Wednesday, October 13, 2010

కథకళి ప్రదర్శన చూసిన రోజు...


"ఒక్క టికెట్టు రెండొందలా?" కథకళి ఆర్టిస్టులా కళ్ళు పెద్దవి చేసి అడిగింది మా శ్రీమతి. నాల్రోజులు సెలవు దొరకడంతో, కేరళకెళ్ళాము నేనూ తనూ, పాపాయీ కలిసి. ఓ సాయంత్రం పూట రిసార్టులో పనేమీ లేకపోవడంతో దగ్గరలో జరిగే కథకళి ప్రదర్శన చూడ్డానికి వచ్చేము. బయట వర్షం కురుస్తోంది.

"పర్లేదులే, చూద్దాం" అన్నాను నేను. నాకూ రెండొందలు ఎక్కువనే అనిపించింది. కానీ ఆమెను వదిలితే బయట వర్షంలో క్రెడిట్ కార్డు తూట్లు పడేలా షాపింగు చేస్తుంది, పైగా ఆమె చేసే షాపింగుకు వర్షంలో ఆమెవెంట అంగరక్షకుడిలా నేను నిలబడి ఛావాలి. అంతకంటే ఈ "కలాపోసన" మేలని నా ఎడమవైపు మెదడు ఘోషించింది.

"సీటు నంబరు 27,28" అన్నాడు టికెట్లిచ్చే యువకుడు. చక్కని ముఖ వర్ఛస్సు ఆ యువకుడిది.

పదడుగుల దూరంలో ఓ స్టేజి, ఓ యాభై ప్లాస్టిక్ కుర్చీలు, పల్చగా జనం. కుర్చీలలో కూర్చున్నాము.

రెండేళ్ళ మా పాప ఇక ప్రశ్నల కార్యక్రమం మొదలెట్టింది.

"రాచ్చతుడు ఏం చేత్తాడు?" (కథకళి ఆర్టిస్టు ముఖం చూసి రాక్షసుడని డిసైడు చేసిందది)
"రాచ్చతుడు కాదమ్మా, దామ"
"దామ ఇప్పుడేం చేత్తాడు?"
"కొంచేం సేపయిన తర్వాత డాన్సు చేస్తాడు"
"ఏ డాన్చు?"
"కథకళి"
"అదేమి"
"దీపం?"
"దీపం ఎందుకు?"
"?"
"నేను దీపం మొక్కుంటా"
"అది మొక్కుకునే దీపం కాదమ్మా"
...
...
...

స్టేజి మీద ఓ దీపం (కలివిళక్కు) వెలిగించారు. ఇద్దరు స్ఫురద్రూపులైన యువకులు కథకళి నృత్యానికి తగినట్టు మేకప్ (చుట్టి - చుట్టి అంటే పురుషపాత్రధారి గడ్డంలా ఉన్న తెల్లటి చక్రం. సామాన్యార్థంలో మేకప్) చేసుకుంటున్నారు. నాట్యంలో ఓ స్త్రీపాత్ర, ఓ పురుషపాత్ర ఉన్నట్టు తెలుస్తూంది.

ముఖానికి మేకప్పు పూర్తవగానే పురుషపాత్రధారి నడుముచుట్టూ ఓ తాడుబిగించి కట్టుకుని, నిలబడ్డాడు.

అతడి నడుముకు బిగించిన తాడు అట్టముక్కలను గుచ్చుతూ, గంపలాగ తాయారు చేశారు. దానిపైకి దుస్తులు తొడిగారు. కాళ్ళకు గజ్జలు, కిరీటం, ఇలా పైపైన ఆహార్యం పూర్తయ్యింది. తెరపైనే ఓ మూలగా ఉన్న గదిలోకెళ్ళి పూర్తిగా తయారయ్యారు.

కాసేపటికి లైట్లవీ ఆర్పి, దీపం వెలుగులో కళాకారులు స్టేజి మీదకు వచ్చారు. తెరపై కళాకారులిద్దరూ వెలిగిపోతున్నారు. వారిని చూసేసరికి, అంతవరకూ ప్రశ్నలతో, స్టేట్ మెంట్లతో ఊపిరి సలుపకుండా చేసిన పాపాయి కూడా నోరు తెరుచుకుని చూడసాగింది. ఇందాక టికెట్లు పంచిన కుర్రాడు మైకు పట్టుకుని, కథకళి గురించి ఆంగ్లంలో క్లుప్తంగా చెప్పేడు.

కథకళి ఆట 17వ శతాబ్దంనుంచి ఉన్నదట. సాహిత్యం, సంగీతం, చిత్రం, నాట్యం, నర్తనం అనే ఐదు అంగాల కలయిక కథకళి. ఈ ఆటను సాధారణంగా దేవాలయాలలో ఆడతారు. సాధారణంగా మహాభారతం, రామాయణం, పురాణాలు మొదలైన గ్రంథాల తాలూకు కథలు లేదా ఆయా గ్రంథాల పాత్రలతో అల్లిన కథలతో కథకళి ఆడటం జరుగుతుంది. కథకళి ఆటలో నర్తించే కళాకారులు పెదవి కదుపరు. కేవలం సైగలతో, హావభావాలతో 24 ముద్రలతో, శరీర కదలికలతో భావాలను ప్రతిఫలింపజేస్తారు. కథకళి తాలూకు పాటలు మణిప్రవాళం (సంస్కృతము, మలయాళమూ కలిసినది) లో ఉంటాయి. ముఖ్యమైన వాయిద్యాలు చండై (తబలా), మద్దాలం,(మద్దెల) ఇలతాళం (భజంత్రీలు), చెంగిల, ఎడక్క (ఘటం కాబోలు) మేము చూసిన ప్రదర్శనలో చండై, ఇలతాళం మాత్రమే ఉపయోగించారు.

మైకులో ఆ యువకుడు కథకళి లో నవరసాల గురించి ఒక్కొక్కటి చెబుతుంటే, యవనికపైన స్త్రీ పాత్రధారి అభినయించి చూపసాగాడు. ఆ తర్వాత 24 ముద్రలు పరిచయం చేశాడు.

తర్వాత ఓ పదిహేను నిముషాలు స్త్రీపాత్రధారి చిన్నబిడ్డను ఎత్తుకున్న తల్లి హావభావాలను అభినయించేడు.

చిన్నబిడ్డను ఎత్తుకున్న తల్లి ముఖంలో మురిపెం,
బిడ్డ అమ్మను గుర్తించి నవ్వితే తల్లి ముఖంలో కనబడే సంతోషం,
బిడ్డ స్పర్శకు తల్లి పులకరింత,
బిడ్డకు స్తన్యం ఇచ్చేప్పుడు తల్లి వదనంలో ప్రశాంతత,
బిడ్డ నిద్రలో నవ్వితే అమ్మ ముఖంలో కనబడే సంబరం, సంభ్రమం,
..
చివరికి బిడ్డ తన అంకంపై ఉచ్చపోస్తే, ఆ ఉచ్చను అలవోకగా విదిలిస్తూ అమ్మ బిడ్డపై చూపే చిరుకోపం
..
అత్యద్భుతంగా, అనన్యసాధ్యంగా అభినయించేడు.

ఆ తర్వాత ఆహ్వానం మూడు విధాలుగా అంటే విన్నపం, ఆజ్ఞ, శాసనం రూపాల్లో అభినయించి ప్రేక్షకులకు ఆహ్వానం పలికాడు. ఆ తర్వాత కథకళి నాట్యప్రదర్శన మొదలైంది. ఆ రోజు నేపథ్య కథ ఇది.

************************************************************

నరకాసురుని దాసి అయిన నక్రతుండి, స్వర్గంలో అప్సరసలను అపహరించుకుని రమ్మని నరకుడు ఆజ్ఞాపిస్తే ఆ కార్యనిమిత్తం స్వర్గానికి వెళుతుంది. అక్కడ ఆమె ఇంద్రసుతుడు జయంతుని చూసి, మోహించి, ఓ అందమైన అమ్మాయిలా మారి, తన పేరు లలిత అని చెప్పుకుంటూ నృత్యగానాదులతో అతణ్ణి సమీపిస్తుంది. 

తను సురకన్యనని, తనను వరించమని జయంతుణ్ణి వేడుకుంటుంది. జయంతుడు, తన గురించి చెప్పుకుని, తన తండ్రి ఆజ్ఞలేనిదే ఏ యువతిని చేపట్టనంటాడు. లలిత వేషంలోని నక్రతుండి విడవక, జయంతుణ్ణి కౌగిలించుకోజూస్తుంది. కృద్ధుడైన జయంతుడు ఆమెను అక్కడనుండి వెళ్ళిపోమని శాసిస్తాడు. నక్రతుండి నిజరూపం ధరించి జయంతుని సమీపిస్తుంది. జయంతుడు నక్రతుండి ముక్కు చెవులు కోసివేస్తే, బాధతో పెనుకేకలు పెడుతూ అక్కడనుండి నక్రతుండి నరకాసురుని దగ్గరకు తిరిగి పరిగెడుతుంది. జయంతుడు తన తండ్రి వద్దకు జరిగిన విహయాలు చెప్పడానికై నిష్క్రమిస్తాడు.

************************************************************

ఓ గంటన్నరసేపు జరిగిన నాట్యం - కేవలం ఇద్దరు పాత్రలతో, ఓ పాటగాడు, ఒకేఒక్క తబలా వాయిద్యంతో
రక్తికట్టించడంలో వారు కృతకృత్యులయ్యేరు. చివర్లో నక్రతుండి ముక్కు చెవులు కోసేప్పుడు స్త్రీపాత్రధారి
హావభావాలు, ఆర్తనాదాలు (భీభత్స రసం) గగుర్పొడిచేలా ఉన్నాయి. మాకు భాష అర్థంకాకపోయినా, అభినయంలోని భావం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇటువైపు మా పాపాయి బొటనవ్రేలు నోట్లో పెట్టుకుని
చూస్తోంది. మొదట్లో శృంగారం ఎంత చక్కగా అభినయించాడో, చివర్లో భీభత్సం కూడా అంతే చక్కగా అభినయించేడు. పురుషపాత్రధారి వీరత్వం, రౌద్రం కూడా తీసిపోలేదు. నాటకం ముగియగానే అక్కడ ఉన్న ప్రేక్షకుల (కేవలం 26 మంది మాత్రమే) కరతాళధ్వనులతో మారుమోగింది, ప్రదర్శనశాల.

చివర్లో ఆ కళాకారులతో ఫోటోలు దిగడం చక్కటి ముక్తాయింపు. స్త్రీపాత్రధారి పేరు మహేష్ అట. కళాకారులిద్దరినీ మనఃస్ఫూర్తిగా అభినందించేను, అభినందనలు స్వీకరించినట్టు వారి ముఖంలో భావాలు స్పష్టంగా తెలిపాయి.

************************************************************

"ఈ షోకు రెండొందలు తక్కువే" - మా శ్రీమతి వస్తూవస్తూ చెప్పిన మాట.

************************************************************

కథకళి గురించి ఆసక్తికరమైన సమాచారం ఇక్కడ.

************************************************************

11 comments:

 1. "రెండొందలు తక్కువే" - కరకట్టు మాట

  ReplyDelete
 2. చాలా బాగుంది మీ కథకళి అనుభవం!

  ఉన్నది 26 గురే, కానీ మీ సీట్ నంబర్లు 27,28. ఇదెలా సంభవం :)

  ReplyDelete
 3. రవి గారు,

  మంచి అదృష్టవంతులు. చక్కటి నాట్య ప్రదర్శన చూశారు.

  మీ ఆవిడ చెప్పింది కానీ రెండోదలు తక్కువే అని మీకనిపించలేదా?:-)

  నేను కాలికట్ వెళ్ళినప్పుడు కథాకళి పుట్టుక ప్రదేశం ( పాల్గాట్ జిల్లా అనుకుంటాను) వెళ్ళి అక్కడ చూడాలని బోలెడు కల లు కన్నాను.కానీ కుదరలేదు. మీరు చెప్తుంటే అనిపిస్తోంది. అక్కడ దాకా వెళ్లకపోయినా, ఏదో ఒకటి కాలికట్ లోనే చూసి వస్తే బావుండేది కదా అని..

  మీరు కథాకళి గురించి వివరం గా రాశారు. ధన్యవాదాలు.

  ReplyDelete
 4. బావుంది. ఆ చోటేదో చెప్తే అటువెళ్ళే మిత్రులకు ఉపయోగకరంగా ఉంటుంది.
  @చంద్రమోహన్
  కనీసం రెండు సీట్లు ఖాళెగా ఉన్నాయని భావం :-)

  ReplyDelete
 5. "ఒక్క టికెట్టు రెండొందలా?
  ఈ షోకు రెండొందలు తక్కువే
  ఎంతలో ఎంత మార్పు!
  కళాకారులకు అభినందనలు.

  ReplyDelete
 6. @మాగంటి వంశీ గారు: :-)
  @చంద్రమోహన్ గారు: :-) అందులో టైపాటులేదు. ఉన్న సీట్లు మొత్తం 50. కానీ ఉన్న ప్రేక్షకుల సంఖ్య మాత్రం 26.
  @రెంటాల కల్పన గారు: :-) రెండొందలు చాలా తక్కువండి. నాకూ అనిపించింది, కారణం కూడా టపాలోనే చెప్పాను.

  కథకళి పుట్టుక స్థానం కోటయం అనుకుంటానండి. కథకళి ప్రదర్శనలు దేవాలయాలలో, కొన్ని సంస్థల ద్వారా బయట కూడా జరుగుతాయి. సింగపూరులో, అమెరికాలో కూడా జరుగుతాయని విన్నాను.డీవీడీలవీ దొరుకుతాయి కానీ ఎదురుగా చూసే అనుభవం వేరు.

  @శ్రీనివాస్ గారు: కేరళలోని మూనారు, తేక్కడి లలో ఈ ప్రదర్శనలు జరిపే రంగమందిరాలు ఉన్నాయి. కలరి అనే ఒకరకమైన వీరవిద్యాప్రదర్శన కూడా ఒక్కోసారి చూపిస్తారు. అక్కడికి వెళితే తప్పక చూసిరండి.

  @విజయమోహన్ గారు: నెనర్లు.

  ReplyDelete
 7. అదృష్ట వంతులు! ఒకసారి రంగ శంకర(జేపీ నగర్) లో అనుకుంటాను, కథకళి ప్రదర్శనకు వెళ్లాల్సి ఉండగా, పుట్టపర్తికి వచ్చిన చుట్టాలు బెంగుళూరు కూడా చూద్దామని సరదా పడి మా ఇంటికి రావడంతో ఆ టికెట్స్ ఇంకెవరో ఫ్రెండ్స్ కి ఇచ్చి పంపాము. ఆ తర్వాత ఇంతవరకూ పడనే లేదు కథకళీ చూడ్డం!

  చాలా బావుంది, చదువుతుంటేనే!

  రెండొందలు చాలా చాలా తక్కువ! నిజంగా!

  ReplyDelete
 8. The details in the post are very informative. Another dance form of Kerala, Koodiattam, is recognized by UNESCO as one of the ancient art forms of the world.

  Kalaripayattu is a martial art, said to be the mother of all martial arts, with roots in Kerala. Includes vigorous physical exercises with breathing, karrasaamu, katthi yuddham, lots of balance, values. Varma kala or varma chikitsa is also a part of it. There are many varma chikitsa centres and a few kalaripayattu training institutions in Chennai. The government here, recently, took a decision to include 'varma' as part of training to the police personnel.

  ReplyDelete
 9. చాలా బాగున్నాయి, మీ అనుభవమూ, కథనమూ రెండూ. నేనెప్పుడూ కథకళి చూళ్ళేదు కానీ, ఈ ’Kalaripayattu’ అనుకుంటా, బెంగళూరులోనే ఒక కాలేజీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమంలో చూశా. అద్భుతంగా చేశారు.

  ReplyDelete
 10. భలే భలే భలే. చాలా బాగా రాశారు.
  కాళాకారులు ప్రదర్శనకి సిద్ధమవడం కూడా ప్రేక్షకుల ముందే చెయ్యడం - భలే ఆలోచన. కథకళిని మీరు చూసినట్టు ఇలా చిన్న సెటింగ్ లోనే చూడాలి, వెయ్యేసి సీట్ల పెద్ద ఆడిటోరియములలో కాదు.

  ReplyDelete
 11. @సుజాత గారు: మళ్ళీ అవకాశం వస్తే చూడండి.
  @మాధురి గారు: కూడియాట్టం ను యునెస్కో వారు గుర్తించారా? బావుంది. కూడియాట్టంలో భాసనాటకాలు, ముఖ్యంగా స్వప్నవాసవదత్తం ఆడతారని చదివాను. ఎప్పుటికైనా చూడాలి.
  @నాగమురళి: ఓహ్!బావుంది. "అశోక" అని షారుక్ ఖాను సినిమాలో కలరి కాస్త చూపిస్తారు.
  @కొత్తపాళి గారు: ఇది చాలా కొత్త, ఊహించని అనుభవం నాకూనూ. కథకళి అంతకు ముందు టీవీల్లో కాసేపు తప్ప ఎక్కడా చూడలేదు. బహుశా అందుకనే మరింత కొత్తగా, సంబరంగా అనిపించింది.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.