Saturday, April 24, 2010

పద్యాలతో నా కసరత్తు!

పొద్దు వారి ఉగాది కవిసమ్మేళనానికి రమ్మని కొత్తపాళీ గారి పిలుపు రూపంలో పొరబాటున నాకో వేగొచ్చింది. నాకు ఏదీ రాకపోయినా (అది నేను చెబుతున్నా), ప్రజలు కొన్ని ఊహల్లో జీవిస్తున్నారని నాకు అ(క)నిపిస్తూనే ఉంటుంది. సరే, భరించే వాళ్ళున్నారు కదాని కొన్ని పూరణలు ప్రయత్నించేను. దాదాపు అన్నీ తప్పులతడకలే. వాటినన్నిటినీ పుల్లెల శ్యాం గారు ఓపికగా సరిదిద్దారు. అలానే కొత్తపాళీ గారు, ఆయన , బిగుసుకు పోవద్దని కొత్త ధైర్యాన్నిచ్చారు. వీరందరి ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో నేను ప్రయత్నించిన పద్యాలు ఇక్కడ. (ఇవి పొద్దులో ప్రచురింపబడలేదు).

నపుంసకమితి ఙ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మన:
తత్తు తత్రైవ రమతే హతా: పాణినా వయం ||

ఆ పద్య తాత్పర్యం : సంస్కృతంలో ’మనస్’ శబ్దం నపుంసకలింగం. నపుంసకం కదా అని మనస్సును ప్రియురాల వద్దకు పంపితే అది అక్కడే చిక్కుకుని ఆనందిస్తోంది. పాణినీ, నీ(వ్యాకరణం)చేత హతులయ్యామే!

అనువాదం:
షండమది ఉలుకదటంచు సంతసమున
పంపితి మనమును పొలతి పంచకునది
ఇంపుగ యచటే చిక్కి రమింపు రీతి
హన్త! పాణిని నన్ను నిహతుని జేసె!

("హన్త" వెనుక చిన్న కథ. హన్త (హర్షే2నుకమ్పాయాం వాక్యారంభ విషాదయోః) అని అమరం. సంతోషానికి, దయకు, దుఃఖానికి ఈ పదప్రయోగం చేస్తారట. వాక్యారంభంలో చేయాలిట. ఈ పూరణ వేగులో చూసినప్పుడు రాఘవ గారు కాస్త నవ్వుకున్నట్టు గుర్తు)

పొద్దున లెగచిన మొదలు యెద్దుల వలె
పని సలుపుచు వేళకు ఇంత తిని యెరుగని
శుష్క నగరపు జీవులు సుంత పంచ
దారను విడనాడ సుఖము తథ్యమగును

ధీటగు హీరో ’చిరు’కున్
నోటిచ్చు బాబుకునసలు నోనో అంటూ
ధాటిగ హస్తము కేలన
ఓటది నా ఇష్టమనుచు ఓటరు పలికెన్

భాసురమౌ రుక్మిణి భా
మా, సురపతికిం, గుమరుడు మదనుండు సునా
యాసముగ యుద్ధమున బా
ణాసురుఁ గేళీ విధమున నాశము జేసెన్!

ఐసు (eyes) వైడు జేసి ఐప్యాడుఁ గొనిదెచ్చి
ముదము మీర దాని ముందు జేరి
సరస సల్లపనము నెరపంగ, హతవిధీ!
పేరు గొప్ప కాని ఊరు దిబ్బ.

వసతిగ పెళ్ళిఁ చేసుకుని వాసిగ శోభనరాత్రి వేళలో
కుసుమములెల్ల జిత్తమున కోరికలై మురిపాలు గ్రోలగా
కిసలయ సౌకుమార్యమున క్రీగనులన్ నళినాక్షి చూడగా
ముసలము బుట్టదే మదిని? పూశరుఁ బాణము వాడియే సుమీ!

విధేయుడు,
రవి.

Wednesday, March 24, 2010

ప్రపంచం చాలా చిన్నది

కొన్నేళ్ళ క్రితం, నా జీవితంలో వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన ఓ రెండు సంఘటనలు.

మొదటిది.

ఓ ప్రాజెక్టు నిమిత్తమై ఇండోనేషియా కు వెళ్ళాను. అక్కడ నా పనిలో భాగంగా ఓ కొరియన్ మార్కెటింగు మేనేజరుతో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఉంటుందా, ఊడుతుందా అన్న ప్రాజెక్టు అదృష్టవశాత్తూ, అనుకున్నదానికన్నా బాగా వచ్చి, విజయవంతమయింది. ఆ మానేజరు మాతో చాలా ఆప్యాయంగా వ్యవహరించేవాడు. (కొరియా వాళ్ళు పని తప్ప మిగిలిన విషయాలు మామూలుగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా, వారి ప్రవర్తనలో diplomacy తప్ప అప్యాయత ఉండదు) చివరి రోజు ఆ కొరియా ఆయన మాకు ఓ పార్టీ ఇచ్చాడు. పార్టీలో ముచ్చటిస్తూ, ఆయన ఓ వింత కథ చెప్పాడు. ఆ విషయం కొరియా సంస్కృతికి సంబంధించిన చిన్న అంశం.


వందల సంవత్సరాల క్రితం భారతదేశం, అయోధ్యానగరానికి చెందిన ఓ రాకుమారి, పడవలో సువర్ణద్వీపానికి బయలుదేరింది. ప్రయాణం మధ్యలో తుఫాను రావడంతో, పడవ తలక్రిందులయింది. ఆమె దొరికిన ఓ చెక్కముక్కను పట్టుకుని ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుంది. అలా ఆమె ఓ తీరం చేరుకుంది. అది కొరియా దేశంలోని తీరం. అక్కడ ఆమెను ఎవరో రక్షించి, రాజు గారికి తెలిపారు. రాజు ఆమెను చేరదీసి, ఆమెకు ఏ లోటు రానివ్వకుండా, ఘనంగా చూసుకున్నాడు. ఆ రాజుకు, ఆ దేశ ప్రజల అభిమానానికి మెచ్చి, ఆ రాకుమారి, అతణ్ణే పెళ్ళాడి, అక్కడే స్థిరపడిపోయింది. ఆమెకు, ఆ రాజుకు పుట్టిన వంశం "కిమ్" అన్న పేరుతో పిలువబడ్డారు. (కొరియాలో అడుగుకు ఓ పదిమంది "కిమ్" లు, ఓ ఐదు మంది "లీ" లు, మరో మూడు మంది "పార్క్" లు తారసపడతారు. అయితే అందరు "కిమ్" లు ఆ రాకుమారి వంశస్థులు కారు. ఏదో ఒక్క "కిమ్" వారు మాత్రమే ఆ రాకుమారి వారసులు). రాకుమారి, ఆ దేశపు రాణి గారు కదా! రాణి గారిది భారతదేశం కాబట్టి, భారతీయులను "cousins" అన్నదమ్ముల్లా భావించమని రాజు ఆజ్ఞ జారీచేశారు. అప్పటి కథ ప్రకారం కొరియనులు, భారతీయులు, సహోదరులు అని ఓ భావన.


మాకు పార్టీ ఇచ్చినాయన పేరు మీరు ఊహించగలరనుకుంటాను.

ఇంతా చెప్పి, ఆయన ఓ చిన్న ట్విస్టు ఇచ్చాడు. అయోధ్య అనే నగరం ఒకటి థాయిలాండులో ఉన్నదట. ఆ రాకుమారి థాయిలాండు దేశానికి కూడా చెందినది అయి ఉండవచ్చు అని ఓ మెలిక పెట్టాడు. అయితే మాపట్ల అతడి ప్రవర్తన, అతడిమనసును మాకు చెప్పకనే చెప్పేది

*******************************************************************

ఇంకో కథ.


ఈ సారి మరో ప్రాజెక్టు, మరో దేశం, యెమెన్.

ఈ సారి మార్కెటింగ్ అధికారి పేరు అహ్మద్. ఆ దేశస్థుడే. యువకుడు, అందగాడు, పనిరాక్షసుడు, పనిలో ఏ చిన్న పొరబాటూ సహించనివాడూ. ఈతడితో కలిసి పనిచేసేప్పుడు ఆసక్తికరమైన విషయాలు చెప్పేవాడు.

నేను యెమెన్ లో ఉన్నప్పుడు మా ఆవిడకు నాలుగో నెల.


ఈ యెమెన్ లో తిండి విషయంలో మాకు ఏ లోటూ రాలేదు. నేనూ, నా మిత్రుడూ, శాకాహారులమైనా, అక్కడ మాకు మంచి రుచికరమైన చపాతీలు, రోటీలు (భట్టీలో గోడలకు తాపించి తయారు చేసినవి), కూర (ముషక్కల్ ఆధి (అరబ్బీ) - శాకాహారపు కూర) దొరికేది. బయట కిరాణా కొట్లలో కూడా చపాతీలు దొరికేవి. ఒక చపాతీ భారతదేశ రూపాయల్లో ఒక రూపాయి. ఓ రోజెందుకో మా ఆవిడ యెమెన్ నుండీ వస్తూ ఆ చపాతీలు పట్టుకు రమ్మని చెప్పింది. ఈ విషయం నేను అహ్మద్ కు మాటవరసకు చెబితే, తనన్నాడు. గర్భవతుల కోరిక ఎటువంటిదైనా నెరవేర్చాలి. అతడికో చెల్లి. ఆమె చూలాలుగా ఉన్నప్పుడు, ఓ రోజు పుచ్చకాయ (కళింగడి) తినాలనుందని కోరిందట, అహ్మద్ ను. అప్పుడు ఆ ఫలాల సీజన్ కాదు. అయినప్పటికీ ఈ అబ్బాయి ఎక్కడెక్కడో వెతికి ఏవో తిప్పలు పడి ప్రయత్నాలు చేశాడుట. చివరికి పుచ్చకాయ దొరకలేదట. ఆ తర్వాత అహ్మద్ చెల్లెలికి ఓ పాపాయి పుట్టిందట. ఆ పాపాయి కడుపు మీద కాస్త ముదురు రంగు చార, ఆ చార మీద అక్కడక్కడా నల్లటి చుక్కలు. (పుచ్చకాయ రూపులో) ఈ ఉదంతం చెప్పి, చివర్లో అహ్మద్ "గర్భవతులకు రెండు హృదయాలు ఉంటాయి. ఒకటి తనది, రెండవది కడుపులో పెరుగుతున్న పాపాయిది" అంటూ ముక్తాయించాడు.


ఆ తర్వాత కొన్ని నెలలకు రఘువంశకావ్యం చదువుతుంటే, అందులో "దౌహృదా" అన్న ప్రయోగం చూశాను. దిలీపుడి భార్య సుదక్షిణా దేవి గర్భవతి అయినప్పటి సన్నివేశంలో. "దౌహృదా" అంటే - రెండు హృదయాలు కలది అని అర్థం.

ఎక్కడి అరబ్బు? ఎక్కడి భారతదేశం?


(ఇంతకూ నా విషయం ఏమైందంటే, నేను ఆ చపాతీలు పట్టుకు రాలేదు, మా ఆవిడకోసం. మా పాపాయికి చారలవీ రాలేదు కానీ.....ఈ క్రింద బొమ్మ చూడండి.
.....అదీ కథ. దానికి చపాతీల పీట, అప్పడాలకర్ర చూస్తే, ఆవేశం ఆగదు.)

ఓ చిన్న విషయం చెప్పి ముక్తాయిస్తాను. ప్రపంచంలో మనిషికి మనిషికి మధ్య, భాష, సంస్కృతి, సంప్రదాయము, రంగు, మతం ఇలాంటివాటికి అతీతంగా ఏదో రకమైన అనుబంధం ఉందని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటూంది. (It may sound sentimental & romantic, but it gets revealed to us few times magically) దీనికి దృష్టాంతాలు మనం వెతికి చూస్తే కనబడుతూనే ఉంటాయి.