Monday, October 4, 2010

పద్యరచన for dummies

ఈ టపా వ్రాయడానికి నాకున్న అర్హత - అనేకమంది ప్రోత్సాహం, ప్రోద్బలం వల్ల నేర్చుకున్న కాసిన్ని ముక్కలు, నా దిక్కుమాలిన ప్రయోగాలున్నూ. నేను ఏ విధమైన కవిని, పండితుణ్ణీ కానని నాకు తెలుసు. మీకు ఇదివరకే పద్యాలు వ్రాసిన అనుభవం ఉంటే ఈ టపాలో సొల్లును పట్టించుకోకండి. ఇక విషయంలోకి.

దాదాపు ఒకటిన్నర యేళ్ళ క్రితం. ఆంధ్రామృతం బ్లాగు నిర్వాహకులు చింతా రామకృష్ణారావు గారోమాట అన్నారు. "వచనం వ్రాయడం కన్నా, పద్యం వ్రాయడం సుళువు. బస్సు నడపడం కన్నా రైలు నడపడం సులువు. నియమాలను పాటిస్తూ వెళితే మిగిలిన సంగతి పద్యమే చూసుకుంటుంది అని. అప్పుడాయన మాట నమ్మశక్యం కాలేదు. అయితే ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది.

పద్యరచనలో మెళకువలు, నియమాలు నేర్పడానికి జాలంలో శంకరయ్య గారు, రామకృష్ణారావు గారు, ఆచార్య ఫణీంద్ర గారు, కామేశ్వర రావు గారు, టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు వంటి వారు ఇదివరకే ఉన్నారు. కొన్ని చక్కటి వ్యాసాలు అందం బ్లాగులో రాకేశ్వరరావుగారు వ్రాశారు. ఉపజాతి పద్యాల గురించి పొద్దులో రాఘవగారు చక్కగా వివరించారు. వీటికి తోడు నా అనుభవాలు ఎవరికైనా ఉపయోగపడవచ్చునని ఈ టపా వ్రాస్తున్నాను. ఇందులో కాస్త స్వోత్కర్ష ధ్వనించవచ్చు. అలాగే ఈ చెప్పబోయే విషయాలు సూచనల్లా ధ్వనించినా, నిజానికి అవి నేను అనుకరించిన పద్ధతులు.

మొదట కావలసిన దినుసులు 3.

౧. వ్రాయాలన్న తపన
౨. నియమాలు తెలుసుకోవడం
౩. మంచి గురువు/సలహాలు చెప్పగల వారిని ఎన్నుకోవడం.

రెండవ విషయం - జాలంలో దొరుకుతుంది. అయితే విషయం మీకర్థం అవడం కోసం ఓ పుస్తకంలో మీకు అర్థమయే విధంగా వ్రాసుకోండి. ఈ నియమాలను చూసి భయపడవద్దు, చికాకు పడవద్దు. తప్పులు చేయడానికి జంకవద్దు. ఇంకా వీలయితే మొదట ఓ మాట అనుకుని, దానిని ఛందోబద్ధం చేయడానికి ప్రయత్నించండి.

ఉదా: కాకిపిల్ల కాకికి ముద్దు.

ఇది ఆటవెలదికి దగ్గరగా ఉంది. ఓ గణం (మూడవ గణం), చివరి గణంలో ఓ అక్షరం మాత్రమే లోపం. ఆ మార్పు కాస్తా చేసేద్దాం.

కాకిపిల్ల తల్లికాకికి ముద్దొకొ!

అంతే - ఓ పాదం తయారు!

అత్త లేని కోడలుత్తమురాలు! ఈ వాక్యాన్ని ఒకే ఒక్క చిన్న మార్పుతో ఆటవెలది పాదంగా మార్చవచ్చు. మీకు తెలుసా?

మీకు వ్రాయాలన్న ’తపన’ ఉంటే అదే మీచేత వ్రాయిస్తుంది. నిజం. కానీ మనకు ఈ నియమాలు అవీ చూస్తే చికాకు. ఈ చికాకు, పరాకు పోవాలంటే మీకు ఇష్టమైన విషయంలో మంచి పద్యాలు, వీలయితే చిన్నచిన్న పద్యాలు, తేటగీతి, ఆటవెలది, కందం వీటిలో వ్రాసినవి చదవండి. ఉదాహరణకు - ఓ చక్కని అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అందం ఎలా ఉందంటే -

నువ్వుపువ్వు నవ్వు జవ్వని నాసిక
చివురుసవురు జవురు నువిదమోవి
మబ్బునుబ్బుగెబ్బు బిబ్బోకవతివేణి
జగమెఱుంగు దాని జగమెఱుంగు.

ఈ పద్యంలో చిన్నచిన్న పదాలలో అమ్మాయి ముక్కును, పెదవిని, జడను వర్ణించడం చూస్తే ఓ మారు ఆహా అనిపిస్తుంది. (ఈ పద్యం నేను పదవ తరగతిలో ఓ లైబ్రరీలో చదివి భట్టీయం వేశాను. ఈ మధ్యనే ఇది చేమకూరవెంకటకవి విజయవిలాసం లోనిదని తెలిసింది)

అలాగే మీకు పదాలతో కవులు ఎలా ఆడుకుంటారు! ఈ విషయం మురిపెంగా అనిపిస్తే ఈ క్రింది పద్యం స్ఫూర్తినివ్వచ్చు.

ఎందుండి ఎందు బోవుచు
ఇందలి కేతెంచినార లిప్పుడు? విద్వ
ద్వందిత! నేడు కదామ
న్మందిరము ధన్యంబయ్యె మాన్యుడ నైతిన్!

ఈ పద్యం మనుచరిత్రలోనిది. ఇలాంటివి అనేకం దొరుకుతాయి. చదువుతూ ఉండండి. ఇంకా సులువుగా , సమస్యాపూరణలు శంకరయ్యగారి బ్లాగులో ప్రతిదినం ఉంటున్నాయి. వాటిని చదవండి.

ఒక్కోసారి, మన కోపాన్ని కూడా ’తపన’ కింద మార్చుకోవచ్చు. ఉదా: నాకు ’ఫలానా’ కామేశ్వర రావు గారంటే కోపం. ఆయనలా పద్యాలు రాయలేకపోతున్నానని ఉక్రోషం. ఆయన బ్లాగు హిట్లను చూసి కుళ్ళు, వగైరా. ఇప్పుడు ఆ ’స్ఫూర్తి’ తో ఎలాగో కష్టపడి

’మర్రిచెట్టు కలదు మహిలోన ఒకచోట
మర్రిచెట్టుకొక్క తొర్ర కలదు’ - అని గరికపాటి వారు వెక్కిరించిన రీతిలో ఓ పద్యం వ్రాసాను. పైగా ఈ పద్యం తప్పొప్పులు చూడమని ఆయన్నే అడుగుతాను! నా ప్రతీకారం, ఆకాంక్ష రెండూ తీరతాయి! పైగా ఆయన్ను ఇలాంటి పద్యాలతో కాల్చుకు తినదం అన్న పురుషార్థమూ దక్కె.చూశారా, ద్వేష బ్లాగు రాయడం కంటే ద్వేషపద్యం వల్ల ఎన్ని అడ్వాంటేజులో!

నేర్చుకోవాలన్న ’తపన’- చాలా పనులు చేయిస్తుంది. ఈ విషయం స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుంది. అంచేత పైన విషయాలు వ్రాశాను.

ఇక గురువు. ఈ విషయంలో చాదస్తం అనుకున్నా పర్లేదు చెప్పాలి. ఒక్కోసారి మంచి గురువు, మీ చేత అద్భుతాలు చేయిస్తాడు, నిజానికి తనేమీ చేయకుండానే. అయితే దీనికి ప్రేమతో కూడిన ఓ బలమైన అభిమానం, నమ్మకం ముఖ్యం. ఈ విషయాలు quantitative కాదు కాబట్టి నిరూపించడం సాధ్యం కాదు. కానీ నా జీవితంలో చాలా సార్లు నాకు ఈ అనుభవం ఎదురయ్యింది. ఈ విషయం మిమ్మల్ని మీరు అడిగి తెలుసుకోవలసిందే. 

దినుసులు సమకూరాయి.

ఇక మొదలెట్టటం ఎలా? ఇదో భయంకరమైన భూతం. కానీ భూతాన్ని ఎదుర్కోవాలంటే రాకుమారుడు లేదా షాడో లాంటి వీరుడు మొదట దాని వీక్నెస్ ఎక్కడుందో చూస్తాడు. అంటే సమస్యను కుదింపజేయడానికి చూస్తాడు. మనమూ అదే చేస్తే పోలా? ఎలానో క్రమంగా చూద్దాం.

౧. మొదట ఆటవెలది/తేటగీతి పద్యాలు సులువు. వాటితో మొదలెట్టటం మంచిది.
౨. ఏ పద్యం మనకు సులువు? ఇది వ్యక్తులను బట్టి ఉంటుంది. ఒకరికి వర్ణన ఇష్టమైతే ఒకరికి సమస్యాపూరణ ఇష్టం.

సమస్యాపూరణ అనుకోండి. సమస్యాపూరణ చివరిపాదం అయితే అంతకు ముందు ఓ పాదం మాత్రమే వ్రాయండి. ఆ తర్వాత వీలున్నప్పుడు మిగిలిన పాదాలు వ్రాయండి. కుదరకపోతే మీ ప్రయత్నాలు వివరించి గురువులను శరణు వేడండి. వారే మార్గం చూపిస్తారు.

వర్ణన అయితే ఏ పాదానికి ఆ పాదం విడిగా వ్రాసేసుకోడానికి పూనుకోండి. ఉదాహరణకు - పద్యం గురించే రాయాలనుకోండి. ఇలా మొదలెట్టవచ్చు. ఆటవెలది ఎంచుకుందామా?

ఆ.వె:

పద్యము మనసుకును హృద్యముగాఁ దోచు
పద్యము సుమలలిత పద శుభదము
...
...

మిగిలిన రెండు పాదాలు అవే మాటలలో పూరించి ప్రయత్నించి చూడవచ్చు.

అబ్బే! పై పద్యం "నాకొక బుల్లి చెల్లి" ని గ్రాంథికంగా చెప్పినట్టు ఉంది అని మీరనుకోవచ్చు. కానీ "కాకిపిల్ల కాకికి ముద్దు". ఇలా జనులమీద experiment చేస్తేనే మనకు వస్తుంది.

ఇంకాస్త సులువు పద్ధతుంది, అయితే కాస్త తెలివి, ట్రిక్సు కావాలి. ఇదివరకు ప్రముఖ కవులెవరైనా వ్రాసిన టెంప్లేటును వాడుకుని మీరు అందులో సబ్జెక్టు, కొన్ని పదాలు మార్చి, మీ పద్యంలా భ్రమింపజేయవచ్చు. ఇదొక ట్రికీ కళ. అలవడితే మాత్రం భలే రంజుగా ఉంటుంది. మీ ఎదుట ఇతరులు ’అసలు’విషయం తెలుసుకోలేక మీ పద్యాలను ’ఆహా, ఓహో’ అంటూంటే, భలేగా ఉంటుంది. (నేనిలా బోల్డన్ని రాశాను. :-))

ఉదాహరణకు చాటువుల్లో తిరుపతి కొండమీద ఒకాయన సీసం వ్రాశారు. ప్రతి పాదాంతంలో "కొండ" అని వస్తుంది. నేను అలాగే ప్రతి పాదం చివర్లో "నగరి" అని వాడుకుని పద్యం ప్రయత్నించి సఫలమయ్యాను.

ఇలా తేటగీతులు, ఆటవెలదులు, బ్లాగు జనులమీద ప్రయోగిస్తూ వెళ్ళండి. మధ్యమధ్యలో మన గురువులను సాధ్యమైనంత విసిగిస్తూ ఉందండి. ఇంకా మీ బ్లాగు ఉంది కదా, అక్కడ ఫోటొ, కింద ఓ పద్యం, బాలకృష్ణ, విజయకాంత్ లాంటివారి మీద పద్యాలు, వీలైతే సమస్యా పూరణలు, మీ పాపాయి/బాబు బోసినవ్వు మీద ఓ మాట, ఇంకొన్ని సలహాలు క్రింద.

* ఇతరుల పద్యాలు తీసుకుని, వాటిలో పదాలు మాత్రం మార్చి మీరో పద్యం వ్రాయండి.
* యతి కిట్టించదం కోసం బ్రౌణ్యగ్రంథం వెతకండి. ఉదా: ఇది వరకు పద్యం మీద పద్యం ఉంది కదా. మీకో ఆలోచనొచ్చింది."పద్యము వలన మది ........" తర్వాత రావట్లేదు. ఇప్పుడు -
యతి స్థానంలో "ప", "పం", "పా", "పై", "పౌ", "వ", "వా","వౌ","వై" - వీటితో మొదలయే పదాలు వెతకండి. ఏదో ఓ పదం దొరక్కపోదు!
* వేటూరి పాట, మీకిష్టమైన దాన్ని తేటగీతి/ఆటవెలదిగా మార్చండి. (ఇది నేను చేశానోసారి. మరో ప్రముఖులు కూడా చేశారు.:-))
* మీ దైనందిన జీవితంలో మాటలని పద్యాలుగా మార్చండి. (ఇది చాలా ప్రావీణ్యతనిస్తుంది. నిజం)
* మీరో పద్యపాదం వ్రాశారు. అది చూసి, మీకే "ఏంట్రా ఇది" అనిపించిందనుకోండి. ఫీల్ అవద్దు. కాస్త ఆలోచించి, కుదిరిన చోట్ల అరసున్న పెట్టండి. పద్యానికి హుందాతనం వస్తుంది. నిజమ్.
* చివరిగా - కొంచెం వ్యక్తిత్వ వికాసం టచ్ లో - మీ రచనలను మీరు గర్వంగా ఫీల్ కండి. ఇతరులూ వాటి గురించి అలానే అనుకుంటారు.

18 comments:

 1. సులువు సులువంచు మిక్కిలి సులభ రీతి
  ముదము మీరగ మీముద్దు ముద్దు పలుకు
  లన్ని చదువుతు వ్రాసితి లక్షణముగ
  తేటగీతిని, ఇది తమదే ఇక రవి

  ReplyDelete
 2. పనిగాదు నీతో! ఐనా పరిక్ష పూర్తయిపోయినాక స్లిప్పులిచ్చి ఏం ప్రయోజనం? :)

  ReplyDelete
 3. @jaggampet: నెనర్లు.

  @భారారె:

  పద్యరచన లోన పదును దేలుచుయున్న
  భాస్కరుండు చెలగి భాసురముగ
  రవికి వ్రాసినట్టి రమ్యమైన కవిత
  అందుకొంటినయ్య ’హార’ వర్య!

  @కొత్తపాళీ గారు: మార్చి పోతే సెప్టెంబరు, సెప్టెంబరు పోతే మార్చి ఉండనే ఉన్నాయిగా. :-)

  ReplyDelete
 4. "నాకు ’ఫలానా’ కామేశ్వర రావు గారంటే కోపం. ఆయనలా పద్యాలు రాయలేకపోతున్నానని ఉక్రోషం."

  హహహ! ఆ "ఫలానా" నేనేనని నాకు నేనే ఊహించేసుకొని గర్వపడుతున్నాను :-) స్పర్థయా వర్ధతే విధ్య!
  మీరిచ్చిన "ఎందుండి ఎందు బోవుచు" పద్యంలో ఒక తప్పు దొర్లింది. ఏమిటో కనిపెట్టండి చూద్దాం! :-)

  ౧. వ్రాయాలన్న తపన
  ౨. నియమాలు తెలుసుకోవడం
  ౩. మంచి గురువు/సలహాలు చెప్పగల వారిని ఎన్నుకోవడం.
  ఈ మూడూ కుదిరి సాధన మొదలుపెట్టి, కొంత పద్యరచన పట్టుబడ్డాక అక్కడే ఆగిపోకూడదు. ఈ కింద మూడు పై వాటికి కొనసాగింపు:

  ౧. బాగా వ్రాయాలన్న తపన
  ౨. నియమాల వెనకాల రీజనింగు ఆలోచించడం
  ౩. పుస్తకాలని గురువుగా చేసుకోడం

  ReplyDelete
 5. అబ్బ టెంప్ట్ చెసేస్తున్నారు మీరు...ఏది కాగితం, ఏదీ పెన్ను, నేనూ రాసేస్తా!

  ReplyDelete
 6. @కామేశ్వర రావు గారు: అలాంటి "ఫలానా" లెవరూ లేరండి. ఆ మాట మాటవరసకే.:-)

  పద్యంలో తప్పు:-

  చివరిపాదంలో "పవిత్రమయ్యె" కు బదులు "ధన్యంబయ్యె" వ్రాసినట్టున్నాను. కరెక్టేనా? నాలుగో పాదం రాసేప్పుడే ఏదో చూచాయగా తెలిసింది. అయితే వావిళ్ళ వారి మనుచరిత్రము ఊళ్ళో ఉండిపోయింది. కాబట్టి సరిగ్గా ఏది నిజమో తెలియడం లేదు.

  @ఆ.సౌమ్య: రాసెయ్యండి. ఎంచేతో జాలంలో ప్రమదలు పద్యాల జోలికి వెళ్ళడం లేదు. కథలు, బ్లాగు టపాలు అంత చక్కగా రాసి, పద్యాలనెందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళూ ఇందులో అడుగిడితే చాలా బావుంటుంది.

  ReplyDelete
 7. పద్యం పద్యమనుచు గద్య ముక్తావళి పఠించి,
  డూయబుల్ థింగ్స్ అని నమ్మించి, ఏమార్చి,
  'క 'యన్న చోట 'కూ'గ మార్చుడు అని వచించి,
  మీయొక్క పాండిత్యం ప్రదర్శించిరా రవి!!!

  నేను పైన వ్రాసిన దానికి ఏమీ అర్ధం ఉండకపోవచ్చు :P
  Just kidding :)

  కానీ మీరు వ్రాసింది చదువుతుంటే, పద్యాల మీద ఎక్సపరిమెంట్స్ చేయాలనిపిస్తోంది :)

  ReplyDelete
 8. బిడియముతో దాగుకొనిన
  యమ్మగువను దరిచేర బిలిచి
  నేర్పున పరుగిడక నిలిపి
  ముద్దడిగితి చిన్నదాన నెద కెత్తుకొని!!

  బ్లాగాగ్ని గారూ!
  ఇది నేను రాసిన మొట్టమొదటి పద్యం.. మీ వ్యాసమే స్ఫూర్తి.. శ్రీ గురుభ్యోనమః...
  చిన్నప్పుడు నేర్చుకున్న ఛందస్సు కొంచం కొంచం తప్ప గుర్తులేదు. పైన నేను రాసిన నాలుగు ముక్కలూ అసలేదైనా వృత్తం లోకి వస్తాయో లేదో చూసి అవసరమైతే కొంచం మరమ్మత్తు చేసి పెట్టండీ...
  రాధేశ్యాం
  సొంతఘోష(http://radhemadhavi.blogspot.com/)

  ReplyDelete
 9. రాధేశ్యాం గారు: నేను మీకు గురువుగా తగను. ఎందుకంటే నాకే సరిగా ఏవీ తెలియవు కాబట్టి. ఓ మిత్రుడిగా మీ పద్యాన్ని ఆటవెలదిగా ఈ క్రిందివిధంగా దిద్దాను. ఆటవెలది నియమాలు చదివి, ఈ క్రింది పద్యం అర్థం చేసుకుందుకు ప్రయత్నించగలరు.అన్నట్టు మీ పద్యం భావం బహు చక్కగా ఉంది.

  ఆ.వె||

  బిడియము వలనను కనబడక దాగు
  నమ్మగువను దరికి రమ్మటంచు
  నయమున పరుగిడక నిల్పి నందనమున
  ముద్దడిగితి పాప వద్ద నేను!!

  ReplyDelete
 10. ధన్యవాదాలు..
  మేష్టారూ..దీనికి గురుదక్షిణగా కనీసం ఒక కందపద్యం (నాకు చాలా ఇష్టమైనది) ఎలాగోలా వండివార్చేస్తాను...!!

  ReplyDelete
 11. రవి గారూ,
  నమస్కారం. ఈమధ్యే నేను వ్రాసిన పద్యాలు(ఒకే పద్యం - మూడు వెర్షన్స్)చదివి సరిదిద్ద గలరు:

  కందపద్యాల నియమాలను చదివిన మీదట ఈ క్రింది పద్యం వ్రాశాను. యతి ఎలా సాధించాలో తెలియలేదు. అసలు మిగిలిన నియమాలు కూడా సరిపొయాయా లేదా సరిచూచి మీ అభిప్రాయాన్ని చెప్పగోరుతాను.

  నమ్మితి నిను యుల్లంబున
  నమ్మితి చరణారవింద యుగ్మము నిజమున్
  నమ్మితి సాగర సంసా
  రమ్మును నడి లోతులోన దాటింప తగున్

  నమ్మితి యుల్లంబందున
  నమ్మితి శ్రీ వేంకటపతి పద పద్మములన్
  నమ్మితి సాగర సంసా
  రమ్మిలలో మొల లోతున దాటింపతగున్..!

  నమ్మితి యుల్లంబందున
  నమ్మితి శ్రీ వేంకటపతి పల్లవ పదమున్
  నమ్మితి సాగర సంసా
  రమ్మిలలో మొల లోతున దాటింతువనిన్

  తన పాదాలను ఆశ్రయించిన వారిని శ్రీ వేంకటేశ్వరుడు ఈ సంసార సాగరాన్ని కటిలోతులోనే దాటిస్తాడు అని చెప్పదలచాను.

  (శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారి బ్లాగులో మత్తకోకిల వృత్తం గురించి చదివి ప్రయత్నించాను.అది కూడా వీలు చూసుకొని చదవమని ప్రార్ధన.
  http://radhemadhavi.blogspot.in/2013/04/blog-post_6.html)
  మీ సలహాకై ఎదురుచూస్తూ..
  నమస్కారాలతో
  - రాధేశ్యామ్

  ReplyDelete
  Replies
  1. నేను పద్యాలు రాయట్లేదండి. మీరు వ్రాసిన పద్యాలలో రెండవపాదంలో యతి మాత్రమే భంగమయ్యింది. అన్నీ ఒకే అర్థాన్నిస్తున్నాయి కనుక ఒక్క సవరణ మాత్రమే సూచించాను.

   correction:
   నమ్మితి నిను యుల్లంబున
   మ్మితి పదపద్మయుగళి నయము నిజమున్
   నమ్మితి సాగర సంసా
   మ్మును నడి లోతునను తణము సలుపగన్

   http://dsal.uchicago.edu/dictionaries/brown/ లో మీకు కావలసిన శబ్దాలను ఎంచుకుని యతి సరిచూసుకోండి. పద్యం రాయటం కోసం భావాన్ని కుంటుపడనీకుండా, మంచి భావం కలిగినప్పుడే పద్యాన్ని వ్రాస్తే బావుండునని నా అనుకోలు.

   Delete
  2. ధన్యవాదాలు రవి గారూ..!
   మొదటి పద్యంలో స్వామి పేరు రాలేదు కదా అని మిగిలిన రెండూ ప్రయత్నించాను. పేరు రాకపోయినా అర్థవంతమై పూర్తి అయిన భావం కలిగిస్తోందా అని ప్రశ్న..!

   Delete
  3. అర్థవంతమే.

   నమ్మితి శ్రీ వేంకటపతి నళినపదంబుల్ - అనండి. సరిపోతుంది.

   Delete
 12. ధన్యవాదాలు రవిగారూ,
  చాలా సులువుగా తేల్చేశారు.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.