Wednesday, August 24, 2011

జ్యోతి లంచ్ హామ్


 
మా ఇంట్లో ఒక స్టీలు నీళ్ళజగ్గు ఉండేది. స్టీలుగిన్నెలు ఇంట్లో ఉంటం పెద్ద విషయం కాదు కాబట్టి, ఆ వాక్యంలో ఒక కథ దాగుందని మదీయసంకేతంబు. ఆ జగ్గు మొదటి స్పెషాలిటీ - cylindrical truncated cone రూపంలో ఉండటం. జగ్గు ఇటు చివర్న నీళ్ళు వొంపుకొందుకు అనువుగా చెవులు.  ఆ చెవుల పక్కగా "జ్యోతి లంచ్ హామ్" (మీరు సరిగ్గానే చదివారు, హోమ్ కాదు హామ్ అనే చెక్కారు) అని అందమైన వ్రాలు. జగ్గు పట్టుకుందుకు వంపుకడ్డీ విరిగిపోయి ఉండేది. అప్పట్లో స్టీలు గిన్నెల మీద వ్రాయటానికి వీధుల్లో అరుచుకుంటూ తిరిగే వ్రాయసగాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకదే జీవనోపాధి. "ఏమ్మా, గిన్నెలకు, చెంబులకూ రంగులేస్తామ్మా!" అని ఒకతను మా ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడు. అదిగో అలాంటి వ్రాయసకాడిచేత ఆ జగ్గు మీద అలా చెక్కించబడిన అందమైన అక్షరాలవి. మామూలుగా పేర్లవీ వ్రాయించుకుంటారు. కానీ ఆ జగ్గు మీద అలా వ్రాసి ఉండటం ఒక ఆకర్షణ.

రెండవ ఆకర్షణ - అది మా అమ్మానాన్నల పెళ్ళికి వచ్చిన ఒకానొక గిఫ్టు.

మొన్నామధ్య మా అమ్మ ఆబ్ధికం సందర్భంగా నాన్న తన పాత జ్ఞాపకాలు ఏవో నెమరు వేస్తూ ఉంటే ఆయన నోట జ్యోతి లంచ్ హామ్ అన్న మాట వినిపించింది. మా అమ్మ అదివరకు నాన్నతో మాట్లాడుకున్న ఊసులు, ఆమె కష్టాలు ఒకటికి మరొకటి కలిపి ఆలోచిస్తే ఈ కథకు లింకు దొరికింది.

చదువులోనూ, అందంలోనూ, తెలివిలోనూ మా నాన్న కంటే రెండందాలు అణకువలో మా నాన్నకంటే నాలుగందాలు ఎక్కువయిన మా అమ్మ తన ప్రభుత్వోద్యోగం మానేసి, జీవనోపాధికోసం వంటలు తప్ప మరేమీ ఎఱుగని ఒక అమాయక,అతిసామాన్య మనిషిని పెళ్ళిచేసుకుని కాపరానికి వచ్చింది. మరో యేడాదికి మొదటి సంతానమూ (మా అన్న) కలిగింది. మా నాన్నది పెద్ద సంసారం. హిట్లర్ సినిమాలో చిరంజీవికి ఉన్నట్టు నలుగురు చెల్లెళ్ళాయనకు.ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు, అమ్మగారు కూడా ఇంట్లోని. ప్రొద్దుటూరులో శివాలయం వీధిలో ఒకానొక హోటల్లో ఆయన పనిచేసేవాడు. మధ్యాహ్నం వరకూ ఎడతెఱిపి లేని పని. ఆయనతోబాటూ అమ్మకూ పనే. హోటల్ పనులు, పెద్దావిడను చూసుకోవడం, చంకలో బిడ్డా, వంటావార్పూ వగైరా. ఇంతా చేసి మధ్యాహ్నం ఏ ఒంటిగంటకో కాస్త ఎంగిలిపడదామంటే అడుగంటిపోయిన గిన్నెలు కనిపించేవట. వండిన వంట మొత్తం ఆడపడుచులూ, పెద్దావిడ స్వాహా చేసేవారట. (అసూయ ఆడవాళ్ళ పేటెంటు, కాబట్టి మా అమ్మ ఆడపడుచుల మీద అసూయపడి ఈ కథ చెప్పి ఉండవచ్చు. వాళ్ళ దగ్గర మరో వర్షన్ కథ ఉండవచ్చు, కానీ మా అమ్మ తప్పైనా ఆమెకే నా ఓటు).

అలానే ఎలాగోలా సంసారం నెట్టుకొస్తూంది.

మా నాన్న పని చేసే వీధి చివర్న జ్యోతి లంచ్ హామ్ అనే అయ్యర్ల భోజన హోటలు ఉండేదిట. ఆ హోటల్ యజమాని ఒక పెద్దవయసాయన. ఆయనకు మా నాన్న అంతకు ముందే పరిచయం. మా నాన్న మీద ఎంచేతనో పుత్రవాత్సల్యం. బాలింతరాలి మీద సానుభూతి. తన హోటల్లో పప్పుకూరలు తీసుకెళ్ళమని చెబుతుండేవాడట.

అలా ఉండగా అమ్మకు ఓ రోజున ఏవో గడ్డలొచ్చేయి. ఆసుపత్రికెళ్ళి చూపిస్తే, డాక్టరు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ ఖరీదు ఆ రోజుల్లో ఏడువేలు (ఇప్పట్లో ఏడు లక్షలు అనుకోండి). ఈయన దగ్గరా అంత డబ్బు కుదిరే అవకాశం కష్టం మీద సాధ్యం కానీ, దానికి కుటుంబసభ్యుల అప్రూవల్ కావాలి. ఇంట్లో ఉన్న కాసులన్నీ చేర్చి, మరికొంత అప్పు తీసుకువస్తే ఆ డబ్బు సమకూరుతుంది. ఇక చేసేది లేక ఇంట్లో అందర్నీ అడిగేడట ఆయన. ఎవరూ ఒప్పుకోలేదు. ఈలోగా అమ్మ జబ్బు కాస్త ఎక్కువై, ఆసుపత్రిలో చేర్చారు.

బయట అప్పులు సాధారణంగా పుట్టని రోజులవి. డబ్బుకోసం ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆ జ్యోతి లంచ్ హామ్ తాలూకు మామయ్య విషయం కనుక్కుని, అయేదవనీ మొదట ప్రాణం నిలబడాలని నాన్నకు సహాయం చేశాడు. ఆ డబ్బుతో అమ్మను ఆసుపత్రిలో చేర్చారు. తదనంతరం అమ్మ క్రమేపీ కోలుకుంది. నాన్న క్రమక్రమంగా అప్పు తీర్చాడు. ఆ తర్వాత - నేను పుట్టాను.(లోకం నవ్విందో లేదో తెలియదు) 

ఆ తర్వాత ఆయన ఆ ఊరు వదిలి వచ్చేశాడు.

ఆ జ్యోతి లంచ్ హామ్ ఆయన మా నాన్న పెళ్ళికి ఇచ్చిన బహుమతి ఆ జగ్గు.దాని తాలూకు ఓనరు మా నాన్నకు డబ్బు సహాయం చేయకపోతే మా అమ్మ ప్రాణాలమీదకు వచ్చినా వచ్చి ఉండేది. నేనూ పుట్టి ఉండేవాడిని కాదు! అలా నా పుట్టుకకు ఈ జగ్గుకు అవినాభావసంబంధమ్!  మా ఇంట్లో ఉన్న పాత వస్తువుల్లో ఈ గిన్నె, నాన్న కోటు, ఒక పెద్ద దీపం (విళక్కు), ఏనుగు బొమ్మ ముఖ్యమైనవి. ఇపుడు దీపం మాత్రం మిగిలి ఉంది. జ్యోతి లంచ్ హామ్ గిన్నె ఎంచేతో కనబడ్డం లేదు! అయినా ఆక్షరాలు నా మెదడులో మాత్రం పదిలంగానే ఉన్నై.

1 comment:

  1. Ravi,
    Good one, I remember your father telling about this incident and remembering about that elderly man who helped him

    ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.