుంది. వాదనను అటు, ఇటు పొర్లించి సమాధానం వెతకటం పండితవాదం. ఎదుటి వ్యక్తి వాదం విని కోపం తెచ్చుకుని శాసించటం రాజవాదం.

మిళిందుడు నాగసేనుడితో అనేకవిధాలుగా వాదించాడు. "నువ్వెవరు? నువ్వు ఏమీ కాకపోతే ఇంత ఆర్భాటం ఎందుకు? సంసారం మీద విరక్తి చెందితే ఆత్మహత్య చేసుకోక ఈ తతంగం ఎందుకు నడుపుతున్నావు? బుద్ధుడికి కోపం రాదంటావు, సారిపుత్రుణ్ణి మందలించాడంటావు. ఏది నిజం? దుస్తులు మారిస్తే నిర్వాణం వచ్చేస్తుందా?" ఇలా అనేకరకాలుగా వాదించాడు. నాగసేనుడు మిళిందుని ప్రశ్నలకు ధీటుగా, ఓపికగా, ఆర్తితో, ఆసక్తితో బదులుచెప్పాడు.

చివరికి -

తన ప్రశ్నలన్నీ నశించడంతో మిళిందుని చిత్తవికారాలన్నీ తొలగిపోయాయి. నాగసేనునికి, శిష్యవర్గానికి ఒక విహారం కట్టించాడు మిళిందుడు. తన తదనంతరం కుమారుని రాజ్యం అప్పగించి ఇల్లు విడిచి ప్రవ్రజ్య తీసుకున్నాడు. తన రెండువందల అరవై రెండు ప్రశ్నలను లిఖితం చేసి భద్రపర్చాడు.

**************************************************

పై కథ చాలావరకూ సంక్షిప్తీకరించి చెప్పినది.

**************************************************

మిళిందపన్హ అనేది బౌద్ధ సాహిత్యంలో ఒక అద్భుతం. ఈ పుస్తకంలో ప్రశ్నలు మనకూ రోజువారి జీవితంలో కలిగేవే.  దీన్ని ఆచార్య వసుబంధుడు క్రీ. శ. ఒకటవ శతాబ్దంలో రచించాడు. ఇది కాలక్రమేణా చీనాభాషలోకి అనువాదం చేయబడింది. బౌద్ధ త్రిపిటకాలలో వీటిని చేర్చడం కూడా జరిగింది. ప్రాకృతంలో ఈ పుస్తకం నేడు దొరుకుతున్నది. (బౌద్ధ భారతీ - వారాణసి) ఆంగ్లానువాదాలున్నాయి కానీ ఇలాంటి పుస్తకాలు భారతీయార్థంలోనివి ఆంగ్లంలో స్థూలంగా అర్థమయినా, సూక్ష్మస్థాయిలో అర్థాలు మారిపోయే అవకాశం ఉంది. తెలుగులో ఈ పుస్తకం సంక్షిప్తానువాదం బోధచైతన్య అనే ఒకాయన చేశారు. ఈ పుస్తకం విక్రయానికి కాదు. భాగ్యనగరంలో ఆనందబుద్ధవిహార ట్రస్టు వారి దగ్గర ఈ కాపీలు దొరకవచ్చు.

4 comments:

 1. కథ బాగానే ఉంది కానీ, కథ కన్నా పుస్తకంలోని ప్రశ్న జవాబులు మరింత ఆసక్తికరంగా ఉంటాయని అనిపిస్తోంది. వాటిలో కొన్నిటినైనా మీ బ్లాగులో పరిచయం చేస్తే బాగుంటుంది.

  ReplyDelete
 2. స్ట్రయిట్ ఫార్వర్డ్ ప్రశ్నలున్నాయండి ఇందులో. ఈ రోజే ఒకటి చదివాను.

  బుద్ధుడి శరీరానికి దుఃఖవేదనలు కలిగాయా?
  అవును. కాలికి రాయిగుచ్చుకుని రక్తం వచ్చినప్పుడు, చనిపోయే ముందు అతిసార వ్యాధి వల్లా, ఇలా ఒక్కొక్కసారి వేదన కలిగింది.
  వేదనలన్ని కర్మవల్లనే కదా వస్తాయి, అయితే బుద్ధుడు కర్మబద్ధుడా? కర్మబద్ధుడయితే నిర్వాణం పొందలేదా? నిర్వాణం పొందకపోతే కర్మలెలా తగులుకున్నయ్?
  వేదనలకు 8 కారణాలు. వాతం, పిత్తం, శ్లేష్మం, ఆ మూడిటి సంయోగం, ఋతుపరిణామం,ప్రతికూలమైన అన్నపానాదులు, ఔపకర్మికం (external reasons), కర్మవిపాకం.
  మొదటి యేడూ కూడా కర్మవల్లనే కదా?
  కాదు. బుద్ధుడి వేదనకు కారణం ఔపకర్మికం. అంచేతనే ఫలితం అతీతంలోనూ, అనాగతంలోనూ రాలేదు. లౌకికవిషయాలకు కర్మను ముడిపెట్టడం అతిప్రసంగం, బాల్యచేష్ట.

  కర్మ వ్యవస్థానం అనేది సమ్యక్ జ్ఞానానికి మాత్రమే అర్థమయే విషయమంటాడు. లోకంలో పేదరికానికి కారణం కర్మ అని buddhist school of thought ఒప్పుకోదు. పేదవాడుగా పుడితే అతడు పూర్వజన్మలో పాపి అనడం childishness అని జిడ్డు కృష్ణమూర్తి కూడా తేల్చి చెబుతాడు ఒకసారి.

  ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయండి. బట్టలు మారిస్తే మోక్షం వచ్చేస్తదా? బుద్ధుడి జితక్రోధుడంటావ్, మరి ఫలానా సందర్భంలో ఎందుకు శారిపుత్రుణ్ణి గెంటాడు? బుద్ధుడు ఒకచోట నేను బ్రాహ్మణుణ్ణి అంటాడు, మరోచోట రాజునంటాడు. ఏది నిజం?

  దాదాపు అన్నిప్రశ్నలకు ఉపమలు (similies) చెప్పడం ఈ పుస్తకంలో ప్రత్యేకత. ఆంగ్లంలో పీడీ ఎఫ్ దొరుకుతుంది వీలైతే చదవండి.

  ReplyDelete
 3. బాగుందండీ. చదవాలి వీలుచూసుకుని.

  ReplyDelete
 4. Chala manchi book gurinchi cheparu


  Thanks a lot

  i am reading it and i sincerely appreciate your good effort

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.