Thursday, July 16, 2009

జలోపాఖ్యానం

"మీ ఆంధ్ర మీల్స్ తెగ స్పైసీనోయ్. అయినా సరే చాలా అద్భుతంగా ఉంది" అన్నాడా బాబు మోషాయ్ కన్నీళ్ళతో. అతనివి దుఃఖాశ్రువులు కావు. ఆనంద భాష్పాలూ కావు. మజ్జిగ మిరపకాయ ముక్క కాస్త కొరికి, ఆ ఘాటు నషాలాకెక్కడంతో, కంట్లో, ముక్కులో నీళ్ళు కారాయ్ తనకు. నాగార్జున హోటల్లో మధ్యాహ్నం లంచడానికి వెళ్ళేం మేము. బాబు మోషాయ్, బీహారీ, కన్నడ కస్తూరి, ఇలా మినీ ఇండియా లాగ ఉందక్కడ.

"సార్, సాయంత్రమయే సరికి కడుపు మంట స్టార్ట్ అవుతుంది చూడండి. దీనికి అలవాటు పడితే ఎప్పుడో ఒకప్పుడు అల్సర్ రావడం ఖాయం" వంతపాడాడు కన్నడ కస్తూరి.

నేనన్నాను. "అవును, ఈ అన్నం ఇక్కడ తిని అరిగించుకోవటం కాస్త కష్టమే" అని.

"అంటే?" క్వశ్చన్ మార్క్ ఫేసు పెట్టాడు కాట్రవెల్లి కండో (మలయాళీ).

"ఏముందీ, ఇదే భోజనం ఆంధ్రాలో అంతమంది తింటున్నారు, అక్కడ అల్సరూ, హలసూరు ఏదీ లేదు. మా వూళ్ళో ఇంతకంటే స్పైసీగా భోంచేస్తాం. మాకు కడుపులో ఏ మంటా కలగదు" చెప్పాను.

"ఎందుకంటావ్?" బీహారీ డవుటేడు.

"మా వూరి నీళ్ళు అలాంటివి." చెప్పేను నేను. నా మాటకు బాబూ మోషాయ్ ఏకీభవించలేదు. నీళ్ళు ఎక్కడికెళినా ఒకేలా ఉంటాయ్. అసలు నీళ్ళకు టేస్టేంటి? వితండవాదం సాగించేడు. బాబూ మోషాయ్ నా బాసురుడు కావడంతో నేను మాట్లాడలేదు.

అవును. మా వూళ్ళో నీళ్ళకు ఆ గుణముంది అని నా నమ్మకం. కాలేజీ రోజుల్లో దాదాపు ప్రతిరోజు సాయంత్రం నారాయణ బొరుగులో, ఉగ్గాని, మిరపకాయ బజ్జీలో, కట్లెట్ పానీపూరీయో మాకు కడుపున పడాల్సిందే. ఆ నారాయణ బొరుగులు తినేప్పుడు కళ్ళల్లో నీళ్ళలా కారిపోయేవి, అయినా సరే అలాగే లాగించేవాళ్ళం.

ఓ సారి నేను, నా ఫ్రెండ్ ఓ పందెం వేసుకున్నాం తను పాతిక మిరపకాయ బజ్జీలు తింటానని, దానికి ప్రతిగా నేను పాతిక రూపాయల బొరుగులు తినగల్ననీనూ. అన్నంతపనీ చేశాం. గెలుపు ఎవరిది అని తేలలేదు. అయితే మా వాడు మరుసటి రోజు హాస్పిటల్లో సెలైన్ బాటిళ్ళ వాతన బడ్డాడు. నేను తప్పించుకున్నా. కారణం బాగా నీళ్ళు తాగడమే. అవును మా వూరి నీళ్ళల్లో అలా కారాన్ని హరాయించే శక్తి ఉంది. అలానే మా వూరి నీళ్ళ రుచి కూడా. (అందరూ వాళ్ళ వూరి నీళ్ళ గురించి అలానే అనుకోవచ్చు). నా చిన్నప్పుడు మా నాన్న మా సొంత ఇంట్లో బావి తవ్వించారు. 200 అడుగులకు పైగా. నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఆ నీళ్ళు కొబ్బరి పాలలా ఎంత తియ్యగా ఉండేవో. పొద్దులో అరిపిరాల సత్య గారి మంచినీళ్ళ బావి కథ చదివినప్పుడు అదే గుర్తొచ్చింది నాకు.

అయితే మా మేనమామ ఒప్పుకోడు. "గంగా స్నాన, తుంగా పాన". మా ఊరి నీళ్ళే మంచివి అనే వారాయన. ఆయన బళ్ళారి లో నివాసముండేవారు.

నీళ్ళ విషయంలో బెంగళూరు వాళ్ళది తెగ బడాయి. మేము కావేరీ నీరు తాగుతాం. కావేరి వాటర్లో ఫాస్పరస్ కంటెంట్ ఉందట. అది బుద్ధిని తెగ షార్ప్ చేస్తుందట, అని వీళ్ళ మాటలు. అక్కడికి బుద్ధి పెన్సిలయినట్లు, కావేరీ నీళ్ళు బ్లేడులా దాన్ని చెక్కుతున్నట్లు.


నీళ్ళకో గుణం. ఏం తిన్నా హరాయిస్తాయా నీళ్ళు. అలాగే ఎంత తాగినా ఏవీ తాగినట్టుండదు, ఎందుకో ఏమో?

పారే నదిలో మధ్యలో వెళ్ళి ఆ నీళ్ళు తాగటం ఓ గొప్ప సంతోషాన్నిస్తుంది నాకు. బాసర వద్ద గోదావరి నది మధ్యకు తెప్పలో వెళ్ళి నది మధ్యలో తెప్పనాపించి, నీళ్ళు ముంచుకు స్నానం చేసి, ఆ నీళ్ళు తాగడం నాకున్న గొప్ప జ్ఞాపకాల్లో ఒకటి. తెప్ప అంటే హరిగోలు కాదు. థర్మోకోల్ షీట్లను తాళ్ళతో కట్టి చేసిన ఓ నలుచదరపు పడవ. అలానే శృంగేరి దగ్గర తుంగా నది నీళ్ళు కూడా. ఇంకా గొప్ప జ్ఞాపకం నైలు నది మధ్యలో పడవలో వెళ్ళి నీళ్ళు ముంచుకు తాగటం.

ఇంతకూ నేనిలా మంచినీళ్ళ మీద పడ్డానికి కారణం, గత ఐదేళ్ళుగా ఈ దరిద్రపు ఊళ్ళో మినరల్ వాటర్ కొనుక్కుని తాగి బతుకీడ్చాల్సిన ఖర్మ పట్టటం. మన చదువులు, మన బతుకులన్నీ "ఉద్యోగం" చుట్టూ తిరుగుతూ తగలడ్డాయ్. ఇంతమందికి ఉద్యోగాలు రావాలంటే పనికొచ్చేవి, పనికి రానివీ రకరకాల వస్తువుల ఉత్పత్తి జరగాలి. పనికి రాని వస్తువులు మార్కెటింగ్ ప్రతిభ కారణంగా, పనికొచ్చే వస్తువులుగా తయారు చేయాలి. అదుగో అందుకనేనేమో చివరకు నీళ్ళను కూడా కొనుక్కుని తాగే దిశకు చేరుకున్నాం. ఎవణ్ణి తిట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఈ నీళ్ళల్లోనూ కాంపిటీషను. టాటా వాడి నీళ్ళు లీటరు పాతిక రూపాయలు. ఇంకొకడెవడో క్యువా అట. బాటిలు నలభై రూపాయలు పెట్టి అమ్ముతున్నాడు.

అలానే మన తిండి పదార్థాలు, పాలు పెరుగు వీటి రుచి కూడా నీటి మీదనే ఆధారపడి ఉంటుందని నాకొహ నమ్మకం. నైలు నది వద్ద ఒక ఆన్ సైటుకెళ్ళినప్పుడు నెల్లాళ్ళు దాదాపు నేనే వండాను, మా కొలీగుల కోసం. అయితే అదే వంట ఇక్కడ బెంగళూరులో చాలా సార్లు ప్రయత్నిస్తున్నా, కుదిరి చావడం లేదు. నైలు నీళ్ళలోనే మర్మం ఉంది.

ఇంతకూ, మనకు ఎప్పుడు వానలు కురిసి నీటి కరువు తీరుతుందో ఏమిటో?

ఇప్పుడు కొంచెం జ్ఞానదాయకమైన విషయాలు చెప్పుకుందాం

నీరు అన్నది సంస్కృత "నీయతే ఇతి" అన్న ధాతువు నుండి వచ్చిన "నీర" శబ్దానికి తద్భవం కాదని నుడి నానుడి రామచంద్ర గారు. నిగనిగలాడేది కాబట్టి నిగళ్ష్, నిగర్, నీరు, నివురు అయిందట. అలాగే వెణ్ణ, పెన్నా వీటి నుంచి వెల్ల, వెల్లువ, మలయాళలో వెళ్ళం (వెళ్ళం అంటే నీరు ఆ భాషలో), వానావానా వల్లప్ప లోని వల్లప్ప ఇవన్నీ వచ్చాయట. ఇలాంటివి మరెన్నో. కాబట్టి మనపదాలన్నీ సంస్కృతానికి కాపీ అని బాధపడాల్సిన అవసరం లేదు.

Wednesday, July 8, 2009

పోలిక

నా క్రితం టపాలో కామేశ్వర్రావు గారు కామెంటుతూ, సమాయుక్తం, సమన్వితం అన్న పదాలు చూడగానే చప్పున ఓ విషయం, చూచాయగా ఓ విషయం గుర్తొచ్చాయన్నారు. ఇలా ఓ విషయం చూసినప్పుడు మరో విషయం స్ఫురించటం మామూలుగా అప్పుడప్పుడు జరిగేదే అయినా, ఒకే కాలానికి, ప్రాంతానికి చెందని ఏ రెండు రచనలలోనో, రచనా ప్రక్రియల్లోనో ఇలా పోలికలు కనబడితే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కో సారి ఈ పోలిక అనుసరణ, ప్రేరణ లేదా ప్రభావం కావచ్చు.

కామేశ్వర్రావు గారు వివరించిన "ఎవ్వాని వాకిట . . ." చదివిన తర్వాత, అలాంటిదే ముక్కు తిమ్మనాచార్యుని పారిజాతాపహరణం చూసినప్పుడు, అందులో అవతారికలో ఈ (12 వ)పద్యం కనిపించింది. ఇలాంటివి ఎన్నెన్నో సారస్వతంలో ఉండవచ్చు.

అయితే - ఒకే వర్ణన ఇద్దరు కవులు చేస్తే ఎలా ఉంటుంది?

రఘువంశం 6 వ సర్గ లో ఒక చిన్న వర్ణన

ఇందీవరశ్యామతనుర్నృపోసౌ
త్వం రోచనాగౌరశరీరయష్టిః
అన్యోన్యశోభాపరివృద్ధయే వాం
యోగ స్తటిత్తోయదయో రివాస్తు

ఈ నృపుడు నీలోత్పలము వలె భాసించే శ్యామతనూ విలాసుడు. నీవు గోరోచనమువలె పచ్చనైన దండసదృశదేహవిలసితవు. మెఱపుకు, మేఘమునకు వలె, మీరిరువురకు యోగము పరస్పర కాంతి ప్రవృద్ధమానమగును.

స్వయంవరంలో పాండురాజును చూపెడుతూ, దౌవారికి సునంద రాకుమారి ఇందుమతికి చెప్పే మాట ఇది. అయితే సూర్యుని కోసం ఎదురు చూసే తామర మొగ్గకు చంద్రుడి కాంతి పట్టనట్టు ఈ రాజు ఇందుమతికి నచ్చలేదట. (సూర్యుడు అంటే సూర్యవంశపు రాజయిన అజుడు అని అన్వయించుకోవాలి)

పై శ్లోకంలో తటిత్తోయదయోరివ - (తోయం దదాతి ఇది తోయదః - తోయములను ఇచ్చునది తోయదము) - మెఱపునకు, మేఘమునకు వలె.

ఈ ఆఖరు వాక్యం చదవగానే -

మెఱయు శ్రీ వెంకటేశు మేన సింగారము గాను
తఱచయిన సొమ్ములు ధరియించఁగా
మెఱుఁగుబోణీ అలమేలు మంగయుఁ దాను
మెఱుపు మేఘము గూడి మెరసినట్లుండె

ఒకపరికొకపరి ఒయ్యారమై
మొకమునఁ గళలెల్ల మొలచినట్లుండె

చప్పున గుర్తుకు వచ్చింది. అయితే ఈ సారి పద్మావతి, శ్రీనివాసుడు నాయికా నాయికలు. నాయకుడు నీలతనుడు. పైగా మంచి సొమ్ములు వేరే వేసికొన్నవాడు. నాయిక పద్మావతి కుంకుమ వర్ణిని. ఇద్దరి యోగము ఇందాక చెప్పిన తటిత్తోయదయోరివ అంటే - మెఱుపు మేఘము గూడి మెరసినట్లుండె.

ఈ కీర్తన విన్నప్పుడో, చిన్నగా పాడుకునేప్పుడో, మేఘాల మధ్య తటిల్లత లాంటి మెఱుపు, ఆ వెంటనే ఆ తటిల్లత ను నాయిక (అమ్మవారి)గా పోల్చిన పోలిక, ఆ తర్వాత నల్లటి మేఘం లాంటి నాయకుడు అసంకల్పితంగానే గుర్తుకు రావడం జరిగిపోతోంది.

సంస్కృత వర్ణన లో క్లుప్తత, కేవలమొక సాదృశ రూపము కనిపిస్తే తెలుగు వర్ణనలో ఓ లయ, దాని ఉధృతి, మనసులో చెప్పలేని ఓ తాదాత్మ్య భావన కలుగుతోంది. (బహుశా నాకే అలా అనిపిస్తుందో ఏమో?)

ఇందులో భక్తి, భగవంతుడిపై నమ్మకం, అపనమ్మకం ఇవేవి లేవు. ఇవన్నీ రసాస్వాదనకు అడ్డు రావు, రావలసిన అవసరం లేదు. అనుభూతులకు తర్కం సమాధానం చెప్పలేదు.

అన్నట్టు ఇది రాస్తున్నప్పుడు, పక్కన కిటికీ నుండీ బయట చీకట్లో ఉండుండీ మెఱుపులు కనిపిస్తున్నాయి.