Monday, October 4, 2010

పద్యరచన for dummies

ఈ టపా వ్రాయడానికి నాకున్న అర్హత - అనేకమంది ప్రోత్సాహం, ప్రోద్బలం వల్ల నేర్చుకున్న కాసిన్ని ముక్కలు, నా దిక్కుమాలిన ప్రయోగాలున్నూ. నేను ఏ విధమైన కవిని, పండితుణ్ణీ కానని నాకు తెలుసు. మీకు ఇదివరకే పద్యాలు వ్రాసిన అనుభవం ఉంటే ఈ టపాలో సొల్లును పట్టించుకోకండి. ఇక విషయంలోకి.

దాదాపు ఒకటిన్నర యేళ్ళ క్రితం. ఆంధ్రామృతం బ్లాగు నిర్వాహకులు చింతా రామకృష్ణారావు గారోమాట అన్నారు. "వచనం వ్రాయడం కన్నా, పద్యం వ్రాయడం సుళువు. బస్సు నడపడం కన్నా రైలు నడపడం సులువు. నియమాలను పాటిస్తూ వెళితే మిగిలిన సంగతి పద్యమే చూసుకుంటుంది అని. అప్పుడాయన మాట నమ్మశక్యం కాలేదు. అయితే ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది.

పద్యరచనలో మెళకువలు, నియమాలు నేర్పడానికి జాలంలో శంకరయ్య గారు, రామకృష్ణారావు గారు, ఆచార్య ఫణీంద్ర గారు, కామేశ్వర రావు గారు, టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు వంటి వారు ఇదివరకే ఉన్నారు. కొన్ని చక్కటి వ్యాసాలు అందం బ్లాగులో రాకేశ్వరరావుగారు వ్రాశారు. ఉపజాతి పద్యాల గురించి పొద్దులో రాఘవగారు చక్కగా వివరించారు. వీటికి తోడు నా అనుభవాలు ఎవరికైనా ఉపయోగపడవచ్చునని ఈ టపా వ్రాస్తున్నాను. ఇందులో కాస్త స్వోత్కర్ష ధ్వనించవచ్చు. అలాగే ఈ చెప్పబోయే విషయాలు సూచనల్లా ధ్వనించినా, నిజానికి అవి నేను అనుకరించిన పద్ధతులు.

మొదట కావలసిన దినుసులు 3.

౧. వ్రాయాలన్న తపన
౨. నియమాలు తెలుసుకోవడం
౩. మంచి గురువు/సలహాలు చెప్పగల వారిని ఎన్నుకోవడం.

రెండవ విషయం - జాలంలో దొరుకుతుంది. అయితే విషయం మీకర్థం అవడం కోసం ఓ పుస్తకంలో మీకు అర్థమయే విధంగా వ్రాసుకోండి. ఈ నియమాలను చూసి భయపడవద్దు, చికాకు పడవద్దు. తప్పులు చేయడానికి జంకవద్దు. ఇంకా వీలయితే మొదట ఓ మాట అనుకుని, దానిని ఛందోబద్ధం చేయడానికి ప్రయత్నించండి.

ఉదా: కాకిపిల్ల కాకికి ముద్దు.

ఇది ఆటవెలదికి దగ్గరగా ఉంది. ఓ గణం (మూడవ గణం), చివరి గణంలో ఓ అక్షరం మాత్రమే లోపం. ఆ మార్పు కాస్తా చేసేద్దాం.

కాకిపిల్ల తల్లికాకికి ముద్దొకొ!

అంతే - ఓ పాదం తయారు!

అత్త లేని కోడలుత్తమురాలు! ఈ వాక్యాన్ని ఒకే ఒక్క చిన్న మార్పుతో ఆటవెలది పాదంగా మార్చవచ్చు. మీకు తెలుసా?

మీకు వ్రాయాలన్న ’తపన’ ఉంటే అదే మీచేత వ్రాయిస్తుంది. నిజం. కానీ మనకు ఈ నియమాలు అవీ చూస్తే చికాకు. ఈ చికాకు, పరాకు పోవాలంటే మీకు ఇష్టమైన విషయంలో మంచి పద్యాలు, వీలయితే చిన్నచిన్న పద్యాలు, తేటగీతి, ఆటవెలది, కందం వీటిలో వ్రాసినవి చదవండి. ఉదాహరణకు - ఓ చక్కని అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అందం ఎలా ఉందంటే -

నువ్వుపువ్వు నవ్వు జవ్వని నాసిక
చివురుసవురు జవురు నువిదమోవి
మబ్బునుబ్బుగెబ్బు బిబ్బోకవతివేణి
జగమెఱుంగు దాని జగమెఱుంగు.

ఈ పద్యంలో చిన్నచిన్న పదాలలో అమ్మాయి ముక్కును, పెదవిని, జడను వర్ణించడం చూస్తే ఓ మారు ఆహా అనిపిస్తుంది. (ఈ పద్యం నేను పదవ తరగతిలో ఓ లైబ్రరీలో చదివి భట్టీయం వేశాను. ఈ మధ్యనే ఇది చేమకూరవెంకటకవి విజయవిలాసం లోనిదని తెలిసింది)

అలాగే మీకు పదాలతో కవులు ఎలా ఆడుకుంటారు! ఈ విషయం మురిపెంగా అనిపిస్తే ఈ క్రింది పద్యం స్ఫూర్తినివ్వచ్చు.

ఎందుండి ఎందు బోవుచు
ఇందలి కేతెంచినార లిప్పుడు? విద్వ
ద్వందిత! నేడు కదామ
న్మందిరము ధన్యంబయ్యె మాన్యుడ నైతిన్!

ఈ పద్యం మనుచరిత్రలోనిది. ఇలాంటివి అనేకం దొరుకుతాయి. చదువుతూ ఉండండి. ఇంకా సులువుగా , సమస్యాపూరణలు శంకరయ్యగారి బ్లాగులో ప్రతిదినం ఉంటున్నాయి. వాటిని చదవండి.

ఒక్కోసారి, మన కోపాన్ని కూడా ’తపన’ కింద మార్చుకోవచ్చు. ఉదా: నాకు ’ఫలానా’ కామేశ్వర రావు గారంటే కోపం. ఆయనలా పద్యాలు రాయలేకపోతున్నానని ఉక్రోషం. ఆయన బ్లాగు హిట్లను చూసి కుళ్ళు, వగైరా. ఇప్పుడు ఆ ’స్ఫూర్తి’ తో ఎలాగో కష్టపడి

’మర్రిచెట్టు కలదు మహిలోన ఒకచోట
మర్రిచెట్టుకొక్క తొర్ర కలదు’ - అని గరికపాటి వారు వెక్కిరించిన రీతిలో ఓ పద్యం వ్రాసాను. పైగా ఈ పద్యం తప్పొప్పులు చూడమని ఆయన్నే అడుగుతాను! నా ప్రతీకారం, ఆకాంక్ష రెండూ తీరతాయి! పైగా ఆయన్ను ఇలాంటి పద్యాలతో కాల్చుకు తినదం అన్న పురుషార్థమూ దక్కె.చూశారా, ద్వేష బ్లాగు రాయడం కంటే ద్వేషపద్యం వల్ల ఎన్ని అడ్వాంటేజులో!

నేర్చుకోవాలన్న ’తపన’- చాలా పనులు చేయిస్తుంది. ఈ విషయం స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుంది. అంచేత పైన విషయాలు వ్రాశాను.

ఇక గురువు. ఈ విషయంలో చాదస్తం అనుకున్నా పర్లేదు చెప్పాలి. ఒక్కోసారి మంచి గురువు, మీ చేత అద్భుతాలు చేయిస్తాడు, నిజానికి తనేమీ చేయకుండానే. అయితే దీనికి ప్రేమతో కూడిన ఓ బలమైన అభిమానం, నమ్మకం ముఖ్యం. ఈ విషయాలు quantitative కాదు కాబట్టి నిరూపించడం సాధ్యం కాదు. కానీ నా జీవితంలో చాలా సార్లు నాకు ఈ అనుభవం ఎదురయ్యింది. ఈ విషయం మిమ్మల్ని మీరు అడిగి తెలుసుకోవలసిందే. 

దినుసులు సమకూరాయి.

ఇక మొదలెట్టటం ఎలా? ఇదో భయంకరమైన భూతం. కానీ భూతాన్ని ఎదుర్కోవాలంటే రాకుమారుడు లేదా షాడో లాంటి వీరుడు మొదట దాని వీక్నెస్ ఎక్కడుందో చూస్తాడు. అంటే సమస్యను కుదింపజేయడానికి చూస్తాడు. మనమూ అదే చేస్తే పోలా? ఎలానో క్రమంగా చూద్దాం.

౧. మొదట ఆటవెలది/తేటగీతి పద్యాలు సులువు. వాటితో మొదలెట్టటం మంచిది.
౨. ఏ పద్యం మనకు సులువు? ఇది వ్యక్తులను బట్టి ఉంటుంది. ఒకరికి వర్ణన ఇష్టమైతే ఒకరికి సమస్యాపూరణ ఇష్టం.

సమస్యాపూరణ అనుకోండి. సమస్యాపూరణ చివరిపాదం అయితే అంతకు ముందు ఓ పాదం మాత్రమే వ్రాయండి. ఆ తర్వాత వీలున్నప్పుడు మిగిలిన పాదాలు వ్రాయండి. కుదరకపోతే మీ ప్రయత్నాలు వివరించి గురువులను శరణు వేడండి. వారే మార్గం చూపిస్తారు.

వర్ణన అయితే ఏ పాదానికి ఆ పాదం విడిగా వ్రాసేసుకోడానికి పూనుకోండి. ఉదాహరణకు - పద్యం గురించే రాయాలనుకోండి. ఇలా మొదలెట్టవచ్చు. ఆటవెలది ఎంచుకుందామా?

ఆ.వె:

పద్యము మనసుకును హృద్యముగాఁ దోచు
పద్యము సుమలలిత పద శుభదము
...
...

మిగిలిన రెండు పాదాలు అవే మాటలలో పూరించి ప్రయత్నించి చూడవచ్చు.

అబ్బే! పై పద్యం "నాకొక బుల్లి చెల్లి" ని గ్రాంథికంగా చెప్పినట్టు ఉంది అని మీరనుకోవచ్చు. కానీ "కాకిపిల్ల కాకికి ముద్దు". ఇలా జనులమీద experiment చేస్తేనే మనకు వస్తుంది.

ఇంకాస్త సులువు పద్ధతుంది, అయితే కాస్త తెలివి, ట్రిక్సు కావాలి. ఇదివరకు ప్రముఖ కవులెవరైనా వ్రాసిన టెంప్లేటును వాడుకుని మీరు అందులో సబ్జెక్టు, కొన్ని పదాలు మార్చి, మీ పద్యంలా భ్రమింపజేయవచ్చు. ఇదొక ట్రికీ కళ. అలవడితే మాత్రం భలే రంజుగా ఉంటుంది. మీ ఎదుట ఇతరులు ’అసలు’విషయం తెలుసుకోలేక మీ పద్యాలను ’ఆహా, ఓహో’ అంటూంటే, భలేగా ఉంటుంది. (నేనిలా బోల్డన్ని రాశాను. :-))

ఉదాహరణకు చాటువుల్లో తిరుపతి కొండమీద ఒకాయన సీసం వ్రాశారు. ప్రతి పాదాంతంలో "కొండ" అని వస్తుంది. నేను అలాగే ప్రతి పాదం చివర్లో "నగరి" అని వాడుకుని పద్యం ప్రయత్నించి సఫలమయ్యాను.

ఇలా తేటగీతులు, ఆటవెలదులు, బ్లాగు జనులమీద ప్రయోగిస్తూ వెళ్ళండి. మధ్యమధ్యలో మన గురువులను సాధ్యమైనంత విసిగిస్తూ ఉందండి. ఇంకా మీ బ్లాగు ఉంది కదా, అక్కడ ఫోటొ, కింద ఓ పద్యం, బాలకృష్ణ, విజయకాంత్ లాంటివారి మీద పద్యాలు, వీలైతే సమస్యా పూరణలు, మీ పాపాయి/బాబు బోసినవ్వు మీద ఓ మాట, ఇంకొన్ని సలహాలు క్రింద.

* ఇతరుల పద్యాలు తీసుకుని, వాటిలో పదాలు మాత్రం మార్చి మీరో పద్యం వ్రాయండి.
* యతి కిట్టించదం కోసం బ్రౌణ్యగ్రంథం వెతకండి. ఉదా: ఇది వరకు పద్యం మీద పద్యం ఉంది కదా. మీకో ఆలోచనొచ్చింది."పద్యము వలన మది ........" తర్వాత రావట్లేదు. ఇప్పుడు -
యతి స్థానంలో "ప", "పం", "పా", "పై", "పౌ", "వ", "వా","వౌ","వై" - వీటితో మొదలయే పదాలు వెతకండి. ఏదో ఓ పదం దొరక్కపోదు!
* వేటూరి పాట, మీకిష్టమైన దాన్ని తేటగీతి/ఆటవెలదిగా మార్చండి. (ఇది నేను చేశానోసారి. మరో ప్రముఖులు కూడా చేశారు.:-))
* మీ దైనందిన జీవితంలో మాటలని పద్యాలుగా మార్చండి. (ఇది చాలా ప్రావీణ్యతనిస్తుంది. నిజం)
* మీరో పద్యపాదం వ్రాశారు. అది చూసి, మీకే "ఏంట్రా ఇది" అనిపించిందనుకోండి. ఫీల్ అవద్దు. కాస్త ఆలోచించి, కుదిరిన చోట్ల అరసున్న పెట్టండి. పద్యానికి హుందాతనం వస్తుంది. నిజమ్.
* చివరిగా - కొంచెం వ్యక్తిత్వ వికాసం టచ్ లో - మీ రచనలను మీరు గర్వంగా ఫీల్ కండి. ఇతరులూ వాటి గురించి అలానే అనుకుంటారు.

Friday, September 3, 2010

వర్ణాల నుండి ధ్వని దిశగా..

(క్రితం టపా తరువాయి)

వర్ణాలు ముఖావయవాలల్లో పుడతాయనిన్నీ, వాటిని పుట్టించడానికి - ప్రయత్నం అవసరమనిన్నీ, స్థానమూ ప్రయత్నమూ రెండూ ఒకేలా ఉంటే సవర్ణాలనిన్నీ అర్థం చేసుకున్నాం.

అభ్యంతర ప్రయత్నం గురించి మరో సారి చెప్పుకుని, సందులనుండి రహదారికొద్దాం.

ఉదాహరణకు "త" వర్గం తీసుకుందాం. త వర్గం అంటే త,థ,ద,ధ మరియు న - వీటికన్నిటికీకి స్థానం దంతము. నాలుక కొస దంతాల వెనుక భాగాన్ని స్పృశించడమనే అభ్యంతర ప్రయత్నం ద్వారా ఈ వర్ణాలను పుట్టించవచ్చు.ఇవి సవర్ణాలు.

ఇప్పుడో అనాలజీ.

ఓ తబలా ఉందనుకుందాం. ఆ తబలా మధ్య స్థానంలో (వృత్తం గీసి ఉన్నచోట), ఒకే బలం (ప్రయత్నం) తో ఎన్ని సార్లు కొట్టినా ఒకే ధ్వని వినిపిస్తుంది.

సైకిలు బెల్లును ఎన్ని సార్లు మోగించినా ఒకేరకంగానే మోగుతుంది.

నాలుక కొసతో దంతాల వెనుక భాగాన్ని స్పృష్టము అనే అభ్యంతర ప్రయత్నంతో ప్రేరేపించినపుడు ఒకే ధ్వని రావాలి కానీ "త", "థ", "ద", "ధ", "న" అన్న ఐదు భిన్న ధ్వనులెలా వస్తున్నాయి? ఈ ఐదింటికీ స్థానం, అభ్యంతర ప్రయత్నం ఒకటే అయితే, భిన్నంగా ఎందుకు ధ్వనిస్తున్నాయి?

దీనికి కారణం మొదట సైకిలు బెల్లు అనాలజీతోనే సాధిద్దాం. బెల్లు కొట్టేప్పుడు మరోచేతితో బెల్లు పట్టుకున్నారనుకోండి, అప్పుడు "ట్రింగ్", "ట్రింగ్" బదులు "ట్రిక్", "ట్రిక్" మంటుంది కదా. అలాగే బెల్లుపై ఓ పల్చటి తడిగుడ్డ కట్టినప్పుడు, లేదా బాగా ఎదురుగాలి వీస్తున్నప్పుడు, తబలా లోపల గాలి బదులు నీళ్ళతో నింపినపుడు.....ఇలా రకరకాల బాహ్య కారణాల వల్ల ధ్వని భేదం కలుగుతుంది.

ఇక్కడ వర్ణాల పుట్టుకలో ధ్వని భేదానికి కూడా అదే కారణం. దానిని బాహ్యప్రయత్నం అన్నారు పాణిని మహర్షి. (అయితే వర్ణాల విషయంలో తేడా కాస్త సూక్ష్మంగా ఉంటుంది, తబలా ఉదాహరణలోలా కాకుండా)

బాహ్యప్రయత్నం అచ్చులకు  3 రకాలు, వ్యంజనాలకు 8 రకాలని (4 జంటలు) సూత్రీకరించారు. అచ్చులని కాసేపు పక్కనెట్టి, హల్లుల బాహ్యప్రయత్నాలను చూద్దాం.

నివారము (బాహ్య అవయవం తెరుచుకొనుట) - సంవారము (మూసుకొనుట)
శ్వాసము - నాదము
అఘోషము - ఘోషము (గంభీరతను బట్టి)
అల్పప్రాణము - మహాప్రాణము (ప్రాణవాయువు వినిమయం బట్టి)

ఈ నాలుగు జంటల్లో ఒక్కో జంటనుండి ఒక్కో అంశము - అనగా ఓ వర్ణానికి నాలుగు బాహ్యప్రయత్నాలు ఉంటాయి. అంటే

"త" కు నివారము, శ్వాసము, అఘోషము, అల్పప్రాణము - అన్న నాలుగు బాహ్యప్రయత్నాలు, స్పృష్టము అనే అభ్యంతర ప్రయత్నము, దంతము అనే స్థానం వద్ద జరుగడం వల్ల సదరు వర్ణం అలా ధ్వనిస్తోంది.

ఇంకా వివరంగా చెప్పాలంటే -

దంతము వెనుక నాలుక కొస తాకుట వల్లనూ, మరియూ, ఆ తాకు సమయమున ముఖభాగము విడివడి యుండుటయు, శ్వాసమును అధికముగ ప్రయోగించుటచే, గంభీరధ్వని వెలువడకుండుటయు, ప్రాణవాయువు వినిమయము తక్కువగ జరుగుటయు అను చర్యలు ఒకేకాలమున సంభవించుట వలన "త" వర్ణము పుట్టి అవ్విధమున ధ్వనించుచున్నది.

త వర్గంలో మిగిలిన వర్ణాలకు చూద్దామా?

"థ" - సంవారము, నాదము, ఘోషము, మహాప్రాణము
"ద" - సం, నా, ఘో, అ.ప్రా.
"ధ" - సం, నా, ఘో, మ.ప్రా,
"న" - సం, నా, ఘో, అ.ప్రా..

ఇదండీ వర్ణాల నుండి ధ్వని వైపుకి వెళ్ళే దిశ.

బాహ్యప్రయత్నం తెలుసుకోవడం ఎందుకంటే, వీటి ద్వారా, కొన్ని సంధులకు సూత్రాలు ప్రతిపాదిస్తున్నారు పాణిని. (వాటిని వివరించేంత సీను నాకు లేదు.)

చివరగా అచ్చులకు సంబంధించిన బాహ్య ప్రయత్నాల పేర్లు తెలుసుకుందాం. అవి - ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము. - వీటిని గురుముఖతః నేర్వాలి. వేరే మార్గం లేదు.

వేల సంవత్సరాలకు పూర్వం - ఇంత శాస్త్రీయమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడి, వాటి మూలకంగా భాషాశాస్త్రం బ్రహ్మాండమైన రీతిలో అభివృద్ధి చెందటం అనేది ప్రపంచభాషలలో సంస్కృతభాషలో మాత్రమే జరిగి ఉంటుంది.

అందుకేగా అన్నారు, "జనని సంస్కృతంబు సకలభాషలకును" అని.

(ఈ టపా చదివిన తర్వాత ఆసక్తి కలిగితే పొద్దులో వ్యాసం రెండవభాగం కూడా చదవగలరు.)

Disclaimer: ఈ టపా  ఉద్దేశ్యం ఆసక్తి కలిగించటం, నాకు తెలిసిన పరిధిలో విషయాలను పంచుకోవడం మాత్రమే. ఈ విషయాలపై పూర్తిస్థాయి అవగాహన నాకూ లేదు. ఇంకా ఎక్కువ వివరాలకు లఘుసిద్ధాంతకౌముది చూడగలరు.