Tuesday, October 26, 2010

జయజయ....

ఆదిత్య 369 గుర్తుందా? సకుటుంబ సమేతంగా చూడగలిగిన కొన్నేకొన్ని బాలకృష్ణ సినిమాలలో అది ముఖ్యమైనదని మా ఇంట్లో పెద్దలు నొక్కకుండనే వక్కాణించేవాళ్ళు. ఆ సినిమాలో ఒకానొక దృశ్యంలో కృష్ణదేవరాయలు విష్ణువు మీద ఓ పద్యం చదువుతాడు (పాడతాడు), తనదేవేరితో కలిసి దేవాలయంలో కులదైవాన్ని పూజిస్తున్న సందర్భంలో. ఆ పద్యం ఇక్కడ చూసి రండి. తర్వాత మాట్లాడుకుందాం.

ఈ సినిమా మొదటిసారి చూసినప్పుడు నాకీ పద్యం తెగనచ్చేసింది. పాడుకోడానికి పాటలా ఉంది, స్తోత్రంలానూ ఉంది. అలాగని కఠినంగా లేక, చాలా లయాత్మకంగా ఉంది. ఇదేం పద్యమబ్బా అని చాలాసార్లు అనుకున్నాను. ఈ పద్యం రాయల వారు పాడారు కాబట్టి, ఆముక్తమాల్యద లోనిదని ఇన్నాళ్ళూ అనుకుంటూ వస్తున్నాను . ఆముక్త మాల్యద లో చాలా పద్యాలు వ్యాఖ్యానం ద్వారా విన్నప్పటికీ, చదివినప్పటికీ ఈ పద్యం గురించి ఎవరూ ఎందుకు మాట్లాడట్లేదా అనిపించేది. తెలుగుపద్యం - కామేశ్వరరావు గారిని ఈ పద్యం గురించి చాలాసార్లు అడగాలనుకుని మర్చిపోయాను.

- ఈ పద్యం అల్లసాని పెద్దన గారి మనుచరిత్రలోనిది. నాకు ఈ మధ్యనే పాతపుస్తకాల దుకాణంలో వావిళ్ళ వారి మనుచరిత్రము, రాఘవపాండవీయము దొరికాయి. ఈ రోజు మనుచరిత్రం సౌరభాన్ని ఆస్వాదించాలని, (ఆఘ్రాణించాలని కూడా) మనసుపుట్టి ఓ పేజీ తెరవగానే చప్పున ఈ పద్యం కనిపించింది. 

ఆరవ ఆశ్వాసంలో, స్వారోచిషునికి హరి ప్రత్యక్షమయితే ఆయనను స్వారోచిషుడీ విధంగా పొగడుతాడు.

జయజయ దానవదారణకారణశార్ఞ్గరథాంగగధాసిధరా
జయజయ చంద్రదినేంద్రశతాయుతసాంద్రశరీరమహఃప్రసరా
జయజయ తామరసోదరసోదరచారుపదోజ్ఝితగాంగఝరా
జయజయ కేశవకేశినిషూదన శౌరి హరీ దురితాపహరా

అర్థం :
దానవ = అసురుల
దారణకారణ = భేదమునకు హేతువులైన
శార్ఞ్గ, రథాంగ, గదా, అసి, ధరా = విల్లు, చక్రము, గద, ఖడ్గము తాల్చినవాడా
జయజయ
చంద్ర దినేంద్ర శతాయుత, సాంద్ర శరీరమహః ప్రసరా = చందురుల, ఆదిత్యుల, పదిలక్షలయొక్క విస్తారమైన శరీరకాంతినిపోలిన శరీరకాంతి కల్గినవాడా
జయజయ
తామరసోదర = పద్మాంతర్భాగమైన కెంపుకు
సోదర = సమానమైన
చారు = మనోహరమైన
పద ఉజ్ఝిత = పాదములనుండి వదలబడిన
గాంగఝరా = గంగానదీప్రవాహము కలిగినవాడా
జయజయ
కేశవ = మంచికేశములు కలిగినవాడు/బ్రహ్మరుద్రులకు పుట్టుక అయినవాడు అని రెండర్థాలుట (శోభానాః కేశాః యస్య సః, కశ్చ, ఈశశ్చ కేశౌ, తావస్మిన్ స్తః ఇతి కేశవః)
కేశినిషూదన = కేశి అనే రాక్షసుని చంపిన
శౌరి = శూరవంశోద్భవుడా
హరీ = హరీ
దురితాపహరా = వృజినములణఁచి వేయువాడా
జయజయ.

ఈ పద్యంలో మరో చక్కటి విశేషముంది. ఇది "కవిరాజవిరాజితము" అన్న ఛందస్సు. ఈ ఛందస్సులో ప్రత్యేకత మొదట నగణం తో మొదలై, ఆ తర్వాత 6 జ గణాలు ( లఘువు, గురువు, లఘువు), చివర్లో వ గణం తాలూకు దీర్ఘం తో ముగుస్తుంది. ఇదో అద్భుత లయ. ఎంత చక్కనిదంటే - మా చిన్నారి మొన్నామధ్య - విశ్వనాథ్ సినిమా, సప్తపది లో ఇదే ఛందస్సులో ఓ పాటని చూస్తూ (వింటూ), పాట ముగిసిన తర్వాత ఆ పాట తాలూకు మకుటాన్ని వచ్చీరాకుండా పాడుకుంది. ఆ పాట/స్తోత్రం ఊహించారా?

అయిగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందినుతే
సురవర వంద్య విరోధిని వాహిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హేసితి కంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

(ఇప్పుడు "తమ్మి" (సంహిత) కు పై శ్లోకం చివరిపాదం వచ్చేసింది. ) ఈ ఛందస్సు కాస్త అరుదైనది అనుకుంటున్నాను. ఈ ఛందస్సులో ఏ కవులు వ్రాశారో తెలియకుండా ఉంది. మనుచరిత్రలో మాత్రం రెండు సందర్భాలలో ఈ ఛందస్సు ఉపయోగించాడు కవి.

ఈ రోజు నిదురకు ముందు చక్కటి అనుభూతి. తెలుగు సాహిత్యంలో నాకు చాలా ఇష్టమైన కవి అల్లసాని పెద్దన. (అనేక విధాలుగా ;-)) ఆయన పద్యమే నేను చాలాకాలంగా వెతుకుతున్నదని తెలియటమూ, నాకు నచ్చిన ఛందస్సులో ఉందని తెలియటమూ (ఈ పద్యం ఈ ఛందస్సులోనిదని ఊహించలేదు. పుస్తకం చూసిన తర్వాతే తెలిసింది) ....చాలా బావుంది.

ఈ ఛందస్సు గురించి, ఇతరకవుల ప్రయోగాలను ఎవరైనా తెలిపితే చాలా బావుంటుంది.

9 comments:

 1. అంతా బాగుంది గానీ, కవిరాజవిరాజితం దగ్గరకొచ్చేస్సరికి curved ballవేశారు.
  నాకేమో ఆరు జ గణాలని గుర్తు. ఎక్కడబ్బా తేడా అని బుర్రగోక్కుంటే .. మీరు మొదటి గణాన్ని "నల" అని నాలుగక్షరాలు లెక్క వేశారు.
  ఐతే ఒకటి గమనించండి. దీన్ని రిసైట్ చేస్తుంటే జ-గణపు తూగే బలంగా వినిపిస్తుంది.

  ReplyDelete
 2. రవీ !! మంచిటపా. మీ చిన్నారి కూడా తండ్రికి తగ్గతనయే. ఆశీః

  సంగీతంలో నాటు స్వరాలని ఉంటాయి. అవికూడా కవిరాజవిరాజితం లాగానే భలే హృద్యంగా, రిథమిక్ గా ఉంటాయి. "వరలీల గానలోలా" అని త్యాగరాజ విరచితమైనది. అది వింటూంటే "జయ వర వర్షిని దుర్ధర ధర్షిణి" మొ|| గుర్తొస్తాయి.

  "అయిగిరి నందిని" రచించిందెవరని కాదుకదా మీ ప్రశ్న? బెనిఫిట్ ఆఫ్ డౌటు ఇచ్చేసుకుంటూ... ఆదిశంకరాచార్యులవారు. ఏది ఏమైనా మహిషాసురమర్దినీ, సప్తపది సినిమాతో ఉటంకిస్తూ మీరు ఇక్కడ ఒక మంచి లీడ్ ఇచ్చారు నా చిన్నప్పటి గతస్మృతులను నెమరువేసుకోటానికి. కృతజ్ఞుణ్ణి.

  కవిరాజవిరాజితానికీ, మహిషాసురమర్దిని స్త్రోత్రానికీ, సప్తపది కీ గల అవినాభావసంబంధం నా చిన్నప్పుడు మా నాన్నగారు ఒకసరాఇ చెప్పారు. ఇప్పటికీ ఆ వ్యాఖ్య నా మనస్సులో అల్లానే నిల్చిపోయింది.

  ఆ సినిమాలో దేవాలయం పూజారి తన భార్య ని చూడగానే ఆమెలో తను నిత్యం పూజించుకునే అమ్మవారు దర్శనమిస్తుంది (ఆమె వేరొకరికి మనస్సిచ్చింది కాబట్టి అతనికి మాత్రం భార్య కాక పరస్త్రీ నే). ఆ సమయం లో భావోద్వేగంతో, ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఆ భక్తుడు పాడే సందర్భం లో ఈ స్త్రోత్రం ఉంటుంది సినిమాలో.

  అయితే ఎన్నో స్త్రోత్రాలు, శ్లోకాలు, పద్యాలు, కీర్తనలూ ఉంటే అక్కడ మహిషాసురమర్దిని స్త్రోత్రాన్నే ఎందుకు పాడాలి, అల్లా అతను ఆమె చుట్టూ తిరుగుతున్నట్టుగానె ఎందుకు చూపించాలి అంటే, అందులోనే ఉంది కిటుకంతా... అనేవారు. అంతేకాదు...విశ్వనాథుణ్ణి కళాతపస్వి అని వూర్కే అన్నారా? కావాలంటే కళ్ళు మూస్కుని "ఊహించి" చూడు, నీకే అర్థం ఔథుంది అనేవారు, పైపెచ్చు ఎనర్జీ ఫాలోస్ థాట్ అని ముక్తాయించేవారు..

  హృద్యంగా ఆర్ద్రంగా మహిషాసురమర్దిని స్త్రోత్రాన్ని ఆలపిస్తూంటే సింహాన్ని అధిష్టించి వింటున్న సర్వాలంకృత అయిన అమ్మవార్ని పారవశ్యం చెందిన సింహం మందగమనం వంటి చిన్ని పరుగుతో మన చుట్టు లయాత్మకంగా వ్యాహ్యాళి చేయిస్తూంటే, ఆ గమనానికి అమ్మవారి మెడలో ఉన్న హారాలు చిన్ని కుదుపులకి ఘల్లు ఘల్లు మంటూ ఎగిరి పడుతూంతే కలిగే మంద్రమైన తాళం లా అనిపిస్తూంటుంది ఆస్త్రోత్రం అంతా తాళం భాషలో చెప్పాలంటే చంగి చక్క-చంగి చక్క-చంగి చక్క-చంగి చక్క-చంగి చక్క-చంగి చక్క-చంగి చక్క-చా ఇల్లా సాగుతుంది నడక. ఆ భావానికి చేయూతగానే సినిమాలో సింబాలిక్ గా ఆ అమ్మాయి చుట్తూ అతను తిరిగినట్టు పెట్టాడేమో భావించి చూడు అన్నారు. నిజమోకాదోతెలీదు కానీ అప్పటి నుండి, ఇప్పటిదాక ఎప్పుడు ఆస్తోత్రం చదివినా, కళ్ళు అప్రయత్నం గా మూతలు పడటం, ఆ మొత్తం ఊహ కళ్ళకి కట్టినట్టు అనిపించటం, ఆ తర్వాత అనిర్వచనీయమైన అనుభూతి, వెరసి ఆ త్రోత్రం.

  ఎన్నో పద్యాలుంటూంటంగా మీకదే ఇష్టం కావటం, మీరు పుస్తకం తిరగేస్తే అదే కంటపడతం, దానికి నాందిగా సప్తపది చూడటం, మీ అమ్మాయి దానిని పట్టగలగటం, మీరు దాని గమనించి బ్లాగటం, నాకది మధురజ్ఞాపకాలను స్మృతికి తేవటం, ఇవన్నీ కూడా యాదృచ్చికమేనా???? ఎమో ......

  ReplyDelete
 3. @కొత్తపాళీ గారు: మీరే కరెక్టనుకుంటాను. 6 జగణాలని సులక్షణసారంలో ఉంది. నేను ఎక్కడ చూసి అలా అనుకొన్నానో ఇప్పుడు గుర్తు రావట్లేదు. టపా మార్చాను.

  @సనత్: అద్భుతంగా రాశారు. ఒకానొక buddhist (zen) thought ప్రకారం - The purpose of God is - to go above Him. - అంటే దైవం ఉపయోగం - దైవాన్ని కూడా మర్చిపోయే తన్మయత్వానికి గురిచేసే ఆత్మ (స్వ)సాక్షాత్కారం మాత్రమేనట. "అయిగిరి నందిని.." వంటి శ్లోకాలను తల్చుకుంటే అది నిజమేమో అనిపిస్తుంది. భక్తుడు పారవశ్యంతో గానం చేస్తూ, ఒకానొక తన్మయావస్థలో తనను తాను కృష్ణుని చెలికత్తెగా, అమ్మవారి వాహనంగా, ఇలా రకరకాలుగా ఊహిస్తాడట. అది మధురభక్తి. ఆ తర్వాత స్థితి - ఆత్మసాక్షాత్కారం.

  రెండేళ్ళ పాపాయికే ఉత్సాహం వచ్చిందంటే - ఇక నచ్చినవారికి ఆ పద్యానుభూతి - ఊహించవచ్చు.

  ReplyDelete
 4. బాగుంది మీ టపా. నాకు ఆ సినిమాలో శ్లోకం, మహిషాసుర మర్ధిని స్తోత్రం రెండూ ఇష్టమే.

  >>సకుటుంబ సమేతంగా చూడగలిగిన కొన్నేకొన్ని బాలకృష్ణ సినిమాలలో అది ముఖ్యమైనదని.

  ఇది నిజమే. కృష్ణదేవరాయలుగా బాలకృష్ణ బాగున్నాడు.

  శ్రీవాసుకి

  ReplyDelete
 5. "ఈ పద్యం రాయలవారు పాడారు కాబట్టి, ఆముక్తమాల్యద లోనిదని ఇన్నాళ్ళూ అనుకుంటూ వస్తున్నాను"
  మీ ఊహ సరైనదే!
  "జయజయ కేశవకేశినిషూదన శౌరి హరీ దురితాపహరా" - సినిమాలో ఈ చివరి పాదం ఇలా కదా ఉంది:
  "జయజయ కేశవకేశినిషూదన శౌరి శరజ్జలజాక్ష హరీ". మరి ఈ తేడా ఏమిటని అనుమానం రాలేదా? మీ ఊహ నిజమే అనడానికి ఇదే కీలకం ;-) ఆముక్తమాల్యదలో కూడా ఇదే పద్యం విష్ణుచిత్తుడు విష్ణుమూర్తిని స్తుతి చేసే సందర్భంలో ఉంది. చివరి పాదం చివరన మాత్రమే తేడా. మీరు ఇచ్చిన వెర్షన్ మనుచరిత్రలోది. సినిమాలో ఉన్న వెర్షన్ ఆముక్తమాల్యదలోనిది.

  కవిరాజవిరాజితం నల తర్వాత ఆరు భగణాలు గురువు అని లక్షణం చెప్పినా తప్పు లేదు.

  ReplyDelete
 6. @కామేశ్వర రావు గారు: అవునా. ఆముక్తమాల్యదలోనూ ఈ పద్యం ఉందా? ఇదేదో బావుంది.

  ReplyDelete
 7. చక్కని పద్యాలను గురించి వివరించారు రవి గారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ ఈ ఛందస్సును గమనించనేలేదు. ఈ సారి ఈ చందస్సులోని పద్యాలు కనిపిస్తే తప్పక చెప్తాను.

  ReplyDelete
 8. చిన్న సంగతి. 'అయి గిరి నందిని' స్తోత్రం రాసినది శంకరాచార్యులవారు కాదు. ఎవరో రామకృష్ణ కవి. స్తోత్రం నడక అద్భుతం. ఇప్పటికీ నాకు చాలా ఇష్టమైన స్తోత్రమే అయినప్పటికీ అందులోని సాహిత్యం పేలవంగా అనిపిస్తుంది నాకు. శబ్దానికే అందులో ఎక్కువ ప్రాధాన్యం, అర్థానికి కాదు.
  అష్టలక్ష్మీ స్తోత్రం కూడా ఇంచుమించు ఇదే ఛందస్సు అనుకుంటాను.

  ReplyDelete
 9. Usually, I never comment on blogs but your article is so convincing that I never stop myself to say something about it. You’re doing a great job Man, Keep it up.

  The Leo News - this site also provide most trending and latest articles

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.