Friday, October 15, 2010

Adventures of రేవంతో సాన్


2001. భాగ్యనగరంలో ఉద్యోగం వెలగబెట్టే రోజులవి. కంపనీ వారు ఓ శిక్షణా సంస్థలో నాకూ, ఇంకా కొంతమందికి జపనీసు భాష తేరగా నేర్పించడానికి నిర్ణయించారు. పని చెయ్యడానికి మనకు బరువు కానీ, ఇలాంటివి నేర్చుకోమంటే అనిష్టం ఎక్కడుంటుంది? క్లాసులో చేరాను. చేరిన రోజే పరిచయమయాడు రేవంతో సాన్. తనో చిన్న సాఫ్టువేరు సంస్థలో గానుగెద్దు పనిచేసేవాడు.

రేవంత్ - అందగాడు,పొట్టివాడు, అయితేనేం గట్టివాడు. నేనేమో మాటలపొదుపరిని, అమ్మాయిలను చూస్తే బిగుసుకు పోయే వాణ్ణీ అయితే తను మాత్రం మంచి మాటకారి, అమ్మాయిలతో అయితే చెప్పనక్కరలేదు. బైకు బాగా నడిపేవాడు, కాళ్ళు అందక పోయినా. నా లైఫులో నాతో విభేదించేవాళ్ళూ, నా స్వభావానికి విరుద్ధంగా ఉండేవాళ్లే నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యారు ఇప్పటి వరకు. రేవంత్ కూడా అంతే, నాతో పరిచయమైన కొన్ని రోజుల్లోనే తను నాకు బాగా క్లోజయ్యాడు.

జపనీసు నేర్పడానికి ఇద్దరు అమ్మాయిలు వచ్చేవాళ్ళు మాకు. వాళ్ళ పేర్లు - కవోరి. సతోమి. వారిద్దరిలో కవోరి మెఱుపు తీగ. కవోరి జపాను అమ్మాయిల్లా కాక, కూసింత ఇండియనులా కనిపించేది.ఓ సంక్రాంతి రోజు లంగా ఓణీ కట్టుకుంటే చూసే భాగ్యమూ కలిగించింది తనో సారి.

సతోమి మట్టుకు జపాన్ బొమ్మ. చిట్టి కళ్ళు, చట్టి ముక్కు, వగైరా వగైరా...సతోమి పొద్దున తరగతులకు వస్తే, కవోరి సాయంత్రం వచ్చేది. నేను, రేవంత్ పొద్దున తరగతులకు వెళ్ళేవాళ్ళం. అక్కడ చేరిన అందరిలోకి జపనీసుమీద శ్రద్ధ నాకే ఎక్కువగా ఉండేది కాబట్టి సతోమి నాతో కాస్త బాగా మాట్లాడేది.

ఇలా ఉండగా, రేవంతో సాన్ తను సాయంత్రం తరగతులకు మార్పించుకున్నాడు. ఎందుకని నాకు అర్థం కాలేదు. కానీ, కొన్ని రోజులకు నేనూ సాయంత్రం తరగతులకు వెళ్ళసాగాను. ఓ రోజు క్లాసు ముగిసిన తర్వాత కవోరి, రేవంతో నవ్వుకుంటూ ఏదో మాట్లాడ్డం గమనించాను.తర్వాత ఆదివారం మా రూములో మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో రేవంతో సాన్ విషయం చెప్పేడు. తను కవోరిని పేమిత్తున్నాట్ట! ఇంకా గొప్ప విషయం ఏమంటే - ఆమే ఇతణ్ణి కొంచెం కొంచెం ఇష్టపడుతోంది (లేదా రేవంత్ అలా అనుకుంటున్నాడు)! ఇదేదో ఆషామాషీ వ్యవహారం అనుకున్నాను కానీ, అదో సిన్సియరు వ్యవహారమని (లేదా తను సిన్సియరుగా ఫీల్ అవుతున్నాడని) నాకు తొందరగానే తెలిసింది.

జపనీసు గాళ్ళు మహా పిసినిగొట్లు. ఆటోలో ఈ ఇద్దరు అమ్మయిలు ఎక్కడికైనా వెళితే ఇద్దరూ సగం సగం లెక్క తేల్చేసుకోవాల్సిందే. అంచేత రేవంతో సాన్ ఆ అమ్మాయిని బానే ఆకర్షించగలిగాడు, బైకులో షికార్లూ, హోటళ్ళలో బిరియాణీలు తినిపించడాలవీ చేసి.

లైఫు అలా ప్రశాంతంగా గడిచి ఉంటే ఈ టపా రాసే పరిస్థితి ఎందుకు వస్తుంది? విలన్ ఎంట్రీ ఇచ్చాడు. అదే శిక్షణా సంస్థలో ఏ జావాయో వెలగబెట్టటానికి జపాన్నుంచీ దిగాడు. అతనో బండరాముడు. మహా లావుగా, మోటుగా ఉండేవాడు. వాడి ఇంటిపేరు కూడా "యమమోటో". వాడికి ఉన్నది వాపే కాదు, బలుపు కూడా. అంటే - అతనొక ధనవంతులబ్బాయి. అతడి తండ్రి బిజినెస్ మాన్. ఓ పది పదిహేను ఎలక్ట్రానికి గాడ్జెట్లు ఉండేవి అతని దగ్గర.

విలన్ ఎంట్రీతో అక్కడ రెక్టాంగులర్ లవ్ స్టోరీ మొదలయ్యింది.
రేవంతో - కవోరిని పేమిత్తున్నాడు.
బండరాముడు - సతోమిని లైక్ చేస్తున్నాడు. సతోమి, కవోరి ఫ్రెండ్స్ కాబట్టి కవోరిని కూడా భరిస్తున్నాడు.
సతోమి - బండరాముణ్ణి (బండరాముడి గాడ్జెట్స్ ని కూడా) బాగా ఇష్టపడుతోంది.
కవోరి - గాడ్జెట్సా, బైకులో షికార్లా అన్న డైలమాలో ఉంది. బండరాముడు సతోమిని ఇష్టపడ్డంతో కాస్త జెలసీగా ఫీలవుతోంది.

మనవాడు రేవంతో - పార్ట్ టైము దేవదాసు, పార్ట్ టైము లవరూ పాత్రలు శక్తివంచన లేకుండా పోషిస్తున్నాడు. బండాస్ - మధ్యలో ఓ వారం జపాను వెళ్ళి మరిన్ని గాడ్జెట్సు తీసుకొచ్చి తన విలను రోల్లో జీవించేస్తున్నాడు. ఇంతలో.... ఎంచేతో ఏమో బండరాముడికి వాళ్ళ నాన్న దగ్గర్నుండీ కబురందిందో, లేక పరీక్షలొచ్చాయో తెలీదు కానీ ఊరికి వెళ్ళిపోడానికి సన్నద్ధమయాడు. వాణ్ణి విమానాశ్రయంలో డ్రాపు చేయడానికి ఇద్దరమ్మాయిలు వెళ్ళారు. అక్కడ విమానాశ్రయంలో - కవోరికి అంతకుముందే తనకు విమానంలో పరిచయమైన ఫ్రెండు ఒకడు తిరిగి కనిపించాడు. అతడు వాళ్ళ ఊరికి (చెన్నై) కి కవోరిని రమ్మని, తన ఇంటికి, కుటుంబసభ్యులతో (అమ్మ, నాన్న వగైరా) గడపడానికి గెష్టుగా రమ్మని రిక్వెస్టించాడు. ఆ అమ్మాయి ఓ వారాంతం చెన్నైకి వెళ్ళింది. అక్కడ ఆమెకు దురదృష్టవశాత్తూ ఆ అబ్బాయి కనిపించలేదు.

ఇలాంటి ట్విస్టులన్నీ అయిన తర్వాత రేవంతో లవ్ ట్రాకు గాడిని పడింది. కొన్ని రోజులకు తను నాతో అన్నాడు. " కవోరిని నేను పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాను. ఇంట్లో ఎలా చెప్పాలో తెలియట్లేదు." నాకు పక్కలో బాంబుపడినట్లయ్యింది. నేను వాళ్ళింటికి ఒకట్రెండు సార్లు వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నామీద ఓ మోస్తరుగా మంచికుర్రాడన్న అభిప్రాయంతో ఉన్నారు. అలాగని ఇప్పుడీ ఇంటర్నేషనల్ సమస్యను డీల్ చెయ్యలేను. తనకు నచ్చజెప్పాను - "ఇలా ఇంటర్నేషనల్ స్థాయిలో సమస్యలు సృష్టించుకోకు. కొన్ని రోజులు ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ దేశమెళ్ళిపోతుందని". అతనికి కూడా విషయం అర్థమయ్యింది, కానీ జీర్ణించుకోడానికి ఇబ్బందై సతమతమయ్యాడు.


కవోరి తన దేశానికి తిరిగి వెళ్ళే రోజు తొందర్లోనే వచ్చింది. మా కోర్సు ముగిసింది. (జపనీసు వెలగబెట్టిన అందర్లోకి నేను అధికుణ్ణి). రేవంతో సాన్ కూడా పాసయ్యేడు. తనకు ఆ అమ్మాయి మీద ఇష్టం జపాను మీద ఇష్టంగా మారసాగింది. జపానుకు ఎలాగైనా వెళ్ళాలని కలలుగనేవాడు. నాకు బెంగళూరులో ఇంకో ఉద్యోగం రావడంతో బెంగళూరుకు వచ్చేశాను. రేవంతో బెంగళూరుకు ఒకట్రెండు సార్లు వచ్చి నన్ను కలిసేడు. నాకు జపాను ఆన్సైటు ఛాన్సు వస్తే తననూ ఎలాగైనా లాగమని అడిగేవాడు.

కొన్ని నెలల తర్వాత రేవంతోకు ఓ పెద్ద బహుళజాతి సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత యేడాదికి పెళ్ళి కుదిరింది. పెళ్ళి కుదరడంతోబాటూ యోకోహామా కు ఆన్సైటు ఛాన్సూ వచ్చింది. చివరి సారి తన కబురు నాకు ఐదేళ్ళ క్రితం తెలిసింది. ఆ తర్వాత నా యాహూ ఐడీ పాతబడి, ఉపయోగించకుండా మూలబడ్డంతో, ఆ తర్వాత తన వివరాలేవీ నాకు తెలియకుండా పోయినయ్. నాకు మట్టుకు ఇంతవరకు జపాను వెళ్ళే యోగం కలుగలేదు!

5 comments:

 1. సూర్యుడు గారు చెప్పినట్లు కథనం చాలా బాగుంది. ఇంతకు ముందు జపానీయుల గురించి, జపనీసు భాషగురించి కొన్ని టపాలు వ్రాసినట్లున్నారు. ఇదన్నమాట పూర్వ రంగం!

  ReplyDelete
 2. రేవంత్ అనగానే అదేదో యండమూరి నవల్లో హీరో గుర్తుకువచ్చాడు! దానికేం తీసిపోకుండానే ఉంది మీ సాహసాల, I mean, రేవంతో సాహసాల కథ! కొత్త భాష బాగా నేర్చుకోడానికి ఇలాంటివి మంచి స్ఫూర్తిదాయకం. :-)

  ReplyDelete
 3. @కామేశ్వరరావు గారు: అనుకున్నదంతా అయిందీ! ఇవి నా సాహసాలు కావండి. :-) రేవంతో (పేరు మార్చాను) భాగ్యనగరంలో .. Guda అనేచోట ఉన్నాడు. కలవడానికి వీలు పడక వెళ్ళలేదు. నా సాహసాలన్నీ కాలేజు రోజుల్లో, పూనాలో ఉన్న రోజుల్లోనే ముగించేశాను.
  @చంద్రమోహన్ గారు: అవును, జపనీసు గురించి ఇంకా రాయాలని ఉంది కానీ, పదేళ్ళ క్రితం కొంతమాత్రమే నేర్చుకున్న భాష. గుర్తుకు రావట్లేదు.
  @సూర్యుడు,@కొత్తపాళీ గార్లు: నెనర్లు.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.