Friday, March 4, 2011

రమణకం

"రమణ హేర్ స్టైల్స్"

రమణ, హేర్ స్టైల్స్ రెండుపదాలూ విలోమానుపాతంలో ఉన్నా కూడా అక్షరాలు సాధ్యమైనంత స్టైలిషంగానే ఉన్నయ్. లోపల రెండు "రివాల్వింగ్" చైర్లు.  ఎదురుగా వెడల్పైన అద్దం. బల్ల మీద వివిధ ఉపకరణాలు. ఇటువైపు "బెంచ్" మీద ఉన్నవారికి టైమ్ పాస్ కోసం ఆ రోజు దినపత్రిక, గడిచిన ఆదివారం ప్రత్యేక అనుబంధం,  అట్ట చిరిగిన స్టార్ డస్ట్ ఆంగ్ల సినిమా పత్రిక, సితార. పైన అటకమీద ఓ చిన్న సైజు కలర్ టీవీ, మోగుతున్న జెమినీ ఛానెలూ.

ఈ అంగడి కాదు కానీ, స్థలం మటుకూ నాకు చిన్నప్పుడు పరిచితమైనదే. అప్పటికి ఇప్పటికీ ఎంతో తేడా. ఆ తేడా ఒక తరానిది లేదా రాముడికీ, రమణుడికీ ఉన్నంత తేడా అని చెప్పుకుందాం, ఈ కథకు సరిపడేలా.

**********************************************************************************

శ్రీరాములు బంకు అంటే ఆ అక్కపక్కల వీధులోళ్ళందరికీ ఎరికే. తిరుపతిని గుండును ఎట్లయితే విడదీయలేమో, అట్లే రాములు - క్రాపు అనేవి ఆ చుట్టుపక్కల మూణ్ణాలుగు గేర్ల వాళ్ళకు బాగా నాలిక్కాడే జంటపదాలు. చిన్నపిల్లలున్న వాండ్లకూ, ఏ ఆదివారమో బద్ధకంగా బయటకొచ్చి గడ్డం గీసుకుందామనుకునే మగరాయళ్ళ పాలిటికి ఆ బంకు ఒక గమ్యం. అట్ల గాకుండ ఉద్దరిగా పేపర్ చూద్దామనుకునేటోళ్ళకీ ఆ బంకుతో అవసరం పడతా ఉంటాది.

బంకు బయట రెండు బెంచీలు, లోపల ఒకటి, ఎదురెదురుగా ఉన్న పెద్ద, చిన్న అద్దాలు, ఓ మూలగా కత్తి చూరుపెట్టడానికి తోలుపటకా, మూలగా బకెట్టు, టెబుల్ మీద సీసా, అందులో నీళ్ళూ, వంకీలు తిరిగిన చిన్న పైపు, కొసన నాజిలు, అందులోంచి రాములు కస్టమర్ల తలలపై చిన్నగా పడే జల్లులు...

బంకు అంతా చెక్కపలకలు కనబడకుండా సినిమా బొమ్మలు. మనుషులు సీటు మీద కూర్చుని ఇవతల చూస్తే, మూలకు సరిగ్గా కన్ను ఆనేచోట శ్రీదేవి ఈత డ్రస్సులో ఉన్న పోస్టరు. అవతల మూల తలతిప్పలేకుండా జయప్రదకు శ్రీదేవి ముద్దు పెడుతున్నట్టు ఉండే త్రిశూలం సినిమా పోస్టరు, పైన చూరుకంతా చిరంజీవి, ఎన్టీ యారు రాజకీయనాయకుడిగా ఉన్న పోస్టరూ ఇట్ల రంగురంగులుగా ఉంటుంది ఆ బంకు.

ఇంక అక్కడ జరిగే లోకాభిరామాయణానికి అంతూ పొంతూ లేదు. నెక్స్టు ఎలక్షన్లలో ఎవడు గెలుస్తాడు, ఊర్లో కొత్త కౌన్సిలరు వస్తానే ఏమి చేసినాడు, చిరంజీవి కొత్తసినిమా ఎట్ల ఆడుతాది? మూడో వీధిలో ఉండే ఆఫీసరుకు యాడ ట్రాన్స్ ఫరయింది...ఇవన్నీ అక్కడకెళితే వీజీగా తెలిసిపోతాయ్.

చిన్నతనంలో ఒక ఆదివారం నాన్న నాకు క్రాఫు గీయించాలని ఆడికి నన్ను కొండబోయినాడు. అంతకు ముందు ఎన్నేండ్లుగా ఆ కుట్ర సాగుతా ఉన్నింది గానీ నా ఊహ తెలిసిన తర్వాత గుర్తున్నది అప్పుడే. తీరా ఆడ రద్దీ చూసిన తర్వాత "మా వానికి మట్టసంగ క్రాఫు చేపించు రాములు" అని రాములుకు ఒప్పజెప్పి, "అట్లాగే సామీ" అని మాటిప్పించుకుని ఎళ్ళిపోయె. నేను బెంచి మీద కూరుచుని, ఆ పేపరూ, ఈ బుక్కూ చూసుకుంటా, పాట్లు పడతా ఉన్నాను. చానా సేపు తర్వాత నా ముందు వచ్చినోళ్ళకు కూడా ఒకరిద్దరికి క్రాఫు కొట్టిన తర్వాత నా వంతు వచ్చింది.

నన్ను రమ్మని, సీటుమీద చేతులకు అడ్డంగా ఒక చెక్కపలక వేసి, నన్ను దానిమీద కూర్చోమన్నాడు రాములు. నాకెందుకో సీటుమీద కాకుండ, అట్ల చెక్కపలక మీద కూర్చోబెట్టడం అస్సలు నచ్చలే. పెద్దోళ్ళందరికీ సీటు? నాకు మటుకూ పలకనా? అన్యాయం గాదా? అయితే  పిల్లోణ్ణి కదా, అట్లాంటివి అడగరాదు. ఆ తర్వాత నా మింద గుడ్డకప్పి, షర్టు బటనొకటి విడదీసి, కాలరు వెనక్కి జరిపి, ఆ గుడ్డను కాలరుకు ముడి పెట్టినాడు. నీళ్ళబాటిల్లోంచి నీళ్ళు తలపైన జిమ్మి తల దువ్వి, "లే రమణా, ఆ పెద్ద దువ్వెన అందుకో" అన్నాడు. ఓ పిల్లవాడు, నా ఈడు వాడే తెల్లరంగు దువ్వెనందిచ్చినాడు. కత్తెర తీసుకుని క్రాఫు ఆరంభించి, ఒక పదినిమిషాలకు అవగొట్టినాడు.

ఇంట్లో వస్తానే, నన్ను బయట నిలబెట్టినారు. ఎవుళ్ళనీ ముట్టుకోనీకుండా బాత్ రూముకు పంపిచ్చి, గుడ్డలిప్పి స్నానం చేయమని, ఒక తువాలును మా యమ్మనే తీసుకుని వచ్చి కండె మీద ఆరేసింది. నేను స్నానం చేసిన తర్వాత వదిలేసిన గుడ్డలను మళ్ళీ ముట్టుకోకండా, ఇంట్లోపలికి వచ్చినా.

రాములు బంకుకు మా నాయన ఇట్ల రెండు మూడు నెలలకోసారి ఒప్పజెప్పేటోడు. రమణను అప్పుడప్పుడూ చూసేవాణ్ణి.

ఒక సంవత్సరం తర్వాత, ఒకరోజు నేను చదువుతున్న క్లాసులోకి రమణ వచ్చి చేరినాడు. వేరే స్కూలునుండీ వచ్చి చేరినాడు, మా తరగతి లోకి. అటండన్స్ లో నా పేరు ముందర వాని పేరు. అట్లాగే పరీక్షలలోనూ నా ముందు వాడు. నేను బాగా చదివే వాణ్ణి కాబట్టి వానికి పరీక్షలలో నా అవసరం పడేది. వానికి చదువు అంతంతమాత్రం.

తెలుగులో ఒకమారు పరవస్తు చిన్నయసూరి పాఠంలోనుండి యూనిట్ టెస్టుకు ఒక ప్రశ్న అడిగినారు.

"విపత్కాలమందు విస్మయము కాపురుష లక్షణము" - ఈ వాక్యము అర్థము తెలిపి సందర్భమును వివరింపుము? -

మామూలుగానే రమణ నన్ను గోకినాడు. కాపురుషులు అంటే ఎవరు? - ఇది వాని అనుమానం. నాకు బెరుకు జాస్తి. పక్కన టీచర్లెవరైనా చూస్తే నాకు మంచి పేరున్నది పోతుంది. ఏదో చెప్పాలని కాపురుషులంటే కాటాగాళ్ళు అని చెప్పినా. వాడు అదే రాసినాడు. టీచర్ క్లాసులో పేపర్లో అందరిముందు వాడు రాసిన అర్థం చదివింది. "కష్టము వచ్చినప్పుడు కొంతమంది కాటా వాళ్ళు లక్షణముగా విస్మరించుదురు". అందరు వానికేసి చూసి పగలబడి నవ్వినారు. నేనూ నవ్వినా. రమణ మామూలుగా నాకేసి ఒకమారు చూసి తలదించుకున్నాడు. ఎక్కడో, ఎక్కడో మూల ఏదో ఫీలింగు నాకు.

ఏడో తరగతిలోనో, ఎనిమిదో సరిగా జ్ఞాపకం లేదు గానీ, ఒకసారి తెలుగువాచకం కనిపించకుండా పోయింది. నాకు తెలుగన్నా, తెలుగువాచకం పుస్తకం అన్నా చానా ఇష్టం. ఆ పుస్తకం కాకుండా, ఇంకో పుస్తకం కొత్తది కొని ఇచ్చినా నాకు సరిపడదు. ఎందుకంటే, అక్కడక్కడా నాకు నచ్చిన చోట నేను అండర్లైన్ చేసుకోవడాలూ, వాచకంలో బొమ్మలకు తోడు నేను వేసుకున్న బొమ్మలు, మొదటి అట్ట వెనుకల పెన్సిలుతో నేను వేసుకున్న తెలుగుతల్లి బొమ్మ - ఇవన్నీ ఆ ఇష్టానికి కారణాలు. ఎంత వెతికినా కనబడలేదు. ఎక్కడ పారేసుకున్నానో తెలీదు. ఇంట్లో చెప్పలేదు. ఒకరోజు క్లాసులో ఒకడు తెలుగు వాచకం అట్టనీదేనా అని చూపించినాడు. రమణ పుస్తకాల సంచీ మీద ఉందా అట్ట. రమణ ఎక్కడో బయటికి పోయినాడు. తెలుగుతల్లి బొమ్మ ఉంది కాబట్టి నాదే ఆ అట్ట. అట్ట చిరిగినందుకూ, పుస్తకం కనబడనందుకు, ఆ పుస్తకం రమణనే కొట్టేసినందుకు నాకు వానిమీద చాలా కోపం వచ్చింది. వాడు వస్తూనే అడిగినా, "నా పుస్తకం ...సినావు కదా? కట్టిస్తావా లేదా టీచరుతో జెప్పాల్నా? వాడు ఏదో చెప్పబోతే నేను వినిపించుకోలే. సరేనని వచ్చే వారం తెచ్చిస్తానన్నాడు. ఆ తర్వాత సోమవారం పాత పుస్తకాల షాపులోనుంచి తెలుగువాచకం అర్ధరేటుకు కొని పట్టుకొచ్చి ఇచ్చినాడు, 

ఆ పుస్తకం ఇచ్చేప్పుడు వాడి ముఖం ఇందాక తప్పుడు అర్థం రాసి, టీచరు ముందు తలదించుకునే ముందు ఎలా ఉందో అలానే ఉంది. ఆ ఫీలింగుకు అర్థం నాకు ఆరునెలల తర్వాత తెలిసింది.

రమణ మీద నా కోపం పరీక్షలో కూడా చూపించినాను. వాణ్ణి నా పేపరునుంచీ కాపీ కొట్టనీలేదు. ఏదీ చెప్పలేదు. వాడు ఫెయిలయినాడు కానీ తర్వాత తరగతికి పంపించినారు ఏదో చేసి. చాలా రోజుల తర్వాత నాకు ఒక విషయం తెలిసింది. నా పుస్తకం కొట్టేసినవాడు ఇంకొకడు. వాడు నా పుస్తకమే కాకుండా, ఇంకా ఇద్దరు ముగ్గురు పుస్తకాలు కొట్టేసి ఉన్నాడు.

రమణ చూసిన చూపు గుర్తొచ్చింది!

తర్వాత వాణ్ణి చదువు మానిపించి పనిలో పెట్టినాడు వాళ్ళ నాయన. ఎనిమిది అయిన తర్వాత అనుకుంటా స్కూలు మానేసినాడు వాడు.

**********************************************************************************

ప్రస్తుతం.

"మీకో బాబు కద సార్" - అడిగాడు రమణ. రమణ నన్ను గుర్తుపట్టలేదు. "బాబు కాదు పాప" అన్నాను నేను.పాప కత్తెర చూస్తే వణుకు. అందుకే మిషను కటింగు ఉండే చోట మాత్రమే తీసుకెళతాము. రమణ దగ్గర మాత్రమే మిషనుంది కాబట్టి, దూరమైనా ఇక్కడికే తీసుకుని వచ్చి ఉంటాడు పాప తాతయ్య. నేను ఆ రోడ్డులో పాపనెత్తుకుని ఎప్పుడైనా తిరుగుతూ ఉంటా కాబట్టి నన్ను చూసి ఉంటాడు.

"నాకూ మిషన్ వేసేయి. నీవు కొట్టుకున్నావుగా అలా కొట్టేసేయి" అన్నాను. రమణ తల గుండు కొట్టుకుని వారం, పది రోజుల తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంది. సరే అన్నాడు నవ్వుతూ రమణ. ఆ తరువాత షేవింగూ, తలకు రంగూ వేశాడు.

"ఎంత" అడిగాను. ధర చెప్పాడు. "మీకు వాడిన డై కాస్ట్లీ ది సార్.." ఏదో చెప్పబోతున్నాడు.

"పర్లేదు"" చెప్పాను. నాకు తెలుసు, రమణ మోసం చెయ్యడు. డబ్బు ఇచ్చాను.

పని అయిపోయి అక్కడ బల్ల మీద క్రితం వారం ఆదివారం అనుబంధం సాక్షిలో "నా ఇష్టం" చదవడం ముగించినా. బయటికి అడుగుపెట్టాను. ఇంకొకరెవరో వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు రమణ. "నాయన చనిపాయె, అందుకే గుండు కొట్టిస్తి.." వచ్చేస్తూంటే వెనుకల మాటలు వినబడ్డాయి.