Tuesday, April 8, 2008

నా ఉగాది అనుభవాలు (క్లయింటు తో) !

బ్లాగ్మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు.

ఉగాది పచ్చడి లో ఏ రుచి మొదటగా తగిలితే, ఆ సంవత్సరమంతా అలానే వుంటుంది అని మన పెద్దల ఉవాచ. నాకు మాత్రం ఉగాది పచ్చడి తినకుండానే ఈ సంవత్సరం ఎలా వుండబోతుందో తెలుస్తా వుంది, ఇప్పుడే.

ఆఫీసు పని రీత్యా ఓ నెల క్రితమే ఈ యెమెన్ దేశానికి రావలసి వచ్చింది. మామూలుగా మృదులాంత్రం లో పని చేసే వాళ్ళు యే అమెరికా నో జర్మనీ నో తిరుగుతుంటారనుకుంటా. ఐతే మా ముదనష్టపు కంపనీకి, సూడాన్, కెన్యా, నైజీరియా, మారిటానియా వంటి విపరీతమైన అభివృద్ది చెందిన దేశాల లోనే బిగినెస్సు.

(కష్టము + కష్టము = అష్టకష్టము
కష్టము + నష్టము = ముదనష్టము...అని ఓ పాత సినిమాలో డవిలాగు.)

ఇక్కడ మా క్లయింటు ని చూసినప్పుడల్లా ఈ పాట వినిపిస్తుంది బాక్ గ్రవుండ్ లో.

" అగ్ని స్ఖలన సందగ్ధ రిపు వర్గ ప్రళయ రథ చత్రపతి
మధ్యందిన సముద్యుత్కిరణ ......."

(మిగతాది గుర్తు లేదు)

వీడికి అరబిక్, ఇంగ్లీషు భాషల్లో నచ్చని యేకైక పదం 'తృప్తి '.

నిజానికి మా ప్రాజెక్టు ముగింపు 4 వతేదీ. తిరుగు ప్రయాణం 6, సరిగ్గా పండగ 7 కి ఇంట్లో వుండచ్చు అని మా ఆలోచన. అంతా అనుకున్నట్లే జరిగింది.

ఏప్రిల్ 2 వతేదీ రాత్రి.

ఆ రోజు వాడన్నాడు. "మీ ప్రాజెక్టు ని తీవ్రంగా పరిశీలించిన మీదట మీకు అప్రూవల్ రేపే ఇచ్చేద్దామని అనుకుంటున్నాను" అని.

ఆ రోజు పగలు బాగా నిద్రపోయాము.

ఇక్కడ రాత్రి పని,పగలు నిద్ర,సాయంత్రం స్నానం.

అదే ఇక్కడ వాళ్ళయితే...

రాత్రి పని, పగలు నిద్ర, మధ్యాహ్నం తిండి, శుక్రవారం స్నానం.

అలానే కాలకృత్యాలలో కూడా కాసింత తేడా.

లేవగానే "ఈ మైల్ " తర్వాత ఇరానీ టీ, తరువాత మన కాలకృత్యాలు.

3 వతేదీ ఉదయం 10:00 గంటలు. ఎందుకో తొందరగా లేవాలనిపించి, లేచి, ఈ మైల్ చూసుకున్నా. ఓ భయంకరమైన ఈ మైల్. దాని సారాంశం ఇది.

" ఇందు మూలంగా తెలియజేయడమేమనగా, మీ ప్రాజెక్ట్ ముగించి, మీరు టెస్టింగు కి గాను ఇచ్చిన ప్రాడక్టు నమూనాలలో 9 బొక్కలు గుర్తించబడినవి. ఇందులో 3 బొక్కలు అతి దారుణమైనవి గా గుర్తించాము. అందువలన మీరీ బొక్కలను పూడ్చని యెడల మీకు అప్రూవల్ ఇవ్వబడదు. "

విధి బలీయమైనది. తానొకటి తలుస్తే క్లయింటొకటి తలిచాడు.

ఆ తర్వాత కాసేపటికి మా డామేజరు దగ్గర నుండీ ఫోను, గద్గద కంఠం తో అడిగాడు "ఇది ఎలా జరిగింది " అని.

మాకు మాత్రమేం తెలుసు ??

సరే, ఇంక ఇక్కడ పని మొత్తం ముగిసే వరకూ మేము ఈ దేశం లోనే పడుండవలసిందని ఆర్డరు జారీ చేయబడింది.

ఈ నేపథ్యం లో 7వ తేదీ సర్వ ధారి నామ సంవత్సర ఉగాది వచ్చింది. కనీసం ఉగాది రోజైనా పగలు ఒంటి గంటకు లేచి సాయంత్రానికల్లా స్నానం చేసి కొద్దిగ మృదులాంత్రం లో గూగిలించి పంచాంగ శ్రవణం చేయండీ అని మా ఆవిడ కోరింది.

నేనావిడకు సర్ది చెప్పాను. క్లయింటు దగ్గర పని చేసేప్పుడు "మధ్యాహ్నం 3 గంటలకు నిద్ర లేచినా దోషం లేదు. అలానే ఇంటర్నెట్ లో పంచాంగ శ్రవణం చేయడం మహా పాపం. కేవలం పుస్తకం లో చదివే చేయాల్సిన పని ఇది " అని.

7 వతేదీ సాయంత్రం దాదాపు 4,4:30 గంటలకు బయట మసీదు లో అల్లా ప్రార్థనలకు మెలకువ వచ్చింది.

విసుక్కుంటూ లేచాను, "ఇంత పొద్దునే యేంటీ గోల " అని.

తర్వాత కాసేపటికి క్లయింటు దగ్గర నుండీ ఫోను. మీకు అప్రూవలు ఎప్పుడు ఇవ్వాలి అని.

తలంతా గిర్రున తిరుగుతున్నట్లనిపించింది.

జరిగిందిదీ.

2 రోజుల క్రితం రాత్రి మా క్లయింటు బొక్కలను ఎత్తి చూపగానే నేనూ, మా టీం (టీం అంటే ఓ పది మంది అనుకునేరు., నేను ఇంకొకతను , ఇంకో టెస్టరు అంతే) తో కలిసి వీరావేశం తో టెస్ట్ చేసి, వెంట వెంటనే మూడు పెద్ద బొక్కల్లో ఒక్క దాన్ని పూడ్చేసేము. 6 చిన్న బొక్కల్లో మూడిటిని పూడ్చగానే, మిగిలిన బొక్కలూ పూడి పొయాయి. ఇక మిగిలిన 2 బొక్కలు, మాకు బొక్కల్లా అనిపించలేదు. ఈ విషయాలన్నీ పూస గుచ్చినట్టు ఈ మైల్ రాసి సమాధనం కోసం ఎదురు చూస్తున్నాం.

వెనుక బాక్ గ్రవుండ్ లో మా డామేజరు, క్లయింటు కంపనీ తో చర్చలు జరిపి, మల్ల గుల్లాలు పడి ఎలానో చెప్పగలిగాడు, పని ముగిసింది, అని.

ఐతే తృప్తి లేని క్లయింటు మాత్రం మొండి గా కూర్చున్నాడు ఒప్పనని. వాడిని వాడి బాసు తిట్టేడట, " పని ముగిసింది కదా , వీళ్ళని ఇక్కడ పెట్టుకుంటే, మనకూ నష్టమే, పంపించేసేయ్, వెధవది" అని.

వాడికి మా మీద పీకల వరకూ కోపం.

ఇక్కడ మా వీసా ముగిసింది 8 వతేదీకి. ఐతే మేమిక్కడ ఇంకా వుండాలి కాబట్టి, మా పాస్పోర్ట్ లు తీసుకుని, మళ్ళీ ప్రాసెస్ చేయడానికి వెళ్ళాడు వాడు. మా మీద కోపం తో, మా వీసాలను కాలరాస్తాడెమో అన్న భయం, అప్రూవల్ కు ఇంకా ఏమి లిటిగేషన్లు పెడతాడో ఏమో అని భయం భయం తో వున్నామిక్కడ, నేనూ మా మిత్రులం. (రవి, శశి, పృథ్వి మా పేర్లు).

రవి అస్తమించని రాజ్యం బ్రిటిష్ రాజ్యం (అట).


రవి, శశి, పృథ్వి (సూర్యుడు, చంద్రుడు, భూమి) ముగ్గురినీ అస్తమింపచేయని (నిద్ర లేకుండా చేసే) రాజ్యం యెమెన్ యేమో మరి.

పండుగ రోజు కూడలి లో తిరుగుతుంటే, జ్యోతి గారి పంచాంగ శ్రవణం కనిపించింది. అలానే వాళ్ళ ఇంటి పిండి వంటలూ, తోరణాలు అవీ. పండుగ వాటితో, జరుపుకున్నాం. ఆవిడకి ధన్యవాదాలు కూడా చెప్పాను.

సంవత్సరం మొదట్రోజు ఎలా జరిగితే, మిగిలిన రోజులన్నీ అలానే వుంటాయి అని నానుడి. నేనివన్నీ నమ్మననుకోండి (ప్రస్తుతానికి ఇలా కంటిన్యూ అయిపోతున్నా) .

నాకు ఏ యన్నారు అంతగా నచ్చడు, కానీ నిన్న రాత్రి (సారీ, ఈ రోజు పగలు) పడుకోబోయే ముందు ఓ పాత ఏయన్నారు పాట ఎందుకో పదే పదే గుర్తొచ్చింది.

" అనుకున్నామని జరగవు అన్నీ.

అనుకోలేదని ఆగవు కొన్ని.

జరిగేవన్నీ మంచికనీ,

అనుకోవడమే మనిషి పని....

నీ సుఖమే నే కోరుకున్నా..."
6 comments:

 1. మొత్తానికెలాగైతేనేం బయటపడ్డారు. అదేదో కంపనీ సియీవో ని అదేదో దేశంలో ఆర్మీవాళ్ళు (క్లయింట్లే లెండి) జైల్లో పెట్టేసినట్టు కాకుండా... జాగర్తండీ బాబూ...

  వీళ్ళెవ్వరికీ తెలుగు రాదు కానీ ‘నక్కలు బొక్కలు వెదకును’ పద్యం చెప్తే బొక్కలు పట్టించుకోడం మానేస్తారేమో...

  ఇంకోమాట. దొరికినవాటిలో రెండు అసలు బొక్కలే కావు అన్నారు. ‘బగ్గు కాదు, ఫీచరే’ అన్నది ఒకప్పుడు మా టీములో మంచి జోకుగా చెలామణీ అయింది.

  మొత్తానికి మళ్ళా ఇరగదీశారు. ఉగాది శుభాకాంక్షలు.

  ReplyDelete
 2. మొత్తానికి బ్లాగాడించేసారు :)
  ఏది ప్రాప్తమో అదే జరుగుతుంది లెండి.

  మొత్తానికి తిరిగొచ్చారా లేదా ?

  ReplyDelete
 3. నాగమురళీ,

  బగ్గు కాదు ఫీచర్ అనేది మొత్తం అందరు బ్రాహ్మి ల స్లోగనే, యే కంపనీ ఐనా :-) .

  ప్రవీణ్,

  లేదండీ బాబు. ఇప్పుడు నా బాధ అప్రూవల్ కాదు. నా పాస్ పోర్టు తిరిగి చేజిక్కించుకోవడం. ఈ క్లయింటు గాడు ఇక్కడ మామూలుగా ఫోను స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటాడు. ఎలానో పట్టుకుని అడిగాను. రేపు అప్రూవలు, పాస్ పోర్ట్ , రెండూ ఇస్తాడట.

  ReplyDelete
 4. మీరు ఆనదించాల్సిన విషయం ఏంటంటే ఉగాది పచ్చడి బదులు మీరు పచ్చడి కాకపోవడం. అన్ని రుచులూ తి(నిపించా)న్నారు.

  చేదు: భారత్ కు వెళ్ళకపోవడం
  వగరు: 9 భూతాలు మాత్రమే కనపడ్డం.
  తీపి: నాలుగు పూడ్చగానే మిగిలిన అయిదు అదృశ్యమవడం.

  శీఘ్రమేవ పాసు పోర్టు ప్రాప్తిరస్తు.

  -- విహారి

  ReplyDelete
 5. అయ్యో పాపం !!!!!!!!!! పండగ పూట కూడా పాత మొగుడేనా అన్నట్టు ఉగాది రోజు కూడా ఉద్యోగం తిప్పలు తప్పలేదా??
  ఐనా ఉగాది తోరణం నుండి విందుభోజనం, పంచాంగ శ్రవణం అయ్యయిగా!! కొంతలోకొంత మేలు అనుకోండి ప్రస్తుతానికి. ఇల్లు చేరాక మళ్ళీ టపా రాయండి.

  ReplyDelete
 6. Hello. This post is likeable, and your blog is very interesting, congratulations :-). I will add in my blogroll =). If possible gives a last there on my blog, it is about the Smartphone, I hope you enjoy. The address is http://smartphone-brasil.blogspot.com. A hug.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.