Friday, August 29, 2008

అష్ట విధ బ్లాగికలు!

మన ప్రాచీన కావ్యములలోనూ, శాస్త్రీయ నృత్య రీతుల యందునూ నాయికలను అష్ట విధములుగా విభజించిన సంగతి రసఙ్ఞులయిన బ్లాగరులకు విదితమే.

1. ప్రోషిత భర్తృక 2. స్వాధీన పతిక 3. వాసవ సజ్జిక 4. ఖండిత 5. కలహాంతరిత 6. విరహోత్కంఠిత 7. విప్ర లబ్ధ 8. అభిసారిక

ఆ విధములుగా వారిని ఎన్ననగును.

****************************

మన బ్లాగ్లోకమున మహిళా మణుల ప్రాభవము ఎన్నదగినది అనిన, అయ్యది ఏ మాత్రమూ అత్యుక్తి కానేరదు. బ్లాగ్లోకమున నాయికలను ఈ విధములుగా వర్గీకరింపవచ్చును.

1. పోషిత బ్లాగిక 2. స్వాధీన 'గడి 'క 3. మూసవ సజ్జిక 4. కామెంటిత 5. గణకాంతరిత 6. తెవికోత్కంఠిత 7.నెనరు లబ్ధ 8. అభి 'చాటి ' క

ఆయా నాయికల వివరణములు ఈ క్రిందనొసంగ బడినవి.

1. పోషిత బ్లాగిక : బ్లాగ్లోకమున కొత్తగా బ్లాగులు వ్రాయగోరు వారిని ఈ నాయిక ప్రోత్సహించును. కొత్త బ్లాగరులకు అమూల్యమయిన సలహాలనందించుట, తెలుగు (యూనీ కోడు) నందు వ్రాయుటకు వలసిన వివిధ సాంకేతిక సహాయ సౌలభ్యములను సూచించుట ఈ నాయిక సంచారీ భావములు.

2. స్వాధీన 'గడి ' క : తన ఆసక్తిని అత్యుత్తమమైన టపాలను వెలువరించుటయే కాక, పొద్దు అను జాలపత్రిక యందు వచ్చు 'గడి ' ని కూర్చుట ఈ నాయిక ప్రముఖ వ్యాసంగము. గడి ని పూరించుటయే కాక, భావ సారూప్యము కలిగిన గడి ఔత్సాహికులకు తగిన సూచనలు, సలహాలనందించుట మున్నగునవి ఈ నాయిక విజయ వంతముగా నిర్వహించును.

3. మూసవ సజ్జిక : కేవలము టపాలను వ్రాయుటయందే ఆసక్తిని నిలుపుకొనక, కాలముతో వచ్చు మార్పులకు అనుగుణముగా, బ్లాగును వివిధ రకములయిన మూస లనుపయోగించి, దృశ్య రంజితముగా ఈ నాయిక తీర్చిదిద్దును. అంతర్జాలమున, బ్లాగులకు సంబంధించి జరిగెడి , అభివృద్ధిని ఈ నాయిక అత్యంత జాగరూకత తో పరిశీలించును.

4. కామెంటిత : ఈ నాయిక టపాలు వ్రాయుటయందే మాత్రమూ ఆసక్తి కనబర్చక, తోటి బ్లాగరులు వ్రాసిన వ్రాతలను చదివి, వారి టపాలపై, కామెంటును.

5. గణకాంతరిత : తను నిర్వహించు బ్లాగుయందు, సందర్శకుల సంఖ్యని లెక్కించుటకై, గణక యంత్రములను నిక్షిప్తము గావించి, బ్లాగుకు గల ప్రాచుర్యమును తులనాత్మకముగా పరిశీలించును. బ్లాగరులు వ్రాయు వివిధ రచనా వ్యాసంగములకు వచ్చు, వ్యాఖ్యలను గణించి, బ్లాగరు యొక్క రచనా పటిమను అంచనా వేయుట ఈ నాయిక అదనపు లక్షణము.

6. తెవికోత్కంఠిత : తెలుగు వికీపీడియా అనబడు తెలుగు విఙ్ఞాన భాండాగారమునకు తన వంతు సహాయ సహకారములనందించుట ఈ నాయిక లక్షణము. తెవికీ లో తన వూరి వివరములు జోడించుట, వివిధ వ్యాసములను ఆంధ్రీకరించుట, ఇతరులు వ్రాసిన వ్యాసములను సరిదిద్దుట ఈ నాయిక సంచారీ గుణములు.

7. నెనరు లబ్ధ : బ్లాగ్లోకమున వివిధ రకములయిన నూత్న కార్యక్రములను చేబట్టి, బ్లాగరుల చేత నెనరులు గడించుట ఈ నాయిక లక్షణము.

8. అభి 'చాటి ' క : కూడలి యందు బ్లాగరులకి ఒసంగబడిన ఉపకరణము, కూడలి చాట్ ను ఉపయోగించుకుని, రక రకములయిన చర్చా కార్యక్రములకు బ్లాగరులను ఆహ్వానించుటయందు ఈ నాయిక ఆసక్తి కనబర్చును. వారాంతమున తీరిక లేకుండుట సంచారీ గుణము.

***********************

పై విభజన, మరియూ ఆయా లక్షణములు, బ్లాగ్లోకమునకు సంబంధించి, కేవలము మహిళా బ్లాగరులకే గాక, పురుష బ్లాగరులకూ వర్తింపజేయవచ్చును.

ఈ టపా వెనుక, హాస్య స్ఫోరకత మినహా, ఒకరిని అవహేళన చేయుట, నొప్పించవలెనను ప్రయత్నము ఏ మాత్రమూ లేవని బ్లాగ్లోకము గమనించ వలె యని నా ప్రార్థన.

***********************

(70 వ దశకం చివర్లో వార పత్రికలు, మాస పత్రికలను చదివే మహిళా పాఠకులపై శ్రీ రమణ ఓ పేరడీ రాసారు. ఆయన విభజనలు ఇలా ఉన్నాయి.

1. పోషిత పత్రిక 2. స్వాధీన పఠిత 3. పుస్తక సజ్జిక 4. రీడిత 5. నవలాంతరిత 6. కథనోత్కంఠిత 7. చిత్ర లబ్ధ 8. అభిమానిక

ఈ టపాకు శ్రీ రమణ గారి పేరడీ స్ఫూర్తి, ఆధారం)

*************************

Sunday, August 24, 2008

దోసె పురాణం!


పని రోజుల్లోని ఓ రోజు సాయంత్రం. మామూలుగానే రోజంతా మొద్దు యంత్రం ముందు కూర్చుని, సాయంత్రం ఇంటికి వచ్చి, కాస్త స్నానం అదీ చేసి,ఈనాడు పక్కనేస్కుని, వెధవ డబ్బా ముందు రిలాక్స్ అవుతున్నాను. టీవీ లో మామూలుగానే ఒకదాన్ని మించి ఒకటి చెత్త కార్యక్రమాలు, పనికి రాని ధారా.. వాహికలూనూ.ఇక లాభం లేదని ఆపద్ధర్మ చానెల్స్ కుప్ప (ఎన్ జీ సీ, డిస్కవరీ వగైరా) లోకి అడుగు పెట్టాను. యాత్ర మరియూ జీవితం చానెల్ తగిలింది.


సల్మాన్ రష్డీ వాళ్ళ (మాజీ?) ఆవిడ (పద్మా లక్ష్మి) దక్షిణ భారత వంటకాల గురించి, ఒక్కో ఊరు తిరుగుతూ ఏదో చెబుతోంది. యాత్ర లో భాగంగా బెంగళూరు కి వచ్చింది. ఎంటీఆరు వారి హోటల్లో దోసెల గురించి, చట్నీ నంజుకుని తింటూ మరీ చెప్పసాగింది.


ఆ తర్వాత ఈనాడు కర్ణాటక పేపర్ చూడసాగాను. అందులోనూ ఓ చోట విద్యార్థి భవన్ దోసెల గురించి రాసేరు!


నా టిఫిన్ భారతంలో ఆది టిఫిన్ ఇడ్లీ, ద్వితీయం దోసె, మూడవది పూరీ. అందులో దోసె ద్వితీయమైనా అద్వితీయమే. ఇటు నెల్లూరు పద్మావతీ విలాస్, చెన్నై శరవణా భవన్ మొదలుకుని, మన రాజధాని లో మినర్వా, కామత్,బెంగళూరు, కోయంబత్తూరు అన్నపూర్ణ విలాస్ నేతి దోసెల వరకు, ఉత్తరాన పూనా, ముంబై ల వరకూ, నా దోసెల జైత్రయాత్ర సాగింది.చివరకు బెంగళూరుకు వచ్చి ఆగింది.


బెంగళూరు ను భారత దేశ, దోసెల రాజధానిగా ప్రకటించవచ్చు. యష్వంతపూర్ గాయత్రి భవన్, మల్లేశ్వరం జనతా భవన్, జయా నగర్ గణెష్ దర్శిని, శివాజీ నగర్ శిల్పా, బసవన గుడి విద్యార్థీ భవన్, ఎంటీ ఆర్, మెజిస్టిక్ ప్రియదర్శిని ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నని ? బెంగళూరు వచ్చిన కొత్తల్లో ప్రతీ శని వారం సాయంత్రం జయా నగర్ దోసెల క్యాంపు, రాత్రి కో తెలుగు సినిమా , ఆదివారం ఉదయాన్నే విద్యార్థీ భవన్ ఠంచను గా ఉండేది. అవీ హోటెల్ దోసెలే. ఇంటి దగ్గర అమ్మ వేసే దోసెలు మాత్రం నాట్ ఆక్సెప్టబిల్! ఇప్పుడు మా ఆవిడ కూడా అప్పుడప్పుడూ దెప్పుతుంటుంది, "సొంత ఇంటి పుల్ల దోసెల కంటే పొరుగింటి మసాల దోసెలంటేనే" నాకు ప్రాణమని.


ఈ "దోసె" అనే పేరు వెనుక పాపులర్ కథ, దాదాపు అందరికీ తెలిసినదే. తమిళాళ్ళు దోసెలూ పోస్తుంటే, ఉత్తర భారతీయులెవరో, రెండు సార్లు "స్స్" అంది కాబట్టి "దోసె" అన్నారు అని.


దోసె - దో బార్ "స్స్" శబ్దం చేయునది.


తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక బహువ్రీహి సమాసం అది!


ఎందుకంటే, దోసె తమిళ్ వాళ్ళదీనడం నాకు సుతరాము నచ్చలేదు. (నాకు తమిళ దురభిమానం మెండు. సిగ్గు లేకుండా చెబుతున్నాను.) ఇది విన్నప్పుడల్లా అదో బాధ.


ఆ రోజు పద్మా లక్ష్మి (ఆవిడా అరవామెనే అనుకోండి) కూడా అదే చెప్పేసరికి కోపం వచ్చింది.


ఈ మధ్య తెనాలి రామకృష్ణ కవి మీద ఒకాయన రాసిన రీసెర్చి పుస్తకం చదువుతుంటే, అందులో ఓ పద్యం కనబడింది. ఆ పద్యం రాయలవారి అష్ట దిగ్గజాల్లో ఒకాయన అయ్యలరాజు రామభద్రుడు రాసిన "రామాభ్యుదయం" అనే కావ్యం లోనిదట.


ఇడిరమ్మౌనికుపాయనమ్ములు మనోభీష్టంబుగా బూరియల్

వడలుం జక్కెర కర్జకాయలును లడ్వాలుక్కెరల్ పూర్ణపుం

గుడుముల్ గారెలు బెల్లమండెగలు నౌగుల్ కమ్మచాపట్లు నూ

టిడులున్ దోసెలు నప్పముల్ సుకియలున్ హేరాళమై కన్పడన్.

అర్థాత్ : బూరెలు, వడలు, చక్కెర కజ్జికాయలు, లడ్డూలు, ఉక్కెరలు (చక్కెర చేర్చి పొరటిన పిండి), పూర్ణపు కుడుములు, గారెలు, గోధుమ పూరీలు, ఓఉగులు, కమ్మని చాపట్లు, నువ్వులతో చేసిన ఇడులు, దోసెలు, అప్పములు,సుకియలు ...వగైరాలు విస్తరి నిండుగా కంపించేట్లు ఆ మునికి వడ్డించారు(ట).


అంటే దోసె 15 వ శతాబ్దం కణ్టే ముందుదే అన్న మాట! కొసరుగా అదే పద్యంలో బెల్ల మండెగలు అని కూడా కవి పేర్కొన్నడు! బెల్ల మండెగలంటే పూరీలట! (ఆ పుస్తకం లోనే చెప్పారది)


తెలుగు ఉచ్చ స్థితిలో ఉన్న విజయ నగర సామ్రాజ్యం కాలంలో దోసె, తమిళ నాడు నుండీ వచ్చి స్థిరపడి ఉంటుందా? నమ్మను గాక నమ్మను. దోసె ఆంధ్ర వాళ్ళ అబ్బ సొమ్మే! నేను విన్నంతే!


నాకున్న ఇంకో ఆశ, ఇడ్లీ గురించి తెలుసుకోవాలి. అది యే మాస్టారు గారో, సంస్కృత పండితులయిన బ్లాగర్లో దాన్ని గురించి చెబితే, ఇడ్లీ తిన్నంతగా సంతోషిస్తా.