Thursday, June 2, 2011

నూరు యోజనాలకు...



నేనిలా బ్లాగులు రాస్తాన్నట్లు మా అవ్వ చిన్నప్పుడు తన కతలు చెబుతా ఉండేది. మా అవ్వ అంటే మా అమ్మ నాయనకు చెల్లెలు. ఆయమ్మకు చిన్నతనంలోనే పెండ్లి చేస్తే, మొగుడు చనిపోయి విధవయింది. అప్పట్నుండి ఆయమ్మను సాకే పని మా తాతదయ్యింది. ఆచారం, ఆచారం అని నీల్గినందుకు గానూ ఆయనకొచ్చిన బహుమానం ఇది. బిడ్డా, గొడ్డూ లేదు కాబట్టి ఆయమ్మకు నా మీద ప్రత్యేకమైన ప్రీతి కాబట్టీ, నాకు ముచ్చట్లు చెబుతా ఉండేది.

మా తాత గోదావరి ధవళేశ్వరం కాడ బారేజీ కట్టేప్పుడు పీడబ్ల్యూడీలో గుమాస్తాగా చేసేటోడంట. ఆయనా, ఆయన భార్యా, తల్లీ, చెల్లెలు, చిన్న పిల్లకాయొకడూ. (అప్పటికి మాయమ్మ పుట్టలే) ఇదీ సంసారం. గోదారోళ్ళ మాటలు వీళ్ళకర్థమయేవి గాదంట. ఆ మాటకొస్తే వాళ్ళు ఎక్కడో తంజావూరు దగ్గర్నుంచీ వలస వచ్చినోళ్ళు కాబట్టి తెలుగే అంతంత మాత్రం. ప్రతి రోజు హాశ్చెర్యమే. 

సపోటాలమ్ముతా ఉంటే చూసి, వీళ్ళు ఉర్లగడ్డను కూడా పండు గా మార్చి తింటున్నారని అనుకొన్నారంట, మరో రోజు వీధిలో ఎవతో మరమరాలు అమ్ముతా ఉంటే ఆమెను ఏమ్మో వియ్యపురాలూ అని పిలిస్తే, ఆవిడొచ్చి ఎవరికి వియ్యపురాలు? అని ఒకటే గలాట పెట్టుకొనిందంట. మా ఊళ్ళో (సీమలో) మరమరాలకు బొరుగులు అని, వియ్యపురాలిని సంబంధి అని వాడుక. (మరమరాలకు, వియ్యపురాలకు మధ్య కన్ఫ్యూజన్ ఆమెకు) ఇట్లాంటి కబుర్లు చెప్పేది. ఆయమ్మవన్నీ డౌలు మాటలని అనుకునేటోళ్ళం నేనూ మాయన్నా. ఒకరోజు ఇదే గోదావరి కబుర్లు చెబుతా,మనకిక్కడ సీతాఫలమున్నట్ల అక్కడ రామాపండు ఉంటుందిరా అనింది. అది నేను నమ్మలే. ఇన్ని యేళ్ళ తర్వాత ఆ మధ్యనెప్పుడో ఒక ఫోటోబ్లాగాయన ఫోటోపెట్టి చూయిస్తే నమ్మాల్సొచ్చింది!

చిన్నప్పుడివి తెలీకపోయినా నా కాలేజీ రోజుల నుంచీ ఈ రోజు వరకూ ఇట్లాంటి ఆశ్చర్యాలు కనిపిస్తూనే ఉన్నై. వారం రోజుల క్రితం హైదరాబాదొచ్చి ఇక్కడ ఇల్లు చూసుకున్నప్పుడు గంటయ్య పరిచయమయ్యాడు. గంటయ్య నేనున్న అపార్టుమెంటు వాచ్ మెన్. అతనిది పాలకొల్లట. గోదావరి యాస. మొదట్రోజు ఒక్క ముక్క అర్థం కాలేదు. తర్వాత్తర్వాత డీకోడ్ చేసి అర్థం చేసుకుంటున్నా. మొన్నో రోజు పొద్దున అతను పలకరించాడు.

"సారూ, మీ జోళ్ళొదిలీశారేటండి?"

"?...కళ్ళజోడా?" (అడిగిన తర్వాత తెలిసింది వెధవప్రశ్నని)

"కాదండి, కాల్జోళ్ళండి"

కాసేపటికి బల్బు వెలిగింది. నా చెప్పులు బయట మర్చిపోయాను. అదీ సంగతి. మా ప్రాంతంలో కొన్ని చోట్ల చెప్పులకు మెట్లు అంటారు (మెట్టుతో కొడతా అని ఒక పాపులర్ తిట్టనమాట).

బల్బంటే గుర్తొచ్చింది. ఇంటికి బల్బు తెచ్చుకోవాలి.బయట అంగడికెళ్ళాను.

షాపతనకి చెప్పాను. బల్బొకటివ్వమని.

"అర్ పయ్యా? నల్ పయ్యా?"

"?!"

నా అయోమయం చూసి మళ్ళీ అడిగాడు. అర్థం కాకుండా తిరిగి వచ్చేస్తూంటే సిక్స్టీ వాట్ బల్బు, సిక్స్టీని అర్పై అంటున్నాడు కాబోలని స్ఫురణ(యాద్)కొచ్చింది. అదీ సంగతి.

ఇంటికొస్తే మా పాప మొదలెట్టింది.

"నానా, మామిడి పండు తింటా నానా, పండు నేను తింటా పొట్టు నువ్వు తిను.." (మామిడిపండు తోలు నాకు ఇష్టం.
అందుకని పండు కోసి దానికి పెట్టి తోలు నేను తినడం అలవాటు)

పొట్టు - ఫక్కున నవ్వొచ్చింది.

నవ్వుతూంటే అంది. "నానా నువ్వు నవ్వొద్దు". -

(తప్పుతుందా) "!...సరే"

కాలేజీ రోజుల్లో నెల్లూరతను మా మాటలు చూసి నవ్వే వాడు. ఓ రోజు కొన్ని పదాలు రాసుకొచ్చినాడు. వాడు రాసుకొచ్చిన మాటల్లో కొన్ని జ్ఞప్తికున్నవి.

"తీరుమానం"
"పాలేగాడు"
"రెట్టమతం"
"కొల్లబడిబోయింది"
"ఉర్లగడ్డ"
"బీగంచెవి" (బీగం - అంటే ఓ మారు మా కొలీగు ముసల్మాను భార్య అనుకుని తికమకపడినాడంట. ఆ తర్వాత అర్థయింది,వేరే ఏదో అని)
"తట్ట" (కంచం)
..
..

వాడిని అప్పట్లో బాగా తన్నాలనిపించింది, కానీ ఆ పరిస్థితి నాకూ చాలాసార్లు ఎదురయ్యింది. భారతదేశంలో ప్రతి నూరు యోజనాలకు భాష మారుతుందని పెద్దలమాటట. భాష ఒకటయినా మాటలర్థం కాక, అలాంటిది అనుభవంలోకొస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.

Saturday, April 23, 2011

సాయిబాబా - అంతశ్శోధన


"అంతమంది జనాలు సాయిబాబాను నమ్ముతున్నారు గదా, నువ్వెందుకు నమ్మవు?" కాలేజీ చదువుతున్నప్పుడు మాయమ్మ అడిగింది ఒకరోజు.

అప్పట్లో ఒకానొక ఫంక్షన్ లో (సత్యసాయి నిగమాగమం ప్రారంభోత్సవం అనుకుంటా) సాయిబాబా రాజేష్ పైలట్ అనే కేంద్రమంత్రికి కొన్ని వేలమంది చూస్తుండగా గాలిలో నుండి ఒక చిన్న నగ సృష్టించి బహుమతిగా ఇచ్చారు, ఆ దృశ్యం వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత వీడియో రికార్డులను స్లో మోషన్ లో చూస్తుండగా ఒక విషయం బయటపడింది. సాయిబాబా పక్కన ఒకతను ఒక పళ్ళెం పట్టుకుని నిలబడి ఉంటే, ఆ పళ్ళెం క్రిందుగా చేతులు పోనిచ్చి సాయిబాబా ఆ నగను తీసినట్టు ఆ దృశ్యం చెబుతూంది. ఆ టేపును అప్పటి దూరదర్శన్ డైరెక్టర్ అప్పారావు గారు కాల్చేశారట. ఇదంతా పత్రికల కథనం కాబట్టి నిజానిజాలు నాకు తెలియవు. అయితే సాయిబాబా పళ్ళెం కింద చేయి పెట్టటం నగ తీయడం ఈ వరుస ఫోటోలు ఒకానొక దినపత్రికలో వచ్చాయి. వాటిని మా కాలేజీ నోటీసు బోర్డులో పెట్టారు. అదీ కథ.

ఆ రోజు వరకూ నా గోల నాది, కానీ సాయిబాబాను నమ్మకపోవడం ఆ సంఘటన నుంచి నాలో మొదలైంది. దానికి తోడు ఆయన కుండలోంచి విభూతిని పది పదిహేను నిముషాల వరకూ తీస్తూనే ఉండడం, నోట్లో శివలింగం తీయడం ఇవన్నీ ఒక డాక్యుమెంటరీ సినిమాలో చూసి కాస్త విరక్తి కలిగింది. ఈ పైత్యానికి తోడు నాకో స్నేహితుడు ఉండేవాడు. వాడు పరమభక్తుడు. "దీపం విలువ దీపం క్రింద చీకట్లో కూర్చున్న వాళ్ళకు తెలీదురా. కాస్త దూరం నుంచి చూసేవాళ్ళకు మాత్రమే కనబడుతుంది" అనే వాడు. వాడి మూర్ఖభక్తి చూసి నవ్వు వచ్చేది. ఆలోచనాశక్తిలేకపోవడం వల్ల ఎప్పుడైనా కోపమూ వచ్చేది.

సాయిబాబా మీద ఈ తిరుగుబాటు భావజాలం అంతర్మథనంగా మారింది మా మేనమామ వల్ల.

కీర్తిశేషులు శంకరసుబ్రహ్మణ్యం మా మామయ్య. ఆయన కాలం చేసి నేటికి పదేళ్ళవుతూంది. ఆయన బహుభాషావేత్త. సంస్కృతంలో మంజరీశతకం అన్న శతకకావ్యమూ, వేమన పద్యాలకు హిందీ అనువాదం, ఠాగూర్ పద్యాలకు తెనుగు సేత, మేఘదూతం లా నిస్తంతీ దూతం (ఆయన టెలికాం లో ఆఫీసర్ గా పనిచేసి పదవీవిరమణ చేశారు) ఇలాంటి రచనలతో సాహిత్యపరిశ్రమ, శారదాసేవ చేసిన వారు. నిత్యవిద్యార్థి. ఆయన ఛాందసులు కారు, ఆధునికులనే చెప్పాలి. ఆంగ్లం మీద, ఆంగ్లవిద్య మీద మోజు, ఆంగ్లం చదివితే జీవితంలో పైకి రావడం సులభమనే భావనా ఆయనకు ఉండేవి. ఆయన టెలికాం ఉద్యోగం నుండి రిటైర్ అవడానికి ముందు కొన్ని చిక్కుల్లో పడ్డారు. తన ఆఫీసులో సహోద్యోగి ఒకతను ఒక చెక్కును ఫోర్జరీయో ఏదో చేసి, డబ్బు కాజేసి, ఆ నేరం ఈయన మీదే మోపారు. ఆ కేసు పెట్టినది దళితుడు అవడంతో ఈయనకు చిక్కులు మరింత ఎక్కువయ్యాయ్. దాదాపు నలభై అయిదేళ్ళ సర్వీసులో నిజాయితీగా కష్టపడినందుకు ఈ ఫలితం దక్కిందని ఆయన మానసిక వేదన అనుభవించారు. ఆ సమయంలో సత్యసాయిబాబాను నమ్మారు. వేడుకున్నారు. ఎలాగైతేనేం కొన్ని యేళ్ళకు ఆయనకు న్యాయం దొరికింది. కోర్టు ఆయనను నిర్దోషిగా నిర్ణయించి తీర్పునిచ్చింది. సాయిమీద కృతజ్ఞతతో ఆయన ఇల్లు కట్టుకుని "సాయిసదనమ్" అని పేరు పెట్టుకున్నారు.

మా అమ్మకూ, మా పిన్నమ్మలిద్దరికీ మేనమామ మాట వేదవాక్కు కాబట్టి వాళ్ళూ ఆయనను నమ్మడం మొదలుపెట్టారు.మా ఇళ్ళ పూజాగృహాలలో సాయిబాబా పటం ఉండేది. అయితే అవజ్ఞతతో, తెలివిమాలినతనంతో అప్పట్లో మా అమ్మతో నేను కాస్త దురుసుగా మాట్లాడేవాణ్ణి, సాయిబాబా కుండలో విభూతి తీస్తే మీరెలా నమ్ముతారని మా అమ్మను ఆక్షేపించిన జ్ఞాపకం. టపా మొదట్లో మా అమ్మ కోపంగా అడిగిన ప్రశ్న ఆ సందర్భం లోనిదే.

బతికి ఉన్న రోజుల్లో మా మేనమామయ్యతో నాకు మాటలు, కొంతవరకూ చర్చలు ఉండేవి కానీ, విపరీతమైన చనువు లేదు,ఆయనతో మాట్లాడే స్థాయి కూడా లేదు. అంచేత సాయిబాబా విషయంలో నేను ఆయనతో చర్చించలేదు కానీ, ఒక సందర్భంలో నాకు తెలిసిందేమంటే, ఆయన సాయిబాబాను చూడనే లేదని, కేవలం ఆశ్రయించారని. తన లీలల గురించి కూడా తనకు తెలిసి ఉండదని నా అనుకోలు. సాయిబాబాను ఆయన కడకు దర్శించారో లేదో తెలియదు.

ఆయన ద్వారా నేను నేర్చుకున్నది సాయిబాబాను నమ్మినా, నమ్మకపోయినా నమ్మేవాళ్ళను గేలి చేయరాదన్న సంస్కారం. ఆ సంస్కారం కాస్త మిగలబట్టి మా ఇంటికి ఒకసారి నాన్న తరపున బంధువులు వస్తే, వారివెంట పుట్టపర్తి వెళ్ళి వచ్చాను. మా బంధువు పొద్దున ఐదున్నరకు వెళ్ళి మూడవ వరుసలో కూర్చున్నారు. సత్యసాయిబాబా చేతి నుండీ విభూతి రాలడం ఆయన స్వయంగా చూశానన్నారు. చాలా ఆశ్చర్యపడిపోయారు.

అయినా ఎందుచేతో అప్పుడప్పుడూ పురుగులా ఒక ప్రశ్న తొలుస్తూనే ఉంటుంది. ద్వేషం వల్ల కాదు, ఏదో తెలియని బాధ, ఆవేశం వల్ల.  ఒక వ్యక్తి రోలెక్స్/టైమెక్స్/సిటిజెన్ గడియారం గాల్లో ఎలా సృష్టిస్తారు? ఒక గడియారం కావాలంటే క్వార్ట్జ్ క్రిస్టలు, దాని వెనుకనున్న సైన్సు సూత్రాలు, నిపుణులు అనేకుల పరిశ్రమ లేకుండా ఎలా సాధ్యం? గాల్లో బూడిద పుట్టిందంటే ఏదోలే సంభావ్యత ఉందనుకుందాం, గడియారం ఎలా "పుడుతుంది"? అసలు చేతిలో పట్టేంత వస్తువెందుకు పుట్టాలి? యే రిఫ్రిజిరేటర్ నో పుట్టించవచ్చు గదా? (నేను ఎర్ర వాణ్ణి, మతద్వేషినీ కానని మనవి. నా వాదన ఎర్రవారికి మద్దతు కాదు. పైవాదన సాయిబాబా భక్తులకు ధిక్కరింపూ కాదు. నేను నమ్మవలసి వస్తే నాకు కలిగే ప్రశ్నలు మాత్రమే)

పై ప్రశ్నలు ఎవరినైనా అడిగితే వాళ్ళు నన్నెలా ఆక్షేపిస్తారో అనుకుంటే ఈ క్రింది ప్రశ్న తట్టింది.

"నువ్వెందుకు ఐదేళ్ళ పిల్లవాడు (కృష్ణుడు) ఒక కొండను చిటికెన వ్రేలుతో ఎత్తాడంటే నమ్ముతున్నావు? పూజిస్తున్నావు?రాముడు ఒక బండకు తన కాలు సోకించగానే ఒకమ్మాయి పుట్టిందంటే నీవెలా నమ్ముతున్నావు?(ఇలాంటివి అనేకం ఉన్నయ్)

కాస్త తల చెడగొట్టుకుంటే రెండు సమాధానాలు కని(విని)పించాయి.

౧) పై రెండు కావ్యసాహిత్య విషయాలు కాబట్టి. సాహిత్యంలో ఒక పురుషోత్తముణ్ణి, శ్రేష్టుణ్ణి చేయడానికి చిలవలు పలవలుగా కల్పించడం ఉన్నదే. (రాజమౌళి సినిమాల్లో హీరోలు చేసే విన్యాసాలలాగా). అవన్నీ లేకపోతే కావ్యమూ లేదు, కావ్యోద్భవరసనిష్పందమూ లేదు. కావ్యం అంటే కేవలం న్యూస్ పేపర్ లో చదివే న్యూస్ లాంటిది కాదు, పొద్దస్తమానం తిని తొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా లేదు. అంచేతే కావ్యమూ, రసమూ, కల్పనలూ వగైరా వగైరా..

౨) ఎవరైనా ఒక మహానుభావుడు, మహోన్నతుడు, పురుషోత్తముడు, సద్గురువు పుట్టి గతించిన తర్వాత ఆతని చుట్టూ మార్మికత, ఆచారాలు, వ్యవస్థా కమ్ముకోవడం లోకవ్యవహారం. బుద్ధుడు దేవుడే లేడన్నాడు. (లేదా దేవుణ్ణి బయట కాక అంతశ్శోధనలోనే వెతుక్కోమన్నాడు). ఆయన తర్వాత అనుచరులు ఆయనను దేవుణ్ణి చేసిపెట్టారు. ఆయన పేరు మీద అభూతకల్పనలు, అతీంద్రియ శక్తులు కల్పించారు. షిర్డీ సాయిబాబా విషయంలో అదే జరిగింది. ఇంకా ఎంతోమంది విషయంలో కూడానూ. బహుశా మరో రెండు తరాల తర్వాత ఏమో, జిడ్డు కృష్ణమూర్తి కూడా దేవుడు కావచ్చు!

జిడ్డు కృష్ణమూర్తి 1929 లో తను అధిపతిగా ఉన్న ఆర్డర్ ఆఫ్ స్టార్ సంస్థను రద్దు చేసి అప్పట్లో 3000 కోట్ల డాలర్ల సొమ్మును సంస్థ సభ్యులు ఎవరికి వారికి పంచి ఇచ్చేశాడని వార్త.

బహుశా మరో వంద, నూటయేభై సంవత్సరాల తర్వాత -

కృష్ణమూర్తి అప్పుడు కళ్ళు తెరిచాడు. అంతే! ఆయన ముందున్న డబ్బంతా మాయమయింది. అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపడ్డారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఆశ్చర్యం!!! వాళ్ళ ఇళ్ళ అల్మైరాలలో, ఇనుపపెట్టెలలో సరిగ్గా వాళ్ళు ఆర్డర్ ఆఫ్ స్టార్ కు ఇచ్చిన విరాళం లెక్క ప్రకారం అంతే లెక్క అలాగే ఉంది. పూజాగదిలో కృష్ణమూర్తి విగ్రహం లోంచి దేదీప్యమానమైన కాంతి ప్రసరిస్తోంది......

అలాంటిది కల్పన ఒకటి మొదలయితే ఆశ్చర్యమేమీ లేదు.

**************************************************************************************************

సాయిబాబా (మత) ద్వేషులది మరో తీరు. ఏదో, ఎవరినో ఉద్దరిస్తున్నట్టు, ప్రపంచానికంతా జ్ఞానజ్యోతులు వెదజల్లుతున్నట్టు ఉంటాయి వీళ్ళవాదనలు. జీవితంలో భరించలేని కష్టాలొస్తే, మళ్ళీ వీళ్ళది అదే త్రోవనే. ఏదో ఒక నమ్మకమో, విశ్వాసమో ఆసరా కావలసిందే. వ్యవస్థీకృతమైన నమ్మకం చెడ్డదని కొందరి చిలకపలుకు. వ్యవస్థీకృతమైన నమ్మకం ఆత్మశోధనకు అడ్డంకి కావచ్చునేమో, కానీ వ్యవస్థీకృతమైన అపనమ్మకం పరమ దారుణమైనది. మనుషులను పశువులుగా మార్చేదీనూ. Truth is not opposite of false, but absence of false అనేది వివేకవంతమైన మాట. అది స్వయంగా ఎవరికి వారు తెలుసుకోవలసిందే. నమ్మకం కనీసం సాంత్వననిస్తుంది. అపనమ్మకం వల్ల ఒరిగే ప్రయోజనమేదీ లేదు. వీళ్ళు చెప్పే అంత సైన్సూ ఈ రోజు ఒరగబెడుతున్నదేమీ లేదు. నూటికి ముప్ఫై మంది ఆకలితో ఛస్తుంటే సైన్సు బాంబులకోసం తన్నుకుంటూంది. అందుకు శాస్త్రీయవాదులు సమాధానం చెప్పరు. వాళ్ళమాట వింటే ప్రపంచం మారిపోతుందన్న అల్పభ్రమలో ఉంటారు.

**************************************************************************************************

అయితే సాయిబాబా గురించి ఆలోచనలు వచ్చినప్పుడు దొర్లే కొన్ని ప్రశ్నలు మట్టుకు వేధిస్తూనే ఉంటాయి. Faith begins when logic ends. అని సూత్రం. Is that faith which comes is really a faith? or a subset of FEAR/DESIRE? గౌతమ బుద్ధుని నుంచి జిడ్డు కృష్ణమూర్తి వరకూ శంకను నిరంతర అన్వేషణాపరత్వాన్ని వీడకూడదని బోధిస్తారు. Doubt has a cleansing effect అంటారు కృష్ణమూర్తి. శంక అంటేనే తర్కం పరిధిలోకి వచ్చేది. తర్కాన్ని ఎంతవరకు నమ్మాలి? ఎప్పుడు తర్కం వద్దనుకోవాలి? ఎవరి దగ్గర తర్కాన్ని త్యజించి విశ్వాసం చూపడం మొదలుపెట్టాలి? తర్కం కూడా బుద్ధి పరిధి లోనిదే కదా? దాన్ని తోసిరాజనడం ఆత్మవంచన కాదా?

Logic ను పక్కకు నెట్టేసి ఒక Entity ని నమ్ముతాము అనుకుంటే నా నమ్మకం (FAITH) వెనుక ఉన్నది ఏమిటి? కోరికా? భయమా? లేక ఆత్మార్పణమా? (Total surrender)

భయమూ, కోరికా లేనప్పుడు మనలను (ఆత్మను లేదా మనసును) ఒకరికి అర్పించుకోవడం ఎందుకు? ఆ అవసరమేమిటి?

Master is born when pupil is ready
When the rain comes
grass grows by itself.

అనేది ఒక జెన్ హైకూ. గురువు కన్నా శిష్యుడే గొప్ప, అంతశ్శోధనయే గురువు అని ఈ సాంప్రదాయం. అంతిమంగా ఏదైతే తెలుసుకోవలసి ఉందో, ఏది తెలిస్తే దుఃఖమూ, అసూయ, అజ్ఞానము, అవివేకమూ మొదలైనవన్నీ నశిస్తాయో దానికి formula ఏ గురువు దగ్గర, ఏ బాబా దగ్గర, ఏ ప్రస్థానం వద్ద, ఏ పుస్తకంలో, ఎవరి బోధలో, ఎవరి శిష్యరికంలో,ఏ మఠంలో, ఎక్కడ దొరుకుతుంది?