సత్యం దానమథాద్రోహ అనృశంస్యం త్రపా ఘృణా
తపశ్చ దృశ్యతే యత్ర స బ్రాహ్మణ ఇతీరితః - (మహాభారతం శాంతిపర్వం)
తపశ్చ దృశ్యతే యత్ర స బ్రాహ్మణ ఇతీరితః - (మహాభారతం శాంతిపర్వం)
ఎవనిలో సత్యము, దానము, ఇతరులకు అపకారం చెయ్యకపోవడం, మృదుత్వం, సిగ్గు (ఎవరేమనుకుంటారో అన్న జంకు), జాలి, తపస్సు ఉంటాయో అతను బ్రాహ్మణుడు.
**********************************************************************************
"రాజమ్మా రెండు ఇడ్లీలు" - రామాశాస్త్రి మా ఇల్లు/హోటలు గుమ్మం దగ్గర వచ్చి అడిగేరు.
"ఇదిగోండి స్వామీ" ఓ పేపరు, ఆ పైన అరటి ఆకు అందులో వేడి వేడి ఇడ్లీలు, పల్చటి చట్నీ మా అమ్మ ఆయనకు అందించింది. పొద్దున 8:30 గంటలవుతోంది. నేను అప్పుడే బడికి వెళ్ళడానికి ఆయత్తమవుతున్నాను. శాస్త్రి గారు, నన్ను చూసి పలకరింపుగా నవ్వారు.
పొద్దున బ్రాహ్మీముహూర్తంలో లేవగానే, మడితో భార్య అందించిన నీటి కడవను దేవళంలోనికి తీసుకువెళ్ళి, అభిషేకం చేసి, రుద్రమూ అదీ చదివి, రోజూవారి పూజలు నిర్వహించిన తరువాత దేవస్థానం పురోహితులు శాస్త్రి గారు మా చిన్న హోటలుకు వచ్చి అప్పుడప్పుడు టిఫిన్ తీసుకుంటుంటారు. శాస్త్రి గారి భార్యగారు (పేరు గుర్తు లేదు) కూడా తర్వాత నిదానంగా మా అమ్మ చేసే ఇడ్లీల కోసం రావడం కద్దు. ఏదైనా పండగ పబ్బం ఉన్న రోజుల్లోనైతే - పూజ అయిపోయి భక్తులకు ప్రసాద వితరణ జరిగింతర్వాత మా ఇంటికి ప్రసాదం పట్టుకొచ్చి ఇచ్చేవారు శాస్త్రిగారు. ఆయన మర్చిపోతే ఆయన భార్య.
శాస్త్రి గారు సన్నగా ఉన్నా, చుఱుకుగా ఉండేవారు. కోలగా మానవల్లి రామకృష్ణకవి గారిలా ముఖవర్ఛస్సు. ఎప్పుడూ అడ్డపంచె, ఉత్తరీయం. షర్టు, పేంటులలో నేనాయన్ను చూసింది లేదు. శాస్త్రి గారి భార్య స్థూలకాయురాలు. కాస్త కష్టంగా నడిచేది. గుండ్రంగా, దయగా ఉన్న ముఖం, నవ్వుతున్న కళ్ళు. నిజానికి మా అమ్మలానే ఉండేది.
మా ఇంట్లో నాకూ, మా అన్నకూ కొబ్బరిపూర్ణం అంటే తెగ ఇది (ఇది = ఇష్టం + ఇంకాస్త). వినాయక చవితి రోజు - మా అమ్మ ఇంట్లో తమిళుల ఇళ్ళలో లాగా కొబ్బరిపూర్ణం బియ్యప్పిండి మధ్యలో పెట్టి ఆవిరి కుడుములు చేసేది. వీటికి తమిళభాషలో "కొఝకట్టై" అని పేరు.(మా అమ్మకు అన్ని దక్షిణభారతదేశ వంటలూ వచ్చు). ఇవి కజ్జికాయలు కావు. తెల్లగా చిన్న చిన్న ముద్దల లాగా అగుపిస్తాయి. (బొమ్మ చూడండి) అలాగే కారం కుడుములు కూడాను.సదరు కొబ్బరి పూర్ణం కుడుములు చేయడానికి కొబ్బెర - శాస్త్రిగారి ఆవిడే స్పాన్సరు మా అమ్మకు. మా అమ్మ కుడుములు చేసిన తర్వాత శాస్త్రిగారికి పంచడమూ ఒప్పందంలో భాగమే.
శాస్త్రి దంపతులకు పిల్లలు లేరు. అంచేత వాళ్ళ ఇంటికి ఏ పిల్లవాడు వెళ్ళినా, ఏదో ఒకటి దొరకబుచ్చుకోవడం రివాజు. కనీసం కొబ్బరి ముక్కయినా సరే. ఇక మా అమ్మకు, ఆవిడకు పులుసులు, కూరలు, పప్పుల మధ్య అండర్ స్టాండింగు కావలసినంత. ఏదైనా బావుందని అనిపిస్తే, ఆవిడ మా ఇంటికి ఓ గిన్నెలో తన వంట పంపడం, మా అమ్మ వాళ్ళింటికి పంపడం తెర వెనుక జరిగే ఆనవాయితీనే. పొరుగింటి కమ్మనైన కూర కాబట్టి నేనూ, మా అన్నా కూడా వాటికి ఎగబడ్డం మామూలే.
అలాగే మా ఇంట్లో ఏ వ్రతమో, అబ్ధీకమో వచ్చినా శాస్త్రి గారు రావలసిందే, పూజ జరిపించవలసిందే. మా అమ్మ వంట ఆయన రుచి చూడవలసిందే.
ఆ రోజుల్లో టీవీలు, అవీ లేవు కాబట్టి సాయంత్రం పూట తీరుబడిగా ఉంటే మా అమ్మా, ఆవిడా అలా మాట్లాడుకుంటూ ఉండడం, మా అమ్మ వాళ్ళింటి గుమ్మం దగ్గర ఉందన్న కారణంతో మేమక్కడకి వెళ్ళి, ఆ మిష మీద శాస్త్రి గారి ఇంట్లో ఏ కలకండో, కొబ్బరి ముక్కలో, పంచామృతమో కాజెయ్యడం అలవాటైన పని. శాస్త్రి గారు గుంభనంగా పిల్లలను చూసి నవ్వుకోవడమూ, ఆయనను చూసి ఆ ఇల్లాలు మురిసిపోవడమూ ఇవన్నీ - ఈ రోజు నీలి ఆకసంలో తేలియాడుతూ వెళ్ళే చిన్న చిన్న మేఘపు తునకల్లా గుర్తుకువచ్చే మధురమైన జ్ఞాపకాలు.
నాకు ఎనిమిదో ఏటననుకుంటాను. వడుగు చేయాలని నిశ్చయించారు మా తాతయ్య. ఓ శంకర జయంతి రోజు సార్వజనిక ఉపనయనాలు జరుగుతుంటే అందులో భాగంగా మాకు ఉపనయనం చేశారు. ఆ తంతు ముగిసిన తర్వాత వటువు నలుగురి వద్దా భిక్ష స్వీకరించాలి. ఆ రకంగా నాకు మొదటి భిక్ష శాస్త్రి గారి భార్య పెట్టారు.
జీవితంలో అన్నీ సౌమ్యంగా, ఆహ్లాదంగా జరిగితే అది జీవితమెలా అవుతుంది? శాస్త్రి గారి జీవితంలో అతిపెద్ద విషాదం అనుకోకుండా జరిగింది. ఏదో పండుగకోసం దేవళాన్ని శుభ్రం చేస్తూ, సున్నం అదీ తనే స్వయంగా కొడుతున్నారు. వాళ్ళావిడ ఆయనకు ఏదో సహాయం చేస్తున్నారు. ఇంతలో ఆమె కుర్చీలోంచి జారిపడ్డదట. పెద్దగా దెబ్బలవీ తగల్లేదు కానీ, ఎంచేతో ఏమో - "రేపట్నుంచి నేను మీకు ఏమీ చేయలేను" అని అన్నారట ఆవిడ శాస్త్రి గారితో. ఆ మాట పొల్లుపోకుండా జరిగింది.
మరుసటి రోజు ఉదయం ఆవిడ స్నానం చేయడానికి మా ఊరి కెనాలు (కాలువ) వద్దకెళ్ళింది. కాస్తంత ప్రశాంతంగా స్నానం చేద్దామని జనం తక్కువగా ఉన్నచోటికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో, ఏమో ఎవరూ చూడలేదు. కాసేపటి తర్వాత ఆమె రాకపోతే ఖంగారుపడి శాస్త్రిగారు చూద్దురు కదా, గట్టు మీద ఆమె ఉంచిన పొడిచీర మాత్రం కనిపించింది. ఇంతలో జనం వచ్చారు. అందులో ఒకరిద్దరు నీళ్ళలో వెతికారు. దొరక్కపోతే కాస్త బాగా ఈత వచ్చిన సంజీవులు వచ్చాడు. ఆమె శవం దాదాపు మూడు కిలోమూటర్ల దూరంలో నీళ్ళలో దొరికింది.
మరణానికి సరిగ్గా ఒక్క రోజు ముందు చాలామందికి తమ మరణం రేపేనని తెలుస్తుందట. ఇది ఆమె విషయంలో ఋజువయ్యింది. (మా తాతయ్య, అమ్మగార్ల విషయంలోనూ ఇది జరిగింది).
ఆ తర్వాత శాస్త్రి గారు గుడి పౌరోహిత్యం మానివేశారు. మరోచోట ఉంటూ కాలం వెళ్ళదీశారు. అప్పుడప్పుడూ మమ్మల్ని చూసినప్పుడు మొహమాటం, పలకరింపు కలిగిన నవ్వు ఒకటి విరిసేది.
కొన్నేళ్ళ క్రితం మా ఇంట్లో ఆయన గురించి అడిగితే, ఆయన పోయాడని, అనాయాసంగా అరగంటలో ప్రాణం విడిచారని విన్నాను. ఒకరి మీద మరొకరికి అంత గొప్ప అనురాగం, అప్యాయతా ఉన్న దంపతులను, దాంపత్యాన్ని, తను నడివయసులో ఉన్నప్పటికీ భార్య పోయిన తర్వాత విరాగి అయి, అత్యంత సాధారణమైన జీవితం గడిపిన భర్తనూ నేను మరెక్కడా చూడలేదు, ఈ రోజు వరకూ.
ఇప్పుడూ ఏదో తెలియని లోకంలో - శాస్త్రిగారి భార్యా, మా అమ్మా ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. శాస్త్రి గారు వడివడిగా తనదైన నడకతో అక్కడికొస్తారు. మా అమ్మ లేవబోతే, "కూర్చో రాజమ్మా" అని ఇంట్లో ఏ కర్పూరమూ తీసుకొని అక్కడినుండి నిష్క్రమిస్తారు! ఆ ఇల్లాలు నవ్వుముఖంతో లోపలికెళ్ళి ఏ కొబ్బరి ముక్కో, కలకండో, ఎండిన ఖర్జూరం ముక్కో తీసుకొచ్చి మా అమ్మ చేతిలో పెడుతుంది! ఆ కలకండ తాలూకు తీపి, ఇలా మధురమైన జ్ఞాపకంగా నన్ను పలుకరిస్తుంది!


