Friday, June 13, 2008

అనగనగా ఓ తెలుగక్షరం 'అ ' !

అక్షరాణాం అకారోస్మి
ద్వంద్వస్సామాసికస్య చ

అంటాడు గీతాకారుడు విభూతి యోగంలో. 'అ ' అక్షరానికున్న ప్రాముఖ్యం అది. మన తెలుగు అక్షరాలలో అందమైనది ఏది అని ప్రశ్నించుకుంటే, నా వరకు నాకు దొరికిన సమాధానం 'అ '.
'శ్రీ ' ఇంకా బావుంటుందనుకోండి (జంధ్యాల చంటబ్బాయి ఓ పాట చరణంలో 'శ్రీ ' లో అమ్మాయి రూపాన్ని ఊహిస్తాడు గీతకర్త), ఐతే 'శ్రీ ' సం యుక్తాక్షరం. అచ్చు, హల్లు ల్లో ఇది రాదు.
నా చిన్నప్పుడు మా తాతయ్య అన్నాడో సారి, "మీ చదువులేం చదువుల్రా.." 'అ ' తో ప్రారంభిస్తారు. అప్పుతో చదువు. మేము ఓనామాలు దిద్దుకున్న తర్వాతే ఐదు బర్లు".

ఓనమాలు అంటే ఇప్పటి పిల్లలకు తెలీదేమో మరి, మనలో చాలా మందికి తెలిసిందే "ఓం నమశ్శివాయ, సిద్ధం నమః " అని.
ఇక ఐదు బర్లు అంటే..

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
ఖ గ ఘ ఙ చ చ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ
త థ ద ధ న ప ఫ బ భ మ
య ర ల వ ష స హ
క్ష ఱ ఇతి

ఈ అక్షరాలను చూచి పరవశించే, మన పూర్వ కవులు "ఆణి ముత్యముల సోయగము మించిన వ్రాలు", "లలిత ముక్తాఫలాకార విలసనమున" అని వర్ణించారేమో!

వాటిలో కొన్ని అక్షరాలు ఇప్పుడు రిటైర్ అయిపొయాయి (ఌ, ౡ) అనుకోండి.

ఆ ఐదు బర్లు ఇసుకలో దిద్దుకునే వాళ్ళట. (బరి - కన్నడంలో రాత, వ్రాయి. ఈ బరి - బడి గా రూపాంతరం చెందిందట)

ఇప్పట్లో కాన్వెంట్ రైంస్ లా నేను చదువుకున్నప్పుడు పెద్దబాలశిక్ష లో ఓ తెలుగు రైం ఉండేది.

"ఒంకర టింకర 'ఓ '
దాని తమ్ముడు 'సో '
రెండు గుడ్ల 'మి '
నాలుగు కాళ్ళ 'బే '"

'అ ' అక్షరానికి అలాంటి అవలక్షణాలేం లేవు. ఇది అప్పటమైన తెలుగు అందం. అచ్చు, తిరుపతి లడ్డులా గుండ్రంగా...ఆ లడ్డులో వట్టి ద్రాక్ష ముక్కలా ఎడమ వైపు పైమూల ఓ చిన్న వృత్తం...లడ్డులో గోడంబి ముక్కలా ఓ అడ్డుగీత....

ఈ 'అ ' అక్షరం (ఆ మాటకొస్తే మన తెలుగు లిపి) ఎలా ఉండేది అని పుస్తకాల షాపులో గాలిస్తే ఓ ఆణిముత్యం కనబడింది (వివరాలు చివర్లో). అలానే వికి పీడిస్తే ఈ వివరాలు దొరుకుతాయి.

మన తెలుగు లిపి ది అచ్చంగా 2000 యేళ్ళకు పైబడిన చరిత్ర!

మన దేశానికి సంబంధించిన అతి ప్రాచీన లిపి పాళీ లో 'అ ' ఇలా ఉండేదట. అంతకు ముందు మన దేశంలో చిత్ర లిపి (చిత్రాల ద్వారా రాసుకునే అక్షరాలు - చైనా అక్షరాల లాగా) ఉండేదట. హరప్ప, మొహంజొదడో (సింధు నాగరికత) త్రవ్వకాల్లో ఓ లిపి బయటపడినా, ఆ లిపి ని ఇంతవరకు ఎవరు గుర్తించలేదు!



చూడండి. ఇప్పటి మన 'అ ' కు అప్పటికీ పొంతనే కనబడదు. అప్పటి ఆ పాళీ 'అ ' ఇప్పటి మన అందమైన 'అ ' వరకూ సాగిన ప్రస్థానం ఈ
లంకె లో చూడండి. ఆ లంకెలో మధ్య పల్లవుల కాలంలో తెలుగు కాస్త వ్యత్యాసంగా ఉండడం గమనించ వచ్చు. (పల్లవులు తమిళులు కాబట్టి, ఆ అక్షరాలు ఇప్పటి తమిళ అక్షరాలకు మాతృక కావచ్చునేమో)

మన తెలుగు 'అ ' ప్రస్థానాన్ని చూసి, దేవనాగరి లిపి 'अ ' ను కూడా కాస్త ఊహించవచ్చు.

మన భారతీయ లిపికి ఇంకో ప్రాముఖ్యం ఉంది. అదేమిటంటే, అక్షరాలనే కాకుండా, ఒక్కో అక్షరం పుట్టుక స్థానం కూడా కనుగొన్నారు మన వాళ్ళు. వీటిని కంఠ్యములు(గొంతు), తాలవ్యములు(దవడ),మూర్ధన్యములు(అంగిలి),దంత్యములు(పళ్ళు),ఓష్ట్యములు(పెదవులు) అని విభజించారు.ఈ మౌలికమైన విభజన కాక ఇంకొన్ని అక్షరాలను కంఠౌష్ట్యములు, దంత్యౌష్ట్యములు, లాంటి విభాగాల లోనూ చేర్చారు.

గొంతు ద్వారా పలకబడే అక్షరాలు 'అ ', 'క ' , 'హ ' మొదలైనవి. పెదవుల ద్వారా ఐతే 'ప ', 'మ ' మొదలైనవి. పుట్టిన బిడ్డ మొట్టమొదట నేర్చుకునే పదం 'అమ్మ ' అన్నది గొంతు, పెదవి ద్వారా పలకబడే సులువయిన శబ్దాలు ’అ ’ , ’మ ’ కావడమే అని మా తాత చెప్పేవాడు. (మిగిలిన భాగాలు, అంగిలి, దంతాలు మొదలైనవి ఇంకా వచ్చి ఉండవు కాబట్టి.)

అలానే 'అ ', 'హ ' ఇవి పలికేప్పుడు గాలి బయటకు వెళుతుంది. కరుణశ్రీ గారు స్వారోచిష మను సంభవం లో ఓ పద్యానికి (ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో....)భాష్యం చెబుతూ,వరూధిని తనను కౌగిలించుకున్నప్పుడు, ప్రవరుడు ఆమె భుజాలను పట్టి తోసి వేస్తూ, 'హా! శ్రీ హరీ ' అంటాడు కదా ’హా! శ్రీ హరీ ’ అనే అని ఎందుకనాలి? అని చక్కగా విశదీకరించారు.

'హా! శ్రీ హరీ ' అన్నప్పుడు గాలి బయటకు వెళుతుందట. అంటే ప్రవరుడు తన ముఖం పక్కకు తిప్పుకోవడంలోనే కాకుండా, తన వాచికంలోనూ అయిష్టత ను చూపించ దలిచాడట (ఈ 'హా! శ్రీ హరీ ' అని అనడం ద్వారా)

ముగించే ముందు మన తెలుగు వాడి గుత్త సొమ్ము తలకట్టు గురించి ఓ పద్యం గుర్తు చేసుకుంటాను.

కన్నులు దీర్ఘముల్ నగుమొగంబవురా తలకట్టు తమ్మిపూ
పున్నమ చందమామలకు బొక్కిలి చక్కదనంబు చెప్పగా
నున్నదె!మేలు బంతులు పయోధరముల్ మరి కౌను సున్నయౌ
నెన్నిక కెక్కు వ్రాతఫలమివ్వర వర్ణినికిన్నింజంబుగన్.

(ఉపకరించిన పుస్తకం, ఆచార్య తిరుమల రామచంద్ర - మన లిపి పుట్టు పూర్వోత్తరాలు, విశాలాంధ్ర ప్రచురణ)

Wednesday, June 11, 2008

పొద్దు లో నా స్వేచ్చానువాదాలు...

రవీంద్రుని కవితలకు నేను రాసుకున్న స్వేచ్చానువాదాలు, పొద్దులో..
ప్రోత్సహించిన మితృడికి ధన్యవాదాలు.