ఉయ్యాలలో పడుకున్న మా పాపకు ఎల్లుండి తొలి "ఉంగా"ది. ఈ ఉగాది- మా పాప ముఖంలో కనిపించే ప్రశాంతత, ఓ చిన్ని చిఱునవ్వు అందరికీ సమకూరాలని మనసారా అభిలషిస్తూ -
ఉగాదికి స్వాగతం. (పద్యాలకు ప్రోత్సాహం, సరస్వతీ పుత్రులు చింతా రామకృష్ణారావు మాస్టారు)
ఆరు రుచుల తోడ ఆమని నీకును
నయముగనిల తోరణములు గట్టి
ఊయల నిదురించు "ఉంగా"ది పాపతో
స్వాగతింతుమమ్మ సస్య లక్ష్మి!
ఇక్కడ మరో రెండు.
చిన్నప్పుడు మా ఇంటి ఎదురు గా రామాలయం ఉండేది. ఆ ఆవరణలో ఓ చెట్టు. ఆ చెట్టు పేరు బంకీరుకాయల చెట్టు. బంకీరుకాయ అంటే - రేగు పండు ఆకారంలో, రేగు పండు లాగే లోపల బీజం ఉన్న ఓ పండు. గుజ్జు కాస్త జిగురుగా ఉన్నా, బాగా తియ్యని రుచి. ఈ పళ్ళు తినడం మొదట అలవాటు పడ్డం కష్టం కానీ, ఒక్కసారి వీటి రుచి మరిగితే విడిచిపెట్టటం కష్టం. రోహిణీ కార్తెలో ఎండలు మండిపోతున్నప్పుడు, ఆ ఉష్ణానికి నోటి పూత వస్తే, దానికి చక్కటి ఔషధం ఈ పండు (లేదా ఈ చెట్టు ఆకులు). వేసవి సెలవుల్లో పిల్లలకు ఆటవిడుపు అవడంతో, ఆ చెట్టు కాయలు పక్వానికి వచ్చే సమయానికి, కోతులు, కోతులకు ధీటుగా మా కుర్రమూక ఆ చెట్టు దగ్గర సిద్ధం. మమ్మల్ని, కోతులను తరమడానికి, దేవాలయానికి కాపలా పనికీ నరసమ్మ అనే ఒకావిడ. ఆవిడ మమ్మల్నందరినీ తరిమేసి, ఆ కాయలు పోగు చేసుకుని, బయట అమ్ముకునేది. (బీదరాలు ఆవిడ.) అప్పట్లో మా పాలిట విలను ఆమె. దాదాపు 15, 20 యేళ్ళు ఆ చెట్టుతో నా అనుబంధం కొనసాగింది. ఆ బంకీరు కాయల్లాగే నాకు కొన్ని unconventional fruits బాగా జ్ఞాపకం. వాటిలో కొన్ని. కలే పండ్లు అని. నల్లగా మిరియపు గింజల లాగా ఉండేవి. స్కూళ్ళ దగ్గర గంపల్లో తెచ్చి అమ్ముకునే వాళ్ళు. కొన్ని కొన్ని సార్లు పురుగులు పడ్డా, చాలా రుచిగా ఉండేవి. గుజ్జు కాస్త ముదురు ఎరుపు రంగులో ఉండేది. ఈత పళ్ళు : ఇవి మా ఇళ్ళలో నిషేధం. ఎందుకంటే, ఈత చెట్టు నుండీ కల్లు వస్తుంది కదా. ఈత కాయలూ వాటి తాలూకు ఫ్యామిలీయే కదా, అందుకని. అయితే, ఇంట్లో తెలీకుండా మా స్నేహితుడి తోటనుండీ తెప్పించుకుని ఎగబడే వాళ్ళం. ఇంకా రేగు, గంగ రేగు, నేరేడు, మేడి, సీమ చింతకాయలు..... ఇవన్నీ ఇప్పుడు దాదాపు కనబడ్డం మానేశాయి. అయితే కొత్త కొత్త ఫలాలు చాలా చూశాను, ఈ మధ్య 4,5 యేళ్ళలో. ఆన్ సైటుకు ఇండోనేషియా వెళ్ళినప్పుడు, కివి అని, డ్రాగన్ ఫ్రూట్ అని, పసుపు వర్ణం గుజ్జు ఉన్న పుచ్చకాయ, బీహార్ నుండి అప్పుడప్పుడు మా స్నేహితుడు తెచ్చి పంచే లిచి, ఇంకా పేరు తెలీని అనేక రకాల పళ్ళు... సరే, మర్చిపోయిన ఫలాల విషయానికి మళ్ళీ వస్తాను. ఈ మధ్య ధూర్జటి కవి గారి కాళహస్తీశ్వర శతకం తాలూకు ఓ పద్యంలో ఆ మర్చిపోయిన పళ్ళలో కొన్నిటిని చూశాను. ఆ పద్యం........ నేరేడు పండులు నెలయుట్టి పండులుఁ గొండ మామిడి పండ్లు దొండపండ్లుఁ బాల పండులు నెమ్మి పండులు బరివంక పండులుఁ జిటిముటి పండ్లుఁ గలివి పండులుఁ దొడివెంద పండ్లుఁ దుమ్మికి పండ్లు జానపండులు గంగ రేఁగుఁబండ్లు వెలగ పండులు పుల్ల వెలగ పండులు మోవి పండ్లు నంకెన పండ్లు బలుసు పండ్లు బీరపండ్లును బిచ్చుక బీర పండ్లుఁ గొమ్మిపండ్లీతపండ్లును గొంజి పండ్లు మేడి పండ్లును మోదలుగాఁ గుడిమాడి చెంచెతలు దెత్తురిత్తు విచ్చేయుమయ్య (3-69) ఇవన్నీ అడవిఫలాలు. ౧.నేరెడు ౨. కొండమామిడి ౩. దొండ ౪. పాల (సపోటాతో అంటు కడతారుట) ౫. బరివంక : బంకీరు కాయలివే ౬. కలివి : కలే పండ్లు ఇవే. ౭. తుమ్మికి / తుమికి /తునికి : కిందుకం అంటారుట సంస్కృతంలో ౮. వెలగ : ౯. పుల్ల వెలగ: ౧౦. గంగరేగు : ఇది తెలిసే ఉండాలి. రేగు పండు పెద్దన్న. ౧౧ మోవి ౧౨. బలుసు ౧౩. బీర : (కూరకు వాడే బీర కాదు) ౧౪. పిచ్చుక బీర : బాపన బూరెలంటారుట ౧౫. ఈత : ౧౬. గొంజి : గొల్వి, గొలుగు, గొనుగు, గుడఫలము ౧౭. మేడి (ఉదుంబర అని సంస్కృతంలో) ౧౮. కొమ్మి ౧౯, నెమ్మి : (సంస్కృతంలో చిత్రకుశ) ౨౦. నెలయుట్టి / నెల్లుట్టి ౨౧. చిటిముటి ; మంచి బిక్కి అంటారుట దీన్ని ౨౨. జాన/పూతిక : పుల్ల జామపండ్లట ౨౩. సంకెన : ౨౪. తొడివెంద ఇలా ౨౪ జాతుల ఫలాలను పేర్కొన్నాడా కవివరేణ్యుడు. ఈ కాఱడవిలో ఉన్న శివయ్యకు, మా వూరు (ఉడుమూరు) కు వస్తే, చెంచెతల చేత తెప్పించి పెడతానని తిన్నడు ఆశ చూపెట్టాడుట. చిన్నప్పుడు చూసిన రుచులు (మళ్ళీ ఆ రుచులు కనిపిస్తాయన్న ఆశలేదు) ఇలా ఈ పద్యంలో కాస్త కనిపించాయి. అన్నట్టు తెనాలి రామకృష్ణ సినిమాలో ఈ పద్యం కూడా ఆ ఆశ్వాసంలోదే. (3-71) చుఱుఁకుఁ జూపునఁ గాలిన కొఱతనుఱుకు నుఱుకుఁ జూపులఁ బుట్టించు నెఱుకువారి ఇఱుకు వలిగుబ్బ పాలిండ్ల ఇగురుఁ బోండ్ల సేవకిచ్చెద నీకు విచ్చేయవయ్యా......!