Monday, March 9, 2009

ఫల శ్రుతి

చిన్నప్పుడు మా ఇంటి ఎదురు గా రామాలయం ఉండేది. ఆ ఆవరణలో ఓ చెట్టు. ఆ చెట్టు పేరు బంకీరుకాయల చెట్టు. బంకీరుకాయ అంటే - రేగు పండు ఆకారంలో, రేగు పండు లాగే లోపల బీజం ఉన్న ఓ పండు. గుజ్జు కాస్త జిగురుగా ఉన్నా, బాగా తియ్యని రుచి. ఈ పళ్ళు తినడం మొదట అలవాటు పడ్డం కష్టం కానీ, ఒక్కసారి వీటి రుచి మరిగితే విడిచిపెట్టటం కష్టం. రోహిణీ కార్తెలో ఎండలు మండిపోతున్నప్పుడు, ఆ ఉష్ణానికి నోటి పూత వస్తే, దానికి చక్కటి ఔషధం ఈ పండు (లేదా ఈ చెట్టు ఆకులు).

వేసవి సెలవుల్లో పిల్లలకు ఆటవిడుపు అవడంతో, ఆ చెట్టు కాయలు పక్వానికి వచ్చే సమయానికి, కోతులు, కోతులకు ధీటుగా మా కుర్రమూక ఆ చెట్టు దగ్గర సిద్ధం. మమ్మల్ని, కోతులను తరమడానికి, దేవాలయానికి కాపలా పనికీ నరసమ్మ అనే ఒకావిడ. ఆవిడ మమ్మల్నందరినీ తరిమేసి, ఆ కాయలు పోగు చేసుకుని, బయట అమ్ముకునేది. (బీదరాలు ఆవిడ.) అప్పట్లో మా పాలిట విలను ఆమె. దాదాపు 15, 20 యేళ్ళు ఆ చెట్టుతో నా అనుబంధం కొనసాగింది.

ఆ బంకీరు కాయల్లాగే నాకు కొన్ని unconventional fruits బాగా జ్ఞాపకం. వాటిలో కొన్ని.

కలే పండ్లు అని. నల్లగా మిరియపు గింజల లాగా ఉండేవి. స్కూళ్ళ దగ్గర గంపల్లో తెచ్చి అమ్ముకునే వాళ్ళు. కొన్ని కొన్ని సార్లు పురుగులు పడ్డా, చాలా రుచిగా ఉండేవి. గుజ్జు కాస్త ముదురు ఎరుపు రంగులో ఉండేది.

ఈత పళ్ళు : ఇవి మా ఇళ్ళలో నిషేధం. ఎందుకంటే, ఈత చెట్టు నుండీ కల్లు వస్తుంది కదా. ఈత కాయలూ వాటి తాలూకు ఫ్యామిలీయే కదా, అందుకని. అయితే, ఇంట్లో తెలీకుండా మా స్నేహితుడి తోటనుండీ తెప్పించుకుని ఎగబడే వాళ్ళం.

ఇంకా రేగు, గంగ రేగు, నేరేడు, మేడి, సీమ చింతకాయలు.....

ఇవన్నీ ఇప్పుడు దాదాపు కనబడ్డం మానేశాయి.

అయితే కొత్త కొత్త ఫలాలు చాలా చూశాను, ఈ మధ్య 4,5 యేళ్ళలో. ఆన్ సైటుకు ఇండోనేషియా వెళ్ళినప్పుడు, కివి అని, డ్రాగన్ ఫ్రూట్ అని, పసుపు వర్ణం గుజ్జు ఉన్న పుచ్చకాయ, బీహార్ నుండి అప్పుడప్పుడు మా స్నేహితుడు తెచ్చి పంచే లిచి, ఇంకా పేరు తెలీని అనేక రకాల పళ్ళు...

సరే, మర్చిపోయిన ఫలాల విషయానికి మళ్ళీ వస్తాను. ఈ మధ్య ధూర్జటి కవి గారి కాళహస్తీశ్వర శతకం తాలూకు ఓ పద్యంలో ఆ మర్చిపోయిన పళ్ళలో కొన్నిటిని చూశాను. ఆ పద్యం........

నేరేడు పండులు నెలయుట్టి పండులుఁ
గొండ మామిడి పండ్లు దొండపండ్లుఁ
బాల పండులు నెమ్మి పండులు బరివంక
పండులుఁ జిటిముటి పండ్లుఁ గలివి
పండులుఁ దొడివెంద పండ్లుఁ దుమ్మికి పండ్లు
జానపండులు గంగ రేఁగుఁబండ్లు
వెలగ పండులు పుల్ల వెలగ పండులు మోవి
పండ్లు నంకెన పండ్లు బలుసు పండ్లు

బీరపండ్లును బిచ్చుక బీర పండ్లుఁ
గొమ్మిపండ్లీతపండ్లును గొంజి పండ్లు
మేడి పండ్లును మోదలుగాఁ గుడిమాడి
చెంచెతలు దెత్తురిత్తు విచ్చేయుమయ్య (3-69)

ఇవన్నీ అడవిఫలాలు.

౧.నేరెడు
౨. కొండమామిడి
౩. దొండ
౪. పాల (సపోటాతో అంటు కడతారుట)
౫. బరివంక : బంకీరు కాయలివే
౬. కలివి : కలే పండ్లు ఇవే.
౭. తుమ్మికి / తుమికి /తునికి : కిందుకం అంటారుట సంస్కృతంలో
౮. వెలగ :
౯. పుల్ల వెలగ:
౧౦. గంగరేగు : ఇది తెలిసే ఉండాలి. రేగు పండు పెద్దన్న.
౧౧ మోవి
౧౨. బలుసు
౧౩. బీర : (కూరకు వాడే బీర కాదు)
౧౪. పిచ్చుక బీర : బాపన బూరెలంటారుట
౧౫. ఈత :
౧౬. గొంజి : గొల్వి, గొలుగు, గొనుగు, గుడఫలము
౧౭. మేడి (ఉదుంబర అని సంస్కృతంలో)
౧౮. కొమ్మి
౧౯, నెమ్మి : (సంస్కృతంలో చిత్రకుశ)
౨౦. నెలయుట్టి / నెల్లుట్టి
౨౧. చిటిముటి ; మంచి బిక్కి అంటారుట దీన్ని
౨౨. జాన/పూతిక : పుల్ల జామపండ్లట
౨౩. సంకెన :
౨౪. తొడివెంద

ఇలా ౨౪ జాతుల ఫలాలను పేర్కొన్నాడా కవివరేణ్యుడు. ఈ కాఱడవిలో ఉన్న శివయ్యకు, మా వూరు (ఉడుమూరు) కు వస్తే, చెంచెతల చేత తెప్పించి పెడతానని తిన్నడు ఆశ చూపెట్టాడుట.

చిన్నప్పుడు చూసిన రుచులు (మళ్ళీ ఆ రుచులు కనిపిస్తాయన్న ఆశలేదు) ఇలా ఈ పద్యంలో కాస్త కనిపించాయి.

అన్నట్టు తెనాలి రామకృష్ణ సినిమాలో ఈ పద్యం కూడా ఆ ఆశ్వాసంలోదే. (3-71)

చుఱుఁకుఁ జూపునఁ గాలిన కొఱతనుఱుకు
నుఱుకుఁ జూపులఁ బుట్టించు నెఱుకువారి
ఇఱుకు వలిగుబ్బ పాలిండ్ల ఇగురుఁ బోండ్ల
సేవకిచ్చెద నీకు విచ్చేయవయ్యా......!

Sunday, March 1, 2009

దాన వీర మూర్ఖ కేసీ ఆర్ (ఏక పాత్రాభినయము)



ముందుగా ఇక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దానవీర శూరకర్ణ అభినయము చవిచూసి రండు.

ఇందలి
పాత్రలు పాత్రధారులు.
సుయోధనుడు
: చంద్రబాబు నాయుడు
కర్ణుడు
: కేసీఆర్
ద్రోణుడు
: సగటు ఓటరు మహాశయుడు
భీష్ముడు
: ప్రజాస్వామ్య వాది, గాంధేయ వాది అయిన ఒక అనుభవజ్ఞుడైన ఓటరు
ఇంకా
దుశ్శాసన (సీపీఐ), శకుని (బాలకృష్ణ) మున్నగు వారు పాల్గొన్నారు.

నేపథ్యము
: ప్రజాస్వామ్యమున ముఖ్య ఘట్టమైన ఎన్నికలు దగ్గర పడినవి. ఎన్నికలన - ఇవి ప్రజాస్వామ్యమునకు, అప్రజాస్వామిక పోకడలకు మధ్య జరిగెడు పరీక్షలేయని చెప్పవచ్చును. ఎన్నికలలో పొత్తులు (పార్టీల యొక్క భావస్వారూప్యమున చేసుకొనెడి ఎంపికలు) సర్వసాధారణము.ఓటరు మహాశయుడు ఎంపిక చేసుకున్నపార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేయును.

నేపథ్యమున - వేర్పాటు వాద బీజములతో అంకురించిన తెలంగాణా ప్రముఖునకు, తెలుగు వారి ఉమ్మడి గౌరవభావములను నిలబెట్టుటకవతరించిన తెలుగుదేశ పక్ష అధినేతకు మధ్య పొత్తు నిలువదని ఓటరు మహాశయుడు ఆక్షేపించుచూ -

ద్రోణ
(ఓటరు) : వేర్పాటు వాద భావ సంజాతుడు, జాతి గౌరవమను అంశమున స్థాపించిన, తెలుగు దేశ పక్షమునతో పొత్తు కలుప అనర్హుడు.

(
కేసీఆర్ నిరాశగా వెనుకకు మళ్ళుచుండగా)

సుయోధనుడు
(చంద్రబాబు) : ఆగాగు.
ఓటరు
దేవా! ఏమంటివి ఏమంటివి.
ఓటు
నెపమున టీఆరెస్ సుతునకిందు నిలువ అర్హత లేదందువా? ఎంతమాట? ఎంతమాట?
ఇది
ప్రభుత్వ ఏర్పాటే కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ కాదే! కాదూ, కాకూడదు, ఎంపిక అక్రమమని యందువా?
అయినచో
, అతి జుగుప్సాకరమైన నీ ఎంపిక (selection) ఎట్టిది?
తొట్టి కాంగ్రెస్ నకు పట్టముగట్టితివి కదా, నీది ఎన్నిక?
ఇంత
యేల? అస్మద్ శ్వసురుడు, నందమూరి కుల వృద్ధుడు అయిన రామారావు, లాలూ, ములయంలతో ప్రత్మామ్నాయ ఫ్రంట్ కు నాంది పలుకలేదా? ఆయనదే రకమైన పొత్తు?
నాతో
జెప్పింతువేమయ్యా? మన ప్రజాస్వామ్యమునకు మూలస్థంభమైన కాంగ్రెస్, తీవ్రవాద పుత్రిక ముస్లిం లీగ్ తో సంధి కలుపలేదా? ముస్లిం లీగ్ ఛండాలముగా తెల్లదొరలతో పొత్తును, పొత్తు పర్యవసానముగా పాకిస్తానము ను, పాకిస్తాను, తిరిగి బంగ్లా దేశమును, పిమ్మట కాశ్మీరమును మన దేశమునుండీ వేర్పరిచ లేదా? రకముగా సందర్భావసరములను బట్టి, క్షేత్ర, బీజ ప్రాధాన్యములతో సంకరమైన ప్రజాస్వామ్యము ఏనాడో కలుషితమైనది. అయిననూ, ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యము అని వ్యర్థ వాదమెందులకు?

భీష్మ
(గాంధేయ, ప్రజాస్వామ్య వాది) : నాయనా, చంద్రబాబు! నువ్వన్నట్టు ఇది ముమ్మాటికీ ప్రభుత్వపు ఎన్నికయే. చిహ్నమున్నవారందరూ పార్టీ నాయకులే. అందులో భావసారూప్యమున్న వారే పొత్తునకు అర్హులు.

సుయోధనుడు
(చంద్రబాబు) : ఓహో! భావ సారూప్యమా, అర్హతను నిర్ణయించునది?
అయినచో
తెలుగు దేశమున, సస్యశ్యామలమై, సంపద్విరామమై వెలుగొందు తెలంగాణమునకు నేడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించెద.
కమ్యూనిష్టు
సోదరా, అనర్ఘ నవరత్నశ్శక్త కిరీటమును వేగముగ దెమ్ము.
బావా
, నటరత్న బాలకృష్ణా, సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనమును దెప్పింపుడు.
పరిజనులారా
, పుణ్యమూసీనదీ తోయాధికములనందుకొనుడు.
కల్యాణ
భక్తులారా, మంగళ తూర్యారావములు అపస్వరంబుగ మ్రోగనిండు.
వంధిమాగధులారా
, కేసీఆర్ కు కైవారములు గావింపకుడు.
పుణ్యాంగనలారా
, వీరాలాకృత కృపాల ఫాల భాగమున, కస్తూరీ తిలకము తీర్చి దిద్ది, బహుజన సుకృత పరీపాక, సంలబ్ధ సహజ వేర్పాటు వాదికి వాంఛలు చెలరేగ, వీరగంధము దిద్ది తోడుకుని రండు.
నేడీ
శాసనసభా మధ్యమున, సకల రాజకీయ నాయకుల సమక్షమున, శతథా, సర్వథా, బహుధా, సహస్రథా, ప్రజాస్వామ్య విలువలను శాశ్వతముగా ప్రక్షాళన కావించెదను.

శతపరివార
సహిత, సహజ ప్రాజాస్వామ్య వ్యతిరేక మానస, మంజీరా తటనివాస, కేయూర కిరీట హార మణీవలయా, దుర్జన మిత్ర, సముజ్జృంభణ ఝర్జాఝర్జరిత సముపాద్య సమగ్ర అశౌర్యధరా, మిత్రీకృత చంద్రబాబు నాయుడా, మూర్ఖా పరావతరా, తెలంగాణారాజ్య రమా మనోవల్లభా, విజయీభవా, దిగ్విజయీ భవా!

చంద్రబాబు
: సొబగు సొబగు.

కేసీఆర్
: దాతా! నా రక్తము రంగరించి, నీ అరుణారుణ శుభ పాద పద్మ యుగళమునకు సంలేపనము గావించిననూ, నీ ఋణమీగు వాడను గాను. ఎచ్చటా నీతిని పాటించని తెలంగాణీయుడు తమ సర్వ అసమతా దృష్టికి దాసానుదాసుడు. నా తుది రక్తపు బిందువు కూడా, మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు. యావజ్జీవము, అహర్నిశము, అవిశ్వాసబద్ధుడనై, అహితుడనై ప్రవర్తింతునని, సర్వ సామంత మహీపాల మండలాధిపతులు, సమస్త ప్రజానీకము విచ్చేసిన, సభామధ్యమున శపథము గావించుచున్నాను.

చంద్రబాబు
: హితుడా! అప్రతిహత ’మూర్ఖవరేణ్యుడగు నీకు, తెలంగాణా రాజ్యమే కాదు, నా హోం శాఖనిచ్చి గౌరవించుచున్నాను.

************************************************************************

ఇది
కేవలం నవ్వుకోవటానికి మాత్రమే. అసంబద్ధాలు, ఇతర పొరబాట్లు పట్టించుకోవద్దని మనవి.