అబ్బ! దాదాపు పాతికేళ్ళ క్రితం మొదలెట్టిన పని ఒక్కటి నిన్నటికి పూర్తి అయ్యింది. వేయి పడగలు చదివేశాను!
మాకు చిన్నతనంలో సంస్కృతం చెప్పిన అయ్యవారు విశ్వనాథ వారి శిష్యుడు, భక్తుడు. ఆయన అనువాదం క్లాసులో పాఠాలతో బాటు, మిగతా విషయాలు కూడా చెప్పేవారు. అందులో భాగంగా విశ్వనాథ గురించి చెప్పడమే కాక, ఆయన నవలలు తెఱచిరాజు, వేయిపడగలు, చెలియలి కట్ట వంటి వాటిని తరగతికి తీసుకు వచ్చి కొన్ని భాగాలు మాకు చదివి వినిపించేవారు. తెఱచిరాజులో కత్తియుద్ధవర్ణనా, వేయిపడగల ధర్మారావు గారి ఉపదేశాలు, చెలియలి కట్ట లో కొంతా ఏదో లీలగా జ్ఞాపకం ఉన్నాయి. చెలియలి కట్ట అర్థం కూడా ఆయన ద్వారానే తెలిసింది. ఒక్క సంఘటన మాత్రం జ్ఞాపకపు పొరల్లోంచి మొన్న వెలికి వచ్చింది. " స్త్రీలు మధ్యవయసు వాళ్ళను ఎందుకు పెళ్ళి చేసుకోకూడదు? స్త్రీలు మామూలుగా భోగాసక్తులు, అలా కాకపోతే ఇద్దరు ముగ్గురు భార్యలుండి పిల్లల్లేని దుష్యంతుని శకుంతల ఎందుకు పెళ్ళి చేసుకుంది?" అని ఒకనాడాయన వేయిపడగలలో (18 వ అధ్యాయం) నుండి ఉటంకించారు. నేను ఆయనను ఆక్షేపిస్తూ, "స్త్రీలందరూ భోగాసక్తులైతే మరి సుకన్య చ్యవనుణ్ణి ఎందుకు పెళ్ళి చేసుకుంది?" అని అడిగినట్టు గుర్తు. మా అయ్యవారికది నచ్చలేదు. ఏదో చెప్పారు, గుర్తు లేదు. నాకు మాత్రం విశ్వనాథ, మా అయ్యవారూ ఇద్దరూ అప్పట్లో నచ్చలేదు. ఆ నచ్చకపోవడం - మాకళీదుర్గంలో కుక్క - తో కాస్త బలపడింది. ఆ కథ నా తొమ్మిదవతరగతి పాఠ్యాంశం. ఆ కథా నాకప్పట్లో అర్థం కాలేదు. ఆ శైలీ నచ్చలేదు. (ఇప్పటికీ)
అంతలా ఆయన చెప్పిన వేయిపడగలు చదవాలని అప్పుడు నిశ్చయించుకున్నాను. మా పుస్తకం మా అయ్యవారినడిగితే ఇవ్వలేదు. విశ్వనాథ పుస్తకాలు అందరికీ సరిపోవని, బదులుగా మహీధరనళినీమోహన్ పుస్తకాలు చదవమని చెప్పారాయన.
అయితే వేయిపడగలు చదవాలన్న కుతూహలంతో మా ఊరి లైబ్రరీకి వెళ్ళి కొంచెం కొంచెం చదువుతూ వచ్చాను. అలా ఓ వందపేజీలు మాత్రమే సాగింది. ఇన్నేళ్ళ తర్వాత అది ముగిసింది.
*********************************************************************************
వేయిపడగల గురించి నా అభిప్రాయం
నవలలో ఆంగ్లేయుల దమన నీతిని గురించి వివరణలూ, భారతీయుల ఔన్నత్యప్రదర్శనా, గ్రామస్వరాజ్య విచ్ఛిత్తి వివరణల్లోని సూక్ష్మతా సంచలనాత్మకంగా, అద్భుతంగా ఉన్నాయి. ఒక చోట జేబులు కొట్టుకునే పిల్లవాని ఔన్నత్యం, అతనిలోని భారతీయాత్మ గురించి చెబుతాడు. హృదయం కదిలిపోతుంది. (అలాంటి సంఘటనలు నిజజీవితంలో ఎదురైతే వాటి విలువ తెలుస్తుంది.) కొన్ని కొన్ని సంఘటనలు కరుణరసాత్మకంగా ఉన్నాయి. అదే సమయంలో ఆంగ్లేయులను ఉద్దేశించి సమాధానాలు చెప్పినంత మాత్రాన ఈయన భావాలు సరైనవని ఎందుకు ఒప్పుకోవాలో తెలియలేదు.
ఉదాహరణకు: "మోటారు వాహనానికి పెట్టే డబ్బు ముండకు పెడితే తప్పేంటి? ఒక వేశ్యకు పూటకు తినడానికి తిండి అయినా దొరుకుతుంది." - అంటాడొకచోట. ఇది నవలలో వచ్చే కొందరు వర్ణాధికుల వేశ్యాలంపటకు చవకబారు సమర్థన. ఆంగ్లేయులు లేని కాలంలో వేశ్యాలంపటను రచయిత ఏ రకంగా సమర్థిస్తాడు?

ఇంకా - శూద్రుల దేవాలయ ప్రవేశనిరాకరణకు రచయిత సమర్థనా, దేవదాసీ వ్యవస్థకు glorification, ఆమె పాత్రచుట్టూ చిక్కగా అల్లిన కూటనీతి ఇలాంటివి కాస్తో కూస్తో ఆలోచనాపరులైన పాఠకులకు సహించవు. (తనసిద్ధాంతాలు కరెక్టని నిరూపించడం కోసం విశ్వనాథ సహృదయులు సిగ్గుపడే వాదనలు చేస్తాడు - వల్లంపాటి వెంకటసుబ్బయ్య) ఇక విస్సన్న చెప్పింది వేదమన్నట్టు లెక్చర్లు దంచడం, భిన్నవాదాలు ఇతర పాత్రలతో చెప్పి చర్చించకుండా, తనకు తెలిసింది ధర్మమన్నట్లు హీరో చెబుతూ పోవడం, వింటున్నవాళ్ళు ’బాంచెన్ దొరా’ అన్నట్టు ఊరుకోవడం కృతకంగా, పేలవంగా ఉంటాయి.
విద్యుచ్ఛక్తి మీద విశ్వనాథ విమర్శలు చదివితే రా.రా. మాటలు గుర్తొచ్చి నవ్వొస్తుంది. వీథిదీపాలు రావడం వల్ల ఆ తీగల మీద కూర్చుని కాకులు చచ్చిపోతాయట. అవి రావడం వల్ల ఆడాళ్ళు సాయంకాలం దీపాలు పెట్టరు, అందువల్ల ఇంట్లో మహాలక్ష్మి వెళ్ళిపోతుంది, పైగా ఆముదం అవసరం తీరిపోవడంతో ఆముదం పంట రైతులు మానేసి వరిపంటనే పండిస్తారట!
ఈ రచన విశ్వనాథ స్వీయచరిత్రేనని, నవలలో ధర్మారావు ఈయనేనని, ధర్మారావు, ఆయన మిత్రుల అభిప్రాయాలు, భావజాలం రచయితవేనని స్పష్టంగా తెలుస్తుంది. ఈ నవలను విమర్శిస్తే భావజాలాన్ని విమర్శించనట్లవుతుందో, లేక రచనను మాత్రమే విమర్శించినట్లవుతుందో తెలియదు.
నవల చదివేప్పుడు చాలాసార్లు ఠాగూర్ గుర్తొచ్చాడు. నవల పూర్తి చేసి వెతికితే ఆర్. ఎస్. సుదర్శనం గారు విశ్వనాథను, రవీంద్రనాథుని పోల్చి వ్రాసిన విమర్శ దొరికింది. (1964 భారతి సెప్టెంబరు నెలలో ప్రచురితం) కొన్ని లోపాలున్నప్పటికీ మంచి వ్యాసం. ఈ వ్యాసాన్ని తిరిగి సారస్వత వివేచనలో రా.రా. సమీక్షించాడు. అదీ గొప్పవ్యాసమే.
ఇంకా "కొల్లాయి గట్టితేనేమి" కూడా గుర్తొచ్చింది. కొల్లాయి గట్టితేనేమి, వేయిపడగలు రెండింటి కథాకాలం ఒక్కటే. 1920 లలో సమాజ ప్రభావం కుటుంబం పైనా, సాంప్రదాయవాది అయిన వ్యక్తి మీద ఎలా ఉన్నదో ఒక అగ్రహార నేపథ్యంతో చెప్పిన కథ మొదటిదైతే, అదే కాలంలో సుబ్బన్నపేట అనే ఒక గ్రామ (స్వరాజ్య) విచ్ఛిన్నతను వ్యక్తులజీవిత నేపథ్యాలతో చెప్పిన కథ రెండవది. మొదటిది Evolution. రెండవది Involution. బిగువైన కథనం, చిక్కటి సన్నివేశచిత్రణా మొదటి నవలలో కనిపిస్తే, రెండవదానిలో ఉపదేశధోరణీ, సాంప్రయవాదం, జమీందారీవ్యవస్థాప్రతిష్టాపనాపరాయణత్వం, విస్తృతవిషయసంగ్రహం కనిపిస్తాయి. మొదటి నవల శైలి అనాయాసమూ, సులభమూ. రెండవ నవల శైలి గ్రాంథికం లాంటి వ్యావహారికం, వ్యావహారికం లాంటి గ్రాంథికం. ఈ రెంటిని పోల్చి తులనాత్మకంగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి.
వేయి అరఠావులు, 650 పేజీల ఈ నవలను ఈ రచయిత 29 రాజుల్లో వ్రాశాడట. గొప్పవిషయమే, కానీ అది quantitative assertion అవుతుంది. రచయిత పాండిత్యంకన్నా పాఠకునికి ఒరిగినదేమిటి అనేది సరైన ప్రశ్న. నవలలో విషయవిస్తృతి విషయవివేచనను మింగివేసింది. మొత్తం చదివిన తర్వాత పాఠకునికి ఎన్నో విషయాలు చదివినట్లున్నా అనేక విషయాలపై స్పష్టమైన అభిప్రాయం, అవగాహన ఏర్పడదు.ఎందుకంటే ఈ రచన మేధోనిష్టమైనది.
సాహిత్యం హృదయనిష్టమైనది. పాండిత్యం మేధోనిష్టమైనది. రెండిటికీ తేడా ఠాగూర్ కు, విశ్వనాథకు ఉన్నంత!