Sunday, January 30, 2011

సీమ (మట్టి) లో మాణిక్యం


ఆదివారం..(ఈ రోజు)

చాలా రోజుల తర్వాత మా ఆవిడ పని చేస్తున్న పల్లెకు వచ్చాను. మధ్యాహ్నం నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పని - నిద్ర ను ఆస్వాదించాక, సాయంత్రం బయటపడి ఎక్కడైనా వెళ్ళాలనిపించింది. మామూలుగా నగరవాసులకు - బయటకు వెళ్ళడం అంటే - పనికి రాని గడ్డి తినడం చేతుల దురద తీరేట్టు షాపింగు చేయటం - ఇవేగా., కానీ పల్లెలో షాపింగు ఏముంటుంది? ఏవీ దొరకదు, కాబట్టి పక్కనున్న కాస్తంత పెద్ద ఊరికి బయలుదేరాం ఏ మిరపకాయబజ్జీలో దొరికితే ఆస్వాదిద్దామని. ఆ ఊరు పేరు కంబదూరు. (మండలం). ఈ సాయంత్రం ఓ గొప్ప అనుభూతినివ్వబోతోందని అప్పుడు ఊహించలేదు. ఆ ఊరిపక్క అందమైన చెఱువు. ఆ చెరువు పక్క మిరపకాయబజ్జీలు తింటే ఎలా ఉంటుందో అని మనసులో ఆలోచనలు బయలుదేరుతుంటే బండి తీసుకుని బయలుదేరాం.

గోధూళి వేళ ...

ఆకాశంలో ఓ పెద్ద ఎర్రటి బంతి వెలుగులు చిమ్ముతూంది. బాటపక్కన చింతచెట్లు పలుకరిస్తున్నాయి. కాసేపటికి ఓ అందమైన చెఱువు చిర్నవ్వింది. చెఱువు గట్టున చిలకపచ్చ రంగులో వరిచేను. అక్కడ ఆపి కాసేపు ఆ చెఱువు గట్టు పక్క కూచుందామన్నాను. మా ఆవిడ ఆ పక్కన కంబదూరులో మల్లేశ్వరస్వామి గుడికెళ్దామని, వచ్చేప్పుడు మిరపకాయల షాపింగు, అవి తీసుకుని చెఱువు దగ్గరకు వద్దామని అంది. సరే, ఆమె మాట ఎందుకు కాదనాలని ఆమె చూపించిన బాటపట్టా. మట్టిరోడ్డులో కాసేపు అపసోపాలు పడి వెళ్ళిన తర్వాత ఓ అందమైన గుడి కనిపించింది.

అద్భుతమైన కట్టడం ఆ దేవాలయం.


అనంతపురం జిల్లాలో కర్ణాటక తాలూకు ఒక ముక్క అలా చొచ్చుకు వచ్చి ఉంటుంది. అంటే ఆ భాగానికి ఉత్తరాన, దక్షిణాన రెండువైపులా కర్ణాటక, మధ్య అనంతపురం జిల్లా. అలా, ఈ ప్రాంతంలో చాలామందికి కన్నడం వచ్చు. ఈ కన్నడ కాస్త భిన్నంగా ఉంటుంది. అలానే ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం విజయనగరరాజుల ఏలుబడిలో ఉన్నది. అక్కడక్కడా  పల్లెలలో చిన్న చిన్న మంటపాలు, విరిగిపోయిన బురుజులు, భోగం వాళ్ళు త్రవ్వించిన చెఱువులు, జొన్నన్నం. (అఫ్ కోర్సు ఈ రోజు రాత్రి నా భోజనమూ అదే).అలాగే ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఇక్కడికి దగ్గరలోనే ములకనూరు అన్న ఊరు, ఆ పక్కన ఓ కొండ.అక్కడికెళితే మీరు ఆరుబయట నెమళ్ళను చూడవచ్చు. ఇంకా (దుర్) అదృష్టం ఉంటే ఎలుగుబంట్లను కూడా. జింకలు, హైనాలు కూడా తరుచుగా కనబడతాయి. పాములు కూడా ఎక్కువే.

సరే గుడికొద్దాం. ఆ గుడిపక్కన ఓ దిగుడుబావి. దిగుడుబావిలో నీళ్ళు ఏదో వాసనొస్తున్నాయి, 

గుడి తాలూకు శిల్పాలు.


నందీశ్వరుడు

అన్నిటికన్నా ముఖ్యంగా - ఈ శాసనం. నేను గుడికి వెళ్ళినప్పుడు ఈ శాసనం మీద ఎవరో అక్కడి వ్యక్తులు పంచె ఆరవేసి ఉన్నారు. వాళ్ల పంచె పక్కకు తీసి ఈ ఫుటోలు తీసికున్నాను. ఆ పక్కన మరో శాసనం. ఈ రెండవ శాసనంలో అక్షరాలు గుర్తుపట్టలేకుండా ఉన్నాయి. ఏ రాజు వ్రాయించాడో? ఈ శాసనం వెనుకల ఏ కథ దాగుందో?ఈ శాసనం తాలూకు మరో ముక్క గుడిబయట దాదాపు పారవేసిన స్థితిలో ఉంది. దాని మీద అక్షరాలూ చెఱిగి ఉన్నాయి. గుడి బయట మాత్రం ఓ ప్లేటు ఉంది, ఈ గుడిని ధ్వంసం చేస్తే మూడునెలల జైలుశిక్ష అని.

ఈ గుడి సంగతేమో కానీ, ఆ శాసనాలను మాత్రం ఎవరు పునరుద్ధరిస్తారో? వాటి సంగతి తలుచుకుంటే మనసులో ఎక్కడో గుచ్చుతోంది.

గుడి నుంచి వెనుతిరిగేసరికి చీకటిపడింది. దారిలో వస్తూంటే రోడ్డు దాటుతూ ఓ శంకరాభరణం. నేను బండి నడుపుతున్నాను, అంతగా గమనించలేదు. మా ఆవిడ చూసిందట. ఇలా పాము కనబడ్డం మంచిశకునమో కాదో తెలియదు.

10 comments:

 1. అత్యపురూప దృశ్యముల నద్భుత రీతిని చూడఁ జేసి తో
  స్తుత్యుఁడ! భారవీ యనుచు తోటి కవీంద్రులు నిన్ను మెచ్చ నౌ
  న్నత్యము చూపినాఁడవయ!నా ప్రియ మిత్రుఁడ! నిన్నుఁ బోల నా
  ముత్యము లైన చాలునొకొ? పూజ్య గుణా! అభినందనల్‍ రవీ!

  ReplyDelete
 2. "దారిలో ఓ శంకరాభరణం" అంటే ఏదైనా చలనచిత్రప్రదర్శనశాలలో ఆ చిత్రం ఆడుతోందేమో అనుకున్నాను :-) బాగుంది అండీ మీ వర్ణన. మళ్ళీ నా జీవితంలోకి పల్లె ఎప్పుడు ప్రవేశిస్తుందో!

  ReplyDelete
 3. ఇక్కడ (అమెరికా లో ) ఇక్కడ ప్రతీ సిటీ లోనూ ఏమీ చారిత్రిక ప్రాశస్త్యం ఉన్నవి పెద్దగా లేకపోయినా ఈ మధ్య కట్టిన కట్టడాలనే తెగ ఎత్తేసి , గర్వంగా ఫీల్ అవుతారు. మనకి ఎంత చరిత్ర ఉన్నా పట్టించుకోం .
  నేను ఎక్కడో (మాలతి గారి బ్లాగ్ లో అనుకుంటా ) చదివాను. ఇల్లు కట్టి 150 ఏళ్ళు దాటితే దాన్ని Historical Monument గా భావిస్తారు. మార్పులు చేర్పులు చెయ్యాలంటే కౌంటీ నించి అనుమతి తీసుకోవాలిట.
  తెలుగు వారికి ఆ ఇది .. ఎక్కడోగానీ కనిపించదు. ఇక ప్రభుత్వాలకైతే ఆంధ్ర భోజుడంటే అతనెవరు అంటారేమో.

  ఫోటలకి ధన్యవాదాలు.

  ReplyDelete
 4. అపురూపమైన దృశ్యాలు ఫోటోల ద్వారా చూపించారు చక్కగా వివరించారు ధన్యవాదాలు.ప్రభుత్వం చర్యలు తీసుకొని మన పురాతన దేవాలయాల వైభవం పునరుద్ధరించాలి.

  ReplyDelete
 5. పల్లెలో పురాతన ఆలయం పరిచయం చాలా బాగున్నది రవీ !!

  ReplyDelete
 6. రవిగారూ, చెప్పిన తీరు చాల బాగుందండీ.

  ReplyDelete
 7. "దారిలో ఒక శంకరాభరణం" భలే రాసారండి...అదిరింది....

  ReplyDelete
 8. baga rasarandi akadda nemali pichallu baga dance chestu vuntayee yenta adurustam miku direct ga nemalini chusaru

  ReplyDelete
 9. చాలా బావుంది...మీరు చెప్పిన విషయాలు, ఆ గుడిని చూసాక మనసు పులకించింది.

  "దారిలో శంకరాభరణం"....ఇది చదివి శంకరశాస్త్రిలాంటివారెవరో కనిపించారు కాబోలు అనుకున్నా...పామని అస్సలు తట్టలేదు సుమండీ! :)

  ReplyDelete
 10. వ్యాఖ్యాతలకు నెనర్లండి.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.