సూడాను విమానం దాదాపు ఖాళీ గా ఉంది. ఉన్న కొద్ది మంది భారతీయులు ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళవటం వల్ల, కీసర బాసర గా గోల చేస్తున్నారు. వాళ్ళు మలయాళీలని వేరే చెప్పాలా?
సూడాను విమానాశ్రయం కు వచ్చి పడ్డాము. సాయంత్రం 4:30 గంటలు దాదాపు.అక్కడ ఇమ్మిగ్రేషన్ కవుంటరు దగ్గర నిలబడి ఉన్నాము. ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు ఎవరు లేరక్కడ. ఓ అరగంట టెన్షన్ గా గడిచింది. ఆ తర్వాత నల్లగా పొడుగ్గా ఉన్న ఒకతను మా వద్దకు వచ్చి, మా పాస్ పోర్ట్లను దాదాపు గుంజుకున్నంత పని చేశాడు. గంగిరెద్దు మెడ లో గలగంటలా, అతని మెడ నుండీ వేల్లాడుతున్న ఐ డీ కార్డును ఎవరూ చూడలేదు, నేను తప్ప. అతణ్ణి మేము ఎవరని విచారించే లోపల, ఇప్పుడే వస్తానంటూ ఎటో మాయమయాడు!
మా వాళ్ళు టెన్షన్ తో సినిమాల్లో గుండె పోటు వచ్చే ముందు గుమ్మడిలా తయారయ్యారు. షమీరు అయితే, పోలీసు కంప్లయింట్ ఇద్దామని మొదలెట్టాడు. నేను తన మెడలో మా కంపనీ కార్డు చూట్టం వల్ల నాకు కాసేపు అర్థం అవలేదు, జనాలెందుకు టెన్షన్ గా ఉన్నారో.
సరే, ఎలాగయితేనేం, ఆ నల్లనయ్య తిరిగి వచ్చేడు. అక్కడ ఉన్న ఇమ్మిగ్రేషన్ వాళ్ళతో ఏదో చెప్పి, బయటకు తీస్కెళ్ళాడు. అక్కడ స్కానింగ్ మిషను నడపడానికి ఎవరు లేరు. ఆ మిషను తనే ఆన్ చేసుకుని, ఆ పని అయిందనిపించాడు. సూడాన్ లో అడుగుపెట్టాం.
ఆ వచ్చిన వాడు అజ్ గర్. (అజగరం అంటే పాము అని అర్థం ట). తను అక్కడ మాకు సంబంధించిన కంపనీ లో ఫెసిలిటీస్ మేనేజరు. సూడాన్ లో బయట సంస్థలు స్వయంగా వచ్చి వ్యాపారం చేయడానికి వీల్లేదు. అక్కడ కంపనీ తో పొత్తు పెట్టుకోవడం తప్పనిసరి.
ఇంకో విషయం. ప్రపంచం లో అత్యంత లంచగొండి దేశాల చిట్టాలో మొదటి పదిలో సూడాను ఒకటి (ఎప్పుడో చదివినది). అందులో మన దేశం లేకపోవడానికి, మన వాళ్ళు ఆ చిట్టా తయారు చేసిన సంస్థకు ఎంతో కొంత కట్టబెట్టి ఉంటారని నా ఊహ.
విమానాశ్రయం బయట మా కోసం "బోక్సు" ఎదురు చూస్తోంది. బోక్సు అంటే, కారు కు ఎక్కువ, మెటడోర్ కి తక్కువ. ఓ చిన్న కారుకు, లారీకు వెనుక సైడు లగేజ్ వేయడానికి ఉంచినట్టు, ఓపన్ గా తెరిచి ఉంచారు. కారులో ముగ్గురు మాత్రమే కూర్చోగలరు. మిగిలిన ఇద్దరు కారు వెనుక ట్రాలీలో బయట ప్రకృతి సౌందర్యాన్ని అస్వాదిస్తూ ఊరేగాలి. నేనూ, నితినూ ఆ ఇద్దరం. నాకు చాలా సంతోషమనిపించింది.ఎందుకంటే, ఎప్పుడో కాలేజీ రోజుల్లో వూరి బయట ఉన్న మా కాలేజీ నుండీ వూరికి రావడానికి ఒకట్రెండు సార్లు, బస్సు టాపు పైకి ఎక్కి వచ్చిన రోజులున్నాయి.ఇప్పుడు ఎంతో కాలం తర్వాత అలాంటి అవకాశం !
అన్నట్టు సూడాన్ లో బోక్సు అన్నది ఓ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు. మన ఆటో లాగా.
అజ్ గర్ మమ్మల్ని ఓ అపార్ట్ మెంట్ వద్దకు తీసుకెళ్ళి దింపి, పొద్దున వస్తానని వెళ్ళేడు.
మా ఫ్లాటు లో 2 పడక గదులు, ఓ హాలు, ఓ టాయిలెట్ కం బాత్ రూమ్. అంటే 5 మందికి కలిపి ఒక్కటి! బాత్ రూం లో కాస్త ఫ్రెష్ అవడానికి వెళుతూ, మా కొలీగు నాబ్ ను క్లాక్ వైస్ గా బలంగా తిప్పేడు. అంతే! అది విరిగి చేతికొచ్చింది. అక్కడ మొత్తం మీటలన్ని వ్యతిరేక దిశలో పని చేస్తాయి!! ఉన్న ఒక్క రెస్ట్ రూము, దాని మీట మొదటి రోజు విరగడం. శుభం!!!
మరుసటి రోజు ఉదయం ఆఫీసుకెళ్ళాం. మా పనిలో భాగంగా మేము మా సంస్థ తాలూకు ప్రాడక్టు ను నగరం లో కొన్ని నిర్ణీత ప్రదేశాల్లోనూ, కారులో తిరుగుతూ ఉన్నప్పుడూనూ (రోమింగ్) రకరకాల టెస్ట్ లు జరపాలి. కాబట్టి పొద్దున 10 గంటలకు కారులో బయటపడ్డాం. బయట ఇలా ఉంది.

తుఫాను, గాలి వాన అనుకుంటున్నారా? తుఫానే, కానీ గాలివాన కాదు. అది ఇసుక (దుమ్ము) తుఫాను. ఆ ఫోటో లో కనిపిస్తున్నది దుమ్ము, ధూళి. ఎంత ధూళి అంటే, కూత వేటు దూరంలో ఉన్నవి మనకు కనిపించవు. (ఆ ఫోటోలో ఉన్నది మా కొలీగు). దాన్ని "హబూబ్" అంటారు ఇక్కడ.
(సశేషం)
శ్రీయుతులు గొల్లపూడి మారుతీ రావు గారు కౌముది జాల పత్రికలో జనవరి నుండీ జూలై వరకు ఓ ట్రావెలాగు (టాంజానియా) రాసారు. అత్యద్భుతమైన ట్రావెలాగు అది. అందులో ఆయన టాంజానియా కు ట్రావెలాగు ఏమిటి ఏ అమెరికాకో వెళ్ళక? అన్న అనుమానానికి, ఓ చక్కటి సమాధానం చెబుతారు."సంపద ఎక్కడ చూసినా ఒక్కలాగే ఉంటుంది. ఎక్కువ సార్లు చూస్తే బోరుకొడుతుంది....నేలబారు జీవితం ఆకర్షిస్తుంది. ఆలోచింపచేసేట్లు చేస్తుంది.A master piece is monotonus,while life is not...."
బహుశా అందుకేనేమో అభివృద్ధి చెందిన దేశాలకు వెళితే (కొంతకాలం పాటు), మొదట కొన్ని రోజులు ఆ ఆకర్షణ లో మునిగినా, మనకు మన ఇల్లు, మన వూరు, మన జీవితాలు తిరిగి గుర్తుకొస్తాయి. మేధ గారు కొన్ని నెలల క్రితం కొరియా మీద వరుస టపాలు రాశారు. ప్రతి టపా చివర "జై భారత్" తప్పనిసరి.ఆమెది ఆ రకమైన నొస్టాల్జియానే నేమో?
అయితే, ఉన్నన్ని రోజులు (రెండు నెలలు దాదాపు) కాస్తో కూస్తో మన లాంటి మనుషులు, మన జీవిత విధానానికి దగ్గరగా ఉన్న జీవితంతో, Feel at home అన్నట్టు నాకు అనిపించిన (నేను చూసిన) దేశంసూడాను.************************************
వెంకటేష్ సినిమా "నువ్వు నాకు నచ్చావు" లో చంద్రమోహన్, "మా వాడికి, అదేదో సాఫ్ట్ వేర్ నేర్పించి, అమెరికాకు కాకపోయినా, కనీసం పాకిస్తాన్ అయినా పంపించరా" అంటాడు, ప్రకాష్ రాజ్ తో.ఒకప్పుడు నాకున్న ఏకైక లక్ష్యం కూడా అదే. అయితే బుద్ధి propose చేస్తే, లెగ్గు Dispose చేసిందన్నట్టు, నా భీకరమైన లెగ్గు వల్ల వచ్చిన అవకాశాలు అన్ని ఏవో కారణాల వల్ల తప్పిపొయాయి. రోజులలా గడుస్తుండగా ఓ రోజు నేను పనిచేస్తున్న కంపనీకి ఓ సూడాను ప్రాజెక్ట్ వచ్చింది. ఆన్ సయిట్ కి 5 మంది వెళ్ళాలి. సూడాను కాబట్టి ఎవరు ఆసక్తి చూపకపోవడంతో, 12th మాన్ లా పడి ఉన్న నాకు అవకాశం వచ్చింది. సూడాను అయితేనేం, నా జీవితంలో మొట్టమొదటి విదేశయాత్ర!
అయితే, అనుకున్నంత వీజీగా గడవలేదు. ప్రయాణానికి అడుగడుక్కూ ఆటంకాలే. నన్ను తప్పించి, ఇంకో అమ్మాయికి ఆన్ సయిట్ చాన్స్ కట్టబెట్టాలని బాసురుడి ఊహ (ఎందుకో ఊహించుకోండి). అయితే, ఆ అమ్మాయి అదివరకే ఒకట్రెండు అభివృద్ధి చెందిన దేశాలు తిరిగి ఉండటం వల్లా, పైగా నాకా అమ్మాయి మంచి మిత్రురాలవటం వల్ల, అవకాశం తిరస్కరించింది ఆవిడ.ఆఫీసులో ఇలా ఉంటే, ఇంటి దగ్గర మా నాన్న నా జీవితం పైన కుట్ర పన్ని నాకు పెళ్ళి చేయాలని తీవ్ర ప్రయత్నాలు ఆరంభించాడు. (నాకు పెళ్ళి సుతరాము ఇష్టం లేదు. ఫిలాసఫీ తల నిండా దట్టించుకున్న వాణ్ణి కాబట్టి). ఓ బలహీనమైన క్షణంలో మా నాన్న మాటకు సరే అన్నాను. ఇక అమ్మాయిని చూసారు. (మాకు తెలిసిన అమ్మాయే). పెళ్ళి చూపులు (బలవంతపు బ్రాహ్మణార్థం) ఎపిసోడ్ అయిపోయింది. అప్పుడు సరిగ్గా ఈ ట్రావెలు.ఒడిదుడుకులన్నీ అయిన తర్వాత, ఓ సాదా ముహూర్తంలో (శుభ ముహూర్తం అనడం లేదు. ఆఫ్రికాకు వెళ్ళటానికి ఏ తొక్కలో ముహూర్తమైతేనేం?) బెంగళూరు నుండీ కింగ్ ఫిషర్ విమానంలో ముంబై కి బయలుదేరాం. అక్కడ నుండీ ఖతర్ ఎయిర్ లైన్స్ (ఈ పేరు విన్నప్పుడు ఎందుకో ఎడమ కన్ను అదిరింది నాకు) లో మా ప్రయాణం, సూడాను రాజధాని ఖార్తూమ్ కు. మధ్యలో దోహాలో (ఖతర్ రాజధాని) విమానం మార్పు.*************************************కింగ్ ఫిషర్ విమానంలో చాలామంది క్వీన్ లు. మొట్టమొదట ఏరోప్లేన్ ఎక్కగానే, అదీ కింగ్ ఫిషర్ విమానం, ఓ కొత్త బంగారు లోకం లోకి వచ్చి పడ్డట్టు అనిపించింది. మా జట్టులో మొత్తం 5 మంది. ఆ ఐదుగురిలో నేనూ, మా ఆన్ సయిటు టీం లీడరు నితినూ మట్టి ముఖాలం., పల్లెటూరి సరుకు. నితిన్ నాకంటే ఓ ఆకు ఎక్కువ నమిలాడు. బీహారీ. మిగిలిన ముగ్గురు సివిలైజ్డ్. విమానం ఎక్కగానే మమ్మల్ని ఆహ్వానిస్తూ ఓ అమ్మాయి, చిరునవ్వుతో విష్ చేసింది. "ప్లీజ్ వెల్ కం" అంటూ. మా వాడు బదులుగా, ముఖమంతా నవ్వులు పులుముకుంటూ, "గుడ్ మార్ణింగ్" అన్నాడు. అప్పుడు సమయం సరిగ్గా, రాత్రి 9:30 గంటలు. అలాంటి మరికొన్ని సంఘటనల మధ్య ప్రయాణం ప్రారంభమై, బొంబాయి విమానాశ్రయం వచ్చి పడ్డాం.అక్కడ నాకు ఓ హర్డిల్ ఎదురయింది. సూడాన్ వెళ్ళటానికి మాకు సూడానులో మా కంపనీ తరపు ఆఫీసు నుండీ, అక్కడ ఎంబసీ ఆమోద ముద్ర పొందిన ఓ ఆహ్వాన పత్రం మాత్రమే ఉన్నది. వీసా (స్టాంపు) లేదు మా దగ్గర. నేను నిలబడ్డ క్యూలో ఉన్న వీసా ఆఫీసరు నన్ను ఎగాదిగా చూసాడు. నా పాస్ పోర్ట్ పెళ్ళి శుభలేఖలా కొత్తగా నవనవలాడుతూ ఉంది. నేను వెళ్ళబోయేది సూడాను. వాడికి అనుమానం వచ్చి, ఓ పెద్ద ఇంటర్వ్యూ మొదలెట్టాడు. యెల్లో ఫీవర్ షాట్ చూపించమన్నాడు (ఆఫ్రికా దేశాలకు వెళ్ళాలంటే, యెల్లో ఫీవరు ఇంజక్షను తీసుకోవడం తప్పనిసరి, తీసుకున్నట్టు ఋజువు కూడా చూపించాలి.), ఇంకా కంపనీ పేరు, అక్కడ సూడానులో మా ఆఫీసెక్కడ, ఇలా... నాకు టెన్షను పెరిగిపోసాగింది. మా వాళ్ళందరు ఇమ్మిగ్రేషన్ దాటి నా కోసం చూస్తున్నారు. ఆ ఇమ్మిగ్రేషను వాడు పక్కకెళ్ళి ఇంకో ఆవిడను పిలుచుకొచ్చాడు. ఆవిడ, వాడు మరాఠీలో మాట్లాడుకున్నారు కాసేపు. ఎట్టకేలకు నన్ను ఆమోదించి, పంపించారు అవతలకు.ఆన్ సయిట్ కు బలిపశువుల్లా మా ప్రయాణం మొదలయింది. అన్నట్టు ఖతర్ ఎయిర్ లైన్స్ లోగో - మేక. *************************************
ఎట్టకేలకు విమానం బయలుదేరి, ఖతార్ రాజధాని దోహా లో వచ్చి ఆగింది. దోహా విమానాశ్రయం శుభ్రంగా, విశాలంగా ఉంది. విమానాశ్రయం లో కార్మికులు చాలామంది భారతీయులే. విమానాశ్రయంలో ఓ చోట ప్రపంచ పటం, ఎక్కడెక్కడి నుండీ విమానాలు నడుస్తున్నాయి తదితర వివరాలు సూచించబడ్డాయి.అందులో భారద్దేశం కూడా ఉంది. అయితే భారద్దేశం లో కాశ్మీరులో కొంత భాగాన్ని మాత్రం (ఆ భాగాన్ని ఆ - ఆక్రమిత పేరుతో పిలవడం అంటే మనస్సు చివుక్కుమంటుంది) పాకిస్తానులో కలిపి చూపించారు! అక్కడ విమానం మారి సూడాను రాజధానికి వెళ్ళే విమానం ఎక్కాము. మా ఆన్ సయిట్ యాత్ర మొదలయింది.
(యేడాది క్రితం బ్లాగ్లోకంలో నా మొట్టమొదటి టపా కూడా ఇదే మకుటంతో రాసాను. దానికి కొనసాగింపు ఇది.)
(సశేషం)