Thursday, December 23, 2010

చక్కిలాలు, జంతికలోయ్..




ధనుర్మాసం చలి దంచేస్తోంది. ఈ చలిలో కరకరలాడుతూ చక్కిలాలు తింటూ, టీవీయో, నెట్టో, పుస్తకమో పట్టుకుంటే ఎంత బావుంటుంది? వర్షంలో పకోడీలూ, ఎండకు చల్లటి మజ్జిగా, చలికి కరకరలాడే చక్కిలాలూ ఊహించని జీవితం జీవితమేనా?

నా ఊహ మటుకు ఈ రోజు నిజమయినది. పెళ్ళిళ్ళ సీజను కాబట్టి ఈ మధ్య నాకు ఓ పెళ్ళి తాలూకు కైమురుకులు/చక్కిలాలు దొరికాయ్. ఆ చక్కిలాలు లాగిస్తూంటే, ఇదుగో ఈ టపా తట్టింది. క్రితం ఏడాది ధనుర్మాసం ఇలానే పులిహోర మీద నోరు, చేయి చేసుకున్నాను, కాబట్టి ఇప్పుడు చక్కిలాల మీదపడ్డానికి అభ్యంతరం లేదనిపించి రాస్తున్నాను.

చక్కిలాలు - వీటిని కొన్నిచోట్ల మురుకులు అంటారు. జంతికలు అని కొందరంటారేమో కానీ నాకు తెలిసి జంతికలు అంటే గుండ్రంగా ఉండక, చుట్లు చుట్లుగా ఉన్నవి. చక్కిలాలు, జంతికలు, మురుకులు, పాలకాయలు, నిప్పట్లు, చేగోడీలు ఏవైతేనేం? అన్నీ ఒకే కుటుంబానికి చెందినవి. "యుష్మాకం సహకుటుంబానాం భక్షణ సమయే సముచిత స్థాన ప్రాప్తిరస్తు!"

ఇవి తిండిలో అజాతశత్రువులు. ఇవి నచ్చని వాడెవడూ ఉండడు. అయినా - అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా - అందరూ గారెలూ, బూరెలూ, బొబ్బట్లూ తలుచుకుంటారు కానీ వీటిని తలుచుకునే నాథుడు లేడు. చివరికి ’వివాహభోజనంబు..’ లో కూడా పింగళి వారు "ఔరౌర గారెలల్ల, ఒహ్హోరె బూరెలిల్ల..ఇవెల్ల నాకె చెల్ల" అంటూ చక్కిలం ఫ్యామిలీలో పెద్ద అయిన గారెలని తలుచుకున్నాడు కానీ చక్కిలాలకు సముచిత స్థానం ఇవ్వలేదు. చివరికి మన దేవాలయాల్లో కూడా చక్కిలానికి వివక్షత. ఏ దేవుడూ చక్కిలాన్ని ప్రసాదంగా తీసుకోడు (నాకు తెలిసినంత వరకు). పెళ్ళిళ్ళప్పుడు మాత్రం తగుదునమ్మా అని పెద్దపెద్ద గుండ్రాలుగా తీర్చిదిద్ది, పెళ్ళి తంతులో కూర్చోబెడతారు. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.

నా చిన్నతనంలో సెలవులకు మా పిన్ని ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్కడ మాకు చక్కిలాలు భలే దొరికేవి. వాళ్ళింట్లో ఓ పెద్ద డబ్బా, అందులో నిత్యాగ్నిహోత్రంలా నిరతమూ లభ్యమయే చిరుతిండి. ఆ పెద్ద బాక్సు సగానికి వచ్చినప్పుడల్లా తిరిగి నిండుతుండేది, అక్షయ తూణీరంలా, అక్షయఖండనఖాద్యపేటిక అని చెప్పుకోవచ్చు. అవి తింటూ టీవీ చూసుకుంటూ అలా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ సెలవులను అలవోకగా గడిపేసే వాళ్ళం.

మా ఊళ్ళో శ్రీకంఠం అని ఓ సినిమా థియేటర్ ఉంది. అక్కడ వచ్చే సినిమాలేమో గానీ అక్కడ ఇంటర్వెల్ లో దొరికే చక్కిలాలు మాత్రం నా చిన్నతనంలో ఫేమసు. నాకు చక్కిలాల పిచ్చి కాస్త ఎక్కువే అప్పట్లో. ఎనిమిదవ తరగతిలోననుకుంటాను ఓ మారు చిరంజీవి సినిమాకు టికెట్లు దొరక్క నిరాశతో ఇంటికి తిరిగి రాబుద్ధి పుట్టక ఏ సినిమా ఐతే ఏముందని ఈ సినిమా థియేటర్కు వెళ్ళాము నేనూ నా ఫ్రెండూనూ. సినిమా పోస్టర్ చూడలేదు. ఏదో డబ్బింగ్ సినిమా. సినిమా చూశాము, ఇంటర్వెల్ లో చక్కిలాలు, కలర్ సోడా కూడా లాగించాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అడిగారు ఏరా సినిమా బావుందా ఎలా ఉంది. జరిగింది చెప్పాను నేను. చిన్న సైజు బడితె పూజ చేశారు. నేనేం పాపమూ ఎరుగకపోయినా బడితె పూజ! ఎందుకంటే - ఆ సినిమా మలయాళ చిత్రరాజమట. నాకూ నా స్నేహితునికి బూతు అ(క)నిపించలేదు, సకుటుంబ సమేతంగా చూడవచ్చు ఆ సినిమాని. ఎవడో డాక్టరు వచ్చిన వాళ్ళకు ఏదో చెబుతుంటాడు. అదీ ఆ సినిమా కథ. అలా చక్కిలాల కోసం చెయ్యని పాపానికి దెబ్బలు తిన్నాం.

ఇదివరకెప్పుడో నా బ్లాగులో ఇడ్లీల గురించి ఓ మాటనుకున్నప్పుడు ఇడ్లీలు ఇండోనేషియా నుండి వచ్చాయని మనసు విరిచేశారు పరుచూరి శ్రీనివాస్ గారు. చక్కిలం మటుకూ భారతదేశ వంటకమని నా వాదన. సంస్కృతంలో చక్కిలాలను "శష్కులీ" అంటారు. (శష్కులీ ప్రకృతి - చక్కిలి వికృతి కాబోలు). ఈ శష్కులీ గురించి ఓ శ్లోకం ఈ రోజే నా కళ్ళబడింది.

నృపమాన సమిష్టమానసస్సనిమిజ్జత్కుతు కామృతోర్మిషు |
అవలంబిత కర్ణశష్కులీ కలశీకం రచయన్నవోచత ||

ఇష్టమానసః = ప్రియమైన మానస సరస్సుగల
సః = ఆ రాజహంస
కుతుకామృతోర్మిషు = సంతోషామృత లహరులలో
నిమజ్జత్ = మునిగిన
నృపమానసం = నలుని చిత్తమును
అవలంబిత కర్ణశష్కులీ = పట్టుకొనబడిన చక్కిలము వంటి చెవులనెడి
కలశీకం = కలశములు కలదిగా
రచయన్ = చేయుచూ
అవోచత = పలికెను

కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నా అర్థం ఇదీ.
మానస సరోవరం లో తిరిగే రాజహంస సంతోషాంతరంగ లహరులలో ఓలలాడే నలుని చక్కిలాలవంటిచెవులను కలశములచే నిలబెట్టి (సావధానచిత్తునిగా చేసి) చెప్పసాగింది.

చక్కిలాలవంటి చెవులను కలశాలుగా చేయడం - ఈ మాటకు అర్థం ఇంచుమించుగా ఇది. నదిలో మునిగేవాడికి ఖాళీ బిందె దొరికితే దాని సహాయంతో (మునక్కుందా పైకి పట్టుకుని) ఎలా వస్తాడో అలా సంతోష తరంగాల్లో మునిగిన నలునికి చెవులనే కలశాలు దొరికాయిట. ఆ చెవులు చక్కిలాల్లా ఉన్నాయిష!

కర్ణశష్కులీ - ఉపమాలంకారము.

పై శ్లోకం నైషధీయచరితంలో రెండవ ఆశ్వాసంలోనిది. రచయిత శ్రీహర్షుడు. ఈయన పదవ శతాబ్దపు ఆసుపాసుల్లోనివాడనుకుంటాను కాబట్టి మనం చక్కిలం భారతీయమైనదని ఒప్పేసుకుకోవచ్చు అనుకుంటాను. చక్కిలాల రుచిచూసేనేమో ఆయన "ఖండనఖండఖాద్యం" అన్న ఓ తర్కగ్రంథం వ్రాశాడు. ఆ మాటకర్థం - ఖండనం అనబడే చిరుతిండి. ఇది అద్వైత వాదం సమర్థించే ప్రౌఢగ్రంథం.

తెలుగులో జంతికల గురించి వేమన ఓ పద్యం చెప్పాడు.

తమకుఁ గలుగుపెక్కుతప్పు లటుండఁగా
నొరుల నేరమెంచు టొప్పు గాదు
చక్కిలంబు విడిచి జంతిక లేరుటా?
విశ్వదాభిరామ వినుర వేమ.

Monday, November 29, 2010

అట్లాస్ సైకిలు షేక్షావలి

"తొందరగా మమ్ము తినేసెయ్యవే. బుడబుడకలాయప్ప వత్తాడు. సంచీలో పిల్లల్నేసుకుని తీసకపోతాడంట."
పాపతో తిండి తినిపించడానికి నానాపాట్లూ పడుతోంది వాళ్ళమ్మ అనబడు మా శ్రీమతి.కానీ అది (పాప) ముదురుది. వినేరకమా?
"ఎల్లిపోయినాడు కదా. మల్లీ రాడు." డిక్లేర్ చేసింది.
"ఫోను చేస్తానుండు. హలో..ఆ..రాప్పా. ఇక్కడ పాప మమ్ము తినకోకుండ సతాయిస్తా ఉంది." ఈ ఎఫెక్టు కాస్త పనిచేసింది. మమ్ము తినమన్న అభ్యర్థనను ఈ సారికి కన్సిడర్ చేసింది పాప.సెల్లుఫోను ఎఫెక్టు!

లైఫులో మంచివాడు, చెడ్డవాడు అని బోర్డుపెట్టుకుని ఎవరూ ఉండరు. ఇది పెద్ద రాకెట్ సైన్సు గాదు. ఏడవతరగతి పిలాసఫీ, అందరికీ తెలిసిందే. మన లైఫులో ఊహ తెలిసీ తెలియని తరుణంలో మొట్టమొదట తగిలే నెగటివ్ లుకింగు పాజిటివ్ కారక్టరు "బూచి". ఈ బూచి అనబడు విలన్, పైకి విలన్ గా కనబడుతూ కొన్ని కొన్ని ప్రయోజనాలు చేకూరుస్తుంటాడు. పిల్లలు మారాం చేస్తే బెదిరించి దారికి తేవడం, అన్నం తినిపించడం, బుద్దిగా చెప్పినమాట వినేట్టు చేయడం ..ఇలాగన్నమాట. బుడబుడకల వాడు, వీధిచివర పెద్దపెద్ద అంగలేసుకుంటూ వెళ్ళే బుర్రమీసాల పోలీసెంకటసామి, వెనకింటి సూర్యకాంతమ్మత్తా, వేపమండలతో ఇంటి ముంగట వచ్చే నాంచారమ్మా వగైరా వగైరా ఈ కోవలోకి చెందినవాళ్ళు.

నాకూ ఊహ అన్నది మొగ్గతొడుగుతూ బుద్ధి వికసిస్తున్న రోజుల్లో నా పాలిట ఓ బూచి ఉండేవాడు. ఆ బూచి పేరు - షేక్షావలి.

********************************************************************************

"హుర్ర్." కాళ్ళతో నేలను చరిచి నన్ను చూస్తూ ఒక్కసారిగా గదిమేడు గడ్డమూ, మీసాలతో ఉన్న ఆసామీ.
"అమ్మా" అక్కడి నుండి పరిగెత్తాను ఐదారేళ్ళ నేను.
మా అమ్మా, నాన్నతో బాటూ పక్కన నిలబడ్డ మా నాన్న మిత్రులు - తెలుగు మాస్టారు (స్వర్గీయ శ్రీమాన్ పుట్లూరు శ్రీనివాసాచార్యులు గారు) ఫక్కున నవ్వేశారు.
మరుసటి రోజు పట్టుదలగా నేను అతణ్ణి ఎదుర్కున్నాను.
"హుర్ర్.." బయపడలేదు.
"హెక్.." ఊహూ..
చేతులు రెండూ మడిచాడు షేక్షావలి. బెల్టు మీదకు చేయిపోనిచ్చాడు.
"హుప్" అంటూ నా వద్దకు పరిగెత్తి వస్తున్నట్టు ఓ అడుగు ముందుకేశాడు.
"అమ్మో!"...

మా నాన్న మిత్రుడు షేక్షావలి ఓ అట్లాసు సైకిల్ లో మా ఇంటికెప్పుడైనా వచ్చేవాడు. ఆ సైకిలుకు ప్రత్యేకత ఏమిటంటే, వెనుక క్యారేజి, క్యారేజిలో కూర్చుంటే కాళ్ళు పెట్టుకోవడానికి ఇరువైపులా రెండు ఫుట్ బోర్డులు. అవి సరిగ్గా చిన్నపిల్లలకు కాళ్ళకు అందేలా అమరి ఉండేవి. సైకిలుకు ముందున్న బారు మీద ఓ చిన్నసైజు సీటు ఉండేది. గడ్డం, చైనా మీసాలు, చేతుల దగ్గర రెండుమడతలు పైకి మడిచిన ఫుల్ షర్టూ, ఇన్ చేసి బెల్టు బిగించిన నేరో పాంటూ, నోట్లో సిగరెట్టూ, అప్పుడప్పుడూ పెద్దనల్లకళ్ళజోడు, మరెప్పుడైనా తెల్లగా గళ్ళుగళ్ళుగా ఉన్న ముసల్మాను టోపీ, చక్కగా నూనెపట్టించి దువ్విన జుట్టూ, నన్ను చూస్తే ఆటపట్టించాలన్నట్టుగా చూసే నవ్వు.

ఆ రోజుల్లో సినిమా వస్తే ఓ ఎద్దుల బండికి లేదా రిక్షాకు సినిమా వాల్పోస్టరు తగిలించి మైకులో పాటలు పెడుతూ, మధ్యమధ్యలో అనౌన్సు చేస్తూ తిరిగే వాళ్ళు. ఆ బండి దగ్గరకు వెళితే ఓ పాంప్లేటో, పాటలపుస్తకమో ఏదో ఇచ్చేవాళ్ళు. అది కూడా పెద్దలకే. పిల్లవాళ్ళు ఆ పేపరు సంపాదించాలంటే చిన్నసైజులో సామదానభేద దండోపాయాలు ఉపయోగించాలి. ఓ మారు నేను ఆ బండి వెనకాతలే పాటలు వినుకుంటూ, ఆ పాంప్లేట్ సంపాదించి, రసానుభూతి చెందుతూ వెళ్ళిపోతుంటే, షేక్షావళి ఆ రసానుభూతికి అడ్డుపడి, నన్ను సైకిల్లో ఇంటికి తీసుకొచ్చి దింపేడట. దింపడమే కాకుండా మా ఇంట్లోవాళ్ళకు నా గురించి హెచ్చరించాడుట, మీ వాడికి సినిమా బండ్ల వెనుకలే నడుచుకుంటూ థియేటర్ వరకూ వెళ్ళిపోయే సిండ్రోమ్ ఉంది, జర భద్రం అని. (ఈ కథంతా నాకు గుర్తు లేదు. మా పెద్దలు నా చిన్ననాటి సంగతులు నెమరు వేసుకుంటుంటే తెలిసింది).

ఆతని సైకిలు ఎక్కాలని నా ఆశ. ఓ రోజు స్టాండు వేసి ఉన్న సైకిలు ఎక్కి కూర్చుంటే మా అమ్మ తిట్టినట్టు లీలగా గుర్తు. అయితే అమ్మకు నచ్చజెప్పి అతనే ఎక్కించుకుని రెండు రౌండ్లు తిప్పి తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటిదగ్గర టీ కలిపి ఇచ్చారు నాకు. నాకు అప్పటికి బయట ఎవరి ఇంటికి వెళ్ళిన అనుభవం లేదు. వాళ్ళింట్లో టీ తాగాలా వద్దా తెలియదు. ఆ మాట చెబితే ఈయనేమంటాడో తెలియదు. సరే టీ తాగేశాను. ఇంట్లో తాతయ్య దగ్గర - షేక్షావలి ఇంట్లో టీ తాగానని చెబితే, ఆయన నవ్వేశాడు. "ఏమైనా తిన్నావా, లేదు కదా. ఏమీ కాదులే" అన్నాడు. ఆయన భయం కేవలం నేను నాన్ వెజ్జు తెలియకుండా తినేస్తానేమోనని.

ఇంటికి వెళ్ళాను కదాని అతను గుర్రుపెట్టటం, భయపెట్టటం మానలే. అన్నయ్య అన్నయ్యే, పేకాట పేకాటే!

షేక్షావలికి మా తాతయ్య అంటే గురి అనుకుంటాను. మహమ్మదీయుడైనా తనకు కొడుకు పుడితే మా తాత వద్దకు భార్యను, బిడ్డను తీసుకువచ్చి ఆశీర్వదించమని అడిగాడన్నట్టు లీలగా నాకు జ్ఞాపకం.

తను బహుశా రైల్వేలో పనిచేసేవాడనుకుంటాను.షేక్షావలికి ఆ తరువాత ఎక్కడికో ట్రాన్స్ ఫర్ అయింది. చాలా యేళ్ళయ్యాయి.

కాలేజిలో చదువుకుంటున్న రోజుల్లో, ఓ రోజు.. ఏదో షాపుముందు నిలబడి ఉన్నాను. పక్కన లూనా దగ్గర ఓ అసామీ సిగరెట్ తాగుతున్నాడు. అతణ్ణే చూస్తున్నాను నేను. అతను నన్ను రెండు మూడు సార్లు గమనించాడు. ఆ తర్వాత నెమ్మదిగా నవ్వుముఖంతో నన్ను సమీపించాడు. మనిషి ఏ మాత్రం మారలేదు. చెవుల దగ్గర జుత్తు కాస్త తెల్లబడిందంతే."హు.." అన్నాడు, నవ్వుతూ. నవ్వేశాను నేను. ఆ తర్వాత పలుకరింపులు, కుశలప్రశ్నలూ అయాయి. మా తాత గురించి ప్రత్యేకంగా అడిగేడు షేక్షావలి. ఆయన స్వర్గస్తులై మూడు, నాలుగేళ్ళయిందని చెప్పాను. "బాబూ! హమ్ ముసల్మాన్ హై, ఫిర్ భీ హమ్ ఆప్ కా దాదాజీకో బహుత్ మాన్ తేహై. ఆప్ బోల్ తే హైనా, సన్యాసి, సన్త్..ఐసాహీ వో. .." ఇలా చెప్పుకొచ్చాడు.

మతం అన్న బూచి ఎదుటివ్యక్తిని ఇబ్బందిపెట్టి జీవితాలకి అడ్డురానంతవరకూ ఏ మతమైతేనేం? సమ్మతమేగా! ఆత్మీయతలు, అనుబంధాలు వీటి ప్రస్తావన వచ్చినప్పుడు మతం దారి మతంది, మనిషి దారి మనిషిది.అన్నయ్య అన్నయ్యే, పేకాట పేకాటే!

మనిషులు మనకు రకరకాల స్టేజుల్లో తగులుతుంటారు, విడిపోతుంటారు. అందరినీ గుర్తుపెట్టుకోవడం మనిషి బుద్ధికి సాధ్యపడదు. అయినా పర్లేదు. జీవితం నాటకరంగం. పాత్రధారులు ఆయా పాత్రలను పోషించింతర్వాత స్టేజు దిగి పోతుండాలి. అప్పుడే నాటకానికి అందము.చందమూ!