Saturday, December 19, 2009

అవతారం - ఓ సామాన్యుడి గోల

నిన్న నవతరంగం లో రామ్ గోపాల్ వర్మ బ్లాగులో అవతార్ సినిమా గురించి అతని ప్రశంస చదివి అతని మీద నమ్మకంతో, అవతార్ సినిమాకు టికెట్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడే ఓ మల్టీప్లెక్స్ లో ఈ 3D సినిమా చూసొస్తున్నాను.

రాము వ్యాఖ్య ప్రకారం ఈ సినిమా ఓ అనుభవం. అక్షరాలా. సందేహం లేదు. అయితే, అనుభవం వేరు, అనుభూతి వేరు. అనుభవానికి ఆలంబన ఇంద్రియాలు, వాటి తాలూకు ప్రకంపనలు, ఇంకాస్త ముందుకు వెళితే, ఇంద్రియాల ద్వారా చోదితమైన బుద్ధి అయితే అనుభూతికి ఆలంబన మనస్సు. అవతార్ సినిమా స్టార్ వార్స్ సినిమా గుర్తు తెప్పిస్తే, నాకు మాత్రం స్పీల్ బెర్గ్ E.T. సినిమా గుర్తొచ్చింది. అందులో ఉన్నది, ఈ సినిమాలో లేనిది కాస్త స్పష్టంగానే కనిపించింది.

ఇది కేవలం నా సోది కాబట్టి, నా ఆలోచనల్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. చాలా రోజుల క్రితం, ఓ శుక్రవారం రాత్రి, "అన్బే శివం" అన్న కమల్ హాసన్ సినిమా చూశాను. ఆ సినిమాలో - ఓ బస్సు ఆక్సిడెంట్ కు గురవుతుంది. దానికి కారణం ఓ కుక్క. ఈ సంగతి తెలిసీ, కమల్ ఆ కుక్కను చేరదీస్తాడు. ఆ సినిమా ఆలోచనలతో రాత్రి చాలాసేపు నిద్రపట్టలేదు. రాత్రి కిటికీ బయట కుక్క ఏడుస్తోంది. రోడ్డుపై ఎవరో దాన్ని కసరడమూ వినబడింది. ఆ తర్వాత మాగన్నుగా నిద్రపట్టింది. (ఆ సినిమాకు చలించిన నా బుద్ధి నిజంగా ఎదురుగా కుక్క ఏడుస్తుంటే పట్టించుకోలేదెందుకో) ఇంతకూ నేను చెప్పదల్చుకున్నదేమంటే, - మనసుకు, బుద్ధికి దగ్గరగా కనిపించే, వినిపించే సంఘటనలకు ప్రతిస్పందించటం మానవ సహజం. మొన్న వరదతాలూకు ప్రభావం టీవీల్లో చూసి, ప్రజలు స్పందించారు. అదే సమయంలో ఏ ఇరాన్ లోనో, మరెక్కడో ఏ దుర్ఘటనలోనో అంతకంటే ఎక్కువ ప్రజలు చచ్చినా, మనం పట్టించుకోము. ఉద్వేగం బుద్ధిని తాకితే అది "అద్భుతం". ఉద్వేగం మనసును తాకితే అది "కరుణ". రెండూ రసానుభూతులే అయినా "ఏకో రసః కరుణ ఏవ" . మనిషి ఆలోచనలను సత్యం వైపుగా మరల్చడానికి "కరుణ" రసమే ఆలంబన అవుతుంది, కానీ అద్భుతం కాదు.

అవతార్ సినిమాలో ఆటవికుల (?) బాధ చూసినప్పుడూ అందులో "అద్భుతం" కనబడిందే తప్ప, వారి "ఆక్రోశం" నా మనసుకు తాకలేదు. (ఇది నా గోల. అందరికీ ఇలానే అనిపిస్తుందో మరి నాకు తెలీదు). ఆ ఆటవికుల ఆహార్యం విచిత్రంగా అనిపించింది కానీ ఆహ్లాదంగా కనిపించలేదు. ఇక నేపథ్య సంగీతం పేలవంగా ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదన్నట్టుగా ఉంది.మరో లోకానికి మనల్ని "ఈడ్చుకెళ్ళినట్టు" ఉన్నది తప్ప, "తీసుకు వెళ్ళినట్టు" ఈ సినిమా నాకు అనిపించట్లేదు.

Imagination will be a creation, if it touches one's heart, and is identifiable by the heart. Otherwise, it remains as a technical grandeur. (ఇది నా కోటింగే, ఎవరిదీ కాదు)

అవతార్ సినిమా ఓ Technical masterpiece అనిపించింది తప్ప, ఓ కళాఖండం అని నాకు అనిపించట్లేదు.

ఇందాక అన్నట్టు, నాకు E.T. సినిమా గుర్తొచ్చింది. అందులో ఉపగ్రహపు బాలుడి వేలు కొసను, భూలోకపు బాలుడు తాకుతాడు. ఈ సినిమా ప్రోమోస్ లో కూడా ఇది కనిపిస్తుంది. ఈ సినిమాలో ఈ దృశ్యం అనుభవైకవైద్యం. అదే సినిమా 3D లో తీసి ఉంటే, ఓ ఒక్క దృశ్యం కోసం సినిమా చాలాసార్లు చూసి ఉండవచ్చు. అవతార్ సినిమాలో కనిపించే (నాగమల్లి) పూలు, జలపాతాలు, యుద్ధ విమానాలు, మరో లోకానికి తీసుకు వెళతాయి తప్ప దర్శకుడు అంతర్లీనంగా చెప్పదల్చుకున్న సందేశానికి ప్రోద్బలం చేసేలా మాత్రం లేవు.

"ఇంతకంటే, ఓ మామూలు థియేటర్ లో ఓ తెలుగు మాస్ సినిమా చూసి ఉంటే మేలు".ఈ సినిమా చూసి, బయటకు వచ్చిన తర్వాత నాకు, నిజాయితీగా నాకు కలిగిన ఫీలింగ్.

1200 కోట్ల సినిమా, రాము మెచ్చిన సినిమా ఇట్లాంటి పనికిరాని మాటలు నా వంటికి పడవని మరో మారు అర్థమయింది. గొప్ప సినిమా అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియట్లేదు.

(అవతార్ సినిమా చివర్లో, ఓ 20 నిమిషాలకు ముందు లేచొచ్చాను నేను. ఆ 20 నిముషాల్లో, నా ఆలోచనల్ని తిప్పేసే సంఘటనలు సినిమాలో జరిగి ఉంటాయని నేను భావించట్లేదు)

15 comments:

 1. ha ha...will you rate a movie as a best movie if you cry and dont get sleep whole night after watching it...anyway its your feeling....but i dont agree with you comparing a telugu mass movie with AVATAR

  ReplyDelete
 2. "అవతార్ సినిమాలో కనిపించే (నాగమల్లి) పూలు, జలపాతాలు, యుద్ధ విమానాలు, మరో లోకానికి తీసుకు వెళతాయి తప్ప దర్శకుడు అంతర్లీనంగా చెప్పదల్చుకున్న సందేశానికి ప్రోద్బలం చేసేలా మాత్రం లేవు."

  దర్శకుడు సందేశం చెప్పదలుచుకున్నానని ఎక్కడైనా చెప్పాడా?

  ReplyDelete
 3. ఒక సాంకేతిక అద్భుతం గా చూడాలి తప్ప చివర్లో ఏదో సందేశం కోసం చూడాలా? మాకు ఇప్పుడు సందేశాలు వినేంత ఓపిక లేదు

  ReplyDelete
 4. మాస్ సినిమా అంటే మీకు చిన్న చూపని అర్దం చేసుకొవాలా ? లేక మన తెలుగు సినిమాలను చిన్న చూపు చూసే వాళ్ళంటే అసహ్యమా ?

  ReplyDelete
 5. అయ్యో, అవునాండీ!

  నేనూ ఇప్పుడే చూసి వచ్చాను. నాకు కూడా అద్భుతంగా తోచింది కానీ ఆ ఆటవికుల ఆక్రోశం కూడా కొంచెం వినపడ్డట్టే ఉంది మరి!

  అక్కడక్కడా ET గుర్తుకురావడానికి కథే కాక, ఆ ఆటవికుల ఆహార్యమూ కూడా కారణం కావొచ్చు!

  నేను మాత్రం అద్భుతాన్ని చూడ్డానికే వెళ్ళాను. సందేశం ఊహించి కాదు! అందువల్ల అద్భుతంగానే తోచింది. ఇంకా ఆ మైకం వదల్లేదు కూడా!

  ReplyDelete
 6. avatar - cinema ayite naaku chaala nacchindi. it takes a shot at american army and american businesses at multiple levels. oka iraq loni natural resources ni exploit chestunattu ga, 200 yella kritam britishers mana desanni dochukunnattu ga.. and director didn't even try to hide his feelings against the war.

  ReplyDelete
 7. ఇప్పుడే నవతరంగం లో రాకేశ్వర రావు గారి గోడు విని ఇటొచ్చ్హాను . మీరింకా బిగ్గరగా రోదించినట్టున్నారు. ఎంత మంది ఎన్ని చెప్పినా నేనీ సినిమా చూసి తీరాలని నిర్ణయించుకున్నాను . ఎందుకంటే నేను సీతమ్మని.....తెలుగు సినిమాల్లో సందేశాలే నాకు అర్ధం కావు ఇక ఇంగ్లీష్ సినిమాల్లో సందేశాలేం అర్ధమవుతాయ్....అందుకే పెద్దగా ఆశలు పెట్టుకోకుండా సుజాత గారిలా అద్భుతం చూడ్డానికే వెళతాను

  ReplyDelete
 8. సుజాత గారు, మీ వ్యాఖ్య చూసిన తర్వాత నాకో అనుమానం. ఇలాంటి 3D సినిమాలే ఇంకో పది వచ్చే రెండేళ్ళలో వచ్చాయనుకోండి. (వస్తాయి లెండి). ఆ తర్వాత 3D ఓ మామూలు వ్యవహారం అయిందనుకోండి. ఆ తర్వాత కూడా "అవతార్" ఓ అద్భుతంగా మిగులుతుందా?

  సినిమా బాలేదంటే, కథ బాలేదు, కథనం బాలేదు, ఇంకోటి, మరోటి - ఇలా చెప్పుకొస్తారు. "కాసేపు మరో లోకంలో విహరింపజేసిన సినిమా" - This particular unit also could be a trivial one. In that case, at least for me, creating unnecessary hype is useless.

  @a2zdreams : చాలా మంచి ప్రశ్న. నాది అభిప్రాయం కాదు, ఆత్మ సంఘర్షణ. పోకిరి సినిమా చాలా మందికి నచ్చింది (బ్లాక్ బస్టర్ కదా). బ్లాగ్లోకంలో చాలామందికి నచ్చలేదు. మా ఫ్రెండ్స్ కూడా అందులో ఉన్నారు. అందరూ అన్న విషయం ఏటంటే, "ఆ సినిమా చూసి తల్నెప్పి వచ్చింది". అని. నాకు అవతార్ సినిమా చూసి తల బద్దలయింది. నిజంగానే. (బాక్సులో మనిషి గాలాడకుండా పడుకోడమేంటి, మళ్ళీ ఎక్కడో, లెగవడం ఏంటి, మనుషులకు తోకలేటి? ఇలా ప్రశ్నలే ప్రశ్నలు.)ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు అభిరుచి లేదా? లేకపోతే, ఉత్తమాభిరుచి అనేదానికి ఏవైనా మెట్రిక్స్ ఉన్నయ్యా? - ఇదుగో ఈ ఆత్మ సంఘర్షణ నాది.

  @gopicm : ఈ సినిమాలో సందేశం లేదని మీరు భావిస్తున్నారా? సరే, కథ ఏమిటి? నాకు కథ కూడా అర్థమవలేదు. (నాకు ఇంగ్లీషు అంత బాగ రాదనుకోండి)

  @Anonymous : Hahaha will you rate the movie the best, just because it is 1200 crores, and "it took you to some unknown world"? Just like others have feeling, I too have my feelings. That is the essence of this post. Just as u did, I too have a point to say about "comparing" some telugu mass movie with anything else.

  ReplyDelete
 9. అవును....కచితంగా....చూసినంత సేపు ఒక అద్భుత లొకములొ విహరిస్తున్న అనుభూతి కలిగింది...ఆటవికుల ఆహర్యం ఎప్పుడు విచిత్రంగానే ఉంటయి....అహర్యం లొ ఆహ్లాదం ని వెతుక్కొవటం...ఎంటొ మీ అత్మ సంఘర్షణ...ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొండి....మరొక్క ప్రశ్న Technical masterpiece అంటె ఎంటొ మీ అర్థం లొ ఒక సారి వివరించగలరా దానికి కళాఖండానికి తేడా ఎంటొ చెప్పగలరా ..

  ReplyDelete
 10. రవి గారూ,
  రెండు కాదు, పది రానివ్వండి! ఎప్పుడో రాబోయే కాలంలో దీన్ని మించిన సినిమాలొస్తాయని దీని గొప్ప తనాన్ని ఒప్పుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి? ఒకవేళ అన్ని సినిమాలు వచ్చినా ఇది పయొనీరేగా!

  ముఖ్యంగా పతాక సన్నివేశాలు(క్లైమాక్స్ కి తెలుగు ఇదేనా)కేక పెట్టించేలా ఉన్నాయనిపించింది. 3D ఎఫెక్ట్ కు మా అమ్మాయి నిజంగానే భయపడి కేకలు పెట్టిందిలెండి!

  మీకు వచ్చిన ప్రశ్నలు చూస్తుంటే ఈ పోస్టు మీదేనా అని డౌటొస్తోందండీ రవిగారూ నాకు!! కథాకాలం ఇప్పటిది కాదు కదండీ! ప్రపంచం అంతా సర్వ నాశనమయ్యాక మిగిలేది ఏమిటో , జరిగేది ఏమిటో ఎవరికి తెలుసు? అసలు హాలీవుడ్ ఫాంటసీ సినిమాలన్నిటికీ ఈ లాజిక్కేగా మూలం?

  స్పైడర్ మానేంటి, బాట్ మానేంటి,సూపర్ మానేంటి(ఈ మాట నేను అనుకోను. నేను సూపర్ మాన్ వీరాభిమానిని) అనే డౌట్లు పెట్టుకుని సినిమాలెలా చూడగలం?

  ReplyDelete
 11. @సుజాత గారు, స్పైడరు మాన్ కు నేను వీరాభిమానినే. స్పైడర్ మాన్ ఓ కామిక్, ఫిక్షన్ కాదు. సరే అటుంచండి.

  ఈ చర్చ ఇలా సాగుతూనే ఉంటుందేమో మరి, అందుకే సాధ్యమైనంత క్లుప్తంగా చెబుతాను. ఈ సినిమా 2D లో అయితే మీరు అదే అనుభూతి పొందే వారా? కాదు కదూ. అంటే, దర్శకుడి గొప్పతనం కంటే, Technology domination మీదే ఈ సినిమా పోతోంది. అలా కాక ఒక absolute value అన్నది ఈ సినిమాలో నాకు కనిపించలేదు. కనిపించినా దాని విలువ అసాధారణం మాత్రం కాదు. యాభై యేళ్ళయినా స్క్రీన్ ప్లే గురించి చెప్పుకోవాలంటే మాయబాజార్ నే చెప్పుకుంటాం. (FTII పూనా లో ఈ సినిమా పాఠ్యాంశం కూడా). అలా ఈ సినిమాలో చెప్పుకునే విషయం ఏముంది,(ఏమీ లేదని అనను, కానీ అంత చెప్పుకునేంతగా) అదీ ఓ మామూలు సినిమాకు నూరు రెట్లు ఖర్చు పెట్టి తీసి?

  @Anonymous : కళాఖండం అంటే, ఎన్ని యేళ్ళయినా (కనీసం ఎక్కువ కాలం) నిలిచి ఉండేది. Technical masterpiece is something lives by the time. In future 4D comes, then Avatar will be forgotten.

  ReplyDelete
 12. Technical values ఇంకా ఆహార్యమ్, వ్యవహారం పక్కన పెడితే మనుష్యుల మనస్తత్వాన్ని బాగా చత్రీకరించారు, అలా అనుకుంటే వాల్ డిస్నీ సినిమాలలో ఇంకా బాగ మనుష్యుల inner mentality ను ఆవిష్కరిస్తారు అనుకోండి.over all గా బానే వుంది . నాకు నచ్చిన డైలాగ్ " The great mother doesn't take sides she try to balance the life" ఆఖరు లో హీరో ఆ పూర్వీకుల చెట్టూ (mother nature I guess) ను ప్రార్ధన చేస్తుంటే హీరోయిన్ వచ్చి అంటుంది. నా కొడుకు కు బాగా నచ్చింది. మొత్తం సినిమా ఒక రూమ్ లో తీసేరు దగ్గర నుంచి ఆఖరు క్లైమాక్స్ ఎంత బాగుందో ఎన్ని ఆస్కార్ లు రావొచ్చు ఆ డైరక్టర్ అసలు ఏ సినిమా అయినా ఎంత ప్రాణం పెట్టీ (తీసి కాదు) తీస్తాడుఅని సినిమా బయటకు వచ్చి ఇంటి కి వచ్చే దాకా పక్క సీట్ లో కూర్చొని రీల్ తిప్పేడూ,( మా ఇల్లు సినిమా హాల్ నుంచి 30 miles) అంతా విన్నాక బావుంది సినిమా అని పించింది.;-)
  మధ్య లో అబ్బ బాగా సాగ దీస్తున్నాడూ అనిపించింది.కాని ఆ ఎవరికి తెలియని ఆ ప్రపంచం ఎంత బాగుందో.. నిజం గా మనం ఎంత దుర్మార్గులం అనిపించింది. రవి గారోయ్ నాకు ఆటవికుల బాధ పట్టీందండోయ్.. ప్రతి రోజుఆమెరికా వాళ్ళ రాజనీతి, చాణక్య నీతి చూసి తెలిసి అనుభవించటం వలనేమో..

  ReplyDelete
 13. నాకూ ఇంగ్లీష్ పెద్దగా రాదు. కాని ఏమి జరుగుతుందో నాకు స్పష్టంగా అర్ధమయ్యింది.కథ కావాలంటే వికిపీడియాలో చదవండి
  నేను 2డి లోనె చూశా.ఐనా నాకు అద్బుతం గానే వుంది . ఎప్పుడు హైదరాబాద్ వద్దామా 3డి లోచూద్దామా అనిపిస్తుంది. భవిష్యత్తులో వచ్చే అద్బుతాల గురించి వూహించుకొని ఇప్పుడు మన కళ్ల ముందున్న అద్భుతాలను మిస్ అవుతామా? ఒకవేళ వచ్చినా సరే అవతార్ ఒక అద్భుతంగానే మిగులుతుంది. చూస్తూవుండండి.
  ఇంకా చెప్పలంటే నాకయితే 'పండోరా" కి వెళ్ళి వుండబుద్ధేస్తోంది.

  ReplyDelete
 14. "అవతార్" నా దృష్టిలో ఒక కళాకండమే, మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా..! బహుశ మీరు సినిమాకి వెల్లే ముందు మీ బుర్రలో కొన్ని అభిప్రాయాలతో వెల్లారేమో..? కాని నేను మాత్రం ఎటువంటి అభిప్రాయాలతో వెల్లలేదు.. ఎటువంటి ఆలోచనలు లేని ఒక శూన్యమైన బుర్రతో వెల్లాను కాబట్టే సినిమా నాకు బాగ నచ్చింది, అతను తీసుకున్న కథ, కథనం, ఇంక గ్రాఫిక్స్ గురించి చెప్పనవసరం లేదు..ఇవే గాక మానసిక ఉద్వేగాలు, పాండోరా వాసులకు ప్రకృతితో ఉన్నమానసిక బంధాలు వెరసి సినిమా ఒక అపురాప ఆణిముత్యమే ఇందులో మీరు ఎన్ని రకాల తర్కాలు పరంగా చూసిన విమర్శించిన..ఈ చిత్రం మాత్రం గొప్ప చిత్రమే..

  ReplyDelete
 15. ఆలోచన రేకెత్తించడం ఒక్క కరుణ రసం వల్లనే అవుతుందని మీరెందుకు డిసైడ్ చేసేసారో నాకు సరిగ్గా అర్థం కాలేదు, నాకు అనుభవమయినంతవరకూ they spark even in the unlikely movies (like Stanely Kubrik's Shining for example).

  నాకు మాత్రం, మొదటి సారి నేవీ వాళ్ళు, ఆ పేద్ద చెట్టుని మిస్సైల్స్ తో కూల్చేసినప్పుడు, ఆ ఆటవీకుల బాధ చూసి, I could connect to that pain. Avatar would be a masterpiece, not for its visuals but for the subtext.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.