Wednesday, April 2, 2008

కార్పోరేట్ శిక్ష(ణ) రీలోడెడ్...

ఇది నా ముందు టపా కు అనుబంధం.

ఈ టపా లో సాంకేతిక శిక్షణ ల గురించి ప్రస్తావిస్తాను. ఈ రకమైన ట్రయినింగ్ కార్యక్రమాలు, హెచ్ ఆర్ వారి తలనొప్పి ట్రయినింగ్ ల కంటే చాలా బెటర్. ఐతే వీటిని కూడా సాధ్యమైనంత భ్రష్టు పట్టించడం జరుగుతుంటుంది మామూలుగా.

ఈ భ్రష్టు పట్టించడం 2, 3 పద్ధతుల్లో జరుగుతుంటుంది.


మొదటి పద్ధతి : ఈ పద్ధతి లో ఓ అద్భుతమైన శిక్షకుణ్ణి తీసుకొస్తారు, సదరు హెచ్ ఆర్ వారు. ఆ శిక్షకుడు ఓ అంశం లో, 15, 20 యేళ్ళు పని చేసి, ఆ అంశం లో తలపండిపోయి వుంటాడు. శిక్ష(ణ) కార్యక్రమం అద్భుతంగా సాగుతుంది. ఐతే, శిక్ష(ణ) జరుగుతున్నప్పుడే తెలిసిపోతుంది., ఈ శిక్ష(ణ) అద్భుతంగా వున్నా, మనము చేసే (బొక్కలు పూడ్చే) పనికి ఇది అవసరం లేదు అని. శిక్షణ కేవలం హరికథా కాలక్షేపం లా సాగుతుంది.

ఐతే , ఈ సాంకేతిక శిక్షణ లో భాగంగా, ఓ ఇద్దరు ట్రైనర్స్ నా వరకూ బాగా గుర్తుండి పొయారు. మొదటి వ్యక్తి పేరు విజయన్. ఈ మహనుభావుడు కెర్నింగాన్ , రిచీ (కంప్యూటర్ లో సీ భాష కు రూప కర్తలు) తో కలిసి పని చేసాడట. ఈయనా సీ లో ఆరితేరిన పిస్తా నే. గీతంజలి సినిమా లో 'ఆమని పాడవే కొయిలా ' పాటప్పుడు నాగార్జున ఎలా వుంటాడో, అలా తపో లగ్నుడైన ముని లా వుంటాడు. ఈయన చేతికి సిగరెట్టు ఓ ఆభరణం. సీ లో అలా అలవోక గా బోర్డ్ మీద ప్రోగ్రాములు రాసి, ఆ ప్రోగ్రాం ను విశ్లేషించేస్తుంటాడు.

ఇంకొకాయన పేరు 'రవి కుమార్ ' .ఈయన మెకానికల్ ఇంజినీరింగ్ లో పట్టభద్రుడు. 'మొటొరోల ' వగైరా సంస్థల్లో 15, 20 యేళ్ళు పని చేసి, ప్రస్తుతం ఇలా బెంగళూరు లో ట్రైనింగ్స్ నడుపుతుంటాడు. ఈయన 'ఆబ్జెక్ట్ ఓరియెంటేషన్ ' అనే అంశం లో దిట్ట. ఈయన నేరు గా చెప్పేస్తుంటాడు ఒక్కోసారి, ఈ శిక్ష(ణ) నిజంగా సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్ లకి పనికి వస్తుంది తప్ప అందరికీ కాదు అని.

ఇక రెండవ పద్ధతి : ఈ పద్ధతి లో మనకు సంబంధించిన అంశం లోనే శిక్షణ వుంటుంది. ' చేతుల మీద ' అనబడే శిక్షణ. (హాండ్స్ ఆన్). ట్రైనింగ్ వున్నంత సేపూ బానే వుంటుంది. తెగ విరగ బడి ప్రశ్నలు వేస్తారు జనాలు. శిక్ష(ణ) ముగిసి తరువాత రోజు యేదీ గుర్తుండదు. ఇలా ఎందుకు జరుగుతుందో కూడా తెలీదు.


మూడు : శిక్షకుడికి సబ్జెక్ట్ తెలిసి వున్నా, చెప్పడం రాదు.భయంకరమైన 'బోర్ '. ట్రైనింగు దూరదర్శన్ లో వచ్చే లలిత గీతాల కార్యక్రమం లా నిస్సారంగా వుంటుంది.

ఇలా మొత్తానికి కార్పోరేట్ శిక్ష(ణ) ఒ ప్రహసనం లానే వుంటుంది తప్ప ప్రయోజనం శూన్యం.సీ ఎం ఎం సంస్థల్లో ఇది ఓ రూల్ కాబట్టి మా లాంటి అభాగ్యులు వీటికి గురవడం తప్పని సరి అవుతోంది.


1 comment:

  1. హిహిహి...చేతులమీద శిక్ష(ణ) గురించి మీరు చెప్పింది అక్షరాల నిజం.అదేంటో మాకన్ని చేతుల మీద శిక్ష(ణ)లే!!

    ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.