Tuesday, December 29, 2009

పులిహోర

"అప్పన్నా!నీ బుద్ధిలో దద్ధోజనం పసేగానీ పులిహోర ప్రభావం రవంత కూడా కనిపించలేదురా!" అంటారు తాతాచార్యుల వారు శిష్యపరమాణువు అప్పలాచార్యుల వారితో, తెనాలి రామకృష్ణ సినిమాలో.

అవును, వేణుగోపాల స్వామి వారి కోవెలలో అప్పనంగా వచ్చే ప్రసాదం అయినంతమాత్రాన పులిహోర ప్రభావం తక్కువ కాదు. అసలు సిసలు పులిహోర అంటేనే - గమ్మున ఆ నేతిసువాసన గుబాళించాలి. నాలుకకు తగులగానే కారంతో కూడిన రుచి నషాళానికంటాలి. ఆ తర్వాత ఏ ఆనందలోకంలోనో విహరించాలి. పులిహోరలో అద్వైత సిద్ధాంతం దాగుందనడంలో సందేహం లేదు. మొదట పంచేంద్రియాలను, ఆ తర్వాత దాన్నధిగమించి జ్ఞానేంద్రియాన్ని పరిచయం చేస్తున్న పదార్థమనే కాబోలు - వైష్ణవ దేవాలయాల్లో ఇందుకు పెద్దపీట! మొన్నటికి మొన్న తిరుపతికెళ్ళినప్పుడు స్వామి వారి ఉచిత ప్రసాదం పులిహోర దొరికింది. చెప్పొద్దూ, కాసేపు వైకుంఠం ఇన్ ఎ నట్ షెల్ కనిపించింది.

నూడుల్స్ రాకమునుపు ఇది కూడా బాచిలర్స్ అమ్ములపొదిలో ఒక అస్త్రం. ఇది నిజం. అన్నమొకటి వార్చేసుకుని, అమ్మ తన ప్రేమను కూడా కలిపి గట్టిగా మూతెట్టేసిన జాడీలోంచి, కాస్త గుజ్జు, అందుకు తోడుగా నెయ్యి కలుపుకుంటే - ఆ పూట ఆత్మారాముడు అనంతంగా శాంతించేవాడు. ఆ తర్వాత ఫలశృతికి పెరుగూ ఆవకాయ ఉండనే ఉన్నాయి.

ఉన్నట్టుండి ఈ రోజెందుకిలా పులిహోర పైత్యం? అంటే - ఉందండి. మా ఫ్రెండు, ఆఫీసులో నా కొలీగు విఠ్ఠల్ అగార్కర్ చాలా యేళ్ళ తర్వాత కన్నడ పులిహోర రుచి చూపించి నన్ను శిఖరం ఎక్కించాడు. ఆ అబ్బాయి వంటల్లో ఘనాపాఠీ. ఓ సారి విదేశానికి ఆన్ సైటు వెళ్ళినప్పుడు నాకు రూమ్మేటు. చిత్రంగా అతడికి మా ఇంటి అధరువులు తెగనచ్చాయి అప్పట్లో. నాకు మాత్రం ఆ అబ్బాయి వంటలు తెగ నచ్చేసేవి. ఓ శిల్పి శిల్పం చెక్కుతున్నట్టుగా వంట చేసేవాడతను.

కాలేజీ రోజుల్లో మా అమ్మ పులిహోర క్యారియరు కట్టించేది. (నేను డే స్కాలర్ ను) ఆ ఘుమఘుమలు అలా సోకంగానే నా మిత్రులు అలా దాని మీద పడి ఖాళీ చేసేవారు. చింత చచ్చినా పులుపు చావనట్లు, చిన్నతనం అయిపోయినా చింత చిగురు, పులిహోర జ్ఞాపకాలు వదలకుండా వేధిస్తూ ఉంటాయి నన్ను. అమ్మ గోరుముద్దల్లో నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నది ఈ చింతచిగురు పప్పు అన్నమే. సంగటితో ఈ పప్పు కలుపుకుంటే - చింతాకు జితా జితా అనుకోవాల్సిందే. (ఈ చింతచిగురు పప్పు ఇప్పుడు ఎవరూ చేయట్లేదనుకుంటాను)

మా వూళ్ళో దీన్ని పులగం అని కూడా అంటారు. ఈ పులిహోర లో పులి నేతిబీరకాయ లోనేతి లా కాకపోయినా చిన్నసైజు ముద్రారాక్షసమో టైపాటో లాంటిదే. అది నిజానికి "పుళి". పుళి అంటే తమిళంలో పుల్లనిది. (ఆమ్లము). చింతపండును కూడా పుళి అనే అంటారు. గోంగూరను తమిళంలో పుళిచ్చకీరై అంటారు(ట). అదుగో ఆ పుళి, పులిలా మీదబడి అంటుకుంది. "హోర" ఎలా వచ్చిందో మరి తెలియదు నాకు. పుళియ ఊర - పుళిహోర అయిందా?

కన్నడంలో పుళి - హుళి కావాలి. అయితే ఆ హుళి హుళక్కి అయిపోయి, పులిగానే మిగిలిందెందుకో మరి.

ఈ పులిహోర ఉరఫ్ పులగం కన్నడ వారిదేనేమో అని నా ఊహ. "తింత్రిణీ పల్లవ యుక్తమౌ ఉడుకుబచ్చలి శాకము" - గుజ్జు కాకపోయినా (తింత్రిణీ పల్లవం అన్నారు కాబట్టి) తింత్రిణీ ఫలావిష్టమైన శాకాలు కూడా ఇదే ప్రాంతానికి చెందినవై ఉండవచ్చు. వైద్యానికి పనికి వచ్చే కాయ అని ఒకప్పుడు ఈసడించబడినా, శ్రీవారి కొలువులో ప్రసాదం దాకా దీని ప్రస్థానం సాగింది కనుక దీని ప్రాభవాన్ని విస్మరించడానికి వీలు లేదు.

ఆ పద్యం ఓ సారి పునశ్చరణ

ఫుల్ల సరోజ నేత్ర! యలపూతన చన్నుల చేదు ద్రావి, నా
డల్ల దవాగ్ని మ్రింగితి వటంచును నిక్కెద వేమొ! తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన యొక్క ముద్ద దిగమ్రింగుమ! నీ పస కాన నయ్యెడిన్.

నా చిన్నప్పుడు మా ఊళ్ళో శ్మశానం దగ్గర ఓ చింతచెట్టు ఉండేది. అప్పట్లో ఆ ప్రాంతం కాస్త నిర్మానుష్యంగా ఉండేది. నేనూ, నా స్నేహితులు "అతడు" సినిమాలో చూపించినట్లుగా పందేలయితే వేసుకోలేదు కానీ, మాట్లాడుకునే వాళ్ళం, ఆ చెట్టు దగ్గరకు వెళ్ళగలిగే ధైర్యం ఎవరికుందా అని. నేనప్పట్లో పిరికి వాడిని అయినా ఓ రోజు సాహసం చేసి, మరీ రాత్రి పూట కాకపోయినా కాస్త వెలుగు రేకలు పర్చుకుంటున్న సమయంలో దీర్ఘశంక కోసం ఆ చెట్టు దరిదాపులదాకా వెళ్ళిన గుర్తు.

ఎవరు రాశారు, ఏమిటి గుర్తు లేదు కానీ ఓ సంస్కృత చాటువు గుర్తొచ్చింది.

మేరుమందరసమానమధ్యమా
తింత్రిణీదళవిశాలలోచనా |
అర్కశుష్కఫలకోమలస్తనీ
పెద్దిభట్టగృహిణీ విరాజతే ||

మందరపర్వతం లాంటి నడుమూ, చింతాకులా విశాలమైన కన్నులూ, ఎండిన జిల్లేడుకాయల్లాంటి ఉరోజాలు కలిగి ఉన్నది పెద్దిభట్ట వారి గృహిణి అని అర్థం. ఇంత వ్యంగ్యం ఎందుకు రాశారో మరి.

(చాలా రోజుల తర్వాత సోది చెప్పుకోవాలనిపించి రాసిన కబుర్లివి. ఇంతటితో సమాప్తం.)

28 comments:

 1. చాలా బాగా చెప్పారు!!
  చింత చిగురు పప్పు(చింతాకు పుల్ళగూర) ని బాగా గుర్తు చేశారు!! ఈ తపా ఇంటికి వెళ్ళినప్పుడు రాగి సంగటి తో కలుపుకొని తినాలి.,.. చిన్నప్పుడు పెద్ద పెద్ద చింత చెట్లు ఎక్కి చింతాకు(చింత చిగురు) పెరికిన రోజులు గుర్తు వస్తున్నాయు!!

  అలాగే ఈ నమ్మ బెంగళూరు నమ్మ రూమ్ లో ఏదైన వండాము అంటే ఆది తప్పకుండా చింతపండు పులిహోర లేక నిమ్మకాయ పులిహోర ఐ ఉంటుంది!!!

  ReplyDelete
 2. రవి,

  మీ పులిహోర కబుర్లు బావున్నాయి. అదే వరసలో చక్రపొంగలి దద్దోజనం కూడా వడ్డించండి, ధనుర్మాసం అయ్యేలోపు :-)

  ఆహారము వికృతి ఓగిరము. అది పుళి ఓగిరము, పుళియోగిరము, పులిహోర అయ్యింది.

  కాకపోతే పులిహోర పులగం ఒకటి కాదు. పులగం పెసరపప్పు, అన్నం, పసుపు, మిరియాలు కలిపి చేసేది. ఇదే ఇంచుమించుగా తమిళవాళ్ళ పొంగల్.

  ReplyDelete
 3. చింతచిగురు పప్పు మా అమ్మగారు చేసేవారు. నేను చేస్తూంటాను. ఉల్లిపాయ ముక్కలు వేసి వెల్లుల్లిపాయ పోపు పెడితే ఇక గిన్నె ఖాళీ అవ్వాల్సిందే...:)
  కామేశ్వరరావుగారు చెప్పినట్లు పులిహోర, పులగమ్ వేరు వేరు. వివరమ్ వారు చెప్పేసారుగా..

  వీలుంటే నా పులిహోర టపా పై ఓ లుక్కేయండి...
  http://trishnaventa.blogspot.com/2009/06/blog-post_18.html

  ReplyDelete
 4. బావున్నాయి మీ పులిహోర కబుర్లు!

  ReplyDelete
 5. ఏదో చెయ్యలేక, చెయ్యలేక low carb డైట్ నిన్ననే మొదలెట్టా, లంచ్ కి, డిన్నర్ కి సూపులు, సలాడ్లు తింటూ. మీరేమో నాకిష్టమైన, నేను బాగా చెయ్యగలిగే వంటల్లో ఒకటైన full carb వంటకం గురించి నోరూరెంతగా టపా వ్రాస్తే ఎలాగండి?

  ReplyDelete
 6. చాలా బాగుంది ..
  నూతన సంవత్సర శుభాకంక్షలు..
  నా కానుకగా ఈ టపా అందుకోండి
  http://creativekurrodu.blogspot.com/2009/12/2010.html

  ReplyDelete
 7. పులిహోరలో నెయ్యి కలపటం ఇదే వినటం. సాధారణంగా నువ్వులనూనె తో పోపు ఇళ్ళలోను, కాస్త ఆవ పెట్టి గుళ్ళలోను చూడటం అలవాటు.

  పులగం అంటే భైరవభట్ల కామేశ్వర రావు చెప్పినట్లు చేస్తాం కానీ పసుపు, మిరియాలు వేయం. దానికి వంకాయ పచ్చి పులుసు [కాల్చిన వంకాయ గుజ్జు, చింతపండు పులుసు, ఉల్లి పచ్చి మిర్చి, ఉప్పు, కారం] కానీ బెల్లం కోరు + నెయ్యి కానీ కలిపి తినటం ఆనవాయితీ.

  చింత వున్న చోట చింతలధికం అని ఇళ్ళలో పెంచరట. మేము చింత చిగురు, పెసరపప్పు కలిపి చేస్తాం. నిజానికి చిగురుతో నాన్వెజ్ కూడా చేస్తారు.

  ప్చ్, అన్నీ మిస్సవుతున్న భావన.

  యేదో మీ సోదికి కాస్త సొద కలిపి చివరికిలా సోపగా ఆపుదామని...

  ReplyDelete
 8. బాగుంది పులిహోర పురాణం.నాకు నచ్చని రెండు వంటకాల్లో ఒకటి చింతచిగురు పప్పు ,మా ఇంట్లోని వారికేమో చాలా ఇష్టం,వారికోసం శాలువా కప్పుకుని త్యాగం నా ఇష్టాన్ని త్యాగం చేస్తూ కళ్ళు మూసుకుని నోరు తెరచుకుని తింటూ ఉంటా. ఇక పులగం విషయానికొస్తే మా ఇంట్లో మాత్రం ప్రతి శనివారం దాదాపు తప్పనిసరి పెసరపప్పేమో వందకో కేజీ అయిపోయిన కాలం ఇకముందు ఏమి చేయాలో మరి! దాన్లోకి శెనక్కాయల ఊరుమిండి అదేనండి చెట్నీ,పచ్చిపులుసు నా స్సామిరంగా... వైకుంఠానికి వాకిలే!

  ReplyDelete
 9. పులిహోర ఇప్పటికీ నా అమ్ముల పొదిలో పాశుపతాస్త్రమే! కన్నడ పులిహోరలో చివర్లో కొంచెం నువ్వులు వేయించి పొడి చేసి కలుపుతారు. అందువల్ల ఆ రుచి ప్రత్యేకంగా ఉంటుంది.

  మా ఇంట్లో పులిహోర లో "ఆవ" కలుపుతారు.దానివల్ల కొంచెం ఘాటుగా, చెప్పలేనంత రుచిగా ఉంటుంది.నేతి పోపు ఇదే మొదటిసారి వినడం! నేనైతే ఒక పావుకిలో జీడిపప్పు కూడా దట్టిస్తా, వేరుసెనగ గుళ్ళు తక్కువ వేసి!చెంచాకొక జీడిపప్పు తగలాలి.

  సీజన్ని బట్టి మామిడికాయ, దబ్బకాయ,పంపర పనసకాయ, రాతి ఉసిరికాయ,చింతకాయ వగైరాలతో పులిహోర చేసినా అల్టిమేట్ మాత్రం చింతపండు పులిహోరే! లేత చింత చిగురుతో చేసిన పులిహోర ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళింట్లో తిని ఫ్లాటైపోయాను.

  "పుల్లగా ఉండి హృదయాన్ని హోరెత్తిస్తుంది " కాబట్టి పులిహోర అని తెలుగులో తాత్పర్యం రాసుకుంటాను నేనైతే!

  పులిహోరలో అద్వైత సిద్ధాంతం దాగుందనడంలో సందేహం లేదు..! దీన్ని ఖండించడానికి నా గుండె చెరువు కాదు.

  వైష్ణవాలయాల్లో పులిహోర చేసేవారి చేతిలో ఏదో ప్రత్యేక రేఖ ఉంటుందండీ! అందుకే అంత రుచి! పైగా కొద్దిగానే పెడతారేమోనా..మరీ రుచి!

  ఒకసారి ఏదో నంబర్ హైవే మీద ప్రయాణిస్తున్నపుడు చిగురుతో నిండిన చింత చెట్టొకటి కనపడగానేం ఆగి, అక్కడ గేదెలు కాసే కుర్రాడిని బతిమాలి, ఒక పెద్ద కవర్ నిండా చిగురు కోసితెచ్చుకున్నాం!

  హైదరాబాదులో చింత చిగురు అమ్మేవాళ్ల లెవెల్ జాయ్ అలుక్కాస్ వాళ్ళక్కూడా ఉండదు.(సీజన్లో ఎక్కువగా వీళ్ళు అమ్మేది ఎక్కడనుకున్నారు? తాజ్ కృష్ణ ముందు మరి) అలుక్కాస్ వాడు కొద్దిగైనా డిస్కౌంట్ ఇస్తాడు. అవసరం మనది కాబట్టి చచ్చినట్లు ఇచ్చినరేటుకే తీసుకుని బయటపడాలి.
  మీరు రాసిన "మేరు సమాన మధ్యమా.."చాటువు పాత పెద్ద బాల శిక్షలో (ఇప్పటి మెగా బాలశిక్ష సంగతి తెలీదు)చదివాను.

  చూడండి, పులిహోర అనగానే ఎంత పెద్ద వ్యాఖ్య రాశానో! పొద్దున్నే పులిహోర గురించి మాట్లాడితే ఇలాగే అవుతుంది మరి!

  ఎప్పటికైనా "పులిహోర"అనే పేరుతో చిన్న ఆంధ్రా రెస్టారెంట్ ఒకటి పెట్టాలని కోరిక!

  ReplyDelete
 10. పొద్దున పొదునే కూడలి, జల్లెడ, హారం ఎక్కడికెళ్ళినా పులిహోర వాసనే..ఏంటా అని చూస్తే ఇక్కడ మీ టపా పులిహోర వాసనతో గుభాళిస్తుంది. పులిహోరలో నేతివాసన...నేనూ ఇదే మొదటిసారి వినటం.

  కాదేది పుల్లటిదేది పులిహోరకనర్హం అన్నట్టు నిమ్మకాయ, ఉసిరికాయ, దబ్బకాయ,....అన్నిరకాలలోనూ రారాజు..చింతపండు పులిహోరే!

  ఇక చింత చిగురు పప్పయితే రైతు బజారులో ఎంత రేటు ఉన్నా తిట్టుకుంటూ కొనుక్కోవటమే.

  @సుజాత గారు, మీరు కుర్రాడిని బ్రతిమాలుకున్నారా..నేనయితే చింతచిగురు కనిపిస్తే నేనే ఎక్కి కోస్తుంటాను..చిన్నపటినుండి చెట్లేక్కే అలవాటు బాగానే ఉందిలేండి.

  మీ పులిహోర రెస్టారెంటుకి నలుగురు కస్టమర్సుని నా తరుపున గ్యారంటీ వేసుకోండి..మీ చేతి పులిహోర రుచి చూసానుగా మరి!

  ReplyDelete
 11. శబాషో... అదరగొట్టేశారు రవి...పులిహోరలో అద్వైతం అనుమానమే లేదు నిజమే..
  నాకూ పులిహోరలో నేతి రుచి ఎప్పుడూ తగల్లేదు మరి.. చింతపండు పులిహోర లో కాస్త ఇంగువ కలిపి నిండా వేరుశనగ గింజలు దట్టిస్తే ఆ రుచే వేరు. ఇక చింత చిగురు పప్పు నాకు ఇప్పటికి ఒకటి రెండు సార్లు మాత్రమే రుచిచూసే భాగ్యం కలిగింది, నాకు అత్యంత ఇష్టమైన వాటిలో ఇదీ ఒకటి.
  మా ఇంట్లో పులగం ప్రత్యేకించి సంక్రాంతి భోగిరోజు చేస్తారు. బియ్యం, నల్లపెసలు ఇంచుమించు సమపాళ్ళలో కలిపి కాస్త ఉప్పూ వేసి కుక్కర్ లో ఉడికించేయడమే. దీనికి కాస్త నెయ్యివేసుకుని, బెల్లం తురుముతోనో, పెద్దచిక్కుళ్ళు టమాటా కూరతోనో, పచ్చిమిర్చీ టమాటా రోటి పచ్చడితోనో లాగిస్తే ఉంటుందీ.. ఆహా నారాజా...

  ReplyDelete
 12. Ravi peddamma cheti chinta chiguru pappu anta tasty pappu yekkada tinaledu..u know my dad is big fan of it and we all miss it

  Good article

  ReplyDelete
 13. ఇది రాసేప్పుడు రెండు పొరబాట్లు దొర్లాయి. పులిహోరలో నువ్వులనూనె అన్నదే కరెక్టు. మా రూమ్మేటు నెయ్యితో ప్రయోగం (ఉగ్రాణ - పోపు) చేసినది బిసిబేళా బాత్ తో. ఇప్పుడే అతనితో మాట్లాడి వస్తున్నాను. తినడంలో తప్ప, చేయడంలో ప్రావీణ్యం నాకు లేదు కాబట్టి ఈ పొరబాటు. అలాగే పులగం అన్నది కూడా. ఇది పొరబాటే.

  @శ్రీధర్ రెడ్డి : మా ఇంట్లో చింతొక్కు స్టాకు ఎప్పుడూ ఉంటుంది. :-)

  @కామేష్ : చూస్తూ ఉంటే, చిన్నప్పుడు మీరూ ధనుర్మాస గుడి ప్రసాదం భక్తులా అని అనుమానమొస్తూ ఉంది. :-).

  పుళియోగిరము - బహు బాగు!

  @తృష్ణ : మీ కబుర్లకు ఇదే వస్తున్నాను.

  @పద్మార్పిత, @కిరణ్మయి, @ఆదిత్య మాధవ్: నెనర్లు.

  @మరువం ఉష గారు: అవును, చింత చెట్టు పెంచరని నేనూ విన్నాను. అయితే బయలు ప్రదేశాల్లో ఈ చెట్లు చాలా ఎక్కువ.

  @విజయమోహన్ గారు: శనక్కాయ ఊర్మిండి - అబ్బా, ఇక చెప్పకండి.

  @సుజాత గారు: ఇంకాస్త రాసి ఉంటే, మరో టపా అయిఉండేదిగా. నేను ఇప్పటికీ, మా ఆవిడ పన్జేసే స్కూలు తాలూకు పల్లెకెళితే, అక్కడ పొలాలపక్కన చింతచెట్టు ఎక్కాలని ఆశపడుతుంటాను. ఆమె అనుమతించదనుకోండి.

  కాలేజీ రోజుల్లో నా ఫ్రెండు ఒకతను "రింబోలా రింబోలా" అని ఒక రెస్టారెంటు పెట్టాలని జీవిత ధ్యేయంతో ఉండేవాడు. ఎక్కడున్నాడో తెలీదిప్పుడు.

  @సిరిసిరి మువ్వ: నేనూ హారానికి వెళతాను, ఈ కామెంట్ అవగానే.

  @వేణూ శ్రీకాంత్ : మీకు చింతచిగురు పప్పు ప్రాప్తిరస్తు. పులగానికి మా వైపు, శనక్కాయ చట్నీ నంజుడు.

  @Ganesh : Now it is just a sweetly spicy memory. I should train jyothi to prepare chinta chiguru pappu. Currently, she has expertise in jonnarotti, chintokku, samgati etc.. :-)

  ReplyDelete
 14. ఇదన్యాయం. పందుగ కాని వేళలో పులిహోర గుర్తు చేస్తే శాపమే.

  మా ఇంట్లో వారానికోసారి నిమ్మకాయ పులిహోర ఉండాల్సిందే. అయితే నాకు చాలా ఇష్టమయింది మాత్రం చింతపందు పులిహోరే. అమ్మ చేయి పడిందంటే అసలు ఆ రుచి అబ్బో....

  ఒకసారి హై. లో ఉన్నప్పుడు అమ్మ వినాయక చవితికి అక్కడ కాలనీలో ప్రసాదం కోసం చేస్తే పది నిముషాల్లో మంది ఎగబడి ఖాళీ చేసేసారు.

  ప్చ్... మీరు నాకు ఇప్పటికిప్పుడు చింతపండు పులిహోర, చింతచిగురు పప్పు పెట్టించాల్సిందే. :)

  ReplyDelete
 15. వైష్ణవాలయం చింతపండు పులిహోరలో తిరగమోతలో మెంతులూ, చింతపండుగుజ్జులో కొద్దిగా బెల్లం వేస్తారండీ కమ్మదనం కోసం.

  ReplyDelete
 16. పులహోరపై మరులు గొలిపేలా ఉంది మీ వ్యాసం.

  ReplyDelete
 17. రాగి సంగటి + చింత చిగురు పప్పు గుర్తు చేసి నోరంతా చేదు చేశారు. అందనివన్నీ పుల్లన అన్నారుగా!చింతచెట్టుతో నా 'బాదరాయణ' సంబంధాన్ని ఇక్కడ చదవండి. http://krishnadevarayalu.blogspot.com/2007/03/blog-post_26.html

  ReplyDelete
 18. Wish you all a very Happy, Prosperous and a Fun-filled new year - 2010 :)
  sripranavart.blogspot.com

  ReplyDelete
 19. ఇస్మాయిల్ గారు,

  చింత చెట్టుతో "బాదరాయణ" సంబంధం...అబ్బ, ఇలా ఉండాలండీ "పన్" అంటే! ఇలాంటివి చదివినపుడు ధైర్యం వస్తుంది..అమ్మయ్య, తెలుగు లో చమత్కారంగా మాట్లాడే వాళ్ళున్నారు అని!

  ReplyDelete
 20. బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు, ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
  మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం
  భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
  http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
  ధన్యవాదములు
  - భద్రసింహ

  ReplyDelete
 21. @ప్రవీణ్ : బెంగళూరు లో అయితే బాచిలర్ పులిహోర దొరుకుతుంది. (మా ఆవిడ ఇక్కడ లేదు.) :-) అది బి. గోపాల్ బాలయ్యతో తీసిన హాలీవుడ్ ఫిలిమ్ లా ఉంటుంది.

  @స్వర్ణమల్లిక : అవును. బాగా గమనించారు. :-)

  @డా. ఇస్మాయిల్ : భలే ఉంది, మీ టపా. మీ ఇంకో టపా, సంగటి + చేప కూర అనుకుంటాను. అది చదివితే, ఫక్తు వెజిటేరియన్నయినా ఓ సారి చేప తినాలనిపించేలా రాశారు. :-)

  @చదువరి : ఆ పాపం నాది కాదు, పులిహోరది. :-)

  @భద్రసింహ : బావున్నాయ్, గోడ కాగితాలు. @cherry's world : same 2 u.

  ReplyDelete
 22. పెద్దిభొట్ల వారు పండితుడూ,కవీ.
  వారి ధర్మపత్ని ఒక రోజు ఆయనతో ,"మీరు మహా కవులని చెప్పుకొని మురిసిపొవటమే కానీ, ఏదీ ఈనాడయినా ఆ కవిత్వమేదో నా మీద రాశారూ? ఇరుగు పొరుగు అమ్మలక్కల ముందు నాకెంత చిన్న తనం గా వుంటోందో?"అని కళ్ల నీళ్లు పెట్తుకుని అలిగేసరికి,ఆయన చతురం గా ఈ పద్యాన్ని ఆశువుగా చెప్పి,ఆ అమాయకురాలిని ప్రసన్నం చేసుకున్నారట.

  ReplyDelete
 23. ఆహా! పులిహోర హోరెత్తిపోయింది! పులిహోరకు పుళియోగరై, పుళియోదరై అని కూడా పర్యాయ పదాలున్నాయి. ఓగరై - ఓగిరం అనే తెలుగు వికృతి నుండీ, ఓదరై - ఓదనం అనే సంస్కృత పదం నుండీ వచ్చాయనుకుంటాను.

  'తింత్రిణీ పల్లవ యుక్తమౌ...' పద్యం శ్రీనాథుడు కన్నడిగులను ఉద్దేశించి చెప్పినది కాదు. పలనాటి అనుభవాలతో చెప్పినది. సుజాత గారు చెప్పినట్లు కర్ణాటకలో నువ్వుల పొడి కలుపుతారు. "వెల్లుల్లిన్, తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్థ వడ్డింపగా..." అని వాపోయాడు శ్రీనాథుడు, కన్నడ రాజ్యలక్ష్మితో.

  చక్రపొంగలి, దద్దోజనం కబుర్లెప్పుడు?

  ReplyDelete
 24. పై కామెంట్ లలో "ఆవ" పెట్టిన అంటున్నారు, అంటే ఆవాల పిండి కలపటమా? వినటమే కాని, "ఆవ" పెట్టటం అంటే అవుడియా లేదు, అంటే ఏమిటో సెప్తారా?

  ReplyDelete
 25. మీ టపా పులిహోర అంట రుచిగా ఉంటే , కామెంట్లు నూపొడి, ఆవపొడి లాగ పులిహోరకి మరింత రుచిని, సువాసననీ తెచ్చాయి. నాకైతే కడుపు నిండిపోయింది.

  ReplyDelete
 26. బ్రహ్మాండం! ఈ మధ్య మీ టపాలు కొన్ని మిస్సయ్యాను.

  ReplyDelete
 27. మరీ లేట్ గా వచ్చినట్లు వున్నాను పులిహోర కబుర్లకు, ఐనా ఘుముమ ఏమి తగ్గలేదు లెండి. చిన్నప్పుడు పులిహోర చూస్తేనే విరక్తి వచ్చేది తిని తిని. కాని ఇప్పుడూ ఆ పులిహోర కోసమే ఎగబడి మరి తింటాము. :-)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.