Saturday, August 27, 2011

సప్తగిరి - శేషగిరి
ఈ శీర్షికకు సప్తగిరి - శేషగిరి అని పేరు పెట్టాలా? లేక శేషగిరి - సప్తగిరి అని అనాలా అని రాస్తుండగా అనుమానం వస్తూంది. దేముడి పల్లకీని బోయీ మోస్తున్నాడు అనడం కరెక్టా లేక బోయీ మోస్తున్న దేవుడి పల్లకీ అనడం సబబా?

****************************************************

సప్తగిరి - తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఈ పత్రిక మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుండేది. బాలజ్యోతి, చందమామ, ఆంధ్రజ్యోతి - ఈ పత్రికలను వచ్చిన వెంటనే చదివేసేవాళ్ళం కానీ సప్తగిరి పత్రికను మాత్రం ఎప్పుడైనా ఒకసారి అలా తిరగేసేవాళ్ళం. అలాగని పత్రిక మా ఇంట ఉండక పోవడమంటూ ప్రశ్నే వచ్చేది కాదు. 

అలా సప్తగిరి పత్రిక - స్వామి వారి సుప్రభాతం బ్రాహ్మీ ముహూర్తంలో ఠంచనుగా పలికినట్టు ప్రతినెల మొదటి తారీకున ఇంటింటికి వచ్చి చేరడానికి కారణం శేషగిరి.

శేషగిరి - బ్రహ్మానందం లాంటి కేరక్టరు. తోడుగా అమాయకత్వం, వలయాలు వలయాలుగా కనబడే భూతద్దాలు. అంత దప్పమైన అద్దాలు ఉన్నా కూడా కనబడని కళ్ళు, తనకు కళ్ళు కనబడవని ఇతరులకు తెలియనివ్వరాదన్న తపనా, అప్పుడప్పుడూ స్టైలుగా నోట్లో వెలిగే చార్మినార్ సిగరెట్టు, కూసింత మతిస్థిమితం లేకపోవడం....ఈతడు సప్తగిరి పత్రికకు ఏజెంట్. తర్వాత్తర్వాత రామకృష్ణప్రభ, ఇలాంటి ఇంకొన్ని అధ్యాత్మికపత్రికలకు ఏజెంట్ అయాడు. సప్తగిరిని మా ఇంటికి, ఇంకా అనేకుల ఇళ్ళకు క్రమం తప్పకుండా మోయడం ఈయన వృత్తి.

శేషగిరి మాధ్వుల ఇంటిబిడ్డ, చదువు అబ్బలేదు. అన్నయ్యకు ఊళ్ళో మంచి పరపతి ఉంది, కానీ శేషగిరి తన తమ్ముడు అంటే బయట నామోషీ కాబోలు. సప్తగిరి వాసుని సేవకు అంకితం చేసి ఈ పత్రికను అమ్ముకు బతకమన్నాడు. ఓ శుభముహూర్తాన శేషగిరి నడుముకు ఒక సంచీ వేలాడదీసుకుని బయలుదేరేడు. వెనుదిరిగి చూడలేదు. సప్తగిరి పత్రిక వెల ఒక్కరూపాయ (ఇప్పుడు ఐదు రూపాయలు) అప్పట్లో. ఎన్ని సప్తగిరి పత్రికలు అమ్మితే తన అవసరాలు తీరేవో ఏమో మరి. తన అన్నయ్య ఇంట్లో భోజనానికి మాత్రం లోటు ఉండేది కాదనుకుంటా.

పగలంతా కోదండరామస్వామి దేవళం, సాయంత్రం రాఘవేంద్రస్వామి, దేవళానికి ఠంచనుగా వచ్చే భక్తులకు అతను పరిచయమే. ఏ పూటైనా మధ్యాహ్నం వరకూ ఉంటే గుడి మూసిన తర్వాత మంటపంలో చిన్నగా కునుకు తీసేవాడు.  

తనకు కళ్ళు కనబడవని తెలిసి ’శేషగిరీ’ అని వెనుకనుండి పిలిచి అతను అయోమయంగా తిరిగి చూస్తే -స్థంభాల వెనుక దాక్కుని కిసుక్కున నవ్వుకునే పిల్లకాయలు,  చెల్లని నోటు ఇచ్చి కనుక్కుంటాడా లేడా అని ఆటపట్టించే పెద్దవాళ్ళు, సప్తగిరి ఇచ్చెయ్ వచ్చేనెల డబ్బులిస్తానని ఉబుసుపోక మాటాడే అరువు బేరాలు, అంతోటి అన్నయ్యకు ఇట్టాంటి తమ్ముడేమిటి? ఏదో పాపం చేసుంటాడు (మనకలాంటి ఖర్మ తగల్లేదు!) అని ఇతరులపాపాన్ని ఊహించుకుని తమ పుణ్యాన్ని బేరీజు వేసుకుని కించిత్తు గర్వపడే ధర్మాత్ములు, అమాయకుణ్ణి ఆటపట్టించడం తెలివితేటలకు నిదర్శనమని భావించే అతితెలివిరాయుళ్ళు - వీళ్ళందరి మధ్య శేషగిరి - పిచ్చిమొక్కలవనంలో చేమంతి పూలమొక్క లా ఉండేవాడు. అయితే చిత్రమేమంటే ఆ పిచ్చిమొక్కలు తమని తాము పూలమొక్కల్లా, నిజమైన పూలమొక్కని పిచ్చిమొక్కలా భావించేవి.

అతణ్ణి ఆటపట్టించే సదరు పిల్లకాయల గుంపులో భవదీయుడు కూడా అప్పట్లో ఒక సభ్యుడు. పైగా మా ఇంటికి వచ్చేవాడు కాబట్టి, ఎఱిగిన వాడు కాబట్టి, అతణ్ణి ఏమారిస్తే ఒకింత సంతోషం కూడానూ. శేషగిరిని, ఒక పనికి మాలిన వాడిగా, పనికిరానివాడుగా కాకండా ఒక మనిషిగా ఆదరంగా చూసినవాళ్ళు చాలా తక్కువ మందని చెప్పవచ్చు.ఆ తక్కువమందిలో మా అమ్మ ఒకరు. చాలా సార్లు తను చదవకపోయినా అతని భుక్తి కోసం, అతని దగ్గర ఉన్న ఇతరపత్రికలను డబ్బు ఇచ్చి కొనడం, తనకు మా హోటల్లో టిఫిను పెట్టి అతను తక్కువడబ్బులిస్తే చూసీచూడనట్టు పోవడం నా బాల్యంలో నేను గమనించాను. బహుశా అతనికీ తెలిసి ఉంటుంది.

ఉద్యోగాల రంధిలో ఊళ్ళువదిలి దిక్కుకొకరుగా చెదిరిపోయిన తర్వాత ఇలాంటి గూటిపక్షుల గురించి ఓ మాట అనుకునే అవకాశం ఎక్కడ? దేవుడి గురించే ఆలోచించే తీరికలేనప్పుడు దేముడి పల్లకీ తాలూకు బోయీ గురించి ఎవడు పట్టించుకుంటాడు? శేషగిరి ఇప్పుడు లేడు. అయితే వీధి మొగదల పుస్తకాల అంగట్లో సరదాగా ఏదైనా చదువుదామని చందమామో, స్వాతి పత్రికో, సితారో కొనబోతూ పక్కన సప్తగిరి పత్రిక కనబడితే ఆ పుస్తకం తప్పక మా ఇంట్లో ఉంటుంది. చదవకపోయినా సరే!

3 comments:

  1. Ravi.. really touching..no other words really .. I could imagine that guy; Don't remember if I have seen him

    ReplyDelete
  2. కదిలించేరు రవీ...

    ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.