Tuesday, January 5, 2010

పిపీలికం

వంటింట్లో నిలువున్న నిన్నటి చపాతీలు తిందామని చూద్దును కదా, అందులో ఎర్రచీమలు.

చీమ! జాగ్రత్తగా గమనిస్తే ఎంత చక్కటి ఆకారం! రెండు అండాకారాలు - ఒకటి ఎర్రనిదీ, మరొకటి నల్లనిదీనూ. వాటిని దారంలా కలుపుతూ సన్నటి నడుము. అటూ ఇటూ హడావుడిగా పరుగెడుతూ ఉన్నాయి. ఇటు వైపు వెళ్ళే చీమకు అట్నుంచి వచ్చే చీమ అడ్డుపడితే, ఓ లిప్తపాటు తలను తాకించి, ఏదో సందేశాన్నందిస్తూంది. కొన్ని చీమలు కలిసికట్టుగా చేరి, ఓ పెద్ద ముక్కను లాగుతున్నాయి. ఆ చీమలబారు ఎక్కడి నుంచీ మొదలవుతుందో చూద్దామని పరికిస్తూ వెళితే, గోడవారగా పక్కగదిలోకి, అలా గది చివర్న ఓ చిన్న పుట్టలోనికి దారి తీసింది. అందులో సగం బారును లెక్కపెడితే, ఉజ్జాయింపుగా 450 చీమలున్నాయి. ఇటు వెళుతున్నవి, తిరిగి వస్తున్నవీ కలిపి. అంటే, దాదాపు వేయి చీమలు ఆహార సేకరణ అనే ఆ మహా యజ్ఞంలో పాలుపంచుకుంటున్నాయి!

భగవంతుని సృష్టిలో అన్నీ అద్భుతాలే. ఉహూ.. ఆ వాక్యం బావోలేదు. సృష్టిలోని అణువణువులోనూ భగవంతుడు తానై రూపాంతరం చెందాడేమో. ఠాగూర్ అనుకుంటాను గుర్తు లేదు. చూడగలిగితే భిన్నత్వం అణువణువులోనూ ఉందంటాడు. ఓ చెట్టులో ఏ రెండు ఆకులను ఆకులను చూచినా, ఆ ఆకులపైని మెఱుపులోనో, ఆ ఆకుల తాలూకు ఈనెలలోనో, ఆ ఆకు ఆకారంలోనో ఏదోక భిన్నత్వం కనిపిస్తుంది(ట). ఓ చెట్టులోని ఆకుకు, మరో ఆకుకూ మధ్య కూడా వ్యత్యాసం స్పష్టంగా చూడవచ్చట, కనులు తెరిచి పరికిస్తే.

ఓ చెట్టులోని ఆకులను అలా చూస్తూనే లెక్కెట్టటం అనే విద్య ఒకటుండేదట, పూర్వకాలంలో. నలదమయంతుల కథలోని నలమహారాజుకు ఈ విద్య తెలుసట. ఈ విద్య పేరు అశ్వ హృదయం అనో, అశ్వహృదయంలో ఈ గణనం కూడా ఓ అంగమనో చిన్నప్పుడెప్పుడో మాష్టారు చెప్పిన గుర్తు. (ఈ నా జ్ఞాపకం పొరబాటు కూడా అయి ఉండవచ్చు. అయితే ఈ రకమైన విద్య మాత్రం ఏదో ఉన్నట్టు చెప్పారన్నది బాగా గుర్తుంది).

చీమల గురించి ఏదో ఆలోచనలో పడి ఎక్కడికో వెళ్ళాను. కనిపిస్తున్న ఇన్ని చీమలలో కూడా ఒకచీమకూ, మరో చీమకూ మధ్య వ్యత్యాసం ఉందా? అదెలా తెలుసుకోవచ్చో? అయినా ఏ ఎమ్బీయేలూ, మేనేజిమెంటులు చదవకుండానే వీటికి, ఇలా తమ ఆహారాన్ని వర్షాకాలం కోసం దాచుకోవాలని ఎలా తెలిసిందో? ఒక మి.మీ. లో అర్ధ భాగం కూడా లేని వాటి తలలలో, ఈ ఆలోచన ఎలా వచ్చిందో? లేకపోతే, మెదడుతో సంబంధం లేని మరో అద్భుత యంత్రాంగం ఏదో ఈ జీవప్రపంచంలో ఉండి ఉండాలి. నేర్చుకోవాలన్న తపన అవసరమే కానీ, మనకు నేర్పడానికి భగవంతుడు అణిమాది రూపాల నుంచి, బ్రహ్మాండమంతటా తానే అయిన మహిమాత్మక రూపం వరకూ ఎదుట కనిపిస్తూ ఆశ్చర్యానందాద్భుతాలకూ ఎప్పుడూ గురి చేస్తూనే ఉంటాడు. మహిమాన్వితమైన ఆ తేజో రూపం గురించి ఏం మాట్లాడగలుగుతాం? కైమోడ్చి శిరసు వంచటం తప్ప?

నల్ల చీమలను (నల్ల గండు చీమలు కాదు. చిన్నవి) ఎట్టి పరిస్థితిలోనూ చంపరాదని మా అమ్మ చిన్నప్పుడు మాకు విధించిన ఆంక్ష! అవి వినాయకుడి చీమలట. వాటికి చక్కెర కూడా పెట్టేది మా అమ్మ.

సత్యజిత్ రే రాసిన ఓ కథ ఉంది. శాశ్మల్ అనే ఓ ఆసామీ, తన సెలవు రోజును గడపడం కోసం, ఒక్కడే కలకత్తాకు దూరంగా అడవిలో ఓ రిసార్టుకెళతాడు. అక్కడ అడవికి మధ్య, చౌకీదారును పంపేసి, గదిలో నిద్రకుపక్రమిస్తాడు. అప్పుడు ఆ రాత్రి - తను చిన్నప్పట్నించీ చంపిన ప్రాణులన్నీ ఒక్కొక్కటిగా ఆ గదిలో కనబడ్డం ఆరంభిస్తాయి. వాటిలో ఓ చీమలబారు కూడా. అతను తన స్కూలు రోజుల్లో ఓ పైకి వెళుతున్న చీమలబారును, కాగితానికి చివర నిప్పంటించి, ఆ నిప్పుతో ఆ చీమల దండుకు మంటెడతాడు. ఆ చీమల బారు, తన కారు కింద పడ్డ కుక్క, తమ బంధువులింట ఎవరికీ హాని తలపెట్టకుండా, దైవంలా అందరూ పూజించబడుతూ, తనచేత కర్రతో కొట్టి చంపబడ్డ పాము, ఓ పక్షి, పిల్లి....ఇలా... ఆ కథ చివరికేమవుతుందో మాత్రం ఇప్పటికి సస్పెన్స్!

అంతరిక్షమూ, పాలపుంతలూ, గ్రహాలు, నక్షత్రాలు ఆదిగా గల ఈ బ్రహ్మాండంలో మనిషి అస్తిత్వం కూడా పిపీలిక పరిమాణమే కాదూ!

చీమలదండు గురించి ఆలోచిస్తూ, వాటికి పెట్టిన ప్రసాదం వదిలేసి, ఏదో అలా మింగి, కొత్త సంవత్సరం ఏ టపా రాద్దామా అని ఈ టపా రాస్తున్నాను. ఆ చపాతీల పాత్రకు కాస్త దూరంగా సాయంత్రం వెలిగించిన సంధ్యాదీపం ఇంకా వెలుగుతూంది దివ్యంగా.

(జిడ్డు కృష్ణమూర్తి గారు తన బాల్యంలో చీమలను దీక్షగా గమనించేవారట. చీమలపై ఆయన వ్రాసిన ఓ పేరా స్ఫూర్తిగా)

12 comments:

 1. రవిగారూ !!

  దానిని అక్ష విద్య అంటారు. నలుడు వేగంగా రథం మీద వెళ్ళిపోతూ కూడా దారిలో కనిపించే చెట్టు ఆకులన్నీ లెక్కపేట్టగలిగేవాడుట. (పోలిక చెప్పుకోవాలంటే Matrix సినిమాలో లాగ అన్నమాట).

  మీకు తెలీంది కాదు. ప్రతి జీవిలో కొన్ని ప్రజ్ఞలు పనిచేస్తూంటాయి. దానికి పరిమాణం తో సంబంధం లేదు. చలికాలానికి తిండి దాచుకోవటం దాకా ఎందుకు? ఆకలేస్తే తినడం, దాహమేస్తే తాగడం, తిన్నది అరిగించుకోవటం అది రక్త మాంసాదులుగా మారటం, వృధ్ధిచెండటానికి ఉపాధి గా నిలబడతం మొదలైనవనీ ప్రజ్ఞకి (శక్తులనండీ, ప్రజ్ఞలనండి) తార్కాణాలే.

  చీమలు బారులు తీరి ఉన్నయి అని మీరంటూంటే నా చిన్నప్పటి ఊహలు గుర్తొచ్చాయి..
  బాగా చిన్నప్పుడు --> గేదెలన్నీ ఒకేలా , మేకలన్ని ఒకేలా , చీమలన్నీ ఒకేలా , ఉన్నాయి కదా వాటిని అవెలా గుర్తు పడతాయి?
  కొంచం పెద్దయ్యాకా --> మనకి స్కూలున్నట్టు వాటికి స్కూలెందుకు లేదో? లేక మన్లాగే స్కూలుకి డుమ్మ కొట్టేశాయా?
  ఇంకొంచం పెద్దయ్యాకా --> అందుకే స్కూలుకి డుమ్మా కొడితే అడ్డగాడిదలాగ తిరుగుతున్నాడంటూంటార?
  మరికొంచం పెద్దయ్యాకా --> అవి మనల్ని చూసి వీల్లందరూ ఒకేలా ఉన్నరే పాపం అనుకుంటాయేమో...

  ఇల్లా ఆలోచించబట్టే చీమలకీ నాకూ కూడా ఏదో అవినాభావ సంబంధం ఏర్పడింది అనుకుంట. నేను బ్లాగు మొదలుపెట్టింది కూడా ఈ చీమల అంతరంగ భావావిష్కరణతోనే...

  http://raata-geeta.blogspot.com/2009/01/sphoorthee.html

  సనత్
  సనత్

  ReplyDelete
 2. (1999 - 2009) TOP-20 తెలుగు కథానాయికల్ని మీరే ఎంచుకోండి!
  visit to poll:
  http://blogubevars.blogspot.com/

  అనుకోకుండా కొందరి పేర్లు TOP-20 లిస్టు లో పెట్టలేక పోయాను, అక్కడ ఉన్నవారికి మీ వొటు వేయండి.

  ReplyDelete
 3. రవి గారూ 1
  చీమలకున్న సఖ్యత, క్రమశిక్షణ మనం మనుష్యుల్లో చూడగలమా ? వాటి లక్ష్యం తమ జీవనానికి కావల్సిన ఆహార సముపార్జనే ! ఎవరినీ నొప్పించకుండా తమ పని తాము చేసుకుంటాయి. అదీ కలసికట్టూగా ! నిజమైన సోషలిజం వాట్లోనే ఉందేమో ! బాగా రాసారు. అభినందనలు.

  ReplyDelete
 4. "మనకు నేర్పడానికి భగవంతుడు అణిమాది రూపాల నుంచి, బ్రహ్మాండమంతటా తానే అయిన మహిమాత్మక రూపం వరకూ ఎదుట కనిపిస్తూ ఆశ్చర్యానందాద్భుతాలకూ ఎప్పుడూ గురి చేస్తూనే ఉంటాడు." ఆయన నేర్పుతున్నాడు నిజమే మనం నేర్చుకోవద్దూ!

  ReplyDelete
 5. చీమల గురించి ఇంత లోతుగా ఆలోచించి, నలుడిని కూడా గుర్తు తెచ్చుకుని పోస్టు రాశారన్నమాట.

  చీమలు ఒకదానికొకటి ఎదురుపడినపుడు పలకరించుకుని కానీ దాటిపోవు. ఇది నేను ఎన్ని సార్లు చూసినా మళ్ళీ ఆశ్చర్యంగా గమనించే సంగతి! జంతువుల నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉన్నా, చీమలనుంచి నేర్చుకోవలసింది మరికొంచెం ఎక్కువ.

  Antz సినిమా కూడా నాకు చాలా ఇష్టం! కోపం, హాస్యం, బాధ, పోరాట పటిమ ప్రేమ ఇవన్నీ చీమల్లో కూడా చక్కగా చూపించగలిగిన సినిమా అది.

  ReplyDelete
 6. అక్షవిద్య అంటే స్టాటిస్టిక్సు అని ఒక interpretation. ఋతుపర్ణుడు అక్షవిద్యని నేర్పినందుకు ప్రతిఫలంగా నలుడు ఆయనకి అశ్వహృదయాన్ని నేర్పాడట. అక్షవిద్యని నేర్చుకున్న ఫలితంగా నలుడిలోని (కలి) కల్మషం అంతరించిందట.

  చీమలు అని మా ఏడో తరగతిలోనో, ఎనిమిదో తరగతిలోనే తెలుగు పాఠం ఒకటి ఉండేది. నిజానికది సైన్సు పాఠం. చీమలు యుద్ధాలు చేస్తాయని, బానిసల్ని పెట్టుకుంటాయనీ కూడా అందులో ఉంటుంది. కాబట్టి చీమల్ని సోషలిస్టులనడం కొంచం ప్రమాదం.

  సృష్టిలో కనిపించే పరమాద్భుతమైన విశేషాలని భగవంతుడికి ఆపాదించి తన్మయత్వం చెందేవాళ్ళు కొందరైతే, ప్రకృతికి (సైన్సుకి) ఆపాదించి అదే అనుభూతిని చెందేవాళ్ళు కొందరు. పదజాలం వేరైనా అనుభూతి ఒక్కటే అని నా అభిప్రాయం.

  ReplyDelete
 7. @సనత్ శ్రీపతి గారు : అక్ష విద్య - బావుంది. రథంలో వెళుతూ, చెట్టు ఆకులను లెక్కగట్టటం - ఇది మా అయ్యవారు చెప్పినట్టు గుర్తొచ్చింది. శ్రీహర్షుని శృంగారనైషధం కావ్యం చాలా గహనంగా ఉంటే, తిరిగి రాశారట ఆయన. అదీ కష్టమయితే ఇంకోసారి, ఇలా ఆరు సార్లు తిరిగి వ్రాయబడిందనీ, ఆయన పాండిత్యం తక్కువవాలని ఎవరో ఉద్దిబేడలు తినిపిస్తే, అందుకాయన "అశేష శేముషీ మోష పూషాన్ ఖాదయామి" అని చమత్కరించినట్టూ - కొన్ని జ్ఞాపకాలు.

  మీ ఊహలు, మీ టపా, ఊహలు మీకు గుర్తొచ్చినందుకన్నా, అవి చదవడానికి అవకాశం కలిగినందుకు ఆనందంగా ఉంది. మీ ఊహలు భలే అందంగా ఉన్నాయి.

  @రావు గారు : బాగా అన్నారు. నిజమే.

  @విజయమోహన్ : ఆరాధన అవగాహనకు తొలిమెట్టు - ఓ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే, దానిపై ప్రేమ కావాలి. ఓస్ అంతేనా, అని అనిపిస్తుంది, కానీ, కొంచెం కష్టమైన వ్యవహారం ఇది.

  @సుజాత గారు : అవి ఏం మాట్లాడుకుంటాయో అన్నది ఆశ్చర్యంగా ఉంటుంది. Antz అన్న సినిమా కూడా వచ్చిందా? వెతకాలి.

  @మురళి గారు: అనుభూతికి "దేముడనో", "సైన్సు" అనో పేర్లు పెట్టటం కన్నా, అనుభూతి ఆస్వాదన ముఖ్యం. అయితే అనుభూతిని "చెప్పుకోవాలి" అన్నప్పుడు ఈ పేర్ల పంచాంగం మొదలవుతుంది!

  ReplyDelete
 8. చాల బాగా చెప్పారు రవి !
  సృష్టి లో సర్వఅంతర్యామి ని , చిమలను చాల చక్క చెప్పారు

  ReplyDelete
 9. చాల బాగా చెప్పారు రవి !
  సృష్టి లో సర్వఅంతర్యామి ని , చిమలను చాల చక్క చెప్పారు

  ReplyDelete
 10. బాగుందండి చీమ పురాణం.

  ReplyDelete
 11. టపా చాలా బాగుంది రవి గారు. నేర్చుకోవాలనే ఆసక్తి, ఓపిక ఉండాలే కానీ ప్రకృతిలోని ప్రతి అణువు ఎన్నో పాఠాలు చెప్తుంది.

  ReplyDelete
 12. Next on Doma , please! :P
  Let us see what to learn from them!! :))

  Sankar
  Anantapur

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.