Sunday, February 26, 2012

తిండి నుండి తిమిరాంధకత్వం వరకూ...టూకీగా...

"కోన్నిచివా? ఓ గెంకి దెసుకా?" (జపనీసు భాష పలకరింపు)

"శుభోదయం. ఏరా, బలిశావా?"

మొదటి జపనీసు పలకరింపుకు స్వేచ్ఛానువాదం రెండవ లైను. స్వేచ్ఛానువాదమే కాదు విశృంఖలానువాదం కూడాననుకోండి. అయితే మాటర్ మాత్రం ఆరోగ్యం గురించి. పలకరింపు ప్రాంతపు సంస్కృతిని పట్టిచ్చేస్తుంది.

కోన్నిచివా - శుభోదయం ఇది చాలాచోట్ల కామనే అనుకుంటాను.

సెలామత్ బాగీ - శుభోదయం
సెలామత్ షియా - శుభ మధ్యాహ్నం
సెలామత్ మలామ్ - శుభరాత్రి

పై మూడు ఇండోనేషియన్ భాష పలుకరింపులు.

"రాం రాం", "నమస్కారం", వీటికి అంతర్లీనంగా ఉన్న అర్థం నీలో దైవత్వాన్ని చూస్తున్నాను. అని చెప్పడమే తప్ప ఇంకొకటి కాదు. వేల సంవత్సరాలు తనగోలలో తాను ఉంటూ, ఒకానొక అంతర్ముఖమైన దేశం భారతదేశం. ఇక్కడి పిలుపులో సూక్ష్మమైన అంతఃపరిశీలనా, నిరాడంబరత్వం కనిపించడంలో విడ్డూరమేమీ లేదు.

అలాగే జపాను వారికి ఆరోగ్యం ప్రధానం. ఇప్పటి అమెరికా ఎలాగో, ఒకప్పుడు జపాను అలాంటిదేశమట. సంపద, యౌవనత్వం, కొత్త ఆలోచనలు, కొత్త అన్వేషనలు, రంగురంగుల దుస్తులూ, కళాకృతులు...భారతదేశం అంతర్ముఖమైతే, (Introvert) జపాను తద్భిన్నంగా పూర్తీగా బహిర్ముఖం (Extrovert).

గౌతమ బుద్ధుని మహాపరినిర్వాణం తర్వాత, బుద్ధుని బోధ ఇంతపెద్ద దేశంలో నిలబడలేకపోయింది. ఇందులో భయంకరమైన కుట్ర అంటూ ఏదీ లేదు. ఎంత కుట్రపన్నినా, పాలకులందరూ కూడగట్టుకుని బౌద్ధాన్ని తొక్కినా, ప్రజలకు అర్థం కాని మతం, అర్థం కాని తత్వసారాంశం నిలబడదు. మెట్టవేదాంతంలా కాలగర్భంలో కలిసిపోవలసిందే. అది ఆ రోజూ ఈ రోజూ కూడా నిరూపించబడుతూనే ఉంది. నేడు కూడా కృష్ణమూర్తి తత్వం జిడ్డుగా ప్రచారమవుతూంది తప్ప అందులో ఉత్కృష్టత, మహత్వపూర్ణత్వమూ సామాన్యుడికి అర్థమయే అవకాశం లేదు, కృష్ణమూర్తి నిర్వాణం పొంది సత్యదర్శనం చేసినట్టు నిదర్శనాలున్నప్పటికీ.

అయితే ఇంత పెద్దదేశంలో మనలేని బుద్ధబోధ పొఱుగున ఉన్న చైనాలో వేళ్ళు తొడిగింది. ఆ నేలలో సారాన్ని తీసుకుని మహా వృక్షంగా ఎదిగింది. అలా చైనాలో ఎదిగిన వృక్షం జపానులో పూలు పూసింది!

ఒక అంతర్ముఖమైన దేశంలో తొడిగిన విత్తు మరొక సారవంతమైన, సామాన్యమైన (అంటే అటు పూర్తిగా ఐశ్వర్యవంతము, లేదా పూర్తిగా దరిద్రమూ కానిది), భూమిలో వేళ్ళూనుకొని ఒకానొక బహిర్ముఖమైన దేశంలో పూలుపూచింది.

అదే జెన్.

ధ్యానము చాన్ గా మారి జెన్ గా రూపు దాల్చింది. పిలుపు వెనుక ఇంత అర్థం లాగాం.

**************************************************************************************

నేను ఎప్పుడు టీవీ ముందు కూర్చున్నా మా ఆవిడకు తలనొప్పి. ఆమెది "సొగిలి రేకులు", "గోరింట్టాక్కూ, గోరింట్టాక్కూ" స్టాండర్డు అయితే నాది ట్రావెల్ అండ్ లివింగూ, డిస్కవరీ వగైరా. ఇద్దరికి భావసారూప్యం క్రికెట్ లో మాత్రమే.

ఆమె టీ ఎల్ సీ గురించి ఓ డిస్కవరీ చేసింది. ఆ చానెల్ లో వచ్చే ఎక్కువభాగం ఎపిసోడ్లు తిండి మీదే ఉన్నాయట. అందుకని ఆమె ఆ చానెల్ కు పెట్టిన పేరు - ఫుడ్ అండ్ లివింగ్ చానెల్.  అంటే మింగుడు-పడుకొనుడు చానెల్ అన్నట్టు.

మనిషికి కడుపు నిండా తిండి దొరికిన తర్వాత ఆలోచించేది ఎంటర్ టైన్మెంట్ గురించేనేమో! ఎంటర్టైన్మెన్ట్ - ఇది ముదరాలంటే మటుకు జీవితకాలం సరిపోదు.

Monday, October 31, 2011

మూగోళ్ళ తోట


జనార్దనరెడ్డి నా వంక విచిత్రంగా చూసినాడు. వాడి చూపును చూసి నాకెందుకో భలే ముచ్చటేసింది. పలుకరించినా. వాడు తిరిగి బదులివ్వలేదు. రోంతలికి వాడి చూపుల్లో విచిత్రం కొంచెం కొంచెంగా సర్దుకుని మట్టసంగా ఐనాడు. నాతోబాటూ మా ఆవిడా, పాఠశాలలో ఆమె తోటి టీచర్లూ, ఇంకా స్టాఫు, అక్కడ కొట్టంలో జనార్దనరెడ్డి వాళ్ళ ఇంటి ఆడవాళ్ళూ.. ఇంతమంది ఉన్నా, నాకెందుకో వాడితోనే ఊసులాడాలానీ, ఆ అందమైన సాయంత్రం ఆడుకోవాలని అనిపించింది. వాడు అంతమంది మధ్య నాదగ్గర మొగమాటం లేకుండా దగ్గరికి రాగలిగినాడు కానీ మాట్లాడడు.

ఆ పిల్లోని నోట పలుకు రాకపోవడానికి కారణం తెలిసి, ఆ రోజు బలవంతంగా నా ఉద్వేగాన్ని అణుచుకోవలసి వచ్చింది. జనార్దనరెడ్డి పుట్టుమూగి. అతడే కాదు, వాళ్ళ నాన్న, ఇద్దరు పెదనాన్నలూ ఎందుకనో యేమో మూగవాళ్ళు.(అందుకనేనేమో, దేవుడిభాష మౌనాన్ని అర్థం చేసుకున్న వానికి మనుషుల గోల చూసి చిత్రమనిపించుంటుంది. దేవుని భాష, గీర్వాణమూ, ప్రాకృతమూ కాదు. మౌనమే ఆయన భాష. కావాలంటే ఈ సారి ప్రశాంతమైన దేవళంలో శివుని లింగం ఎదురుగానో, అమ్మవారి ముంగిటనో నిశ్శబ్దంగా కూర్చుని కళ్ళుమూసుకోండి. ఒట్టు. దేవుని పలుకరింపు వినబడుతుంది. ఇంకా పెద్దమనసున్న వానికి దేవుని గుడే అక్కర్లే, యే చెట్టుకిందనో అందమైన పూట కూర్చుంటే చాలు)

రెడ్డేర్ల తోటలో మామిడిచెట్లూ, పనస చెట్టూ, కొబ్బరి బొండాలు, పక్కనున్న బాయి, దూడ, ఇవన్నీ మమ్మల్నా రోజు ఆప్యాయంగా పలకరించినై. మమ్మల్ని కట్టమీద కూర్చోమని రెడ్డి చెట్టుపైనెక్కి కొబ్బరి బొండాలు దింపినాడు. నవనవలాడే పచ్చిమామిడి కాయలు ఎవరికాళ్ళు కోసుకుని ఒకపక్క ఉప్పురాసుకుని నముల్తా మురిసిపోతున్నారు.

నాకు మాత్రం వాటికన్నా మా జనార్దనరెడ్డి లోటాలో తెచ్చుకున్న బొరుగులు వాడికి తినిపిస్తా, ఒకట్రెండు పలుకులు నేనూ నోట్లో యేసుకుంటా ఉంటే, అహా అనిపించింది.

రెడ్డెర్ల ఇంటాడంగులు మాట్లాడిస్తా, పొలం కబుర్లు చెప్పిరి. అందర్లోకి చిన్నోడంట ఇప్పుడు పొలం చూస్తా ఉండేది. యే యేడికాయేడు ఎట్లో నెగ్గుకొస్తన్నామని చెప్పినాదాయమ్మ. ఆ మహాతల్లికి, మాకు ఏం సమ్మందమని? మామిడికాయలు కోసిచ్చి, ఉప్పూకారం తెచ్చిచ్చి, బొండాలు తాపి, తోటకి మళ్ళీ రమ్మని పిలిచిందాయమ్మ.

సాయంత్రం బండిమీద తిమ్మాపురంలో శనక్కాయలతోట కాడికి, ఆడ నుండి మూగోళ్ళ తోటకూ బైల్దేరి, పొద్దుగుంకే వేళ చంద్రుడు, సూర్యుడు డ్యూటీలు మార్చుకునే టయానికి తిరిగొస్తిమి.

బండి మీద ఊరేగటం భలే ముచ్చట. 

ఇప్పటికి మూడున్నరేండ్ల ముందర ముచ్చట ఇది.  టీవీ సీరియళ్ళూ, క్రికెట్టు మజా, ఫ్రిజ్జు నీళ్ళూ, సోఫాసెట్టు మెత్తదనం, ఫ్యాను గాలి, లాప్ టాపులో intellectual ejaculations, దవడలల్లాడించడానికి ఏదో జంక్ ఫుడ్డు ఇయేవీ లేని ఒక సాయంకాలం అది. మొబైల్ ఫోను సిగ్నలు కూడా లేదు. శుభం.

జనార్దనరెడ్డి ని మర్చిపోలేను. వాని చూపును కూడా. మళ్ళీ వాణ్ణి చూసే ధైర్యం మటుకు నాకు లేదు. వాడు బాగుంటే అంతే చాలు.

ఈ ముచ్చటనంతా కళ్ళున్నాయో లేవో తెలవదు కానీ తనకళ్ళతో కాక, మనసుతో చూసిన ప్రాణి ఇంకొకరున్నారు. దాని పేరు సంహిత. అవును. అప్పుడు మా ఆవిడ దౌహృద :).